అనువాద నవల

రాజ్ఞి – పదవ భాగం (‘ She ‘ By Sir H. Rider Haggard)

ఏప్రిల్ 2016


[ మార్చ్ నెల సంచిక తరువాయి ]

నా గదికి చేరి పక్క మీద పడేప్పటికి రాత్రి పది గంటలు దాటి ఉంటుంది. కాస్త కాస్తగా నాకు బుద్ధి తెలిసింది. అంతకు ముందర జరిగినదాన్నంతా మళ్ళీ మళ్ళీ తలచుకున్నాను. ఎంత ఆలోచించినా ఏమీ అంతుబట్టింది కాదు. నేను తప్పగాగి ఉన్నానా, లేక పోతే పిచ్చి పట్టిందా ? కాక ఏదో బ్రహ్మాండమైన మహేంద్రజాలం లో ఇరుక్కుపోయానా ? నేను హేతువాదిని, గడిచిన కాలాల చరిత్రనంతా తిరగేసి ఉన్నవాడిని – ఇవాళ యూరోప్ లో అతీంద్రియశక్తుల పేరిట చలామణీ అయే మోసాల మీద వీసమెత్తు నమ్మకం కూడా లేనివాడిని. రెండువేలేళ్ళకి పైబడి జీవించి ఉన్న స్త్రీ తో మాట్లాడటమేమిటి ? ఇదంతా ప్రకృతి విరుద్ధం- పూర్తిగా అసాధ్యం. పెద్ద మోసమే అయి ఉండాలి అంతా … మరి , మోసమే అయితే, ఆమె నాకు నీళ్ళలో చూపించిన దృశ్యాల మాటేమిటి ? వే ల సంవత్సరాల కిందటి సంగతులన్నిటినీ ఆమె వివరించటమేమిటి, ఆ తర్వాతేమయిందో అమెకి తెలియకపోవటమేమిటి ? ఆ అద్భుతమైన, అపూర్వమైన సౌందర్యం మాటేమిటి ? ఏ మానవ స్త్రీ రూపమూ అలా ఉండగల వీలు లేదు , ఆమే చెప్పినట్లు అది కన్నెత్తి చూసినంతమాత్రానే హాని చేయగలది ! ఆడవాళ్ళ అందాలకీ హొయలుకీ నేను చలించటం మానేసి చాలా కాలమే అయింది – కాని, ఇప్పుడు ఆ అద్భుతనేత్రాల కాంతి నా మనసునుంచి తొలగిపోవటమే లేదు – అది ఆకర్షణ వల్లనో భీతివల్లనో అర్థమవటమూ లేదు ! రెండువేల ఏళ్ళ అనుభవమూ అపారమైన జ్ఞానమూ అనంతమైన శక్తిసామర్థ్యాలూ మూర్తి కట్టిన ఆమె – ఖచ్చితంగా ప్రేమించదగినదే – కాని, నేనా ! నేనా – ఇంత వయసొచ్చి ఈ వ్యామోహం లో పడుతున్నది – ఏమన్నా అర్థముందా ? ఆమె తప్పు లేదు , నన్ను ముందే హెచ్చరించింది, అయినా ఆ ముఖాన్ని చూడగోరాను , చూసి చలించిపోయాను – ఏ శాపానికి ఎదురు పోతున్నానో ఏమో ! కుతూహలమే అనేకమైన సమస్యలకి మూలం, అయినా దాన్ని జయించలేడు మనిషి !

రెండు చేతులా జుట్టు పీక్కున్నాను, మంచం మీద కుదురుగా పడుకోలేకపోయాను – దిగ్గుమని లేచి నిలుచున్నాను. తక్షణం ఏదో ఒకటి చెయ్యకపోతే ఉన్మాదం వచ్చేస్తుందనిపించింది – కాని, ఏమిటి చేయటం ? అవునూ ఆ scarab ఉంగరం చూసి ఆమె అంత కంగారు పడిందేమిటి ? అది లియో తండ్రి దాచి పెట్టిన వాటిలోది కదా ? కొంపదీసి ఆయన పేర్కొన్న విచిత్ర స్త్రీ మూర్తి ఈవిడేనా ? ఈమె ఎదురు చూస్తున్నది లియో కోసమేనా ? ఛీ, ఛీ, అసంభవం ! చచ్చిపోయిన మనిషి ఎక్కడైనా మళ్ళీ పుడతాడా ?

