కథ

మంట

డిసెంబర్ 2015

ఇంకొక ఐదు నిమిషాలు చూస్తానంతే. వీడు వచ్చాడా వచ్చాడు, లేదంటే వెళ్లిపోవాలి. ఇదే ఆఖరి కాల్.

‘‘అన్నయ్యా… ఈ తమ్ముడి కోసం ఇంకొక్క పది నిమిషాలు ఓర్చుకోవే.’’

పది ఇంటూ పది నిమిషాలుగా ఓర్చుకుంటూనేవున్నా. ప్చ్, సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. ఈ మాటంటే: ‘10.12 నిమిషాలకు సరిగ్గా కలవకపోతే ఏమౌతుందీ? పదీముప్పైకైనా కలవడమేగా’!

ఉత్తినే కలవడమే అయితే, దీనికి ప్రాధాన్యత లేనట్టే అయితే, మరి ఎందుకు అక్కణ్నుంచి రావడం, నేను ఎదురుచూడటం?

వేరొకరి ఉద్వేగాల మీద ఆధారపడటమే నాకు నచ్చదు. అలాంటిది, ఇప్పుడు నిర్ణయాల మీద కూడా ఆధారపడాలి! జీవితంలో ఉన్న పెద్ద విషాదం ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్లినా మనుషులతోనే వ్యవహరించాలి.

పనివుంటే తీరదు. ఏ పనీ లేకపోతే తోచదు.

హోటల్‌కైనా పోదాం. ఏమీ తినలేదు. అయినా ఆకలి లేదు. అంతా ఆకలయ్యే తింటున్నారా?

సీతాకోకలా ఉండాలనుకుంటే జీవితం బొద్దింకలా ఎదురొస్తుంది. ఈమధ్య జీవితం గురించి ఎక్కువైపోయినాయి ఆలోచనలు! జీవితం కూడా దేవుడిలాంటిదే; ఎలాగైనా వ్యాఖ్యానించుకోవచ్చు.

పోనీ అమ్మాయైనా వాడి ఆలస్యానికి క్షమించేవాణ్నేమో!

ఛా… ఈ విషయంలో మాత్రం నన్ను నేను క్షమించుకోలేను. కాలేజీలో ఉన్నప్పుడు ప్యూరిటన్ థాట్స్ ఉండటం వల్ల కనురెప్పల కరచాలనాల్ని కోల్పోయాను. అయినా, స్త్రీ మనోకుహరంలోకి చొరబడటానికి చేసే ప్రయత్నంలో పురుషుడికి మిగిలేది ఉత్తి ఉబలాటమే తప్ప, ఎప్పటికీ సౌఖ్యం కాదు. అయినా మళ్లీ…
ఆకాశంలోనే బాగుంటుందనీ తెలిసీ వర్షం నేలమీద పడుతుందే! బురద కావడానికా?

గుంటల్లోని రాత్రి నీళ్లు ఎటుపోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నాయి. ఎటని పోతాయి? పోతే పైకే! ఒరేయ్ ఎండగా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను తిరిగి వచ్చేలోపల ఇదంతా ఎండిపోవాలి.

పొడవుగా ఉన్న ప్యాంటు నేలను తాకుతుందని భయం. నడిచినప్పుడు అది చెప్పులోనే ఆగిపోతుందని ఇంతకుముందు తెలియలేదే!

ఒరేయ్ నా కొడకా బండి ఆపింది తను, గుద్దింది నువ్వు. మళ్లీ నా వైపు చూస్తావేందిరా నాయాల…
కూల్. కూల్. కూల్.

సాక్షాత్తూ భార్యతోనే చాలా విషయాలకు గొడవపడాల్సి వస్తుంది. బయట పడటంలో ఆశ్చర్యం ఏముంది?

కూల్. హాట్. కూల్. హాట్. హాట్. హాట్.

ఆ గోడకు అవతలివైపున బొందులు విప్పకుంటారని తెలిసీ… కంట్రోల్. కంట్రోల్. కంట్రోల్.

