అనువాద నవల

రాజ్ఞి – పదిహేనవభాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

సెప్టెంబర్ 2016

యేషా చెప్పిన చోటికి బయలుదేరుతున్నాము. మా సామాన్లు సర్దేందుకు ఎక్కువ శ్రమ తీసుకోలేదు. తలా ఒక జత అదనపు దుస్తులూ అదనపు బూట్ లూ. ఇవి కాక రివాల్వర్లూ  తుపాకులూ. తుపాకి మందు మాత్రం పుష్కలం గా సర్దాము – ఇదివరకటి చాలాసార్ల లాగే ఇప్పుడూ అది మా ప్రాణాలని కాపాడుకొచ్చింది.

ఆయేషా చెప్పిన సమయానికి కొద్ది నిమిషాల ముందరే ఆమె గది ముంగిట సిద్ధమయాము. ఆమె అప్పటికే పూర్తిగా సంసిద్ధురాలై ఉంది – తన  తెల్లని పల్చని దుస్తులపైన పొడుగాటి నల్లని కోటు ని నిలువునా కప్పుకుని.

” సాహస యాత్ర కి అంతా తయారేనా ? ”- అడిగింది.

” ఆ. పూర్తిగా. నా వరకు నాకైతే ఇందులో కొంచెం కూడా నమ్మకం లేదు ” – బదులు చెప్పాను.

” అబ్బా, హాలీ ! నువ్వూ నీ నమ్మకాలూ !! పాతకాలపు యూదు ప్రజ లకి ఉండిన  లాంటివి నీ విశ్వాసాలు. తమకి తెలియని జ్ఞానమొకటి ఉంటుందని మనసులో అనుకుందుకే వాళ్ళు మొండికేసేవారు – ఆ జనాన్ని ఇప్పుడు తలచుకున్నా  చిరాకు పుడుతుంది. నువే చూస్తావుగా- ఈ నా దర్పణం చెప్పేది అబద్ధమేమో – ” – నీరు నింపిన తన స్ఫటికపు కూజా వైపు చూపించింది. ” ప్రాచీనకాలం లో లాగే ఈ రోజూ ఆ మార్గం తెరుచుకునే ఉంది. పదండి వెళదాం – ఇక్కడి నుంచి , ఎక్కడికో చూద్దాం . ‘’

మా గుహ ముందర ఒకే పెద్ద పల్లకీ, బోయీ లుగా ఆరుగురు మూగవాళ్ళు. బిలాలీ కూడా ఉన్నాడు – ఎందుకోగాని ఆ నిమిషాన అతన్ని చూస్తే ప్రాణం లేచొచ్చింది. ఆ జుగుప్సా కరమైన శవాగారాల నీ మేము చూడవలసి వచ్చిన క్రూరమూ అమానుషమూ అయిన సంఘటనలనీ ఎంతెంత త్వరగా దాటేద్దామా అని ఉంది – అది ఇంకెక్కడికైనా సరే ! పల్లకీ ఆయేషా కి మాత్రమే  - మమ్మల్ని నడిచే రమ్మంది – అది అంతకన్నా బావుంది మాకు. ఇంచుమించు  శవప్రాయులు గా అన్నాళ్ళు గడిపాక కాలు సాగించి ముందుకు పోవటం కొత్తగా బ్రతికి ఉన్నట్లనిపించింది.

అతి శ్రద్ధగా, ఎన్నో తరాల తరబడి శ్రమించి నిర్మించిన ఆ కోర్ జాతి గుహలని ఆఖరిసారిగా అవలోకిస్తూ గబ గబా అడుగులు వేశాము.  మరకతశిల లాగానిశ్చలం గా  కనిపించే లావా సరస్సు , దాని నీటితో సాగు చేసి ఉండిన నేల , నీరు నిలిచి పోకుండా తవ్విన కాలువలు -  గొప్ప సాంకేతిక నైపుణ్యం వాళ్ళది , ఇవాళ కాలగర్భం లో కలిసిపోయి ఉండినా. సూయజ్ కాలువ, మాంట్ సెనిస్ సొరంగం వంటి ఆధునిక నిర్మాణాలు వీటి కి  ఎందులోనూ ఏ మాత్రమూ సరిపోవనే అనాలేమో.

