అనువాద నవల

రాజ్ఞి – తొమ్మిదవ భాగం (SHE by Sir H.Rider Haggard)

మార్చి 2016

“హ్మ్..వెళ్ళాడు” – బిలాలీని ఉద్దేశించి అంది రాజ్ఞి. ” ఏళ్ళొస్తాయి, గడ్డం తెల్లగా పెరు గుతుంది గాని జ్ఞానం రాదు మనిషికి. దోసిట్లోకి నీళ్ళలాగా తీసుకోబోతాడు , నీళ్ళలాగే వేళ్ళ సందునుంచి ఆ జ్ఞానం జారిపోతుంది. అరచేతికి అంటుకున్న ఆ కాస్త తడినే చూసి ‘ ఆహా ! ఎంత వివేకి ! ‘ అని జనం దణ్ణాలు పెడుతుంటారు ఇటువంటివాళ్ళని చూసి, అవునా ? ” నవ్వింది. ” అవునూ , నిన్నేమంటాడు ఇతను, కోతి మొహం వాడని కదూ ? ఈ అనాగరికులకి అంత కన్న ఏం తెలుస్తుందిలే, కనిపించిన ప్రతిదాన్నీ వాళ్ళకి తెలిసి ఉన్న జంతువుతోగాని పోల్చుకోలేరు . ఇంతకూ నీ దేశం లో ఏమని పిలుస్తారు నిన్ను ? ”” నన్ను ‘ హోలీ ‘ అంటారు రాజ్ఞీ ”” హోలీ ” – కాస్త కష్టం గా ఆమె తిరిగి పలికింది , కాని ఆ కంఠం లో నా పేరు అద్భుతంగా ధ్వనించింది. ” హోలీ అంటే ఏమిటసలు ? ”

” అదొక ముళ్ళ చెట్టు పేరు రాజ్ఞీ ”

” నీకు తగిన పేరేలా ఉంది. ముళ్ళకీ నీ వికృతరూపానికీ సరిపోయింది , కాని వృక్షం లాగా స్థిరంగా , బలం గా కనిపిస్తున్నావు. నా అంచనా తప్పు కాకపోతే , నిజాయితీ గలవాడివీ ఆలోచనాపరుడివీ కూడా అని అనుకుంటున్నాను. అలాగే నిలబడిఉన్నావెందుకు, రా, ఇలా వచ్చి కూర్చో. ఆ బానిస వెధవల్లాగా నా ముందర నువ్వు సాష్టాంగ పడనక్కర్లేదు. వీళ్ళ మూఢభక్తి నాకు విసుగు- ఒక్కోసారి మరీ చిర్రెత్తుకొస్తే తెగ తిట్టిపోస్తుంటాను , కారణం లేకుండానే- వాళ్ళు అయోమయం తో హడిలి చస్తారు – నాకు ఆ మాత్రం వినోదం అవసరమే కాదూ ? ” దంతం తో చెక్కినట్లున్న తన చేత్తో పరదాని తొలగించి నన్ను లోపలికి అనుమతించింది.

నిలువునా వణుకు పుడుతుండగా లోపలికి అడుగు పెట్టాను. అక్కడొక చిన్న గది వంటిది – పన్నెండు అడుగుల పొడవూ పది అడుగుల వెడల్పూ. అందులో పట్టు దిండ్లు అమర్చి ఉన్న దివాన్ , ఒక మేజా బల్ల. బల్ల మీద రకరకాలైన పళ్ళు, గాజు కూజాలో మిలమిలమంటున్న నీరు. ఆ చివరన మరొక కడవ- రాతితో మలచినది ఉంది. అందులోనూ నీరే ఉందేమో మరి – తెలియదు.

మట్టి కూజాలలో వెలిగించి ఉన్న దీపాల మెత్తని వెలుతురు. ఆ గాలిలోనూ , పరదాల మీంచీ సున్నితమైన పరిమళం. రాజ్ఞి శ్వేతవస్త్రాల నుంచీ , శిరోజాల కాంతి నుంచీ కూడా మరింకొకలాంటి పరిమళం. అక్కడ అలా నిలబడి ఉండిపోయాను .

” కూర్చో ” – దివాన్ ని చూపించింది. ” నువ్వు నన్ను చూసి భయపడేందుకు ఇంతవరకూ కారణం లేదు – ఒక వేళ ఉన్నా, ఆ భయం ఎంతో కాలం ఉండదు , శీఘ్రంగా నీ సం హారం జరిగిపోతుంది . కనుక, ఇప్పటికి, చింతించకు ”

ఆ చివరన మెల్లిగా కూలబడ్డాను. ఆమె ఇంకో చివరన కూర్చుని ఉంది.

” ఊ, ఇప్పుడు చెప్పు- ఈ ప్రాచీన అరబిక్ భాష ఎలా పట్టుబడింది నీకు ? నాకెంతో ప్రియమైన మాతృభాష అది. అవును, అరేబియా లో జన్మించాను నేను , కహ్ తాన్ కుమారుడైన యారాబ్ వంశం లో… సుందరమూ పురాతనమూ అయిన ఒజాల్ నగరం లో, యమన్ భూమిలో. నువ్వు మాట్లాడేది పూర్తిగా అప్పటి మా భాష లా అయితే లేదులే , మా హమ్యార్ తెగ వారు పలికితే సంగీతం వినిపించేది. కొన్ని మాటలూ తేడా గా ఉన్నాయి. ఈ అమహగ్గర్ మనుషులు నా భాషని బొత్తిగా ఖూనీ చేసేస్తారు, భరించలేక వాళ్ళతో నేను వేరే భాష లో మాట్లాడుతుంటాను ”