ఒక స్త్రీ రెండు వేల ఏళ్ళు జీవించి ఉండటం సాధ్యమైతే ఏదైనా సాధ్యమే ! ఎవరికి తెలుసు, నాకూ పూర్వజన్మా గట్రా ఉందో ఏమో ! ఏ జ్ఞాపకాలైనా గుర్తొస్తే కదా , ఎంత గుర్తు చేసుకుందామన్నా ! ఆ గుహ లోపలి పురాతన వీరుడి శిల్పం స్ఫురించింది – నేను బహుశా అతని తోటివాడినేమో ? లేకపోతే అతనే నేనేమో ? ” ఇదిగో వీరుడా, వింటున్నావా , మనిద్దరం ఒకటే ” – పైకే అంటూ పగలబడి నవ్వాను. నా తోబాటు , ఆ గుహ కప్పు మారుమోగేలాగా అతని పిశాచం కూడా నవ్వుతోందేమోనిపించింది…

లియో ఎలా ఉన్నాడో చూడాలని తట్టింది. చెప్పులు తొడుక్కుని ఒక దివిటీ చేత పుచ్చుకుని అతని గది వైపుకి వెళ్ళాను. ద్వారానికి కట్టిన పరదా గాలికి కొద్దిగా చలిస్తోంది – నేనున్న పరిస్థితిలో ఆ కదలిక కూడా ఏదో అతీతశక్తి వల్లనే జరుగుతోందనిపించింది. లియో తెరపి మరుపులుగా మంచం మీద పడిఉన్నాడు, పక్కనే ఉస్తేన్. ఆమె సగం నేల మీదా సగం అతని మంచం మీదా పడిఉంది. ఆమెకీ కాస్త కునుకు పట్టినట్లుంది , కానీ లియో చేతిని గట్టిగా పట్టుకునే ఉంది. ఆ ఇద్దరూ ఒక దయనీయ సుందర చిత్రం లాగా నిలిచిఉన్నట్లనిపించింది. లియో మొహం జ్వరం తో కాగుతోంది, కళ్ళ కిందన పెద్ద పెద్ద నల్లటి వలయాలు – ఇతను బ్రతుకుతాడా ? లేక నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతాడా ? ఇంకేముంటుంది నాకు ప్రపంచంలో ?

చప్పుడు చేయకుండా అక్కడినుంచి బయటపడి నా గదికి చేరి, నిద్ర పోయే ప్రయత్నం చేశాను. కాని కళ్ళు మూతలు పడేసరికి – ఘోరమైన పీడకలలు. వాటిలో నేను కనీ వినీ ఎరగని విషయాలతోబాటు , ఎప్పుడో మర్చిపోయాననుకున్న చెడ్డవిషయాలు మరింత భయంకరపు ముసుగులు వేసుకుని వెంటాడాయి. ఇక తట్టుకోలేక లేచిపోయి గదిలో అటూ ఇటూ, ఇటూ అటూ పచార్లు చేస్తూ ఉండిపోయాను.

