[ జనవరి సంచిక తరువాయి ]
మర్నాడు పొద్దుటే లియో బాగోగులు చూశాక జాబ్, నేను స్నానాలు చేసి శుభ్రమైన దుస్తులు వేసుకున్నాం. మా సామాను లో చాలావరకూ, తుఫాను వచ్చే ముందే, చిన్న పడవలోకి చేరవేసి ఉండటం వల్ల మాకు దక్కాయి. పెద్ద పడవలో ఇక్కడి జనం కోసమని తెచ్చిన కానుకలూ అవీ మాత్రం మొత్తం పోయాయి. ఇంచుమించుగా మా బట్టలన్నీ దిట్టమైన ఫ్లానల్ గుడ్డతో తయారైనాయి.ఇక్కడంతా పగలేమో మండిపోయే ఎండ, రాత్రులు వొళ్ళు కొంకర్లు పోయే చలి – రెంటికీ ఫ్లానల్ అనువైనదే. పైగా అవి కాస్త బరువు తక్కువే అనాలి – నా నార్ ఫోక్ జాకెట్, చొక్కా, పంట్లాం – మూడూ కలిపి కేవలం నాలుగు పౌండ్ ల బరువే ఉన్నాయి, ఈ వేడిలో ప్రతీ ఔన్సు బరువూ ఎక్కువే అవుతుంది గదా మరి!
అలా ఒళ్ళు తోముకుని ఉతికిన బట్టలు వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో దాదాపు మర్చేపోయాను , నా ఉల్లాసానికి సబ్బు బిళ్ళ లేకపోవటమొకటే లోటు.
ఏ మాటకామాటే చెప్పాలి, అమహగ్గర్ వాళ్ళు కూడా స్నానాలు చేసి శుభ్రపడ్డారు. కాల్చిన మట్టిని వాళ్ళు సబ్బు కి బదులు ఉపయోగిస్తారట – ముట్టుకుంటే అదొకమాదిరిగా ఉంటుంది గాని దాంతో మురికి బాగానే వదులుతుంది.
తల దువ్వుకుని, బొత్తిగా జీబురుగా పెరిగిపోయిఉన్న గడ్డాన్ని సాఫు చేసుకున్నాను. విపరీతంగా ఆకలేసేసింది. నా గుమ్మానికి అడ్డుగా కట్టిన తెర తొలగించి ఒక అమ్మాయి ప్రవేశించింది. చేసైగలతో భోజనం సిద్ధంగా ఉందని చెబితే ఆవురావురుమంటూ ఆ వెనకే వెళ్ళాను. ఇక్కడ మొత్తం మనుషులందరూ మూగవాళ్ళే కాబోలు – జాబ్ నీ మరొక మూగపిల్ల అక్కడికి తీసుకొచ్చి కూలేసింది. అతను మహా ఇబ్బందిగా ముడుచుకుపోతూ వచ్చాడు – ఇదివరకొక అమహగ్గర్ ఆడామె ప్రదర్శించి ఉన్న వలపు అతన్ని ఇంకా భయపెడుతున్నట్లే ఉంది.
నేనతన్ని వినోదంగా చూస్తుంటే ఉడుక్కుని – ” అయ్యా, వీళ్ళేమంత మర్యాదస్తుల్లా లేరండి ” అని వక్కాణించాడు.
ఆ భోజనశాల మా గదుల గుహకి రెట్టింపు విశాలంగా గా ఉంది. ఇప్పుడంటే ఇలా వాడుతున్నారు గాని ఇదొకప్పుడు శవాలను అలంకరించే చావడి అయిఉండాలి – నాకు ఆధారాలు కనిపించాయి.
