అనువాద నవల

రాజ్ఞి – పన్నెండవభాగం (‘ SHE ‘ By Sir H.Rider Haggard)

జూన్ 2016

[ మే నెల సంచిక తరువాయి ]

యేషా లియోని ఎవరనుకుంటోందో ఏమిటో ఆ నిమిషం లో నాకేం పట్టలేదు. నాకు కావలసింది అతను బతకటం, అంతే. ఈమె ప్రలాపం పూర్తయేలోగా పుణ్యకాలం గడిచిపోతే ఏం కాను ?

” చూడు ఆయేషా, నువ్వేం చేయాలని వచ్చావో ఆ పనిని త్వరగా పూర్తి చేయకపోతే నీ ‘ కాలిక్రేటస్ ‘ భూమ్మీద ఎంతో సేపు ఉండడు ” – హెచ్చరించాను.

ఆమె ఉలిక్కిపడింది. ” ఇంతకుముందే ఎందుకు రాలేదు నేను ? ఇప్పుడు నాకే భయమనిపిస్తోంది, చేతులు వణుకుతున్నాయి. హాలీ , ఇదిగో, దీన్ని అతని గొంతులో పోయి. ఇప్పటికే మరణించి ఉండనివాడైతే లేచి తీరతాడు ” – తన దుస్తుల్లోంచి చిన్న గాజు సీసాని తీసి నా చేతిలో పెట్టింది.

లియో మొహం ఆ పాటికే బూడిదరంగు లోకి మారిపోయి ఉంది, డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆ సీసా కి చెక్కబిరడా గట్టిగా బిగించి ఉంది. ఊడదీయటం కష్టమై పళ్ళతో పట్టి లాగాను. ఆ క్రమం లో మూత ఊడొచ్చి ఒక చుక్క ద్రవం అందులోంచి నా నాలుక మీదికి చిందింది, తియ్యటి వాసనతో. ఒక్క క్షణం పాటు నా కళ్ళముందేవో వెలుగులు- ఆ వెంటనే తగ్గిపోతూ.

లియో తల ఒక పక్కకి ఒరిగిపోయి , నోరు కొద్దిగా తెరుచుకుని ఉంది. ఆయేషాని అతని తలను గట్టి గా పట్టుకోమని అడిగాను. ఆమె శక్తి అంతా ఏమైపోయిందో గాని, నిలువెల్లా వణికిపోతూ అతి కష్టం మీద అతని దవడలు తెరిచి పట్టుకుంది. సీసాలో ఉన్న ఏడెనిమిది చుక్కలనీ అతని గొంతులోకి వొంపాను. నైట్రికి ఆసిడ్ ని కదిలిస్తే వచ్చేట్లు , పొగలొచ్చాయి అతని నోట్లోంచి. ఆ వైద్యం పనిచేస్తుందనే ఆశ- కొంచెం కూడా నాకు లేకపోయింది.

అతను డొక్కలెగరేయటం మటుకు వెంటనే తగ్గిపోయింది. మొహం బూడిదరంగు నుంచి తెల్లగా పాలిపోయిన రంగు కి మరలింది. అంతవరకూ అందని నాడి కొద్దిగా ఆడటం మొదలైంది, కను రెప్పలు మాత్రం అలాగే అల్లలాడుతున్నాయి. ఆయేషా ని చూశాను. ఆ ఉధృతం లో ఆమె మేలిముసుగు జారిపోయింది. లియో మొహమంతగానూ పాలిపోయి ఉంది ఆమె మొహం. అతన్ని వదల్లేదు- చూస్తూన్న కవళిక లో చెప్పలేనంత వేదన, ఆదుర్దా. అతను బ్రతుకుతాడో లేదో ఆమెకీ నమ్మకం లేదని నాకు అర్థమైంది. అలాగే ఆయిదు నిమిషాలు గడిచాయి…ఆశ అంతకంతకూ తగ్గిపోతోంది.

అందమైన ఆమె కోల మొహం కిందికి వాలిపోయింది, పెదవుల పగడపు ఎరుపు మాయమైంది. దుర్భరమైన వ్యధ కి ముఖ రేఖలు ముడుచుకుపోయాయి. అంతటి నా దుఃఖం లోనూ ఆమె మీద జాలేసింది.

” ఆలస్యమైపోయిందా ? ”

ఆమె బదులు చెప్పకుండా తల పక్కకి తిప్పుకుంది. కాని- అప్పుడు-లియో గట్టిగా ఊపిరి పీల్చాడు. కాస్త కాస్తగా మొహం లోకి గులాబి రంగు వచ్చింది. చూస్తూండగానే దేహం లో చలనం వచ్చి , పక్కకి తిరిగాడు.

