అనువాద నవల

రాజ్ఞి- చివరి [ పదిహేడవ ] భాగం

జనవరి 2017

వెనక్కి ప్రయాణించేప్పుడు అన్ని గుహలని దాటటమూ సులువు గానే జరిగింది గాని బోర్లించిన గరాటు లాగా ఉన్న దానిలో – పైకి ఎక్కటం దాదాపు అసాధ్యమైంది. సహజం గానే ఆ వాలు వెంట దిగటం కన్నా ఎక్కటం చాలా కష్టం కదా. పైగా మేమున్న స్థితిలో దారీ సరిగ్గా గుర్తు లేకపోయింది. వచ్చేప్పుడు ఆ రాళ్ళూ రప్పలకి ఏవో బండ గుర్తులు పెట్టుకున్నాను గనుక మెల్లిగా గుర్తు చేసుకున్నాను. లేదంటే ఆ అగ్నిపర్వతగర్భం లో దిక్కు తోచక తిరిగి తిరిగి నిస్పృహ తో చచ్చిపోయి ఉండేవారం. అప్పటికీ చాలాసార్లు దారి తప్పాము , ఒకసారైతే పెద్ద నెరియ లోంచి పడిపోబోయాము కూడా. ఆ చిమ్మ చీకట్లో, ఘోరమైన నిశ్శబ్దం లో మా గుడ్డి లాంతరుల తో దారి వెతకటం …ఒక్క మాట కూడా మేము మాట్లాడుకోలేదు. గుండెల నిండా మోయలేనంత బరువు. కొన్నిసార్లు జారిపడ్డాము, ఒళ్ళు చీరుకుపోయేలాగా. మేమెంత లోజెడి ఉన్నామంటే మేమేమవుతామా అన్న ఆదుర్దా అసలు లేదు. ఏదో మానవ సహజం గా బయటపడదామని ప్రయత్నించాం , యాంత్రికం గా. నాలుగైదు గంటలు గడిచాయేమో – కాలం లెక్క తెలిసిందా ఏమన్నానా ! చివరి రెండు గంటల్లోఅయితే అక్కడక్కడే తిరుగుతున్నాము, ఏ మాత్రమూ ముందుకు వెళ్ళలేదు . ఆ విషయం లోపలికి ఇంకి పూర్తి నిర్వేదం లోకి జారుతుండగా అప్పుడు అతి సన్నని వెలుగు చార మెరిసి మాయమైంది. దారి తెలిసింది. ఇక త్వర గానే మెట్లెక్కి , ఆయేషా చెప్పిన యోగి ఉండిన గుహ కి చేరుకున్నాము. ఆశ పుట్టింది.

అటునుంచి అవతలికి అగడ్త ని దాటాలి. మేము వచ్చేప్పుడు ఉపయోగించిన చెక్క పలక ని దాటుతూ జాబ్ విరగ్గొట్టేశాడని ఉన్నట్లుండి గుర్తొచ్చి వణుకు పుట్టింది. ఏం చేయాలి ? ఏమీ లేదు చేసేందుకు – ఆ వైపుకి లంఘించటం తప్ప. ఆ దూరం మరీ ఎక్కువేమీ కాదు – పది పన్నెండు అడుగులుంటుందంతే. అదివరకు లియో ఇరవై అడుగులకి పైనే సునాయాసం గా దూకేవాడు. కాని అప్పుడు – తిండీ నిద్రా లేని భీకరమైన అలసట , తీవ్రమైన విషాదం …అతనికే ఓపిక ఉండదు , ఇక వయసు మళ్ళుతూన్న నా సంగతి చెప్పాలా ! అదొకటే మార్గమని లియో తో అంటే అతను దాన్ని నిర్లిప్తం గా తీసుకున్నాడు. ప్రయత్నించకపోతే ఎలాగూ అక్కడ ఆకలి దప్పులతో తీసుకు తీసుకు చావవలసిందే- అంతకన్న ఆ అగాధం లోకి పడి ఒక్కసారే చావటం మేలు. అయితే ఒకటి – ఆ చీకట్లో మాత్రం ఆ పని చేయకూడదు. వెలుగు ఎప్పుడొస్తుందో, ఎంతసేపుంటుందో తెలియదు – అయినా వేచి చూసేందుకే నిశ్చయించుకున్నాము.

