కడిమిచెట్టు

స్వప్నప్రపంచాల సౌందర్య దీపం- రవీంద్రుల ‘చిత్ర’

అక్టోబర్ 2014

 

” పూర్ణా నదీ తీరంలో ఆ  సాంద్రమైన అరణ్యం. పరుగెత్తే జింక కోసం-  లోలోపలికి , మెలికలు తిరిగే కాలి బాట వెంట నేను . నా మృగయా వినోదం మృగం  ఆ పొద కిందన  ముగిసింది.  ఎండుటాకుల పైన శయనించి అతను అక్కడ. అడ్డు తప్పుకొమ్మన్నాను,  లక్ష్యపెడితేనా !  నా వింటి అంచుతో పొడిచాను చిరాకుగా. నివురు నుంచి భగ్గుమన్న జ్వాల లాగా అతను దిగ్గున లేచాడు…నా పురుష వేషాన్ని చూసో ఏమో, వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. అప్పుడు, ఆ ముహూర్తం లో- నేను స్త్రీనని నాకు తెలిసింది. ” -

ఆమె మణిపుర రాజకుమారి. అతను అర్జునుడు. మహాభారతంలో నలుపు తెలుపు రేఖాచిత్రం వలె కనబడే చిత్రాంగదకు రవీంద్రులు అద్దిన వర్ణవైచిత్రి –  ’ చిత్ర ‘   లో వాక్యాలు అవి.

రవీంద్రులు స్వయంగా గొప్ప సుకృతసౌందర్యం తో జన్మించారు. సౌందర్యాన్ని వెతికి, సాధించి, సృష్టి చేసి ,  అమర్చి -  రచించి, చిత్రించి, వినిపించి, ప్రదర్శించి లీనమైన  హేల- ఆ జీవనం.

తమ ముప్ఫై ఒక్కేళ్ళ వయసులో రవీంద్రులు రచించిన చిన్న నాటిక చిత్ర.   ఆ మహాకవి యౌవనపు ప్రౌఢిమ – అందులోని పిపాసా తీవ్రత  , త్రిదశులైన  అమరుల వలె  అక్కడే నిలిచి ఉండాలనిపించే ఆశ  , వీలు కాదని తెలిసిపోయే  అభద్రత , ఏది ఎప్పటికీ నిలవగలదో దాన్ని అన్వేషించే  ప్రయత్నం-ఇవన్నీ అయాక తేరిన జ్ఞానం,  కాంతి   …వీటన్నింటినీ ఆ కొద్ది పుటలలో శాశ్వతం చేసిన రచన. మరొక వైపునుంచి స్త్రీ లో పురుషుడు కోరుకోవలసినవి ఏవో, జీవితాంతం కలిసి నడిచే శక్తి ఉన్న స్త్రీ ఏ విధంగా అద్భుతమో అర్థం చేయిస్తుంది. ఆ విధంగా అది  సాధికార అయిన స్త్రీని రంగస్థలం మీదికి తెచ్చిన రచన. ఈ నాటికను  1892 లో రాశారు. ఈ రోజుకీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట  ప్రదర్శించబడుతూనే ఉంది .

ఈ నాటిక  పరమ రమణీయమైన దీర్ఘ కవిత. ఉపమానాలు కవికులగురువును జ్ఞాపకం చేస్తాయి.

ఈ నాటిక తార్కికమైన తిరుగుబాటు. ఆ శతాబ్దం లో స్త్రీ వైపునుంచి అంత వాదన, అన్ని ప్రశ్నలు ఊహించటం చాలా కొత్త  సంగతి. అనూచానం గా వస్తున్న ఆడవారి బాధ్యతలను , ప్రవర్తనను , నియమాలను – అన్నిటినీ ఆయన తరచి చూశారు  .

ఈ నాటిక  విచిత్రమైన ప్రణయగాథ.  అతిగాఢమైన  అనురాగం, అనురక్తి – చిత్ర.  ఆమె ప్రేమ తీవ్రతకి ప్రేమికుడిలోని ఔన్నత్యమూ స్పందించి ఎదుగుతుంది. ఆ అపురూపమైన అందం కోస మే మొదట  చేరువ అయినా,  ఆవరించిన దేనినో కాక అచ్చంగా ఆమెనే అతను గుండెకి అద్దుకుటాడు- ఆఖరికి.

పూర్తి సమానత్వాన్ని రవీంద్రులు ప్రతిపాదించారని చెప్పలేము. చిత్ర లో భర్త ను దైవంగా పూజించే నారీత్వం ఉంది, అయితే  ఆ వెనక ఉచితమైన ఆత్మప్రత్యయమూ ఉంది.

తన తక్కిన  నాటికల , నాటకాల లాగే దీనినీ భారతీయ నాట్యశాస్త్రం ఆధారంగానే రవీంద్రులు నిర్మించారు. పాత్రధారులనూ ప్రేక్షకులనూ ఒకటి చేసి ప్రవహించగలిగేది రసం అని ఆయన పాశ్చాత్యులకి చెప్పారు. ” రచన ముందు, నటన ఆ తర్వాత ” అని కూడా.