” చూడు ” – నాకు మాట పెగల్లేదు, గొణిగాను అంతే.

” ఓహ్ ” – ఆమె గొంతు గద్గదం గా ఉంది. ” బతికాడు. ఒకే ఒక్క లిప్త ఆలస్యమయి ఉంటే – అంతా అయిపోయి ఉండేది ” – మాటల చివర్లోంచే పెద్ద పెట్టున దుఃఖం వచ్చి నేల మీద కూలబడి గొల్లుమని ఏడ్చింది.

కాసేపటికి తేరుకుని అంది – ” నా బలహీనతను క్షమించు హాలీ, స్త్రీ ని గదా నేను ! ఇవాళ పొద్దునే చెప్పావు కదా , మీ కొత్త మతం లో నరకం గురించి ! శక్తి ఉండదు, మార్చగల అవకాశం ఉండదు – జ్ఞాపకాలు ఉంటాయి… చేసుకున్న పాపాలు – అపరాధాలూ, తప్పుగా వేసిన లెక్కలూ ఎన్నటికీ నెరవేరని కాంక్షలూ భరించలేనన్ని భయాలూ – అనుక్షణం పెడుతూండే యాతన గురించి ! దాన్ని నేను రెండు వేల ఏళ్ళ పాటు – రెండు మూడు వందల తరాలపాటు – అనుభవిస్తూనే ఉన్నాను. తోడు లేదు, ఓదార్పు లేదు, చావు రాదు – ఆశలు , కొరివిదయ్యాల లాగా కాసేపు కనిపించి ఆరిపోతూ. కాని లోలోతుల్లో ఏదో గుడ్డి నమ్మకం .

ఇప్పుడేమైందో చూడు – పదివేలేళ్ళైనా ఇలాంటిది నువ్వు వినవు. అతను వచ్చాడు, నాకు ఇంత దగ్గరలో ఉన్నాడు – నేను గర్వపడే నా అత్యున్నత శక్తి సామర్థ్యాలు అతని ఉనికినే కనిపెట్టలేకపోయాయి ! తీరా అతను నా కంటబడ్డాడు – మృత్యువుకి అతి సన్నని వెంట్రుకంత దూరం లో …ఇప్పుడు అతన్ని పోగొట్టుకొని ఉండి ఉంటే తిరిగి ఎన్ని వందలేళ్ళు నేను ఎదురు చూడవలసి ఉండేదో, అసలు మళ్ళీ వచ్చి ఉండేవాడో కాడో – ఆ మహాశూన్యం లో నేనెన్ని నాళ్ళు బతకవలసి ఉండేదో. అతను జీవిస్తాడో లేదో తెలియని ఆ అయిదు నిమిషాలలో – అరవై తరాల కాలం గడిచింది నాకు – రాబోయే రోజుల హాలాహలపు ఛాయలన్నీ చుట్టుముట్టాయి. ఆ మందు గొంతు దిగింది కాబట్టి , అప్పటికింకా కొసప్రాణమేదో ఉంది కాబట్టి – అతను బతికాడు. పన్నెండు గంటలు నిద్రపోతాడు, మేల్కున్నాక ఇక జ్వరం రాదు ”

అతని బంగారపు గిరజాల జుట్టు పైన చేయివేసి నుదుటిని చుంబించింది – అతి సున్నితంగా, అనంతమైన అనురాగపు రక్తి తో.
అలా ఒక నిమిషం పాటు ‘ రాజ్ఞి ‘ ఆనందం పొంగి పొరలింది. గొప్ప దేవత లా కనిపించింది ఆమె. అంతలోనే మొహం లో భావం మారిపోయింది.
” దాదాపు మర్చేపోయాను.. ఆ ఆడమనిషి ఉందే, ఉస్తేన్ – లియో కి ఏమవుతుంది ఆమె ? సేవకురాలేనా మరింకేదైనానా ? ” – గొంతు కొంచెం వణికింది.
” అమహగ్గర్ ల ఆచారం ప్రకారం లియో ని పెళ్ళి చేసుకుందేమో …తెలీదు ” – బుజాలెగరేశాను.

