అనువాద కథ

వృక్షం

అక్టోబర్ 2013

మూలం: మరియా లుయిసా బొంబాల్ (చిలీ)
తెలుగు అనువాదం: ఎలనాగ

పియానో వాద్యకారుడు కూర్చుని, కృతకంగా దగ్గి, ఏకాగ్రతను ఆవాహన చేసుకున్నాడు. ఆ హాలును వెలిగిస్తున్న కరెంటు దీపాల గుచ్ఛం నుండి వెలువడే కాంతి సాంద్రత క్రమంగా తగ్గుతుం టే ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక సంగీత స్వరమాలిక అణకువ నిండిన సాహసవంతమైన చంచలతతో రూపం పోసుకుంటున్నది.

‘మోట్జార్ట్ స్వర రచన కావచ్చు’ అనుకున్నది బ్రిగిడా. ఎప్పటి లాగానే కార్యక్రమ వివరాల కార్డును తీసుకోవటం ఆమె మరచి పోయింది. ఈ సంగీతం మోట్జార్ట్ దో లేక స్కార్లాటిదో కావచ్చు అనుకున్నదామె. ఆమెకు సంగీతం గురించి అంతగా తెలియదు. అందుకు కారణం ఆమెకు దాని పట్ల అభిరుచి లేకపోవటం కాదు. నిజానికి చిన్నప్పుడు పియానో పాఠాలు నేర్చు కుంటానని అడిగింది ఆమే. తన అక్కలను బలవంత పెట్టినట్టు తనను బలవంత పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అయినా తన అక్కలు ఇప్పుడు పియానో చక్కగా వాయిస్తారు. రాసి వున్న సంగీతం నోట్సును సరిగ్గా చదువుతారు. తనేమో సంగీత పాఠాల్ని మొదలు పెట్టి సంవత్సర కాలం లోపలే వాటిని మానుకుంది. అందుకు కారణం చిన్నదీ సిగ్గు పడాలిసిందీనూ. ‘ఎఫ్’ అనే ‘కీ’ని తను అసలే నేర్చుకోలేక పోయింది. తన తండ్రి ఎంతగా కోప్పడే వాడు! ఇంత మంది ఆడ పిల్లల్ని పెంచటం ఇక నా వల్ల కాదు. పాపం మిసెస్ కార్మెన్! బ్రిగిడాకు సంగీతం నేర్పటమనేది ఆమెకు ఎంత బాధాకరంగా పరిణమించిందో! ఈ పిల్లకు బుద్ధిమాంద్యమున్నట్టుంది అనే వాడు అతడు.

ఆరుగురు అక్కచెల్లెళ్లలో బ్రిగిడా అందరికన్న చిన్నది. ఆ పిల్లల్లో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోతీరు. ఆరవ సారి కూడా ఆడపిల్లే పుట్టడంతో వాళ్ల తండ్రి ఎంతగా విసిగిపోయి నిరుత్సాహ పడ్డాడంటే బ్రిగిడాను బుద్ధిమాంద్యం గల పిల్లగా ప్రకటించి, విషయాన్ని సరళతరం చేశాననుకు న్నాడు. “ఇక యెంత మాత్రం ఈ పిల్ల కోసం ప్రయాస పడను. ఎందుకంటే దాంతో ఫలితం సున్న. ఈ అమ్మాయి అట్లాగే వుండనీ. చదవకపోతే చదవకపోనీ. వంటగదిలో దెయ్యాల కథల్ని వింటూ గడపాలని అది అనుకుంటే ఇక దాని యిష్టం. ఈ పదహారేళ్ల వయసులో ఇంకా దానికి బొమ్మలు యిష్టమైతే అది వాటితోనే ఆడుకోనీ” అనే వాడు తండ్రి. బ్రిగిడా కూడా బొమ్మలతోనే సమయమంతా గడిపి అజ్ఞానురాలిగానే మిగిలిపోయింది.

అజ్ఞానిగా వుండటం ఎంత బాగుంటుంది! మోట్జార్ట్ ఎవరో, అతడు ఎక్కడ పుట్టాడో, అతని వాదనా నైపుణ్యమేమిటో తెలియకపోవటం! మనను అతడు చేయి పట్టుకుని నడిపించటం ఎంత బాగుంటుంది! ఇప్పుడు జరుగుతున్నట్టుగా.

నిజంగానే మోట్జార్ట్ యిప్పుడు ఆమె చేతిని పట్టుకుని ఎటో తీసుకుపోతున్నాడు. గులాబీల వంటి ఇసుక రేణువుల మీదుగా ప్రవహించే స్ఫటికస్వచ్ఛమైన నది మీది వంతెన పైనుండి అతడామెను తీసుకుపోతున్నాడు. సాలె గూడు లాంటి సన్నని వల మాదిరి డిజైనున్న గొడుగును తెరిచి పట్టుకుని, తెల్లని దుస్తుల్లో వున్న ఆమెను అతడు తీసుకుపోతున్నాడు.

పక్కన వున్న పరిచితులెవరో “బ్రిగిడా, నువ్వు చాలా యౌవనురాలిగా కనపడుతున్నావు. నిన్ననే నేను నీ భర్తను – అదే మాజీ భర్తను – కలిసాను. అతని వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి” అన్నారు.