కొడుకులు లేని తండ్రి ఆమెను యుద్ధవిద్యలు నేర్పుతూ పెంచాడు . వాటిలో పారం ముట్టిన ఆమె మహావీరుడని  చెప్పుకునే అర్జునుడిని ఒకసారైనా సాయుధురాలై ఎదిరించాలని కలలు కనేది. తీరా అతన్ని చూశాక అవేవీ గుర్తు రాలేదు- అతనని తెలిశాక ఒక్క మాటైనా ఆమె నోటి వెంట రాలేదు. మర్యాద చేయాలనీ  , క్షమాపణ అడగాలనీ తట్టలేదు. నాగరికత ఎరగని దాని వలె స్థాణువై ఉండిపోయింది. అతను నిష్క్రమించాడు.

ఆ మరుసటి రోజు తన పాత వేషాన్ని వదిలింది. కుంకుమ రంగు పట్టు వస్త్రాలలో, అందెలతో, గాజులతో, వడ్డాణంతో – తనని బంధించుకుని అలంకృతయై – లజ్జను వెనకకు నెట్టి అతని కోసం వెళ్ళింది. తానేమని అడిగిందో తనకే తెలియదు- అతను అన్నది మాత్రం వీలు పడదనే. అప్పుడు పిడుగు లాగా మీద పడింది లజ్జ, అవమానం తోడుగా. ఆమె బలిష్ఠ , పగలలేదు. కాని తన ధనుస్సును కచ్చగా  విరిచి తగలబెట్టింది. బాణాలు వేసి కాయలు కాసిన తన దృఢమైన చేతులను ద్వేషించుకుంది. అతన్ని ఆకర్షించగలిగే ఒక్క లక్షణం కోసం తపించింది. ఎందుకంటే ఆమె సౌందర్యవతి కాదు.

మన్మథుని కరుణ కోసం ఆమె వ్రతం పూని ప్రార్థిస్తుంది. నిత్య యౌవనానికి ఆకృతి అయిన వసంతుడి తో కలిసి మన్మథుడు దర్శనమిస్తాడు.

” మనసులను గెలిచే వగలూ హొయలూ నాకు తెలియవు. అస్త్రవిద్య లో నా హస్తాలకి నైపుణ్యం ఉందే కాని పూలబాణాలు కంటి తుదలనుంచి వేయటమెలాగో నేర్వలేదు ” – ఆమె ఆక్రోశిస్తుంది

” ఆ విద్య నేర్చుకోవాలా..మనసులో ఉన్నవాడు[ మనసిజుడు , తనే ]  చూసుకోడూ ” అంటాడు మన్మథుడు. ” ఆ సమయం వస్తే అన్నీ తెలుస్తాయి ”

ఆమె అలా సరిపోదని అంటుంది.  ” సమయం లేదు. ఉంటే కనుక, నిదానంగా ఒక్కొక్క మెట్టుగా అతన్ని నేను గెలుచుకోగలిగి ఉందును, దేవతల సాయం అవసరం లేకపోయేది. . చీకటిలో ఏడుస్తూ పగలు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ , మౌనం గా ఒంటరిగా నిర్వే దాన్ని భరించే అబల ను  కాను . నా కాంక్షాపుష్పాలు  ఫలించకుండా రాలిపోవు.

అతనికి తోడుగా గుర్రాల మీద స్వారీ చేస్తూ – వేట లో, యుద్ధం లో సహకరించి ఉండేదాన్ని. రాత్రులు అతని గుడారానికి కాపలా కాసి ఉండేదాన్ని. బలహీనులను రక్షించటం లో, న్యాయాన్ని నెలకొల్పటం లో అతనితోబాటు క్షత్రియధర్మాన్ని నెరవేర్చేదాన్ని. నన్ను అతను తప్పనిసరిగా గమనించి ప్రేమించేలా చేసిఉండేదాన్ని.

అయితే అదొక జీవితకాలపు శ్రమ- తమ నిజమైన స్వభావానికీ ప్రవర్తనకీ గుర్తించబడటం, గౌరవించబడటం .

అందుకు, కే వలం అందుకు – సమయం లేక, అడుగుతున్నాను. ఒక్క రోజు, ఒకే  ఒక్క రోజు నాకు  అపూర్వ లావణ్యాన్ని  ప్రసాదించండి. నా హృదయం లో వికసించిన ప్రేమ అంత పరిపూర్ణతను నా రూపానికి ఇవ్వండి…చాలు ”

ఒక రోజు మాత్రం కాక ఒక సంవత్సరమంతా ఆమె వసంతపుష్పాలంత అందంగా అయే వరం దొరుకుతుంది.