” నేను దాన్ని ఎంతో కాలం పాటు అభ్యసించి ఉన్నాను రాజ్ఞీ ! ఈ భాషను ఈజిప్ట్ లోనూ మరింకొన్ని ప్రాంతాలలోనూ కూడా మాట్లాడతారు ”

” ఓ హో, ఇంకా మాట్లాడుతున్నారా ? ఈజిప్ట్ ఇంకా ఉందా ? ఏ ఫారో ఏలుతున్నాడు దాన్ని ఇప్పుడు ? పర్షియన్ చక్రవర్తి ఓకస్ సంతతి వారేనా లేక వారి కాలం అంతరించిందా ? ”

” పర్షియన్ లు ఈజిప్ట్ ని వదిలి వెళ్ళి రెండు వేల ఏళ్ళు దాటిపోయింది రాజ్ఞీ ! ఆ తర్వాత టాలెమీలు, రోమన్ లు , ఇంకెందరెందరో- నైల్ నదీదేశాన్ని పాలించి , వారి కాలం ముగిశాక అంతరించారు. మీకు ఆర్టరెక్సెస్ అనే పర్షియన్ గురించి తెలుసా ? ”

ఆమె నవ్వింది, బదులు ఇవ్వలేదు – మళ్ళీ భయం పుట్టింది నాకు. ” మరి గ్రీస్ సంగతేమిటి ? ఇంకా ఉందా ఆ దేశం ? గ్రీకులు- ఎంత సౌందర్యవంతులో ! బుద్ధిశాలులు కూడాను- కాని నిర్దయులు , చంచలస్వభావులు…”

” ఆ గ్రీక్ దేశం ఉంది, ఆ మనుషులూ ఉన్నారు. కాని ఇప్పటి వారికి అప్పటి వారితో పోలికే లేదు – ఆ దేశానికీ ఆ వైభవం పోయింది ”

” ఓ ..అయితే హీబ్రూ ల సంగతేమిటి ? ఇంకా జేరు సలేం లోనే ఉంటున్నారా ? వివేక చక్రవర్తి [Solomon] నిర్మించిన ఆలయం నిలిచి ఉందా ? ఇప్పుడు ఏ దేవుడిని పూజిస్తున్నారో ? వాళ్ళ ‘ రక్షకుడు ‘ ఏతెంచాడా ? ”

” యూదులు పూర్తిగా చితికిపోయి చెల్లాచెదురైపోయారు. జేరు సలేం లో ఏవీ లేవు ఇప్పుడు , హెరాడ్ నిర్మించిన ఆలయం…”

” హెరాడ్ ? ఎవరతను- నాకు తెలియదు…సరేలే, చెప్పు ”

” ఆలయాన్ని రోమన్ లు తగలబెట్టారు , ఆ శిథిలాల మీద రోమన్ గద్దలు ఎగిరాయి- జ్యూడియా ఇప్పుడొక ఎడారి ”

” ఆహా- అవున్లే, రోమన్ లు తక్కువవాళ్ళా మరి ! అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు – సరిగ్గా చెప్పావు, గద్దల్లాగా వేటాడతారు శత్రువులని- శాంతిని నెలకొల్పుతారు ”

” అవును, ఎడారిని సృష్టిస్తారు, దాన్నే ప్రశాంతమని పేర్కొంటారు ” – సూచించాను.
[Solitudinem faciunt, pacem appellant ]

” ఓహో- నీకు లాటిన్ కూడా వచ్చునా ? ” ఆశ్చర్యంగా అంది. ” ఇన్నేళ్ళ తర్వాత ఆ భాష నా చెవుల్లో విచిత్రంగా ధ్వనిస్తోంది , రోమన్ లు మాట్లాడే యాస కాదనుకుంటాను ఇది. ఈ మాటలు రాసినది ఎవరు ? నాకు తెలీదు గాని, ఎవరో శ్రేష్టుడే అయి ఉండాలి. మొత్తానికి నేనొక విద్వాంసుడిని కలుసుకున్నాను కదా- ప్రపంచ విజ్ఞానమంతా నీకు మంచినీళ్ళప్రాయం లాగా ఉంది. నీకు గ్రీక్ కూడా తెలుసా ? ”

” తెలుసును రాజ్ఞీ, కొంత హీబ్రూ కూడా తెలుసు- కాని బాగా మాట్లాడలేను. వాటిని ఇప్పుడు మృత భాషలని అంటున్నారు ”

ఆమె చిన్నపిల్లలా చప్పట్లు కొట్టింది. ” వికారమైన వృ క్షం వంటి నీన్ను జ్ఞానఫలాలు ఆవరించి ఉన్నాయి , ‘ హోలీ ‘ ! ఆ యూదులకి బాగా అయిందిలే , నాకు వాళ్ళంటే అసహ్యం…నేను తెలుసుకున్నదాన్ని వాళ్ళకి నేర్పించబోతే నన్ను ‘అవిశ్వాసి ‘ అని నిందించేవారు. వారి ‘ రక్షకుడు ‘ వచ్చాడా ? లోకాన్నంతటినీ ఏలాడా ? ”

” వచ్చాడు ” – నమ్రత తో చెప్పాను. ” కాని బీదవాడుగా , తక్కువ వాడు గా వచ్చాడు – వాళ్ళతన్ని లక్ష్యపెట్టలేదు. అతన్ని దూషించారు , ఒక చెట్టుకు శిలువ వేశారు. కాని ఆయన మాటలు, మహిమలు నిలిచే ఉన్నాయి- దేవుని కుమారుడైనందువలన. ప్రపంచం లో సగభాగాన్ని ఆయన ఇప్పుడు ఏలుతున్న మాట నిజం, అయితే అది అందరు రాజులూ ఏలే లాంటి రాజ్యం కాదు ‘’