కానీ ఆమె జవాబివ్వలేదు. తన పద్దెనిమిదేళ్లప్పటి యౌవనభరిత సంవత్సరాల అందమైన తోటకు వెళ్లటానికి మోట్జార్ట్ చదును చేసి బాగు చేసిన వంతెన మీదుగా ఆమె వెళ్లిపోతోంది. సంగీతాన్ని పైకి చిమ్మే నీటి ఫౌంటేన్లు, విప్పితే మోకాళ్ల దాకా జారే బాదంకాయల వరుసల్లాంటి తన జడల అల్లిక, బంగారు లాంటి తన మేని వర్ణం, ఏదో ప్రశ్నిస్తున్నట్టు విశాలంగా తెరిచి వున్న తన నల్లని కళ్లు, చక్కని పెదవులున్న తన నోరు, మధురమైన మందహాసం, అత్యంత నాజూకైన, సొగసైన తన శరీరం – ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి బ్రిగిడాకు. ఆ ఫౌంటేన్ రాయి అంచు మీద కూర్చుని తను ఏమాలోచిస్తోంది? ఏమీ లేదు. “ఆమె యెంత అందమైనదో అంత అజ్ఞానురాలు” అన్నారు అందరూ. కాని తాను అజ్ఞానురాలిగా వున్నందుకు గాని, డాన్సు చేస్తుంటే తను ఎబ్బెట్టుగా కనిపిస్తున్నందుకు గాని ఆమెకు పెద్దగా ఖేదం కలుగ లేదు. తన అక్కలకు ఒకరి తర్వాత ఒకరికి పెళ్లళ్లయి పోయాయి. తనను పెళ్లి చేసుకోవటానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.

మోట్జార్ట్ ఇప్పుడామెను రెండు మంచుకలువల వరుసల మధ్య లోంచి నీలి రంగు చలువ రాతి మెట్ల మీదుగా కిందికి తీసుకొస్తున్నాడు. ఆ గేటును తెరుచుకుని లోపలికి పోయి, ఆమె తన తండ్రి స్నేహితుడైన లూయిస్ మెడ మీద వాలిపోతుంది. తాను చాలా చిన్నగా వున్నప్పుడు, తనను అందరూ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆమె పరుగెత్తుతూ లూయిస్ దగ్గరికి వెళ్లేది. అతడామెను పొదివి పట్టుకునే వాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి, పాట లాంటి మృదువైన స్వరాలతో నవ్వుతూ అతని కళ్ల మీద, నుదురు మీద, నెరిసిన అతని వెంట్రుకల మీద (అతనెప్పుడైనా యువకుడిగా వుండే వాడా) వాన జల్లులా తీరూ తెన్నూ లేని విధంగా ముద్దుల జల్లును కురిపించేది.

“నువ్వొక పక్షుల దండ లాంటి దానివి” అనే వాడు లూయిస్.

ఆ విధంగా అతణ్ని పెళ్లి చేసుకున్నదామె. ఎందుకంటే పవిత్రుడూ, మితభాషీ అయిన అతని దగ్గర ఆమెకు తన వెర్రితనం, సరసం, సోమరితనాల తాలూకు అపరాధభావం కలిగేది కాదు. అవును, ఇప్పుడామెకు ఏమనిపిస్తున్నదంటే లూయిస్ ను తను ప్రేమ కేసం పెళ్లాడలేదని. అయినా తను హఠాత్తుగా యిల్లు వదిలి ఎందుకు వచ్చిందో ఆమెకు పూర్తిగా అర్థం కావటం లేదు.

కాని ఇప్పుడు మోట్జార్ట్ ఆమె చేతిని పట్టుకుని వేగం నిండిన నడకతో వ్యతిరేక దిశలో తోట వైపు లాక్కెళుతున్నాడు. మళ్లీ ఆ వంతెన మీదుగా తిన్నగా తీసుకుపోతున్నాడు. ఆమె పట్టుకున్న గొడుగునూ, తొడుక్కున్న గౌనునూ మాయంచేసి, మృదువైన, బలమైన స్వరంతో గతం అనే గది తలుపును మూసేశాడు. ఆమె ఆ హాల్లో నల్లని గౌనుతో మిగిలిపోయి, కృత్రిమమైన దీపాలు వెలగగానే యాంత్రికంగా చప్పట్లు కొట్టింది.

మళ్లీ ఒక సారి విద్యుద్దీపాల వెలుతురు క్రమంగా తగ్గిపోయి, బరువైన నిశ్శబ్దం అలుముకుంది.

తర్వాత వసంత కాలపు జాబిల్లి కింద బేథోవెన్ సంగీతం ఉప్పొంగింది. సముద్రం ఎంత వెనక్కి తగ్గిందో! దూరాన వుండ చుట్టుకుని ప్రశాంతంగా మిలమిల మెరుస్తున్న సముద్రానికి దారి తీసే తీరం మీదుగా నడిచింది బ్రిగిడా. కాని తర్వాత సముద్రం ఉప్పొంగుతూ, మెల్లగా పెరిగే నీటి మట్టంతో ఆమెను చేరుతూ, ఆమెను చుట్టుముట్టుతూ, తన చెంపను మరో పురుషుని శరీరం మీద ఆనించే దాకా నెట్టింది. తర్వాత అది వెనక్కి తగ్గుతూ, తన్మయత్వంలో మునిగిన బ్రిగిడాను లూయిస్ వక్షం మీదకు చేర్చింది.