సరోవరం ఒడ్డున , అడవి మధ్యన సాయంకాలం . నీడలు పొడుగవుతూ ఉన్నాయి. ఆకులు ముడుచుకుంటూ కమ్మిన మసక లోంచి పాలరాతి అరుగు మీద ఆమె అతనికి సౌందర్యాధిదేవత లాగా ప్రత్యక్షమవుతుంది. ఆ  అడుగుల  అడుగున  నేల ఆనందంగా వణికింది.. తూర్పు కొండను కప్పిన మంచు సూర్యకాంతికి కరిగేటట్లు ఆమెని కప్పిన వస్త్రాలు గాలిలోకి కరిగిపోతాయా అనిపించింది.  విచ్చుకుంటూ ఉన్న తెల్ల తామర మొగ్గ  లాగా ఒంగి సరస్సులో తన ప్రతిబిబంబం చూసుకుని తానే మైమరచింది. గొప్ప సంతోషం, ఆ వెంటనే ఏదో తెలియని బాధ ఆ ముఖం లో. ముడి వీడిన జుట్టునూ  పల్చని మేలిముసుగునూ  సవరించుకుంటూ నిట్టూర్చి ఆమె నడిచి వెళ్ళింది- అందమైన సంధ్య  రాత్రిలోకి మాయమైంది .

కాసేపు గడిచాక అతని తలుపు తడుతుంది. ఆ నిర్జనమైన చోట శివాలయం లో తన మనోరథం తీరేందుకు దీక్షలో ఉన్నానని చెబుతుంది.

” విశ్వమంతా కాంక్షించదగినదానివి నువ్వు, నీకు తీరని కాంక్ష ఏమిటది ? తూర్పు నుంచీ పడమర వరకూ ఎంతో తిరిగాను, ప్రశస్తమైన వాటన్నిటినీ చూశాను. ఏమిటి ఆ కోర్కె, నేను దారి చూపగలనేమో ..”

” నేను కోరే వారు అందరికీ తెలిసినవారే. అత్యుత్తమవంశం లో పుట్టిన అసమానశూరుడు ఆయన ” అని సూచించి, మళ్ళీ మళ్ళీ అడిగించుకుని అతని పేరే చెబుతుంది ఆమె.

” అది నేనే.  నీ ముంగిట , నీకోసం  ”

” పన్నెండు సం వత్సరాలు బ్రహ్మచర్యవ్రతం పూనారు కాదా ? ”

” చంద్రోదయం తో రాత్రి అంధకారం మాయమైనట్లు నువ్వు ఆ వ్రతాన్ని మాయం  చే స్తున్నావు ”

చిత్ర -  ” ఏమిటి చూసి నిన్ను నువ్వు మీరుతున్నావు ! ఈ నల్లటి కళ్ళలోనూ తెల్లటి శరీరం లోనూ ఏం కనిపిస్తోంది నీకు ? ఇది అసలైన నేను కాదు. ఒక పురుషుడు స్త్రీకి ఇవ్వగల అత్యున్నతమైన బహూకృతి  ఏదో-  ఆ ప్రేమ- నీ భావన అది కాదు. అయ్యో ! ఈ దుర్బలమైన మారువేషం, ఈ దేహం – ఆ లోపలి అంత కాంతినీ దాచిపెడుతుంది కాబోలు. ఏమి వీరుడివి అర్జునా…అంతా ఒట్టిది ”

అతను-   ” అవును, అంతా ఒట్టిదే, నువ్వు కానిది అంతా స్వప్నమే  ”

అతని సమ్మోహానికి కారణం తను కాదు అన్నది ఆమె భరించలేకఅప్పటికి అతన్ని వదలి వెళ్ళిపోతుంది  -

కాని అతని మీదనే లగ్నమైన మనసు మాట వినదు.  కొద్ది గంటల  తన వైభవం లో   తుమ్మెదల పొగడికలూ   చివురాకుల  గుసగుసలూ విని ,  ఆ పైన ఆకాశం నుంచి  చూపు కిందికి వాల్చి తలవంచి ధూళిలో రాలిపోయే పూవు లాగా-  ఆమె ఆ క్షణం లో జీవించింది. గడిచిన దాన్నంతా గత జన్మలాగా విస్మరించింది. తన సౌందర్యాన్ని అర్జునుడు చేసిన ప్రశంసను ఒక్కొక్క మాటగా,  దాచుకున్న ఒక్కొక్క తేనె చుక్క లాగా , తలచుకుంటూ భూత భవిష్యత్తులు అంటని వర్తమానం గా ఉండిపోయింది…బహుశా  ఇరుకైన పాటలో అంతులేని  లేని అర్థం లాగా కూడా.

ఆమె జుట్టు మీద, వక్షం మీద, పాదాల మీద రాలిన మాలతి పుష్పాలు. సువాసనలతో  మత్తెక్కి భారమైన దక్షిణపుగాలి.  పడమటికి వాలిన చంద్రుడు కొమ్మల మధ్యనుంచి తొంగిచూస్తూ. సరస్సులో చెట్ల నీడలు కదలిక లేకుండా. ఆమె ఎదురుగా అతను , పొడుగ్గా నిటారుగా, తనూ ఒక అరణ్యవృక్షం లాగా . వాస్తవ జీవిత సత్యాలన్నీ అదృశ్యమైన ఆ స్వప్నం లో , ఏదో మరొక లోకం లో ఆమె తిరిగి జన్మించింది . అతనికి చేతులు చాచింది. చంద్రుడు అస్తమించాడు, ఆవరించిన ఒక చీకటి తెర. మనుష్య దివ్య  లోకాలూ , స్థలమూ కాలమూ , ఆనందమూ ఆవేదనా – జీవన్మరణాలు ఏకమైన పారవశ్యం . తర్వాత గులాబి రంగు ఉదయం.  ఆమె మేల్కొంది, జ్ఞాపకం వచ్చింది తనేమిటో. నీడను చూసి జడుసుకున్న లేడిలాగా పరుగు తీసింది- శేఫాలికా పుష్పాలు రాలిపడిన దారివెంట…ఒక ఒంటరి పొదరింట్లో ఆగి ఏడవబోయింది. కన్నీరు రాలేదు.