***

‘‘ఏం కావాలి సార్?’’

ఇడ్లీ వడా దోసె పూరీ చపాతీ…

‘‘ఏమున్నాయి?’’

ఇ వ దో పూ చ… అదనంగా మైసూర్ బజ్జీ.

‘‘పూరి’’

‘‘అన్నా ఆ పేపరియ్యే’’

నాకోసం చాలా కష్టపడినట్టున్నాడు. ఎండినయి మాడినయి చాలా జాగ్రత్తగా వెతికి తెచ్చాడు. ఒకటి బాగుంది; ఎండిందీ మాడిందీ దొరికినట్టు లేదు. నా నొసట ఏమన్నా రాసుందారా, వీడికి ఏమైనా పెట్టొచ్చూ అని. అనవసరంగా నీ పెళ్లాన్ని తిట్టేలా నా నోటిని ఎందుకు రెచ్చగొడతావురా…

తెల్లటి పచ్చడి… దీనికీ పక్షులకూ ఏదో సంబంధం ఉంది. ఆలుగడ్డలు, నీళ్లు, ఎర్రగా, చెత్తగా. ఈ హైద్రాబాద్‌లో ఇంతే. పది రూపాయలు ఇచ్చేదగ్గరా ఇదే కూర, ముప్ఫై రూపాయలు వసూలు చేసే దగ్గరా ఇదే కూర.

ఈ క్రాంతి అయినా రాడేమిటి? ప్రదీప్ గాడు ఏమయ్యాడు? అందరూ కట్టగట్టుకొని ఎక్కడ పోయార్రా?

చెమటవల్ల కింది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టున్నాయి. సుఖంగా కూర్చోవడానికి వీలు పడట్లేదు. దేవుని లంజాగొడకా… అక్కడెందుకు మొలిపించావురా?

చేతివేళ్లు ఆడుతున్నాయి. సిగరెట్ కాల్చితే బాగుండు. అది పడదు; తిరిగినట్టు అవుతుంది; కాని బాగుంటుంది స్టైల్‌గా. న్యూనతను పొగలాగా ఊదేస్తుంది. అదృష్టవశాత్తూ మనకు పొగ, మద్యం ఉన్నాయి కాబట్టి సరిపోయిందిగానీ లేకుంటే జీవితం మరీ పొడవైపోయి బోరెక్కిపోదూ!

అయ్యో, వీడు ఇంకా రాడేమిటి? ఒక కదలిక కావాలి; పరుగెత్తాలి; జీవితం పడుకునిపోయిందిరా… ఉరుకు ఉరుకు… ఫాల్తు నా కొడుకులంతా జీవితం వేగమెక్కిపోయింది, నెమ్మది నెమ్మది కావాలంటారే!

‘అన్నా, అనుకోని పని పడింది. సాయంత్రం కలుద్దామా?’

దగ్గరుంటే సిగరెట్‌తో కాల్చేవాణ్ని. ఈ మెసేజ్‌కు రిప్లై కూడా ఇవ్వను.

***

అలిఖిత ఒప్పందం ద్వార ఉమ్మడిగా రోడ్డు దాటుతున్న పాదచారులు.

‘షుగర్ లెస్ స్వీట్స్ అవైలబుల్’. తీపిలేకుండా మిఠాయి ఏమిటి?

హెల్మెట్లు వరుసగా అమర్చివున్నాయి. స్పోర్ట్సు షాపు తెరిచివుంది. చద్దన్నం కవరు కారులోంచి భిక్షగాడికి అందుతోంది. బ్యాగుల్లో గాలి నింపి పెట్టారు. నడుం వంపు పోస్టరు మీద పేడా? మరకా?

‘తెలుగు ‘బా’షను కాపాడుకుందాం’

మంగత్రయి? మంగత్⁠రాయ్?

