విశాలి ఆలోచనా ధోరణేమిటో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు నాకు.
పోనీ అలాగని అదేం నిన్నమొన్న పరిచయమైన కొత్త మొహం కాదు. స్కూల్ రోజుల నుంచీ పెరుగుతూ వచ్చిన స్నేహం. ఎప్పుడు మొదటి సారి కలిశాం, ఎలా అన్నది అంతగా గుర్తులేదు కాని తరువాతెప్పుడో తెలిసింది యూ.కే.జి నుండి ఇద్దరం ఒకే స్కూల్, ఒకే సెక్షన్ అని. అది మొదటి వరస చివరన గోడపక్కన కూర్చుంటే నేను దాని వెనక వరసలో దాని వెనకాలే కూర్చునే దాన్ని. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, చాలా సార్లు టెస్ట్ లన్ని దాని దగ్గర నుండే కాపీ కూడా కొట్టేదాన్ని. ఏం చెయ్యను ? ఇంట్లో అమ్మ తన పనిలో తను తీరిక లేకుండా ఉండేది. నన్ను చదివిస్తూ కూచుంటే డబ్బులెలాగ రావాలి. అయినా అమ్మ మిషన్ నడిస్తేనే మా ఆకలి తీరటం, చదువులు సాగటం.
అక్కడికీ మా , అంటే నా చదువు, చెల్లి చదువు కోసమే అమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుని మమ్మల్ని కాన్వెంట్ లో వేసింది. ఓ రోజున రాత్రి పూట ఎవరో ఏడుస్తున్న దానికి మెళుకువ వచ్చి చప్పుడు కాకుండా లేచి చూస్తే వంటింట్లో తన దేవుడి మందిరం పెట్టుకుని వాటిలో విగ్రహాలను పాలతో అభిషేకిస్తూ, ఏడుస్తూ ప్రార్ధిస్తోంది అమ్మ.
” భగవంతుడా , తప్పక , మరోదారి లేక పిల్లల చదువుల కోసం ఈ పని చేసాను గాని, నీ మీద నమ్మిక లేక కాదయ్యా, క్షమించు తండ్రీ ”
ఆగలేక అడిగేశాను.
” ఎందుకమ్మా మనను మనం ఇలా మోసం చేసుకోడం?” అప్పుడు నేను పదో తరగతిలో ఉన్నాను.
” జీవితమే అంత శాలినీ ఎప్పటికప్పుడు మనను మనం మోసం చేసుకుంటేనే బ్రతగ్గలం. లేదంటే జీవచ్చవాలమే, మతం పుచ్చుకోకపోతే మీ చదువులు , పుస్తకాలు ,బట్టలు నా వల్ల అవుతాయా, మాడి చావాలి. కనీసం మీరైనా చదువుకుంటే మీ బతుకు మీరు బతగ్గలరని ”
“ఇప్పుడు మాత్రం కాదా? ” అందామనుకున్నాను గాని ఎందుకో అనలేదు.
సరే , విశాలి గురించి మాట్లాడుతూ ఇవన్నీఎందుక్కాని, అమ్మ కుట్టు పనిలో ఉంటే ఒక్కోసారి ఇంటి పనంతా నా మీదే పడేది.దాంతో చదువుకునే సమయమే దొరికేది కాదు. కనీసం పాస్ మార్కులు రావాలంటే కాపీ కొట్టడమే దారి మరి.
విశాలి మాత్రం అంత తొందరగా దాని ఆన్సర్లు చూపటానికి ఒప్పుకుందనుకున్నారా? అదేం లేదు.
ఎంత బాగా చదివినా దానికి హోమ్ వర్క్ చెయ్యడమంటే ఎక్కడలేని బద్ధకం. వాళ్ళ నాన్న , అమ్మ హోదాల వల్ల సాయంత్రాలు పిల్లలతో సహా ఏదో ఒక పార్టీ కి వెళ్ళేవారు. అయిదారు సార్లు దానికి వర్క్ చెయ్యలేదని పనిష్మెంట్ ఇచ్చాక నేనే చెప్పాను. నీ వర్క్ నేను చేసి పెడతా నాకు పరీక్షల్లో అన్సర్లు చెప్పాలని. అది సంతోషం గా ఒప్పుకుంది. రెండు మూడు సార్లు వాళ్ళింటికి వెళ్తే వాళ్ళమ్మ నాముందే దాన్ని తిట్టింది. ” ఆ కిరస్తానీ మూకతో నీకు స్నేహాలేమిటే”అని.