కొండల మీంచి వీచే ఆ ఉదయపు గాలి చల్లగా హాయిగా ఉంది . ఒక అరగంట దూరం నడిచాక , కొండ వాలు కి కొన్ని ఫర్లాంగ్ ల దూరం లో కట్టిన నగరాన్ని బిలాలీ చూపించాడు. మేము మొదటిసారి చూస్తున్న ఆ శిథిలనగరం – ఈ రోజున మనం చూసే బాబిలోన్, థెబెస్ వంటి ప్రాచీన నగరాల కన్నా పెద్దదేమీ కాదు. దాదాపు పన్నెండు చదరపు మైళ్ళ చుట్టుకొలత లో ఉంటుంది. కోట గోడలూ మరీ ఎత్తైనవి కావు – భూమి లోకి కుంగిపోకుండా ఉన్న చోట్ల , నలభై అడుగుల ఎత్తు ఉంటాయేమో. దట్టమైన అరణ్యాలూ నరమానవుడు దాటి బయటపడలేని చిత్తడి నేలలూ – ఇవే ఆ నగరానికి నిజమైన రక్షణ , అందువల్ల ఆ గోడల ఎత్తు సరిపోతుందనుకొని ఉండాలి. కాకపోతే అవి చాలా మందం గానూ బలిష్ఠం గానూ ఉన్నాయి. చుట్టూ తవ్విన కందకం అరవై అడుగుల వెడల్పున ఉంది – కొన్ని చోట్ల అందులోని నీరు ఇంకా నిలిచే ఉంది.  ఆ కందకం మీది వంతెన ముక్కలు ముక్కలైపోయింది గాని ప్రయాస తో దాన్ని దాటి వెళ్ళగలిగాము. ఆ కర్ర వంతెన కి వాడిన కలప కూడా అంత  శ్రేష్ఠమైనదే అయి ఉండాలి బహుశా. క్రుంగుతూన్న సూర్యుడి  ఎర్రని సంధ్యకాంతి లో నేను దర్శించిన దాన్ని మాటల్లో పెట్టేందుకు నాకు శక్తి చాలదు. మైళ్ళకి మైళ్ళ విస్తృతి లో – ఎత్తైన స్తంభాలు, వేదికలు, ఆలయాలు, భవనాలు – అన్నీ మధ్య మధ్యన పెరిగిపోయి ఉన్న తుప్పలతో ఉండి కూడా అతి బ్రహ్మాండం గా ఉన్నాయి. ఏ నిర్మాణానికీ పై కప్పు లేదు ఇప్పుడు , కాని ఎన్నుకున్న శిల ఉత్తమమైనది, శిల్పుల సామర్థ్యం అమోఘమైనది – అంతా ప్రత్యక్షం గా కనిపిస్తోంది.

మాకు ఎదురుగా ఆ నగరపు రహదారి. గోడలకి వాడిన రాతినే దీనికీ వాడి ఎక్కడా సన్న సందు కూడా లేకుండా బిగించారు – అందుకని మట్టి చేరటమూ పిచ్చి మొక్కలు పెరగటమూ లేదు దీని మీద.  ఉద్యానాలకో విశ్రాంతి స్థలాలకో వదిలిన ప్రదేశాలు మాత్రం అరణ్యాల లా గా ఉన్నాయి ఇప్పుడు.  రహదారికి అటూ ఇటూ ఉన్న శిథిల భవనాలకి  మధ్యన విశాలమైన ఖాళీ వదిలారు – ఇంటి తోట కోసం కాబోలు, అక్కడా దట్టం గా పిచ్చి మొక్కలు. ఈ నగరం నిర్మానుష్యం కావటం శత్రువుల దండయాత్రల వలనా ప్రకృతి వైపరీత్యం వలనా జరగలేదు – అందుకని విధ్వంసపు ఛాయలు లేవు. ప్లేగ్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి వల్ల ఈ జనం చివరికంటా నశించారు – అదనులో సముద్రం మీదినుంచి తప్పించుకుపోయిన వారెవరో కొందరు తప్ప. కొన్ని వందల ఏళ్ళ నుంచీ ఇక్కడ మనుషులు సంచరించలేదు , అర్థమవుతోంది.

కాసేపటికి ఒక విశాలమైన చోటికి చేరాము. అదొక దేవాలయం అయిఉండాలనిపించింది. అక్కడి స్తంభాలు నలభై అడుగుల వ్యాసమూ డెబ్భై అడుగుల ఎత్తూ ఉన్నాయి. మధ్యలో సన్నగానూ పైకీ కిందికీ విప్పారుతూనూ చెక్కారు వాటిని. తూర్పు దేశాల పద్ధతిలో వాటిని స్త్రీ శరీరాన్ని సూచిస్తూ చెక్కారేమోననుకున్నాను గానీ ఆ తర్వాతి మా ప్రయాణం లో సరిగ్గా అటువంటి ఆకృతి లోనే ఉన్న వృక్షాలని చూశాను – ఆశ్చర్యం ! ఆ ప్రాంగణమంతా చిన్న చిన్న కూటాలకి లాగా విభజించబడి ఉంది -  ఒక్కొక్కటీ ఒక ఉపదేవత కి స్థావరం అయిఉంటుంది. ఎట్టకేలకి ఆ చోట ఆయేషా తన పల్లకీ దిగింది.