ఎలా జారిపోయాయో గుర్తించేలోపే పైటలు మాయమైనాయే! ఆధునిక మహిళల ఔదార్యం కీర్తించదగినదే!

తల తిప్పి చూస్తున్నాడంటే ఏదో కొత్తది చూస్తున్నాడని అర్థం; అంతకు ముందు చూడనిది, అది ఆఖరికి నేమ్ప్లేటే కావొచ్చుగాక!

తుపుక్, తుపుక్… బస్టాండులో ప్రయాణీకులు కొంతమంది అలవాటైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మనుషుల్నా నేను ప్రేమించాలి! ‘పీడనం, ఉష్ణోగ్రత, క్లీన్‌రూమ్ వాతావరణం… అన్నీ ఒకేలా అప్లై చేసినా అన్ని వేఫర్లూ ఒకేలా ఉండవు. హెచ్ఎఫ్ఈ వేరియేషన్ ఉంటుంది. ఇనెవిటెబుల్’! తొలి ఉద్యోగపు తొలి రోజుల థియరీ! మనుషులూ అంతేనా!

కదలనియ్రా బస్సు!

‘ఎక్కడదీ, 403 సాయిబాలాజీ నివాస్?’

‘ఓ సారూ, కైరుతాబాద్ వోతదా?’ తలపాగా మనిషి. అంతరిస్తున్న ఆహార్యం.

తత్వశాస్త్ర గ్రంథం రాయొచ్చు, కానీ యాసను యథాతథంగా పట్టుకోలేం. వినడంలో దాని సొగసు తెలుస్తుంది. కానీ రాయడంలో!

‘అబ్బో ఏం స్వీట్లోయమ్మ… ఒకటి బెట్టి రెండు బెట్టి ప్యాకిట్ ఇచ్చినట్టు పెద్ద…’

‘అది నేర్సుకునుడు ఏమన్న సుతారామా?’

అమ్మాయి చాలా సున్నితం. చూపు చూపుకల్లా ఎర్రబడుతోంది.

‘మీరు ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు బాగుంటుందిగానీ తెలుగులో మాట్లాడితే తెలంగాణా బయట పడిపోతుంది.’

వాళ్లమ్మను దెంగుతున్నప్పుడు వచ్చాడు డ్రైవరు. ఒక అరనిమిషం ముందుగా వచ్చివుంటే ఆమె శీలాన్ని కాపాడుకోగలిగేవాడే! ప్చ్…

అంత చిన్న వయసులో ఆమెకు అలా జరగొద్దని ఎందుకుండేది? విలన్ ఆమె మీద పడి ఇక ఏదో చేయబోతుండగా, నిజంగానే అదేదో జరిగిపోతుందని మన గుండె లబలబలాడుతుండగా, ఒక మనిషి తలకాయంత బూటుతో గాలిలో కనబడి, గూండా గాడి గదువ కింద కాలు పెట్టి, బూటుతో వాడి తల ఎత్తి… ఏ డ్ఢిష్యాం… బొడ్డు కింది శీలం పదిలం! అమ్మయ్య. ‘స్స్స్స్సూస్సూస్సూ’… విజిల్!

నిజంగా సత్యంతో ప్రేక్షకులకు అంతగా పని లేదు. ఆ నామమాత్రపు సత్యాన్ని పట్టివుంచగలిగే చిక్కటి కండ మాత్రం కావాలి. ప్రేక్షకుడు ఆ మాంసపుకండను కొరుకుతూ, కొరుకుతూ ఆ ఉన్న సత్యాన్ని కూడా మరిచిపోతాడు. ఇక సినిమా అంటే ఆ మాంసపు రుచే!

క..ళా..మ..తల్లి!

అయినా పాపులారిటీ వేరు, కంట్రిబ్యూషన్ వేరు.

సెలబ్రిటీ అయ్యాక అదొక చావు అయిపోతుందేమోలే! మనమే ఫోన్ చెయ్యాలా? వాడు ఫోన్ చేసేదాకా ఎదురుచూడాలా!

