లియో ఇరవై అయిదో జన్మదినానికి ముందురోజున ఇద్దరమూ బయలుదేరి లండన్ వెళ్ళి , ఇరవై ఏళ్ళ కిందట బాంక్ లో దాచి పెట్టిన ఇనప పెట్టె ని బయటికి తీయించాం. అప్పటి గుమాస్తాయే, అదృష్టవశాత్తూ ఇప్పుడూ ఉన్నాడు – లేదంటే ఆ సాలెగూళ్ళ కింద నుంచి దాన్ని తీయటం కష్టమయేదట. సాయంకాలానికి కేంబ్రిడ్జ్ కి వచ్చేశాం, రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టనేలేదు. తెల్లారుతూనే లియో డ్రెస్సింగ్ గౌన్ లోనే వచ్చాడు , వెంటనే పని మొదలెడదామని. అంత కుతూహలం అక్కర్లేదనీ, ఇరవై ఏళ్ళు ఆగినవాళ్ళం బ్రేక్ ఫాస్ట్ అయేదాకా ఆగితే తప్పు లేదనీ నేను అన్నాను. సరే, తొమ్మిది కొట్టగానే బ్రేక్ ఫాస్ట్ కి కూర్చున్నాం….నా పరధ్యానం లో లియో కాఫీ కప్ లో పంచదార గుళ్ళకి బదులు జామ్ వేసేశాను..లియో ఏమరుపాటుగా – నాకెంతో ప్రియమైన టీ కప్ ని బద్దలు కొట్టేశాడు,
ఎట్టకేలకి , ఆ సరంజామా అంతా సర్దటం పూర్తయాక, జాబ్ నేను చెప్పినట్లుగా ఆ పెట్టెని తెచ్చి బల్ల మీద పెట్టాడు, అతి జాగ్రత్తగా, అది కరుస్తుందేమోనన్నట్లు ! జాబ్ వెళ్ళబోతూ ఉంటే నేను అతన్ని ఆగమన్నాను -
” ఉండు జాబ్, లియోకి అభ్యంతరం లేకపోతే నమ్మదగిన సాక్షి ఒకరు ఇక్కడ ఉండటం అవసరమని నాకు అనిపిస్తోంది ”
” అలాగే, అంకుల్ హొరేస్ ” అన్నాడు లియో. నన్ను అంకుల్ అని పిలవమని పట్టుపట్టేవాడినేగాని గాని చాలాసార్లు అతను నన్ను ‘ ఇదిగో , పెద్దాయనా ‘ అనో, వేళాకోళంగా ‘ ప్రొఫెసర్ గారూ ‘ అనో పిలుస్తుండేవాడు.
జాబ్ వినయంగా తల ఆడించి నిలుచున్నాడు. నేను తలు పు మూసి వచ్చి జేబులోంచి తాళం చెవులు తీశాను. విన్సే ఆ రాత్రి నాకు అప్పగించినవి అవి. ఆ మూడిట్లో ఒకటి పెద్దగా, కాస్త కొత్తగా కనిపిస్తోంది, రెండోది బాగా పురాతనంగా . మూడోది.. అలాంటి తాళం చెవిని నేనింకెక్కడా చూడలేదు. వెండితో పోతపోసి , పట్టుకునేందుకు గట్టి కాడని అడ్డంగా అమర్చి, పైనంతా ఏవేవో వింత గా చెక్కారు.
ఎక్కువరోజులు వాడకుండా వదిలేసి ఉన్నాయి గనుక, అన్నిటికీ ఇంత నూనె పట్టించాను. పెద్ద తాళం చెవిని ఇనపపెట్టె లో రంధ్రానికి బిగించి తిప్పాను. ..బరువుగా ఉన్న మూతని లియో పైకి లాగాడు, కిర్రుమంటూ తెరుచుకుంది. లోపల ఇంకో పెట్టె ఉంది, పైకి తీసి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచాను. అది నల్ల చేవకర్రతో చేసి ఉంది, చుట్టూ ఇనపబద్దీలు బిగించి ఉన్నాయి.. ఎంత పాతదో చెప్పేందుకు వీలు లేనట్లుగా ఉంది. రెండో తాళం చెవిని ఉపయోగించి ఆ పెట్టెనీ తెరిచాను.. లియో, జాబ్ – ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇది సులభంగానే తెరుచుకుంది.
లోపల ఇంకో పెట్టె, వెండితో మలచినది. అటూ ఇటూ పన్నెండేసి అంగుళాల కొలతతో, ఎనిమిది అంగుళాల ఎత్తున ఉంది. ఈజిప్ట్ లో తయారైనట్లుంది దాని పనితనం చూస్తే…నాలు కాళ్ళ స్థానం లోనూ స్ఫింక్స్ బొమ్మలు చెక్కి ఉన్నాయి, మూత పైన కూడా. బాగా పాతదవటం వల్ల వెండి మెరుగు తగ్గింది గాని , పెట్టె అయితే దిట్టంగానే ఉంది.
బయటికి తీసి బల్ల మీద ఉంచాను. ఎవరమూ మాట్లాడటం లేదు…ఆ వింత తాళం చెవిని దూర్చి అటూ ఇటూ తిప్పాను ..మెల్లిగా తెరుచుకుంది. లోపలంతా మట్టి రంగు పదార్ధం పొరలు పొరలుగా నిండిపోయి ఉంది, కాగితం కాదు..నార వంటిదేదో. జాగ్రత్తగా వెతికితే అడుగున మూసి అతికించిన కాగితపు సంచి, కొత్తగానే కనిపిస్తోంది- దాని మీది చేతిరాత నా మిత్రుడు విన్సే ది…ఇలా-
” నా కుమారుడు లియోకి, అతను జీవించి ఉన్నట్లైతే ”
లియో చేతికి ఇచ్చాను…తేరిపారచూసి పక్కన పెట్టాడు. ముందర పెట్టె లో ఇంకా ఏమున్నాయో చూద్దామన్నాడు.
బిగుతుగా చుట్టిఉన్న తోలు రాత ప్రతి ఉంది. విప్పి చూస్తే అదీ విన్సే చేతిరాత లోనే ఉంది- ” కుండ పెంకు మీద ప్రాచీన గ్రీక్ లో ఉన్నదాని కి అనువాదం ‘ ‘ . పక్కన పెట్టాం. ఇంకో తోలు చుట్ట…అదీ గ్రీక్ నుంచి అనువదించిందే, అయితే లాటిన్ లోకి. ఆ అక్షరాల కూర్పు చూస్తే పదహారో శతాబ్దానిదిలాగా అనిపించింది. దాని అడుగునే మరొకటి – నార తో చుట్టిన చుట్ట..గట్టిగా బరువుగా ఉంది. పట్టుకుంటే పొడిపొడిగా రాలిపోతూ ఉంది..అతి జాగ్రత్తగా తెరిచి చూస్తే – వెలిసిపోయిన పసుపు రంగులో అతి ప్రాచీనమైన కుండ పెంకు ఉంది. ఒక పురాతనమైన కూజా లో అదొక ముక్క అని నాకు అర్థమైంది. పది అంగుళాల పొడవున, బాగా వెడల్పుగా, పావు అంగుళం మందం తో ఉంది.
ఉబ్బెత్తుగా ఉన్నవైపున ప్రాచీన గ్రీక్ లిపి ఉంది…కొన్ని చోట్ల మసకబారినా చాలా చోట్ల చదవగలిగేలాగే ఉంది. ఆ కాలపు పద్ధతిలో, మట్టి మెత్తగా ఉన్నప్పుడే వెదురు గంటం తో రాసిఉంటారు . ఆ ఫలకం ఒకప్పుడు రెండుగా పగిలి తిరిగి అతికించబడి ఉండాలి.. ఎనిమిది చోట్ల అడ్డంగా అతుకులూ సన్నటి మేకులూ కనిపిస్తున్నాయి. ఫలకం లోపలి వైపునా ఏదేదో రాసి ఉంది…అయితే ఆ రాత ఒక పద్ధతిలో లేదు- వేర్వేరు కాలాల్లో వేర్వేరు మనుషులు రాసి పెట్టినట్లుగా ఉంది.
‘ అమెనార్టాస్ శకలానికి నకలు ‘
అసలు కు ఒకటిన్నర రెట్లు పరిమాణం
అసలు పొడవు- 10 1/2 అంగుళాలు
అసలు వెడల్పు- 7 అంగుళాలు
బరువు- 1 పౌండ్ 5 1/2 ఔన్సులు
” ఇంకేమైనా ఉందా ? ” లియో ఆరాటంగా అడిగాడు.