“నీకు హృదయం లేదు, నీకు హృదయమే లేదు” అనేది బ్రిగిడా లూయిస్ తో. భర్త హృదయ స్పందన అత్యంత బలహీనంగా వినపడేది. రాత్రి పడుకునే ముందు యధావిధిగా లూయిస్ వార్తా పత్రికల్ని చదువుతున్నప్పుడు “నా పక్కన వున్నా నీ మనసు నాతో వుండదెందుకని? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావసలు?” అన్నది బ్రిగిడా.

“ఎందుకంటే నువ్వు భీత హరిణేక్షణవు కనుక” అని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు లూయిస్. ఆమె వెంటనే సంతోష పడిపోయి, అతని నెరిసిన తలను తన బుజం మీద ఆనించు కుంది. అతని వెండి వెంట్రుకల తలను!

“లూయిస్! నువ్వు చిన్న పిల్లాడిగా వున్నప్పుడు నీ వెంట్రుకలు కచ్చితంగా ఏ రంగులో వుండేవో చెప్పనే లేదు నువ్వు. పదిహేనేళ్లప్పుడు నీ వెంట్రుకలు నెరిసినప్పుడు మీ అమ్మ ఏమనేదో కూడా నువ్వు చెప్ప లేదు. ఏమన్నదామె? నవ్విందా లేక యేడ్చిందా? నువ్వు అందుకు గర్వపడ్డావా లేక సిగ్గు పడ్డావా.” నీ స్కూళ్లో స్నేహితులు ఏమనేవారు? చెప్పు లూయిస్ చెప్పు” అన్నది బ్రిగిడా.

“రేపు చెబుతాను. నాకు నిద్ర వస్తోంది బ్రిగిడా. నేను చాలా అలసిపోయాను. లైటు కట్టెయ్” అన్నాడు లూయిస్.
అచేతనంగా అతడు ఆమె నుండి దూరంగా జరిగాడు. ఆమె కూడా అచేతనంగా రాత్రంతా భర్త భుజం మీద తల పెట్టింది అతని శ్వాసను కోరుతూ. అనుకూలమైన వాతావరణం కోసం దాహంతో కొమ్మల్ని చూస్తూ వాటంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నిస్తున్న మొక్కలా ఆమె అతని శ్వాస కింద బతకాలని ప్రయత్నించింది.

ఉదయాన పనిమనిషి కిటికీ తలుపుల్ని తెరవటానికి వచ్చినప్పుడు, బ్రిగిడా పక్కన లూయిస్ కనిపించ లేదు. అతడు నిద్ర లేచి ఆమెకు శుభోదయం చెప్పకుండానే మెల్లగా జాగ్రత్తగా బయటికి జారుకున్నాడు. ఎందుకంటే తన పక్షుల దండ అయిన ఆమె అతణ్ని పోనివ్వకుండా బలవంతంగా బుజాన్ని లాగి పట్టి వుంచుతుందని అతని భయం. “ఐదు నిమిషాలు, కేవలం ఐదు నిమిషాలు మాత్రమే లూయిస్. నువ్వు నాతో ఐదు నిమిషాల పాటు వుంటే నీ ఆఫీసేం మాయమవదు” అంటుంది బ్రిగిడా. తన మేల్కొనటాలు… అబ్బ తన మేల్కొనటాలు ఎంత దుర్భరంగా ఉండేవి! ఎప్పుడైనా అరుదుగా డిరెస్సింగ్ రూం లోకి వెళ్లగానే తన విచారమంతా మాయమవటం విచిత్రంగా తోచేది.

దూరాన ఒక ఆకుల సముద్రం గొణుగుతున్నదా అన్నట్టు అలలు పైకి లేస్తూ విరిగి పడుతున్నాయి. అది బేథోవెన్ సంగీతమా? కాదేమో.
అది తన డ్రెస్సింగ్ రూముకు దగ్గరే వున్న చెట్టు చేస్తున్న చప్పుడు. తన లోపల సుళ్లు తిరుగుతున్న అద్భుతమైన ఆనందకర స్ఫురణను అనుభూతి చెందటానికి ఆ చెట్టు చాలు అనిపించిందామెకు. ఉదయపు వేళల్లో పడక గదిలో ఎంత వేడిగా వుండేది! ఆ వెలుతురు ఎంత కర్కశంగా వుండేది! కాని అక్కడ, ఆ డ్రెస్సింగ్ రూం లో ఎంతో విశ్రాంతి ప్రశాంతత దొరుకుతాయి. నది లోని చల్లని అలలు గోడ మీద నీడల్ని పరుస్తున్నట్టు అనంతమైన ఆకు పచ్చని అడవి లోకి జారిపోయే నీడల్ని ప్రతిబింబించే అద్దాల్లా అలలు… ఆ గదిలో ఎంత హాయిగా వుంటుంది! ఆ గది అక్వేరియంలో మునిగిన ఒక ప్రపంచంలా తోచేది ఆమెకు. ఆ మహా వృక్షం ముచ్చటిస్తున్నట్టు ఎలా చప్పుడు చేసేది! చుట్టుపక్కల నుంచి పక్షులన్నీ ఎగిరి వచ్చి దాని మీద వాలి ఆశ్రయం పొందేవి. నగరపు ఒక మూల నుండి నదికి దారి తీసే ఆ ఇరుకు వీధిలో ఉన్న చెట్టు అదొక్కటే.

