ఆ ఆటవిక స్త్రీ లలో ఎవరూ నన్ను ప్రేమించినట్లు కనిపించలేదు… అందులో ఆశ్చర్యం లేదు . జాబ్ కి మాత్రం ఒకరిద్దరు నడివయస్సు అభిమానులు తయారయారు.. పాపం అతను ఇబ్బందిపడిపోయాడు. ఉస్తేన్ ‘ప్రేమ ప్రకటన ‘ వ్యవహారం పూర్తయాక మమ్మల్ని బిలాలీ గుహ లోపలికి నడవమని సైగ చేశాడు. మా వెంబడిపడి ఉస్తేన్ కూడా వచ్చింది.
చాలా విశాలమైన సావడి అది, నూరడుగుల పొడవూ యాభై అడుగుల వెడల్పు. ప్రకృతి సిద్ధంగా కాక మానవనిర్మితం లాగే ఉంది. దాని చివరన సన్నటి నడవా ఉంది , బహుశా అవతల ఇంకొన్ని చిన్న గదులు ఉండిఉంటాయి. సావడి మధ్యకి వచ్చేసరికి వెలుగు తగ్గిపోయింది. అక్కడొక పెద్ద నెగడు వంటిది మండుతోంది. చుట్టూ గోడల చీకటి మీద దాని నీడలు పొడుగ్గా పడుతున్నాయి. మమ్మల్ని అక్కడ కూర్చోమనీ భోజనం తెస్తారనీ బిలాలీ చెప్పాడు. నేల మీదే, ఒత్తుగా పరిచి ఉన్న జంతుచర్మాల మీద కూలబడ్డాము. త్వరలోనే ఆహారం వచ్చింది. ఉడకబెట్టిన మేకమాంసం, మొక్కజొన్న గింజలు , తాజా గా పితికిన పాలు,. ఆత్రంగా లాగించేశాము- నా జన్మలో అంత తృప్తికరమైన భోజనాన్ని ఎరగను.
మేము తినటం పూర్తయేవరకూ బిలాలీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు లేచి నిలుచుని మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ రాతినేల [ అమహగ్గర్ ] మనుషుల దగ్గరికి తెల్లవాళ్ళు రావటమనేది కనీ వినీ ఎరగని అద్భుతమట. వేరే నల్లజాతివాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు మావంటివారు ఉంటారనీ ఓడలమీద వస్తారనీ చెప్పి ఉన్నా కూడా అటువంటిది సంభవిస్తుందని వాళ్ళు ఏమాత్రం నమ్మలేదట. పరదేశీయుల ఆచూకీ అందుతూనే చంపేయటం ఆనవాయితీ అనీ ఆ లోపు రాణి మమ్మల్ని రక్షించి తీసుకురమ్మని ఆదేశించిందనీ కూడా బిలాలీ చెప్పాడు.
నేను అతని మాటలకి అడ్డు తగిలాను – ” క్షమించాలి తండ్రి గారూ, ఆ రాణి ఎక్కడో దూరాన కదా ఉంటున్నది ? మా రాక ఆమెకి ఎలా తెలిసిందంటారు ?? ”
అతను అటూ ఇటూ చూశాడు. అతను మాట్లాడటం మొదలు పెట్టగానే ఉస్తేన్ వెళ్ళిపోయింది- ఇప్పుడు అక్కడ మేము మటుకే ఉన్నాము. కాస్త విడ్డూరంగా నవ్వి అన్నాడు – ” ఏం ? మీ దేశాల్లో లేరా – కళ్ళతో సంబంధం లేకుండా చూడగలవాళ్ళు ? చెవులకి పని చెప్పకుండా వినగలిగేవాళ్ళు ? ప్రశ్నలు వద్దు – రాణికి తెలుసు ”
తెలియదన్నట్లు బుజాలెగరేశాను నేను. అప్పుడు అతను – మమ్మల్నేం చేయాలో రాణి ఆజ్ఞ ఇవ్వలేదనీ ఆ నిమిత్తమై వెళ్ళి ఆమె ను సంప్రదించాలనీ చెప్పాడు. దారి దుర్గమం గా ఉన్నందున తిరిగివచ్చేందుకు నాలుగైదు రోజులు పడుతుందట. మా సౌకర్యం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయని మాకు హామీ ఇచ్చాడు. మేము అతనికెందుకో నచ్చామట… రాణి మా ప్రాణాలు కాపాడుతుందని ఆశిస్తున్నాడట. అయితే అటువంటి పూచీ ఏమీ లేదట. అతనికి తెలిసి – మూడుతరాల ముందునుంచీ ఆ నేల మీద కాలు పెట్టిన ఏ పరదేశీయులూ బతికి బట్ట కట్టలేదట. దయాదాక్షిణ్యాలకి చోటివ్వకుండా బయటివారందరినీ చంపెయ్యటమే అక్కడి పద్ధతి, రాణి కల్పించుకుంటే తప్పించి. ఇప్పటి వరకూ ఆమె జోక్యం చేసుకున్న దాఖలాలూ లేవట.