‘ఆదాయం ఎట్లత్తుందో ఇప్పటికైతే అర్దం కాలేదు, ముందు ముందు గిట్ట అర్దమైతదేమో!’

‘బాయీస్ అంటే ట్వెంటీఫోరా?’

‘ఇరవై రెండు.’

ఆ గడ్డంతో ఎలా సరసాలాడుతారో అర్థం కాదు.

బస్సు ఆపాలి బస్సాపాలి బస్సాపాలి ఆపాలాపాలాపా…

‘ఏంటీ ఇవ్వాళ బందా?’

పేపర్ ఎవడు చదువుతున్నాడు! ఇప్పటివరకూ బందులవల్ల ఏమైనా ప్రయోజనం జరిగివుంటుందా? వాళ్లు దానికోసం పోరాడుతున్నారన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం తప్ప! ఈమాత్రం వాయిస్ కూడా లేకపోతే అరాచకం అయిపోతుందా? వచ్చాడండీ మేధావి!

***

పాదచారులకు బదులుగా పోలీసులు. వాహనదారులకు బదులుగా పోలీసులు. ప్రజలకు బదులుగా పోలీసులు…

ఇళ్లు ఇళ్లల్లా కాకుండా డబ్బుకట్టల్లా కనబడుతున్నాయి.

నలుగురూ తిరిగేచోట త్రీ బై ఫోర్తులు… బట్టలకు సంబంధించిన తన స్థితేమిటో, తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొందరికి ఉంటుంది. బట్టలు లగ్జరీ స్థితిని దాటిపోతేగానీ ఈ క్యాజువల్‌నెస్ రాదు.

వీపులుగా మోహం కలిగించి ముఖాలుగా మోసం చేసేవాళ్లు…

‘దుఃఖం, శూన్యం మధ్య నేను ఏం కోరుకుంటాను?’

అనామకంగా గాలిలో కలిసిపోతే బాగుంటుందిగానీ ఎవరో వచ్చి, మనల్ని తొక్కి, పూలు పెట్టివెళ్లడం బాగుంటుందా?

సామాన్యతను సెలబ్రేట్ చేయడానికి నేను వకాల్తా పుచ్చుకుంటున్నానంటే నేను అసామాన్యతను ఇష్టపడుతున్నట్టా?

జడలు నిరంతరం తాకడం వల్ల నునుపు దేలిన పిరుదులు.

ఎవరీ వీలయినంత వీపు సుందరి?

ఉద్వేగపూరితమైనదేదో జతకూడనిదే నగ్నత్వంలో ఆకర్షణ ఉంటుందా?

మూత్రం పోస్తూ, పొడవు తుపాకిని నిలపడంలో అవస్థ పడుతున్న పోలీసు…

తిరగడం అంటే తిరగడం అని కాదు; రోజూ చూసేదానికి భిన్నమైన దృశ్యాన్ని కంట్లో వేసుకోవడం!

థ్రీసమ్… మేము అడ్వాన్స్డ్ అని నిరూపించుకోవడానికి కాబోలు!

స్త్రీ పురుషుడిగా రూపాంతరం చెందినతర్వాత కూడా ప్రత్యుత్పత్తి ప్రక్రియకు ఉవ్విళ్లూరేట్టు చేయడం గొప్ప విషయమే!

ప్రాంతాల మానసిక అంతరానికి చిహ్నంగా ధ్వంసమైన ట్యాంక్‌బండ్ విగ్రహాలు. దంపతులు మామూలుగానే ఫొటోలు దిగుతున్నారు. నాగ్గూడా మామూలుగానే ఉంది.
ఇంతకీ నేను తలవైపున్నానా? కాళ్లవైపా?

మన కాళ్ళేమో పల్లెలో ఉంటాయి, చేతులేమో పట్నాన్ని కౌగిలించుకుంటాయి. అటుగాదూ ఇటుగాదూ, అటూఇటూకానివాడిలాగా!