మా లాంతరులు వెలుగుతున్నప్పుడే దూకి వెళ్ళాల్సిన చోటికి దగ్గరగా వెళ్ళాలనుకుని, గుహ బయటికి వస్తూండగా మా దీపాలు ఆరిపోయాయి. పూర్తి గాఢాంధకారం ఆవరించింది. అడుగున నేల తగులుతూందో లేదో అంగుళమంగుళమూ చూసుకుంటూ ఒక చోట కూలబడ్డాము. మేము కూర్చున్న రాయి రెప రెపా ఊగిపోతోంది. ఏమీ కనబడదు- అతి భయంకరమైన గాలి విసురు, వికృతమైన దాని రోదనా ధ్వనులు. నరమానవుడెవడూ మెలకువ లో కాదుగదా పీడకలలో కూడా మేముండిన స్థితిని అనుభవించి ఉండడు. ఎంత కల్పనా చాతుర్యమున్న రచయిత కూడా కథగా ఊహించి ఉండడు. అవి నిమిషాలో గంటలో రోజులో తెలియదు – ఉన్నాం అలాగే. అదృష్టవశాత్తూ ఎక్కువ చలిగా లేదు. అదివరకు ఆయేషా అక్కడ నిలుచునప్పుడు ఆ హోరుగాలికి ఆమె నిలువునా కప్పుకుని ఉన్న పచ్చడం జారి కొట్టుకుపోయింది కదా – ఎటు ఎగిరి వెళ్ళి ఉందో , ఆ వేళ వచ్చి లియో పైకి వాలి అతన్ని ఆపాద మస్తకమూ కప్పివేసింది. ముందు అది ఏమిటో మాకు అర్థం కాలేదు – బోధపడేప్పటికి లియో ఇక తట్టుకోలేకపోయాడు. అతను గుండెలవిసేలా ఏడ్చాడు. ఏ మొనదేరిన రాతి మీదనో అది చిక్కుకుపోయి ఉండి మళ్ళీ గాలి విసురుకి విడివడి ఉండచ్చు , కాదనను. కాని అది అప్పుడే ఎందుకు జరగాలి ? నేనూ ఏడ్చాను.

కాసేపట్లోనే అక్కడికి వెలుగు రాబోయే సూచనలు కనిపించాయి. అది మాయమయేలోపునే మా ప్రయత్నం చేసి తీరాలి. ఎర్రటి రక్తపు రంగులో పరిసరాలన్నీ నిండాయి , మా దిగువన ఉన్న అంతులేని అగాధాలతో సహా. ఆ అగడ్త లో సగం మేరకి పొడుగాటి రాయి వేలాడుతోంది.

” ఎవరం ముందు ? ” – అడిగాను.

” నువే. నేను ఈ వైపునుంచి రాతిని నిలిపి ఉంచుతాను. బలమంతా ఉపయోగించి దూకు – ఆ పైన దేవుడున్నాడు ” – లియో.

నెమ్మదిగా తలాడించాను. లియో కి ఏడెనిమిదేళ్ళొచ్చినప్పటినుంచీ నేను చేయని పని – గట్టి గా కౌగలించుకుని నుదుట ముద్దు పెట్టుకున్నాను. అలా ఫ్రెంచ్ వాళ్ళే చేస్తారనీ పద్ధతిగల ఇంగ్లీష్ పెద్దమనిషెవడూ చేయడనీ నాకు తెలుసు – కాని అది తుది వీడుకోలు, నా సొంతబిడ్డ కన్నా రెట్టింపు ఎక్కువగా ప్రేమించిన మనిషి నుంచి.

