అనువాద నవల

రాజ్ఞి – పద్నాలుగవ భాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

ఆగస్ట్ 2016

[ జూలై నెల సంచిక తరువాయి ]

“చూడు , రెండు వేలేళ్ళుగా ఏ చోట నిద్రపోతూ ఉన్నానో” – లియో చేతిలోంచి దీపాన్ని తీసుకుని పైకెత్తి చూపించింది. కాస్త పల్లంగా ఉన్నచోట , పొడవాటి రాతి అరుగు పైన తెల్లటి ఆచ్ఛాదన తో ఒక ఆకారం.  అటువైపున – గోడ లోకి  మరొక అరుగు మలచి ఉంది.

” ఇక్కడే ” – చేత్తో చూపిస్తూ చెప్పింది ఆయేషా. ” కొన్ని తరాల నుంచి ఇక్కడే నిద్రిస్తున్నాను . నా ప్రియతముడు ఇక్కడ ఉండగా మరొక చోట ఎలా ఉంటాను రాత్రంతా ? ఆ మెట్లలాగే ఇదీ నా శరీరపు ఒత్తిడికి అరిగిపోయి ఉంది. సజీవుడి గా తిరిగి దొరికిన నా కాలిక్రేటస్ – మరణించి ఉన్న నిన్ను చూస్తావా ? చూడగలిగేందుకు సిద్ధమేనా ? ”

మేము ఏమీ మాట్లాడలేకపోయాము – భయం గా ఒకరి మొహాలొకరు  చూసుకున్నాము. ఆ దేహం పైన కప్పిన బట్ట ను ఒక చివర పట్టుకు ఎత్తబోతూ ఆయేషా మళ్ళీ అంది -

” భయం లేదు. ఇప్పుడు జీవించి ఉన్నవాళ్ళు ఇదివరలోనూ జీవించారు – ఏ స్వరూపమూ కొత్తది కాదు భూమి పైన. కాకపోతే గుర్తుండదు, మన జ్ఞాపకాలని ఎవరూ భద్రం చేసి ఉంచరు – భూమి తను ఇచ్చిన ఆకృతిని తిరిగి తనలో కలి పేసుకుంటుంది. ఈ కోర్ జాతి వారి ప్రక్రియలను అధ్యయనం చేసి, నా విజ్ఞానం తో మరికొంత అభివృద్ధి చేసి – నీ శరీరాన్ని దాచిఉంచాను. నీ సౌందర్యాన్ని చూస్తుండగలగటమే నాకు ఇంత కాలం గా శక్తినిస్తూ వచ్చింది. ఆ తొడుగుకి స్మృతుల తో ప్రాణం పోసుకుంటూ జీవితేచ్ఛను నిలుపుకున్నాను – నా మృతస్వప్నాల  చీకట్ల మధ్యన.

దర్శించు – సజీవులు నిర్జీవులను కలుసుకుంటున్నారు ! అనంతమైనది  కాలపు అగాధం- అంచులలో అన్నీ ఒకటే. దీర్ఘనిద్ర – మృత్యువు – దయతో జ్ఞాపకాలకి మూతవేస్తుంది – లేదంటే ఆ వేర్వేరు జీవితాల దుఃఖాలని ఆత్మ మోసుకుంటూ పోతే పిచ్చిదవుతుంది…జీవనం దుస్సాధ్యం. కాని అదొక ముసుగు మాత్రమే సుమా – ఈదురుగాలికి చెదిరిపోయే మేఘాలకి మల్లే విడిపోతుంది. సూర్యకాంతిలో కొండల మీది మంచు కరిగి ప్రవహించినట్లుగా – ఘనీభవించి ఉన్న గతపు గొంతు ద్రవించి గానం చేస్తుంది . కాలపు కనుమలలో తిరిగి మరొక్కసారి – అప్పటి ఆ ఆనందవిషాదాలు మారుమోగుతాయి.

అవునోయీ- నిదుర జారిపోతుంది. జన్మాంతరాలు ఒకదానికొకటి అతుకు పడతాయి, హారం పూర్తి అవుతుంది – మొత్తంగా దాన్ని అవలోకించి, మనం ఏమిటో, ఎందుకో తేల్చుకోవచ్చు .