” కాలిక్రేటస్, ఇక్కడే ఒకచోట , విశ్రమించేందుకు అనువైన స్థలం ఉండాలి. ఆ నాడు నువ్వూ నేనూ ఆ ఈజిప్ట్ ఆడదీ అక్కడ నిద్రించాము. ఆ రోజునుంచీ నేనిక్కడ పాదం మోపలేదు – అది ఉందో, కూలిపోయిందో ” – అంటూనే ఒక వైపుకి వెళ్ళి చూపు సారించి చెప్పింది ఆయేషా – ” ఉంది. అలాగే ఉంది .” అదొక గుహ వంటి నివాస స్థలం. ఆయేషా  చేసైగ తో మూగవాళ్ళు చర చరా వెళ్ళి అక్కడంతా చేతయినంతమేరకి శుభ్రం చేశారు. ఆ సరికే వాళ్ళు  దివిటీ లు వెలిగించి ఉంచుకున్నారు. భోజనం ఏర్పాటయింది – నాకూ లియో కీ జాబ్ కీ మాంసం వడ్డించారు. ఆయేషా కి పిండితో చేసిన రొట్టెలు, పళ్ళూ , నీళ్ళూ.  ఎన్నాళ్ళబట్టో మాంసాహారం మానివేశానని చెప్పి ఉంది కదా మొదట్లోనే.  కొద్ది సేపట్లోనే – పర్వతాల వెనక నుంచి నిండు చంద్రుడు ఉదయించాడు , మా చుట్టూ వెండి వెన్నెల నిండిపోయింది.

” నిన్ను ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, కాలిక్రేటస్ ? ” ఆయేషా నిలుచుని ప్రశ్నించింది. ఆ వింత వెన్నెట్లో, పురాతన స్తంభాల మధ్యన ఆమె దేవతల రాణి లా ఉంది. ” నువ్వు కూర్చుని ఉన్న చోటనే ఆ రోజున నీ మృతదేహం పడి ఉంది, ఇక్కడి నుంచే నీ శరీరాన్ని కోర్ గుహలకి మోసుకు వెళ్ళాను – దుర్భరమైన స్మృతులే…కాని , గుర్తొస్తున్నాయి ”

లియో కి బెదురు పుట్టి , లేచి మరొక చోట కూర్చున్నాడు. ఆయేషా జ్ఞాపకాలు ఆమెకెలా ఉన్నాయో దేవుడెరుగు, లియో కి అవి ఏ మాత్రమూ ఆకర్షణీయం గా లేవు పాపం.

” కేవలం అందుకే కాదు , మనషులకు దుర్లభమైన అద్భుతదృశ్యాన్ని చూపించేందుకూ తీసుకు వచ్చాను నిన్ను. నీ భోజనం కానివ్వు ముందు – ఆ జీవ జ్వాల లో నిన్ను  స్నానం చేయించాక నీకూ మాంసం లేకుండా ఆహారం తీసుకోవటం నేర్పుతాను- నేనూ ఒకనాడు మృగానికి లాగా మాంసం తిని ఉన్నదాన్నే ! ఇక్కడి బ్రహ్మాండమైన దేవాలయాన్నీ అప్పటి ప్రజలు అర్చించిన దేవతనీ చూపిస్తాను నీకు ”

త్వరత్వరగా భోజనం కానిచ్చి లేచేశాము. ఆ ఆలయాలు- ఆ స్తంభాల పైన అంగుళమైన ఎడం లేకుండా చెక్కి ఉన్న శిల్పాలూ నగిషీలు …  ఖాళీ గా ఉన్న ఆ వసారా లు జనసమ్మర్దం తో నిండిన వీధుల కన్న బిగ్గరగా, స్పష్టం గా మాతో మాట్లాడాయి. ఆ మృత్యు నిశ్శబ్దం…ఆ ఏకాంతపు అంతిమత్వం … లోలోపలంతా లీనమయి ఉన్న గతపు దుఃఖం – ఎంత సౌందర్యం, మరింకెంత భీతావహం ! ఆయేషా అంతటిదే అక్కడ తగ్గి నడిచింది. మేము పెద్దగా మాట్లాడుకోలేకపోయాము – మా గుసగుస లు ఆ స్తంభాల మధ్యని గాలి తరగల మౌనం లో కలిసిపోయాయి. వెన్నెల వెలుగు అక్కడి శైథిల్యాన్ని మరుగు పరిచి వైభవ భ్రాంతిని కలిగిస్తోంది. కాని ఆ నడుమ నీడలు – వాటిలో మరణం స్పందిస్తోంది. ఏనాడో మృతులైన పూజారుల అర్చనలు ఆ నీడల కడుపుల లోంచి ఒక క్షణం వినబడుతూ, మరుక్షణం  అంతమవుతూ.

అలా ఎంతసేపు గడిచిందో తెలియదు – ఆయేషా అంది – ” రండి, చూద్దురుగాని. కాలాన్ని ధిక్కరించిన మహాద్భుత సుందర కిరీటాన్ని, సౌందర్యానికి పరమావధి అయిన దివ్య శిలా పుష్పాన్ని ” – ప్రధాన ద్వారం లోంచి గర్భాలయం లోకి తీసుకు వెళ్ళింది.