” వెళ్ళొస్తాను. త్వరలో కలుసుకుందాం , అది ఎక్కడైనా కానీయి ”

మరొక రెండు నిమిషాల తర్వాత జీవించి ఉండనని నా పూర్తి విశ్వాసం.

ఆ వేలాడే రాతి మీద బాగా వెనక్కి నడిచి ముందుకు దూకాను. అర్థమైంది, నా ఊపు చాలలేదని. కాళ్ళు గాల్లోనే ఉన్నాయి, కాని చేతులకి రాయి తగిలింది. దాన్ని గట్టి గా పట్టుకునేలోఉనే ఒక చేయి పట్టు తప్పింది. అవతలి వైపు కి అడుగున వేలాడుతున్నానని తెలిసింది , అలా ఎంతోసేపు ఉండలేని కూడా. పైకి లాగేందుకు ఎవరూ లేరు.
నా వెనక నుంచి లియో గట్టి గా కేక పెట్టటం వినబడింది. రెప్పపాటులో అంతదూరమూ దూకి వచ్చేసి పడ్డాడు. ఆ ఉదుటుకి రాతినేల కంపించిపోయింది, కొంత మేర కూలిపోయింది. ఇదంతా ఒక్క క్షణం లో జరిగిపోయింది. మరుక్షణం లో లియో నా మణికట్టు ని రెండు చేతులతో పట్టుకున్నాడు. నేను నా పట్టు వదిలి అతని చేతులని తేలిగ్గా అందుకోవాలి, లేకపోతే అతను పడిపోతాడు. చాలా బలమైన మనిషి అని నాకు తెలుసు , కాని ఈ ముసలివాడికోసం అతని ప్రాణాన్ని ఎందుకు ఒడ్డాలనిపించింది … అతను నన్ను వదల్లేదు. అతి కష్టం మీద , బహుశా ఒకటి రెండు నిమిషాల వ్యవధి లో పైకి ఎక్కాను. సరిగ్గా అప్పుడే వెలుతురు పోయింది.

అరగంటకి పైగా అక్కడ పడి ఉండిపోయాం. వెళ్ళాలి, మేము దాటి వచ్చిన సొరంగం లోకి. లాంతర్లు ఎప్పుడో పడిపోయాయి , ఉన్నా లాభం లేదు – నూనె పూర్తిగా అయిపోయింది . గొంతులు ఎండిపోతున్నాయి- చుక్క నీరు కూడా లేదు, దొరకదు. అయినా – ఇంకా ఆలస్యం చేస్తే ఆ కాస్త శక్తి కూడా ఉండదని తోచింది. పడుతూ లేస్తూ సొరంగపు ముఖద్వారాన్ని దాటి వెళ్ళాము.

ఆ నికృష్టపు సొరంగం లో , చేతులు పట్టుకుని, గోడలు తడుముకుంటూ నడిచాము. అడుగునంతా సూది గా ఉన్న రాళ్ళు – చిన్నవీ పెద్దవీ. ఎన్ని గాయాలయినాయో లెక్కలేదు. మరీ అలిసిపోతే కాసేపు ఆగి మళ్ళీ మొదలు. ఒక చోట అలాగే పడి నిద్ర పోయాము కూడా – కొన్ని గంటల సేపు. శరీరాలని ఈడ్చుకుంటూ కొన్నిసార్లు దేక్కుంటూ …ఆఖరికి, సూర్యకాంతి వంటిది కళ్ళబడింది.