భయపడకు – నిన్న మొన్ననే మళ్ళీ పుట్టి వచ్చిన నీకు ఒకప్పటి నిన్ను చూపిస్తున్నానంతే. నీ సుదీర్ఘ ప్రయాణపు పుస్తకం లో ఒక్క పుటను వెనక్కి తిప్పుతున్నానంతే .

చూడు ! ”

ఒక్కసారిగా ఆయేషా ఆ వస్త్రాన్ని తొలగించి దీపకాంతిని అక్కడికి మరల్చింది. ముందుగానే ఆమె ఎంత వివరించి ఉన్నా, ఏ వింత సిద్ధాంతాలను బోధించి ఉన్నా – ఆ దృశ్యం పూర్తిగా హడలగొట్టేసింది నన్ను. కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఆ రాతి అరుగు పైన, తెల్లని దుప్పటి కింద ఉన్నది – ముమ్మూర్తులా లియో విన్సే నే. పక్కనే నిలబడి ఉన్న లియో నీ పడుకుని ఉన్న అతన్నీ మార్చి మార్చి చూశాను.  గడ్డం మీది సొట్ట, గిరజాల ముంగురులు – ఎక్కడా చిన్న తేడా కూడా లేదు. వయసులో కొద్దిగా పెద్దవాడనిపిస్తున్నాడు అంతే. గాఢం గా నిద్రపోయేప్పుడు లియో కవళిక అక్షరాలా ఇలాగే ఉంటుంది.

లియో – చేష్టలు దక్కి నిలుచుండిపోయాడు. రెండు మూడు నిమిషాలు తదేకం గా చూసి, గొంతు పెగిలించుకుని అన్నాడు -

” కప్పివేయి దాన్ని. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో ”

” లేదు. ఆగు, కాలిక్రేటస్ ” – ఆ సన్నని వెలుగు లో ఆమె రూపం ఒళ్ళు జలదరించేంత అందంగా ఉంది. ఆమె స్వరం లో అధికారం ఇటువంటిదని నిర్వచించలేను.

” ఉండు. నా నేరాన్నీ చూపిస్తాను నీకు – దేన్నీ దాచాలనుకోవటం లేదు. హాలీ, ఆ బట్ట ని ఇంకాస్త దిగువకి లాగు- నడుము వరకూ ”

విపరీతంగా వణికే చేతులతో ఆమె అన్నట్లే  చేశాను. ఆ పడుకుని ఉన్న లియో గుండె మీద పెద్ద గాయం . బల్లెం పోటును సూచిస్తూ.

” నేనే నిన్ను చంపుకున్నాను కాలిక్రేటస్. ఆ ఈజిప్షియన్ ఆడది, అమెనార్టస్ – నిన్ను వదిలిపెట్టలేదు. ఆమె నా కన్న ఆనాడు శక్తివంతురాలు – ఆమెనేమీ చేయలేని క్రోధం తో , ఆమె కి లోబడి ఉన్న నిన్ను చంపుకున్నాను. అదే ఆడది ఇవాళా అడ్డొచ్చింది నాకు – ఇప్పుడు రానియ్యలేదు నేను, అంతం చేసేశాను. అప్పటి నా పాపానికి ఇన్నేళ్ళూ శిక్ష అనుభవించాను. చూడు – అందుకు బదులుగా ఇప్పుడు నీకు వేల వేల ఏళ్ళు జీవించి ఉండే వరాన్నిస్తాను. నీ సౌందర్యం , సామర్థ్యం అంతకాలమూ  నిన్ను వీడిపొకుండా ఉంచుతాను.  నీ వంటి పురుషుడు మానవులలో ఇంతకు మునుపు లేడు, మున్ముందు ఉండడు. నువ్వు బ్రతికి వచ్చావు, ఇక ఈ నీ దేహం నాకు అవసరం లేదు- బాధామయ గాథలను త్రవ్విపోయటం తప్ప ఇది ఇంకేమీ చేయలేదు. ధూళి లో కలిసిపోనిస్తాను దాన్ని. ”