ఆహా – ఏమని వర్ణించను ఆ స్వరూపాన్ని ! కళాదేవి తన ను కొలిచిన వారికి అంతకన్న గొప్ప వరాన్ని కటాక్షించలేదు – నాకు తెలిసి. పెద్ద శిలా వితర్దిక పైన, గుం డ్రని   నున్నని నల్ల రాతి పైన – ఇరవై అడుగుల ఎత్తున , విస్తారమైన రెక్కలతో , దివ్యాతి దివ్య సౌందర్య మూర్తి అయిన స్త్రీ స్వరూపం అతి స్వచ్ఛమైన పాలరాతిలో మలచి ఉంది.  చూస్తూన్న క్షణాలలో ఆ మహదాకర్షణ కు నాకు ఊపిరి అందలేదు, నాడి ఆడలేదు.

ఆ ప్రతిమ కొద్దిగా వంగి , చేతులు చాచి – తన  ప్రియమైన సంతానాన్ని చేరబిలుస్తున్నట్లుగా ఉంది . ఆ భంగిమ లో ఎంత లాలిత్యమూ మాతృత్వమూ ఉన్నాయో, వాటితోబాటుగా ఎంత శక్తి ఉట్టి పడుతూ ఉందో వివరించటం నాకు అసాధ్యం . అతి సన్నని మేలి ముసుగు ఆమె ముఖాన్ని కప్పి వక్షం మీదుగా జారుతోంది .

” ఎవరు ? ఎవరు ఈమె ? ” – చూపు మరల్చుకోగలిగిన మరుక్షణం ప్రశ్నించాను.

” గుర్తించలేదా హాలీ ? నీ ఊహాశక్తి మొత్తమూ ఏమయిపోయింది చెప్పు ? కోర్ జాతి వారి గ్రంథాల సారమంతా ఈవిడే- ఈమె ‘ సత్యం ‘ . తన సంతానమైన అందరినీ  పిలుస్తోంది, ఆ మేలి ముసుగు తొలగించి తనను స్పష్టం చేసుకోమని ! చూడు, ఆ వితర్దిక పైన చెక్కి ఉన్న మాటలు అవే  ”

ఆ లిపిని చదవగలిగినది ఆయేషా ఒకర్తేనని వేరే చెప్పనవసరం లేదు.

” సత్యదేవత అంటోంది – ‘నా ఈ మేలి ముసుగు ను తొలగించి నన్ను దర్శించగలవారెవరూ లేనే లేరా ? నా ముఖాన్ని ఒక్కసారి చూసిన వారికి అపరిమితమైన జ్ఞానాన్ని , అనంతమైన శాంతిని  – ప్రసాదిస్తాను కాదా ? ‘

ఒక కంఠం పలికింది – ‘ నీ దర్శనమైన పిమ్మట జీవించగలిగేవారు లేరు. స్త్ర్రీ పురుష సంగమం  చేత జన్మించిన ఎవ్వరూ నీ ముసుగును తొలగించలేరు- అది వారికి మృత్యువు లోనే సాధ్యం ‘

సత్య దేవత విచారిస్తూనే ఉంది ! ”

ఆయేషా చెప్పింది – ” ఈవిడే కోర్ జాతి దేవత. దర్శించటం అసాధ్యమైన దాన్ని కనుగొని చూడాలనే ఈ దేవాలయం నిర్మించుకున్నారు ”

” ఈ రోజుకీ అంతే కద ” – నేను విచారంగా అన్నాను. ” మానవులు అన్వేషిస్తూనే ఉన్నారు, ఆమె అందకుండానే ఉంటోంది…బైబిల్ లోనూ చెప్పేశారు – ‘ వెతుకు వారికి సత్యము లభించుట దుర్లభము, అట్టిది మరణానంతరమే సాధ్యము ‘

ఆ శిలా పంజరం  లోంచి ప్రకాశించే దివిజాత్మని, అది వాగ్దానం చేస్తున్న అలౌకికపు ఉదాత్తతను,  గడ్డకట్టి నిలిచి పిలిచే ఒక బృహద్దార్శనికుని సౌందర్య స్వప్నాన్ని – విడిచి, మరలి, మేము – వెనక్కి.  ఆ మసక చీకట్ల నడవాల వెంబడి బయటికి వచ్చాము. ఆ విగ్రహాన్ని మళ్ళీ నా జన్మ లో చూడలేదు – జీవించి ఉన్నంతవరకూ ఒక్క క్షణమైనా మర్చిపోనూ లేదు.

***

మర్నాడు తెల్లారగట్లనే మూగవాళ్ళు మమ్మల్ని లేపేశారు. నిద్ర కళ్ళ తోనే అక్కడి పాలరాతి జలయంత్రం  లోంచి ప్రవహించే నీళ్ళలో స్నానాలు కానిచ్చాము. ఆయేషా సిద్ధమై ఉంది, తన తెల్లని పల్చని ఉడుపులలో – నిన్నటి సత్యదేవత కి మల్లే. అలా వస్త్రాలు ధరించే ఆలోచన  ఆమె అక్కడినుంచే తెచ్చుకుందేమో. ఆవాళ ఎందుకో ఆయేషా , ఎప్పుడూ లేనిది – క్రుంగిపోయి కనిపించింది. రాత్రి సరిగా నిద్ర పట్టిందా అని లియో ఆమెని అడిగాడు.

