దీపాలు పెట్టే వేళ

దివ్యాలోకనం

జూన్ 2017

ప్రతీదీ పక్కదానితో సంధానమైన జాలం ఇదంతా అన్న స్పృహ రావటం , విశ్వపు లయకి వీలైనంత దగ్గరగా వెళ్ళగలగటం – స్తిమితం.

మెలకువలోంచి నిద్రలోకి జారే ఆ కాసిని క్షణాలలో గొప్పగా సేదదీరుతామని శాస్త్రజ్ఞులు అంటారు.అక్కడొకింత నిలవగలగటం ముక్తులయేందుకు మొదలని తత్వజ్ఞులు.

ఏమాలోచిస్తాము అప్పుడు? ఏవేవో. కలిసిపోయి. అర్థం లేదనిపించేవి. అర్థాలు తెలుసుకోవటం మొదలుపెట్టటం తేలిక, మర్చిపోవటం దాదాపు అసాధ్యం. మొత్తాన్నీ ఒక్క కొనసాగే స్రవంతి గా చూడగలగటం జ్ఞానపు ఒక నిర్వచనం.

ఎక్కడ ప్రారంభమైనా – కళ పర్యవసించవలసినది శాంతిలో, దీవించబడి దిగినవారికి.

దేనికి దాని సరిహద్దులు విడిగా – ‘సామాన్య జీవనం’ లోనూ, కొందరు ఉత్తములకు జన్మతః తెలియవు.

మా అమ్మమ్మకి ఇద్దరు కూతుళ్ళూ ముగ్గురు కోడళ్ళూ నేనొక మనవరాలిని. ఎవరిని పిలవబోయినా వేరేవాళ్ళవి కనీసం రెండో మూడో పేర్లు అన్నాకే అసలువాళ్ళ పేరు వచ్చేది. చిన్నప్పుడు నవ్వొచ్చేది గాని, అందరిమీది అనురాగమూ కలిసిపోయినతనమని తర్వాత అర్థమైంది.

”ఎదురు గా ఉన్నవాటిని విడివిడి వస్తువులుగా చూడటం మానేసే ప్రయత్నం చేయండి. చెట్టో ఇల్లో పొలమో – ఏదైనా. ఇక్కడొక నీలి చదరం, అక్కడ కోలగా గులాబీ వన్నె …ఇక్కడొక పసుపు రంగు చార – మీకెలా కనిపిస్తే అలా, అదే వర్ణాన్ని ఆ ఆకృతి లోనే – చిత్రిస్తూ వెళ్ళండి . ఆ సన్నివేశం మిమ్మల్ని ముద్రించిన తీరునంతా బొమ్మకట్టగలిగేదాకా”

ఇది Claude Monet చూపు.

పక్షి పాడినట్లుగా బొమ్మ వేస్తే బావుండుననుకునేవారు. ప్రతి రోజూ కొత్త కొత్తగా ప్రత్యక్షమయే సౌందర్యం ఆయనను మాదకత లో ముంచేది. ఆ మొత్తాన్నీ వ్యక్తం చేస్తూనూ చేయబోతూనూ – ఉన్మత్తత ఆవరించేది. తన చిత్రాలను అర్థం చేసుకోవాలనుకొని చర్చకు పెట్టవద్దనీ ప్రేమిస్తే చాలుననీ ఆయన వేడుకోలు.

”అబ్బే. ఇవి చిత్రాలా ఇంకేమైనానా, కేవలం ఇతని impression” అని, తన జీవిక తొలిదశలలో ఒకరు నిరసనగా అన్నదే నిర్వచనమైంది. Pierre Auguste Renoir, Camille Pissarro వంటి కొందరు సన్నిహితులూ స్నేహితులతో కలిసి, impressionism – సౌందర్యావిష్కరణకు అప్పటి అవసర సందర్భమైంది.