మొహాలకి చల్లగాలి హాయిగా తగిలింది. అప్పుడే తెల్లవారబోతున్నట్లుంది. బతికి ఉండగా ఏనాడూ చూడలేమనుకున్న ఆకాశం కనిపిస్తోంది. ఆగిపోయి పడుకుండిపోవాలనిపించింది. కాని ఇంకొక్క యాభై అడుగులు – కొండ దిగితే అక్కడ బిలాలీ ఉంటాడు. ఆయేషా చెప్పి ఉంచింది కదా ఎదురు చూస్తుండమని. ఎక్కడలేని ఓపికనీ కూడదీసుకుని దిగిపోయాం. అక్కడ కాపు కాస్తున్న మూగవాళ్ళలో ఒకడికి కనిపించాము – అతను విపరీతమైన భయం తో అరుచుకుంటూ పరిగెత్తాడు. లియో మొహం నిండా గాయాలు, రక్తం ఎక్కడికక్కడ గడ్డ కట్టీ కమిలిపోయీ. దుస్తులు పీలికలైపోయాయి – నా అవతారం అంతకన్నా దరిద్రం గానే ఉండి ఉండాలి , వికార రూపం కదా నాది.

కబురు అందినట్లుంది – బిలాలీ ఊడిపడ్డాడు. ఆశ్చర్యం గా, ఒకింత నిరసన గా చూశాడు మా మమ్మల్ని.

” ఏమిటిది ? ఏమైంది ? ఇలా ఎందుకయిపోయారు ? మీ నౌకరేడీ ? రాజ్ఞి – రాజ్ఞి ఎక్కడ ? ”

” పోయారు. ఇద్దరూ పోయారు. ప్రశ్నలు వేయకు బిలాలీ. నాలుకలు పీక్కుపోతున్నాయి. ముందు నీరూ ఆహారం …”

” పోయిందా ? ఆమె కి చావు లేదు- ఎలా మరణిస్తుంది ? ” – బిలాలీ అయోమయం గా కేక పెట్టాడు. . చుట్టూ చేరిన మూగవాళ్ళు గమనిస్తూండటం చూసి, చప్పున సర్దుకుని , మమ్మల్ని మోసుకు తీసుకు వెళ్ళమని సైగా చేశాడు.
ఆ వేళకి మా విడిది లో మాంసం పులుసు కళపెళా ఉడుకుతోంది. కాస్త కాస్తగా ఎవరో గొంతుల్లోకి పోశారు. గాయాలని శుభ్రం చేసి గడ్డి మీద పడుకోబెట్టారు. ఆ తర్వాత ఒళ్ళు తెలియలేదు.

***

నాకు స్పృహ తెలిసేప్పటికి పక్కనే బిలాలీ కూర్చుని సాలోచనగా గడ్డం దువ్వుకుంటున్నాడు. నాకేమైందో చటుక్కున గుర్తు రాలేదు. శరీరం లో ఏ భాగాన్నీ కదిలించలేకపోయాను. పక్కకి చూస్తే లియో ఇంకా నిద్రపోతున్నాడు. అతని రూపురేఖలు తెలియనంతగా మొహమంతా గాయాలతో వాచిపోయి ఉంది… ఒక లిప్త పాటు ఆశ్చర్యం , తర్వాత జరిగిందంతా గుర్తొచ్చింది.

” చాలా సేపే నిద్ర పోయావు పరదేశీ ” – బిలాలీ అన్నాడు.

” ఎంత సేపు ? ”

” ఒక పగలూ ఒక రాత్రీ. అతను ఇంకా పడుకునే ఉన్నాడు ”

” మంచిదే ” – నిట్టూర్చాను. ” నిద్ర లో స్మృతి ఉండదు కదా ”

” చెప్పు, ఇప్పుడైనా – ఏమైందో ? రాజ్ఞి మరణించటం నిజమేనా ? ఆమెకి చావు ఎలా వస్తుంది అసలు ? ఒక వేళ అదే నిజమైతే మీకు దారుణమైన ప్రమాదం ఉంది. ఈ అమహగ్గర్ లు మిమ్మల్ని ఉడకబెట్టి తినేస్తారు- రాణి కి భయపడే కదా ఇన్నాళ్ళూ ఊరుకున్నారు…”