రాజ్ఞి మొహం ఈర్ష్య తో, ద్వేషం తో భయంకరమైంది. వాటిని గెలిచే వయసు ఆమెకి రాలేదు, ఇంత కాలం గడిచాక కూడా.
” ఆమె చచ్చిపోవలసిందే. మరొక మార్గం లేదు ”

” ఎందుకు ? ఏం నేరం చేసిందని ? ” – ఈమె క్రూరత్వం తో ఎంతటి పరిచయం ఉన్నా కూడా హడలిపోయాను కొత్తగా. ధైర్యం కూడదీసుకుంటూ అన్నాను – ” నువ్వు చేసిన తప్పే కదా ఆమె కూడా చేసింది ? ప్రేమించింది, ఆమె ప్రేమని అతను సంతోషం గా స్వీకరించాడు ”

” ఎంత తెలివితక్కువవాడివి హాలీ ” – ఆమె కోప్పడింది, కాస్త నవ్వుతూనే. ” నాకూ నా అభీష్టానికీ మధ్యన అడ్డుగా ఉండటమే ఆమె పాపం.నేను అతన్ని అమెనుంచి తీసేసుకోవటం చాలా తేలిక నాకు – ఈ భూమ్మీద జన్మించిన ఏ పురుషుడైనా నా ఆకర్షణ నుంచి తప్పించుకోగలడా ? మోహం ఉన్నంతవరకే పురుషులు స్త్రీలకి కట్టుబడతారు . సామాన్య మానవ స్త్రీల పైని మోహం ఎన్నాళ్ళో నిలవదు, శీఘ్రంగా వాళ్ళ భర్తలకి వాళ్ళు నచ్చటం మానేస్తారు.

ఆ ‘ శీలవతులు ‘స్వర్గానికైతే వెళతారేమో , మీ కొత్త మతం ప్రకారం – కాని అటువంటి ఆడవాళ్ళు అక్కడేమైనా సుఖపడతారనుకోను నేను. సరిపడా సౌందర్యం ఉంటే దానితో ఏ పురుషుడినైనా కొనవచ్చు, తగినంత ధర చెల్లిస్తే ఏ స్త్రీ సౌందర్యాన్నైనా ఖరీదు చేయవచ్చు. మా కాలం లో అలాగే ఉండేది – ప్రపంచం ఒక పెద్ద సంత- ఎవరు ఎక్కువ వెలకి వేలం పాడుకోగలిగితే వాళ్ళకి అన్నీ దొరికేవి ”

ఆయేషా పరిజ్ఞానం ప్రకారమే ఆమె మాటలు ధ్వనించినా నాకు కాస్త చిరాకేసింది. క్రైస్తవ స్వర్గం లో వివాహాలూ దాంపత్యాలూ ఉండవని చెప్పాను.
” ఓ..అయితే పెళ్ళిళ్ళ ప్రసక్తి ఉంటే అది స్వర్గం కాకుండా పోతుందంటావా ఏమిటి ? అయినా మీ స్వర్గానికీ మా స్వర్గానికీ పెళ్ళి ఒకటే తేడా కాదేమోలే. ఇక చాలు – ఎంతకీ నా మాట ని తిరస్కరించటమే నీ పనిగా పెట్టుకుంటుంటావు గదా. ఈమె తప్పకుండా చనిపోవలసిందే – అతన్ని ఆమె నుంచి లాక్కోగలను కాని ఆమె బ్రతికి ఉన్నంతవరకూ అతని మనసు ఆమె పట్ల మెత్తబడే అవకాశం ఉంది – నా ప్రియుడి హృదయం లో నాకు తప్ప మరెవరికీ చోటు ఉండకూడదు, ఆ సామ్రాజ్యం పూర్తిగా నాది మాత్రమే. అనుభవించిందేదో అనుభవించిందిగా , చాల్లే – ప్రేమగా గడిపిన ఒక్క గంట సమయం , ఒంటరిగా వెళ్ళదీసిన శతాబ్దం కన్న ఎక్కువైనది. ఇక ఆమె ఈ చీకటి రాత్రి లో కలిసిపోతుంది ”

” వద్దు వద్దు ” – కంగారు గా అరిచాను. ” అది ఘోరమైన నేరం – అంతటి దుష్టత్వం లోంచి కీడు తప్ప మరింకేమీ రాదు. నీ మంచి కోసమే చెబుతున్నాను, ఆ పనిని తలపెట్టకు ”