గుహ గోడల వారగా రాతిని పొడుగ్గా బల్లల్లాగా తొలిచారు , మనుషులు కూర్చుందుకు వీలుగా మోకాళ్ళు ఆనేచోట్ల పల్లంగా ఉన్నాయి అవి. అక్కడ కూర్చున్నవారు భోజం చేసేందుకు మరొక రాతిని సన్నగా పొడుగ్గా అమర్చారు- అయితే ఇది మేము కూర్చున్న వైపున మటుకే. ఆ వైపున నిలువుగా మూడు నుంచి ఆరడుగుల పొడవున విడి విడి రాతి పలకలు మూడడుగుల ఎత్తున ఉన్నాయి. పడుకోబెట్టిన మనుషుల [శవాల ] తలలూ , పృష్ఠ భాగాలూ ఆనేలాగా మలిచి పెట్టారు వాటిని. శవాలకి స్నానం చేయించినప్పుడు నీరు కిందికి వెళ్ళిపోవటానికి చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇవి కాక గోడల మీద మృత్యు దృశ్యాలని వైన వైనాలుగా చెక్కారు. ఆ శిల్పాలలో ఎవరో రాజు వంటి మనిషి చనిపోబోతున్నట్లూ , చుట్టూ స్త్రీలూ పిల్లలూ చేరి దుఃఖిస్తున్నట్లూ ఉంది . అనంతరం అతని శరీరానికి స్నానం చేయించి లేపనాలు పూయటం కనిపిస్తోంది – ఇక్కడ వింతేమిటంటే ఆ కార్యక్రమం లో పాల్గొంటున్న ఆడా మగా మొహాలకి ముసుగులు వేసుకుని ఉన్నారు – కళ్ళు మటుకే కనిపిస్తున్నాయి. అది చాలక ఒకచేత్తో ముక్కులు మూసుకుని ఉన్నారు , కారణం ఊహించలేకపోయాను. ఆ తర్వాత, ఆ శరీరం మేము రాత్రి నిద్రించిన గుహ వంటి గదిలో, అటువంటి రాతి మీదనే. తల దగ్గరా పాదాల దగ్గరా దీపాలు వెలిగించి ఉన్నాయి. రెండు పక్కలా నేను ఇదివరకు చెప్పిన అందమైన కూజాలు – రకరకాల పరిమాణాలలోవి, ఉన్నాయి – ఆ మరణించిన వ్యక్తి [మళ్ళీ బతికాక ] ఉపయోగించవలసిన పదార్ధాలేవో నింపి ఉంటారు వాటిలో. ఒక మనిషి చేతిలో ఏదో సంగీతవాద్యాన్ని పట్టుకుని గానం చేస్తున్నాడు, మరొకడు పొడుగాటి దుప్పటి వంటి బట్టని రెండు చేతులతోనూ పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో తరాల వెనక అంతరించిన నాగరికత కి ఆనవాళ్ళు ఇవి, ఇప్పుడు ఈ అడవి జాతివారి పాలయినాయి. మృత్యు దృశ్యాలన్నమాటని మినహాయిస్తే ఆ శిల్పాల పనితనం అద్భుతంగా ఉండింది, నా ఈ వర్ణన వాటికి ఏ మాత్రమూ న్యాయం చేయలేదు. ఒకవేళ బతికి బయటపడి నేను ఇదంతా చెబితే కేంబ్రిడ్జ్ లో నా తోటి పురావస్తు పరిశోధకులూ అధ్యాపకులూ అతిశయోక్తుల కింద కొట్టి పారేస్తారేమో – చరిత్రలో ఏ అపూర్వమైన ఆవిష్కరణ అయినా ఆధారాలు లేనప్పుడు అలాగే తోస్తుంది కదా.