చాలా ప్రేమించిన మొదటి భార్య, మొదటి చిత్రాలు చాలావాటికి నమూనా – Camille Doncieux Monet 1878 లో క్షయ వ్యాధి తో అకాల మృత్యువు పాలైనారు. అప్పటికి Camille వయసు 38. Monet ఆ అగాధం లోంచి చాలా శ్రమపడి పైకి వచ్చారు. తన ఇంటినీ తోటనూ తీర్చి దిద్దుకున్నారు. తిరిగి జీవించారు, ప్రేమించారు. తోట లోపలి కొలనులోవి ఆ కలువపువ్వులనే, మారే వేళల కాంతులలో మళ్ళీ మళ్ళీ, తీరీ తీరని తమితో చిత్రిస్తూ ఇరవై ఏళ్ళు…

ఊరట ఇచ్చిన రెండవ భార్య Alice 1911 లోనూ, మొదటి సంతానమైన కొడుకు Jean 1914 లోనూ మరణించారు. వెలుగు నీడల దోబూచులను కుంచెలోకి తెచ్చుకోవటమే తన జీవన సాఫల్యం అన్నాళ్ళ నుంచీ. అప్పుడిక చీకట్ల ఛాయలు ఎక్కువైనాయి. రంగులు ఇదివరకట్లా లేవు, పసుపూ జేగురుల నడుమనే ఊగుతున్నాయి…ఎరుపెరుపు అంచులవరకూ. ఆ దృష్టి మందగించింది, కళ్ళలో శుక్లాల ఫలితమయి.

ఇక్కడిది కానిదొకటి ఉందనేందుకు ఆనవాళ్ళుగా నేలకు దిగుతారు కళాకారులు. అయ్యో, ఈ ఐహికత్వం ఎంతెంత వేధించి నలుపుతుంది, వచ్చినదారినే తిరుగు మొహం పట్టే దాకా!

ఆనాటికి వందేళ్ళ ముందు నుంచే శుక్లాలకు శస్త్ర చికిత్స ఉంది. కాని అందులో పరాజయాల పాలు ఎక్కువే. తోటి impressionist చిత్రకారిణి Mary Cassatt కి చేసిన శస్త్ర వైద్యం పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత ఆమె మరి చిత్రించనేలేదు. ఆ నేపథ్యంలో, తనకు మిగిలి ఉన్న చూపు చాలుననే తృప్తి లోకీ ఆ కొత్త చూపు విలక్షణత్వం తనను చేర్చుతూన్న అపూర్వమైన తీరాలలోకీ ఆయన కొన్నేళ్ళు ఒరిగిపోయారు. మేఘమూ మెరుపూ వానా హరివిల్లూ అన్నీ ఒకదానిలోకి ఒకటి కరిగిపోవటమే ఆయన అన్నేళ్ళుగా కోరుకుంటూవచ్చిన పక్వత.

ఆ మనస్స్థితి ని జర్మన్ అమెరికన్ కవయిత్రి Lisel Mueller తన శ్రేష్ఠ పద్యం ‘Monet Refuses the Operation‘ లోకి తీసుకు వస్తారు. ఇందుకు Monet ఉత్తరాల ద్వారా ప్రకటించిన భావాలు కొంతవరకు వాస్తవాధారం. పూర్తిగా ఈ పద్యం నిజమా అంటే కాకపోవచ్చు. పూర్తి సత్యం, ఏకైక సత్యం – వీటికి చాలాసార్లు అందని కళాదృష్టికి వివరణ ఇది. మరొక వైపున, ఈ రోజుల medical ethics లో భాగంగా, రోగి అభిప్రాయాలకూ నిర్ణయాలకూ ప్రాధాన్యం ఉండే పరిస్థితుల లోనూ ఈ పద్యానికి విలువ ఉంది.

ఉత్తమ పురుష లో కొనసాగే ఆ పద్యం ఇలా ఉంటుంది..

‘’పారిస్ వీధుల దీపాలన్నీ అంత విస్పష్టంగా వెలుగుతున్నాయా?మసకల పరివేష్టాలేవీ ఆ చుట్టూ లేనేలేవా?

ఆ అగుపించటమొక రుగ్మత అనీ వయసు తెచ్చిపెట్టినదనీ అనేయద్దు దయచేసి, డాక్టర్ !