“నేను బిజీగా వున్నాను. నేను నీతో రాలేను. నేనెంతో పని చేయాల్సి వుంది. మధ్యాహ్న భోజనానికి నేను రాలేను… హలో, అవును, నేనిప్పుడు క్లబ్బులో వున్నాను. ఒకాయనతో పని వుందిప్పుడు. నువ్వు భోంచేసి పడుకో. ఉహుఁ, తెలియదు నాకు. నా కోసం వేవి వుండక నువ్వు పడుకో బ్రిగిడా.”

‘నాకెవరైనా చెలికత్తెలుంటే బాగుండేది’ అనుకుని నిట్టూర్చింది బ్రిగిడా. కాని ఎవరూ ఆమెతో స్నేహానికి ఆసక్తి చూపలేదు. తను అంత అజ్ఞానురాలిగా వుండకుంటే బాగుండేది. కాని వెంటనే అంత జ్ఞానాన్ని సొంతం చేసుకోవటం ఎలా సాధ్యం? తెలివిని పొందటానికి చిన్నతనం నుంచి మొదలు పెట్టాలి కదా’ అనుకున్నదామె.

“నా అక్కల్ని వాళ్ల భర్తలు తరచుగా బయటికి తీసుకు పోతారు. కాని లూయిస్ నా అజ్ఞానానికి, పిరికితనానికి, నా పద్ధెనిమిదేళ్ల వయసుకు సిగ్గు పడతాడు. ఈ విషయాన్ని నాకు నేను ఎందుకు చెప్పుకోగూడదు? నా వయసు చాలా తక్కువగా వుండటం రహస్యంగా వుంచతగిన లోపంగా భావించాడేమో, లూయిస్ నాకు ఇరవై రెండేళ్లుటాయని చెప్పమని అనే వాడు” అనుకుంది బ్రిగిడా.
రాత్రి పడక మీదికి వచ్చినప్పుడు అతనెంతగా అలసిపోతాడు! తను చెప్పిందంతా ఆయనెప్పుడూ వినడు. తనను చూసి అతడు యాంత్రికంగా నవ్వుతాడని తెలుసు. తనకు తనను ఎంతో మురిపెంగా లాలిస్తాడు కానీ ఆ సమయంలో అతని మనసు యెక్కడో వుంటుంది. అతడు తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కేవలం ఒక అలవవాటు కోసం. తన తండ్రితో బాంధవ్యాన్ని బలపరచుకోవటం కోసం. బహుశా ఈ మగాళ్లకు జీవితమంటే చిన్నప్పటి కొన్ని అలవాట్లే కాబోలు. ఆ అలవాట్లలో ఏదైనా ఒకటి ఆగిపోతే తికమక, పరాజయం

తలెత్తుతాయి. అప్పుడు వాళ్లు నగరం లోని వీధులన్నీ తిరుగుతూ, పార్కుల్లో బెంచీల మీద కూర్చుంటూ, రోజురోజుకూ మరింత ఎక్కువగా మాసిపోయిన గుడ్డల్ని ధరిస్తూ, గడ్డాన్ని మరింతగా పెంచుతారు. అందుకే లూయిస్ ప్రతి నిమిషం ఏదో వొక పని చేస్తుంటాడు. ఈ విషయాన్ని తను ముందుగానే ఎందుకు అర్థం చేసుకోలేదు? తన తండ్రి తనను తెలివి తక్కువ వాళ్లలో జమ కట్టడం సమంజసమే అనిపించింది ఆమెకు.

“నాకు ఎప్పుడైనా మంచును చూడాలని వుంది లూయిస్”

“ఈ వేసవి కాలంలో నిన్ను యూరప్ కు తీసుకుపోతాను. అక్కడ అప్పుడు చాలా చలి కాలం కనుక నువ్వు మంచును చూడగలుగుతావు.”

“ఇక్కడ ఎండా కాలం అయితే యూరపులో చలి కాలమని తెలుసు నాకు. అంత అజ్ఞానురాలినేం కాదు నేను.”

ఒక్కోసారి అతనిలో నిజమైన ప్రేమ తీవ్రతను మేల్కొల్పటం కోసం భర్త మీద పడిపోయి అతణ్ని ముద్దులతో ముంచెత్తుతూ, ఏడుస్తూ, లూయిస్, లూయిస్, లూయిస్ అని పిలుస్తుందామె.

“ఏమిటి? ఏమైంది నీకు? నీకేం కావాలి?” అంటాడు లుయిస్.

“ఏమీ లేదు”

“మరయితే నన్నెందుకలా పిలుస్తావు?”

“ప్రత్యేకమైన కారణమేమీ లేదు. నిన్ను అలా పిలవాలనిపిస్తుందంతే ” అంటుందామె. ఆ కొత్త ఆటను సౌమ్యంగా స్వీకరిస్తూ అతను నవ్వుతాడు.

వేసవి కాలం వచ్చింది. పెళ్లయిన తర్వాత అది మొదటి వేసవి. ఆఫీసులో తన కొత్త డ్యూటీలు భార్యకు చేసిన వాగ్దానాన్ని నెరవేరనీయ లేదు.