నేను లోపలంతా తడిమాను. ఏదో గట్టిగా తగిలింది. అదొక చిన్న నార సంచి. దంతం మీద చాలా చక్కగా వేసిన సూక్ష్మచిత్రమొకటి ఉంది అందులో . దాంతోబాటు పేడపురుగు [Beetle] ఆకారం లో మలచిన ధూమ్రవర్ణపు శిల. దాని లోపలి వైపున ఏవేవో గుర్తులతో రాసిఉంది… కూడబలుక్కుని అర్థం చేసుకోగా ఆ మాటలు – ‘ సుటెన్ సె రా ‘ .అంటే ‘ రా ‘ దేవుడి [సూర్యుడి ] రాజ పుత్రుడు అని. ఆ సూక్ష్మచిత్రం లియో తల్లిది, దాని వెనకవైపున ‘ నా ప్రియమైన భార్య ‘ అని విన్సే చేతి రాతలో ఉంది. …ఆవిడ గ్రీక్ స్త్రీ అని చూడగానే తెలుస్తోంది, నల్లటి కళ్ళు, ఒత్తైన ఉంగరాల జుట్టు – గొప్ప సౌందర్యవతి.
లియో ఆ చిత్రాన్ని ప్రేమగా కాసేపు చూసి పక్కన పెట్టి ” ఇక ఉత్తరం చదువుదామా ? ” అంటూ దానికి వేసి ఉన్న ముద్రని తొలగించి పైకి చదివాడు…
” లియో , నా బంగారు తండ్రీ ! నువ్వు ఇది చదివేనాటికి పెరిగి పెద్దవాడివైపోయి ఉంటావు, నేను మరణించి ఎన్నో ఏళ్ళయి ఉంటుంది- నన్ను అందరూ మర్చిపోయీ ఉంటారు. కాని ఈ సిరాతో రాసిన అక్షరాల ద్వారా నేను నిజంగానే నీతో మాట్లాడుతున్నానని తెలుసుకో , మృత్యువనే మహా అగాథం అవతలినుంచి నా చేయి నీ వైపుకి చాస్తున్నాను. నేను నీకు గుర్తు లేకపోయినా, నా శరీరం నీతో లేకపోయినా – నువ్వు ఇది చదువుతూ ఉన్న నిమిషాల్లో నేను నీ దగ్గరే ఉన్నాను, నమ్ము. నువ్వు పుట్టినప్పటినుంచి నేను ఇది రాస్తున్నప్పటివరకూ నిన్ను సరిగా చూడను కూడా లేదు నేను, క్షమించు. నీ పుట్టుకా నీ తల్లి మరణమూ ఒకేసారి సంభవించాయి…ఆమె మీద నాకు విపరీతమైన, అనంతమైన అనురాగం – ఆ అఘాతం నుంచి నేను తేరుకోలేకపోయాను. నేనింకొన్నేళ్ళు జీవించగలిగి ఉంటే నెమ్మదిగా నా వేదన ఉపశమించేదేమో, నిన్ను దగ్గరికి తీసుకోగలిగేవాడినేమో…కాని నాకు ఆ ప్రాప్తం లేదు. శారీరకంగా, మానసికంగా నేను పడుతూ ఉన్న బాధలని ఇంకెన్నాళ్ళో తట్టుకోలేను. నీ కోసం నేను చేసి ఉంచిన ఏర్పాట్లలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే నన్ను భగవంతుడు మన్నిస్తాడు గాక ! ఇంకొక సంవత్సరం కన్న ఎక్కువ బతకను, ఈ లోపే నా జీవితాన్ని అంతం చేసుకోవాలనీ అనిపిస్తోంది …”
” అయితే ఆత్మహత్య చేసుకున్నాడన్నమాట ” , బాధగా అన్నాను – ” నేను అనుమానిస్తూనే ఉన్నాను ”
లియో ఏమీ జవాబు చెప్పకుండా , చదవటం కొనసాగించాడు.
”సరే, నా గురించి ఇంక చాలు. నేను చెప్పబోయేది నీకు సంబంధించింది గానీ , ఏనాడో కాలగర్భం లోకి వెళ్ళిపోయినవాడిని – నాకు కాదు. నువ్వు జన్మించిన వంశం అతి పురాతనమైనదని హాలీ నీకు ఇప్పటికే చెప్పి ఉంటాడు. దానికి ఆధారాలు ఈ భరిణ లో దొరుకుతాయి. ఆ మృణ్మయ ఫలకం పైన ఉన్న వింత గాథను రాసిపెట్టినది – ఎన్నో తరాల వెనక నీకు పూర్వీకురాలైన స్త్రీ. మా తండ్రి తన మరణ శయ్య మీద దీన్ని నాకు అందజేశాడు. ఆ రోజునుంచీ ఆ సమాచారం నన్ను బలంగా వెంటాడింది…దాన్ని నిర్థారించేందుకు పూనుకున్నాను , నా పందొమ్మిదేళ్ళ వయస్సులో. , దురదృష్టవంతుడైన మన పూర్వీకుడొకరు కూడా , పదహారో శతాబ్దం లో అలాగే సంకల్పించుకున్నారు. నాకు జరిగిన అనుభవాలన్నిటినీ ఇక్కడ చెప్పలేను , కాని ఇది మాత్రం నా కళ్ళతో చూశాను….
ఆఫ్రికా తీరం లో , ఇప్పటివరకూ ఇతరులెవరూ కాలు మోపని చోట…జంబేజీ నది సముద్రం లో కలిసే చోటికి ఉత్తరంగా కొంత దూరం లో ఒక ఎత్తైన భూభాగం ఉంది. దాని చివరన, ఆఫ్రికన్ దేశస్థుడి శిరస్సు ఆకారం లో ఒక కొండ కొమ్ము ఉంది. నేను అక్కడ ఓడ దిగాను. ఏదో అపరాథం చేసి తన తెగ వాళ్ళతో వెలి వేయబడిన మనిషి ఒకడు నాకు అక్కడ పరిచయమయ్యాడు. తీరం నుంచి లోపలికి ఇంకా ఎత్తైన పర్వతాలూ , వాటిలోపల అంతు తెలియని గుహలూ , చుట్టూ భయంకరమైన ఊబి నేలలూ ఉన్నాయని అతను చెప్పాడు. అక్కడి జనం అరబ్ భాష లోని ఒక మాండలికాన్ని మాట్లాడతారట. వాళ్ళని ఏలుతున్నది అద్భుత సౌందర్య రాశీ , చాలా తెల్లనిదీ అయిన ఒక రాణి. ఆమె వాళ్ళకి కనిపించటం చాలా అరుదు , కాని ఆమె అమితమైన శక్తిసామర్థ్యాలు గలదట, ఆ శక్తి జీవించి ఉన్నవాళ్ళ మీదా చనిపోయినవాళ్ళ మీదా కూడా తిరుగులేకుండా పని చేస్తుందట. ఆమెకి వృద్ధాప్యమూ మృత్యువూ లేవట. నాకీ విషయాలన్నీ చెప్పిన రెండు రోజులకే ఆ మనిషి విషజ్వరం తో మరణించాడు. నాలో కూడా ఆ జబ్బు లక్షణాలని గ మనిం చుకోవటం వల్లా, ఆహార పదార్థాలూ నీరూ అయిపోతున్నందువల్లా నేను నా ఓడ దగ్గరికి వెళ్ళిపోవలసి వచ్చింది.
ఆ తర్వాత నాకు ఎదురైన సంఘటనలని ఇప్పుడు నీకు చెప్పనక్కర్లేదు. మడగాస్కర్ దీవి తీరం లో నా ఓడ ముక్కలైంది..కొన్ని నెలల తర్వాత ఒక ఇంగ్లీష్ నౌక నన్ను ర క్షించి యమెన్ దేశం లో, ఆడెన్ నగరం లో దిగబెట్టింది. . అవసరమైన సరంజామానంతా సమకూర్చుకుని మళ్ళీ ప్రయాణం సాగించాలనుకుంటూ ఇంగ్లండ్ కి బయల్దేరాను. దారిలో గ్రీస్ లో ఆగాను… అక్కడ మీ అమ్మ తో పరిచయమైంది. ‘ ప్రేమ అన్నిటినీ జయిస్తుంది ‘[ omnia vincit amor ] అని నానుడి ఉంది కదా … పెళ్ళి చేసుకుని అక్కడ ఉండిపోయాను. కొంతకాలానికి నువ్వు పుట్టావు, ఆమె మరణించింది. ఆ తర్వాత నా దేహం లోనూ వ్యాధి మొదలైంది, తిరిగి వచ్చేశాను. నా వ్యాధి రోజు రోజుకీ ముదురుతున్నా కూడా ఎప్పుడో ఒకప్పటికి అది ఉపశమిస్తుందనీ ఆ తర్వాత ఆఫ్రికా వెళ్ళి నా శోధన ని పూర్తి చేస్తాననీ ఆశపడి …అరబిక్ భాష ను అధ్యయనం చేసే ప్రయత్నం కూడా చేశాను…నా జబ్బు తిరుగుముఖం పట్టలేదు, నా కథ అక్కడితో అయి పోయింది.