మన్మథుడు అడుగుతాడు, ఇంకా బాధెందుకని…దేవలోకం నుంచి తెచ్చి నింపిన మధువుతో పొంగిపొరలలేదా ఆ గడిచిన రాత్రి, భూమి మీద ?

ఆమె – ” అరువు తెచ్చుకున్న రూపం అడ్డుపడిపోతూ ఉంది. వర్షించిన లాలస ఏదీ నా వరకూ రానేలేదు …

సంతోషపు ఓడ అలా కనబడుతూనే ఉంది, అందకుండా అలలేవో  ఆపివేస్తూ ఉన్నాయి.

స్వర్గం ఎంత దగ్గరగా వచ్చిందంటే , ఒక్క క్షణం అందిందనే అనుకున్నాను. లేదు, నా ఈ శరీరమే నా ప్రత్యర్థి. దీన్ని నేను నా ప్రియతముడి కోసం సిద్ధం చేసి ఉంచాలా, ఒద్దు. మీ వరాన్ని వెనక్కి తీసేసుకోండి ”

అలా అయితే అతని ముందు ఎలా నిలబడగలవని ప్రశ్న.

” అదే నయం, చాలా. ఈ సొగసైన వేషం  కన్నా ఖచ్చితంగా నేను మెరుగే.  అతను తిరిగి తిరస్కరిస్తే , భరిస్తాను ”

వసంతుడు వారిస్తాడు.”  వసంతం గడిచి శరత్తు వస్తే, పూవు పండు కాబోతూ ఉంటే- అప్పుడు అతను నిజాన్ని భరించగలడు. అందాకా వేచి ఉండు. అమ్మా ! నీ ఉన్మత్తపు ఉత్సవానికి మరలి వెళ్ళు ”

కాలం సాగుతోంది. ఆమె ఎంతో ప్రత్యేకమైనదని అర్జునుడు గుర్తిస్తూ ఉంటాడు.  . సోయగమూ నేర్పూ ఆమె చేసే ప్రతి పనిలోనూ అల్లుకుపోవటాన్ని అతను మెచ్చుకుంటాడు. తనతోబాటు నగరానికి, తన ఇంటికి తీసుకువెళ్ళాలని కలలు కంటాడు. ఆమె కాదంటుంది. అడవి పూవుని ఆ నేల పైనే రాలనివ్వమంటుంది , రాజప్రాసాదపు రాతి గచ్చు కి ఆ కరుణ ఉండదని .

” ఆనందాన్ని తెరచి ఉంచిన తలుపులోంచి తప్పుకోనివ్వు. లేదంటే అది వేదనగా మారిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటే అన్ని నాళ్ళు ఆస్వాదించు. ఈ సాయంత్రపు తృప్తిని రేపు పొద్దున వరకూ లాగకు, అది నిలవదు. అలసిపోయాను, ఇదంతా వదిలేయి ”

అతను ఔననడు, కాదనడు. ఆ నిశ్శబ్దం లో దూరం నుంచీ గుడిగంటలు వినిపిస్తాయి.

వారిద్దరి మధ్యదైహికమైన  ఆకర్షణ చల్లబడుతూ ఉండటాన్ని ప్రతీకాత్మకంగా చెబుతారు కవి…వసంతుడు మన్మథుడితో ఫిర్యాదు గా అనే మాటలలో. ” నువ్వు రగిలించిన జ్వాలని నిలిపి వెలిగించే పనిలో ఓపిక పోతోంది నాకు. నిద్ర కి తూగుతున్నాను, మంట ను బూడిద మూస్తే చలికి ఉలికిపడి లేచి  విసనకర్ర తో విసురుతున్నాను, మళ్ళీ భగ్గుమంటోంది. కాని ఇలా ఎంత కాలమని ? ”

ఏకమైన ఏ జంట మధ్యన అయినా తప్పనిసరిగా వచ్చే ఈ దశను కావాలని వివరించి చెప్పారనిపిస్తుంది… ఆ జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉండటం అసాధ్యమని  . నిలిచి ఉండగల  చల్లదనం వేరు .

మన్మథుడు వసంతుడిని మందలిస్తాడు ” నువ్వు పసిబిడ్డ లాగా చంచలమైనవాడివి. ఏ చిన్న వివరమూ బీరుపోకుండా రోజుల తరబడి కట్టుకొచ్చినదంతా ఒక్కసారిగా కూల్చేస్తావు, పశ్చాత్తాపమైనా లేకుండా. అయినా మన పని అయిపోవచ్చిందిలే.