” మనకీ మన గమ్యానికీ మధ్యన ఉన్నదాన్ని తొలగించటం నేరమంటావా ? అటువంటి నేరాలను మనం ప్రతిరోజూ చేస్తూనే ఉన్నాం. మనం బతికేందుకు జంతువులని చంపి తింటున్నాం. ఒక్క చెట్టో జంతువో బ్రతకాలంటే అటువంటివి ఇరవై చచ్చిపోవాలి. బలమున్నవాడిదే కదా రాజ్యం ?వేరే దేశాలని జయిస్తున్నాం, వాళ్ళ తిండిని దోచుకుంటున్నాం – ఇదే కదా జరుగుతోంది ? నేరం నుంచి కీడు తప్ప మరేమీ రాదంటున్నావు, నీకు అనుభవం లేదు. ఆ నేరాలలోంచే గొప్ప ఫలితాలు వస్తాయి, మంచి పనుల లోంచి నష్టాలు సంభవిస్తాయి. ఒక క్రూరుడైన నియంత పరిపాలన వలన తర్వాతి ఎన్నో తరాలు సుఖపడవచ్చు, ఒక మహాత్ముడి ప్రభావం వలన ఒక జాతి మొత్తం బానిసలు కావచ్చు. తన మనసుకి తోచిన మంచినీ చెడునూ మటుకే మనిషి గుర్తించగలడు , చేయగలడు – వాటి పరిణామాలెలా ఉండగలవో అతను ఊహించనేలేడు – తన మీద పడిన దెబ్బ కి కారణం ఏయే సంక్లిష్టమైన పరిస్థితుల అల్లిక లోంచి వచ్చిందో అతను తెలుసుకోనేలేడు. మంచీ చెడూ తీపీ చేదూ రాత్రీ పగలూ ప్రేమా ద్వేషమూ ఆడా మగా భూమీ ఆకాశమూ – ఇవన్నీ ఒకదానికొకటి అవసరమే – దేని అంతు ఏదో , ఎక్కడో ఎవరికి తెలుసు ? విధి అనేదేదో , తన ఏ బృహత్ప్రయోజనం కోసమో – వీటన్నిటినీ ఒక మహా సూత్రంగా పేనుతోంది. మనం దేన్నీ ఇదమిద్ధమని నిర్ణయించటం కుదరదు – మనకు పాపమనిపించినది మరొకరికి పుణ్యమే కావచ్చు. వింటున్నావా ? ”

ఇటువంటి కుతర్కానికి ఎదురు వాదించటం నా శక్తికి మించిన పని. హేతుబద్ధమైనది గానే అనిపించవచ్చు గాక, ప్రపంచం ఈ పద్ధతి మీదే నడిచేలా వదిలేస్తే మానవజాతి మొత్తమూ నశించిపోగలదు. కాని – ఏ నీతిసూత్రాలనూ న్యాయశాస్త్రాలనూ ఈ అద్భుతమైన మేధ గుర్తించదు. అనాదిగా పశుపక్ష్యాదుల నుంచి మనిషిని వేరు చేస్తున్న నైతిక బాధ్యత లలో లోపాలు లేవని కాదు , ఆ సంకెళ్ళు ఏవీ ఈమెను బంధించలేవనే విషయం కొత్తగా తెలిసి వచ్చి , నా మనసు భయం తో జలదరించింది.

అయినా , పాపం ఏ తప్పూ చేయకుండా అంతం కాబోతున్న ఉస్తేన్ ని ఈ అతి బలమైన ప్రత్యర్థి నుంచి ఎలాగైనా రక్షించాలనే అనిపించి, మళ్ళీ ప్రయత్నించాను.

” నీ ఈ తర్కం నా మొద్దుబుర్రకి ఎక్కనంత సూక్ష్మమైనది . నువే ఒకసారి అన్నావు కదా ఎవరి హృదయానికి చట్టాలు వాళ్ళే ఏర్పరచుకోవాలని ? ఎవరి స్థానాన్ని నువ్వు ఆక్రమించబోతున్నావో ఆమె పైన కొంచెమైనా కరుణ చూపకూడదా ? ఎన్నో శతాబ్దాల అనంతరం ఇతను నీకు చేరువగా వచ్చాడని అంటున్నావు, మృత్యువు కోరల్లోంచి అతన్ని నువ్వు బయటపడవేసి ఎంతో సేపు కాలేదు – ఈ సందర్భాన్ని ఒక పండగ గా జరుపుకోరాదా, ఇప్పుడు అందులో హత్యల ప్రసక్తి ఎందుకు చెప్పు ? ఈమె లియో కోసం తన ప్రాణాన్ని పణం గా పెట్టి నీ బానిసల నుంచి అతన్ని కాపాడింది , ఆ తర్వాతనే అతను ఇక్కడికి రాగలిగాడు – అందుకోసమైనా ఆమెను క్షమించకూడదా ? ఇతని పట్ల ఒకానొకప్పుడు ఘోరమైన అపరాధాన్ని చేసి ఉన్నానని నువ్వే చెప్పావు – ఈజిప్ట్ స్త్రీ అమెనార్టస్ ని ప్రేమించాడని ఇతన్ని నువ్వే చంపేశానన్నావు కదా ? ”

” నీకెలా తెలుసు ? ఆమె పేరు నీకెలా తెలిసింది ? నేను నీతో అననే లేదే ? ” – ఆమె సంభ్రమం తో నా చెయ్యి గట్టిగా పట్టేసుకుంది.