” లేదు. ఏవేవో పీడకలలు – అంతు పట్టనివి. ఏదో కీడు స్ఫురించింది, ఏదో చేటు సమీపించింది – ఆ దుస్స్వప్నాలలో. నాకు- నా అంతటి దానికి ఏ మి కాబోతుందని ? ఆ వెంటనే అనిపించింది, కాలిక్రేటస్ – ఒకవేళ నాకేమైనా జరగరానిది జరిగితే , ఏమని జ్ఞాపకం ఉంచుకుంటావో నన్ను – అని. నువ్వు తిరిగి వచ్చేవరకూ ఇన్నేళ్ళు వేచి ఉన్నాను కదా, నా కోసం నువ్వు ఆగబోతావా ???”

జవాబు కోసం చూడకుండానే ఆమె పల్లకీ ఎక్కేసింది. ” రండి, రండి. చాలా దూరం వెళ్ళాలి మనం. మరొక పొద్దు పొడిచేలోపే అక్కడికి చేరాలి ”

అయిదు నిమిషాల్లో తిరుగుదారి పట్టాము. ఆ తెల్లారగట్ల వెలుతురు లో మాకు అటూ ఇటూ పరచుకున్న శిథిల నగరం తెలియని గుబులు కలిగిస్తోంది. మొదటి సూర్య కిరణాల కాంతి లో మళ్ళీ ఒక్కసారి తన గతవైభవ చిహ్నాలను కనిపింపజేసింది. సావకాశం గా తిరిగి చూడలేకపోయామే అన్న ఆశాభంగం తో లియో, నేను నడుస్తున్నాం. జాబ్ కి మటుకు ఆ గోల ఏమీ లేదు – అతనికి శిథిలాలు ఎంతమాత్రమూ సరిపడవు, భయమే పుట్టిస్తాయి.

సూర్యుడు పైకి వస్తూన్న కొద్దీ ఆయేషా మనస్స్థితి మెరుగైంది. ఉదయపు ఫలహారం వేళకి ఆమె పూర్తిగా మామూలైంది. నవ్వుతూ అంది – ” అదంతా ఆ దిక్కుమాలిన కోర్ నగరపు ప్రభావం. దయ్యాలు తిరుగుతుంటాయి అక్కడ- అవే నా బుర్ర లో దూరి ఉంటాయి. కాకపోయినా, కాలిక్రేటస్, అక్కడే ఒకప్పుడు నీ మృత్యువు సంభవించింది – ఇంకే చోటూ దొరకనట్లు  ఇద్దరం కలిసి అక్కడికే వెళ్ళి నిద్ర పోవటం ఏమిటి- పీడకలలు వచ్చాయంటే రావూ ! మళ్ళీ ఎప్పుడూ ఆ చోట అడుగు పెట్టేది లేదు ”

మధ్యాహ్నం రెండు గంటల వేళకి అగ్ని పర్వతపు పాదప్రాంతానికి చేరాము. ఆగాము. అక్కడ ఆ పర్వతం నిట్ట నిలువుగా రెండువేల అడుగుల ఎత్తున ఉంది – అటూ ఇటూ ఏ దారీ లేదు. ఇక మీదట ఎటు వెళ్ళాలో నాకేమీ బోధపడలేదు.

” ఊ ” – పల్లకీ దిగుతూ ఆయేషా అంది. ” ఇక్కడి నుంచే మన శ్రమ మొదలవుతుంది. వీళ్ళెవరూ మన తో వచ్చేందుకు లేదు – మన సంగతి మనమే చూసుకోవాలీ. బిలాలీ ! నువ్వు ఈ మూగ వాళ్ళతో ఇక్కడే విడిది చేయి. రేపు మధ్యాహ్నానికల్లా మేము తిరిగి వస్తాము. ఒక వేళ రాకపోతే – వేచి చూడు ”

బిలాలీ వినయం గా వందనం చేశాడు. ఆయేషా చెప్పాక వాళ్ళంతా చచ్చేవరకూ అక్కడే ఉండాలి, మరొక మాట లేదు.

జాబ్ ని చూపిస్తూ ఆయేషా అంది – ” ఇతనూ ఇక్కడే ఆగిపోవటం మంచిది. ఇతనికి సాహసం గానీ గుండె దిటవు గానీ బొత్తిగా లేవు. మనం చూడబోయేదంతా చూసి ఇతను తట్టుకోలేడు ”

జాబ్ కి ఆమె మాటలని అనువదించి చెప్పాను. అతను బిక్కచచ్చిపోయి ఏడ్చేశాడు. ఇంతకు ముందు చూసిన వాటి కన్నా ఇంకా ఘోరమైనవి ఉంటాయని తను నమ్మననీ , ఒక వేళ ఉన్నా మాతోబాటే ఉంటాననీ మొత్తుకున్నాడు. ఆ నికృష్టులతో తనని వదిలేస్తే తప్పకుండా ఉడకబెట్టుకు తినేస్తారని కూడా.