సౌఖ్యపు రెక్కల దినాలు త్వర త్వర గా ఎగిరిపోతాయి. సం వత్సరం ముగుస్తోంది, పరిపక్వత లోకి, ప్రశాంతి  లోకి. ”

ఒకనాడు అర్జునుడు అనుకుంటాడు ” కలల్లోంచి ఒక ఉదయం ఈ రత్నం దొర్లిపడింది. దీన్ని ఏం చేసుకోవాలో ఎక్కడ దాచుకోవాలో అర్థం అవటం లేదు. విసిరివేసేందుకు మనసు ఒప్పటం లేదు. దీన్నే సోమరిగా  పట్టుకు కూర్చున్న  నా దక్షిణహస్తం క్షత్రియోచితమైన దేన్నీ చేయలేకుండా ఉంది ”  ప్రేమా శృంగారమూ తప్ప మరేమీ లేని  ఈ జీవితం అతనికి  చాలటం లేదు.

అతని అన్యమనస్కత ను ప్రశ్నించిన చిత్రతో  తనకి వేట మీద బుద్ధి పుడుతోందని అంటాడు. పాత రోజులలో తమ అన్నదమ్ములు అయిదుగురూ ఒక వర్షాకాలాన్ని  చిత్రకారణ్యం లో గడిపిన రోజులను  ,  అప్పటి మేఘ నిస్వనాలనూ నెమళ్ళ క్రీంకారాలనూ పారి పోయే లేళ్ళనూ తప్పించుకున్న చిరుత పులులనూ …వేట అయిపోయాక పరవళ్ళు తొక్కే కొండవాగులలో ఈదటాన్నీ …గుర్తు చేసుకుంటాడు.

చిత్ర ” ఆ మాయా మృగాన్ని నువ్వు పట్టుకోగలవా ? ” అని నర్మగర్భంగా అంటుంది.

ఇక్కడ నిజానికి కవి మాట్లాడారు. హృదయం లో గంతులు వేసే వాంఛ లన్నింటినీ- తీర్చుకోవటమూ నియమించటమూ రెండూ కష్టసాధ్యాలే.

వీలైనంత కాలం అతనితో అలా ఉండిపోవాలనే ఆమెకి. ఆ ఏడు గడిచిపోతే మరి తనకి మిగులతాడనే నమ్మిక ఉండదు.

” నీకోసం ఎదురు చూసేవారెవరూ ఇంట్లో లేరా ? ” అని మృదువుగా అడుగుతాడు .

” ఎందుకు ఈ ప్రశ్నలన్నీ ? ఆలోచన అవసరం లేని కాలం గడిచిపోయిందా ? నీకు కనబడుతున్నదాని కంటే నేను వేరే ఏమీ లేనని నీకు తెలియదా ? కింశుక పత్రం మీద కదిలే మంచుబిందువు కి పేరుంటుందా ? గమ్యం ఉంటుందా ? అది ఏ ప్రశ్నకైనా బదులు ఇస్తుందా ? నీ ప్రేయసీఅంతే  ”

అతను – ” అవునా? ఆమెకి ఈ ప్రపంచం తో ఏ ముడులూ లేవా ? ఏ దేవత నిర్లక్ష్యం వలనో జారిపడిన స్వర్గ ఖండమా ఆమె ? ”

” అవును ”

” అందుకే- ఎప్పుడూ నిన్నెక్కడ కోల్పోతానో అనిపిస్తుంటుంది. నా మనసుకి తృప్తి లేదు, బుద్ధికి శాంతి లేదు. ఊరూ పేరూ అమ్మా నాన్నా- ఈ బంధాలకి కట్టుబడరాదా కొంచెం ? నీ అన్ని పార్శ్వాలనూ నన్ను దర్శించనీ ! భద్రతలో, శాంతమైన గృహవాతావరణం లో నీతో కలిసి జీవించనీ ” – అతను.

” ఎందుకు ఈ వృధా ప్రయాస ? మబ్బుల రంగులనీ అలల చిందులనీ పూవుల తావినీ ఒడిసి పట్టగలవా ? దాచేసుకోగలవా ? ” – ఆమె

” కాదు. చేతికి అందేదీ గట్టిగా పట్టుకోగలిగేదీ ఇవ్వు  నాకు. సుఖం కన్న శాశ్వతమైనది, దుఃఖాన్ని తట్టుకోగలిగేదీ – కావాలి నాకు ”  -అతను

” స్వామీ, ఈ ఏడు పూర్తి కానే లేదు ..అప్పుడే మార్పు నీలో ! ఇప్పుడు తెలుస్తోంది నాకు- పూవుల ఆయువు కొద్ది కావటం దేవుడిచ్చిన వరం అని. ఆ వసంతం లోనే ఈ శరీరం రాలిపోయి ఉంటే ఎంత బావుండేది  ! ఇంకెంతో సమయం లేదులే…పూర్తిగా తీసేసుకో. ఆ తర్వాత నువ్వు యాచించినా ఇక్కడ ఏమీ దొరకదు ”

మొండి బాకుతో కుమ్మినట్లు , గుండె నిలువునా చీలినట్లు ఉంటుంది ఈ మాటలు చదువుతుంటే, రాస్తుంటే. మృత్యువు , దాని ముందు వెనుకలు  టాగూర్ రచన లో నిరంతరంగా, నిర్దాక్షిణ్యంగా వెంటాడుతూనే ఉంటాయి.  జీవించటాన్నీ కోల్పోవటాన్నీ ఒకే లయలో ధ్వనింపజేసే ప్రయత్నం ఆయన సాహిత్యం, ఒక విధం గా.  ‘Crossing ‘ పద్యసంపుటి మొత్తం ‘ దాటిపోవటం ‘ గురించే.

ఆమె అందానికి  ఆఖరి రాత్రి అది. ” నీ దేహపు స్నిగ్ధత్వమంతా , రేపు – తరిగిపోని వాసంతలావణ్య నిధులలో జమ అవుతుంది. నీ పెదవి మీది ఎరుపు  అశోకాల చివురాకులకు వెళుతుంది. నీ చర్మపు మెత్తదనం, తెల్లదనం తీసుకుని వంద మల్లెపూలు పుట్టి  పరిమళిస్తాయి. ” అని చెబుతాడు వసంతుడు.

ఆమె ” అయితే, ఆ చివరి ఘడియలో , ఆరిపోబోయే దీపపు వెలుగు లాగా – నా సౌందర్యం ప్రకాశించనీయండి   ” అని అడిగి అవుననిపించుకుంటుంది.

అక్కడికి దగ్గరగా ఉన్న పల్లెటూరు నుంచి కొందరు గ్రామస్థులు అర్జునుడికి ఎదురవుతారు. దోపిడీ దొంగల బెడద ముంచెత్తబోతోందని వాళ్ళు భయపడుతూ ఉంటారు.

” మా రాజకుమారి చిత్ర ఉంటే అంతా ఆవిడే చూసుకునేది,  దుష్టులకి సిం హస్వప్నం. ఆవిడ ఉన్నప్పుడు ఈ రాజ్యమంతా సంతోషమయం. సహజం గా వచ్చే చావు తప్ప మరి ఇంకే భయమూ లేదు.  తీర్థయాత్రకు వెళ్ళింది, ఎప్పుడొస్తుందో తెలియదు  ” అని వాళ్ళు చెబుతారు.

అర్జునుడు ఆశ్చర్యంగా అడుగుతాడు ” మీ రక్షణ ఒక స్త్రీ చేతిలోనా ? ”

” అవును. ఆమె మాకు మొదట తండ్రి, తర్వాత తల్లి కూడా ”

అంత శక్తివంతురాలైన రాజకుమారి  చిత్ర ఎటువంటిదో, ఎలా ఉంటుందో అని అర్జునుడు ఆలోచిస్తూ ఉంటాడు.

దగ్గరికి వచ్చిన చిత్రతో అదే అంటాడు.

చిత్ర – ” ఆమె అందమైనది కాదు. నా కన్నులంత  చక్కనివి కావు ఆమెవి . ఏ లక్ష్యాన్నయినా భేదించగలదు, అయితేనేం? ఈ నాయకుడి హృదయాన్ని తాకలేదు ”

” పరాక్రమం పురుషుడి వంతు, మార్దవం స్త్రీ వంతు కదా ? ”

” అదే గొప్ప దురదృష్టం ఆమెకి. స్త్రీ కేవలం స్త్రీ గా ఉంటే- తన నవ్వులతో అలకలతో సేవలతో లాలనతో, పురుషుల హృదయాలను లతలాగా అల్లుకుంటే- ఆమె సంతోషంగా ఉండగలదు. ఏం నేర్చితేనేం, ఏం సాధిస్తేనేం ? అంతెందుకు- ఈ శివాలయం దగ్గరి అడవిదారిలో నిన్న నువ్వు ఆమె నీకు తారసపడి ఉంటే , ఆ వైపైనా చూడకుండా వెళ్ళిపోయిఉందువు. కాదా ? స్త్రీ సౌందర్యం కొంత విసుగు పుట్టినట్లుంది కనుక ఆమెలో పౌరుషాన్నీ వీరత్వాన్నీ చూడగలవా ? ” నిలదీస్తుంది చిత్ర.

”  సరే, దానికేమి…ఈ జలపాతం పక్కన , ఆ తుంపరలతో తడిసిన ఆకులతో, రాత్రి లాగా చీకటైన కొండ గుహలో – చల్లని శయ్య…” – ఆహ్వానిస్తుంది.

” ఊహూ. ఇవాళ కాదు ”

‘ ఎందుకు ?”

” బందిపోటులెవరో మీదపడబోతున్నారట. ఆ ప్రజలని వెళ్ళి రక్షిస్తాను ”

” ఏమీ భయం లేదు. చిత్ర తీర్థయాత్రకు వెళ్ళే ముందు సరిహద్దులన్నీ పటిష్ఠం  చేసి ఉంచింది ”

” క్షత్రియునికి తగినదానికి నువ్వు నన్ను అనుమతించవా ? ఏ పనీ లేకుండా పడి ఉంది…నా కుడిచేయి ఆ పనిని సాధిస్తే నీకు ఇంకా మంచి తలగడ అవుతుంది కదా ! ”

” సరే, వెళ్ళు.  నా చేతులలో బంధించినా దురుసుగా విడిపించుకుంటావో ఏమో ! గుర్తుంచుకో…తెగిన లత మరి అతకదు. సౌఖ్యానికి అధిదేవత ఎవరికోసమూ ఆగదు. చెప్పు, ఎవరు నీ మనసులో ఉన్నది ? చిత్ర ? ”

” అవును. ఆమెకి ఏమి లోటని తీర్థయాత్రకు వెళ్ళిందో ?”

” ఏమి  లోటా ? ఆమెకి ఏముందని ? ఆమె యోగ్యతలే తనకి చెరసాలలు. ఆమెకి ఆకర్షణ లేదు, ఆశలు తీరవు. ఏ దుస్తులు వేసుకున్నా ఒకటే, అందం ఆమెకి శత్రువు. రాళ్ళూ రప్పలూ నిండిన, చెట్టూచేమా లేని కొండ కొమ్ము మీద – వెలుగు లేని పగలు ఆ బ్రతుకు  . ఆమె గురించి అడగకు, నీ చెవికి ఇంపుగా  ఉండదు ”

”  తెలుసుకోవాలని ఉంది. అర్థరాత్రి వేళ అపరిచితమైన నగరానికి చేరిన యాత్రికుడిలా ఉంది నాకు. గోపురాలూ భవంతులూ తోటలలో వృక్షాలూ…అన్నీ మసక మసకగా ఉన్నాయి. సగం నిద్ర లో ఉన్న సముద్రపు హోరు లీలగా వినిపిస్తోంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ వింతలన్నీ స్పష్టమవుతాయా అని ఎదురు చూస్తున్నాను. చెప్పు, ఆమె గురించి ”

” ఏముంది చెప్పేందుకు ?”

” నా మనసులో ఆమె తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తూ, ధనుర్బాణాలు ధరించి,  ధైర్యం పుట్టించగల విజయలక్ష్మి లాగా కనిపిస్తోంది. తన కూనలను కంటికి రెప్పలా కాచుకునే తల్లి సిం హంలా కనిపిస్తోంది. ఆభరణాలు ధరించినా,  స్త్రీ బాహువుల కు సంకెళ్ళు అవసరం లేదు, ఆ చేతుల శౌర్యమూ  సౌందర్యమే.

సుదీర్ఘమైన శీతాకాలపు నిద్ర నుంచి లేచిన సర్పానికి  లాగా నాకు కుదురు లేకుండా ఉంది . పద, ఇద్దరమూ గుర్రాలెక్కి వెళదాము… జంట కాంతి కిరణాల మై !   ఈ అనురాగపు మగత నుంచి, ఈ ఆకుపచ్చని దిగులు నుంచి, ఈ  సుగంధపు మాదకత నుంచి, వెళదాం రా, ఊపిరి ఆడటం లేదు ! ”

” అర్జునా, నిజం చెప్పు. నువ్వు మోహించే ఈ లావణ్యాన్ని  ఏదో ఇంద్రజాలం వల్ల  వదిలాననుకో ….  బయటి ప్రపంచపు  మొరటైన స్పర్శ నుంచి , అది ఇవ్వగల ఆరోగ్యం నుంచి – దాక్కునే ఈ పిరికితనాన్నీ  నాజూకునీ దూరంగా పొమ్మన్నాననుకో , భరించగలవా ? ఈ స్త్రీ సహజమనే బలహీనతలను వీడి నిటారైన వెన్నెముకతో ఉన్నాననుకో  …నీడలో పాకే లతలాగా కాక సూర్యరశ్మికి తలేత్తి నిలుచునే దేవదారు వృక్షంలా అయాననుకో, నేను అప్పుడు నీ కళ్ళకి నచ్చుతానా ? లేదు, సాధ్యం కాదు. నా చుట్టూ ఆటబొమ్మలవంటి వస్తువులని పరచుకుని నీ కోసం ఓర్పుగా ఎదురు చూడాలి,  నీకిష్టమై వచ్చినప్పుడు నా సుందరశరీరంతో నీకు  ఆహ్లాదాన్ని ఇవ్వాలి, అంతే కదా ? నీకు చాలు అనిపించినప్పుడు నువ్వు వినోదానికో వ్యాసంగానికో వెళతావు. నాకు ఇచ్చిన కొద్ది చోటు లో నేను మురిసిపోతూ సర్దుకుని వృద్ధా ప్యాన్ని ఆహ్వానించాలి. నీ సఖి – రాత్రి వేళ క్రీడతో తృప్తి పడక పగలూ నీ పక్కనే ఉంటానంటే నీకు రుచిస్తుందా ? బలిష్టమైన కుడి చేయి చేయగల పనిని ఎడమచేయి చేస్తానంటే ఒప్పుకోగలవా ?”

అర్జునుడు ” నువ్వు నాకెప్పుడూ పూర్తిగా అర్థం కాలేదు. స్వర్ణ విగ్రహం లో దాగి ఉన్న దేవీ మూర్తి లాగా స్ఫురిస్తావు. నిన్ను నిజంగా నేను స్పృశించలేదు, నువ్వు ఇచ్చినదానికి బదులు తీర్చానని చెప్పలేను…నా ప్రేమ అసంపూర్ణం. ఒక్కొక్కసారి నీ చూపులో, తీరులో ఏదో అంతుపట్టని లోతు , నీ మాటలను నువ్వే వెక్కిరిస్తున్నావా అనిపిస్తుంది. ఈ ఆవిరయే నవ్వులలోంచి, ఈ బద్ధకపు కదలికలలోంచి…ఇవేవీ కాని ఒక తీక్షణమైన  అస్తిత్వం  అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటుంది.

