సమీక్ష

హృదయ ఘోషకు, సమాజ భాషకూ చక్కని రూపం మౌనశ్రీ మల్లిక్ కవితా దీపం

మార్చి 2014

యుగాన్ని శాసించేది కాలం కాదు కలం
జగాన్ని నడిపించేది ధనం కాదు కవనం

అంటూ దూసుకొచ్చిన కొత్త కవిత్వపు చిరునామా మౌనశ్రీ మల్లిక్.

ఆధునిక సంక్షోభాలనూ అతి సుందరమైన కవితలో చెప్పగల నేర్పు మౌనశ్రీది. కాదేదీ కవిత కనర్హం అతనికి. అయితే ప్రతికవితా చక్కని భావుకతా చిత్రం .ఒక గొప్ప రస సిద్ధి. వస్తు వైవిధ్యం, భావ సౌకుమార్యం, భాషా సముదాయం కూడగట్టుకుని కనిపించే అతని కవిత్వం అతిలోక సుందరి. మరణ రంగస్థల ప్రదర్శన అయినా అలిగిన గొంతు అయినా అతని కలానికి ఒక అలవోక గీత మాత్రమేరూపకాన్ని సాధికారికంగా ఉపయోగించే నేర్పరి.

యుగయుగాల విశ్వంభర సుడిగాలుల్లో చెలరేగిన
ధూళి కణాన్ని నేనని తెలిసిన తరువాత
నా రెండు వెలుగు లోయలు
విషాద నిశీధితో నిండిపోతున్నాయి.

యుగయుగాల విశ్వంభర సుడిగాలులు —ఏ చరిత్రలవి ? ఏ సమస్యలవి ? వెతికి ప్రతీక లీ సుడిగాలులు ?
సుడి గాలిలో ధూళి కణం కణం –ఇది మానసిక స్థితా? సామాజిక అవస్థా? ఒక లోలోని అభద్రతా భావనా? అనుభవించిన అవమానపు హేలనా?

రెండు వెలుగు లోయలు –అతి చక్కని ప్రతీక వెలుగులు చిమ్మే కళ్ళు ఏం చెప్తాయి? వెలుగుల స్థానం ఆక్రమించిన విషాదపు నిశీధి… ఎంత లోతైన భావన!

అంటూ పరిచయ వాక్యాలతో ఆరంభించి, ఎందుకు జన్మి౦చానో తెలిసి కూడా భ్రమలో చిటికిన జీవితానికి పర్యవసానం ఊహకందని విధంగా నిర్వచిస్తాడు. అమ్మ గురించి వర్ణన అత్యద్భుతం. అమ్మంటే మౌనమే కదా.. ఎంత ఆర్ద్రత, మెదడు పొరల్లోంచి తడి జ్ఞాపకాలు బయటకు తోడి చూపి మురిపించి మరిపి౦చిన చాతుర్యం అతని కవిత్వం.

మాట్లాడుకున్న మాటల్నే శాశ్వతంగా నిద్రపోడం , ..కాలానికేం తెలుసు అనుబంధాల విలువ ? లోలోని నీ గుర్తులన్నీ కవిత్వమై పవిత్రంగా గుభాలిస్తూనే ఉంటాయి.

హృదయాన్ని మెలితిప్పే ఆవేదన అందంగా మలచడం ఇదేనేమో!
“ వేట గాడి కదలికలు “
ఒక కాంట్రాస్ట్ ను విడమరిచి చెప్పడం బావుంది.
వాడు
మేకపిల్లలను చేరదీసేది
కనికరంతో కాదు
కసాయితనంతో …
చిన్న చిన్న పదాలు అతి సామాన్యమయినవే ,అయితే పదాల మధ్య ,పదాల వెనక భావం అనంతం.
“ నీ స్వరం విన్నప్పుడల్లా
వాడి నోట్లో లాలాజల సునామీలు…..”
“వాడి చిరునవ్వులోతుల్లో
కపట నీతుల కాల బిలాల లోతులున్నాయి “
“వెలుగు లాటి చీకటిలో
వస్త్ర సన్యాస విన్యాసం “
ఒక జుగుప్సాకర భీకర దృశ్యాన్ని ఇంత అందమైన కవితగా మలచడం ఒక మల్లిక్ కే సాధ్యం.
మరో కవితలో అమ్మగా మారి
“ పొగిలిపొగిలి రోదిస్తున్న
పుడమి తల్లిని ఓ సారి ఒళ్లోకి తీసుకుని
స్తన్యమిచ్చి ఓదార్చాలని ఉ౦ది” అంటాడు.
“ ఒక అమానుష పరిష్వంగం “ కవిత నేటి సమాజ అభద్రతను ఆడపిల్లల దైన్య స్థితిని ఎంత అద్భుత శైలిలో మనసు పి౦డేసేలా రాసాడో చూడండి.
“ ఆ రోజు కూడా సూర్యుడు అస్తమించి
చేతులు దులుపు కుంటాడు
ఆయనకు తెలుసు
ఒక జీవితం
వెలుగులోంచి తిమిరం లోకి వెళ్తుందని “
ఇక్కడి వ్యంగ్యం చేరవలసిన వాళ్ళను చేరితే బాగుండు కదా.
“వేట కొరకై రాటుదేల్తాయి
జ్వలిస్తున్న వాంఛలన్నీ
…ఒక వీణియ తీవెల్ని
అమానవీయంగా తె౦చే౦దుకు
రంగం సిద్ధమవుతు౦ది…దానవుల దమన కా౦డ.”

గరళం కవిత సమగ్రంగా అర్ధం చేసుకుంటే జాతిపిత జన్మించిన రోజుకూడా గరళంగా మారుస్తున్న చరిత్ర ప్రతిపుటలో ప్రతిధ్వనిస్తూ ఈ కవితా సంపుటికి ఇది తగిన పేరని అనిపించక మానదు. వస్తు వైవిధ్యం గురించి చెప్పాలంటే ఎల్లలు లేకుండా వ్యక్తీ నుండి ,సమాజం నుండి రాష్ట్రం , దేశం , చివరికి పరదేశీ’ యాత్రికుడి వరకూ సాగింది. ధ్యానం, మలి సంధ్య పాడిన తొలి వేకువ పాట, విశ్వనరుడి స్వప్నం. , చార్మినార్ సాక్షిగా …కిరణజన్య సంయోగ క్రియ, పుత్ర హరిత రాగం ఇలా కొనసాగుతాయి
చెప్తూ పొతే ప్రతి కవితా ఒక కళాఖండం, ఒక సంవేదన. ఒక స్పందించే హృదయం. అంతకన్నా ఉత్తమం ప్రతి కవితా చదివి ఆస్వాదించడం.
( గరళం కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా)