కథ

యు ఆర్ సెలక్టెడ్

నవంబర్ 2015

“డామ్లిన్నున్ లాయింగ్టంబమ్” సీవీ మీద వున్న ఆ పేరును రెండు మూడుసార్లు మళ్లీ పలికితేగానీ నోరు తిరగలేదు అర్చనకి. ఆ పేరుగల వ్యక్తి లోపలికి వచ్చాడు.”గూర్ఖా లాగా వున్నాడు” ఆమెకు వచ్చిన మొదటి ఆలోచన. పక్కనే వున్న వైస్ ప్రసిడెంట్ సావంగికర్ చిన్న గొంతుతో “అరే షాబ్ జీ” అని అర్చన వైపు చూసి కన్నుకొట్టి నవ్వాడు. ఇంటర్వ్యూ మొదలైంది.

అతనిది మణిపూర్ లో ఇంఫాల్ దగ్గర చిన్న ఊరు. పెద్ద కుటుంబం. చిన్న సంపాదన. వుండీ, లేక ఎంతో కష్టపడి ఎం.బీ.యే. దాకా వచ్చానని చెప్పాడు. ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నాడు కానీ ఎంతో జాగ్రత్తగా వింటే కానీ అది ఇంగ్లీషని అర్థం కావడం లేదు.

అర్చన కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆమెకి చాలా ఎక్సైటింగ్ గా వుంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇలాగే తన కాలేజీలో టేబుల్ కి మరో వైపు కూర్చోని ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు కూడా సావంగికరే వచ్చాడు. అతనితో పాటు ఎచ్.ఆర్. హెడ్ అనూప్ సింగ్. ఇప్పుడు అలాంటి టేబుల్ కి మరో వైపు కూర్చోవడం ఆమెకు ఎంతో సంతోషానిస్తోంది. నిజం చెప్పాలంటే గర్వాన్ని కూడా.

అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా నెమ్మదిగా పదాలు కూడగట్టుకుంటూ సమాధానాలు చెప్తున్నాడతను.

“ఆర్.బీ.ఐ. గవర్నర్ సీ.ఆర్.ఆర్. తగ్గించారు కదా… అందువల్ల ఎకానమీకి జరిగిన నష్టం చెప్పు” అడిగాడు సావంగికర్.

అర్చన ఆశ్చర్యంగా సావంగికర్ వైపు చూసింది. అది చాలా కష్టమైన ప్రశ్న. అప్పటిదాకా ఇంటర్వ్యూకి వచ్చిన స్టూడెంట్స్ స్టాండర్డ్ ని బట్టి అది చాలా పెద్ద ప్రశ్న. ఆ కాలేజీ కూడా పెద్ద పేరున్న కాలేజేమీ కాదు. గ్రేటర్ నోయిడాలో వున్న వందల కాలేజీలో ఇదొకటి. కాకపోతే సావంగికర్ కింద పనిచేసే ఏవీపీ అదే కాలేజి నుంచి వచ్చాడని, అతను బాగా పని చేస్తున్నాడనీ, ఆ కాలేజీకి కేంపస్ ప్లేస్మెంట్స్ కోసం వచ్చాడు. రిక్రూట్మెంట్ అంటే ఎచ్.ఆర్ తోడు తప్పనిసరి కాబట్టి ఆమె కూడా రావాల్సి వచ్చింది.

ఆమె డామ్లిన్నున్ వైపు చూసింది. పొట్టివాడు కావడం చేత ఎదురుగా వున్న టేబుల్ ని దాటి అతని భుజాలు, మెడ, తల మాత్రమే కనపడుతున్నాయి. చేతులు టేబుల్ మీద పెట్టుకోవడం కుదరలేదేమో ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న విని కుడిచేత్తో నుదిటి మీద చెమట తుడుచుకున్నాడు.

“సీ.ఆర్.ఆర్. తగ్గించడం వల్ల చాలా వరకు బ్యాంకులు వడ్డీ రేటు తగ్గిస్తాయి.. దాని వల్ల లోన్ తీసుకునేవారికి ఈ.ఎమ్.ఐ. తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ మంది లోను తీసుకుంటారు. సీ.ఆర్.ఆర్. తగ్గించడం వల్ల నాకు తెలిసినంత వరకు ఎకానమీకి మంచే జరుగుతుంది. నెగటివ్ ప్రభావం వుంటుందని నేను అనుకోను” అన్నాడతను.