సత్యానికి తొలి రూపం భ్రాంతి.

ఆమె తన ప్రేమికుడిని మారు వేషం లో చేరింది. ఎప్పటికో ఒక నాటికి ఆ అలంకారాలూ ఆచ్ఛాదనలూ తొలగించుకుని తన సహజ గాంభీర్యం తో కనిపిస్తుందని చూస్తున్నాను… ఆ అసలైన నీ కోసం, సరళమైన నిజం కోసం ! ఎందుకుఏడుస్తున్నావు ? ముఖాన్ని కప్పుకుంటావెందుకు? నేను అన్నదాన్ని మరచిపో, పర్వాలేదు. ఈ నువ్వే నాకు చాలు.

ప్రతి సౌందర్య భరితమైన క్షణాన్నీ ఒక  సంగీతపు రహస్యాన్ని ఎక్కడనుంచో మోసుకు వచ్చే పక్షి లాగా….కదలనీ . నిజం వద్దులే, దాని ఒడ్డున గడిపేస్తాను జీవితమంతా ! ”

చిత్ర – ” నా మధుపాత్ర ఖాళీ అయిందా ? ఇదే అంతమా ? లేదు, అంతా జరిగాక కూడా ఏదో మిగిలే ఉంటుంది , దాన్ని నీ పాదాల దగ్గర అర్పిస్తాను.

స్వర్గ లోకపు ఉద్యానం నుంచి , నిన్ను పూజించేందుకని, సాటిలేని సౌందర్యపుష్పాలను తెచ్చాను. అర్చన ముగిస్తే, పూవులు వాడితే- వాటిని  అవతల పారవేస్తాను ”

తన నిజమైన రూపం లో కనబడి-  ” ఇదిగో, చూడు, నీ పూజారిణిని. దయ ఉందా ? ? ?

నేను ఏరితెచ్చిన పూవులంత అందం లేదు నాకు , లోపాలున్నాయి, మచ్చలున్నాయి. ప్రపంచం లో ప్రయాణించేదాన్ని నేను-ఊరికే కూర్చోగలదాన్ని కాను.  నా దుస్తులు మాస్తాయి, నా పాదాలు ముళ్ళు గుచ్చుకుని రక్తం చిమ్ముతాయి. క్షణభంగురమైన పుష్పాల లాగా నేనెలా ఉంటాను ? నా స్త్రీ హృదయాన్ని సగర్వంగా నీకు సమర్పిస్తున్నాను. ఇందులో బాధా సంతోషమూ , ఆశలూ భయాలూ అవమానాలూ- అన్నీ, అన్నీ  ఉన్నాయి. మట్టిలో పుట్టినదాని ప్రేమ ఇది, కాని మట్టిలో కలిసిపోయేది కాదు .  ఇక్కడ సంపూర్ణ సౌష్ఠవం లేదు, కానీ ఉదాత్తత ఉంది, ఘనత ఉంది. పూలతో పూజ  అయిపోతే, పూజ చేసిన నన్నే తీసుకో !

నేనే చిత్రని, రాజకుమారిని. ఒకనాడు ఒక స్త్రీ , అలంకరించుకుని వచ్చి -నీ దగ్గర సిగ్గు విడిచి ప్రేమభిక్ష అడిగింది. నువ్వు నిరాకరించావు. ఆమె నేనే…అదొక మారు వేషం.  దేవతల వరం తో ఒక ఏడాది పాటు నిన్ను మెప్పించగల సౌందర్యాన్ని తెచ్చుకున్నాను. నా మోసం తో నీ మనసుని బరువు చేశాను.  ఇప్పుడు నేను ఆమెను కాను, ఖచ్చితంగా.

నేను చిత్రని. పూజించవలసిన దేవతను కాను, నిర్లక్ష్యంగా తోసేయవలసినదాన్నీ కాను. నువ్వు నడిచే దారిలో నీ సాహసం లో ప్రమాదాలలో నన్ను పక్కన ఉండనిస్తే, నీ బాధ్యతలను పంచి ఇస్తే- అప్పుడు నిజంగా నేనెవరో నీకు అర్థమవుతుంది. మన బిడ్డ ను పెంచి మరొక అర్జునుడుగా పెద్ద చేసి తరుణం వచ్చినప్పుడు నీ దగ్గరికి పంపుతాను…అప్పుడు, చివరిగా నేనేమిటో నీకు పూర్తిగా తెలుస్తుంది.

ఇప్పటికి మాత్రం నేను చిత్రని, ఒక రాజకుమారిని, అంతే.”

అర్జునుడు – “ప్రియా ! నా జీవితం నిండిపోయింది”

Let thy eyes rest upon my eyes for

a while.
Let me take to my work the assurance

of thy comradeship, my friend.
Fill my mind with thy music to last

through the desert of noise !
Let thy Love’s sunshine kiss the peaks

of my thoughts and linger in

my life’s valley where the harvest

ripens. [Crossing ]