కవిత్వం

అ’సంతోష’ం

జనవరి 2013

తోటమాలి చేసిన ద్రోహానికి
చెట్టుమీది
కాయల అలక
మాగి మాధుర్యాన్ని నింపుకోవాల్సిన
పచ్చికాయలు
కచ్చగానే రాలిపోవడం

రేపటి విజన్‌ లేని
రెండు కాళ్ల సిద్ధాంత కబోది యాత్రికుడొకడు
సిగ్గువిడిచి విసురుతున్న చంద్రనిప్పులు
నా పల్లె గుడిసెల ఆశల్ని కాల్చి మసిచేస్తున్నప్పుడు
చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పలేక
‘చస్తున్నాం మీకోసం’

అలీబాబా
ఆరుగురు దొంగల
అవినీతి క్విడ్‌ప్రో కో యజ్ఞంలో
అమాయకులు నెయ్యిగా మండుతున్నప్పుడు
నడుస్తున్న ఓదార్పులేని రథచక్రాల కింద
ప్రజాస్వామ్య నేతిబీరకాయ పటాల్న పగిలినప్పుడు
చెట్టు వంగి
వేళ్ళను నరుక్కోవడం

‘చచ్చేది మేమే చంపేది మేమే’
జీవచ్ఛవాల అచేతనలో
డిసెంబర్‌ 9 రోడ్డు రోలర్‌
అనేక సంవత్సరాల మైలురాళ్ళు దాటినా
ఆప్షన్‌ ఆరునుంచి అంగుళమైనా కదలక
ఛాప్టర్‌ యైట్‌ బుల్లెట్‌ గాయం సలుపుతున్నప్పుడు
ధైర్యం జారి కాళ్ళమీద పడి
జీవనరేఖ సముద్రపు ఇసుకతిన్నెల మీద రాతైనప్పుడు
కట్టతెంపి
ప్రాణధారను పారబోసుకోవడం
వుట్టి అసంతోషమే కాదు
ఎప్పటికీ ఒడవని దు:ఖం కూడా.

(ఇటీవల తెలంగాణరాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్‌ కాలేజి ముందు
ఉరి వేసుకొని మరణించిన ‘ సంతోష్‌’ యాదిలో)