ఇలా బొడ్డు మీద ఎంతకాలమని బతకాలి!

నాచురల్ అనేది నాచురల్‌గా ఉందా? తల్లి కడుపులోంచి బయటపడ్డానికి బొడ్డుతాడు కోయడంతోనే కృత్రిమత మొదలైందిగదా!

ముందు పుట్టిన దొంగ లంకొలంతా దొంగ లంకొలే. ఎవడికి ఇష్టమైనట్టు వాడు భూగోళాన్ని దొర్లించుకుంటూ వెళ్లాడు.

నా రాగద్వేషాల్ని ఇప్పటికైనా స్పష్టంగా నిర్వచించుకోవాలి. వృద్ధాప్యమో మృత్యువో వచ్చేదాకా ఆగాలా?

ఇలా కూడా బానేవుంటుందిలే, అందరం మూకుమ్మడిగా అంతమైపోవడం!

నేను పొట్లపల్లి రామారావును ఇంతకుముందు సీరియస్‌గా చదవకపోయివుండవచ్చు. కానీ రేపు నువ్వు ‘పొట్లపల్లా! ఆయనెవరు?’ అంటే నొచ్చుకోవడానికి కారకమయ్యేదేదో నా లోలోపల రూపుదిద్దుకుంటూ ఉందా?

ఈ ఉత్తుత్తి భావప్రాప్తులతో ఏమైనా ఉపయోగం ఉందా? అంతా ఉత్తిదే! ఉత్తిత్తిత్తిత్తిత్తి… పూరీ నిజం, మాడిపోవడం నిజం, రావాల్సినవాడు రాకపోవడం నిజం, నాకు కోపంతో అరికాలిమంటెక్కడం నిజం. ఎంత దూరం ఇలా ఈడ్చుకుంటూ నడవాలి!

***

‘‘లార్జ్. వన్ ప్లస్ వన్… ఇది కూడా బంద్ ఉంటుందనుకున్నా.’’

‘‘మందుకు బందేందన్నా.’’

‘‘క్రిస్పీ వెజ్ ఉందా?… రెండు లైట్స్ గూడా.’’

అబ్బా కటిక చేదు!

పదార్థం వల్ల భావన కాదు; భావన కోసం పదార్థం.

‘అన్నా, ఇప్పుడు కలుద్దామా?’ ‘వద్దు. నేను చాలా బిజీగా ఉన్నాను.’ నువ్వెప్పటికీ రావొద్దు. నీకోసం నేను ఎదురుచూసే శ్రమ తీసుకోను.

వాడి స్పెర్మ్ కౌంట్ 12 మిలియన్ ఫర్ 1ఎంఎల్ అంట. 50 పర్సెంట్ నాన్ మొటైల్. పిల్లలు పుట్టరంటావా?

ఉదయం పది గంటలు. అందరు వరి కలుపులకు పోతున్న సమయంలో నేను పుట్టానంట!

‘నానా, అమ్మా నువ్వూ పెళ్లి చేసుకున్నరా?’
అదేరా చావు.

ఏంటీ రిలేషన్సు? హు… కూతురితో ఆడుకునేటప్పుడు తండ్రి తన పురుషాంగాన్ని ఎక్కడ దాస్తాడు?

‘నీకు లౌక్యం లేదు; బతకడం రాదు; ఒక దగ్గర కొన్నేండ్లు మెదిలే తెలివిలేదు; నీతో ఉంటే మాకు ఎప్పటికీ సుఖం లేదు’.

‘అరే, నీకు ఏమని జెప్పాల్నె. నేను దెల్వదా నీకు? అక్కడ వానితోటి పనిజేయాల్నంటే తల నేలమీదవెట్టి మాట్లాడాలె. అర్థం చేసుకోవేంటి?’

‘మొన్నటికి మొన్న లెసైన్సు కోసం మూడువేలు పోగొట్టినవ్. డ్రైవింగ్ వచ్చిందా? నీ ఆలోచనలు ఎక్కడ్నో, నీ చేతులు ఎక్కడ్నో?’