” హ్మ్…కటిక గుండె ల తోడేళ్ళు ” – ” బహుదేవతారాధకులు, వడ్డీలు కట్టేవారూ లాభాలు తీసేవారూ – దురాశాపరులు ! వాళ్ళు తమ రక్షకుడిని శిలువ వేశారా- అందుకు సమర్థులే వాళ్ళు . ఏ పవిత్రాత్మ వారికోసం దిగివచ్చినా అది వారికి పట్టే విషయం కాదు- నిజంగా అతను అటువంటి వాడేనా ? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాంలే. భగవంతుడే అవనీ , ఆర్భాటంగా అట్టహాసం గా రాక పోతే వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళు ‘ ఎన్నబడిన జాతి ‘ – వారి దేవుడు జెహోవా చేత- కాని లోభానికి దాసులై సంపన్నులై నారు, శక్తిమంతులైనారు – రక్షకుడు నిరాడంబరుడై వచ్చాడు గనుక శిలువ వేశారు – ఈ రోజున చెల్లా చె దురైనారంటే అవరా మరి ? ఆ విషయమే వాళ్ళ ప్రవక్త ఒకరు జోస్యం చెప్పినట్లున్నారు, జ్ఞాపకం వస్తోంది. అలాగే నాశనమవనీ వాళ్ళని – నా హృదయాన్ని బద్దలు కొట్టి నన్నీ అరణ్యాలలోపలికి తరిమికొట్టింది వాళ్ళే కదా ! జెరుసలేం ఆలయం ముందు నిలుచుని నా జ్ఞానాన్ని వాళ్ళకి బోధించబోయిన నన్ను రాళ్ళతో కొట్టారు – వాళ్ళ వెనకే ఆ మతగురువులు , ఇంతింత గడ్డాలు పెట్టుకుని ! చూడు, ఆ గాయపు మచ్చ ఇంకా ఉంది ” – మోచేతిపైకి తన వస్త్రాన్ని లాగి చూపించింది – పాల వంటి తెల్లని చర్మం మీద ఎర్రని మచ్చ. నేను కంగారుగా వెనక్కి తగ్గాను.

” మన్నించండి రాజ్ఞీ ! యూదుల రక్షకుడిని గోల్ గొతా లో శిలువ వేసి రెండు వేల ఏళ్ళవుతోంది. అంతకుముందు కాలం లో మీరు యూదులకి బోధించబోవటం ఏమిటి ? మీరు స్త్రీ యే గాని ఆత్మ కారు గదా ! ఏ స్త్రీ అయినా రెండువేలేళ్ళు జీవిస్తుందా…నన్నెందుకు వేళాకోళం చేస్తున్నారు ? ”

ఆమె వెనక్కి వాలి కూర్చుంది. మేలిముసుగు వెనక నుంచి ఆమె నేత్రాలు నన్ను శోధిస్తున్నాయనిపించింది.

” నువ్వు మంచి జ్ఞానివేగానీ మానవా, ఈ భూమి పైన నీకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. జన్మించిన ప్రతిదీ చనిపోవలసిందేనని, ఆ యూదులకి మల్లే నువ్వూ నమ్ముతున్నావా ? మృత్యువు అనేది లేదు, ఉండనవసరం లేదు – మార్పు ఉంటుంది, అంతే. ఆ రాతి గోడల పైని శిల్పాలని చూపిస్తూ అంది – ” చూడు- ఇవి జన్మించి రెండు వేలు కాదు, ఆరువేల ఏళ్ళయింది. వీటిని నెలకొల్పినవారు ఆ తర్వాతి యుద్ధాలలో పరాజితులైనారు – కాని వారు నశించలేదోయీ, ఇప్పుడు , ఈ క్షణం లో కూడా వారు జీవించే ఉన్నారు. వారి ఆత్మలు మనల్ని తిలకిస్తూ ఉండవచ్చు కూడా ”

” కాని లోకం దృష్టిలో వారు మరణించారు ”

” కావచ్చు, కొద్ది కాలం పాటు ! ప్రపంచం లోకి కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. అవును, పరదేశీ ! ఈ ఆయేషా ఎదురుచూస్తోంది, నేను ప్రేమించినవాడు తిరిగి జన్మిస్తాడని, నన్ను వెతుకుతూ ఇక్కడికే వస్తాడని, పలకరిస్తాడని ! ఇంతటి శక్తిమంతురాలిని , గ్రీ కుల హెలెన్ కన్న సౌందర్యవతిని, సాల్మన్ చక్రవర్తి కన్న ఎక్కువ మేధాశాలినిని – ప్రపంచపు సంపదలూ రహస్యాలూ అన్నింటినీ ఎరిగి ఉన్నదాన్ని , అన్ని వస్తువులనీ నాకు అనుకూలం గా మలచుకోగలిగినదాన్ని – మార్పుని, అదే, నువ్వనే మృత్యువుని కూడా అధిగమించినదాన్ని… ఇక్కడ, పశువులకన్న హీనులైన ఈ అనాగరికుల మధ్యన , దేనికి నివసిస్తున్నాననుకుంటున్నావు ? ”

” నాకు తెలియదు ” – వినయంగా సమాధానమిచ్చాను.