ఉన్నది ఉన్నట్లు గా కాదు గాని, చెప్పాను. రాజ్ఞి మంటల్లో పడి చనిపోయిందని చెప్పాను. మాకు ఎదురైన భయంకరానుభవాల గురించి కూడా. ఆయేషా చనిపోయిందని అతను నమ్మలేదు. ఆమె కావాలని మాకు కనబడకుండా మాయమై ఉంటుందనీ తన తండ్రి హయాం లో కూడా ఒకసారి పన్నెండేళ్ళపాటు ఎవరికీ కనిపించలేదనీ, అకస్మాత్తు గా ప్రత్యక్షమై తనకు ద్రోహం చేయబోయినవారిని నాశనం చేసిందనీ అన్నాడు. అప్పటి మాటేమో గానీ ఇప్పుడు అలా జరగదని నాకు తెలుసు , కాని అతన్ని గట్టిగా ఖండించలేదు.

” అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు ? ” – అడిగాడు.

” ఇక్కడినుంచి తప్పించుకు వెళ్ళాలి ”

” మనం వచ్చినదారి లో అది అసాధ్యం. కొందరున్నారు- నరమాంసానికి మొహం వాచి ఉన్నవాళ్ళు , తిన్నాక చచ్చినా పర్వాలేదనుకునేవాళ్ళు. రాణి వచ్చి ఏమైనా చేస్తుందని తెలిసీ మిమ్మల్ని వాళ్ళు బతకనివ్వరు. నీ మాటలు వింటుంటే ఆమె కొన్నాళ్ళ వరకూ రాదనిపిస్తోంది. ఈ కొండ చరియలలోంచి వేరే మార్గం ఉంది- మామూలుగా పశువుల ని మేత కోసం వదులుతుంటాము ఆ వైపు. అక్కడినుంచి మీరు చూసిన చిత్తడి నేలల మీదుగా ఒక దారి ఉంది ”

బిలాలీ నీటిలో పడి కొట్టుకుపోతున్న ఒక సందర్భం లో నేను రక్షించి ఉన్నాను.

” మీ ప్రాణం నేనొకప్పుడు కాపాడాను కదా తండ్రి గారూ – ఇప్పుడు నన్నూ లియోనీ రక్షించండి. మీకు పుణ్యం వస్తుంది , పరలోకం లో సుఖపడతారు. మీరన్నట్లు ఆయేషా తిరిగి వస్తే మీరు మాకు చేసి పెట్టిన సహాయానికి మిమ్మల్ని సన్మానిస్తుంది కూడా ”

” నాకు గుర్తుంది బిడ్డా. ఈ దొర్భాగ్యులందరూ చూస్తూ ఊరుకున్నప్పుడు నన్ను నువ్వే కాపాడావు. నేను కృతఘ్నుడిని కాను, మీకు ఉపకారం చేస్తాను. విను – రేపు తెల్లారగట్లే సిద్ధం గా ఉండండి. పల్లకీ లు వస్తాయి. ఆ చిత్తడి నేలలకి అవతలి పక్కన మిమ్మల్ని విడిచిపెడతారు – రాజ్ఞి ఆజ్ఞ గా ఆ పని చేయాలనీ ఆమె త్వరలోనే రాబోతోందనీ గట్టిగా చెబుతాను. తర్వాత మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అతను మేలుకుంటున్నాడు చూడు – ముందు భోజనాలు కానివ్వండి ”

లియో పరిస్థితి నేను భయపడినంత ఘోరం గా లేదు. ఇద్దరమూ ఆవురావురుమంటూ భోజనం చేశాము. తర్వాత దగ్గర్లో ఉన్న ఏటికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి మళ్ళీ నిద్ర పోయాము. మళ్ళీ రాత్రికి సుష్టు గా తిని నిద్ర పోయాము. బిలాలీ ఆ మధ్య లో అంతా కనిపించలేదు – పల్లకీ ల ఏర్పాట్లు చూస్తున్నాడు కాబోలు. అర్థరాత్రి కొత్తగా మనుషులూ సరంజామా వచ్చిన అలికిడి అయింది.