దానికి మామూలుగానే బీపీ. డేట్ వచ్చినప్పుడు చావే!

టాయ్‌లెట్‌ను ఉమ్మడిగా పంచుకోవడంలోనే భార్యాభర్తల రొమాన్స్ సగం చచ్చిపోతుంది. ఇంక మిగిలింది ఏమన్నా ఉంటే ఇదిగో ఇలాంటి చిల్లర మల్లర కొట్లాటల్తో!

కొన్ని ఊహాజనిత విలువల్ని ప్రేమించి, ఉన్నతి సాధించినట్టుగా భ్రమించి, బతకడంలో మమేకం కాలేక, అంచుల వెంబడి జారిపోయి, ఎటూ కాకుండా అయిపోయి…

ఒక స్టేజిలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్లు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్లు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరా చేసుకోవడమా?

కాజా బేగం టీచర్ నన్ను అలా కొట్టగలదని ఊహించలేదు. రెండ్రోజుల్లో హిందీ అక్షరాలు నేర్చుకోవాలంటే… ఆరోక్లాసులో కొత్తగా చేరాను కాబట్టి కొంత కరుణనో, మినహాయింపునో ఆశించాను. చెంప అదిరిపోయింది.

‘ఇవాళ ఏదోటి అదరగొడదాం… అదరగొడదాం అంటే ఏంటి నాన్నా?’

అదరగొట్టడం అంటే… అంటే నానా… అదరడం… ఏందీ నాకు ఇంగ్లీషే రాదనుకున్నా, తెలుగు కూడా రాదా?

‘బఠానీలాగా పిల్లిని మట్టిల పెట్టి నీళ్లు పోస్తే ఇంకో పెద్దపిల్లి మొలుస్తదా నానా?’

అయ్యో, బంగారం… ఎక్కడ్రా?

ఉజ్జయినీ బ్రెత్. బస్త్రిక. శ్వాస గొంతుకు తెలియాలి. హూహూహూ

‘‘ఆ చెప్పు…’’

‘‘ఎక్కడున్నవ్?’’

‘‘అరే ఎక్కడ్నో వున్నగని చెప్పు… ’’

‘‘ఇల్లు గురించి ఏం ఆలోచించినవ్?’’

‘‘తీసుకుందాం. డెరైక్టుగా ముప్పై ఏడు లక్షలు పెట్టి ఒకటేసారి తీసుకుందాం.’’

‘‘మల్ల దాగినవా?’’

‘‘తాగడమేంటే? చదువుకుంటూ ఉంటే…’’

‘‘నీకు ఏదీ పట్టింపుండదు’’.

నాకు అన్నీ ఉంటాయి. రావాల్సిన బాకీలు ఇవ్వాల్సిన శాపనార్థాలు. పేపరన్నా సరిగ్గా మడత పెట్టడం రాదు, ఇది నాకు చెప్తుంది! నాలుగు రోజులు గిలకాడించడం కోసం ఇందులో ఇరుక్కుపోతిమే!

శరీరం తిరుగుబాటుదారు. మూడు పెగ్గుల్ని సహించినా ఐదో పెగ్గుకు ఒప్పుకోదు. కాని సిగరెట్ రుచి మాత్రం మందులో పెరుగుతుంది. ‘‘బిల్ దే’’

ఒక్క సెట్విన్ అన్నా రాదు!

నడిచీ నడిచీ నడిచీ…

న..డి..చీ.. న…డి…చీ… నన్నారా మీరు ఇలా నడిపిస్తున్నారు?

నన్ను? నన్ను?

నేనెవరో తెలిస్తే భుజాల మీద మోస్తార్రా!