” అది ఎలా సాధ్యం తండ్రిగారూ ? మీరే పెద్దవయసువారు, మీకు మూడుతరాల వెనకనుంచీ మీ రాణి ఎలా జీవించి ఉంది ? ”
బిలాలీ మళ్ళీ నవ్వాడు. అదే విచిత్రమైన నవ్వు. ఏమీ చెప్పకుండా- గౌరవంగా వంగి , మా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అయిదురోజులవరకూ మేము అతన్ని చూడనూలేదు.
వ్యవధి దొరికింది కనుక మా పరిస్థితి నంతా సమీక్షించుకున్నాము. ఆ రాణి సంగతి ఏమీ బావున్నట్లు లేదు …ఎంతైతే మాత్రం – రాజ్యం లోకి ఎవరొస్తే వాళ్ళని చంపేయటమేమిటో ? బిలాలీ చెప్పినదానిబట్టి తన తండ్రి పేర్కొన్న మహిమాన్విత అయిన స్త్రీ ఆమే అయిఉంటుందని లియో కి ఉత్సాహం వచ్చిందిగానీ నాకవేవీ ఆలోచించే ఓపిక బొత్తిగా లేకపోయింది. బాగా మట్టిగొట్టుకుపోయాము కనుక కాస్త అలా బయటికి వెళ్ళి స్నానాలు చేస్తే నయమనుకున్నాను. మాకు కాపలాగా పెట్టినవాళ్ళలో ఒకడికి మా ఉద్దేశం బోధపరిచాక అతను మమ్మల్ని గుహ బయటికి తీసుకుపోయాడు. జాబ్, నేను – చుట్టలు ముట్టించి ఉన్నాము. బయట ఇంకా జనం గుమిగూడే ఉన్నారు..మా నోళ్ళలోంచీ ముక్కుల్లోంచీ పొగ రావటం వాళ్ళకి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది – మేమేదో పెద్ద మాంత్రికులమని గుసగుసలాడుకున్నారు. మా తుపాకులకంటే ఎక్కువగా మా పొగాకు వాళ్ళని ప్రభావితం చేసినట్లుంది. దగ్గర్లోనే వాగు ఒకటి ప్రవహిస్తోంది- మా వెనకాల కొందరు అమ్మాయిలూ వచ్చారు , వాళ్ళలో ఉస్తేన్ ఉందని వేరే చెప్పనక్కర్లేదు.
మా స్నానాలు పూర్తయేసరికి సూర్యాస్తమయమవుతోంది. గుహకి తిరిగి వచ్చేసరికి పూర్తిగా చీకటి పడింది. ఇదివరకు ఉన్నది కాక ఇంకొన్ని నెగళ్ళు మండుతున్నాయి అక్కడ. వాటి చుట్టూ కూర్చున్న మనుషులు రాత్రి భోజనాలు కానిస్తున్నారు. గోడలవారగానూ , వీలైనచోట్ల ఎత్తుగానూ చిన్నవీ పెద్దవీ చాలా దీపాలు అమర్చబడి ఉన్నాయి. అన్నీ మట్టితో చేసినవే. వాటి తయారీ లో చక్కని పనితనం కనిపించింది. కరిగిఉన్న కొవ్వు తో నింపినట్లున్నారు , పొడుగాటి నార వత్తులు వేసి ఉన్నాయి. ఆ ఉదాసీనపు మనుషులు మరింత ఉదాసీనంగా భోజనం చేస్తుండటాన్ని కాసేపు గమనించాక మాకు నిద్రవస్తోందని వాళ్ళకి తెలియజేశాను.