మా భోజనం బావుంది – శుభ్రంగా కడిగిన కొయ్య పళ్ళాలలో వడ్డించారు. ధాన్యపు సంకటి ముద్దలు, చక్కగా పక్వమైన మేక మాంసం, తాజా గా తియ్యగా ఉన్న పాలు. తినటం పూర్తయాక లియో ఎలా ఉన్నాడో మళ్ళీ వెళ్ళి చూడాలనుకున్నాం. మేము వెనుదిరుగుతున్నప్పుడు బిలాలీ – మేము ఆట్టే ఆలస్యం చేయకుండా రాజ్ఞిని దర్శించవలసి ఉందని ప్రకటించాడు. లియో పరిస్థితి చూస్తే ఏమీ బావున్నట్లు లేదు. అతను మగత నుంచి మేలుకుని పలవరిస్తున్నాడు – కేంబ్రిడ్జ్ పడవ పందాలలో పోటీ చేస్తున్నట్లుగా. పడుకున్నవాడు విసురుగా లేచి వెళ్ళబోతూంటే , పాపం – ఉస్తేన్ అతన్ని బలవంతాన పట్టుకు ఆపుతోంది. నేను అతన్ని పేరు పెట్టి పిలిచి, బాధని దిగమింగుకుంటూ లాలనగా పలకరించాను – కొంత శాంతించి, మరొక మోతాదు క్వినైన్ ని లోపలికి పోనిచ్చాడు.
మళ్ళీ మగత లోకి పడిన అతని పక్కనే కనిపెట్టుకుని ఒక గంట సేపు ఉండిపోయాను – ఉస్తేన్ కి మాత్రం నిద్రాహారాలు అవసరం ఉండవా ? ఆమె విశ్రాంతి తీసుకునేందుకు నిరాకరించింది గాని, కనీసం భోజనమైనా చేసి రమ్మని పంపించాను. చూస్తుండగానే గుహ లో వెలుగు తగ్గిపోయింది, బయట పొద్దు కుంకినట్లుంది. ఆ కను చీకట్లో , మేము దిండుగా అమర్చి పెట్టిన నల్లటి కంబళి మీద , లియో ముఖం స్పష్టంగా కనిపించటం లేదు – తల చుట్టూ బంగారు రంగు ఉంగరాల జుట్టు మటుకే మెరుస్తోంది. అప్పుడు బిలాలీ అక్కడికే వచ్చి రాజ్ఞి నన్ను చూసేందుకు అక్కడికే రాబోతోందనీ, అది ఎంతో కొద్ది మందికే ప్రాప్తించే అదృష్టమనీ గొప్పగా చెప్పాడు – నేను పెద్దగా స్పందించనందుకు కాస్త నొచ్చుకున్నట్లున్నాడు కూడానూ. ఎంత మహిమాన్వితురాలైనా అవనీ – ఈ అనాగరికుల రాణిని చూడాలని నాకేమీ కుతూహలం లేదు, పైగా నా ధ్యాసంతా లియో మీదే ఉందాయె. బయటికి వెళుతున్నప్పుడు నేల మీద ఏదో పచ్చగా ప్రకాశిస్తూ కనిపించింది. చూస్తే అది – లియో తండ్రి దాచబెట్టిన పురాతనపు సరంజామా లోది, scarab ఆకారం లో చెక్కబడి ఉన్న మణి, దాని పైన ‘ సూర్య సుతుడైన రాజాధిరాజు ‘ అనే అక్షరాలు. దాన్ని ఉంగరం లో పొదిగించి లియో ధరిస్తూండేవాడు – ఈ జ్వరపు సంధిలో గింజుకుంటున్నప్పుడు జారిపోయిఉంటుంది. అక్కడే వదిలేస్తే ఎవరైనా తస్కరిస్తారేమోననిపించి , నా చిటికిన వేలికి పెట్టుకుని బయల్దేరాను. ఉస్తేన్ అప్పటికి వచ్చేసి ఉంది, జాబ్ ని ఆమెకి తోడుగా అక్కడే ఉండమన్నాను.