అటు, తను నిద్రించే వైపున – గోడ లోంచి పెద్ద పింగాణీ జాడీ ని రెండు చేతులతో పట్టుకుని తెచ్చింది. దాని మూత గట్టి గా దళసరి చర్మంతో బిగించి ఉంది. ఆ పాత లియో నుదుటిని ముద్దు పెట్టుకుని ఇవతలికి వచ్చి జాడీ మూత తెరిచి అందులోని ద్రవాన్ని ఆ శరీరం పైన నిలువునా కుమ్మరించింది. ఒక్క చుక్క కూడా తన పైనా మా పైనా పడకుండా జాగ్రత్త పడింది. బుస్సుమని పొగలు లేచాయి. చితుకులు చిటపట్లాడే లాంటి శబ్దం మెల్లిగా మొదలై, ఎక్కువై, సద్దు మణిగింది. ఆ దేహం ఉన్నంత మేరా పొడుగాటి దట్టమైన మబ్బు వంటిది ఆవరించింది. కాసేపటికి అదీ మాయమైంది. ఇప్పుడు ఆ అరుగు మీద కొద్ది పిడికిళ్ళ తెల్లని పొడి మాత్రమే మిగిలింది. అదేదో మహా శక్తివంతమైన ఆమ్లo అయి ఉండాలి, ఆ రాతి ని కూడా అక్కడక్కడా తినేసింది అది. ఆ బూడిదను గుప్పెళ్ళతో తీసి గాలిలోకి వెదజల్లుతూ ఆయేషా గంభీరం గా పలికింది -

” ధూళి నుంచి, ధూళి లోకి. గతం – గతం లోకి. మృత్యువు – మృత్యువు లోకి. మరణించిన కాలిక్రేటస్ – జన్మించాడు ఇడుగో , మళ్ళీ !! ”

నిశ్శబ్దంగా ఆ బూడిద నేలకి రాలుతూంటే మేము అంతకన్నా నిశ్శబ్దంగా చూస్తుండిపోయాను.

” ఇక మీరు వెళ్ళండి. వెళ్ళి నిద్రపోవాలంటే పోవచ్చు. మనం రేపు చేయవలసిన ప్రయాణం  గురించి  నేను ఆలోచించాలి, సమయం కావాలి – చాలా కాలమైంది ఆ వైపుకి వెళ్ళి ”

మేము వినయం గా సెలవు తీసుకుని బయటపడ్డాము.

మా గదికి వెళ్ళే ముందు జాబ్ ఎలా ఉన్నాడో తొంగి చూశాము. ఆ అమహగ్గర్ వెధవల ఉత్సవాలకే ఘోరంగా బెదిరిపోయాడు.  మా వెనకే ఆయేషా దగ్గరికి వచ్చినా , ఉస్తేన్ ని చంపేసే ముందే అక్కడినుంచి పారిపోయాడు. ఇప్పుడు సుఖం గా గుర్రు పెడుతూ నిద్ర పోతున్నాడు…పోనీలే పాపం అనిపించింది.  మా గదిలోకి వచ్చి పడ్డాక – అప్పటికి లియో కి ఒంటిమీదికి తెలివి వచ్చినట్లైంది. ఉస్తేన్ హత్య, తన లాగే ఉన్న శవం, అది బూడిదవటం – అన్నీ ఒక్కసారి అతన్ని చుట్టుముట్టాయి. దుఃఖం వచ్చింది పెద్ద పెట్టున-  తెరలు తెరలు గా… మధ్య మధ్యన తనని తను శాపనార్థాలు పెట్టుకుంటూ, ఆ దరిద్రగొట్టు మట్టి పలకని చూసిన దురదృష్టపు రోజుని తిట్టుకుంటూ. అంత ఉద్వేగం లోనూ ఆయేషాని దూషించలేదు అతను- ధైర్యం సరిపోయి ఉండదు- ఎక్కడ ఎవరేమన్నా ఆమె కి తెలియకుండా పోదని, బహుశా.