ఒక్కమాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని తలా ఒకరు చేయిపుచ్చుకు తీసుకుపోయారు. అంతకుముందు చూసిన నడవా అవతల నేను అనుకున్నట్లే చిన్న చిన్న గదులు ఉన్నాయి. నేను ప్రవేశించినదానిలో మూడు అడుగుల ఎత్తున రాతి అరుగు వంటిది ఉంది. ఇంకే బల్లలూ కుర్చీలూ- కనీసం గాలీ వెలుతురూ రాగల రంధ్రాలు కూడా లేవు. బహుశా అదొక శవాగారం అయిఉంటుందనీ , వెనకాల సమాధులుండి ఉంటాయనీ అనుకున్నాను [ అది నిజమేనని తర్వాత తెలిసింది- ఆ రాతి అరుగు మీద శవాన్ని పడుకోబెట్టి స్నానం చేయించి సిద్ధం చేస్తారట ] . కడుపులో తిప్పినట్లనిపించినా ఎక్కడో ఒకచోట నిద్ర పోవాలి కనుక సమాధానపడ్డాను. నా దుప్పటి తెచ్చుకుందుకు వెనక్కి వెళ్ళేసరికి జాబ్ గోల గోల చేస్తున్నాడు. అతనికీ అది సమాధి లాగే అర్థమై , చచ్చినా అక్కడ ఉండనని అరుస్తున్నాడు. ఇంగ్లండ్ లో – [ ఇటుకరాళ్ళతో సంసారపక్షంగా కట్టిన ] వాళ్ళ తండ్రి సమాధి కిందయినా నిద్రపోగలడేమో గాని ఇక్కడ మాత్రం కాదట. జాలేసి , నాతోబాటు రమ్మని పిలిచాను – అదే తడవుగా వచ్చేసి నా పక్కన పక్క వేసుకు పడుకుండిపోయాడు.
మొత్తం మీద రాత్రి సౌకర్యంగా నే గడిచింది. పూర్తిగా అయితే కాదు – ఎందుకంటే నన్ను బతికి ఉండగానే పాతిపెట్టినట్లు భయానకమైన పీడకలలు వచ్చాయి. తెల్లవారు జామున వినిపించిన వింత వింత ధ్వనులు మెలకువ తెప్పించేశాయి. ఏనుగు దంతం తో చేసిన బాకాలు అవి . జనాన్ని నిద్ర లేపేందుకు రోజూ ఒకరు వంతులవారీగా ఊదుతుంటారట.
నిన్నటి వాగు దగ్గరికి వెళ్ళి మొహాలు కడుక్కున్నాము. నిన్న జాబ్ చుట్టూ చేరినవాళ్ళలో ఒకావిడ వచ్చి తిరిగి ‘ ప్రేమ ప్రకటన ‘ చేసిందిగాని జాబ్ ఈసారి గట్టిగా అరిచి ఆవిడని తరిమివేశాడు. నాలాగ అతనూ కొంచెం స్త్రీద్వేషి – పదిహేడు మంది సంతానం లో ఒకడుగా పెరిగిఉండటం దానికి కారణం అయిఉండచ్చు. నాకు వినోదం గానే ఉండింది కాని ఆ తిరస్కరించబడిన స్త్రీ – అవమానం తో , కోపం తో , ఉడికిపోయింది . నేను కీడు శంకించాను – జాబ్ వివాహితుడనీ , సంసార జీవితం అతనికి విరక్తి కలిగించిఉండటం వల్లే మాతో యాత్రకి వచ్చాడనీ అక్కడివాళ్ళతో నమ్మబలికాను. మగవాళ్ళ మొహాల్లో యథాప్రకారంగానే ఏ చలనమూ లేదు – నమ్మారో లేదో తెలీదు. ఆడవాళ్ళు మాత్రం చిరునవ్వులు నవ్వుకున్నారు. బతుకుజీవుడా అనుకున్నాను.
ఉదయపు తిండీ తిప్పలూ అయాక వాళ్ళ పశువులమందలు చూసేందుకు వెళ్ళాం. వాటిలో రెండు రకాలున్నాయి – ఒక జాతి పరిమాణం లో పెద్దవిగా, కొమ్ములు లేకుండా ఉన్నాయి. సమృద్ధిగా పాలిస్తాయట. రెండో రకానివి పొట్టిగా, పెద్ద కొమ్ములతో – ఉన్నాయి. వాటిని మాంసం కోసం ఉపయోగిస్తారట. మేకలున్నాయిగాని వాటి పాలుపితకటం నేనెప్పుడూ చూడలేదు – వాటినీ మాంసానికే వాడతారు కాబోలు. వాళ్ళ వ్యవసాయం అయితే బాగా ప్రాథమికదశలోనే ఉంది.