కాని నాయనా, నీ కథ మిగిలే ఉందేమో ! నీ వంశ చరిత్ర కి సంబంధించిన ఆధారాలనీ నేను శ్రమించి సేకరించిన సమాచారాన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను. నీకు పూర్తి విచక్షణా జ్ఞానం కలిగే వయసు వచ్చాకే ఇవి నీకు అందేలాగా నిర్ణయించాను. ప్రపంచపు గొప్ప రహస్యాలలో ఒకటైన దీన్ని భేదించే ప్రయత్నం చేస్తావో , లేదా ఒక మతిస్థిమితం లేని ఆడ మనిషి కల్పించిన కాకమ్మ కథ గా కొట్టి పారేసి ఊరుకుంటావో – అది పూర్తిగా నీ ఇష్టం.
నా వరకూ అయితే ఇది కట్టు కథ కాదు. ప్రాణ శక్తులు కేంద్రీకరించబడి ఉండే ఆ చోటుని కనుగొనవచ్చుననే నేను భావిస్తున్నాను. జీవం అన్నది ఉన్నప్పుడు దాన్ని ఎప్పటికీ నిలిపి ఉంచే మార్గం మాత్రం ఎందుకుండదు ? కాని నేను నిన్నేమీ ముందే ఒప్పించెయ్యాలనుకోవటం లేదు. పూర్తిగా చదివి నువ్వే తేల్చుకో. నువ్వు అన్వేషణ ప్రారంభించాలనుకుంటే దానికి అవసరమయేదంతా నేను సమకూర్చి ఉంచాను. నీకు నమ్మకం కుదరకపోతే ఈ మట్టి పలకనీ తక్కినవాటన్నిటినీ నాశనం చేసేయి..ఇక్కడితో మన వంశం నుంచీ ఈ ప్రపంచం నుంచీ దాన్ని బహిష్కరించు. నిజానికి అలా చేయటమే మంచిదేమో కూడా. బొత్తిగా తెలియని సంగతులకి భయపడటమే మంచిది , వాటినుంచి దూరంగా ఉండటమే నయం – అవి ఎక్కువసార్లు భయంకరంగానే ఉంటాయి. నీ అన్వేషణ జయప్రదంగా ముగిసిందే అనుకో ; అతి బలవత్తరమైన ఆ కాలాన్ని.. రక్తమాంసాలనీ బుద్ధినీ వివేకాన్నీ క్షీణింపజేసే ఆ శక్తిని- నువ్వు గెలిచి ఎప్పటికీ యువకుడిగా, జ్ఞానవంతుడిగా మిగిలా వే అ నుకో….అది నీకు ఆనందాన్నే కలిగిస్తుందని నమ్మకం ఏమిటి ? ఆలోచించి ఎంచుకో బాబూ…తిరిగి రాలేనంత దూరం వెళ్ళకు !
నీ ఆనందానికీ ప్రపంచపు శ్రేయస్సుకీ ఏది పనికి వస్తుందని నీకు అనిపిస్తుందో ఆ వైపుకే ప్రయాణించు ! నువ్వు సాధించిన అనుభవం తో ఆ ప్రపంచాన్నే ఏలగలవేమో..ఎవరికి తెలుసు! ఇక సెలవు . ”
అక్కడితో ఆ జాబు ముగిసింది..తేదీగానీ సంతకంగానీ లేదు.
” ఏమంటావు అంకుల్ హాలీ ? ” లియో ఉత్తరాన్ని పక్కన పెడుతూ అన్నాడు…” ఒక రహస్యం కోసమేకదా వెతుకుతున్నాం మనం, ఇది అక్షరాలా గొప్ప రహస్యమే ..”
” ఆ ఇరవై ఏళ్ళ కిందట అనుకున్నట్లే ఇప్పుడూ అనుకుంటున్నాను లియో..మీ నాన్నకి బొత్తిగా మతిపోయిందని ! అనవసరంగా తొందరపడి ప్రాణాలు కూడా తీసుకున్నడు, పూర్తిగా అర్థం లేని వ్యవహారం ఇదంతా ”
” కచ్చితంగా అంతేనయ్యా ” జాబ్ గట్టిగా అన్నాడు , అతను అన్ని విధాలా సాయిలా పాయిలా మనిషి మరి.
” సరే, ఏమైతేనేం..ఆ మట్టి పలక మీద ఏమని రాసిఉందో చూస్తే పోలేదూ ” అని, లియో , పైకి చదవటం మొదలుపెట్టాడు.
” ఈజిప్ట్ ఫారో ల రాజవంశానికి చెందిన పూజారి, దేవానాం ప్రియుడూ రాక్షసవిరోధీ అయిన కాలిక్రేటస్[శూరసుందరుడు ] ధర్మపత్నిని, అమెనార్టస్ అనే నేను, మృత్యుముఖం లో ఉండి, నా కొడుకైన టిసిస్థేనస్ [ప్రతీకార సమర్థుడు ] కి చెబుతున్నాను. నెక్టనెబెస్ పాలించే కాలం లో, నా మీది ప్రేమ వల్ల నీ తండ్రి తన [ దైవసేవ కే అంకితమయే ] వాగ్దానాలను భగ్నం చేశాక , మేమిద్దరం ఈజిప్ట్ ను వదిలి వెళ్ళాము. కొద్దిమంది పరివారం తో కలిసి సముద్రం మీద ఇరవై నాలుగు పౌర్ణముల పర్యంతం ప్రయాణించి, ఉదయించే సూర్యుడికి అభిముఖంగా ఉన్న లిబియా [ ఆఫ్రికా ] తీరాన్ని చేరుకున్నాము. అక్కడి నది ఒడ్డున ఇథియోపియన్ జాతి మనిషి శిరస్సు ఆకారం లో ఒక పర్వతశిఖరం ఉంది. వరదలో ఉన్న నది ఉధృతిని మా నౌక నాలుగు రోజుల పాటు ఎదుర్కొని, చివరికి ముక్కలైంది. మాలో కొందరు మునిగిపోయారు, ఇంకొందరు వ్యాధిగ్రస్తులై మరణించారు. తప్పించుకున్నవాళ్ళం – అక్కడి బురద నేలల్లో పదిరోజులపాటు నడిచి, గుహలతో నిండి ఉన్న మరొక పర్వతాన్ని చేరాము. ఆ గుహలకి అంతు ఎక్కడో నరమానవుడెవరికీ తెలియదు, ఆ పర్వతపాదం లో ఒక మహా నగరపు శిథిలాలు కనిపించాయి. అక్కడి ఆటవికలు మమ్మల్ని బంధించి కళ్ళకు గంతలు కట్టి వారి రాణి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆమె మంత్రతంత్రాలు తెలిసినది , చరాచర జీవరాశులన్నిటి భూత భవిష్యద్వర్తమానాలూ ఆమె ఎరుగును. ఆమె జీవశక్తీ సౌందర్యమూ తరిగిపోనివి. నా భర్త కాలిక్రేటస్ ను ఆమె చూస్తూనే ప్రేమించింది. ఆయనకు ఆమె పట్ల భయం మాత్రమే కలిగింది , నా మీద ఆయన ప్రేమా ఏమాత్రం చలించలేదు. అప్పుడు ఆమె మమ్మల్ని దుర్గమమైన దారులవెంట నడిపించి ఒక అనంతమైన అగాథపు సమీపానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్నది, ప్రాణశక్తి నిండిన జ్వాలా స్థంభం. ఆమె ఆ అగ్నిశిఖలలో ప్రవేశించి చెక్కుచెదరకుండా, ఇనుమడించిన సౌందర్యం తో బయటికి వచ్చింది. నన్ను సంహరించి ఆమెను చేపట్టినట్లైతే నా భర్తనూ తన లాగా చావులేనివాడుగా, నిత్య యౌవనుడిగా – చేస్తానని ప్రకటించింది. [ నేను జన్మించిన వంశం చాలా శక్తివంతమైనది , అందువల్ల నన్ను చంపటం ఆమె కి సాధ్యం కాలేదు. ] ఆయన తన కళ్ళు చేతులతో మూసుకుని, ఎప్పటికీ ఆ పని చేయలేనని సమాధానమిచ్చాడు. ఆమె ఆగ్రహం తో ఆయనను అక్కడికక్కడే చంపేసింది , కాని ఆ వెంటనే పశ్చాత్తాపం తో ఆయన శరీరం మీద పడి అమితంగా దుఃఖించింది. నాకు భయపడింది కనుక నాకేమీ హాని తలపెట్టలేదు ..నదీముఖం లో, పడవలు వచ్చి ఆగే చోట – వదిలిపెట్టించింది. నన్ను కొందరు నావికులు రక్షించి తీ సుకువెళ్ళారు , నువ్వు పుట్టావు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఆఖరికి నీతోబాటు ఏథెన్స్ చేరుకోగలిగాను. పుత్రుడా, టిసిస్థేనస్ ! నీకిదే చెబుతున్నాను , ఆమె ను కనుగొని ఆ శాశ్వత జీవితపు రహస్యాన్ని భేదించు , చంపగలిగే మార్గం దొరికితే ఆమెను సంహరించు , నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకో. నీవల్ల ఆ పని జరగకపొతే నీ కుమారుడికి అప్పగించు , అవసరమైతే ఆ తర్వాత అతని కుమారుడికి. ఈ కార్యం నెరవేరేవరకూ మన వంశం లో వారికి ఈ ఆజ్ఞ అందజేయబడుతూ ఉండాలి. ఆ దివ్యాగ్ని లో స్నానం చేసి జరామరణాలను గెలిచి ఫారోల సిం హాసనాన్ని అధిష్టించగలిగే ధీశాలి ఒకడు ఎప్పటికో ఒకప్పటికి నా సంతతిలో జన్మిస్తాడని నమ్ముతున్నాను. ఈ విషయాలు నమ్మశక్యం కానివిగా అనిపించవచ్చు, కాని స్వయంగా చూశాను, తెలుసుకున్నాను – నేను అబద్ధమాడను. ”
” ప్రభువు ఆమెను మన్నించుగాక ! ” – నోరు తెరుచుకుని వింటూ ఉన్న జాబ్ మూలిగాడు.