మా గదుల బయటి నడవా దాటి వెలుపలికి వచ్చేసి, పక్కనే ఉన్న మరొక ద్వారం వైపుకి వెళ్ళాము. ఇద్దరు భటులు అటూ ఇటూ – కదలకుండా, విగ్రహాల్లాగా నిలబడి ఉన్నారు. మేము దగ్గరికి వెళ్ళాక గౌరవ సూచకంగా తలలు వంచి, చేతుల్లో ఉన్న ఈటె లని మంత్రదండాలకి మల్లే మా నుదుళ్ళకి ఆనించారు. లోపల అంతా మేమున్న భాగం లాగే కనిపించింది గాని , అడుగడుగునా దేదీప్యమానం గా వెలిగే దీపాలు వెలిగించి ఉన్నాయి. నలుగురు మూగ మనుషులు – ఇద్దరు ఆడ, ఇద్దరు మగ – మాకు స్వాగతం లాంటిది చెప్పారు. అటూ ఇటూ మేముండిన గదుల వంటివే – వాటికి పట్టు పరదాలు . అవి రాజ్ఞి చెలికత్తెల నివాసాలని ఆ తర్వాతి కాలంలో తెలుసుకున్నాను. ఇంకాస్త ముందుకి వెళితే మరొక ద్వారం- అక్కడితో ఆ గుహ అంతమైనట్లుంది. ఇక్కడ మరొక ఇద్దరు భటులు – వీరి దుస్తులు ఇంకొంత మేలిరకంగా ఉన్నాయి. వాళ్ళూ పక్కకి తప్పుకున్నాక – చతురస్రంగా , నలభై అడుగుల పొడవు వెడల్పుల తో ఉన్న పెద్ద చావడిలోకి ప్రవేశించాము. ఏడెనిమింది మంది అమ్మాయిలున్నారు అక్కడ , అందరూ పసుపుపచ్చని కేశాలతో చాలా అందగత్తెలుగా కనిపించారు. వీళ్ళూ మూగవాళ్ళే – దంతపు సూదులతో చేతుల్లోని బట్ట మీద కుట్టుపని చేస్తున్నారు – ఆశ్చర్యం ఏమిటంటే , ఇంగ్లండ్ లో వాడే కుట్టు పని చట్రాల వంటివే ఆ బట్టలకీ బిగించి ఉన్నాయి. ఈ చావడికి ఒక చివరన మరింకొక ద్వారం. దీనికి బరువుగా వేలాడే పరదా పైన , ఎక్కడా సందులేకుండా , బంగారు వెండి రంగుల దారాలతో జరీపని చేసి ఉంది – ఇంచుమించుగా, తూర్పు దేశాల రాజభవనాలలో చూసే తివాచీ పరదా[tapestry] వంటిది ఇది. అటూ ఇటూ నిలుచున్న సౌందర్యరాశులు అతిమర్యాదగా తలలు వంచుకుని , పరదాని పక్కకి తప్పించి పట్టుకున్నారు. బిలాలీ హఠాత్తుగా నేల మీద కూలబడిపోయి, తన పొడుగాటి గడ్డం నేల మీద జీరాడుతుండగా, మోకాళ్ళ తోనూ మోచేతులతోనూ లోపలికి పాకటం మొదలు పెట్టాడు. మామూలుగా రెండు పాదాల మీదా నడుస్తున్న నన్ను కంగారు గా చూసి, ” మోకరిల్లు, మోకరిల్లు బిడ్డా ! అలాగే ముందుకి కదులు. రాజ్ఞి సమక్షం లో వినయం ఆవశ్యకం, లేదంటే సర్వ నాశనం ” అని గుసుగుసగా హెచ్చరించాడు.
నాకు కొంచెం భయం వేసింది, దాదాపుగా కూలబడబోయానుగాని – బ్రిటిష్ పౌరుడినైన నేను ఎవరో అపరిచితురాలి ముందర సాగిలబడమేమిటనిపించింది, ఆగాను. కాకపోతే, అతినెమ్మదిగా పాకుతూన్న బిలాలీ వెనకాల అడుగులు వేయటం కూడా కష్టంగానే ఉంది- అడుగు నేలమీద మోపే ముందర గాలిలో చాలాసేపు [ అలా అనిపించింది ] నిలిపి ఉంచుకోవలసి వచ్చింది. వెళ్ళవలసింది చాలా దూరమనీ తోచింది -పాపం చాలాసార్లు బిలాలీ ని తన్నేయబోయాను కూడా. సంతకి పందులని తోలుకుపోతున్నవాడిలాగా నాకు నేను అనిపించి , ఆపుకోలేనంత నవ్వు వచ్చింది…ఆపుకునే ప్రయత్నం లో ముక్కు గట్టిగా ఎగబీల్చాను – బిలాలీ గాభరాగా ” అయ్యో, ఉష్షు, ఉష్షు ” అంటున్నాడు.