ఇంకా చీకట్లు ఉండగానే బిలాలీ వచ్చాడు. అతి ప్రయత్నం మీద, రాజ్ఞి పేరు చెప్పి భయపెట్టి అంతా ఏర్పాటు చేశాననీ అయినా కూడా దారి లో ఆ మూర్ఖులు మమ్మల్నేమీ చేయకుండా తనూ వెంట వస్తున్నాననీ చెప్పాడు. నా మనసు కృతజ్ఞత తో నిండిపోయింది – అంత దూరమూ ఆ వృద్ధుడు పాపం వెనక్కి రావాలి కదా. అతని మేలుని జీవితాంతమూ మర్చిపోలేను.

కాస్త తిండి తినేసి ఆ వెంటనే బయల్దేరిపోయాం. శరీరాలు క్రమం గా మామూలు స్థితికి వస్తున్నాయి- మనస్సులు ?

కొంతదూరం వెళ్ళాక పల్లకీ లు దిగి నడవవలసి వచ్చింది – ఆ దారి అంత నిట్ట నిలువు గా ఉంది. అయితే త్వరలోనే చదును గా ఉన్న భూభాగం వచ్చింది. దూరం నుంచి ఆయేషా చూపించిన కోర్ శిథిలాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఎక్కి వచ్చినంత దూరమూ దిగాలి. పల్లకీ లలోనే ఉన్నాము గాని ఒళ్ళు పూర్తిగా హూనమైంది. ఆ రోజు కాక మరి మూడు రోజుల ప్రయాణం అయాక చిత్తడి నేలలని దాటగలిగాము. అంతకాలమూ చుట్టూ అక్కడి విషవాయువులూ రకరకాల కీటకాలు పెట్టే బాధలూ దూరం గా సిం హాల గర్జనలూ. ఏమైతేనేం – చేరాం. బిలాలీ నుంచి సెలవు తీసుకుంటూ ఉంటే కొద్దిగా బాధ కలిగింది . అతను గంభీరం గా మమ్మల్ని దీవించాడు.

” వెళ్ళండి. ఇంకెప్పుడూ రాకండి. ఇటువంటి సాహసాలు చేయకండి . సుఖంగా మీ దేశం చేరగలిగితే అప్పుడప్పుడూ నన్ను తలచుకోండి. నేనూ మిమ్మల్ని మర్చిపోలేను ”

అతను వెనుదిరిగి పరివారం తో కలిసి వెళ్ళిపోయాడు.చూస్తుండిపోయాం – చిత్తడి నేలల్లోంచి లేచే పొగల లో ఎక్కువదూరం వరకూ కనిపించలేదు.

ఒకరి మొహాలొకరు చూసుకున్నాము. మూడంటే మూడే వారాల కిందట ఇక్కడికి నలుగురం వచ్చాము. ఇద్దరు దారుణం గా చనిపోయారు, మిగిలిన ఇద్దరం చావుకన్నా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని బయటపడ్డాము. ఇంతా చేసి మూడు వారాలేనా , జరిగింది ? ముప్ఫై ఏళ్ళనిపిస్తోంది. కాలాన్ని ఇటువంటప్పుడు సంఘటనల తో కొలవాలి కాబోలు.

” జంబేసీ నది ఒడ్డుకి వెళ్ళాలి – చేరగలమో లేదో , పైవాడికెరుక ” -అన్నాను.

లియో తల ఊపాడు. అతను బొత్తిగా మాట్లాడటం మానేశాడు. కట్టుబట్టలతో ఉన్నాము అంతే – అవి కాక రెండు మూడు రివాల్వర్ లు, సరిపడా తుపాకి మందు, ఒక దిక్సూచి.