“బ్రిగిడా! బొనస్ అయిరెస్ లో ఈ సారి వేసవి కాలంలో వేడిమి చాలా తీవ్రంగా ఉండబోతోంది. మీ నాన్నతో ఫామ్ హౌస్ కు వెళ్ల రాదూ”

“నువ్వు లేకుండానా?”

“నేను ప్రతి వారాంతంలో నిన్ను కలవటానికి వస్తాను”

అతణ్ని అవమానించాలనుకుని ఆమె మంచం మీద కూర్చుంది. కాని బాధించే మాటలతో అతని మీద అరవటం ఆమె వల్ల కాలేదు. అట్లా చేయటం ఆమెకు అసలే రాదు. ఎట్లా అవమానించాలో కూడా తెలియదామెకు.

“ఏమైంది నీకు? ఏమాలోచిస్తున్నావు బ్రిగిడా?”

మొదటి సారిగా ఆఫీసుకు టైము అయిపోతున్నా లూయిస్ అడుగులు వెనక్కి వేసి, ఆమె మీదికి వంగుతూ ఆగిపోయాడు.
“నాకు నిద్ర వస్తోంది” అన్నది బ్రిగిడా, చిన్న పిల్ల లాగా దిండులో ముఖం దూరుస్తూ.

లూయిస్ జీవితంలో మొదటి సారిగా లంచ్ టైమ్ లో క్లబ్ నుండి ఫోన్ చేశాడు. కాని ఆమె టెలిఫోన్ దగ్గరికే పోకుండా తన ఆయుధమైన మౌనాన్ని ఉపయోగించింది.

ఆ సాయంత్రం ఆమె తన భర్తకెదురుగా కూర్చుని, దించిన కళ్లు ఎత్తకుండా నరాలు బిగబట్టుకుంటూ భోంచేసింది.

“నీకింకా కోపం పోలేదా బ్రిగిడా?”

కాని ఆమె మాట్లాడ లేదు.

“నువ్వంటే నాకు ప్రేమ అని నీకు తెలుసు నా ‘పక్షుల హారమా’. కాని నేను ఎప్పుడూ నీతోనే వుండ లేను. నేను చాలా బిజీ మనిషిని. నేను వెయ్యి పనులకు దాసుడిగా వుండాల్సి వస్తున్నది”

“…………………….”

“రాత్రి బయటకు వెళ్దామా?”

“……………………..”

“పోవాలని లేదా? మాంటె విడియో నుండి రాబర్టో ఫోన్ చేసాడా?”

“…………………………”

“నీ డ్రెస్ ఎంతో బాగుంది. కొత్తదా?

“…………………………”

“డ్రెస్ కొత్తదా, బ్రిగిడా, జవాబివ్వు”

కాని ఇప్పుడు కూడా ఆమె జవాబివ్వలేదు. దాంతో తక్షణమే ఊహించని, ఆశ్చర్య కరమైన, అసంబద్ధమైన, అనుచితమైన సంఘటన జరిగింది. లూయిస్ కుర్చీలోంచి లేచి, నాప్ కిన్ ను విసురుగా టేబుల్ మీదకి విసిరి, బయటికి పోతూ తలుపును దట్టిగా మూసేశాడు.
ఆమె అప్రతిభురాలై తనకు జరిగిన అన్యాయం పట్ల కోపంతో వణుకుతూ, తికమకగా గొణుగుతూ “ఇక నేను …. నేను ….. దాదాపు ఒక ఏడాదిగా …. జీవితంలో మొదటి సారిగా తిరస్కరిస్తే … నేను వెళ్తున్నాను …. ఈ రాత్రికే వెళ్లిపోతున్నాను. మళ్లీ ఈ యింట్లో కాలు పెట్టను” అన్నది. డ్రెస్సింగ్ రూం లోని అలమరాను కోపంగా తెరిచి, పిచ్చిదాని లాగా బట్టలన్నింటినీ నేల మీద గిరాటేసింది.
అప్పుడు కిటికీ తలుపుల మీద ఎవరో పిడికిలితో కొట్టినట్టు వినపడింది ఆమెకు. తనకు తెలియకుండానే ధైర్యంతో కిటికీ దగ్గరికి పరుగెత్తిందామె. కిటికీని తెరిచింది. చూస్తే అది నీలగిరి చెట్టు. ఆ చెట్టు చాలా పెద్దగా వుంది. బయట ఉధృతమైన గాలి వీస్తుంటే దాని కొమ్మలు కిటికీ తలుపులకు తగిలి ఆమెను బయటికి పిలుస్తున్నాయా అన్నట్టు చప్పుడు చేసినయ్. ఆ ఎండా కాలపు సాయం సమయాన రౌద్రమైన ఆకాశం కింద ఒక ఉగ్రమైన నల్లని జ్వాల కదులుతున్నట్టుగా వుంది ఆ చెట్టు.

కొద్ది సేపైన తర్వాత దాని చల్లని ఆకుల మీద వర్షం పడింది. ఎంత ఆహ్లాదకరంగా వుంది చెట్టు! రాత్రంతా దాని ఆకుల మీద వర్షం పడి, నీళ్లు కిందికి జారి, వెయ్యి ఊహాజనితమైన కాలు వల్లోంచి పారిన శబ్దం ఆమెకు వినపడింది. రాత్రంతా ఆ నీలగిరి చెట్టు తన కాండాన్నీ, కొమ్మల్నీ కిటికీ రెక్కలకు రాస్తూ మూలుగుతున్నట్టు, తుఫాను గురించి చెబుతున్నట్టు, తనేమో లూయిస్ కు ఆనుకుని దుప్పట్లో వణుకుతున్నట్టు నటిస్తూ…

వెండి పైకప్పు మీద దోసిళ్ల కొద్దీ ముత్యాలు పుష్కలంగా వర్షిస్తున్నాయి. షోపేన్ స్వరబద్ధం చేసిన ‘ఎట్యూడ్స్’ అవి.

ఎన్నో వారాలుగా తను చాలాపొద్దున్నే లేచి చూస్తుంటే, తన భర్త ఇంకా మొండిగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ లేచి పోతున్నాడు.

డ్రెస్సింగ్ రూం కిటికీ తెరవగానే నది వాసన, పచ్చిక బయళ్ల వాసన ఆ గదిలో తేలి యాడింది. అద్దాల మీద పొగమంచు తాలూకు వెలుతురు.

షోపేన్ సంగీతమూ, నీలగిరి చెట్టు ఆకుల సందుల్లోంచి కిందికి జారే వర్షపు నీరూ, అది గులాబీ పొదల్ని ముంచెత్తుతూ చేసే ఒక గువ్త జలపాతం లాంటి చప్పుడూ… ఆందోళనా తరంగితమైన బ్రిగిడా మనసులో ఈ రెండు చప్పుళ్లూ కలిసిపోయి, ఒక బెంగను ధ్వనింపజేశాయి.

వేసవి కాలంలో అంత పెద్ద వర్షం పడ్డప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? విషాదాన్నీ, నలతనూ నటిస్తూ పొద్దంతా యింట్లోనే వుండిపోతారా? లూయిస్ ఒక మధ్యాహ్నం పూట బెరుకుగా యింట్లోకి వచ్చాడు. కుర్చీ మీద బిగుసుకుపోయి కూర్చున్నాడు. కొంత సేపు నిశ్శబ్దం.
“బ్రిగిడా! అయితే నువ్వు ఇప్పుడు నన్ను ఏ మాత్రం ప్రేమించటం లేదనేది నిజమేనా?”

ఆమె ఒక మూర్ఖురాలి లాగా హఠాత్తుగా సంతోషపడింది. అతడు ఆమెకు సమయం ఇచ్చివుంటే “లేదు లూయిస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అనేదే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా అతడు తనకు అలవాటైన ప్రశాంతతతో “ఏ విధంగా చూసినా మనం విడిపోవటం సముచితమైన విషయం కాదు బ్రిగిడా. దీని గురించి నం బాగా ఆలోచించాల్సి వుంటుంది” అన్నాడు.

బ్రిగిడా లోని ఉరవడులు, ప్రేరణలు ఎంత హఠాత్తుగా తలెత్తాయో అంతే హఠాత్తుగా అణగిపోయాయి. తను అనవసరంగాఎందుకు ఉద్రేక పడాలి? లూయిస్ తన మృదుత్వంతో మితంగా ప్రేమించాడు. ముందు ముందు అతనెప్పుడైనా తనను ద్వేషిస్తే అతని ద్వేషం న్యాయమైనదిగా, వివేకపూరితమైనదిగా వుంటుంది. అదే జీవితం మరి! ఆమె కిటికీ దగ్గరికి పోయి చల్లని గాజు తలుపుకు నుదురు ఆనించింది. నీలగిరి చెట్టు చినుకులతో వర్షాన్ని నిశ్శబ్దంగా, మృదువుగా,నిలకడగా స్వీకరిస్తోంది. నీడలో ఆ గది మౌనంగా, క్రమబద్ధంగా వుంది. ప్రతిదీ శాశ్వతంగా, ఉదాత్తంగా వచ్చి ఆగిపోతున్నట్టనిపించింది ఆమెకు. జీవితమంటే అదే మరి! జీవితపు ఆ సాధారణత్వాన్ని, కచ్చితత్వాన్ని, పరిష్కార రాహిత్యాన్ని ఆమోదించటంలో గొప్పతన మున్నట్టు తోచింది. విషయాల లోతుల్లోంచి విషాదకరమైన, జాప్యత గల పదాలు పుట్టి, పైకి ఉబుకుతున్నాయనిపించింది.

తన ప్రవర్తనా విధానం మళ్లీ కుదురుకున్నాక, లూయిస్ గది లోంచి జారుకున్నాడని గ్రహించింది బ్రిగిడా.

వాన మొదలైంది. నిలకడగా, రహస్యంగా షోపేన్ సంగీతంతో నిర్విరామంగా గుసగుసలాడింది. ఎండా కాలపు వేడిమి క్యాలెండరు లోని కాయితాల్ని కాల్చేస్తున్నదా అన్నంత తీక్ష్ణతతో సాగింది. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రకాశ తీవ్రతతో, చిత్తడి నేలల అసంపూర్ణ తేమతో స్వర్ణ ఖండాల్లాగా రాలిపోయాయి ఆ కాయితాలు.సంక్షిప్తమైన, ఉగ్రమైన తుఫానునూ, వడ గాలుల్నీ, గులాబీల పరిమళాన్నీ మోసుకొచ్చి ఆ పెద్ద నీలగిరి వృక్షానికి వేలాడదీసే గాలుల్లాంటి కాయితాలు అవి.