” ఎందుకంటే నా ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్నాను గనుక. యాదృచ్ఛికంగా నా జీవనం దుష్టమయింది…అయినా ఏది మంచో ఏది చెడో నిర్ధారించగలవారెవరు ? ఒకవేళ నేను చావగలిగి ఉన్నా చనిపోయేందుకు నాకు భీతి…చనిపోయి అతన్ని అన్వేషించాలనుకుంటే-అప్పుడు మా ఇద్దరి మధ్యన ఎంత ఎత్తు గోడలుంటాయో, వాటిని నేను ఎక్కగలనో లేదో…అవునో కాదో, భయమంతే నాకు. ఆ గ్రహాంతరాలలో విశ్వాంతరాళాలలో దారితప్పి ఎప్పటికీ తిరుగాడుతుండనని నమ్మకమేమిటి ? కాని ఒక రోజు వస్తుంది- ఇప్పటినుంచి అయిదు వేల ఏళ్ళు కావచ్చు, చీకట్లోకి కరిగే చిన్న చిన్న మబ్బుల వలె కాలగర్భం లోకి మేము ఒకటిగా కలిసిపోవచ్చు…లేదా అది రేపే కావచ్చు – అతను, నా ప్రియుడు – మళ్ళీ పుట్టి …మానవవ్యూహాలకన్న బలీయమైనదాని వెంబడి నడిచి ఇక్కడికే – ఇక్కడికే, వచ్చి నన్ను కనుగొంటాడు ! నేనేమిటోఅర్థమయాక అతని హృదయం నా పట్ల మెత్తనవుతుంది…ఒకనాడు అతనికే నేను ద్రోహం తలపెట్టి ఉన్నా ! ఒకవేళ నన్ను గుర్తించనేలేడా.. ఏం? ఈ సౌందర్యం కోసమైనా ప్రేమించబోడా నన్ను ? ”

కొద్ది క్షణాల పాటు నాకు మాట పెగలలేదు. ఆ ధోరణి నా బుద్ధికి అందనంత దూరాన ఉంది.

చివరికి అన్నాను – ” పోనీ అలాగనే అనుకున్నా, రాజ్ఞీ , మనుషులు తిరిగి తిరిగి జన్మిస్తారనేది నమ్మినా , మీ విషయం లో అది వర్తించదా మరి , మీరు సత్యమే చెబుతున్నట్లైతే….” ఆమె తలెత్తి చూసింది- పదునైన కత్తుల తళతళ వంటి ఆ చూపు కి తడబడి, సమర్థించుకున్నాను – ” అది కాదు, అసలే మరణించని వారెవరుంటారు ? ”

” నిజమే. శోధన వలన కొంతా యాదృచ్ఛికంగా కొంతా , ప్రపంచపు మహారహస్యాలలో ఒకదాన్ని నేను భేదించాను. ఏం, ఎందుకు కుదరదు చెప్పు పరదేశీ, జీవితాన్ని కొంతకాలం పాటు పొడిగించటం ? ఈ అనంతకాలప్రవాహం లో పదీ ఇరవై యాభై వేల యేళ్ళనగా ఎంత అని అంటావు ? పదివేల సంవత్సరాల తుఫానులూ జడివానలూ ఒక కొండకొమ్ముని ఏ మాత్రం అరగదీస్తాయంటావు ? రెండు వేల ఏళ్ళ నుంచీ ఈ గుహలు ఇలాగే ఉన్నాయి – పశువులు మరణిస్తాయి, పశుప్రాయులైన మనుషులు మరణిస్తారు. నీకు అర్థం కావటం లేదా, పదార్థం లో గొప్పేమున్నదోయీ ? ప్రాణశక్తి లో ఉన్నది అద్భుతం , ఆ ప్రాణం కొంతకాలం పాటు కొనసాగటం విశేషం కాదు. ప్రకృతి లో ఉన్న శక్తిని, ఆమె బిడ్డ అయిన మానవుడు ఆవాహన చేసుకోగలితే ప్రకృతి లాగే జీవించగలడు. శాశ్వతం గా జీవిస్తాడని చెప్పటం లేదు సుమా నేను, ప్రకృతీ మరణిస్తుంది, లేదా – ఒక మార్పుకు లోబడి నిద్రిస్తుంది, తిరిగి జన్మించేవరకూ. ఎక్కడినుంచి శక్తిని గ్రహించవచ్చునో ఆ ప్రకృతి మరణించటం ఇప్పట్లో జరిగేది కాదు , అందుచేత ఆ రహస్యం ఎరిగిన వారి మరణమూ ఇప్పుడప్పుడే లేదు. నాకు సర్వమూ తెలిసిపోయిందని చెప్పను , కాని , కొంత తెలుసుకున్నాను. నీకు ఇదంతా జీర్ణించుకోలేని మర్మమని నాకు తెలుసు, కనుక ఇప్పటికి ఇది చాలు. బుద్ధి పుడితే ఇంకెప్పుడైనా వివరిస్తాను- లేక అసలింకేమీ చెప్పనేమో కూడా. మీరు ఈ ప్రదేశానికి వస్తున్నారని నాకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నావా ? మిమ్మల్ని ఎలా కాపాడుకొస్తున్నానో అంతుపట్టటం లేదా ? ”

” అవును, రాజ్ఞీ ! ” బలహీనం గా జవాబు చెప్పాను.

” చూడు, ఈ నీటిలోకి ” రాతికడవ వైపు చూపించింది, ముందుకు వంగి దాని మూతి పైన తన అరచేయి ఆనించింది.

