నుడి

నుడి-5 (మార్చి 2016) & నుడి – 4 (ఫిబ్రవరి 2016) ఫలితాలు

మార్చి 2016


నుడి – 4 (ఫిబ్రవరి, 2016) ఫలితాలు


పాఠకులకు నమస్కారం.
నుడిని ఈ సారి ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచిన వారు:
1. భారతి
2. కామేశ్వర రావు
3. రవిచంద్ర ఇనగంటి
4. తుమ్మూరి రామ్మోహన్ రావు
5. రాధిక
6. నాగరాజు రవీందర్

‘నుడి’ పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.

ఈ సారి కొందరు కొత్తవారు పాల్గొనడం ఆనందాన్ని కలిగించింది. మరికొందరు కొత్తవారు ఈ పజిల్ వైపు ఆకర్షితులవుతారనే ఉద్దేశంతో ఎక్కువ ఆధారాలకు వివరణలను ఇస్తున్నాను.

వివరణలు:
3 అడ్డం: మన మధ్య పాక్షికంగా ఉన్న గౌరవం. చాలా మంది మనన అని నింపారు.
వివరణ: పాక్షికంగా ఉన్న అంటే ‘ఉన్న’ లోని రెండక్షరాలలో ఒకటైన ‘న్న’. దీన్ని ‘మన’ మధ్యన దూరిస్తే వచ్చేది మన్నన = గౌరవం.

7 అడ్డం: నడుమ 3 అడ్డంకు నడుమ మార్పు. మడున, మనన, మన్నన అని నింపారు.
వివరణ: 3 అడ్డంకు సమాధానం మన్నన. దానికి నడుమ మార్పు చేస్తే (అంటే ‘న్న’ ను ‘ధ్య’ గా మార్చితే మధ్యన వస్తుంది. అది ఆధారంలోని మొదటి పదమైన నడుమకు సమానం.

10 అడ్డం: మొదలు తప్ప మరేమీ మిగలని అటువంటి విక్రమార్కుల నీలాపనిందలు తిట్లు అధర్మాన్ని సూచిస్తాయి.
వివరణ: అటువంటి, విక్రమార్కుల, నీలాపనిందలు, తిట్లు – ఈ నాలుగు పదాల్లో మొదలు మాత్రమే (మొదటి అక్షరం మాత్రమే) మిగిలింది కనుక వాటి మొదటి అక్షరాలను వరుసగా రాయాలి. అప్పుడు అవినీతి వస్తుంది. అదే సమాధానం.

12 అడ్డం: వదరుబోతుతనం పులిని చూసి మరో జంతువు పెట్టుకునేదాంట్లో ఎక్కువగ ఉంటుంది.
వివరణ: పులిని చూసి మరో జంతువు (నక్క) పెట్టుకునేది = వాత. ఎక్కువగ = చాల. ‘వాత’లో ‘చాల’ను దూరిస్తే వచ్చేది వాచాలత = వదరుబోతుతనం.

23 అడ్డం: ఇంకొంచెం తమరికి శూన్యాన్ని కలిపి సరి చెయ్యాలి.
వివరణ: తమరి + o ( శూన్యం) = తమరిం. దీన్ని తారుమారు చేస్తే మరింత = ఇంకొంచెం.

24 అడ్డం: రోజా తిరగేసిన నిక్కరు పక్కన జాలి లేని జాబిలి.
వివరణ: నిక్కరు = లాగు. తిరగేసిన నిక్కరు = గులా. జాలిలేని జాబిలి (జాబిలి మైనస్ జాలి) = బి. గులా + బి = గులాబి = రోజా.

25 అడ్డం: వాడి వున్న గోరు చివరలు ఆంగ్లేయుల భోజనాన్ని సూచిస్తాయి.
వివరణ: ఆధారంలోని మొదటి మూడు పదాల చివరి అక్షరాలను కలిపితే డిన్నరు వస్తుంది.

2 నిలువు: వాపోయిన మనవాడు బతకడు. కొంత మంది పోనాడు అని నింపారు.
వివరణ: ‘వా’పోయిన అన్నాం కనుక మనవాడు – వా = మనడు = బతకడు.

3 నిలువు: దోమలే ఏరియాలో ఏదో పోగొట్టుకుంటే ఈ వ్యాధి వస్తుంది.
వివరణ: ‘దో’’మలే ‘ఏ’రియా మైనస్ ‘ఏ’ ‘దో’ = మలేరియా.

6 నిలువు: పువ్వు తారుమారు చేయాల్సింది క్షీరమట. మాటరు అని నింపారు కొందరు.
వివరణ: క్షీరమట = పాలట. దీన్ని తారుమారు చేస్తే పాటల వస్తుంది. ఇదొక పువ్వు పేరు.

11. నిలువు: నువ్వులు తిలకాలు కాలేదు.
వివరణ: ‘కా’లేదు అన్నాం కనుక తిలకాలు – కా = తిలలు = నువ్వులు.

13 నిలువు: అక్కడక్కడే తిరిగి కొసల్లో చెమ్మను చేర్చుకుంది. తత్తడి, తట్టాడి అని నింపారు కొందరు.
వివరణ: తచ్చాడి అనేది సమాధానం. దాని కొసలను కలిపితే వచ్చేది తడి = చెమ్మ.

17 నిలువు: గడిలో పైకి స్పృశించి దీన్ని విప్పడం కష్టం. చాలా మంది గడి నుడి అని నింపారు.
వివరణ: స్పృశించి = ముట్టి. పైకి అన్నాం (ఇది నిలువు ఆధారం కనుక వెనక్కి అనకుండా పైకి అన్నాం). ముట్టిని రివర్స్ చెయ్యలి. అప్పుడు ‘ట్టిము’ వస్తుంది. దీన్ని ‘గడి’ మధ్యన చేర్చితే గట్టి ముడి వస్తుంది.

18 నిలువు: నీ నా కింద నీళ్లు చేరితే ప్రాణాలతో ఉండనివ్వరు.
వివరణ: నీ నా = మన. నీళ్లు = నీరు. మన + నీరు = మననీరు = ప్రాణాలతో ఉండనివ్వరు.

20 నిలువు: కవితలు విధ్వంసమైతే వికృతమైన కథలు మిగులుతాయి.
వివరణ: ‘వి’ధ్వంసమైతే అన్నాం కనుక కవితలు లోంచి ‘వి’ మైనస్ చెయ్యలి. అప్పుడు కతలు మిగుల్తుంది. వికృతమైన అంటే వికృతి అయిన అన్న మాట. కథలుకు కతలు వికృతి కదా.

21 నిలువు: తెలుగు నాడులో కుడినుండి ఎడమకు వచ్చిన సర్పాలు. కొందరు లుగునా అని నింపారు.
వివరణ: ఆధారంలోని మొదటి రెండు పదాల మధ్య ‘నాగులు’ కుడినుండి ఎడమకు వస్తుంది.

22 నిలువు: ఒక రకమైన మత్తు పానీయంతో చక్రవర్తి ఏర్పరచిన టెంటు.
వివరణ: చక్రవర్తి = శిబి. మత్తు పానీయం = రం (Rum). శిబి + రం = శిబిరం = టెంటు (Tent)

**** (*) ****