పేవ్ మెంటు బండల్ని పైకి లేపుతూ వంకర తిరిగిన ఆ పెద్ద చెట్టు వేర్ల నడుమ పిల్లలు దాగుడు మూతలాడుకునే వారు. ఆ చెట్టు నవ్వుతో, గుసగుసల్తో నిండిపోయింది. ఆమె కూడా ఆ ఆటలో పాల్గొనాలనుకుంది. కాని పిల్లలు అది గ్రహించక భయంతో పారిపోయారు.

తన మోచేతుల్ని కటికీకి ఆనించి, వణికే చెట్టు ఆకుల్ని చాలా సేపు చూస్తూ వుండిపోయింది బ్రిగిడా. నేరుగా నదికి దారి తీసే ఆ వీధి మీదుగా కొంత గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. ఆ చెట్ల ఆకుల వణుకును చూడటం దృష్టిని పారే నది నీళ్లలోనో, మండే కొలిమిలోనో ముంచటంలా వుంది. ఏ ఆలోచనా లేక సంతోషపు మైకంలో గంటల తరబడి అలా కాలాన్ని గడప వచ్చుననుకుంది ఆమె.
సాయంత్రం వేళ ఆ గదిలో ఆమె దీపం వెలిగించినప్పుడు కాంతి పరచుకునేది కాదు. ఆ దీపపు ప్రతిబింబం అద్దాల్లో పడి రాత్రిని త్వరగా ముగింపజేసే ఎన్నో మిణుగురు పురుగుల్లా మారి పోయేది.

రాత్రి తర్వాత రాత్రి ఆమె తన భర్త పక్కన జోగుతూ మధ్య మధ్య మెవకువ వచ్చినప్పుడు బాధ పడింది. కాని ఆమె లోని ఆగ్రహపూరితమైన ఆవేదన భర్తను కత్తితో పొడిచి గాయపరచాలనుకునేటంతగా పెరిగినప్పుడు నిద్ర లోంచి లేపి, అర్జెంటుగా అతణ్ని కసిగా బాదాలనో, లేక ప్రేమగా నిమరాలనుకునే విధంగానో కోపం కమ్ముకున్నప్పుడు, ఆమె కాలి వేళ్ల మీద నడుస్తూ డ్రెస్సింగ్ రూం లోకి వెళ్లి కిటికీ తలుపులు తెరుస్తుంది. వెంటనే ఆ గది మార్మికత నిండిన పద ధ్వనులతో, రెక్కల టపటప శబ్దాలతో, చెట్ల కొమ్మలు విరిగిన అస్పష్ట శబ్దాలతో, వేసవి రాత్రిలో మునిగిపోయిన నీలగిరి వృక్షపు బెరడు కింద దాక్కున్న కీచురాళ్ల రొదతో – ఇలా రకరకాల శబ్దాలతో వాటి నికితో నిండిపోతుంది. కార్పెట్ మీద ఆమె నగ్న పాదాలు మెల్లమెల్లగా చల్లబడటం తో ఆమె లోని భావోద్వేగం తగ్గింది. బాధను భరించటం అన్నది ఆ గదిలోఎందుకంత సులభమౌ తపందో ఆమెకు అర్థం కాలేదు.

షోపేన్ సంగీతం ఒక స్వర మాలికను మరొక స్వర మాలికతో, ఒక ఒంటరి విషాదాన్ని మరొక ఒంటరి విషాదంతో కలిపింది నిశ్చలత్వంతో.
ఆకు రాలే కాలం వచ్చింది. ఎండిన ఆకులు తోట లోని పచ్చిక మీద పల్లానికి వంగే పేవ్ మెంటు మీద పడే ముందు గాలిలో గిరగిరా తిరిగాయి. నీలగిరి చెట్టు పైకొస పచ్చదనంతో నిండి వుంది. కాని కింది భాగాన అది ఎర్రబడిపోయి, మందమైన స్వెటర్ లా ముదురు రంగును దాల్చింది. ఆ గది బంగారు వన్నె గల పానపాత్రలో మునిగి వున్నట్టనిపించింది.

దివాన్ మీద పడుకుని, రాత్రి భోజనానికి లూయిస్ వస్తాడని ఆమె ఎదురు చూసింది. అతడు వచ్చే అవకాశం తక్కువ అని ఆమెకు తెలుసు. ఆమె మళ్లీ అతనితో మాట్లాడుతూ ఉత్సాహం, కోపం నశించి, మళ్లీ అతని భార్యగా మారింది. ఇప్పుడామెకు అతని మీద ప్రేమ లేదు. నిజానికి ఆమెలో సంతుష్టి , ప్రశాంతత నెలకొన్నాయి. ఇప్పుడామెను బాభ పెట్టటం ఎవరి వల్లా, దేని వల్లా కాదు. కోలుకోలేని విధంగా సంతోషాన్ని పోగొట్టుకున్నట్టు కచ్చితంగా తెలియటంలో నిజమైన ఆనందం వుంటుందేమో. అప్పుడు మన జీవితం లోని శాశ్వతమైన చిన్న చిన్న సంతోషాలను ఆనదించే విధంగా నిర్భయంగా, నిశ్చితంగా మనుగడ సాగించటం ప్రారంభిస్తాము.
ఒక ప్రచండమైన ఉరుము శబ్దం, ఆ తర్వాత ఒక మెరుపు ఆమెను వెనక్కి నెట్టాయి. ఆమె నిలువెల్లా వణికిపోయింది. అది వర్ష రుతువు శబ్దమా? కాదు, నీలగిరి చెట్టు చేసిన శబ్దమని ఆమెకు తెలుసు. గొడ్డలితో నరికి ఆ చెట్టును పడగొట్టారు. ప్రాతఃకాలంలోనే మొదలైన ఆ కార్యక్రమపు కలకలాన్ని ఆమె వినలేదు. ఆ చెట్టు వేళ్లు పేవ్ మెంటు మీది బండల్ని పైకి లేపుతున్నాయి కనుక దాన్ని కొట్టేయాలని కమిటీ నిర్ణయించింది.