” ఏం చెయ్యను నేను , అంకుల్ హాలీ ” – నా బుజం మీద తల పెట్టుకుని గుండె అవిసేలా ఏడ్చాడు లియో.  ” ఉస్తేన్ ని నా కళ్ళ ముందే చంపేసింది ఆమె- ఏమీ చెయ్యలేక చూస్తుండిపోయాను. తర్వాత అయిదే నిమిషాలలో ఆ హంతకురాలిని ముద్దాడాను, ఎంతటి దౌర్భాగ్యుడిని ! మళ్ళీ  ఆమె సమక్షానికి వెళితే మళ్ళీ అలాగే ప్రవర్తిస్తాను – తెలుస్తోంది నాకు. తిరిగి ఆమె ని చూడకపోయినా నా జన్మ లో మరొక స్త్రీ కి దగ్గర కాలేను – ఆమె అధీనం లో ఉన్నాయి నా ఇంద్రియాలన్నీ. ఇక్కడ నుంచి వెళ్ళేందుకు నా శరీరం కూడా నాకు సహకరించదు. అయస్కాంతం వైపుకి లాగబడే సూది లాగా తిరగాల్సిందే నేను. కాని నా బుద్ధి నా వ లోనే ఉంది – ఆమె మీద అంతులేని ద్వేషమూ ఉంది…ఉందేమో అనిపిస్తోంది. ఆ శవం ఏమిటసలు – ఏమనుకోవాలి దాన్ని ? అమ్ముడుపోయాను అంకుల్ హాలీ, బానిసనైపోతున్నాను. ఆ మంత్త్రగత్తె తన అందానికి నా ఆత్మని వెలకట్టి తీసుకుంటోంది ..”

నాకు చేతయినట్లుగా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశాను. అక్కడి నుంచి పారిపోదామని సూచించాను – అతను అది అసాధ్యమన్నాడు. నాకూ తెలుసు అది సాధ్యం కాదని- దీపం వైపు ఎగిరే శలభాలం మటుకే మేము. ఆయేషా పట్ల నా ఆకర్షణ కూడా తక్కువైనది కాదు – మరింకే ఉద్దేశమూ ఆమెకో నాకో ఉన్నా లేకపోయినా. ఆమె ఒక నల్లమందు – లియో తోబాటు నేనూ ఆ మత్తు లో కొట్టుకుపోతున్నాను. మైకం వదిలిన కాసేపూ వదిలేద్దామనిపించినా ఆ దివ్య సౌందర్యాన్ని వదిలి వెళ్ళగలగటం అయే పని కాదు.

మరొక వైపు నుంచి ఆలోచించటం మొదలుపెట్టాను. లియో ని ఆమె ఎంతో గాఢం గా కోరుకుంటోంది – ఎప్పుడో చేసిన నేరానికి ఇంతకాలమూ వేదన పడింది. ఆమె విశ్వాసం , అంకిత భావం – ఇప్పటి నేరాన్నీ పక్కన పెట్టమంటున్నాయి. ఆమెను చేపడితే  ఆమె అధీనం లోకి వెళ్ళిపోతాడు లియో – నిజమే , కాని మామూలు  వివాహాలలో మాత్రం భార్య కి భర్త లోబడిపోవట లేదా ? ఈ వివాహం వల్ల అతనికి లభించే అమితమైన జ్ఞానమూ అనుపమానమైన రూపమూ మానవాతీతమైన శక్తులూ – వీటన్నిటితోబాటు , అతను తప్ప మరొక పురుషుడినే గుర్తించని ఆయేషా ప్రేమ…ఎందుకు వదులుకోవాలి దీన్నంతా ? లియో కీ లోలోపల అలాగే అనిపిస్తూ ఉండాలి- అదే సహజం , కనీసం ఈ పరిస్థితిలో.

లియో నేనూ రెండు మూడు గంటల పాటు ఏవేవో మాట్లాడుకున్నాం- ఆ ధోరణికి అర్థం పర్థం ఏమీ లేదు …మా మనసులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయి  ఉన్నాయి. మేము ఉన్నది వాస్తవం కాక స్వప్నమో కల్పిత గాథో అనిపిస్తుండింది. ఆ మట్టి పలక మీది రాతలేమిటి, వాటి లో రాసినదాన్ని తేల్చేందుకు మేము రావటమేమిటి, ఆ అమానుష స్త్రీ నిజం గా ఇక్కడ ఉండటమేమిటి, ఎన్నో వందల ఏళ్ళ వెనక లియో ని ఆమె ప్రేమించి ఉండటమేమిటి, దానికి నిదర్శనం గా ఆ శవాన్ని మేము చూడటం ఏమిటి, ఈ కోర్ సమాధులలో ఇప్పుడు -  మాకేమి సంప్రాప్తం కాబోతోందో తెలియని స్థితిలో మేము పడి ఉండటం ఏమిటి ? దీన్ని ఎటువంటి హేతువాదం వివరించగలదు ? కాని ఇదంతా జరిగింది, జరుగుతోంది – మనిషి గర్వించే ఏ ఆధునిక జ్ఞానమూ తర్కమూ ఇక్కడికి సాయం రావటం లేదు. ఎట్టకేలకి – పూర్తిగా అలిసిపోయి- ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుందన్న నిర్వేదం లోకి పడిపోయి  – ఒళ్ళెరగకుండా నిద్రపోయాము.