” కలగని ఉంటాను బహుశా ” -సర్దుకున్నాను – ” ఈ పురాతనపు ‘ కోర్ ‘ గుహల్లో ఎలాంటి కలలైనా రావచ్చు, వాటిలో ఏమాత్రమో నిజం ఉండనూ వచ్చు. అప్పుడు తలపెట్టిన క్రూరకృత్యం వల్ల నీకేం వచ్చింది – రెండువేలేళ్ళ యాతన , అంతేనా ? ఇప్పుడూ అంతే అవుతుంది, ఈమెని చంపితే నీకు కొత్తశాపం సంక్రమిస్తుది, చరిత్ర పునరావృతమవుతుంది. నువ్వేమైనా అను, చెడు పనుల వల్ల తర్వాతి తరాలకి మంచి జరగటం ఏమోగాని, చేసినవారు మాత్రం దాని పరిణామాన్ని స్వీకరించి తీరవలసిందే. మా రక్షకుడు చెప్పినదీ ఇదే. తనను రక్షించి సేవ చేసిన స్త్రీ ని చంపి, ఆ నెత్తురంటిన చేతులతో నువ్వు సమీపిస్తే అతను నిన్ను ఎలా ప్రేమిస్తాడు ? ”

” నా సమాధానం ఇదివరకే చెప్పాను నీకు. ఆమెనే కాదు, ఒకవేళ నిన్ను కూడా నేను చంపేసినా అతను నన్ను ప్రేమించే తీరతాడు – అతని ప్రాణమంటూ నిలిచింది నా వల్లనే కదా ? సరే, చూద్దాం – నీ మాటల్లో ఏ కొంచేమో నిజం ఉందేమో. నేను ఉద్దేశపూర్వకంగా క్రూరత్వాన్ని ప్రదర్శించనని నీకు ముందే చెప్పాను. తప్పనిసరైతే తప్పించి – బాధని కలిగించటమూ చూస్తూ ఉండవలసిరావటమూ నాకు ఇష్టం లేదు. ఆమె ని ఇక్కడికి తీసుకురా- త్వరగా, నా మనస్సు మారేలోపునే ” – మొహం మీదికి మేలిముసుగు లాక్కుంది.

ఆమెని ఆ మాత్రమైనా ఒప్పించగలిగినందుకు సంతోషిస్తూ, ఉస్తేన్ ని పిలిచుకొచ్చేందుకు గబ గబా బయటికి వెళ్ళాను. అక్కడా అక్కడా నూనె దీపాలు వెలుగుతూన్న ఆ పొడుగాటి నడవాలో ఒక చోట ముడుచుకు పడిఉంది ఆమె. పిలవగానే పరిగెత్తుకొచ్చింది.

” ఆయన మరణించాడా ? లేదు కదూ? లేదని చెప్పండి ” – అందమైన ఆమె మొహం కన్నీటితో తడిసి ఉబ్బిపోయి ఉంది.

” లేదు. బ్రతికాడు. రాజ్ఞి అతన్ని బ్రతికించింది ”

అమహగ్గర్ జాతి పద్ధతి ప్రకారం , ఆమె మోకాళ్ళ పైన కూలబడి తలదించుకుంది.

” అక్కడ కూర్చోవటం కాదు, రా ఇలా – లోపలికి ” – వాకిట్లో నిలబడి ఉన్న రాజ్ఞి అజ్ఞాపించింది.

ఉస్తేన్ లేచి వచ్చి రాజ్ఞి ముందు అదే విధంగా కూర్చుంది.

ఒక నిమిషం తర్వాత ఆయేషా ప్రశ్నించింది – లియో ని చూపిస్తూ – ” ఎవరు అతను ? ”

” ఆయన నా భర్త ” – ఉస్తేన్ లో గొంతుక తో జవాబు చెప్పింది.