అందుకే స్కూల్లోనే నా హోమ్ వర్క్ తో పాటు దాని వర్క్ కూడా రాసేసే దాన్ని.
మొత్తానికి స్కూల్ చదువు తో పాటు కాలేజి చదువులూ కలిసే, ఒకే చోట చదువుకున్నాం. అప్పటికి నా జ్ఞాపక శక్తి కాస్త మెరుగుపడి కాలేజిలో, క్లాస్ లో విన్నవి విన్నట్టు గుర్తుండి పోయేవి. దాంతో కాపీ కొట్టాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. డిగ్రీ రెండో సంవత్సరం కాబోలు దత్తు వచ్చి చేరాడు వైజాగ్ నుండి.
వచ్చినది మొదలు అదేమిటో నా మీద ఆసక్తి కనబరచడం మొదలెట్టాడు.చుట్టూ చుట్టూ తిరగడం, ఇంటికి వచ్చి అమ్మతో గంటలు గంటలు ఆంటీ అంటూ మాట్లాడటం, చెల్లికి అర్ధం కాని పాఠాలు చెప్పటం ఒకటేమిటి ఎన్ని రకాలుగానో సాయపడేవాడు. ఎందుకు నీకు శ్రమ అంటే వినేవాడు కాదు.
చాలా సార్లు అడిగాను కూడా ఏం చూసి నన్నింత ఇష్టపడుతున్నావని.నవ్వేసి ఊరుకున్నాడు. కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవన్నాడు.
చెప్పొద్దూ , నాకూ అదేమిటో అతనంటే అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది. ఒక్కరోజు కనిపించకపోయినా ఇది అని చెప్పరాని వెలితి కొట్టొచ్చినట్టు కనిపించేది. అతనికీ అంతే. ఒక్కరోజు కాలేజీకి వెళ్లకపోయినా ఇంటికి పరుగెత్తుకు వచ్చేవాడు.
అతను నాకు చాలా రకాలుగా సాయపడే వాడు. చదువులోనూ, ఆర్ధికంగానూ కూడా. ఇద్దరం ఒకరు లేకుండా ఒకరం బ్రతకలేమని ఒకరితో ఒకరం అనలేదు కాని ఎవరికీ వారికి అనిపించేది.అతనే నాసర్వస్వమని నమ్ముకున్నాను కూడా అమ్మయ్య నా జీవితం కాస్త కుదుట పడిందనే అనుకున్నాను.
రెండు మూడు సార్లు దత్తు ఇంటికి వెళ్ళాము.ఏదో రికార్డ్ వర్క్ పూర్తీ చెయ్యవలసి ఉండి ఒకసారి, కాలేజి డేడ్రామా సెలెక్షన్ కోసం అయిదారు డ్రామాలు ఎంచుకుని వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుందుకు వాటిని ఒకళ్ళు చదివి మిగతా వాళ్ళు వింటే సరిపోతుందనీ. అప్పుడు వాళ్ళమ్మ నన్ను చూసి మొహం అదోలా పెట్టుకోడం నేను గమనించకపోలేదు.
కాని విశాలి కాఫీలు తెస్తానని లోనికి వెళ్ళినప్పుడు నేను బాత్ రూమ్ లొ ఉన్నానని తెలియక
” ఈ కిరస్తానీ పిల్లలను నమ్మకూడదమ్మాయ్, ఒక నీతా , జాతా డబ్బుకోసం ఏదైనా చేస్తారు” అని విశాలిని ఆవిడ హెచ్చరించడం నా చెవుల పడింది.
ఆ తరువాత కూడా దత్తు నాతో మామూలుగానే ఉన్నాడు .
అమ్మయ్య వాళ్ళమ్మ అభిప్రాయాలు అతనికి లేవేమో లే అనుకున్నాను.
కాని అదేమిటో మూడో ఏడాదిలోకి వచ్చేసరికి అటు దత్తులోనూ ఇటు విశాలి లోనూ కూడా ఇది అని చెప్పలేని మార్పు కనబడింది.
ఇది వరకులా నాతో ఇద్దరూ చనువుగా ఉండటం మానేశారు.ముక్తసరిగా మాట్లాడటం, నన్ను తప్పించుకు తిరగాలని చూడటం. దత్తు అసలు ఇంటికే రాదం మానేశాడు.
నాలో నేను నా వల్ల తప్పేం జరిగిందా అని మదన పడుతుంటే, ఓ రోజున విశాలి క్లాస్ లు ఎగ్గొట్టి అర్జంట్ గా మాట్లాడాలి రమ్మనే సరికి అనుమానిస్తూనే వెళ్లాను.