నాకైతే – మరణించిన నా మిత్రుడు విన్సేయే చిత్తభ్రమకు లోనై ఈ కథంతా కల్పించి ఉంటాడనిపించింది . కాకపోతే ,అలాంటి కల్పన చేయటం సులభం కాదేమో , అంత పకడ్బందీ గా ఉంది. మట్టి పలకని తీసుకుని పరిశీలించాను .. ఉబ్బెత్తుగా ఉన్నవైపున, జేగురురంగు అక్షరాలలో రాసి ఉన్నది – నిజంగా ప్రాచీనమైన గ్రీక్ భాష , ఆ కాలానికి తగినంత సాధికారంగా ఉంది , రాసినది ఈజిప్ట్ దేశస్థురాలైనా కూడా. [ ఆ నెక్టెనెబెస్ ( రెండవ నెక్టెనెబో ) క్రీస్తుపూర్వం 399 ప్రాంతం వాడు. ఈజిప్ట్ ని ఏలిన స్వదేశీ ఫారోలలో చివరివాడు. తన ఏలుబడి చివరి రోజులలో ఓకస్ నుంచి ఇథియోపియాకి పారిపోయాడు. ]
ఆ పలక మీద , పై సమాచారం తో బాటుగా, కాలిక్రేటస్ అనే పేరుతో, ఈజిప్ట్ రాజవంశీకులకి ప్రత్యేకమైన రాజముద్ర [ Cartouche ] ఉంది. దానిలో గుర్తులు తిరగేసి ఉన్నాయి [మైనం మీద ముద్రించినప్పుడు సరిగ్గా వచ్చేందుకు ] , అది ఆ కాలపుదేనో, లేక ఆ తర్వాత చెక్కబడిందో- నాకైతే తెలియలేదు. ఈ కథలో చెప్పబడిన కాలిక్రేటస్ కులీనవంశానికి చెందినవాడే అయినప్పటికీ రాజు గానీ యువరాజుగానీ కాడు, మరి అతని పేరిట ఆ ముద్ర ఎలా ఉందో కూడా నాకు అర్థం కాలేదు…ఆ పేరుతోనే మరొక రాజవంశీకుడు ఉన్నాడా ? అన్నిటికీ అడుగున రెక్కలు చాపిన స్ఫింక్స్ బొమ్మ చెక్కబడి ఉంది.
పలకని వెనక్కి తిప్పి చూశాను. పైనుంచీ కిందివరకూ గుర్తుగా రాసిపెట్టిన వాక్యాలూ సంతకాలూ…వరసగా గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నాయి. మొదటి రాత ఈ కథలో చెప్పిన అమెనార్టస్ పుత్రుడు టిసిస్థేనస్ ది . ‘ నా తల్లి ఆజ్ఞను నేను అమలుచేయలేకపోయినందువలన నా కుమారుడు కాలిక్రేటస్ కి అప్పగించటమైనది – ఇట్లు కాలిక్రేటస్ అమెనార్టస్ ల పుత్రుడు టిసిస్థేనస్ అని ఉంది. తాత పేరు పెట్టుకున్న మనవడు కాలిక్రేటస్ ఆ దిగువన రాశాడు , ఇలా -” దేవతలు సుముఖంగా లేనందున నా ప్రయాణం కొనసాగించలేకపోయాను , నాకుమారుడికి- కాలిక్రేటస్ ”
ఆ తర్వాత చదవగలిగిన సమాచారాల్లో ఒకదానిలో ” Romae, A.U.C [ab urbe condita] [ రోమ్ నగరం స్థాపించబడిన తర్వాత అని అర్థం. ఇది రోమన్ కాలమానం ] అని ఉండటం ఆ కుటుంబం రోమ్ నగరానికి వెళ్ళి స్థిరపడటాన్ని సూచిస్తోంది. ఏ సంవత్సరం వరకూ వారు అక్కడ ఉన్నారో తెలుసుకోవటం వీలవలేదు, పలక అక్కడ విరిగిపోయి ఉంది.
ఆ తర్వాత వరసగా పన్నెండు సమాచారాలూ సంతకాలూ లాటిన్ లో ఉన్నాయి- ‘ విండెక్స్ ‘ అనే వంశనామం తో . టిసిస్థేనస్ అంటే గ్రీక్ లో పగ తీర్చగలిగిన బలశాలి అనే అర్థం ఉన్నట్లే, లాటిన్ లో విండెక్స్ అనే మాటకీ అటువంటి అర్థమే ఉంది. ఆ పదం క్రమేపీ డి – విన్సే గా మారి, ఆఖరికి ఒట్టి విన్సే గా మిగిలింది. ఇంగ్లీష్ లో ఉన్నవాటిలో ఒకటి లియొనెల్ విన్సే పేరు మీద ఉంది- అతను లియో కి తాత. క్రీస్తుపూర్వపు ఈజిప్షియన్ వారి విచిత్ర గాథ లో ఆ ఇంగ్లీష్ వంశనామం ఉండటం ఆశ్చర్యంగా ,ఆసక్తికరంగా అనిపించింది. అందులో రాసి ఉన్న కొన్ని రోమన్ పేర్లని నేను ఇదివరకు చరిత్ర గ్రంథాలలో , భాండాగారాలలోని కవిలె లలో చూసి నిజంగానే ఉన్నాను .
రోమన్ [లాటిన్ లో రాసి ఉన్న ] పేర్ల తర్వాత కొన్ని శతాబ్దాల కాలం ఖాళీ గా ఉంది , ఆ చీకటి యుగాల్లో[ dark ages ] ఈ ఫలకం చరిత్ర ఏమిటో తెలియదు. తమ కుటుంబం వారు రోమ్ నుంచి లొంబార్డీ కి వచ్చారనీ చార్ల్ మేన్ కాలం లో ఆల్ప్స్ పర్వతాలు దాటి బ్రిటానీ [ ఫ్రాన్స్ ] కీ ఆ తర్వాత Edward The Confessor కాలంలో ఇంగ్లండ్ కీ వచ్చి అక్కడ స్థిరపడ్డారని నా మిత్రుడు విన్సే చెప్పి ఉన్నాడు. బ్రిటానీ గురించి మటుకే ఫలకం లో ప్రస్తావన ఉంది , చార్ల్ మేన్ గురించీ లొంబార్డీ గురించీ ఏమీ లేదు – విన్సే కి ఆ విషయాలు ఎలా తెలిశాయో
మరి ?
ఆ దిగువన ఎరుపు రంగుతో [ బహుశా రక్తం తోనేమో ] వేసి ఉన్న రెండు శిలువ గుర్తులు కనిపించాయి , అవి Crusaders ఖడ్గాలు అయిఉంటాయి. [ 11-13 వ శతాబ్దాల కాలం ]
అన్నిటి కన్న వింతగా ఉన్నది మాత్రం 1150 నుంచీ 17 వ శతాబ్దం వరకూ అమలులో ఉండిన లాటిన్ లిపి లో [Blackletter Latin ] ఉన్న సమాచారం. దాని తేదీ 1445 వ సంవత్సరం. రాసిన మనిషి లాటిన్ లో మంచి పండితుడై ఉంటాడు.