ఎట్టకేలకి , మేము చేరవలసిన చోటికి చేరాం. బిలాలీ బోర్లా పడుకుని చేతులు ముందుకి చాచి ఉండిపోయాడు. నేను ఏం చేయాలో తెలియక నిలుచుండి పోయాను …అక్కడి పల్చని పరదాల వెనక నుంచి నన్నెవరో గమనిస్తున్నట్లు తెలిసింది- ఎందుకో వెన్ను జలదరించింది. ఆ చోటు చాలా ఏకాంతంగా , కాదు ఒంటరి గా అనిపించింది. ఊగుతూన్న ఆ పట్టు తెరలూ మెత్తగా వెలుగుతూన్న దీపాలూ ఎవరో అక్కడ ఉన్న ధైర్యానికి బదులుగా భయాన్ని కలిగిస్తున్నాయి. అంతా నిశ్శబ్దం…ప్రాణం లేనట్లుగా పడుకుండిపోయిన బిలాలీ. పట్టు తెరల అవతలినుంచి ఏదో విచిత్రమైన పరిమళం …దిగులు దిగులుగా నేను నిలుచుండిన చోటికి తేలివస్తోంది. నిమిషం తర్వాత నిమిషం గడుస్తూంది- ఎవరూ రాలేదు, ఏమీ కాలేదు. ఇదీ అని చెప్పలేని భీతి నన్ను ముంచెత్తింది, ముచ్చెమటలు పట్టేశాయి.
లోపల ఏదో కదలిక. నా బుర్రలో అసంబద్ధమైన ఆలోచనలు. ఎవరు ఆ వెనకన ఉన్నది ? ఇంచుమించు నగ్న అయిన అనాగరికుల రాణి ? వడలి బడలిపోయిఉన్న ప్రాగ్దేశపు యువరాణి ? సాయంత్రపు టీ సేవిస్తున్న నాగరిక మహిళ ? అక్కడ ఎవరుండినా ఆశ్చర్యం లేని స్థితి.
మంచులాగా తెల్లగా సుకుమారంగా ఉన్న చేయి పరదాని తొలగిస్తోంది. పొడవుగా కొనలుదేరిన వేళ్ళు, వాటి చివరన సంజ ఎరుపు గోళ్ళు. ఒక కంఠం వినబడింది…మృదువైన వెండి జలతారు లాగా, పాలరాతి గులక పైన ప్రవహించే వాగు లాగా.
” పరదేశీ ! ” అది అరబిక్ భాషే, కాని కావ్యాలలో వినిపించే స్థాయిది. ” ఎందుకు ఆ భయం నీకు, దేని వలన ? ”
ఎంత భయం పుడుతున్నా పైకి తేలకుండా ఉన్నాననే అనుకున్నాను గాని, ఈ ప్రశ్నకి బొత్తిగా కిందా మీదా అయిపోయాను. జవాబు ఆలోచించుకునే లోపున, నా ముందర ఒక పొడుగాటి ఆకృతి. మనిషి అని నేను ఎందుకు అనటం లేదంటే ఆశరీరమూ ముఖమూ కూడా తెల్లటి బట్ట తో పొరలు పొరలుగా ఆచ్ఛాదించబడి ఉన్నాయి – నాకెందుకో తెల్ల మస్లిన్ బట్ట తో చేసే శవాలంకరణ స్ఫురించి హడలు పుట్టింది. నిజానికి అలా అనుకుందుకు ఏమీ ఆస్కారమే లేదు, ఆ పల్చటి ముసుగులోంచి గులాబివన్నె దేహం తెలుస్తూనే ఉంది, అయినా ఎందుకో…! లోకాతీతమైనదేదో తట్టిన నా భయం పెచ్చు మీరిపోయి నెత్తి మీది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
కాని – అందాన్ని గుర్తించే శక్తి పరిపూర్ణంగా ఉన్న నా దృష్టికి అక్కడొక అద్భుత లావణ్యరాశి ఉందని తెలియకపోలేదు. ఆ కదలిక లో – మనుషులలో నేనెన్నడూ చూడని హొయలు – మెలిదిరిగే సర్పానికి మల్లే… ముంజేతినో పాదాన్నో కదిలించినప్పుడు ఆ దేహం మొత్తంగా చలించిపోతోంది…ఆ మెడ వంగటం లేదు, వంపు తిరుగుతోంది.