లేచి చూశాను. తక్షణమే ఆ నీరు నల్లగా అయింది, అంతలోనే తేట పడింది. ఆ దరిద్రగొట్టు కాలవలో , మా పడవ కి తెడ్లు వేసుకుంటూ జాబ్, మహమ్మద్, నేను. ముసురుతున్న దోమలు- అపస్మారకస్థితిలో పడవ అడుగున పడిఉన్న లియో, దోమల నుంచి కాపాడేందుకు అతని ముఖం పైన కప్పి ఉంచిన కోటు రంగు తో సహా , మొత్తం – అతి స్పష్టం గా, ఎదురుగా ఉన్నట్లుగా , కనిపించింది.

నేను కెవ్వుమంటూ వెనక్కి పరిగెత్తాను. అదంతా మాయాజాలమని అరిచిచెప్పాను …అంతా జరిగిపోయి ఉన్న దృశ్యమే !

” లేదు, హోలీ, లేదు – ఇది మాయ కాదు. మాయ అన్నది లేదు , అజ్ఞానం తప్ప. జ్ఞానం ఉంది, సృష్టి లోపలి రహస్యాలను శోధించి తెలుసుకోవటం అది. ఈ నీరు నాకు దర్పణం , నేను భావిస్తున్న చోట ఏమి జరుగుతూ ఉందో ఇందులో నాకు కనిపిస్తుంది…ఆ పని ఎప్పుడోగాని తలపెట్టను . గతించినకాలం నుంచి – నాకు తెలిసిన ఈ దేశపు సంఘటనలనైనా, లేక నీకు తెలిసిన నీ దేశపువాటినైనా – ఇక్కడ చూపించగలను. నీకు ఇష్టం వచ్చిన ముఖాన్ని తలచుకో, అది నా మేధలోకి ప్రవహించి ఇక్కడ ప్రతిఫలిస్తుంది. అంతా తెలిసిపోలేదని అన్నానుగా, అందుకని ఇక్కడ భవిష్యత్తు కనిపించదు నాకు. ఈ రహస్యం పాతదే, నేను కనిపెట్టిందేమీ కాదు. ఈజిప్ట్ లోనూ అరేబియా లోనూ శతాబ్దాల నుంచీ మాంత్రికులకి ఇది తెలిసినవిద్యే . ఒక రోజున, యథాలాపంగా – నేను ఆ రెండు వేల సంవత్సరాల కిందట ప్రయాణించిన కాలవ ని తలచుకుని ఇందులోకి చూశాను. మీరంతా కనిపించారు- ఆ పడుకుని ఉన్న యువకుడి ముఖం కనిపించలేదు గాని, ఎవరో గొప్పవాడిలాగా అనిపించి – మిమ్మల్ని రక్షించాను. సరే, ఇక సెలవు తీసుకుందామా ? ఆగాగు, ఆ యువకుడి గురించి చెప్పు నాకు- బిలాలీ అతన్ని సిం హం అని ప్రస్తావిస్తాడు- అతన్ని చూడాలి నేను. ఒంట్లో బాగాలేదన్నావు కదూ అతనికి – జ్వరానికి తోడు పెద్ద గాయం కూడా తగిలినట్లుంది…”

” అతని పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు ” నా కళ్ళలో నీరు తిరుగుతుండగా అడిగాను – ” మీరేమీ చేయలేరా ? ఇన్ని శక్తులు ఉన్నాయని అంటున్నారే, అతన్ని బాగు చేయలేరా ? ”

” తప్పకుండా ! అతనికి పూర్తిగా నయం చేయగలను నేను – ఎందుకంత వేదన పడుతున్నావు ? అతను నీకు అంతగా ప్రేమాస్పదుడా ? నీ కొడుకా ? ”

” నా పెంపుడుకొడుకు. అయితే అతన్ని ఇక్కడికి తీసుకు రానా ? ” – ఆత్రంగా అడిగాను.

” వద్దులే. ఈ జ్వరం వచ్చి ఎన్నాళ్ళయింది ? ”

” ఇవాళ్టికి మూడో రోజు ”

” అయితే ఇంకొక్క రోజు గడవనీ. బహుశా అతని శరీరం రేపటికి దానంతట అదే కోలుకోవచ్చు. అది కొంత మంచిది, ఎందుకంటే నా వైద్యాన్ని తట్టుకోవటం అంత తేలిక కాదు. రేపు రాత్రికి జ్వరం నెమ్మదించకపోతే నేనే అక్కడికి వచ్చి నయం చేస్తాను. ఉండు, అతనికి ఎవరు సేవ చేస్తున్నారు ? ”

” మా దేశం నుండి మాతోబాటు వచ్చిన నౌకరు, ఇంకా..” కొంచెం సంకోచంగా చెప్పాను – ” ఉస్తేన్ అని, ఇక్కడి అమ్మాయే, తను కూడా. చాలా అందగత్తె , లియో ని చూస్తూనే కౌగలించుకుని వరించి , అప్పటినుంచి అతనితోనే ఉంటూ వస్తోంది….ఇది మీ ప్రజల పద్ధతి అనుకుంటాను రాజ్ఞీ ! ”