1564 లో జాన్ విన్సే అనే అతను ఇలా రాశాడు – ” ఆఫ్రికా తూర్పు తీరం లో చేయబూనిన విచిత్రాన్వేషణ లో నా తండ్రి ప్రాణాలు
పో గొట్టుకున్నాడు. ఆయన పడవను పోర్చ్ గీస్ వారు ముంచివేశారు ”
మరొకటి పద్దెనిమిదో శతాబ్దపు మధ్య కాలానిదని గ్రహించాను , ఎందుకంటే షేక్ స్పియర్ నాటకం ‘ హామ్ లెట్ ‘ లోని మాటలు ఆ కాలం లోనే అలా తప్పుగా వాడుకలో ఉండేవి.
చదవగలిగే వీలున్న సమాచారాన్నంతా పరిశీలించటం పూర్తి చేసి , లియో తో అన్నాను – ” అంతా అయింది లియో , నేనొక అభిప్రాయానికి వచ్చాను. నువ్వూ నీ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవచ్చు ఇంక ”
” నువ్వేమనుకుంటున్నావు అంకుల్ హాలీ ? ”
” ఈ మట్టి పలక అసలైనదే . క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నుంచి తరతరాలుగా మీ వంశం లో వారికి అందుతూ వస్తున్న మాట నిజమే . మీ పూర్వీకురాలో , లేక ఆమె తరపున ఎవరో వ్రాయసకాడో దీని పైన ఇదంతా రాశారని ఒప్పుకు తీరాలి..అయితే అంత వరకే. భర్తను పోగొట్టుకున్న బాధలో, ఆ తర్వాత పడిన కష్టాలలో ఆవిడకి మతి చలించి ఉండాలి , అనుమానం లేదు ”
” మరి మా నాన్న ఆఫ్రికా తీరం లో అటువంటి చోటొకటి నిజంగానే ఉందని విన్నాడు కదా, దానికేమంటావు ? ”
” కేవల కాకతాళీయం అయిఉండాలి.ఆఫ్రికా తీరం లో మనిషి తల ఆకారం లో కొండలు ఉండచ్చు, అక్కడి జనం అపభ్రంశపు అరబిక్ భాష మాట్లాడుతూండవచ్చు, అటువంటి చిత్తడి నేలలూ అక్కడ ఉండి ఉండవచ్చు…అందులో వింతేముంది ? మీ నాన్నకీ ఆ ఉత్తరం రాస్తున్నప్పుడు మతి సరిగ్గా లేదనే నేను అనుకుంటున్నాను. మీ అమ్మ పోవటం, జబ్బు చెయ్యటం …అతన్ని యాతన పెట్టి మనసుని బలహీనం చేసి వదిలాయి. ఆ స్థితిలో ఈ కట్టు కథకి తనూ చిలవలూ పలవలూ అల్లుకున్నాడు పాపం ! మనకి తెలీనివీ అంతు పట్టనివీ ఈ ప్రపంచం లో ఉంటే ఉండచ్చు – కాని నాకు అవి ఎదురైతేనేగాని నేను నమ్మను, ఎప్పటికీ ఎదురు పడనే పడవని మాత్రం బలంగా నమ్ముతాను. ఆఫ్రికా లో చిల్లర మంత్రగత్తెలకి కొదవేమీ లేదు. కాని ఆమె ఎవరో, చావునీ ముసలితనాన్నీ జయించి అప్పటినుంచీ ఇప్పటిదాకా అలాగే ఉండటమేమిటి…ఇంత అర్థం పర్థం లేని మాటలు నేనెప్పుడూ వినలేదు…జాబ్! నువ్వేమంటావు ? ”
” ఇదంతా పచ్చి అబద్ధం అయ్యా ! ఒకవేళ నిజమే అయినా దీని జోలికి మన లియో వెళ్ళకుండా ఉండటమే మంచిది , వెళితే నష్టం తప్ప లాభమేమీ ఉండదు ”
” మీరనేది నిజమే కావచ్చు, కాదనటం లేదు నేను. అయితే ఈ సంగతేదో తప్పకుండా తేల్చి తీరాలి, మీరు గనుక రాకపోతే నేనొక్కడినే వెళతాను ” అనేశాడు లియో.
అతని వైపు తేరిపారజూశాను… ఆ వాలకం చూస్తే నిర్ణయించేసుకున్నాడనే అనిపించింది- ఏదన్నా పట్టు పట్టినప్పటి క వళిక అలాగే ఉంటుంది చిన్నప్పటినుంచీ , నాకు తెలుసు. అయితే ఒక్కడినే వెళ్ళనిచ్చేది మటుకు లేదు.. అతని కోసంకాదు, నా కోసమే ! ప్రపంచం లో నాకింకె వరూ లేరు..తమ్ముడూ కొడుకూ స్నేహితుడూ .. నా సర్వస్వమూ లియోనే . అతనికే విసుగు పుడితే తప్ప నేను వదిలి ఉండలేను. కాని ఆ సంగతి తెలిసిపోవటం ఇష్టం లేక , ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
” వెళతాను అంకుల్… ఆ ‘ ప్రాణ స్థంభం ‘ ఏదో కనపడకపోయినా , అడవుల్లో కావలసినంతగా వేటాడే అవకాశం ఉంటుంది కదా ! ”
” ఆ..అవును కదూ ? నేనా విషయం ఆలోచించనేలేదు ! మంచి అడవి దున్నని వేటాడాలని ఎప్పటినుంచో ఉంది నాకు …అందుకోసమైనా అక్కడికి వెళ్ళచ్చు. నువ్వు వెళ్ళాలనే నిశ్చయించుకుంటే, కళాశాలకి సెలవు పెట్టి నేనూ వస్తాలే ”
”అవునవును, అలాంటి అవకాశాన్ని నువ్వెందుకు వదులుకుంటావు ! వెళదాం అయితే…మరి డబ్బు సంగతి ? చాలానే ఖర్చవుతుందేమో ? ”
” ఆ దిగులేమీ లేదు…మీ నాన్న దాచి ఉంచినది, వడ్డీ తో కలిపి బోలెడయింది. అదిగాక నా ఆదాయం సగానికి పైగా పొదుపు చేసి ఉంచాను కూడా, కావలసినంత డబ్బుంది ”
” సరే అయితే. ఇవన్నీ సర్దేసి పట్నం వెళ్ళి తుపాకుల సంగతి చూద్దాం. నువ్వూ వస్తావా జాబ్ ? ఇప్పటికైనా ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి కదా నువ్వు ? ”
” నాకేమీ విదేశాల మీద మోజు లేదులెండి గాని, మిమ్మల్నిద్దర్నీకనిపెట్టుకుందుకు ఎవరో ఒకరు ఉండద్దా మరి ? ఇన్నేళ్ళూ చేసి ఇప్పుడు వదిలేస్తానా ? అలాంటివాడిని కాదు నేను.. ”
” నువ్వన్నది నిజమే జాబ్ , నువ్వు లేకపోతే మేమేమై పోతాము ! ఇదిగో, ఇద్దరూ వినండి..ఈ మట్టి పలక వ్యవహారం ఎవ్వరికీ చెప్పకండి. ఎవరికైనా తెలిసి , ఆ తర్వాత నాకేదైనా అయితే- మతిలేనివాడినని నా విల్లు కూడా చెల్లదు , కేంబ్రిడ్జ్ లో అంతా నవ్వుకోగలరు ! ”
ఆ తర్వాత సరిగ్గా మూడు నెలలకి జాంజిబార్ వెళ్ళే ఓడ లో ఉన్నాము.
ఇప్పటివరకూ చెప్పినదానికీ ఇకమీదట చెప్పబోయేదానికీ ఏమీ సంబంధం లేదు. నిశ్శబ్దమైన కళాశాల భవనాలూ గాలికి ఊగే ఎల్మ్ వృక్షాలూ వాటిపైని పక్షుల అరుపులూ అల్మైరాలలో అలవాటైన ఉద్గ్రంథాలూ..ఇవన్నీ మాయమై వాటిస్థానం లో ఆఫ్రికన్ చంద్రకాంతి లో తళతళలాడుతూన్న మహాసముద్రం ప్రత్యక్షమైంది. మెల్లని గాలితెరలు వీస్తున్నాయి…నీటి సవ్వడి మధురంగా వినబడుతూ ఉంటేమా నౌక ముందుకి సాగుతూంది. అర్థరాత్రి కావస్తూంది, అంతా నిద్రకి జోగుతున్నారు. మహమ్మద్ అనే అరబ్ నావికుడు మాత్రం చుక్కాని పట్టుకుని నక్షత్రాల వెంట ఓడని నడిపిస్తున్నాడు. దృఢంగా చామనచాయగా ఉంటాడు అతను. మా నౌకకి కుడి వైపున మూడు మైళ్ళ దూరం లో మధ్య ఆఫ్రికా తూర్పు తీరం ఉంది. ప్రధాన భూభాగానికీ తీరం వెంబడి పరుచుకుని ఉన్న రాతి గుట్టలకీ మధ్యన మా ప్రయాణం సాగుతోంది . ప్రమాదభరి త మైన ప్రయాణం – ఎందుకంటే మేము ఈశాన్య ఋతుపవనాల వెంట కాకుండా వాటికి ముందుగా దక్షిణంగా వెళుతున్నాం . రాత్రి పూర్తిగా సద్దు మణిగి ఉంది , చీమ చిటుక్కుమన్నా వినిపించేంత. దూరతీరాలనుంచి భూమ్మని ధ్వని ఏదో మంద్రంగా చెవుల్లో పడుతోంది.