దిగ్భ్రాంతితో ఆమె తన చేతుల్ని పైకెత్తి, వాటిని కళ్లకు అడ్డంగా పెట్టుకుంది. చూపు మళ్లీ కుదుట పడగానే అక్కడ నిలబడి చుట్టూ కలయ జూచింది. ఏం చూసింది ఆమె? హఠాత్తుగా వెలుతురు నిండిన హాలునా? విడిపోయి వేర్వేరు దిశల్లో నడుస్తున్న మనుషులనా? కాదు ఆమె తన గతపు గూడులో బందీ అయింది. డ్రెసింగ్ రూంను ఆమె వదిలిపోలేదు. తెల్లని భయంకరమైన వెలుతురుతో నిండిపోయిన తన డ్రెసింగ్ రూమును, తన యింటి పైకప్పును పెరికేసినట్టు, అన్ని దిక్కులనుండీ కర్కశమైన వెలుతురు లోపలికి వచ్చి, తన చర్మరంధ్రాల్లోంచి లోపలికి పోయి, చలితో తనను కాల్చేసినట్టు అనుభూతి చెందిందామె. ముడుతలు పడ్డ లూయిస్ ముఖం, లావైన రంగు వెలిసిన రక్తనాళాలు పాకుతున్న అతని చేతులు, అతడు పులుముకున్న ఆడంబరమైన రంగులు – అన్నీ స్పష్టంగా కనిపించాయి ఆమెకు. భయంతో ఆమె కిటికీ దగ్గరికి పరుగెత్తింది. ఇప్పుడా కిటికీ ఆ ఇరుకైన వీధిలోనికి నేరుగా తెరుచుకుంటుంది. ఆ వీధి ఇప్పుడు ఎంత ఇరుకుగా వుందంటే తన గది ఒక బహుళ అంతస్తుల భవనాన్ని దాదాపు తాకుతున్నట్టుగా వుంది. ఆ పెద్ద భవనం లోని మొదటి అంతస్తులో అన్నీ షో రూముల కిటికీలు సీసాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వీధి మలుపులో ఎర్రగా పెయింట్ చేసిన పెట్రోల్ బంకు ముందర కార్లు బారులు తీరి వున్నాయి. వీధి మధ్యలో కొందరు పిల్లలు బంతిని తన్నుతూ ఆడుకుంటున్నారు.

ఆ వికార దృశ్యాలన్నీ ఆమె గది లోని అద్దాల్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఆమె గది లోని అద్దాల్లో నికెల్ తో తాపడం చేసిన బాల్కనీలు, అపరిశుభ్రమైన గుడ్డల వరుసలు, చిలుకల పంజరాలు కనిపిస్తున్నాయి.

అవన్నీ ఆమె రహస్యాన్నీ , ఆంతరంగికతనూ మాయం చేసినయ్. వీధి మధ్యలో తాను నగ్నంగా నిలబడి వున్నట్టు అనిపించిందామెకు. పడక మీద వీపును తిప్పి పడుకునే మునలి భర్తకు, తనకు సంతానాన్ని ప్రసాదించని భర్తకు పక్కన నగ్నంగా అందరకీ కనిపించే విధంగా నిలబడి వున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లూ తాను పిల్లలు కావాలని ఎందుకు కోరుకోలేదో, జీవితమంతా పిల్లలు లేకుండా బతకాలనే ఊహతో ఎందుకు బతికిందో ఆమెకు అర్థం కాలేదు. అతి సంతోషాన్ని వెల్లడించే లూయిస్ నవ్వును, కపటపు నవ్వును నవ్వటంలో సిద్ధహస్తుడైన లూయిస్ ను, కొన్ని సార్లు నవ్వాలి కనుక బలవంతంగా నవ్వే లూయిస్ ను ఇన్నాళ్లు తానెలా భరించిందో ఆమెకు అర్థం కాలేదు.

అంతా అబద్దం. తన సహనం, ప్రశాంతత అన్నీ అబద్ధాలే అనుకున్నదామె. తను ప్రేమించాలనుకున్నది నిజమే. అదంతా…. ఆ ప్రేమంతా పిచ్చితనమే.

“కాని బ్రగిడా, నువ్వెందుకు ఈ యిల్లు వదిలిపోతున్నావు? ఎందుకు వుండటం లేదిక్కడ?” అని అడిగాడు లూయిస్.
అతనికి ఎలా జవాబివ్వాలో ఇప్పుడు తెలిసింది ఆమెకు. “చెట్టు. చెట్టు లూయిస్. ఆ చెట్టును కొట్టేశారు” అన్నదామె.

 

 

(‘ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు’ అనువాద కథల సంపుటిలోంచి)