తెల్లారి తొమ్మిదింటికి జాబ్ నన్ను లేపేందుకు వచ్చాడు. ఇంకా భయం తో పీచు పీచుమంటూనే ఉన్నాడు. నాతో బాటు లియో కూడా అక్కడే సజీవం గా కనిపించటం అతనికి విపరీతమైన ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ కలిగించింది. ఉస్తేన్ చావు  గురించి విన్నాక మేము బతికి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆమె బతికి ఉండగా ఉస్తేన్ కీ అతనికీ ఏమంత గా పడేది కాదు – కాని ఆమెకి పట్టిన గతికి జాబ్ విచారాన్ని వ్యక్తం చేశాడు.

ఆయేషా వృత్తాంతం విని అదంతా ఏదో రాక్షసమాయ వంటిదని అభిప్రాయపడ్డాడు. అసలు ఆయేషా స్త్రీ కాదనీ పురుషుడేననీ, లేదా ఆమె ని అడ్డు పెట్టుకుని ఇంకెవరో పురుషుడు ఇదంతా చేస్తున్నాడనీ అతని బుద్ధికి తోచింది.

” ఆమె లియో ప్రాణాన్ని రక్షించింది కదా ? ” – నేను.

” అవునండీ – ఇప్పుడు అతని ఆత్మని తీసుకుని సైతాన్ కి అమ్మేస్తుంది. లియో నీ మంత్రగాడు గా మార్చేస్తుంది. నేను రాత్రంతా నా గదిలో పెద్దగా బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. మంత్రాలూ మాయలూ చేసేవాళ్ళకి దేవుడు ఏ గతి పట్టిస్తాడో వైన వైనాలు గా రాసి పెట్టారు కదండీ అందులో ? మా అమ్మ ఎప్పుడూ చెబుతూనే ఉండేది ఆ సంగతులు …పాపం ఇదంతా తెలిస్తే ఏమైపోతుందో ఆవిడ…”

” అవున్లే. ఇదంతా విడ్డూరం గానే ఉంది ” – ఒప్పుకున్నాను.

” కాదండీ మరి ? ” జాబ్ అందుకున్నాడు. ఈ లోపు లియో లేచి బయటికి వెళ్ళాడు.

” రాత్రేమయిందనుకున్నారు ? నాకొక కల వచ్చింది – అందులోకి మా నాన్న వచ్చాడు. అదేమిటోగాని, ఈ దిక్కుమాలిన వెధవల వేషం లో ఉన్నాడు, తల్లో ఈకలతో సహా. నాతో అన్నాడూ- ‘ ఒరేయ్ జాబ్ , ఇంకెంతో కాలం పట్టదులేరా – చూడకూడనివన్నీ చూస్తావు, ఆఖర్న నా దగ్గరికే వస్తావు. చెప్పిపోదామని వచ్చాను ‘ అని. ఇంక ఇప్పుడు చస్తానని భయం లేదులెండి గాని, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటమేమిటో, ఖర్మ. ఆయనా నేనూ ఒక చోట మూడు రోజులుంటే యుద్ధాలైపోతుండేవి గదా ”

” మీ నాన్న కనిపించినంత మాత్రాన చచ్చిపోతానంటావా ఏమిటి ? ”

” అదెలాగూ తప్పదు గానీ అయ్యా- ఆయన అన్నది నాకు అర్థమైంది లెండి. ఇలాంటి దరిద్రగొట్టు చోట చస్తే క్రైస్తవుడికి జరగాల్సిన కర్మకాండలేం జరిగే పనిలేదు గదా- అందుకని నరకానికి పోతాను నేను- మా నాన్న అక్కడే ఉంటాడు, చచ్చినా స్వర్గానికి వెళ్ళి ఉండడు. కాకపోతే ఇన్నాళ్ళూ ఎంతో పద్ధతి గా బాధ్యత గా నడుచుకుంటూ వచ్చాను , దానికేమీ ఫలితం ఉండదంటారా ? ఈ దిక్కుమాలిన ప్రయాణానికి ముందర – ఒక్క ఆదివారమైనా చర్చ్ కి వెళ్ళకుండా ఉన్నానా చెప్పండి ? ”

” ఊరుకో జాబ్. ఇలాంటి కష్టాలు ఎన్నిటిని దాటలేదు మనం ? ఇప్పుడూ బయట పడతాం లే ” – నచ్చజెప్పబోయాను.