***

వీధుల్లో నీడలు పొడువవుతూ, పొట్టివవుతూ, అంతలోకే ముడుచుకుపోతూ, విస్తరిస్తూ, వెనక్కీ ముందుకూ జరుగుతూ…

షట్లర్ల ముందు ముడుచుకుంటున్నవాళ్లు నేలదయ్యాల్లాగా కనబడుతూ…

ఆయాసం. దురద. చెమట.

ఇల్లు ఊడ్వక ఎన్ని రోజులవుతోంది!

మనసే ఊడ్చుకోలేం.

పుస్తకం తిరగేద్దాం…

ఇస్మైల్ వసుంధరా కేశవా విశ్వనాథా స్వామీ… అల్లం రఘోత్తమరెడ్డా?

ఖాళీసీసాలు. పదిహేను పైసల కోసం చీరలు ఊడదీసుకునే నూకాలమ్మ పైడి… తాత్విక కథ అనుకుంటిమే.

స్మైల్ నువ్వు తిరగరాయాలబ్బా! లేదంటే త్రిపురకు చెప్పేదా? అబ్బే, లేటు. రాజిరెడ్డిగాడైతే గీకి అవతల పారేస్తాడు.

ఎంతైనా కథ కంటే కవిత్వం రాయడం ఈజీ. ఎట్లయినా రాయొచ్చు క్రమం లేకుండా.

రష్యన్ అనువాదంలో రాముడు, ధర్మరాజు, బకాసురుడు, బ్రహ్మరుద్రాదులు… అయ్యో!

తెలుగువాళ్లు ఒక భాషను సృష్టించుకునేంత తెలివిమంతులవడే ఒక ఆశ్చర్యం!

కొండయ్య పూరీలు మండే బ్లూస్ పోగొట్టేవి. ఆ పప్పు, ఆలుగడ్డ కూర… ఆ రుచి మళ్లీ దొరకలేదు. ఎప్పుడూ డబుల్ ప్లేట్లే! వర్తమానంలో చాలా చిన్న విషయంగా కనపడేది ఎప్పటికోగానీ విలువైన విషయమని అర్థం కాదు. నిజంగా జీవితంలో ఉన్నది కళలో ఎప్పటికీ రాదు.

‘సాహిత్యమూ బొంగూ’ పేరుతో ‘పాలపిట్ట’కు ఒక వ్యాసం రాసెయ్యాలి. నాకంటే ముందు పుట్టినవాళ్లంతా దీన్ని నానా చంకలు నాకించారు. దేవుడు నన్ను బెసైక్సువల్ చేసివుంటే బాగుణ్ను.

‘ఆనందమూ నొప్పీ ఒకటే కాగలిగే స్థితి రతిలోనూ, రాయడంలోనూ మాత్రమే సాధ్యపడుతుంది.’ ఎస్. మొదటి వాక్యం ఇదే! రాయడమూ రతీ ఒకటే అంటే ఒప్పుకుంటారా!
రాస్తే వచ్చేది లేదు. రాయకపోతే పోయేది లేదు.

ప్చ్ ప్చ్ ప్చ్… ఇవ్వాళ రోజంతా వృథా అయిపోయింది. ఇట్లా ఎన్ని రోజులు? ఎన్ని గంటలు? ఒక లెక్కాపత్రం లేకుండా…
ఇవ్వాళేం చేశానని?

కళ్లు మూసుకుని ధ్యాననిద్రలో కూర్చుని…

ఊ… పొద్దున్నే లేచాను. లోపలున్నది బయటికి రావడానికి ఫైబర్ కలపాలి.

… ‘నిన్ను విసుక్కునే స్వేచ్ఛ గూడా లేదా నాకు?’… గుండపు స్నానంలో గిల్టీ ప్లెజర్… కర్మక్షయం ఎటూ జరగదు కనుక, ఎటూ మానవజన్మ ఎత్తుతూనే ఉంటాం కాబట్టి, మళ్లీ తల్లులు మళ్లీ గర్భాలు…

ఛీ… ధ్యాననిద్ర… మళ్లీ ఫ్రెష్షుగా…

పొద్దున్నే లేచాను. నీళ్లు పుక్కిలించి గ్లాసెడు నీళ్లు తాగాను. అప్పటికే పాలు వచ్చాయి. పొయ్యి మీద పెట్టాను, చిన్న మంటలో, పొంగిపోకుండా.