ఇద్దరం తాజ్ లో ఓ మూల సీటు వెతుక్కుని తీరిగ్గా లంచ్ ఆర్డరిచ్చాక తటపటాయిస్తూ చెప్పింది.
” నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదే, కాని తప్పదు. నేను తల్లిని కాబోతున్నాను ”
ఉలిక్కిపడ్డాను. కొంపదీసి అబార్షన్ కి సాయ పడమని అడుగు తుందా?
కాదని తేల్చేస్తూ బాంబ్ పేల్చనే పేల్చింది.
” దత్తు పెళ్ళికి రెడీ గానే ఉన్నాడనుకో, అయితే పెళ్లయే వరకు అమ్మా నాన్నకు చెప్పకూడదని. అందుకే రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాం. దాని ఏర్పాట్లు నువ్వు చూడాలి ”
పేలవంగా నవ్వేసి ఒప్పుకున్నాను. దత్తును కాని దాన్ని కాని నా సంగతేమిటని అడగాలనిపించలేదు.అయినా అడక్కుండా ఆగలేకపోయాను.
“అమ్మకు వేరే మతం వాళ్ళను చేసుకోడం ఇష్టం లేదు. వినకపోతే ఉరేసుకుంటానంది” పొడి పొడి గా చెప్పాడు.
స్నేహం చేసినప్పుడు నా మతం గుర్తు రాలేదా?
అయినా అందరికీ తెలుసు పేరుకు మతం మార్చుకున్నా మేము అన్ని విధాలుగా హిందువుల్లానే ఉంటామని. అయినా అతన్ని దేబిరించి ఎందుకు పెళ్లి చేసుకోవాలి.
అలా వాళ్లిద్దరి పెళ్లి జరిగింది.
అటు ఫైనల్ పరీక్షలు రాస్తూనే ఇటు పిల్లను కంది విశాలి.
నేను ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి.
అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. ఇంకా చెల్లాయి చదువుకోవాలి.
ఉద్యోగం వచ్చేలోగా అమ్మకు కుట్టుపనిలో సాయపడేదాన్ని.
నా అదృష్టమో , దురదృష్టమో కాని మా ఇద్దరికీ ఒకే బాంక్ లో ఆఫీసర్లుగా అపాయింట్ మెంట్ వచ్చింది.
ఒకరి సంగతి మరొకరికి తెలియక పోయినా ఇద్దరం ఒకే రోజు వెళ్లి జాయినయాము.
అక్కడా ఈ మతాల జాడ్యం కనిపిస్తూనే ఉండేది. అప్పట్లో ఇలా మతం పుచ్చుకున్న వాళ్ళ సంఖ్యచాలా తక్కువగా ఉండేది.
విశాలి కి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. పెద్దపిల్ల రెండో క్లాస్ , పిల్లడు ఆర్నెల్లవాడు.
ముందు అందరినీ దుమ్మెత్తిపోసిన దాని అమ్మా నాన్నా ఇప్పుడు దానితో సవ్యంగానే ఉన్నారు.అయినా సమయం దొరికినప్పుడల్లా కిరస్తానీ స్నేహాలు చేసి పిల్ల తప్పుదారి పట్టిందని నన్నే నిందిస్తారు.
నా చెల్లెలు మెడిసిన్ చదువుతోంది. దాని చదువు పుర్తయాకే నా పెళ్లి. అమ్మ ఎలాగో రోజులు నెట్టుకొస్తోంది.
ఇప్పుడిప్పుడే శంకర్ తో పరిచయం పెరుగుతోంది. అతను చక్కటి చిత్రకారుడు.
ఒకటి రెండు సార్లు చూచాయగా తన ప్రసంశలు తెలియ జేసాడు కూడా. ఎందుకయినా మంచిదని ముందుగానే చెప్పాను మా అమ్మ మతం మార్చుకున్న సంగతి. అది పెద్ద పట్టించుకున్నట్టు కనబడలేదు.
నా శరీరం చెక్కిన శిల్పంలా ఉంటుందట. చామన ఛాయ అయితేనేం మొహం కళగా ఉంటుందట. ఒకసారి అతని చిత్ర ప్రదర్సన రవీంద్రభారతిలో జరిగింది. అప్పుడు వచ్చిన వారందరికీ నన్ను గొప్పగా పరిచయం కూడా చేసాడు నా ఆత్మీయురాలంటూ.