అతను ఏమీ వినిపించుకునే స్థితిలో లేడు. ఆ వచ్చే చావేదో వేణ్ణీళ్ళ బాన లో ఉడకబెడుతూ రాకపోతే చాలని ప్రకటించి , మాకు అల్పాహారం తెచ్చేందుకు వెళ్ళాడు.

జాబ్ అమాయకపు మాటలు నన్ను కొంత కలవరపెట్టాయి. అతని భయాలని పూర్తిగా కొట్టివేయగల వాదన ఏదీ నా దగ్గర లేదాయె. ఆ లోపు లియో వచ్చాడు. అల్పాహారం అయాక బయటికి అలా షికారు వెళ్ళాము. అమహగ్గర్ మనుషులు కొందరు – ధాన్యం నాటే పనిలో ఉన్నారు. ఆ ధాన్యాన్ని సారా తయారు చేసేందుకు వాడతారు గనుక – దానికొక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. మేక చర్మం తో కుట్టిన సంచిలో గింజలు పోసి, అడుగున సన్నని చిల్లు పెట్టి- ఒక మనిషి దాన్ని నడుముకి కట్టుకుని మడిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ వ్యవహారం కాస్త వింత గా ఉంటేనేం గాక – ఆ మాత్రం ‘ మామూలు పని ‘  వాళ్ళు చేస్తున్నందుకు కాస్త నయం గా అనిపించింది. పంట పండించుకోవటం, ధాన్యం తో సారా కాచుకోవటం -  ఇటువంటి మానవసహజమైన కృత్యాలు చేస్తున్నారు గనుక వాళ్ళూ ఒక విధమైన మనుషులేనని తోచింది – కాసేపు.

బిలాలీ మేమున్న చోటికి వచ్చి , రాజ్ఞి మాకు దర్శనమివ్వాలనుకుంటోందని చెప్పాడు. ఎప్పట్లాగా మూగవాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి దించి నిష్క్రమించారు. ఆయేషా మళ్ళీ తన ముసుగు తీసి కనిపించింది, లియో – గత రాత్రి విచికిత్సనంతా గాలికి వదిలేసి ఆమెని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు – బహుశా నిన్నటికన్నా ఇంకాస్త ఎక్కువ అనురక్తితో.

ఆమె అతని ముఖం లోకి ప్రేమ గా చూస్తూ అంది – ” మన ఇద్దరమూ ఎప్పుడు కలిసి జీవించబోతున్నామా అని ఆలోచిస్తున్నావు కదా ? ప్రస్తుతానికి మన ఇద్దరమూ వేరు వేరు. నేను పూర్తిగా అమరత్వాన్ని సాధించకపోయినా నా శరీరం  నీ శరీరం కన్నా చాలా దృఢమైనది. ప్రకృతి శక్తులను వశం చేసుకుని నాలో లీనం చేసుకున్నాను – నీ మామూలు స్థితిలో నువ్వు నన్ను భార్య గా భరించలేవు . అందుకు మనం ఒక ప్రయాణం చేయవలసి ఉంది. అంతా సవ్యం గా సాగితే రేపు సాయంత్రానికి ఆ చోటికి చేరుకుంటాము. అక్కడ ప్రకాశిస్తుండే జీవన జ్వాల లో ప్రవేశించి బయటికి వచ్చాక నువ్వూ నా వంటి వాడివే అవుతావు- అప్పుడు మనం భార్యా భర్తలం కావచ్చు – ఇంకొన్ని వేల ఏళ్ళు కలిసి జీవించవచ్చు , ప్రకృతి ఉన్నంతవరకూ ”

లియో సమాధానం గా ఏమన్నాడో వినబడలేదు . అతని అయోమయానికి ఆమె నవ్వి ,

” హాలీ, నీకూ ఇస్తాను ఆ వరాన్ని. తెలివైనవాడివి – నచ్చావు నాకు ”