” ఎవరు ఇచ్చారు అతన్ని నీకు భర్త గా ? ”

” మా పద్ధతి ప్రకారం, నేనే చేసుకున్నాను – రాజ్ఞీ ”

” నువ్వు చేసింది తప్పు. అతను మీ జాతికి చెందినవాడు కాడు, మీ పద్ధతి ఇక్కడ చెల్లదు. సరే, ఏదో తెలియక చేసి ఉంటే, మన్నిస్తున్నాను ఈ సారికి. అతను నీకోసం కాదు, నీ వాడు కాదు. వెళ్ళు, వెళ్ళిపో నీ వాళ్ళ దగ్గరికి. మళ్ళీ ఇతని వైపుకి చూడకు, రాకు. తక్షణం వెళ్ళిపో. లేదా ఈ క్షణమే నిన్ను చావు మింగేస్తుంది ”

ఉస్తేన్ కదల్లేదు.

ఆయేషా ఒక్క సారి అరిచింది – ” వెళ్ళు ! ”

” లేదు రాజ్ఞీ, నేను వెళ్ళను. ఆయన నా భర్త. ఆయన నా సర్వస్వం – నన్ను వెళ్ళమనేందుకు మీకేం అధికారం ఉంది రాజ్ఞీ ? ” – తలెత్తిన ఉస్తేన్ మొహం లో తీవ్రమైన ఉద్వేగం.

ఆయేషా కొంచెం కంపించింది- నాకు హడలు పుట్టింది.

లాటిన్ లో అన్నాను – ” దయచూపించు- ఇది ప్రకృతి సహజం ”

ఆయేషా అదే భాష లో జవాబు చెప్పింది – ” దయ చూపిస్తూనే ఉన్నాను. లేదంటే ఈమె ఇంకా బ్రతికిఉండేది కాదు ” – ఉస్తేన్ తో – ” వెళ్ళకపోయావా, నిన్ను నిలుచున్న చోటనే నాశనం చేస్తాను ”

ఉస్తేన్ బాధతో అరిచింది – ” అతను నా వాడు- నా వాడు ! అతని ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. మీకు చేతనైనట్లు గా నన్ను నాశనం చెయ్యండి, నేను మాత్రం వెళ్ళేది లేనేలేదు ”

ఆయేషా అతి చురుగ్గా కదిలింది, ఆ కదలిక ఏం చేస్తోందో నేను గమనించలేనంత వేగం గా. చూస్తే ఉస్తేన్ తల మీద అడ్డంగా మూడు తెల్లటి వెళ్ళ గుర్తులు. ఆమె దిమ్మెర పోయి తల మీద చేయి పెట్టుకు ఉండిపోయింది, వణుకుతూ.

” ఈమెని ఏం చేశానో అద్దం లో చూసుకోమను , హాలీ ”

తీసుకొచ్చి చూపించాను.

” చూసుకో, ఆడదానా ! నీ జుట్టంతా ఇలాగే తెల్లబడిపోతుంది – నా ముద్ర ని అచ్చుగుద్దాను నీ తల మీద. ఇంకా మొరాయించావా – నీ ఎముకలూ ఇలాగే సున్నం గా మారిపోతాయి ”

ఉస్తేన్ అతి కష్టం మీద లేచి నిలబడి, ఏడుస్తూ వెళ్ళిపోయింది.

” అంత భయపడనక్కర్లేదు హాలీ ! ఇదేం మాయ కాదు, నీకు అర్థం కాని శక్తి, అంతే. ఆమె గుండె లోకి తీవ్రమైన భీతి ని పంపించాను, అది అలా ముద్రించుకుపోయింది. ఆ- చూడు, నా బానిసలు కాలిక్రేటస్ ని మీ కొత్త గదుల్లోకి మోసుకుపోతారు – నువ్వూ మీ సేవకుడూ వాళ్ళతో రండి. ఈమె కి జరిగినదాని గురించి ఒక్క పిసరంత కూడా అతనికి తెలియనివ్వకు, హెచ్చరిస్తున్నాను నిన్ను. నా గురించి కూడా ఏమీ చెప్పకు ” – ఆయేషా వెళ్ళిపోయింది, నేను ఉండిపోయాను.. నా మనసులో రక రకాల భావాలు సముద్రపు అలల్లా ఇంతెత్తున పొంగుతున్నాయి – ఆనందం, వేదన, ఆశ్చర్య, అసహ్యం, భయం …మొత్తానికి, జాబ్ ని తీసుకొచ్చి – ఆ మూగవాళ్ళు మోసుకు వెళుతూన్న లియో వెంట నడిచేందుకు మాత్రం నా బుద్ధి సహకరించింది. మా కొత్త నివాసం ఆయేషా ను నేను కలుసుకున్న గదికి చాలా దగ్గరలో ఉంది. ఆమె నిద్రించే గదులు కూడా అక్కడే ఎక్కడో ఉండి ఉంటాయేమో.