” ఎందుకు భయపడుతున్నావు పరదేశీ ? ” – ఆమె తిరిగి ప్రశ్నించింది. ఈ సారి – గుండె శరీరం లోంచి విడివడిపోతుందేమోననిపించింది, మధుర తర సంగీతాన్ని విని భరించలేనట్లుగా. ” నాలో ఒక మానవుడిని భయపెట్టేదేముందో మరి, మనుష్య ప్రవృత్తి ఈ మధ్యన మారిపోయినట్లుందే ” – ఆమె ఒక ఒయ్యారం తో పక్కకి తిరిగి చేతిని ముందుకు చాచింది.ఆ తుహినాంబరాల మీంచి , అతి చక్కని పాదరక్షలు తొడిగిన అడుగుల వరకూ- అతి నల్లని కుంతలరాశి అలలు అలలుగా.
” రాజ్ఞీ , నన్ను భయపెడుతూన్నది మీ సౌందర్యమే ” – తట్టిన మాటలు అన్నాను. బోర్లా పడుకునే ఉన్న బిలాలీ గొణిగాడు – ” బాగా చెప్పావు బిడ్డా, సరిగా చెప్పావు ”
” ఆహా, పురుషులు స్త్రీలని ఇంకా మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు ! నువ్వు భయపడింది – తెర వెనకనుంచి నిన్ను తరచే నా చూపు వలన- కాదూ ? పోనీలే , మర్యాద మీరకుండా అన్నవి నీ ఈ మాటలు, స్త్రీ ని కదా- క్షమిస్తాలే. ఈ అరణ్యాల్లొకీ గుహల్లోకీ ఎందుకు వచ్చినట్లు ఇలాగ ? దారిలో ఆ బురద నేలలూ అడవి మనుషులూ, మరణించిన వారి నీడలూ …ఏం చూద్దామని వచ్చారు ? ప్రాణాలు మీకు అంత చవకా ఏమిటి – హీయా అరచేతిలో ఉంచేందుకు ? నేను మాట్లాడుతూన్న భాష నీకు తెలిసింది ఎలాగ – ఇంతటి ప్రాచీనమైనది ? ఇంకా ఆ ప్రపంచం లో దీన్ని మాట్లాడే మనుషు లున్నారా ? నేనీ పర్వతాలలో గుహాంతరాలలో- మనుషుల తీరు తెన్నులేవీ తెలియవు నాకు, తెలుసుకునే ఇచ్ఛా లేదు. నేనున్నది నా స్మృతులలో , ఆ స్మృతులున్నది నాకు నేనై తవ్వుకున్న సమాధిలో ” – ఆ తియ్యటి గొంతు కొద్దిగా జీరబోయి శృతి తప్పింది. తెప్పరిల్లే ప్రయత్నం లో తన ముందర సాగిలబడిన బిలాలీ ని చూసి సర్దుకుంది.