చాలా చక్కని సమాధానం అనిపించింది అర్చనకి. అలాంటి ప్రశ్న తననే ఆడిగి వుంటే చేతులు ఎత్తేసేది. ఏడాది క్రితం ఇంటర్వ్యూలో ఇంతకన్నా సులభమైన ప్రశ్నలే అడిగారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అడిగారు. బట్టీ కొట్టిన సబ్జెక్ట్ లో నుంచి ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు. అది కూడా చెప్పలేకపోయింది. బయటికి వచ్చి “ఈ జాబ్ అనుమానమే” అని కూడా అంది. తన కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాళ్ళు చాలా మంది అప్పటికింకా ప్లేస్ కాలేదు. ఫస్ట్ ర్యాంకర్ కిరణ్ కుమార్ కే ఇంకా జాబ్ రాలేదు. అలాంటప్పుడు తనకి ఈ ఉద్యోగం వస్తుందని ఏ మాత్రం అనుకోలేదు. ఉన్నట్టుండి యు ఆర్ సెలక్టెడ్ అన్న మాట విని పొంగిపోయింది.

సావంగికర్ వైపు చూసింది. డామ్లిన్నున్ సమాధానాలు అతనికే మాత్రం నచ్చినట్లు లేదు. కోపంగా ముఖం పెట్టాడతను.

“వాట్? అది కూడా తెలియదా? ఎక్కువమంది లోన్లు తీసుకుంటే అందరి దగ్గర ఎక్సెస్ డబ్బు వుంటుంది… దానివల్ల ఏమౌతుంది?” అడిగాడు. అతను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కాక ర్యాగింగ్ చేస్తున్నట్లు అర్చనకి అనిపించింది.

“ఎకానమీలో ఎక్కువ డబ్బు వుంటే అన్ని వస్తువులకీ డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల అన్నింటి ధరలు పెరిగే అవకాశం వుంది. అంటే ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం వుంటుంది. మీ ప్రశ్నకి సమాధానం అదే అనుకుంటాను ”

“నేను ప్రామ్టింగ్ ఇస్తే కానీ చెప్పలేకపోయావ్…” అన్నాడు సావంగికర్ పెదవి విరిస్తూ.

“సారీ సార్” అన్నాడతను.

సావంగికర్ ఎప్పుడూ అంతే. అతని టీమ్ తో కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడని అందరూ అంటారు. అంతెందుకు అవసరం వున్నా లేకపోయినా వచ్చి తనతో మాట్లాడుతుంటాడు. నిన్న హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి పక్కనే వున్నాడు. ఏదో ఒక వంకతో తాకుతున్నాడు. అవసరం వున్నా లేకపోయినా గట్టిగా నవ్వేసి హైఫై కొట్టాలన్నట్లు చేతిని పైకి ఎత్తుతున్నాడు. కొన్ని సార్లు ఇవ్వక తప్పట్లేదు.

ఆ మాటకొస్తే ఆమె ఎక్స్ బాస్, ఆమెని క్యాంపస్ లో రిక్రూట్ చేసిన అనూప్ సింగ్ కూడా అంతే. ఏదో చేస్తాడని కాదు. కానీ ఆ చూపు లోనే ఏదో తేడా. ఒకోసారి మాటల్లో అనేస్తాడు కూడా “యు ఆర్ డామ్ సెక్సీ అర్చనా” అని.

మూడు నెలల క్రితం అతను రిజైన్ చేశాక అతని ప్లేస్ లో వందన రావడంతో ఆ ఇబ్బంది లేకుండా పోయింది. వెళ్ళే రోజు కూడా “మిస్ యు ఆల్” అంటూ అందరినీ బలవంతంగా కౌగిలించుకోని కుతి తీర్చుకున్నాడు.