నా గుహ గది గోడలో సుమారైన రంధ్రమొకటి ఉన్నట్లు నా కంటపడింది. సామగ్రి పెట్టుకుందుకు అమర్చిన అరుగుకి వెనకాల అది ఉండటాన అప్పటివరకూ గమనించినట్లు లేను. అది ఎక్కడినుంచి ఎక్కడికి దారితీస్తుందో తెలియదుగాని , ఎవరైనా ఎప్పుడైనా నా గదిలోకి ప్రవేశించగలరు అందులోంచి. విడి విడి గా గదులు ఇచ్చినట్లు ఇచ్చి ఈ చొరబాట్లేమిటి ? చిరాకనిపించి, అది ఎటుపోతుందో చూడాలని కొంతా, ఏదో ఒక పని చేస్తే గాని నిలకడరాదనిపిస్తూ కొంతా- దివిటీ పట్టుకుని అందులోంచి నడిచాను. కొన్ని అడుగులు వేశాక, కిందికి రాతి మెట్లు ఉన్నాయి. అదొక పొడవాటి నడవా. మా గదుల ముందర ఉన్నదానికి ఒక అంతస్తు దిగువన, సమాంతరంగా ఉందని గ్రహించాను. యాభై అడుగుల దూరంలో అడ్డంగా మరొక మార్గం కనిపించింది. దాన్ని సమీపిస్తుండగా ఉన్నట్లుండి చలిగాలి విసురుగా వీచి దివిటీ ఆరిపోయింది. అంతా చిమ్మచీకటి. ఇప్పుడు దారి తెలిసేది ఎలాగ ? ముందుకి వెళ్ళలేను, వచ్చినదారే అయినా కేవలం తడుముకుంటూ వెనక్కి వెళ్ళటమూ అసాధ్యం. విపరీతమైన భయం తో కాసేపు చేష్టలుదక్కి నిలుచుండిపోయాను. ఈ రాత్రంతా అక్కడే ఉండాలా, అయినా ఆ సొరంగం లో పట్టపగలూ నడిరాత్రీ ఒకేలాగా ఉంటాయేమో. నా చుట్టుపక్కల ఎలాంటి శబ్దం గానీ దృశ్యం గానీలేదు – ఉ హూ, కాదు – పరీక్షగా మెడ నిక్కించి చూస్తే బాగా దూరంగా చిన్న వెలుతురు ఉందేమోనని అనుమానం. మెల్లిగా, అతి మెల్లిగా – చేతులతో గుహ గోడ గట్టి గా పట్టుకుంటూ ఆ వైపుకి అడుగులు వేశాను, నా పాదాల కిందని ఉన్నట్లుండి భూమి కుంగిపోయి అగాధం లో పడిపోతానేమోననే భయం. ముప్ఫై అడుగులు – అవును, వెలుతురే, కనిపిస్తూ మసకబారుతూ – బహుశా ఒక పరదా వెనకనుంచి. యాభై అడుగులు – దగ్గరకొచ్చాను. అరవై అడుగులు – ఓహ్ ! అమ్మయ్య !!

ఆ ద్వారానికి ఉన్న పరదాలు రెపరెపలాడుతున్నాయి , లోపలి ప్రదేశం కొద్ది కొద్దిగా కనబడుతోంది. అదొక సమాధిలా ఉంది. మధ్యలో వెలుగుతూన్న తెల్లటి జ్వాల వల్ల ప్రకాశమానం గా ఉంది- చిత్రం గా ఆ మంట లోంచి పొగ రావటం లేదు. గోడ లో మలచిన పెద్ద అర వంటిదాని మీద పొడుగాటి ఆకారం పడుకోబెట్టి ఉంది- శవమేమో అనిపించింది. మీదనంతా తెల్లని బట్ట కప్పి ఉంది. అటువంటి అరే రెండో వైపు కూడా ఉంది – దాని మీద జరీ పువ్వుల వస్త్రమేదో ఉంది- అడుగున ఏమైనా ఉందో లేదో తెలియటం లేదు. నాకు ఒక పక్కనుంచి కనిపిస్తూ, జ్వాల మీదికి వంగి, ఆ శవం వైపు తిరిగి ఉన్న ఒక స్త్రీ – పురుషులు ధరించేలాంటి పచ్చడాన్ని ఆపాదమస్తకం కప్పుకుని ఉంది. నేను ఏం చేయాలో నిర్ణయించుకునే లోపున ఆమె విసురుగా , ఆగ్రహం గా లేచి నిలబడింది- పచ్చడం జారిపోయింది.

ఆమె – రాజ్ఞి !

నేను అంతకు ముందు చూసినట్లే దుస్తులు ధరించి ఉంది. ఒంటికి అంటి పెట్టుకున్న శ్వేత వస్త్రం, నడుము దగ్గర బిగించిన జంట సర్పాల వడ్డాణం , వీపు మీద భారమైన అలలుగా జారే నల్లటి కేశరాశి. కాని – ఆమె ముఖం ! సౌందర్యమంతా అలాగే ఉంది, కాని – అక్కడ మహా దుర్భరమైన వేదన, అమితమైన భావావేశం, భయంకరమైన ప్రతీకార వాంఛ – పైకెత్తిన ఆ కళ్ళ నిండా దుస్సహమైన హింస పడుతున్నట్లున్న ఆక్రోశం – మాటల్లో చెప్పగలిగేది కాదు ఆ కవళిక.

ఒక్క నిమిషం మౌనం గా నిలుచుని, తర్వాత తన సుందర హస్తాలను తల మీంచి పైకి ఎత్తింది. ఆమె వస్త్రం కొద్దిగా జారి ఇంకొంత సౌందర్యాన్ని బయల్పరిచింది. పిడికిళ్ళు క్రోధం తో బిగిసి ఉన్నాయి , మొహం లో కనిపిస్తున్న దౌష్ట్యాన్ని చూస్తూ తట్టుకోవటం కష్టమనిపించింది.