అన్నట్టు అ చిత్ర ప్రదర్శనకు విశాలి కూడా వచ్చింది. శంకర్ చిత్రాలంటే గొప్ప అభిమానం కూడా ప్రకటించింది.
నాలుగు రోజులుగా విశాలి బాంక్ కి రావడం లేదు. ముందు ఏవో పిల్లల జ్వరాలేమో అనుకున్నాను. కాని మధ్యాన్నం ఫోన్ చేసి నాతోమాట్లాడాలనేసరికి గతుక్కు మన్నాను.
శంకర్ ఇందాకే సాయంత్రం డిన్నర్ కి వెళ్దామని అడిగాడు. సరే నన్నాను.
అలాగని దానితో అబద్ధం చెప్పలేను. నిజమే చెప్పాను చెప్పి ఉరుకున్నానా, నువ్వూ డిన్నర్ కి రమ్మని ఆహ్వానించాను. అక్కడే మాట్లాడుకోవచ్చని చెప్పాను.
వచ్చింది. అప్పుడో ఇప్పుడో సమయం చూసుకు చెప్పింది, దత్తు అతని సెక్రెటరీ రుచికతో ప్రేమలో పడ్డాడట. ఇల్లు పిల్లలు ఎవరి ధ్యాసా లేనే లేదట.. అతనితో కలిసి బ్రతకడం కష్టం , అసాధ్యం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఒక్కసారి పగలబడి నవ్వాలనిపించింది.
దత్తు నన్ను వదిలి తన వెంట తిరిగి నప్పుడు ఈ సంగతి దాని బుర్రకు తట్టలేదా అనిపించింది. తప్పేముంది, అప్పుడు నన్ను వదిలి నీ ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు మరొకరి ప్రేమలో ..అందామనుకున్నాను
నేనేదైనా మాట్లాడేలోగానే శంకర్ తో ఏవో మాటల్లో పడింది.
శంకర్ , నేను ఎన్నో మాట్లాడుకోవాలని ఉహించుకున్న సాయంత్రం ఇల్లా వృధా కావడంతో చిరాకనిపించింది.
దీన్ని స్నేహమంటారా?, ఏమో! ఒక్కోసారి దీంతో నాకెందుకు ఈ పితలాటకం , ఇంకెవరూ దొరక నట్టు-అనిపిస్తుంది.
మొత్తానికి ఆ రాత్రి నన్ను మా ఇంట్లో దింపి దాన్ని వాళ్ళింట్లో దింపడానికి వెళ్ళిన శంకర్ రెండు నెలల తరువాత గాని కనబడలేదు.
అదీ చెల్లాయి కోరికమేరకు కొత్త సినిమాకు వెళ్తే అక్కడ విశాలితో కనిపించాడు.
ఈ లోగా రోజూ బాంక్ లో కనబడుతూనే ఉన్నా అస్సలు స్వంత విషయాలేమీ మాట్లాడలేదు విశాలి.
ఉదయం బాంక్ కి బయల్దేరే హడావిడిలో తెలియని నంబర్ ఫోన్ లో చూసి చిరాకనిపించింది. అయినా బస్ స్టాండ్ వైపు అడుగులు వేస్తూనే ఫోన్ ఎత్తాను.
“హలో” నా చిరాకు నా స్వరంలోనూ వినిపించినట్టుంది.
” సారీ శాలీనీ నీ నంబరేనా అని అనుమానిస్తూ చేశా.. నీకు తెలుసా , విశాలికీ నాకూ డివోర్స్ అయిపోయాయి..” దత్తు గొంతు.ఆపైన వినాలన్న ఆసక్తి నాకు లేదు.
నాకు తెలుసు. నిన్ననే వెడ్డింగ్ కార్డ్ అందింది. ఈ నెల పదహారున శంకర్ , విశాలి పెళ్లి.
ఎంత కులాల అభిమానం లేకపోయినా మరీ మతం మార్చుకునే వారంటే ఇంకా సమాజం లో ఆదరణ లేదట. అందుకని శంకర్ వెనక్కు తగ్గాడు.అయినా మనం ఎప్పటికీ మంచి మిత్రులమే అంటాడు.
ఫోన్ పెట్టేసే లోగా దత్తు స్వరం వినబడింది.
” శాలినీ నీకు అన్యాయం చేశాను , అందుకే నాకిలా అయింది. పోనీ మనిద్దరం ఎందుకు కలిసి ఉండకూడదు?”
నాకు నవ్వొచ్చింది. పెళ్ళికి అడ్డొచ్చే మతం మార్పిడి కలసి బ్రతికేందుకు రాదా?
