దీపాలు పెట్టే వేళ

నిలబెడుతూన్న గోడ

ఆగస్ట్ 2017

విడిగా ఉండటం సౌకర్యమో ఏకాకితనమో -
గోడ లు కావాలో వద్దో – ఎల్లప్పుడూనో అప్పుడప్పుడూనో,
ఎవరట ఇదమిద్ధమనగలది!

దేశ కాల దేహ పాత్ర ధర్మాలు ప్రతిదానికీ వర్తిస్తాయన్నమాట అలా ఉంచితే, ఘనీభవించిన సమయ సందర్భాలలో కవి చేసిన చింతన ఈ పద్యం.

ఎప్పట్లాగే, ప్రశ్నలు. కొన్నేసి మటుకే జవాబులు. రెంటికీ అవతల పనిచేసేసహజ స్ఫురణ, లీలగా చదువరికి అందనిస్తూ. దాన్ని తెలుసుకోకపోతేనూ , తెలుసుకోదలచకపోతేనూ కూడా ఏమీ ఇబ్బంది లేదు – అలాగ సమాధానపడే పరిస్థితినీ ఆవైపున కల్పించి అట్టేపెడతారు.

తానే చెప్పుకున్న mischief అది.

Robert Frost పద్యాలలో చాలా – ఇటువంటి ‘గాథ’ లు. మరొక విశేషణం తట్టదు నాకు. Stopping By Woods On A Snowy Evening, The Road Not Taken, Home Burial…

సరదాగానో, నిజం గానేనో – రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ పద్యం గురించి చెప్పమంటే ఇలా అన్నారు.

” ఆ ప్రదేశపు వాతావరణాన్ని కల్పించి ఆ పాత్రలను నేను అనుకున్నట్లుగానే చిత్రించాననిపిస్తుంది. నా ఏ ఒక్క పద్యంలో నైనా – ఆ రెండిట్లో దేనికి లోపం కలిగిందనిపిస్తే బాధ – పూర్తిగా చివరంటా అది నెరవేరాలి, మధ్యలో ఆగిందనిపించినా బాధే.
నా పద్యాలు – నిజానికి ఎవరై పద్యాలైనా సరే – వాటిని తట్టుకుని చదువరి – అనంతం లోకి తూలి పడాలి. చిన్నప్పటినుంచీ అలా – నా ఆట బొమ్మలని [ కొయ్య నమూనాలూ కుర్చీలూ బళ్ళూ ] చీకట్లో , నడిచేవాళ్ళ కాళ్ళకి అడ్డం పడతాయనే చోట్లనే వదిలిపెడుతుండేవాడిని. ముందుకి పడేలాగా, చీకట్లో …విన్నారు కదా ? అన్నిసార్లూ నా ప్రయత్నం ఫలించకపోవచ్చు – ఉద్దేశం మాత్రం ఎప్పుడూ అదే.నా తులిపి తనం ..”

‘Building a wall’ అనకుండా ‘Mending a wall‘ అనటం లోనే ఉంది చమత్కారం. అది ఈనాటిది కాదు- ఉంది, అలాగ. ఎవరో ఎప్పుడో కట్టి పెట్టేసి. పడిపోకుండా నిలబెడుతూ ఉండటం ఎవరూ అప్పగించని బాధ్యత గా మీద వేసుకోబడింది అంతే.

అసలా గోడ అక్కడుండటం నచ్చటం లేదు దేనికో – అడుగున నేలని ఘనీభవింపజేస్తోంది. ఆ ఒత్తిడి పైకి తన్ని పడిపోతున్నాయి రాళ్ళు…ఇద్దరు అటూ ఇటూ నడిచిపోగల ఖాళీ లు.

వేటగాళ్ళ లెక్క ప్రకారం – రేచు కుక్కలు అరవాలి, ఈ సందుల్లో దాక్కున్న కుందేళ్ళు వెలికి పరుగెత్తాలి , అయితే – అదీ ఇదీ కూడా జరిగిందెప్పుడని ?