ఇనుముతో చేసిన పెద్ద పార ఒకటే వాళ్ళు ఉపయోగించే పనిముట్టు. కాలికి పట్టు దొరికేట్లూ బుజానికి ఆనించుకునేట్లూ ఏ సులువూ లేదు దానికి. అందుకని వాటితో పనిచేయటం చాలా శ్రమతో కూడిన పని. తక్కిన ఆదిమజాతుల్లోలాగా ఇక్కడ ఆడవాళ్ళు ఆ పనులు చేయరు . మగవాళ్ళు మాత్రమే చేస్తారు.
ఈ అమహగ్గర్ మనుషుల ఆవిర్భావమూ చరిత్రా – వీటి గురించి తెలుసుకోవాలని కుతూహలం మాకు . ఎవరిని కదిలించినా ఏ సమాచారమూ వచ్చేది కాదు. చివరికి ఉస్తేన్ నుంచి కొన్ని సంగతులు రాబట్ట గలిగాము. ‘ రాణి ‘ ఉండే చోట పెద్ద పెద్ద భవనాలూ స్థంభాలూ ఉండేవట…అక్కడినుంచే ఈ మనుషులు వచ్చారనుకుంటారట. ఇప్పుడు అవన్నీ శిథిలమై ఉన్నాయి..ఎవరూ అక్కడికి వెళ్ళే సాహసం సాధారణంగా చేయరు…భూతాలుంటాయని నమ్ముతుంటారు. అటువంటి శిథిలాలు ఆ ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయట. ఆ భవనాలు నిర్మించిన మనుషులే ఇక్కడి కొండలు తొలిచి గుహలని మలిచారని చెప్పుకుంటారు. వీళ్ళకి న్యాయసూత్రాల వంటివి ఏమీ లేవు – కట్టుబాట్లు తప్ప. ఎవరైనా వాటిని మీరితే ఒకటే శిక్ష- మరణశిక్ష. అది ఎలా ఉంటుందని అడిగితే ఉస్తేన్ చెప్పలేదు – ‘ మీరే చూస్తారులెండి ‘ అని మాత్రమే అంది.
వాళ్ళకి రాణి ఉందని అందరికీ తెలుసు , కాని ఆమెను చూసినవారు తక్కువ. రెండుమూడేళ్ళకి ఒకసారి కొద్దిమందికి ఆమె దర్శనం కలుగుతుంది – అప్పుడూ దట్టమైన పరదా ధరించే ఉంటుంది. ఆమె అద్భుత సౌందర్యం గురించి ఉన్న కథలకి లెక్కే లేదు. ఆమె సేవకులు ప్రత్యేకం గా ఎంచుకోబడతారు – వాళ్ళు మూగ, చెవిటి వాళ్ళు.[ సహజంగానో మరింకెలానో తెలీదు ]. ఆమె కి చావులేదనే మాటతోబాటు ఇలాకూడా అనుకుంటూ ఉంటారు – ” కొన్నేసి సంవత్సరాలకొక్కసారి ఆమె భర్తను ఎంచుకుంటుంది. ఆడపిల్ల పుట్టగానే అతన్ని చంపేస్తారు…తల్లి మరణించాక ఆమెని రహస్యంగా సమాధి చేసి కూతురు కొత్త రాణి అవుతూ ఉంటుంది ” అయితే ఇందుకు ఆధారాలంటూ ఏమీ లేవు. ఎటువంటి ప్రశ్నలైనా వేసినవారికి మృత్యుదండనే. రాణికి రక్షకులుంటారు గాని సాధారణమైన సైన్యం ఏమీ ఉండదు.