లియో ని పడుకోబెట్టిన గది లోనే నేనూ ఆ రాత్రి నిద్ర పోయాను, ఒళ్ళు తెలియకుండా. దారుణమైన పీడకలలు వచ్చిపోతున్నా , మెలకువ మాత్రం రాలేదు. ఒక దుర్భరమైన కలలో, నేను చూసి వచ్చిన ఎముకల గుట్టలు , సైన్యం లాగా కదం తొక్కుతూ ముందుకి ముందుకి, నేనున్న చోటికి, నా మీదికి – వస్తూంటే మాత్రం ఉలికిపడి మేలుకున్నాను . తెల్లవారింది – ఆయేషా నా గదిలోకి వచ్చి ఉంది. ఆమె చెప్పిన ప్రకారం లియో కి ఇప్పుడు స్పృహ రావాలి.

” అతను హాయిగా, పసిపిల్లవాడిలా లేస్తాడు చూడు ”

ఆయేషా మాటలు నోట్లోంచి వచ్చాయో లేదో, లియో అటూ ఇటూ కదిలి, ఒళ్ళు విరుచుకుంటూ , కళ్ళు విప్పాడు. తన మీదికి వంగి ఉన్న స్త్రీ ని చూసి ఉస్తేన్ అనుకుని, ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు . అరబిక్ లో ” ఏమిటి ఉస్తేన్, మొహానికి అలా కట్టు కట్టుకున్నావు, పంటి నొప్పి గాని వచ్చిందా ? ” అని నవ్వి, ఇంగ్లీష్ లో ” ఓయ్, జాబ్ – ఎక్కడున్నావు రా నాయనా, నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఏమన్నా చేసి ఉంచావా లేదా ” అని కేక పెట్టాడు.

ఆయేషా పట్ల అసహ్యాన్నీ భయాన్నీ అణిచిపెట్టుకుంటూ, ఆమె కి దూరం గా ఆ వైపు నుంచి నడిచి వెళ్ళాడు జాబ్. ” నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడాలి లియో, ఆవేశపడకు. ఇదిగో, ఈవిడ అనుమతిస్తే, సూప్ తెచ్చి పెడతాను నీకు, వేడి వేడి గా ”

జాబ్ కి ఉస్తేన్ పట్ల గౌరవం లాంటిదేమీ లేదని లియో కి బాగా తెలుసు. అర్థమై, ” ఈమె ఉస్తేన్ కాదా ? ఏది ? ఎక్కడుంది ? ”

మొదటిసారిగా ఆయేషా మాట్లాడింది లియో తో. ” ఆమె త నవాళ్ళని చూసేందుకు వెళ్ళింది. ఆమె స్థానం లో , నీకు సేవ చేసేందుకు – నేనున్నాను ”
వెండి గంటలు మోగినట్లున్న ఆమె కంఠధ్వని లియో ని అయోమయానికి గురిచేసింది, ఆమె వేషం సరేసరి – ఇంకా అతని మెదడు పూర్తిగా మేలుకోలేదు కదా. ఇంకేమీ అనకుండా, జాబ్ తెచ్చిన సూప్ ని ఆత్రంగా తాగేశాడు. ఆ తర్వాత నన్ను ప్రశ్నలతో పీడించటం మొదలు పెట్టాడు. వీలైనంత క్లుప్తంగా అతని వ్యాధి గురించీ, అది నెమ్మదించటం గురించీ చెప్పాను. ఆయేషా ఆ ప్రాంతపు రాణి అనీ, ఆమె ఎవరికీ ఆ ముసుగు లేకుండా కనబడదనీ మాత్రం చెప్పగలిగాను – ఆమె ఆ పక్కనే ఉందాయె మరి. ఇంగ్లీష్ ఆమె కి అర్థం కాకపోయినా, ఆ మేధ కి గ్రహించటం ఎంత పని గనుక !

మరుసటిరోజుకి అతను బాగా కోలుకున్నాడు. అతని శరీరం దృఢమైనది, ఆయేషా ఇచ్చినది అక్షరాలా దివ్యౌషధం- అందుకని. అతను నన్ను ఎంత ప్రశ్నించినా ఉస్తేన్ గురించి ఎక్కువేమీ చెప్పలేకపోయాను. ఆయేషా తనని తను అతని ముందు తగిన సమయం లో బయటపెట్టుకుంటానని మళ్ళీ నన్ను హెచ్చరించి ఉంది. ఉస్తేన్ విషయమై మరొక్కమాట మాట్లాడితే నా ప్రాణం నిలబడదని కూడా వీలైనంత సుతారం గా సూచించింది మళ్ళీ.