మహమ్మద్ చేయి పైకెత్తి ఒకే మాట అన్నాడు ” సింహం ”
అందరం లేచి కూర్చుని ఆలకించాము. మెల్లిగా, గంభీరంగా వస్తోంది ఆ శబ్దం..ఒళ్ళు జలదరించింది .
నేను అన్నాను ..” కెప్టెన్ చెప్పినప్రకారం అయితే, రేపు పొద్దున పది గంటలకి ఆ మనిషి తల ఆకారం లో ఉండే ఆ వింత కొండని చేరాలి…అప్పుడిక వేట మొదలు పెట్టచ్చు ”
” శిథిల నగరాన్నీ , ప్రాణ జ్వాలనీ అన్వేషించటం ప్రారంభించవచ్చు ” లియో నవ్వుతూ సవరించాడు.
” పిచ్చి మాటలు వద్దు ” – నేను ఖండించాను. ఇవాళ మధ్యాహ్నమంతా మహమ్మద్ తో నువ్వు అరబిక్ లో మాట్లాడుతున్నావు కదా ? ఏం చెప్పాడు అతను ? ఈ ప్రాంతాలలో బానిసల వ్యాపారం చేస్తూ అతని సగం జీవితం గడిచిపోయిందనీ , ఒకసారైతే ఆ మనిషి తల కొండకి కూడా వెళ్ళి ఉన్నాననీ చెప్పలేదూ అతను ? ఆ శిథిలనగరం గురించీ గుహల గురించీ ఎప్పుడైనా విన్నాడా ? ”
” లేదు ” జవాబు చెప్పాడు లియో – ” అక్కడంతా చిత్తడి నేల అనీ పాములూ కొండ చిలువలూ తిరుగుతాయనీ మనుష్య సంచారం లేదనీ చెప్పాడు నిజమే. ఆ బురద నేలలు ఆఫ్రికా తీరమంతా ఉన్నాయి, అది కొత్త విషయమేమీ కాదు ”
” అవును , వాటిలో మలేరియా జ్వరాలూ ఉన్నాయి. నౌకలో వాళ్ళంతా ఒకే మాటగా మన వెంట దీవి లోపలికి రామని చెప్పేశారు , విన్నావా ? మనకి పిచ్చి పట్టిందనుకుంటున్నారు, వాళ్ళ ఊహ నిజమేనేమో కూడా. తిరిగి ఇంగ్లండ్ తీరాన్ని చూస్తామని నాకు ఆశ లేదు.. ఇవాళ కాకపోతే రేపు పోవలసిన వాణ్ణి నేను , నాకేం పర్వాలేదు- నా భయమంతా నీ గురించే…పాపం జాబ్ చిన్నవాడే , అతని గురించి కూడా. ఇదంతా ఒట్టి వెర్రి వ్యవహారం లియో ! ”
” కావచ్చు అంకుల్ హొరేస్ ! నా వరకూ నేను మటుకు దీని సంగతేదో చూడాలనే అనుకుంటున్నాను ..అరె, చూడు ! ఆ మేఘాలు…” మాకు కొన్ని మైళ్ళ వెనకగా, చుక్కలతో మిలమిలమంటున్న ఆకాశం మీద నల్లటి మచ్చ.
” వెళ్ళి అవేమిటో మహమ్మద్ ని అడుగు ”
అతని లేచి ఒళ్ళు విరుచుకుని వెళ్ళి వచ్చాడు…” మహమ్మద్ అది గాలివాన అన్నాడు , కాకపోతే మనకి దూరంగానే దాటిపోతుందట ”
సరిగ్గా అప్పుడే జాబ్ అక్కడికి వచ్చాడు – మట్టి రంగు ఫ్లానెల్ సూట్ లో , ఇంగ్లీష్ వాలకం ఉట్టిపడుతూ. అతని గుండ్రటి మొహం లో ఆందోళన నిండిపోయింది , నిజానికి ఈ విదేశాలకి వచ్చినప్పటినుంచీ అంతే. తలమీద ఒకవైపుకి జారిపోయిన టోపీని [ మర్యాదను సూచించేందుకు ] ముట్టుకుంటూ అన్నాడు -
” అయ్యా, దయచేసి నేను చిన్న పడవ లోకి వెళ్ళి పడుకుంటానండీ. తుపాకులూ సరుకులూ అన్నీ అక్కడే ఉన్నాయిగదా, ఏ రాత్రప్పుడో ఈ పడవవాళ్ళు దాని తాడు తెంచేసి పట్టుకు పోతే మనగతేం కాను చెప్పండి..వీళ్ళని చూస్తే నాకెందుకో దడగా ఉంది ”
ఈ ‘ చిన్న పడవ ‘ మరీ అంత చిన్నదేమీ కాదు , ముప్ఫై అడుగుల పొడవుంటుంది. మధ్యని మంచి తెరచాప , పురుగూ పుట్రా రాకుండా అడుగున రాగి రేకులు తాపడం చేశారు , నీరు చొరబడకుండా కట్టుదిట్టం చేశారు. స్కాట్లండ్ లోని డండీ లో తయారు చేయించాం దాన్ని … నీటి లోతు చాలకపోతే మేము ప్రయాణిస్తూన్న నౌక దీవి ఒడ్డు వరకూ వెళ్ళకపోవచ్చునని కెప్టెన్ ముందే చెప్పి ఉంచాడు గనుక ఆ ముందు రోజు రాత్రే చిన్న పడవలోకి మా సామగ్రిని చాలా భాగం చేరవేశాము… ఆ మనిషి తలకొండ కనబడుతూనే మేం ముగ్గురం అందులోకి దిగి వెళ్ళిపోవటమే .
నాకూ జాబ్ చెప్పిన సూచనని పాటించటం ఎందుకైనా మంచిదనిపించింది. స్వతహా జాబ్ ఈ విదేశీయులని అనవసరంగా అనుమానించే మనిషే అయినా , జాగ్రత్త పడదామనే అనుకున్నాను.
అతన్ని చిన్న పడవలోకి దించి నౌకకి దాన్ని కట్టి ఉంచిన మోకుని ఒకసారి సరిచూసి నేనూ లియో వెళ్ళి డెక్ మీద కూర్చున్నాం. నేను పైప్ ముట్టించాను…ఏవో కొద్ది కొద్ది మాటలు మా మధ్యన. రాత్రి చాలా శాంతంగా ఉంది , మా మనసుల్లో మాత్రం అణిచిపెట్టుకున్న అలజడి. ఒక గంట గడిచాక ఇద్దరం నిద్రకి పడ్డాం…అడవి దున్నని వేటాడటం గురించి లియో ఏదో చెబుతూ ఉండటం లీలగా గుర్తుండింది , ఆ తర్వాత ఇంకేమీ జ్ఞాపకం లేదు.
ఉన్నట్ట్లుండి మెలకువ వచ్చింది. హోరుమని గాలి గర్జిస్తోంది…నీళ్ళు ఛెళ్ళుమని మొహాల మీద కొడుతున్నాయి, నావికుల హాహాకారాలతో అంతా అల్లకల్లోలం గా ఉంది. కొందరు నావికులు వెళ్ళి తెరచాపని దించుదామని ప్రయత్నించారు , కాని అది బిగిసిపోయి ఉంది. నేను రక్షణ కోసం ఒక గట్టి మోకుని పట్టుకు వేలాడాను. ఆకాశం బొగ్గుమసిలాగా అతినల్లగా ఉంది..కాని ఎందుకనో చంద్రుడు వెలుగుతూనే ఉన్నాడు. ఆ కాంతిలో దూరం నుంచి ఇరవై అడుగుల ఎత్తున మామీద విరిగిపడబోతున్న దయ్యపు అల…గాలివాన వేగానికి అంతకంతకీ ముం దు కి వచ్చేస్తూ. ఒక్క రెప్పపాటులో – ఆ అల మీద మా చిన్నపడవ ఊగిపోతూ కనిపించింది. అల విరుచుకుపడింది… మోకు ని గట్టిగా పట్టుకున్నాను , సుడిగాలి నన్ను నీటిలోకి విసిరికొట్టింది.