“అంతకన్నా ముందుకెళ్ళే ధైర్యం వాళ్ళకీ వుండదు” చెప్పింది కొలీగ్ వైశాలి. “సెక్సువల్ హెరాస్మెంట్ పాలసీ కింద కేసు పెడితే మంచి ఉద్యోగం పోతుందని భయం వుంటుంది లోపల…”

“ఉద్యోగం దొరికిందనుకుంటే ఈ బాధ ఒకటా” అని ఆమె దగ్గర అంటే – “మరి ఇంతందంగా ఎందుకు పుట్టావ్?” అంది కన్నుకొట్టి.

“వాట్ ఆర్ యూ థింకింగ్ అర్చనా?” అంటూ భుజం మీద చెయ్యేసేసరికి తేరుకుంది. ఎదురుగా అతను అలాగే వున్నాడు. సావంగికర్ అడగాల్సిన ప్రశ్నలు అయిపోయినట్లు వున్నాయి. అర్చన నుంచి ఏమైనా ప్రశ్నలు వుంటాయేమో అన్న బెదురు అతని కళ్ళలో కనపడుతోంది.

“డు యూ హావ్ ఎనీ క్వశ్చెన్స్?” అడిగింది.

“నో మేడమ్”

“థాంక్యూ డామ్సూ….” పలకలేకపోయింది.

“మై ఫ్రెండ్స్ కాల్ మీ డేవిడ్ మేడమ్” అన్నాడతను అతనికి అలవాటైన తడబాటుని చూస్తూ

“ష్యూర్… ఆల్ ద బెస్ట్ డేవిడ్” అంది అర్చన.

అతను వెళ్ళిపోగానే సావంగికర్ అతని సీవీ మీద పెద్ద “ఆర్” అక్షరాన్ని రాసి దాని చుట్టూ సున్నా చుట్టాడు.

“సార్… ఎందుకు రెజెక్ట్ చేస్తున్నారు?” అడిగింది.

“అతని కమ్యూనికేషన్ చూశావా?” అడిగాడతను.

“అతను పుట్టి పెరిగిన ప్రదేశం అలాంటిది. అతని లాంగ్వేజ్ లో ప్రాబ్లం వుంది కానీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు కదా?”

“ఏంటి కమ్యూనికేట్ చేసేది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడుగా…”

“అది చాలా కష్టమైన ప్రశ్న… పైగా మీరు కాస్త అందిస్తే అల్లుకుపోయాడు… హీ ఈజ్ గుడ్…”

“హీ ఈజ్ నాట్…. హీ ఈజ్ జస్ట్ ఎ చింకీ…” గట్టిగా నవ్వాడతను.

“నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాడని మీకు చులకన” కటువుగానే అంది.

“కాదు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాడు కాబట్టి నీకు జాలి… అందుకే తీసుకుందాం అంటున్నావు…” ఒక్క క్షణం ఆగి సీవీ మీద రాసిన “ఆర్” అక్షరాన్ని కొట్టేశాడు. “ఇఫ్ యు రియల్లీ వాంట్, లెట్స్ టేక్ హిమ్… మనం రిక్రూట్ చేసే అరవై డెబ్భై మందిలో ఒకడు… హౌ డజ్ ఇట్ మాటర్?”

“అలా ఎలా తీసుకుంటారు? ఇద్దరికీ నచ్చితేనే కదా సెలక్ట్ చెయ్యాలి?” అర్చన ఆశ్చర్యపోయింది.

“ఏం నచ్చాలి? మనిషా? మార్కులా?” గట్టిగా నవ్వాడతను. “తీసుకోవాలనిపిస్తే తీసేసుకోవడమే… నీ సంగతే చూడు.. పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ థ్రీ… ఇంటర్వ్యూ వాజ్ పేథటిక్… మేము తీసుకోలేదూ…”

“అదే ఎందుకు తీసుకున్నారు?” అని అడగాలనుకుంది కానీ ఆగిపోయింది.

అతను తన చేతిని ఆమె జబ్బలమీద వేసి చిన్నగా నొక్కి నవ్వాడు. “గో ఎహెడ్… టేక్ హిమ్” అన్నాడు.

తను సెలక్ట్ అయినప్పుడు క్లాస్ టాపర్ కిరణ్ యాంత్రింకంగా చెప్పిన కంగ్రాట్స్ గుర్తుకొచ్చిందామెకి.

**** (*) ****

Picture Credit: Aripirala Satyaprasad