” ధన్యవాదాలు ఆయేషా ! కాని అది నాకు వద్దు. అటువంటి శక్తి, మృత్యువుని నిజం గా ధిక్కరించగలిగేది – ఉన్నా దానితో నాకు పని లేదు. ఈ లోకం నాకేమంత మృదువు గా అనిపించటం లేదు. ఈ భూమి ది రాతి గుండె, ఇది తన పిల్లలకీ రాళ్ళే పెడుతోంది ఆహారంగా , పెంపకం పేరిట దెబ్బలే కొడుతోంది. ఈ మాత్రపు బ్రతుకుని అన్నేళ్ళు బ్రతకాలా ! ఉపశాంతిని ఇవ్వలేని జ్ఞానం లాగా అది వృధా. గతపు బరువుని మోసుకుందుకు ఈ ఒక్క జీవితమూ చాలులే. తీర్చే దారి లేనప్పుడు పొరుగు వారి ఇక్కట్లను మీదవేసుకోవటం దేనికి ? చచ్చిపోవటం కష్టం కాదని అనను గానీ వేల ఏళ్ళు  బ్రతికే ఉండటం ఇంకా కష్టం ” – అన్నాను.

” అలా అంటావా ? ఆలోచించుకో, ఇంకా సమయం ఉందిలే ”

తర్వాత మా సంభాషణ లో మాకు లియో తండ్రి అందజేసిన మట్టి పలక ప్రస్తావన వచ్చింది. ఆయేషా కళ్ళు ఆశ్చర్యం తో విప్పారినాయి . నాతో అంది – ” చూడు, నేను చెప్పలేదా ? కాలాంతరాలలో చెడు లోంచి మంచీ మంచి లోంచి చెడూ పుట్టవచ్చునని ? ఏ అమెనార్టస్ నా కాలిక్రేటస్ ని నాకు కాకుండా చేసిందో , ఆమే తన స్వహస్తాలతో అతను నన్ను తిరిగి చేరగల దారిని రాసిపెట్టింది. ఆమె కారణం గానే నేను అతన్ని చంపుకున్నాను, ఇప్పుడు ఆమె వల్లనే , ప్రపంచం లో ఇంకెవ్వరూ ఇవ్వలేనిది నాకు తిరిగి వచ్చింది.

నీ ఆ ‘ తండ్రి ‘ ని చంపినందుకు ఆమె పగ తీర్చుకొమ్మని రాసింది కదూ ? కాలిక్రేటస్ – ఇక్కడ తండ్రివీ నువ్వే, కొడుకువీ నువ్వే. ఆ పురాతనమైన భార్యదో తల్లిదో – ఆదేశాన్ని పాటించాలని నువ్వు అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను చంపేసి ఆనందంగా నీ ప్రపంచం లోకి తిరిగి వెళతానంటే అలాగే కానీయి ” – మోకాళ్ళ పైన కూలబడి తన వస్త్రాన్ని మెడ కింద పక్కకి తప్పించింది – ” ఇక్కడ పొడిచేయి, చచ్చిపోతాను ”

లియో ఆమెని లేవదీశాడు.

 

” అయేషా – నిన్ను నేను చంపలేను, నీకు తెలుసు. నువు నిన్న రాత్రి చంపేసిన స్త్రీ కోసం కూడా నిన్ను చంపలేను – ఆ తర్వాత నేను బ్రతకలేను. నీకు తెలుసు ”

ఆమె లేచి చిరునవ్వు నవ్వింది . ” నన్ను కొద్దిగా ప్రేమించటం మొదలుపెట్టావులే కాలిక్రేటస్. ఆ- మీ దేశం గురించి చెప్పు. చాలా గొప్పదని చెప్పాడు హాలీ. మనం ఇక్కడ చేయవలసింది పూర్తయాక అక్కడికే వెళ్ళి ఉందాం ఇద్దరం. నేను మార్గం వెతుకుతాను. ఈ నికృష్టులకీ ఈ దౌర్భాగ్యపు గుహలకీ ఎప్పుడెప్పుడు దూరం గా వెళ్ళిపోతానా అని ఎన్ని వందలేళ్ళు గా కలలు కంటున్నానో ! మనం ఇంగ్లండ్ నే ఏలవచ్చు, ఈ అసహ్యమైన నేల ఎందుకు మనకి ! ”

” మాకు ఒక రాణి ఉన్నారు కదా అక్కడ ” – లియో చటుక్కున అనేశాడు.