అల వెళ్ళిపోయింది. నీటి అడుగున చాలా నిమిషాలు ఉండిపోయాననిపించింది , కాని ఉన్నది కొద్ది సెకన్ల సేపు మాత్రమే. తలెత్తి పైకి చూస్తే..నౌక తెరచాప నిలుగా చిరిగిపోయింది , గాయపడిన పెద్ద పక్షిలాగా అది గాలిలో రెపరెపలాడుతోంది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. అప్పుడు జాబ్ పెట్టిన వెర్రి కేక – ” రండి ..పడవలోకి వచ్చెయ్యండి ”
అంత దిగ్భ్రాంతిలోనూ నాకు అటువైపుకి ఈదాలని స్ఫురించింది. కిందన నౌక మునిగిపోతూ ఉండటం తెలిసింది , దాని నిండా నీళ్ళు. దానికి కట్టి ఉన్న పడవ ఎడాపెడా కొట్టుకుంటోంది. చుక్కాని వదిలేసి మహమ్మద్ చిన్న పడవ లోకి దూకాడు. నేనూ పడవకి కట్టి ఉన్న తాడు దొరకబుచ్చుకుని లోపలికి దూకేశాను , జాబ్ నా చెయ్యిపట్టుకుని లాగి పడవ అడుగున పడేశాడు. ఆ క్షణం లోనే మహమ్మద్ తాడు కోసేశాడు, నౌక పూర్తిగా మునిగిపోయింది..దాని స్థానం లో, గాలివానని ఎదు ర్కొంటూ మా చిన్న పడవ ఉంది. అప్పుడు భయంగా అరిచాను నేను – ” ఓరి భగవంతుడా !!! లియో ఏడీ ? లియో ! లియో ! ”
” అయ్యో …ఆయన గల్లంతయ్యారండీ ” జాబ్ నా చెవిలోకి కేకపెట్టాడు. గాలివాన శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే , జాబ్ గొంతు గుసగుసగా తప్ప వినిపించలేదు.
దుర్భరమైన వేదన తో నేను కంపించిపోయాను…లియో మునిగిపోయాడా ? ఏడ్చేందుకు నేను మిగిలి ఉన్నానా ? ?
” చూడండి..ఇంకోటి ” – జాబ్ భయంతో గొంతు చించుకున్నాడు.
చూశాను…ఇందాకటి అల అంత ఎత్తునా ఇంకోటి మా మీదికి దూకుతోంది. అది నన్ను ముంచేస్తే బాగుండునని ఆశ పడ్డాను. ఒకలాంటి కుతూహలం తో చూస్తున్నాను…చంద్రుడు పూర్తిగా మూసుకుపోయాడు గాని సన్నపాటి వెలుతురు ఎక్కడినుంచో వస్తూనే ఉంది. అల పైన ఏదో శిథిలం నల్లగా కనిపిస్తోంది. అల మా మీద పడింది, పడవ నిండా నీళ్ళు..కాని దాని తయారీ లో ప్రత్యేకమైన అరలుండటం వల్ల అది అప్పటికైతే మునగలేదు , తేలుతూనే ఉంది. నీటి నురగల కల్లోలం మధ్యలోంచి ఆ నల్లటి శిథిలం నా మీదికే వచ్చింది..కుడి చేత్తో దాన్ని అడ్డుకోబోయాను , నా చేతికి ఇంకో చేయి తగిలింది…గట్టిగా ఆ మణికట్టుని ఒడిసిపట్టుకున్నాను. నేను చాలా బలంగలవాణ్ణే , ఇవతల నాకు పడవలో పట్టుకుందుకు ఆధారమూ ఉంది- కాని ఆ తేలుతూన్న శరీరపు బరువుకి నా చెయ్యి ఊడివచ్చినంత పనయింది. ఇంకొక రెండు సెకన్ల పాటు ఆ నీటి ఉధృతి అలాగే ఉండి ఉంటే ఆ చెయ్యిని నేను వదిలెయ్యటమో , నేనూ కొట్టుకుపోవటమో- ఏదో ఒకటి జరిగేది. కాని అల వెళ్ళిపోయింది..మేము మోకాటిబంటి నీటిలో ఉన్నాము.
” నీళ్ళు తోడిపొయ్యండి, త్వరగా ” జాబ్ అరిచాడు. నేను వెంటనే ఆ పని మొదలెట్టలేకపోయాను. ఇందాకటంత చంద్రకాంతి కూడా లేదు ..చిమ్మచీకటి. ఒక్క కిరణం లిప్తపాటు మెరిసింది…నేను పట్టుకుని ఉన్న మనిషి మొహం కనిపించింది. సగం పడుకుని, సగం తేలుతూ ఉన్న అతను- లియో. ఆ వెళ్ళిపోయిన అల అతన్ని మృత్యువు కోరల్లోంచి వెనక్కి తెచ్చినట్లుంది ..ప్రాణాలు ఉన్నాయో, లేదో ?
” నీళ్ళు తోడండి..లేదంటే మన పని అయిపోతుంది ” జాబ్ మళ్ళీ కేక పెట్టాడు.
కాడ ఉన్న పెద్ద రేకు గిన్నెలు రెండు దొరికాయి…వాటితో గబగబా తోడటం మొదలుపెట్టాము. మా చుట్టూ ఆ భయంకరమైన తుఫాను సుడులు తిరుగుతూనే ఉంది…మా పడవ గజ గజా వణికిపోతూనే ఉంది…నీళ్ళ చరుపులకీ గాలి విసురుకీ మా కళ్ళు మూసుకుపోతున్నాయి…అయినా మేము రాక్షసుల్లాగా పనిచేశాం…నిరాశ లోంచి వచ్చే ఆ ఉత్సాహం తో…అవును, నిరాశ లోంచి కూడా ఉత్సాహం వస్తుంది ! ఒక నిమిషం…మూడు నిమిషాలు..ఆరు నిమిషాలు…పడవ తేలికవటం మొదలైంది…కొత్త అల ఏదీ మీదపడలేదు. ఇంకో అయిదు నిమిషాల్లో పడవ బాగా ఖాళీ అయింది. అప్పుడు ..తగ్గుస్థాయిలో , లోతుగా – గర్జన వంటి ధ్వని , తుఫాన్ శబ్దాల్లోంచి …దేవుడా ! మళ్ళీ అవే అలలు !!!
చంద్రుడి వెలుగు వచ్చింది ..మాకు అరమైలు అవతల తెల్లటి నురుగు పొడుగాటి గీతల్లాగా, మధ్య మధ్యన నల్లటి ఖాళీ లతో .. అవి ఇంకొన్నిదయ్యపు అలలు..వాటిముందు మా పడవ ఒక పిచ్చుకపాటి కూడా చెయ్యదు. మంచునురగలతో పొగలూ సెగలూ కక్కుతూ , అవి – మీదపడి కరవబోతున్న మహాసర్పాలలాగా, తెరుచుకుంటున్న నరకద్వారాల లాగా !!!!!!!
” చుక్కాని పట్టుకో మహమ్మద్ ” గట్టిగా చెప్పాను నేను – ” మనం వాటిని ఢీ కొని విరగ్గొట్టాలి, వేరే దారి లేదు ” ఒక తెడ్డు పుచ్చుకుని శక్తికొద్దీ దాన్ని వెయ్యటం మొదలుపెట్టాను , జాబ్ నీ అలాగే చెయ్యమన్నాను. ఇంకో నిమిషం లో మా పడవ , పందెపు గుర్రమంత వేగంగా దయ్యపు అలల్లోకి దూకి వాటిని చీలగొట్టింది. మాకు ఎదురుగా ఉన్న అలలు రెండు పక్కలా ఉన్నవాటికన్న కొంచెం పల్చగా అనిపించాయి…అవతల లోతయిన నీటిగూడు.
” బతకి బట్ట కట్టాలంటే అటు వైపుకి నడుపు మహమ్మద్ ” కేక పెట్టాను. అతను నైపుణ్యం ఉన్న నావికుడు , ఇలాంటి సందర్భాలను చాలావాటిని ఎదుర్కొని ఉన్నవాడు – చుక్కాని గట్టిగా పట్టుకుని ముందుకి వంగి భయంతో పెద్దవైన కళ్ళని ఇంకా ఇంకా మిటకరించి పరికించి చూశాడు. సముద్రపు వాలు మా కుడివైపుకి ఉంది…దానికి యాభై అడుగులలోపు ఆ దయ్యపు అలల్ని ఢీ కొట్టామా , మా పడవ మునిగిపోతుంది . విరిగిపడే , బుసకొట్టే అలల యుద్ధరంగం మధ్యలో , మహమ్మద్ పాదాలని పడవ అడుక్కి బోటు పెట్టి శక్తి కొద్దీ చుక్కాని పట్టుకు తిప్పాడు… కొంచెం తిరిగింది , కాని సరిపోదు. జాబ్ , నేనూ అతివేగంగా తెడ్లు వేశాము… ఈసారి పడవ పూర్తిగా తిరిగింది గాని అప్పటికి ఆలస్యం అవనే అయింది.