పరదా ఇవతలినుంచి నేను అలా గమనిస్తున్నట్లు ఆమెకి తెలిస్తే ఏమవుతుందో – అక్కడికక్కడే బూడిదయిపోతాను బహుశా. కాని ఒక్క అంగుళం కూడా కదల్లేకపోయాను. నేను కాస్త మెదిలినా, పొరబాటున తుమ్ము వచ్చినా, ఆమె మంత్రశక్తి వల్ల నా ఉనికిని తెలుసుకున్నా….

ఆమె పిడికిళ్ళు కిందికి వాలినాయి, మళ్ళీ పైకి లేచాయి. అక్కడి జ్వాల ఒక్కసారి భగ్గుమని కప్పువరకూ ఎగసింది. ఆ వెలుగులో గుహ లోపలి అణువణువూ ప్రస్ఫుటంగా కనిపించింది.

ఆమె పలికింది – పాము బుస కొట్టినట్లుగా. ఆ అరబిక్ మాటలు వింటూంటే ముందు వెన్నులోంచి చలి పుట్టింది, ఆ తర్వాతి క్షణం లో గుండె ఆగినట్లైంది.

” నాశనమై పోవాలి అది – ఆ మనిషి శాశ్వతంగా నరకం లో కాలిపోతుండాలి !! ”

ఆమె చేతులు అలా లయబద్ధంగా పైకీ కిందికీ లేచి వాలుతున్నాయి.

” అది సర్వనాశనం కావాలి, ఆ ఈజిప్ట్ ఆడదాని పేరు కూడా మిగలకూడదు ”

చేతుల విన్యాసం కొనసాగుతూనే ఉంది.

” ఆ నైల్ నది కూతురు , దాని అందం – నాశనం కావాలి , నా శక్తి కన్నా దానిది ఎక్కువైనందుకు అది నశించిపోవాలి,
నా ప్రియతముడిని నాకు ఇవ్వనందుకు అది నాశనం కావాలి ”

జ్వాల పైకీ కిందికీ లేచి పడుతోంది.

అరచేతులు కళ్ళకి అడ్డం పెట్టుకుని , పెద్దగా కేక పెట్టింది-
” ఎన్ని శాపనార్థాలు పెడితే ఏమిటి లాభం ? అదే గెలిచింది, చచ్చే పోయింది ”

రెట్టించిన ఆగ్రహం తో మళ్ళీ మొదలు పెట్టింది -
” అది ఎక్కడుంటే అక్కడ నశించిపోవాలి. నా శాపం దాన్ని వెంటాడి విశ్రాంతి లేకుండా చేయాలి !

నక్షత్రాలకి అవతల ఉండినా సరే, దాని నీడ కూడా నాశనం కావాలి.
నా శక్తి దాన్ని వెతికి పట్టాలి. నా గొంతు దానికి వినబడాలి. అది భీతితో అంధకారం లోకి దాగిపోవాలి.

అది నరకపు నిస్పృహలో కూరుకుపోవాలి . ..”

జ్వాల తగ్గుముఖం పట్టింది.

” లేదు- లాభం లేదు- నిద్రిస్తున్నవారిని ఎవరు చేరి బాధించగలరు ? నాకూ శక్యం కాదు ”

ఆ నీచమైన తంతు మళ్ళీ మొదలెట్టింది.

” ఆ- అది మళ్ళీ పుట్టాలి, పుడుతూనే నా శా పం తగలాలి పుట్టిందగ్గరనుంచి చచ్చేదాకా అది నరక యాతన పడాలి నా చేతికి చిక్కాలి – అప్పుడు, అప్పుడు…”

అలా ఎంత సేపు జరిగిందో చెప్పలేను. ఆమె ఉచ్చరించిన క్రూరమైన, నికృష్టమైన శాపనార్థాలని నేను ఇక్కడ రాయలేను. అవి ఆ గది గోడలని తాకి ప్రతిధ్వనించి అక్కడే అంతమవుతున్నాయి. దేదీప్యమానమైన కాంతీ గాఢమైన అంధకారమూ ఆ పడుకోబెట్టి ఉన్న వ్యక్తి మీద, ఆ కప్పిఉన్న తెల్లటి బట్ట మీద – విడిచి విడిచి ప్రతిఫలించాయి.
ఆఖరికి – ఆమె అలిసిపోయింది. ఆగిపోయింది. నేల మీద కూలబడింది. హృదయవిదారకంగా దుఃఖించటం మొదలుపెట్టింది.