ప్యాకెట్‌ను కట్ చేసేటప్పుడు విధిగా నందినిని గుర్తు చేసుకున్నాను. తను రెండు దిక్కులా కట్ చేయాలంటుంది. దానివల్ల ఒకవైపు నుంచి లోపలికి గాలి వెళ్తుంది కాబట్టి, పాలు చుక్క మిగలకుండా గిన్నెలో పడిపోతాయి. పాలు మొత్తంగా… చుక్క మిగలకుండా అలాగే తాగేసి…

పి ఐ డబ్ల్యూ…. పి ఐ డబ్ల్యూ 213. అరే, ఎన్ని పాసువర్డులని గుర్తుపెట్టుకోవాల్రా?

నీ వయసే నిన్ను వాంఛ నుంచి లిబరేట్ చెయ్యాలి!

ఇరవై రెండో ప్లీజుకైనా కరగక తప్పదు; ముక్కు చీదక, ముడ్డి కడగక తప్పదు…

బస్సు… మనుషులు… అనుకోకుండా తారసపడిన సిరిసిల్లా మిత్రుడు… యాభై రూపాయలు బొక్క…

‘అబ్బా నెట్టకండి’.

నెట్టకపోతే ఎట్టా?

కొన్ని పదులు జతలు. ఒకసారి పెనెలోప్లాగా చిన్నగా; ఇంకోసారి బెల్యూచిలాగా నిండుగా; మరోసారి ఆ హెచ్చార్ అమ్మాయిలాగా ఏమీలేనట్టుగా…
కొరికి రక్కి గిచ్చి గిల్లి…

ఎక్కడున్నావే…

థూ నీ యబ్బా… పూలరెక్కలాగా భావించిచస్తావు. నలపడానికి మనస్సు రానివాడివి నీకెందుకురా మగజన్మ?

‘కనీసం ఇస్త్రీపెట్టె రిపేరన్నా నీకు రాదు’.

నాకు దేన్నీ బాగుచేసుకోవడం తెలీదు. దాన్ని విప్పదీయడం నావల్ల కాదు.

విప్పదీయడం

విప్పదీయడం

విప్పదీసి

కొంపదీసి

వాడు విప్పినప్పుడు ఏమైనా చేశాడా టీవీని? ఏవో పార్ట్స్ మాయం చేసివుంటాడు. లేకపోతే ఎందుకు రాదు? అనవసరంగా కేబుల్ బిల్లు దండగ. సౌండ్ వస్తుంది, బొమ్మ రాదు.

బొమ్మ. బొమ్మ బొమ్మ… ఒక బొమ్మ కావాలి. బొమ్మ లాంటి బొమ్మ కావాలి. బాత్రూమ్లోకి లాక్కెళ్లాలి. అర్ధ శిశువుల్ని అనాథల్ని చెయ్యాలి. బండగా, మోటుగా…

బండగా, మోటుగా ఉండి… ఎదుటివాళ్లకూ దుఃఖం, నేనూ సుఖపడింది లేదు; చావదెంగడానికి కాకపోతే ఇలాంటి జన్మ ఎందుకెత్తించినవే నాయినా! చావదెంగడానికి కాకపోతే…

చావదెం… దెం… దెం… ఎం… ఎం…

ఎగుడు దిగుడు

ఎగుడు దిగుడు

ఎక్కి దిగి

ఎక్కి దిగి

ఎ ది

ఎ ది

ది

ది

ఆ.. ఆ… ఆ…. ఆ…..

బుడుక్ బుడుక్…

నల్లానీళ్లు…

అప్పుడే తెల్లారిందా!

**** (*) ****

(Illustration: Anwar)