ఆ తర్వాతి రెండు నిమిషాలూ ఎలా గడిచాయో చెప్పలేను. సముద్రపు సమాధుల్లోంచి లేచిన దయ్యపు అలలు మమ్మల్ని కబళించేందుకు చేసిన విలయతాండవాన్నుంచి తప్పించుకోవటానికి మూలం మహమ్మద్ చాకచక్యం , కొంత మా అదృష్టం. వాటి కోరల్లోంచి బయటపడి ప్రశాంతమైన నీటిలోకి మా పడవ తేలుతూ ఉంటే మహమ్మద్ విజయగర్వం తో అరిచాడు.
పడవ నిండా మళ్ళీ నీరు చేరింది…అరమైలు దూరం లో ఇంకో దయ్యపు అలల సమూహమూ కనిపిస్తోంది. ప్రచండంగా పనిచేసి నీరు తోడిపోశాము. మా భాగ్యవశాన తుఫాన్ నెమ్మదించింది , చంద్రుడు పూర్తిగా కనిపిస్తున్నాడు. దూరంగా రాతిగట్టు ఒకటి సముద్రం లోకి చొచ్చుకువస్తూ కనిపించింది. దాని అడుగునే దయ్యపు అలలు బుస కొడుతూ ఉన్నా కూడా , ఆ గట్టు ఎటు కొనసాగుతోందో పరిక్షిస్తే , అది ఒక కొండలోకి కలుస్తోంది , ఆ కొండ భూమి మీదే కదాఉంది !!!
పడవలో నీరు దాదాపు మొత్తం తీసింది..అప్పుడే , నా ప్రాణాలు లేచి వచ్చేలాగా – లియో కళ్ళు విప్పాడు. పక్క మీది దుప్పట్లు నిద్రలో జారిపోయాయనీ చర్చ్ కి వెళ్ళే వేళ దాటిపోతోందనీ చెప్పాడు నాకు. నేను అతన్ని కళ్ళు మూసుకుని నిద్రపొమ్మన్నాను. అతను తనెక్కడున్నదీ కూడా గమనించుకోకుండా అలాగే నిద్రపోయాడు. అతను చర్చ్ గురించి మాట్లాడేప్పటికి నాకూ కేంబ్రిడ్జ్ లో నా సుఖమైన పరిసరాలు గుర్తొచ్చి దిగులుపుట్టింది. బుద్ధి తక్కువ కాకపోతే అదంతా ఎందుకు వదిలేసి వచ్చాను !
గాలి వేగం తగ్గింది …మెల్లిగా , ప్రవాహం వెంట , ప్రయాణిస్తున్నాం.
ఇంకో దయ్యపు అలల గుంపు ఎదురైంది. మహమ్మద్ ఎలుగెత్తి అల్లాను స్మరించాడు , నేనూ ప్రార్థన చేసుకున్నాను , జాబ్ ఇక్కడ రాసేందుకు వీల్లేని మాటలేవో అన్నాడు. మేము అలల్లోకి ప్రవేశించి అయిదు నిమిషాలపాటు పోరాడి బయటికి వచ్చాం , కాకపోతే ఇంతకుముందంత తీవ్రంగా లేదు మా యుద్ధం. త్వరలోనే మా పడవ, కనిపిస్తూన్న కొండకొమ్ము వైపుకి వేగంగా కదిలింది.
అయితే , ఆ కొండ చేరవస్తూన్న కొద్దీ పడవ వేగం మందగించింది. నీటి మీద తేలుతూన్న తెట్టు , లోతు తగ్గిపోవటమూ దీనికి కారణాలు…పైగా అక్కడొక నది సముద్రం లో కలుస్తోంది . త్వరలోనే పడవ ఇంచుమించుగా ఆగిపోయింది. తుఫాన్ పూర్తిగా తగ్గిపోయింది, ఆకాశం నిర్మలంగా ఉంది. ఆ నదీముఖం లో ఆగిన మేము పడవ లో నీటిని పూర్తిగా తోడేసి బాగు చేసుకున్నాం. లియో గాఢంగా నిద్రపోతున్నాడు , అతన్ని లేపకపోవటమే మంచిదనుకున్నాను. అతని బట్టలు తడిసిపోయి ఉన్నాయి నిజమే , కాని అతను యువకుడూ ఆరోగ్యవంతుడూ కనుక పర్వాలేదనుకున్నాను. వాతావరణం వెచ్చగానే ఉంది , మార్చేందుకు వేరే పొడిబట్టలూ లేవు .
చంద్రుడు అస్తమిస్తున్నాడు . సముద్రపు నీరు , ఊపిరి తీసుకుంటున్న వక్షం అంతగా మటుకే చలిస్తోంది. గడిచినదానంతటి గురించీ ఆలోచించుకునే తీరికి చిక్కింది మాకు- జాబ్ తెడ్లు వేసే దగ్గరే ఉన్నాడు, మహమ్మద్ చుక్కాని దగ్గర- నేను లియో పక్కనే కూర్చుండిపోయాను. తూర్పున వస్తూన్న కాంతిలో నక్షత్రాల వెలుగు పాలిపోవటం మొదలైంది. కొత్తగా పుట్టిన నీలిరంగు మీద తడబడే అడుగులతో వేకువ నడచి వచ్చింది. సముద్రం మరీ మరీ ప్రశాంతమైంది , మెత్తటి నురుగుకింద దాని అలజడి దాగిపోయింది..వికలమైన మనసు బాధను నిద్ర కప్పివేసినట్లుగా. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి…కొండ నుంచి కొండ మీదికి…గుప్పెళ్ళతో వెలుతురు చిమ్ముతూ ప్రభాతకిరణాలు విచ్చుకున్నాయి. చీకటి సమాధుల్లోంచి వెలువడి స్వర్గానికి చేరబోయే సత్పురుషుల ఆత్మలలాగా అవి ప్రకాశించాయి.
అది అత్యంత సుందరమైన దృశ్యం..దాని అందం బాధ పెట్టేంతటిది. సూర్యోదయం..సూర్యాస్తమయం…మానవ జీవితపు మొదటికీ చివరకీ ప్రతీకలని నాకు ఆవేళ కొత్తగా తిరిగి స్ఫురించింది- సాగర గర్భం లో కలిసిపోయిన మా సహప్రయాణీకులు గుర్తొచ్చి.
మేం నలుగురం రక్షించబడ్డాము, కాని అది ఇప్పటికి మటుకే , మాకూ ఒక రోజు వస్తుంది- వాళ్ళలో కలిసిపోయేందుకు .. ..
[ఇంకా ఉంది]
గ్రీక్ స్త్రీ చిత్ర పటాన్ని వదిలి రాలేనట్టు మీ యీ రచనని వదిలి రాలేకరాలేక వచ్చి యిలా మీకు నా ప్రేమైక అభినందనలు చెపుతున్నాను మైథిలీగారు.
ధన్యవాదాలు పద్మ గారూ
అద్భుతం గా ఉంది మీ రచనా శైలి!!! తరువాయిభాగం కోసం మరో నెల వరకు ఆగడం కష్టమే!
ధన్యవాదాలండీ. మూల రచయిత దే ఆ ఘనత అంతా.
Dhanyavadalu
చాలా సంతోషమండీ
Nagishee chekkina andamaina shilpam laa entha baagundo…Mythili garu, abhinandanalu.
thank you so much andee
నగిషీ చెక్కిన అందమైన శిల్పంలా ఉంది మీ రచన. అనువాదమంటే ఒప్పుకునేలా లేదు. అభినందనలు మైథిలి గారూ.
ధన్యవాదాలండీ
మైథిలి గారూ, బావుంది.. మొత్తం గబగబా చదివేస్తే బావుండునని ఉంది.
ధన్యవాదాలు రాధ గారూ
ఆ దెయ్యపు అలల సన్నివేశాన్ని ఎంత చక్కగా వ్రాసారండి. కళ్ళకు కట్టినట్లు గా ఉంది.
థాంక్ యూ సో మచ్ సురేష్ ..! చదువుతూ, తెలుగులోకి తెస్తూ ఉన్నప్పుడు నేనూ ఆ పడవలో ఊగిపోయాను.. ! ఊరికే అవుతాయా క్లాసిక్ లు , కదా ?