” నా ప్రజలా- అలా పిలవకు వాళ్ళని. ఈ బానిసలు నా ప్రజలు కారు, కేవలం నా ఆజ్ఞలు పాలించే శునకాలు…నాకు వారి అవసరం తీరేవరకూ. వాళ్ళ పద్ధతులూ ఆనవాయితీలూ – వాటితో నాకే సంబంధమూ లేదు. సరేగాని నన్ను రాజ్ఞీ అని పిలవకు, ఈ మర్యాదలతో గౌరవాలతో నాకు విసుగెత్తిపోయింది. నా పేరు తో , ‘ ఆయేషా ‘ అని పిలువు. ఆ అక్షరాలు నా చెవులకి తియ్యగా ఉంటాయి, నా గతాన్ని ప్రతిధ్వనిస్తాయి. ఈ ఉస్తేన్ విషయం…ఈమె గురించి నన్నెవ రో హెచ్చరించారా, లేక నేనే ఆమెను హెచ్చరించి ఉన్నానా- ఏమో, తెలియటం లేదు. చూద్దాం ఉండు ” – రాతి కడవ పైకి వంగి తని మూత పైన చేయి ఉంచి తీసి అందులోకి చూసింది –
” చూడు. ఈమేనా ? ”

చూశాను. అక్కడ ఉస్తేన్ ప్రతిబింబం. అందమైన ముఖం నిండా చిందుతున్న అనురాగం – కిందికి వంగి చూస్తోంది. నల్లటి ఒత్తైన జుట్టు గిరజాలుగా ఆమె బుజం మీంచి జారుతోంది.

” అవును, ఆమే. ” – తగ్గు స్వరం లో చెప్పాను. ఎందుకో నా మనసు కి కలతనిపించింది. ” లియో నిద్రపోతుంటే కనిపెట్టుకుని చూస్తోంది ”

” లియో ! ” – పరధ్యానం గా అంది ఆయేషా. ” అంటే లాటిన్ లో సింహమే కదా, ముసలాడు సరిగ్గానే అన్నాడు. విచిత్రంగా ఉంది…” తనలో తను మాట్లాడుకుంటోంది – ” అలాగే ఉంది- లేదు, అది అసాధ్యం ! ” అసహనంగా మరొకసారి కడవ మీదినుంచి చేతిని కదిలించింది. నీరు నల్లబడింది, బొమ్మ మాయమైంది- నిశ్శబ్దంగా . దీపపు వెలుగు తప్ప ఇప్పుడు ఆ నీటిలో ఇంకేమీ లేదు, కనిపించటం లేదు.

కొద్ది క్షణాలపాటు ఏదో తలపోసుకుని , తర్వాత – ” ఇది మొరటు జీవితం నాకు ఇక్కడ , ఈ నికృష్టుల మధ్యలో. నేను వీరి ఆహారాన్ని తీసుకోను- పళ్ళు తప్పించి ” – బల్ల మీదికి చూపించింది. ” ఎప్పుడైనా రొట్టెలు, కొంచెం నీరు, అంతే. నా సేవికలను నీ అవసరాలు గమనించేందుకు నియమించాను – చెవిటీ మూగా కూడా వాళ్ళు, చూశావుగా ! ఏ రహస్యమూ బయటికి పోయే అవకాశం లేదు. ఆ జా తిని నేనే ఒక పద్ధతి ప్రకారం తయారుచేశాను. చాలా కష్టమే, కానీ జయించాను. అంతకుముందూ ఒకసారి నా ప్రయత్నం ఫలించింది గాని, వాళ్ళు చూసేందుకు అందవికారం గా తయారు కాబడ్డారు – నాశనం చేశాను వాళ్ళందరినీ. ఇప్పుడు చూడు- చక్కగా ఉన్నారు కదూ ? ఒకానొకప్పుడు మహాకాయుల జాతిని కూడా పెంచాను గాని, ప్రకృతి వాళ్ళని బతకనియ్యలేదు. సరే, ఇంకేమైనా అడగాలా నన్ను ? ”

” ఒకే ఒక్కటి, ఆయేషా ! ” ధైర్యంగా అడిగేశాను , లోపల భయమే ఉన్నా కూడా. ” మీ ముఖాన్ని దర్శించాలని ఉంది ”

నవ్వింది. వెండిగంటలు మోగే నవ్వు. ” ఆలోచించుకుని అడుగు…గ్రీక్ పురాణ గాథలన్నీ తెలిసే ఉంటాయి కద నీకు – ఆక్టయాన్ అని లేడూ ఒకడు, అత్యద్భుత సౌందర్యాన్ని ఒకేసారి చూసి భరించలేక చచ్చిపోతాడు కదా ? నా ముఖం చూసి నీ గతీ అదే అయిపోయేను- నీ గుండె లోపలి కోర్కె ని అలాగే దాచిఉంచుకో. నేను నీకోసం కాదు…ఏ పురుషుడి కీ కాదు నేను – ఆ ఒక్కరికి తప్ప- ఒకప్పటి వాడు, ఇంకా తిరిగి రానివాడు ”

” మీ ఇష్టం ఆయేషా ! మీ సౌందర్యం నాకు హాని చేయదనే భావిస్తున్నాను. స్త్రీ అందం పట్ల మోహాన్ని నేను అధిగమించి చాలాకాలమైంది, అది పూసి వాడిపోయే పూవు వంటిది ”

” లేదు, పొరబడుతున్నావు . వాడదు. నేను జీవించినంతకాలమూ నా సౌందర్యమూ జీవించే ఉంటుంది. నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం… వ్యామోహం నీ విచక్షణను జయిస్తే అందులో నా బాధ్యతేమీ ఉండదు , గుర్తుంచుకో. నన్ను ఒకసారి చూసిన ఏ పురుషుడూ విస్మరించగలగటం ఇంతవరకు జరగలేదు..ఆఖరికి ఈ అనాగరికులకి కూడా నేను ముసుగు తీసి కనిపించను- లేదంటే వాళ్ళూ నన్ను విసిగించేవారు, నేను వాళ్ళని చంపేయవలసి వచ్చేది- ఎందుకొచ్చిన బెడద ! సరే, మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, చూస్తావా ? ”