”ఉందా- సరేలే.  ఆమెని దించేయవచ్చు- అదెంత పని ! ”

మేము నిర్ఘాంత పోయి , తేరుకుని వివరించాము – మా ప్రాణాలు పోయినా అటువంటి పని చేయమని.

” చాలా వింతగా ఉందే ” ఆయేషా విస్తు పోయింది. ” ఒక రాణి మీద ప్రజలకి ఇంత ప్రేమ ఉంటుందా ? నాకు తెలియకుండా చాలా జరిగిపోయినట్లుందే ”

పాలకుల స్వభావం లో చాలా మార్పు వచ్చిందనీ , మా రాణి ని  ఆమె [ క్వీన్ విక్టోరియా ] పాలించే సువిశాల భూభాగమంతటా ఉన్న సజ్జనులు అలాగే అభిమానిస్తారనీ వివరించాము. అసలు పరిపాలన చట్టసభ ల ద్వారా జరుగుతుందనీ ఆ సభ్యులని ప్రజలే ఎన్నుకుంటారనీ – వారిలో నిరక్షరాస్యులూ అజ్ఞానులూ అయిన ప్రజలు కూడా ఉంటారనీ చెప్పాక -

ఆమె పెదవి విరించింది . ” ప్రజాస్వామ్యాలా ? అవెక్కడ నిలబడతాయిలే. వాటికొక సొంత తీరూ తెన్నూ ఉండవు – నియంత ఎవడో పుట్టుకొస్తాడు త్వరలోనే ”

కొన్ని దేశాల్లో నియంతలూ ఉన్నారని చెప్పాను

” అయితే ఇంకేం ! ఒకణ్ణి దింపేసి నాశనం చేసి అక్కడ లియో ని కూర్చోబెడితే సరి ”

‘ ఏదేమైనా ‘ ఇంగ్లండ్ లో చట్టాలూ న్యాయాలూ కట్టుదిట్టంగా అమలు జరుగుతుంటాయని హెచ్చరించాను.

” చట్టాలా – అవి నాకు లేవు, కాలిక్రేటస్ కీ అక్కర్లేదు. చూద్దాం లే. ఇప్పటికి వెళ్ళండి. నేను ప్రయాణానికి తయారు కావాలి.  మీ నౌకరు ని కూడా తెండి. ఎక్కువ సామాను వద్దు – మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అప్పుడు, తీరిక గా – ఈ కోర్ స్మశానాలని వదిలివెళ్ళే ప్రణాళిక వేస్తాను ”

ఈమె ఇంగ్లండ్ బయల్దేరి వస్తే ఎలాంటి సమస్యలు వచ్చిపడతాయో !! ఇంత శక్తి వంతురాలు తన ప్రభావాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఉపయోగించగలదా ? ఆమె ఆత్మవిశ్వాసం ఎవరికైనా అణిగి ఉండనిస్తుందా ? ఎదిరించిన వారందరినీ నాశనం చేయక ఊరుకుంటుందా ? ఇంగ్లండ్ నీ దాని పాలిత దేశాలనే కాదు, భూమినంతటినీ ఏలకుండా ఆగుతుందా ? అసలు , ఈమె సహజమైన చావు ను నిరవధికం గా వాయిదా వేసింది గాని ప్రమాదాలూ ఉత్పాతాలూ ఈమెనేమీ చేయకుండా ఉంటాయా ? ఇందాక చంపమంది కదా, లియో పొడిస్తే చనిపోయి ఉండేదా ? తెలియదు.

ప్రపంచాన్ని ఒక దారిలోకి తీసుకు వచ్చేందుకు విధి ఈమెని వాడుకుంటుందేమో ! ఈమె కావాలని హాని చేసే క్రూరురాలు కాదు, అంతులేని వివేకమూ విజ్ఞానమూ ఉన్నది – అఖండమైన శక్తి ఉంది గనుక అతి గొప్ప ఏలిక అవుతుందేమో , ఈమె ద్వారా లోకానికి మంచి రోజులు వస్తాయేమో !

[ ఇంకా ఉంది ]