ఆమె పద్ధతే పూర్తిగా మారిపోయింది. నేను ఊహించినట్లుగా , తన చిరకాల ప్రేమికుడిని కనుగొన్నట్లుగా ప్రవర్తించలేదు ఆమె. వినయంగా, సహనం గా అతని అవసరాలు కనిపెట్టి సేవ చేసింది. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడలేదు. ఆమె లేని ఒక సందర్భం లో – ఆమె శరీరాకృతి నీ కంఠాన్నీ మించి ఉంటుంది ఆమె ముఖసౌందర్యం అని మాత్రం చెప్పగలిగాను. అతనిలో ఆమె మొహం చూడాలని కుతూహలం విపరీతం గా పెరిగింది. మనసులో ఉస్తేన్ మీది అనురాగం తాజాగా లేకపోయి ఉంటే చప్పున ఆమె ప్రేమ లొ పడిపోయి ఉండేవాడే.

ఆఖరికి, ఒక రోజు ఉదయం – మేమిద్దరమూ ఆయేషా సమక్షానికి ఆహ్వానించబడ్డాము. మమ్మల్ని చూస్తూనే ఆమె సాదరం గా లేచి వచ్చి స్వాగతం చెప్పింది. ‘ మమ్మల్ని ‘ అంటున్నానే గాని, నేను అక్కడున్నాననే స్పృహే ఆమెకి లేదు. లియో కి పూర్తి ఆరోగ్యం వచ్చింది. ఎప్పటి అందమూ ఠీవీ అతనిలో ప్రకాశిస్తున్నాయి. అతన్ని కొత్తగా చూస్తున్నట్లు చూశాను – ఇంతెత్తు మనిషి, ఇంత వెడల్పు చాతీ – కనుముక్కు తీరులో అంత సౌందర్యం, మెత్తని ఒత్తైన బంగారు వన్నె కేశాలు.

” స్వాగతం పురుష సిం హమా ! నిన్ను ఇలా చూడగలగటం ఎంతో ఆనందం గా ఉంది. నా ప్రమేయం లేకపోయి ఉంటే నువ్వు ఇవాళ ఇలా నడిచి వచ్చి ఉండేవాడివి కావు. కాని ప్రమాదం తప్పిందిలే, మరిక నీ చెంతకి రాదు – నేనుండగా ” – మృదువైన స్వరం తోఅ ఆయేషా అంది.

లియో గౌరవం గా వంగి వందనం చేశాడు. స్వచ్ఛమైన అరబిక్ లో – మర్యాద తో – ఒక అపరిచితుడి పైన అంత కరుణని వర్షించినందుకు ఆమె కి ధన్యవాదాలు చెప్పాడు.

” లేదు. ప్రపంచం ఇంత అపురూపమైన సౌందర్యాన్ని కోల్పోకూడదు. ఆనందమంతా నాది ”

మళ్ళీ అంది – ” నా సేవకుల పని లో లోపాలేవీ లేవు కదా ? ఈ నా నివాసం లో నీకు సౌఖ్యమే కదా ? ఇంకా కావలసిందేమైనా ఉందా ? ”

” ఒక్కటే ఉంది రాజ్ఞీ ! నాకు సేవ చేస్తూ ఉండిన అమ్మాయి ఏమైంది ? ”

” ఓ..ఆమె నా ! వెళతానంది, వెళ్ళమన్నాను. ఎక్కడికో, ఏమో…వస్తుందో, రాదో – నాకూ తెలియదు. జబ్బుపడిన వారి సేవ ఏమంత సులువుగా ఉండదు, ఈ ఆటవిక స్త్రీ ల మనస్సులూ చంచలం గా ఉంటాయి కాదూ ? ”

ఆ మాటల వెనక ఉన్న చాకచక్యం లియో కి నచ్చలేదు.

” ఇదంతా విడ్డూరంగా ఉంది ” – నాతో ఇంగ్లీష్ లో అని, ఆమె తో – ” నాకేం అర్థం కావటం లేదు. ఆమెకీ నాకూ పరస్పరం … చాలా అభిమానం ఉండేది …”

ఆయేషా నవ్వింది, సంగీతం వినిపించేట్లు. మాట మార్చింది.

[ ఇంకా ఉంది ]