” చూస్తాను ” – నా కుతూహలాన్ని పట్టలేఉండా ఉన్నాను. తెల్లగా, పరిపుష్టం గా ఉన్న చేతులని పైకి లేపి, నెమ్మదిగా, అతి నెమ్మదిగా- తలవెనక ఉన్న ఏదో ముడిని విడదీసింది ఆమె…ఆవరించి ఉన్నదంతా ఒక్కసారి నేలకి జారింది. శరీరాన్ని హత్తుకుని ఉన్న మరొక ధవళవస్త్రం ఉంది- ఆమె ఆకృతిని స్పష్టం చేసేందుకే . పరిపూర్ణమైన రాజసం ఆమె దేహాకృతి లో , సర్పం వంటి హొయలు. జీవాన్నీ ప్రాణాన్నీ మించిన శక్తి అక్కడ ఉన్నదని తెలిసిపోతోంది. చిన్నవిగా, అమిత సుకుమారంగా ఉన్న పాదాలకి పాదరక్షలు బంగారు గుండీ లతో బిగించబడి ఉన్నాయి. ఆ పైన, ఏ శిల్పీ కలగని ఉండని , అతి నున్నని చీలమండలు . నడుముకి జంట పాముల మెలివేత గా వడ్డాణం , ఆ పైన స్వచ్ఛంగా వికసించిన మహా లావణ్యం. అటువంటి శరీర రేఖలను నేను చూసి ఉండకపోవటం కాదు, ఊహించుకోనైనా లేను. వెండి మంచు శిఖరం లాగా ఉన్న వక్షోభాగం దిగువన రెండు చేతులూ కట్టుకుని నిలుచుని ఉంది – అప్పుడు, తల ఎత్తి, ఆమె ముఖాన్ని చూశాను. నాకళ్ళు ఒక్కసారిగా జిగేలుమని ఆ వెంటనే బైర్లు కమ్మాయి , దాదాపు గుడ్డివాడినయాను కాసేపు- నా ఈ మాటల్లో ఏ అతిశయోక్తీ లేదు. దేవతల సౌందర్యం గురించి విని ఉన్నాను , ఇప్పుడు చూస్తున్నాను. అద్భుతానికి అవధి ఇదేననిపించే ఆ సమ్మోహ సౌందర్యం అతి స్వచ్ఛం గా ఉంది, దానితోబాటు – ఏదో, ఎక్కడో -దౌష్ట్యం కనిపిస్తోంది, కీడు స్ఫురిస్తోంది- నాకు, కనీసం, ఆ సమయం లో. ఎలా వర్ణించాలి ఆ రూపాన్ని , నా చేత కాదు…నా చేత కానేకాదు ! నేను చూసినదాన్ని మాటలలో పెట్టగల మనిషి ఇంకా ఈ భూమి పైన జన్మించలేదు. ఆకర్ణాంతాలైన, అపూర్వ చంచల నయనాల లోతు గురించి, విశాలమైన చంద్రవంక వంటి భ్రూభాగం గురించి, తీర్చి దిద్ది పెట్టిన ముఖరేఖల గురించి – ఎంతో కొంత చెప్పనగును…అవన్నీ అందమైనవే, కాని ఆమె అందం వాటిలో లేదు…కనీసం వాటికి పరిమితమై లేదు. ఎక్కడో ఒకచోట ఉందని చెప్పవలసే వస్తే- అది దృశ్యమానమైన ప్రాభవం లో, మహారాజ్ఞీ దర్పం లో…ముద్ర గుద్దినట్లున్న దివ్యత్వం లో, మృదూభూతమయినిలిచిన సామర్ధ్యం లో -అదొక సజీవ తేజో పరివేష్టమయి ఆమె కవళికను ఆచ్ఛాదించి ఉంది. ఉదాత్తమైనది ఇలా కూడా ఉండవచ్చునని నేను ఎరగను…అవును, ఈ ఔదాత్త్యం నల్లనిది, ఇది స్వర్లోకసంబంధి కాదు, అయినా వైభవోపేతమే ! ఆ ముఖం ముప్ఫై ఏళ్ళు నిండుతూన్న స్త్రీ దే- పూర్ణారోగ్యమూ పరిపక్వమైన యౌవనమూ తొణికిసలాడుతున్నాయి. కాని ఇదమిద్ధమని చెప్పలేని అనుభవపు ఛాయలూ స్పష్టం గానే ఉన్నాయి ..బహుశా ఒక వేదన వలన, వేసట వలన , ఆరాటం వలన. దేదీప్యమానమైన ఆ చిరునవ్వు కూడా దుఃఖపు, పాపపు నీడలను దాచలేకపోతూ ఉంది. కన్నుల ధగ ధగ లోనూ ఆ సన్నని మసక ఉంది , ఆమె నిలిచినంతమేర నిండిపోయిఉంది. ఆ భావానికి ఈ మాటలు పొసగవచ్చు, నా శక్తి కొద్దీ-

” చూడు !ఏ స్త్రీకీ వరమై దొరకని ఈ సౌందర్యాన్ని , మరణాన్ని నిరవధికపు వాయిదా వేసిన ఈ అర్థ దేవతాత్వాన్ని – యుగ యుగాలయి ఆ స్మృతీ తీవ్రత వెంటాడుతూనే ఉంది.మోహం నన్ను చెయ్యి పట్టుకు నడిపిస్తూనే ఉంది. శోకం తో నా పరిచయం తరతరాలుగా వర్ధిల్లుతోంది, తిరిగి తిరిగి దుష్కృత్యాలకి నాకు ప్రేరణ ఉంటూనే ఉంది , నిష్కృతి వచ్చేవరకూ ఈ ఖేదపు కొనసాగింపే…”

అనిర్వచనీయమైన ఆ అయస్కాంతశక్తి ని ప్రతిఘటించి నిలదొక్కుకోలేక, నా దృష్టి ఆమె నేత్రాల కే అంటిపెట్టుకు ఉండిపోయింది – గొప్ప విద్యుత్ప్రసారం సంభవించి నన్ను తలకిందులు చేసింది.