ఆ తర్వాతి వివరాలు క్లుప్తంగా మటుకే చెబుతాను. జంబేసీ నది అక్కడికి నూట డెబ్భై మైళ్ళుంది. వచ్చేప్పుడు పడవలో కదా వచ్చాము – ఇప్పుడు కాలి నడక. దారి లో ఇంకొక ఆటవిక జాతి వాళ్ళకి చిక్కి కొన్ని నెలలు నిర్బంధం లో ఉండి
పోయాము. వాళ్ళు మమ్మల్ని దేవతలనుకున్నారు – అందుచేత చంపలేదు. ఎలాగో తప్పించుకుని, లెక్క లేన్న్ని కడగళ్ళు పడీ పడీ చివరికొక పోర్చుగీస్ దేశస్థుడిని కలుసుకోగలిగాము. అతను ఏనుగుల వేట కోసం వచ్చాడట. పాపం మమ్మల్ని బాగానే చూసుకున్నాడు. అతని ఓడ లో వెళ్ళి డెలా గోవా రేవు లో దిగాము. అప్పటికి మమ్మల్ని బిలాలీ దిగబెట్టి పద్దెనిమిది నెలలైంది. మా అదృష్టం కొద్దీ అక్కడినుంచి మర్నాడే ఇంగ్లండ్ వెళ్ళే నౌక దొరికింది. జన్మభూమికి మా ప్రయాణం దివ్యం గా జరిగింది. బయల్దేరిన రెండేళ్ళ తర్వాత ఇంటికి చెరాక ఇదంతా రాస్తున్నాను. లియో నా పక్కనే ఉన్నాడు. ఆ అర్థరాత్రి విన్సే నాకు ఆ వింత పెట్టే నీ తన కొడుకు బాధ్యతనీ అప్పజెప్పి సరిగ్గా ఇరవై రెండేళ్ళయింది.
అక్కడితో నేను చెప్పగలిగిన కథ అయిపోయింది. కాని నిజంగా పూర్తయిపోయిందా? రెండు వేల ఏళ్ళ నాడు మొదలైన కథ భవిష్యత్తు లోకీ కొనసగుతుందా? ఏమో.

పునర్జన్మ లు ఉన్నాయా ? కాలిక్రేటస్ మళ్ళీ లియో గా జన్మించటం నిజమేనా? ఇలా అంటున్నాను గాని నాకు లోపల తెలుసు, ఇదంతా నిజమేనని. కాలిక్రేటస్, అతని భార్య అమెనార్టస్, ఆయేషా, లియో, నేను… ఒక్కో రాత్రి వేళ కూర్చుని ఇంకా జన్మించని కాలంలోకి చూపు సారించబోతుంటాను – ఏమీ కనిపించదు. ఒక్కటే నాకు నిశ్చయం, దీనికి కొనసాగింపు ఉంటుందని, ఉందని.

[ సమాప్తం ]

[ ఒక పత్రికలో ధారా వాహికం వచ్చిన ఈ నవల 1887 లో పుస్తకంగా వెలువడింది. కొనసాగింపుగా, పద్దెనిమిదేళ్ళ తర్వాత, 1905 లో రచయిత ' ఆయేషా ' రాశారు. మరొక ప్రసిద్ధ రచయిత, Rider Haggard స్నేహితుడు, Andrew Lang దాన్ని లిపి బద్ధం చేయటం విశేషం. మొదటి నవల అంతగా కాకపోయినా అదీ విజయవంతమైంది. అసలు Sir Haggard రాసినవాటిలో అపజయం చూసిన నవలలు చాలా తక్కువ. రెండో భాగం టిబెట్ లో జరుగుతుంది. ఆయేషా అక్కడ పుడుతుంది. హాలీ, లియో అక్కడికి వెళతారు. ఆ నవల ఒక విధంగా సుఖాంతమే. రెండవ భాగంలో రచయిత పరిధులు తన మతవిశ్వాసాలను దాటి మరి కొంత విస్తరించి కనిపిస్తాయి.

రచయిత సృష్టించిన మరొక ప్రసిద్ధ పాత్ర Allan Quatermain నీ ఆయేషానీ కలిపి ఇంకొక నవల She and Allan రాశారు. ఆ కథ లియో కథాకాలానికి ముందు జరుగుతుంది. అదే కాకుండా Wisdom’s Daughter అని She కి prequel కూడా రాశారు. ]

**** (*) ****