ఆ గాలిలాంతరులను దేవకన్యలుగా దర్శించేందుకొక జీవితకాలం పట్టింది నాకు. అంచులని మెత్తబరచి చెరిపివేసి

బహిష్కరించటం తేలికగా అయిపోలేదు. ఉందనుకున్న తిర్యగ్రేఖ అభాస అని తెలుసుకుందుకూ సాగర గగనాలు

విడిగా లేవన్నది తట్టేందుకూ – ఇంతకాలం కావలసివచ్చింది. రోయెన్ ఆలయం నిలిచి ఉన్నది సమాంతరకాంతి

స్థంభాల పైన అని యాభై నాలుగేళ్ళయాక అర్థమైంది. ఇది పైదీ అది కిందదీ అన్న నిశ్చయాలు నా యవ్వనానివి- ఆ మూడుకొలతల దోషాలని తిరిగి తెచ్చి నాకు ఇవ్వటమెందుకు? అరే, వంతెనా దాన్ని కప్పిన విస్టీరియా తీవెలూ

విడివిడిగా నాకెందుకు తెలియాలి? ప్రతీ రాత్రీ శాసనభవనం కరిగి, థేమ్స్ నదీ జలస్వప్నం అవుతోందని మీకు

తెలియదు, చెప్పటమెలాగ? ఒక్క పెద్ద ఖండం నుంచీ విడివడిన పిల్ల దీవులకి మల్లే ఒకదానినింకొకటి గుర్తించని,

పరిచయాన్ని ప్రకటించని ఆ లోకం వద్దండీ నాకు.

ప్రపంచమొక ప్రవాహం- కాంతిది దేన్ని తాకితే అది అయిపోగల మార్దవం.

నీరూ నీటిపైని కలువపూలూ కాంతే. నీటి అడుగునా నీటి పైనా ఊదా, ధూమ్రం, పచ్చని పసుపు…తెలుపూ నీలపు

దీపాలు, ఆ గుప్పిటి నుంచీ దీనికి అతి వేగంగా మారే వెలుతురు – నా కుంచె కుచ్చులు మరీ పొడుగయి,

పట్టుకుందుకు మించిపోతోంది. ఇప్పటికే. నిట్టనిలువుగా నిలుచున్న మన ఈ భారమైన ఘనాకృతులు దగ్ధమై

గాలిలోకే కలిసేందుకు చూస్తాయి – ఎముకలూ చర్మమూ వస్త్రాలూ అన్నీ. నింగి వంగుతూ నేలని సందిట్లోకి

లాక్కుంటుంది- మీకు కనబడితే బాగుండును డాక్టర్ ! పొంగి ఉప్పొంగే గుండె – నీలిరంగు పొగలుగా ఆవిరి

అయినాక గానీ, అంతటినీ చుట్టలేదు‘’

ఆ దశలో వేసిన చిత్రాలు ఆ తర్వాత రాగల నైరూప్య చిత్రకళకు ఆధారమైనాయని విమర్శకులు అనుకోవటం ఉంది.
అయితే – వేసిన దారిలోనే కాదు, ఆ పైన అక్కడ పడే అడుగులలోనూ మాధుర్యం ఒలకాలి కద.

మరణానికి మూడేళ్ళ ముందు, పూర్తి అంధత్వంలోకి జారిపోతూండగా Monet రెండు కళ్ళకూ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొన్ని క్లేశాలు అడ్డుపడినా మొత్తం మీద వైద్యం విజయవంతమైంది.

ఆ తర్వాత వేసిన బొమ్మలలో, సామాన్య నేత్రాలకు అందని అతినీలలోహిత కిరణాలు కనిపిస్తున్న చిహ్నాలు ఉంటాయని అంటారు. అందుకు నిరూపణేమీ లేదు కాని, అందరికీ కనిపించేవాటినే, కనిపించేలాగే – అసలు ఎప్పుడాయన కళ్ళు చూశాయని?

**** (*) ****