ఆ ప్రాంతం పొడవు వెడల్పులు ఎంతవో ఎవరికీ తెలీదు . కొన్ని కొన్ని గుంపులుగా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాటిని ‘ కుటుంబాలు ‘ అంటారు. అప్పుడప్పుడూ వాళ్ళ మధ్యన యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. రాణి కొంతకాలం జరగనిచ్చి ఆపేయమంటుందట- ఆపేస్తారు. ఆ యుద్ధాల్లో జరిగే ప్రాణనష్టం వల్లా, ఏడాదికొకసారి దాడి చేస్తుండే విష జ్వరాల వల్లా జనసంఖ్య అదుపులో ఉంటుంది. బయటి తెగలతో వీళ్ళు ఏ సంబంధాలూ పెట్టుకోరు. ఒకప్పుడు[ జంబేసీ ] మహానది ప్రాంతం నుంచి దండయాత్ర కి ఒక సైన్యం రాబోయింది. బురదనేలల్లో వాళ్ళు దారి తప్పిపోయారు. అక్కడ గాల్లోకి లేచే అగ్నిగోళాలని [marsh gas ] చూసి శత్రువులు ఆ వైపు ఉన్నారనే భ్రమలో వెళ్ళి ఊబుల లో కూరుకుపోయారు. మిగిలినవాళ్ళు ఆకలితో చచ్చిపోయారు. ఇలా – ఆ చిత్తడినేలలని దాటిరావటం ఎవరికీ సాధ్యమయే పని కాదు. రాణి తలచుకోబట్టే మేము రాగలిగామని ఉస్తేన్ చెప్పింది.
ఆ నాలుగురోజుల్లో ఇవీ, ఇంకా కొన్నీ సంగతులూ తెలుసుకున్నాము. మట్టి పలకమీద రాసిఉన్నదానితో సరిపోలే విషయాలు చాలానే ఉన్నాయి. అది లియోకి విజయగర్వాన్ని కలిగిస్తే నావరకు నాకు భీతి మాత్రమే కలిగింది. జాబ్ అయితే జరుగుతున్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం పూర్తిగా మానేసి పరిస్థితులకి లోబడిపోయాడు. మా నావికుడు మహమ్మద్ పట్ల వీళ్ళ ద్వేషం స్పష్టంగా కనిపిస్తుండేది , కాకపోతే అతన్నేమీ బాధ పెట్టలేదు. అతను ఒకమూల కూలబడి అస్తమానమూ అల్లానీ ప్రవక్తనీ ఎలుగెత్తి పిలుస్తుండేవాడు. ఈ మనుషులు స్త్రీలూ పురుషులూ కారనీ కేవలం పిశాచాలనీ ఈ భూమి మంత్రాలమారిదనీ అతని నమ్మకం. నాకూ అతనితో ఏకీభవించాలని అనిపిస్తుండేది . బిలాలీ వచ్చేముందురోజు రాత్రి ఇలా జరిగింది -
ఉస్తేన్, మేము ముగ్గురం – నెగడు చుట్టూ కూర్చుని ఉన్నాము.ఉన్నట్లుండి ఆమె లేచి నిలుచుంది. లోగొంతుతో ఒక మోస్తరుగా మాట్లాడటం మొదలుపెట్టింది – అది మంత్రోచ్ఛాటన లాగానూ పాటలాగానూ కూడా ఉంది. ఆమె భంగిమ – మామూలుగా చూసేదానికి భిన్నంగా – ఠీవిగా నిటారుగా రాజసంతో నిండిఉంది. … సగం చీకట్లలో సగం నెగడు వెలుతురులో – నీడల్లో కలిసిపోతూ ఉన్న ఆకారం ..తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. తన చేయి లియో ఉంగరాలజుట్టు మీద వేసి అతన్నే సంబోధిస్తూ -
” నిన్నే ఎన్నుకున్నాను ప్రియా-నిన్ను మాత్రమే…ఎప్పుడో, ఏకాలం లోనో ! … మంచువంటి నీవన్నె , స్వర్ణమయం అయిన జుట్టు ..నీ కళ్ళలో ఆకాశం, వెలిగే నక్షత్రాలు.. దృఢమైన బాహుదండం, సంతోషం నిండిన ముఖం – మూర్తీభవించిన పురుషత్వం నీది. చూస్తూనే నా మనసును పారవేసుకున్నాను. ప్రియా, నీకు హాని రాకుండా నాకు హత్తుకున్నాను. సూర్యుడి కిరణాలనుంచి నా కురులు కప్పి దాచాను. ఒకరికి ఒకరం సొంతం, సర్వస్వం అయిపోయాము…ఆ దుష్టపు దినం దాపురించేదాకా- ఆ కాలమొక్క లిప్తలో గడిచిపోయింది. అంధకారం కమ్ముకుంది , తిరిగి చూస్తే లేవు నువ్వు. ఆమె నిన్ను లాక్కుపోయింది – నా కన్నా శక్తిగల ఆడది , అందమైన ఆడది. నీ చూపులు నన్నే వెతికాయి , నన్నే పిలిచావు..కాని ఆమె బలం హెచ్చయింది, చెప్పరాని చోట్లకెక్కడికో నిన్ను ఈడ్చుకుపోయింది.