మేము మోసుకుపోవలసిన చెక్క పలకనీ ఒక లాంతరునీ జాబ్ కి మోయమని ఇచ్చాము. ఇంకో లాంతరు నీ నూనె జాడీ నీ నా వీపుకి కట్టుకున్నాను. ఆహార పదార్థాల మూటనీ తోలు సంచి లో నింపిన నీటినీ లియో భుజాన వేసుకున్నాడు. అక్కడికి వంద అడుగుల దూరం లో దట్టమైన మనోలియా చెట్ల గుబురు ఉంది. ఆయేషా బిలాలీ నీ మూగవాళ్ళనీ మేము కనుమరుగయేవరకూ అక్కడే దాక్కుని ఉండమంది . వెళుతూ వెళుతూ బిలాలీ నాతో కరచాలనం చేసి బుజం తట్టాడు. త్వరలోనే వాళ్ళంతా ఆ గుబురు వెనక్కి వెళ్ళిపోయారు.

ఆయేషా తలెత్తి ఆ పర్వతాన్ని చూస్తోంది.

” ఏమిటిది లియో- ఇదంతా మనం ఎలా ఎక్కుతాం ? ” – నేను కంగారు పడ్డాను. లియో బుజాలెగరేశాడు. అతనేదో సగం స్వప్నం లో ఉన్నట్లు కనిపించాడు. చూస్తూండగానే ఆయేషా ఎక్కటం మొదలు పెట్టింది. ఎంత నేర్పుగా, చురుగ్గా – పట్టు దొరికించుకుంటూ వెళుతోందో ! ఆ వెనకే మేమూ. అనుకున్నంత కష్టం గా అయితే లేదు కొండ ఎక్కటం- ఒకటి రెండు చోట్ల తప్పితే. జాబ్ మోస్తూన్న చెక్క పలకే కాస్త ఇబ్బంది పెట్టింది – ఎందుకంటే మేము ఎండ్రకాయల్లాగా పక్కకి తిరిగి ఎక్కుతున్నాం . అలా , మేము బయలుదేరిన చోటి నుంచి యాభై అడుగులకి పైగా ఎక్కగగలిగాం. అక్కడ రాతి లో సన్నని కలుగు వంటిది కనిపించింది. ఆయేషా వెనకాల మేమూ అందులోకి దూరాం. పోను పోను అది వెడల్పయి, ఇంచుమించు ఒక కాలిబాట కన్నా పెద్దదైంది. అది అంతమవుతూన్న చోట ఒక గుహ వంటిది. ఆ గుహా ముఖం దగ్గర ఆగి, ఆయేషా ఒక లాంతరుని తన చేతిలోకి తీసుకుంది. కోర్ జాతి వాళ్ళు మలచిన వాటిలాంటిది కాదు ఈ గుహ – సహజం గా ఏర్పడింది. నేల చాలా ఎగుడు దిగుడు గా, అక్కడక్కడా పెద్ద రాళ్ళతో నిండి ఉంది. జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేసుకుపోతున్నాము.

దారి నిండా బోలెడన్ని మెలికలు. నా బుర్ర సరిగా పనిచేస్తూ ఉండినట్లైతే – పావు మైలు దూరాన్ని, ఇరవై నిమిషాల సేపు – నడిచిఉంటాము.

ఆ చివరన ఆగాము. నేను కళ్ళు పొడుచుకుని చూస్తూండగానే పెద్ద గాలి వీచి మా లాంతర్లు ఆరిపోయాయి.

ఆయేషా మమ్మల్ని దగ్గరికి పిలిచింది. వెళ్ళి చూస్తే – ఓరి దేవుడా ! అక్కడ గుహ గాని కాలు మోపగల నేల గాని లేదు. పర్వతం పైనుంచి కిందికి ఒక అగాధం. దాని  నిండా సూదులవంటి రాళ్ళూ రంపపు పళ్ళ వంటి అడ్డుగోడలూ. అతి ప్రయత్నం మీద చూపు కేంద్రీకరించి చూస్తే – ఈ వైపునుంచి ఆ వైపుకి సన్నని రాతి దారి- అదీ కొన్ని వందల అడుగుల ఎత్తున. కింద ఆధారమంటూ ఏమీ లేదు. ఒక్క మనిషి మటుకే , అతి కష్టం గా అడుగు వేయగలిగిన వెడల్పుతో , ఆ కొండ గోడ నుంచి  ఈ వైపు దానికి వ్యాపించి ఉంది. కొండ గోడ ల మీదకూడా  అది సన్నగా అతుకు పెట్టినంత మటుకే ఆని ఉంది- రెండు వైపులా.

” దీని మీంచి నడిచి వెళ్ళాలి ” ఆయేషా ప్రకటించింది. ” జాగ్రత్త , అడుగు జారిందా – ఈ అగాధానికి అడుగంటూ లేదు. కళ్ళు తిరగకుండా చూసుకోండి ” – అంటూనే విస విసా నడిచిపోతోంది. ఆ వెనక నేను, నా వెనక చెక్క పలక ని మోసుకుంటూ జాబ్, తర్వాత లియో. కొన్ని చోట్ల, ధైర్యం చాలక – మేము కూలబడిపోయి, ఆ రాతివంతెనని గట్టిగా పట్టుకుని పాకాము. ఆయేషా మాత్రం అలాగే తల ఎత్తి , ఎదురుగాలికి ఎదురు నడిచింది.