ఆమె నవ్వింది- ఓహ్..సంగీతప్రవాహమై నవ్వింది. నన్ను చూస్తూ తల ఊపింది, ఆ ఒయ్యారం లో ఒక ఘనత – వీనస్ కి కూడా సాధ్యం కాదేమో అది.

” ధూర్తుడా ! ” హేలగా సంబోధించింది నన్ను. ” ఆక్టయాన్ లాగా నీ ఇష్టాన్ని చెల్లించుకున్నావు, జాగ్రత్త, అతనిలాగానే అంతం కాగలవు చూడు ! నీ మోహాలూ కామనలూ వేటకుక్కలై చీల్చుతాయి నిన్ను. నేను- కన్యకా దేవిని సుమా, నన్నెవరూ కదల్చలేరు . చూశావా, సరిపడా ? ”

” సౌందర్యదర్శనం నన్ను అంధుడిని చేస్తోంది ” డగ్గుత్తిక తో అన్నాను, అర చేతులతో కళ్ళు మూసుకున్నాను.

” నేను చెప్పలేదా ? సౌందర్యం విద్యుల్లత కద , నాశనం చేస్తుంది, ముఖ్యంగా వృక్షాలను- నువ్వేమో హోలీ చెట్టువి ! ” గలగలమని నవ్వింది.

ఉన్నట్లుండి ఆమె ఆగిపోయింది. నా వేళ్ళ సందుల్లోంచి చూస్తున్న ఆమె ముఖం లో ఘోరమైన మార్పు వచ్చింది. ఆ బ్రహ్మాండమైన నయనాలలో విపరీతమైన భీతీ అమితమైన ఆశా పెనుగులాడుతున్నాయి. ఆమె ముఖం బిగిసిపోయింది, నిలువెల్లా స్తంభించిపోయింది.

” పరదేశీ ” – సగం గుస గుస గా, సగం పాము బుసగా పలుకుతూ కాటు వేయబోయే సర్పం లా తల వెనక్కి విసిరి చాచింది. ” ఎక్కడిది ? నీ వేలికి ఆ scarab ఉంగరం ఎలా వచ్చింది ? చెబుతావా నిన్ను ఉన్నపాటున దహించివేయమంటావా ? ” – నా వైపుకి ఒక అంగ వేసింది. ఆమె కళ్ళలోంచి వచ్చే వెలుగు భయంకరమైన జ్వా లలాగా ఉంది – తట్టుకోలేకపోయాను, నేల మీద పడిపోయాను…ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమవకుండా పలవరించాను.

” శాంతి ! ” పూర్వపు కంఠం తో మృదువుగా అంది ఆమె. ” చాలా భయపెట్టాను కదా నిన్ను, క్షమించు. ఒక్కోసారి- ఒక్కోసారి, అనంతమైన నా మేధ కి, నా దృష్టికి – సంకుచితమనిపించే నిదానం సరిపడదు…విసుగుపుట్టి నా శక్తిని ఉపయోగించబోతాను..పాపం, నిన్ను ఇంచుమించుగా చంపేసి ఉండేదాన్ని. చెప్పు- చెప్పెయ్యి – ఆ scarab గురించి ”

” నేను దాన్ని నేల మీది నుంచి ఏరాను ” – నా అయోమయం ఎంత తీవ్రంగా ఉందంటే, లియో ఉంగరం నేల మీద పడి ఉండగా తీసి నా వేలికి పెట్టుకున్నానని తప్ప ఇంకేమీ ఆ క్షణం లో గుర్తే రాలేదు.

” వింతగా ఉందే ” – సాధారణమైన స్త్రీ లాగా చలించింది, చిరాకు పడింది ఆమె. ” ఒకప్పుడు నాకు ఇటువంటిదొకటి తెలుసు.అది- అది నా ప్రియుడి మెడలో వేలాడేది ” – దుఃఖపు వెక్కిళ్ళు ఆమె ఎంత కేవలమైన స్త్రీయో చెప్పాయి ఆ నిమిషం లో.

” సరేలే. అలాంటిది మరొకటి ఉండవచ్చు, కాని ఇంతవరకూ చూడలేదు . దాని వెనక పెద్ద చరిత్ర ఉంది , అతనికి అది ఎంతో అపురూపం కూడాను. కాని ఇలా ఉంగరం లో పొదగబడి ఉండేది కాదులే. వెళ్ళు, హోలీ- వీలైతే, ఆయేషా రూపాన్ని చూశానని మరచిపో ”

దివాన్ మీద బోర్లగిలా పడి పట్టు దిండ్లలో మొహం దాచుకుంది.

నా సంగతి…పడుతూ లేస్తూ అక్కడినుంచి బయట పడ్డాను…నా గుహ కి ఎప్పుడు, ఎలా చేరుకున్నానో గుర్తు లేదు .

[ ఇంకా ఉంది ]