” ఒకటా రెండా – రెండు- వేల – ఏళ్ళు ! భరిస్తూనే ఉన్నాను. శతాబ్దం వెనక శతాబ్దం వచ్చి వెళుతోంది, కాలాలు మారిపోతున్నాయి – జ్ఞాపకం మాయలేదు, ఆశ చావటం లేదు – అంతు దొరకటం లేదు ! హృదయం నిండా నీ కోసం తపన, వెనువెంటే నే చేసిన పాపం – అయ్యో, నాకు మరపైనా ఎందుకు రాదు ! ఇంకా ఎన్ని యేళ్ళు రావాలో, ఎన్ని యుగాలు గడవాలో – నా అనంతమైన ఆయువు కి అంతు ఎప్పుడో !

ప్రియతమా..ప్రియతమా ! ఆ పరదేశి నీ చిహ్నాన్ని నాదగ్గరకెందుకు తెచ్చాడు ! అయిదు వందల యేళ్ళయింది ఇంత రంపపు కోత ఎదురై . పాపం చేశాను , నిజమే – మహాపాపమే …ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కాదా , చాలదా ? అన్నీ ఉన్నాయి నాకు – నువ్వు లేనిది -ఏమీ లేదు , శూన్యం. ఏం చేయను – ఇంకేం చేయగలను నేను ! ఒకవేళ- ఒకవేళ ఆ ఈజిప్ట్ ఆడది నీతోబాటే నువ్వున్న చోట లేదు కదా , నన్ను అపహాస్యం చేయటం లేదు కదా ? నిన్ను నేను చంపుకున్నాను – నీతోనే ఎందుకు చచ్చిపోయాను కాను ? అయ్యో- వీల్లేదు కదా…నాకు చావు రాదు కదా ”

నేల మీద బోర్లాపడిపోయి గుండె పగిలిపోయేలాగా ఏడ్చింది.

కాసేపటికి ఊరుకుని, లేచి, జుట్టు సవరించుకుని , ఆ పడుకోబెట్టిన ఆకారం వైపు వెళ్ళింది.

” ఓ- కాలిక్రేటస్ ! ” అరిచింది- ఆ పేరు వింటూనే వణికిపోయాను.

” నీ ముఖం చూడాలి ఒకసారి – అదెంత నరకయాతన అయినా సరే. చేతులారా చంపుకున్న నిన్ను నా కళ్ళతో చూసి, చూడగలిగి – ఒక తరం దాటిపోయింది…” ఆ కప్పిన వస్త్రాన్ని ఒక చివరనుంచి పైకెత్తబోతూ గొణుక్కుంది , తన మాటలు తనకే బెదురు పుట్టిస్తున్నట్లు- జంకుతూ.

” నిన్ను లేపి నిలబెట్టనా ? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నువ్వు నా కళ్ళ ఎదుట నిలబడినట్లు ? చేయగలను కదా ” – రెండు చేతులూ ఆ శరీరం మీద చాచింది. నిలువెల్లా బిగిసిపోయి భయంకరంగా అయింది – కళ్ళు నిశ్చలమై తేజోహీనమైనాయి. నేను భయం తో కంపించిపోయాను. అది నిజమో లేక మతి చెదిరి ఉన్న నా భ్రాంతో తెలియదు – ఆ వస్త్రం కింది ఆకారం లో చలనం వస్తున్నట్లూ , అది ఊపిరి తీయబోతున్నట్లూ తోచింది. ఉన్నట్ల్లుండి ఆమె చేతులు తీసేసింది, ఆ వస్త్రం కింది కదలికా ఆగినట్లైంది.