ఒక ఇరవై అడుగులు వేసి ఉంటాము – వంతెన అంతకంతకూ సన్ననవుతోంది. అప్పుడొచ్చింది పెద్ద గాలి దుమారం. ఆయేషా సైతం ఆగిపోయింది. ఆ విసురుగాలి ఆమె ధరించి ఉన్న నల్లని పొడవాటి కోట్ ని ఎగరగొట్టేసింది. అది ఒక ప్రాణమున్న వస్తువులాగా ఆ చోట తేలుతూంటే భయం పుట్టింది. ఆకాశానికీ భూమికీ మధ్యన ఉన్న అంధకారం లో వేలాడుతున్నాం మేము. కింద ఎన్ని అడుగుల లోతో, పైకి ఎన్ని అడుగుల ఎత్తో ఊహకి అందటం లేదు. పాదాలకి పట్టు జారిపోతోంది. ఆ చివర , చివరకన్నా చివర – ఎక్కడో నీలాకాశ రేఖ కనిపిస్తోంది – నిజంగా కనిపిస్తోందో నా భ్రాంతో తెలియదు. ఒక ఉత్పాతమై నురగలూ ఆవిర్లూ కక్కుతూ హోరుగాలి ముంచెత్తింది – ఏమీ తోచటం లేదు, మతులు పోతున్నాయి.

భీతి కూడా కలగనంత అయోమయపు, అలౌకికపు  స్థితి అది అప్పుడు , కాని ఇవాళ గుర్తొచ్చిందా- ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది.

” పదండి, పదండి ! ” ఆయేషా పెద్దగా హెచ్చరించింది. ఆ తెల్ల దుస్తులు గాల్లో ఎగురుతుంటే ఆమె మనిషి లాగా లేదు, కేవలమొక ప్రేతం లాగుంది. ” ఆగారా, ముక్కలు ముక్కలైపోతారు. నేల మీదే చూపు ఉంచి అడుగులు వేయండి ”

మేము ఆమె ఆజ్ఞను పాలించాము. ఎంతసేపో ఏమిటో – తెలీదు. మా చుట్టూ గాలి గింగిరాలు తిరుగుతోంది, కేకలూ శోకాలూ పెడుతోంది. చిట్ట చివరికి – ఎట్టకేలకి – ఆగాము. ఎందుకంటే మా ముందు ఆయేషా ఆగిపోయింది. అక్కడి నేల కాస్తో కూస్తో చదును గా ఉంది. ” ఇక్కడే ఉండాలి, వెలుగు వచ్చే వరకూ ” – ఆమె చూస్తున్న వైపుకి చూశాము. అవతల ఏముందో కంటికి ఆనటం లేదు – దానికి చీకటొకటే కారణమో మరింకేదైనానో , తెలీదు. ఒక్కటి అర్థమైంది – మేమున్న చోటికీ దానికీ మధ్య – ఏమీ లేదు. ఖాళీ. ఇందుకన్నమాట జాబ్ మోసి తెచ్చిన చెక్కపలక.

” కాసేపు – ఆగితే, వెలుగు వస్తుంది ”

ఆయేషా మాటలు నాకు పిచ్చివి గా తోచాయి. ఆ నిబిడాంధకారం లోకి, ఆ అనంత తమస్సు లోకి – ఎక్కడైనా వెలుగు వస్తుందా ?

కాని – వచ్చింది. ఒక పదునైన అగ్ని జ్వాల ఏదో కొండ గోడ ని పొడిచినట్లు , అక్కడికి కాంతి వచ్చింది. ఆ కాంతిలో ఆయేషా మెరిసిపోయింది. అది సూర్యుడి నుంచో, మరింకెక్కడి నుంచో – ఎక్కడినుంచైతేనేం – వచ్చింది.

ఆ చోటికీ మాకూ మధ్యన , పన్నెండు అడుగుల దూరాన – ఒక రాతి అంచు, అడుగు మోపగల వెడల్పు ఉన్నది. అది ఏ రాతి అంచో ఆ గుండ్రటి రాయి, ఇంకొక ముక్కోణపు రాతి మీద అలవోకగా నిలిచి ఉంది. ఆ అంచు కి ఎలాగోకలా చేరితే , ఆ తర్వాత ఇంకేమిటో ? తెలియదు.

” త్వరగా. ఈ వెలుగు ఎంతోసేపు ఉండదు ” – ఆయేషా .

” అయ్యా- ఈ చెక్క పలక మీంచి మనం దాటి పోవాలా ? ” – జాబ్ వణికి పోతున్నాడు.

” అంతే కదా మరి. దాన్ని తెచ్చింది ఎందుకనుకున్నావు ? ” – నాకూ అంతే భయం వేస్తున్నా వేళాకోళం చేశాను.