చిన్నప్పుడు అమ్మ అన్న మాట గుర్తొచ్చింది.
మతం మార్పిడి జీవితాలను బాగు చేస్తుందా బలి తీసుకుంటుందా అని అడుగు దామనిపించింది. మనసులకు మతం ఉంటుందా అని అడుగు దామనిపించింది.
ఏదడిగి ఏం లాభం ఆధునికతకూ మతం పొరలు వచ్చాక, ఏది కనబడుతుంది గనక?
కధ బావుంది! కనీ..నిజంచెపాలంటే..స్వాతి గారి కవితలు చదివినప్పటి థ్రిల్ ఈ కధ చదివినప్పుడు కలగలేదు!మొత్తమ్మీద కధ బావుంది!!
కొ.కు గారు అనే వారు ” ఆధునిక యుగాని కి శాస్త్రవిజ్జానమే ప్రాతిపదిక”అని. అయితే ఈ ఆధునిక సమాజం శాస్త్రవిజ్జానాన్ని పనిమనిషి గా చేసు కొని దాని పలాలను తింటూ, అది కనిపించకుండా వుండేటందుకు సమాజానికి మతం పొరలను కప్పి ఉంచుతుంది. మంచి వస్తువు. అయితే వ్యక్తీకరణ బలంగా ఉన్నట్లు అనిపించటం లేదు.
ఈ కథ మతం సాకున మానవసంబంధాలను మకిలపరుస్తున్న మనుషుల దుర్మార్గపు వ్యక్తిత్వాలను నిలబెట్టి ప్రశ్నిస్తున్నది.మనిషి ధరిస్తున్న ముసుగుల్లో మతం ఒక పొరే. సామాజిక, ఆర్థిక సంబంధాలలో తమను తాము గొప్పచేసుకునే నెపాలు, ప్రణాళికాబద్ధ జీవితాలు, ఆకర్షణీయమైన ఆడంబరాల ఆబతో ప్రేమను అవమానించే మనుషుల దొంగబతుకుల డొల్లతనాన్ని బాగా బయటపెట్టారు స్వాతి శ్రీపాద గారు. వస్తువు బాగుంది.
కొన్ని ఇంప్రెశన్స్ ని పోగొట్టడం చాలా కష్టం.క్లిష్ట సమస్యని కథా వస్తువుగా తీసుకుని పాఠకుల్లో ఆలోచనా బీజం నాటటం లో రచయిత్రి కృతకృత్యులయ్యారు.
మతం మార్చుకున్నంత తేలికగా అభిమతాన్ని మార్చుకోవడం అంత సులభతరం కాదు అని చెబుతుంది ఈ కథ.
బ్రతకడం కోసం కొందరు- ఈ మతాన్ని ఆశ్రయించడం తప్పనిసరి అని భావించినా, లోలోన ఎక్కడో ఒక అసంతృప్తి,అశాంతి అలానే వుండిపోతుంది, అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ కథలో కధానాయిక తల్లి పాత్ర.
ఇక చుట్టూసమాజం మాట కొస్తే, ‘మతమార్పిడి కుటుంబమంటే ‘ ఎంత చులకనో అర్ధమౌతుంది ఇందులోనె మనుషుల ప్రవర్తన నని బట్టి.
కథ చివరిలో రచయిత్రి మాటలు నచ్చాయి.
‘నాకు నవ్వొచ్చింది. పెళ్ళికి అడ్డొచ్చే మతం మార్పిడి – కలసి బ్రతికేందుకు రాదా?
మనసులకు మతం ఉంటుందా? ‘ అని అడుగు దామనిపించింది.
ఏదడిగి ఏం లాభం ఆధునికతకూ మతం పొరలు వచ్చాక, ఏది కనబడుతుంది గనక?’
ఒక క్లిష్టమైన సనస్య తో కూడిన కథాంశాన్ని ఆధారం గా చేసుకుని అల్లిన కథ కాబట్టి, అన్నీ ప్రశ్నార్ధకాలు గానే వుంటాయి.
మనిషి సమాధానం కోసం వేచివేచి…అలా ఎదురు చూస్తూనే వుంటాయి కామోసు!
జవాబు చెప్పలేని కాలంతో బాటే, మనమూ..
స్వాతి గారికి అభినందనలతో..
-ఆర్.దమయంతి.
కధ బాగుంది ! కాని శాలిని తో పరిచయం అయిన ప్రతి వాళ్ళు విసాలిని ఇష్ట పడడం కధలో ఇమడలేదు !