అప్పుడు..ప్రియతమా ! అప్పుడు ….”
ఇక్కడితో ఆ మాటలు ఆగిపోయాయి. మేము చేష్టలుదక్కి ఉండిపోయాము. ఆమె కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నదేన్నో తళతళమంటూ చూస్తున్నాయి. ఒక్క క్షణం లో ఆమె మొహం భయంతో వికృతమైపోయింది..లియో తల మీంచి తన చేయి తీసేసింది. చీకట్లోకి వేలితో చూపించింది – మాకేమీ కనిపించలేదు. అప్పుడిక నరాలు పట్టు తప్పి , స్పృహ కోల్పోయి పడిపోయింది.
లియో కి ఉస్తేన్ మీద ఇష్టం పెరుగుతూ వస్తోంది – అతను బాగా ఆదుర్దా పడిపోయాడు. అర్థం కాని భయం నన్ను ముంచెత్తింది ..ఏమిటిదంతా ? మానవలోకమేనా ఇది ?
అంతలో ఆమెకి స్పృహ వచ్చింది. నిలువెల్లా ఒణికిపోతూ లేచి కూర్చుంది.
” ఏమిటి నీ ఉద్దేశం ఉస్తేన్ ? ” లియో ప్రశ్నించాడు.
” ఏముంది..ఏమీ లేదు దొరా ! ” ఆమె నవ్వు తెచ్చిపెట్టుకుంది. ” మా జాతివాళ్ళు పాడేలాగే నేనూ పాడాను అంతే. ఇంకా జరగనిదాన్ని గురించి ఏం తెలుసు నాకు ? ”
” ఏం చూశావు నువ్వు ? ” నేను పదునుగా అడిగాను.
” ఏమీ లేదు. నేనేమీ చూడలేదు,నన్నేమీ అడగద్దు. మీకెందుకు భయం ? ” లియో వైపు తలతిప్పింది. అప్పుడు ఆమె మొహం లో కనిపించిన మార్దవం నేను అంతకుముందూ ఆ తర్వాతా కూడా ఏ స్త్రీ మొహం లోనూ చూడలేదు . రెండు చేతులతో అతని మొహాన్ని దగ్గరికి తీసుకుని , బిడ్డను ముద్దాడినట్లు నుదుటి మీద ముద్దు పెట్టుకుని చెప్పింది.
” నేను నీకు దూరమైపోయినప్పుడు , నీ చేతికి అందనప్పుడు ..నన్ను తలచుకో దొరా ! నీ పాదాలను కడిగేందుకు కూడా సరిపోను నేను , కానీ- చెప్పలేనంత ప్రేమ నీపైన. దొరికినదాన్ని ఇప్పుడు తీసుకుందాం.. రే పు ఏమి కానుందో ? సమాధిలో నిద్రించేప్పుడు వెచ్చదనం రాదు సుమా , పెదవులు దొరకవు సుమా ! అప్పటికిక అంతా చేదే… ఈ రాత్రి మాత్రం మనది, ఈ కాసిని గంటలూ ..ఇప్పుడు.”
[ ఇంకా ఉంది ]
**** (*) ****
ఊపిరి సలపని ఉత్కంఠలో కొన్ని క్షణాలు – ఉస్తేన్ ఏమి చూసిందో , చాలా ఊహలు వస్తున్నాయి Mam , ప్రవాహం ఎక్కడా ఆగలేదు, మంచి మంచి పదాలు సావిడి, నడవా .. చదవడం చాలా ఆనందంగా వుంది. తక్కువ వాక్యాల్లో రాణి – గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్న ఆనందం. వచ్చే భాగం కోసం ఎదురుచూస్తున్నాం , వడివడిగా అడుగులు ‘రాణి ‘ వైపు !!
థాంక్ యూ సో మచ్ రేఖా. ఆ పదాలు చందమామ తెలుగు కొడవటిగంటి కుటుంబరావు గారి దయ.
కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఇండియానా జోన్స్, కింగ్ సోలమన్ మైన్స్ సినిమాలు చూస్తున్నట్లు ఉంది, ఇది చదువుతుంటే.