ఆయేషా తనే ఆ పలకని అందుకుని విసిరింది. అది వెళ్ళి ఆ అంచున్న రాతి మీద నిలిచింది. ఒక అడుగు వేసి, ఆయేషా అంది – ” నేను గతం లో వచ్చినప్పటి కన్నా ఈ ఆధారం బలహీనం గా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, ముందు నేనే వెళతాను ”.

అతి సుతారం గా నడిచి ఆమె ఆ వైపుకి చేరిపోయింది.

” బాగానే వుంది. ఒక్కొక్కరూ రండి. నేను ఈ వైపు న పాదం ఆనించి  ఉంచాను ”

నాకు కాలు సాగలేదు. అక్కడే చతికిలబడాలనిపించింది.

” అంత భయమా ? సరేలే, కాలిక్రేటస్ ని రమ్మను ”

ఇంతవరకూ వచ్చాక ఈమె ఎగతాళి ఎందుకు నాకు ?

పళ్ళు బిగబట్టి బయల్దేరాను. నాకసలు ఎప్పుడూ ఎత్తులంటే భయమే – ఈ అసనాటకపు కొయ్య పలక మీంచి అతి భయంకరమైన  అగాధాన్ని దాటటం…ఒకటి రెండు చోట్ల కొయ్య విరిగిపోతోందనిపించింది. కళ్ళు బైర్లు కమ్మాయి, పడిపోతున్నాననే అనుకున్నాను. ఆ కాస్త ప్రయాణం పూర్తయి   , ఆ రాయి మీద కాలు పెట్టిన క్షణం నా జీవితపు బ్రహ్మానంద సందర్భాలలో ఒకటి. తాత్కాలికం గానే అయితేనేం, నా అదృష్ట దేవత కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

తర్వాత లియో వంతు. మొహం కాస్త అదోలా ఉంది గానీ, తాడు మీద నడిచే గారడీ వాడిలాగా వచ్చేశాడు. ఆయేషా ఆనందం గా అతని చేయి పుచ్చుకు నొక్కింది – ” భళా ! నీ పూర్వపు గ్రీకు శౌర్యం నశించలేదు ప్రియతమా ! ”

అవును కాబోలు, ఆమె ఏమంటే అదే.

ఆ తర్వాత జాబ్. ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు – శోకం లంకించుకున్నాడు – ” నా వల్ల కాదు నాయనో, నా వల్ల కాదు దేవుడో ! పడిపోతాను బాబోయ్, అడుక్కంటా పడిపోతాను ”

” నువ్వు రావాలి జాబ్, రాగలవు – వచ్చెయ్యి ! ఎంతసేపూ- ఈగల్ని పట్టుకున్నంతే ” – తెచ్చుకోలు హాస్యం తో ధైర్యం చెప్పాను గాని, ఈగలని పట్టుకోవటమన్నది  అస్సలు సులువైన పని కాదని నాకు తెలీదూ ?

” లేదయ్యా. లేదు . రాలేను ”

” అతన్ని వస్తే రానీయి,లేదంటే అక్కడే చావనీ ” ఆయేషా గదిమింది. ” కాసేపట్లో వెలుతురు పోతుంది, మనం వెళ్ళకపోతే ”

నిజమే. అప్పటికే వెలుగు తగ్గిపోతోంది.

” వచ్చెయ్యి. లేదంటే చచ్చిపోతావు ” – అరిచాను.

లియో కూడా అవే మాటలు అన్న మీదటా, ప్రత్యేకంగా ధైర్యం చెప్పిన మీదటా జాబ్ ఆ కొయ్య పలక మీద బోర్లా పడుకుని పాకుతూ వచ్చాడు.  భయం తో అతని శరీరం ఘోరం గా వణుకుతూ పలకని దడాదడా కుదిపేసింది. దానికి తోడు అతను సగం దూరం రాగానే వెలుగు పోయింది.

అంతా చిమ్మ చీకటి.

” త్వరగా, జాగ్రత్తగా …” బాధతోనూ భయం తోనూ కేకలు పెడుతున్నాను నేను. మేము నిలుచుని ఉండిన రాయి కూడా చలించిపోతోంది- ఆ చెక్క పలక కుదుపులకి.

” దేవుడా, కరుణించు ” – జాబ్ ఆక్రందించాడు. ” పలక జారిపోతోందయ్యా …” – ఇక జాబ్ లేడనే అనుకున్నాను.

కాని, నా చాచి ఉంచిన చేతికి జాబ్ చేయి దొరికింది. పిచ్చి బలం తో అతన్ని పైకి లాగాను.

కొయ్య పలక లేదు.

” వెనక్కి వెళ్ళటం ఎలా ? ”

” ఇవాళ్టికి ఈ దరిద్రం చాల్లే అంకుల్ హాలీ, క్షేమం గా చేరాంగా  అందరం -  తర్వాత చూసుకుందాం ”

ఆయేషా ఏమీ అనలేదు.  తన చేయి పుచ్చుకుని నన్ను రమ్మని పిలిచింది.

[ ఇంకా ఉంది ]