” ఆ- వృద్ధుడా , ఏమిటి విషయం ? నీ ఇంట్లో ఈ అతిథుల మీద దాడి ఎలా జరిగింది ? ఆ తుచ్ఛులకి వీళ్ళని ఉడకబెట్టి తినాలనుకునే ధైర్యం ఎలా వచ్చింది , ఏం అలుసిచ్చావు నువ్వు ? వీళ్ళు వీరోచితంగా పోరాడి ఉండకబోతే ఏమయి ఉండేది ? దేహాన్ని వదిలిన ప్రాణాన్ని వెనక్కి లాగటం నా వల్ల కూడా అవదు…చెప్పు, ఏం చేయమంటావు నిన్ను , ఏ శిక్ష విధించమంటావు ? ”
ఆమె కంఠం లో ఆగ్రహం ఆ రాతి గోడల మీద స్పష్టంగా, క్రూరంగా ప్రతిధ్వనించింది. భయమన్నది ఎరగడనిపించే ధీరుడు బిలాలీ కంపించిపోయాడు.
” హీయా ! మహారాజ్ఞీ !! నీ ఘనత వంటిదే నీ దయ కూడా… శాంతించు ! దాసుడిని , కరుణించు ! అది నా అపరాధం కాదు , నాకు తెలిసి జరగలేదు. వీరితో నౌకరుగా వచ్చిన నల్లవాడి గురించి ఏ మాటా చెప్పబడలేదని – వాడిని తినేందుకు మాత్రమే ఆ ధూర్తులు పూనుకున్నారు. అప్పుడు ఈ పరదేశులు ఆ పని తలపెట్టిన ఆడదాన్ని చంపారు, అనుకోకుండా వీరి నౌకరునీ వీరే చంపేశారు. నోటి ముందు కూడు పోయిన నా తెగ వాళ్ళు రక్త దాహం తో పిచ్చివాళ్ళై వీరి పైకి కలబడ్డారు. వీరు పరాక్రమం తో పోరాడి ఆ నికృష్టులని ఎంతమందినో సం హరించారు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న నేను మిగిలి ఉన్నవాళ్ళందరినీ బంధించి నీ చెంతకి తెచ్చాను, నీ తీర్పు కోసమే ! నా పైన దయదలచు ”
” ఆ విషయం నాకు తెలుసులే, రేపు ఉదయం దర్బారు లో వాళ్ళని విచారిస్తాను. నిన్ను – ఇప్పటికి క్షమించమంటావా ? ఇక పైన నీ ఇంటిని శ్రద్ధగా దిద్దుకోగలవా మరి ? ”
” చిత్తం, చిత్తం ” – బిలాలీ మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ మళ్ళీ మూడుసార్లు నేల మీద నుదురు తాటించి మోకరిల్లాడు. ఆ పైన వెనక్కి వెనక్కి పాక్కుంటూ అక్కడినుంచి బయటపడ్డాడు , నన్నొక్కడినీ ఆ బీభత్సమోహనమైన సమక్షం లో వదిలేసి.
[ ఇంకా ఉంది ]
**** (*) ****
ఎట్టకేలకు రాజ్ఞి బయటపడింది. ఈ భాగం లో కథనం కూడా పాలరాతి తిన్నెపై ప్రవహించే వెన్నెలవాగులా చాలా అందంగా ఉంది.
థాంక్ యూ అండీ ..అవును, ఎట్టకేలకు !
అద్భుతం మైథిలీ Mam ..!రాజ్ఞి పరిచయం మహత్తరంగా ఉంది. రాజ్ఞీ ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? లియో ఉంగరం తన చిటికిన వేలికి పెట్టుకున్నందుకు మరేదైనా ప్రమాదమో హెచ్చరికో రానుందా? ఈ సశేషం తో మమ్మల్ని కూడా “….. బీభత్సమోహనమైన సమక్షం లో వదిలే శారు ” మీరు తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాం TQ
” alone with this terrible but most fascinating person ”
ఇదీ ఆ మాటల మూలం…థాంక్ యూ సో మచ్ రేఖా
రేఖ గారు అన్నట్లు .. ఈ సశేషం తో మమ్మల్ని కూడా “….. బీభత్సమోహనమైన సమక్షం లో వదిలేశారు
థాంక్ యూ సురేష్
అనువాదము రచయితని బాగా ఆకళింపు చేసికొని వ్రాసినట్లు వుంది. ఇటువంటి అనువాదాలు ఇంకా రావాలి.
థాంక్ యూ అండీ