సరే, మళ్ళీ వసంతకాలం – గోడని బాగు చెయ్యాలి కదా… కొండ కి అవతలిపక్కని, పొరుగింటాయన ఉంటే , చెప్పి వచ్చాను. ఒక రోజున అనుకుని – కలిసి, గోడ కి అటూ ఇటూ నడిచి చూశాం. ఎలా పడితే అలా పడిపోయి ఉన్నాయి రాళ్ళు – రొట్టె ముక్కల్లగా, గుండ్రటి బంతుల్లాగా. [ బంతుల్లాగా కనిపించే రాళ్ళు ఉల్లాసపు ఆటవిడుపుకీ రొట్టె ముక్కల తో పోలిక ఆ ప్రాథమికావసరానికీ సూచనలుగా నాకు అనిపిస్తాయి - ఆ రెండు ప్రయోజనాలూ అక్కడ సిద్ధించవు , అవి రాళ్ళు అంతే గనుక ]

సర్దేసి నిలబెట్టి , ” ఏయ్- ఉండండి అక్కడే , అలాగే – మేం వెనక్కి మళ్ళే దాకా ” – అని మంత్రం పెట్టాల్సి వచ్చింది వాటికి. ఆరుబయటి ఆటనుకోవచ్చునా – వేళ్ళింతలా కొట్టుకుపోతున్నాకూడానా ? చెరోపక్కా ఆడుతున్నామేగానీ , అసలిది అవసరమేనా ? ఆయనవి పైన్ చెట్లు, నావేమో ఆపిల్ లు – ఇవి వెళ్ళి తినేస్తాయా వాటిని ? అదే అడిగాను ఆయనని – ‘ కంచెలు బాగుంటేనే ఇరుగూ పొరుగూ బాగు ‘ అట …

అది నా వసంతకాలం కనుక – కొంచెం తుంటరితనం. కా- స్త ఒప్పించాలనిపించింది. ‘ ఆవులున్నచోట్ల కదా, ఆ నానుడి ? ఇక్కడేమున్నాయని? కట్టే ముందు గోడకి లోపలేదో బయటిదేదో తెలుసుకోరాదా ? ఇది ఎవరికైనా వద్దేమో, కూలిపోతే సంతోషమేమో చూసుకోరాదా?’

‘ పొట్టి భూతాలకి నచ్చదేమో .. ‘ బెల్లించబోయాను గాని అతనే అనేశాడు – వాటికి కావాలనో ఇంకేదో…
. ఇంకా గట్టి పట్టు రాళ్ళ పైనా గోడ చేర్పు పైనా.
అతన్ని చుట్టిన చీకటి అడవిదీ కాదు, చెట్లదీ కాదు. చాలా పాతది.
అతను తండ్రి ఆజ్ఞ జవదాటని ఆదిమానవుడు.

నిర్దిష్టం కాని ఆ భయానికి, ఆ ‘ అనాగరికత ‘ కు – గోడ చిహ్నం. ఒకరిపై ఇంకొకరు దాడి చేసి దోచుకోగలదేమీ లేనప్పుడూ ఆ భీతి వదలదు , దాన్నొక సంప్రదాయం గా నిలబెట్టేయటం తప్ప. దూర దూరాల జనావాసాల న్యూ ఇంగ్లాండ్ నైసర్గిక స్వరూపానికి ఒకనాడు ఆ ఎడం అవసరమే అయి ఉండవచ్చు – కవి దృష్టిలో , అప్పటికైతే కాదు. అది తెలుస్తూనే ఉంటుంది. ఆయన నాగరికత ఎక్కడంటే, అవతలి మనిషి దృక్కోణాన్ని ‘ మరీ ఎక్కువ స్పష్టం గా ‘ తృణీకరించకపోవటం లో, తనదే తప్పేమో అన్న సన్నని సందేహాన్ని వదిలి ఉంచటం లో.

సరిగ్గా అందుకే ఈ పద్యాన్ని గోడ ఉండి తీరాలనే పక్షం నుంచి సమర్థించే చదువరులూ ఎక్కువే ఉన్నారు.

Liberals ఆయనను Conservative అన్నా కూడా

కనీసం స్థూలం గా ఆయన ద్వంద్వవాది. లేదా మధ్యస్థవాది. ఎందుకంటే రెండు వైపుల కీ ఉన్న పరిమితులను ఆయన గుర్తుపడతారు, వేర్వేరు సందర్భాలలో.

” నేను ఉదారవాదిని – అలా అనటం లో నా ఉద్దేశమేమిటో ‘ కులీనుల ‘ కు అర్థం కాదు. దెబ్బలాటలో నా పక్షాన్నే నేను గట్టి గా సమర్థించలేను , నా నైతికత అందుకు అడ్డుపడుతుంది. పరహితత్వం నన్ను ఆపివేస్తుంది ”

ఆ అశక్తతే Robert Frost శక్తి.

ఇప్పటి అనేకానేకమైన సంక్లిష్టతల నేపథ్యంలో – ఇంకానూ, బహుశా.

Link to Robert Frost Poem ‘Mending Wall’

**** (*) ****