” ఎందుకు , ఏం ప్రయోజనం ! జీవం ఉందన్న భ్రమ దేనికి నాకు, ఆత్మ అక్కడ లేకపోయాక ! నువ్వు లేచి నిలబడినా నన్ను గుర్తించలేవు, నేను చెప్పినది తప్ప ఇంకేమీ చేయలేవు- నీలో చలించేది నా ప్రాణమే గనుక. కాలిక్రేటస్, అది నీ ప్రాణం కాదు, ఆ నువ్వు నువ్వు కావు ”

ఒక్క నిమిషం అలా నిలుచుండిపోయి, ఆ పక్కనే కూలబడి , ఆ వస్త్రాన్ని ముద్దు పెట్టుకుంటూ దుఃఖించటం ప్రారంభించింది. ఆ ఏడుపులో ఇదివరకటి తీవ్రత లేదు, కాని నేను చూసి భరించలేకపోయాను. అసమాన శక్తివంతురాలైన ఈ స్త్రీ, ఈ మహిమాన్విత సౌందర్యరాశి – మరణించిన వాడికోసం పొగిలి పొగిలి ఏడవటాన్ని చూసి తట్టుకోలేకపోయాను. మెల్లిగా , అతి మెల్లిగా – పాకుతున్నట్లుగా వెనక్కి మరలాను. త్వరలోనే నేను దాటివచ్చిన చిమ్మ చీకట్లోకి చేరాను. ఈ గాఢాంధకారమే ఆమె ని చూడటం కన్నా నయమనిపించింది. ఇది చీకటి మటుకే, అది నరకం – అక్షరాలా. ఆమె నరకం లో పీడించబడుతున్న ఆత్మ.

రెండు సార్లు తట్టుకుని పడ్డాను, ఒకసారి దారి తప్పాను- అదృష్టం కొద్దీ వెంటనే సర్దుకున్నాను. దాదాపు ఇరవై నిమిషాల తర్వాత, నేను దిగివచ్చిన రాతిమెట్ల ని దాటిపోయానేమో అనిపించి, నిస్పృహతో అక్కడే కూర్చుండిపోయాను.

కాసేపటికి – అది ఎంత సేపో తెలియదు – నా వెనక నుంచి వెలుతురు జాడ . పొద్దుటి వెలుగు , చాలా కొద్దిగా అక్కడికి చొరబడినట్లుంది. అవే నేను ఎక్కివెళ్ళవలసిన మెట్లు. పడుతూ లేస్తూ నా గదికి పోయి పక్క మీద పడి ఒళ్ళెరగని నిద్రపోయాను.

ఆ తర్వాత నేను తెలివి రాగానే చూసింది మా నౌకరు జాబ్ ని. అతని జ్వరం పూర్తిగా నయమైంది – పాపం, ఎప్పట్లాగా నా అవసరాలు కనిపెట్టుకుందుకు వచ్చినట్లున్నాడు. నా దుస్తులని పొద్దుటే బ్రష్ చేసి శుభ్రం చేయటం రివాజు – ఇక్కడ బ్రష్ దొరకదు గనుక బాగా విదిలించి శుభ్రం గా మడతలు పెట్టాడు. నా గ్లాడ్ స్టోన్ సంచిలోంచి నిత్యం ఉదయమే ఉపయోగించే వస్తువులున్న పెట్టెని బయటికి తీశాడు . దాన్ని తెరిచి నా కాళ్ళ దగ్గర, రాతి మంచం మీద పెట్టబోయాడు. నేను నిద్రలో తన్నేస్తాననుకున్నాడేమో , మళ్ళీ తీసి నేల మీద పరిచిన పులిచర్మం మీద అమర్చాడు.

రెండు అడుగు లు వెనక్కి వేసి చూసుకుని, నచ్చక అక్కడినుంచీ తీసేసి- సంచీ మడత పెట్టి మంచం మీద ఉంచి పెట్టెని మూత పెట్టి దానిమీద సర్దాడు. మా వాడకానికి అక్కడ బానల్లో నీళ్ళు పెట్టారు. ఒకసారి వేలు ముంచి చూసి – ” ఛీ. ఈ దరిద్రగొట్టు దేశం లో వేడి నీళ్ళెక్కడ వాడతారు , ఒకళ్ళనొకళ్ళు ఉడకబెట్టుకు తినేందుకు తప్పించి ” – పెదవి విరిచాడు.

” ఏమిటి విషయం, జాబ్ ? ”

” క్షమించండయ్యా , మీరు నిద్రపోతున్నారనుకున్నాను. మీ మొహం చూస్తే బాగా నలిగిపోయినట్లుంది- ఇంకాసేపు పడుకోకపోయారా ? ”

” లియో ఎలా ఉన్నాడు ? ”

” ఎప్పట్లాగేనయ్యా. ఇకనైనా కోలుకోకపోతే – కోలుకోకపోతే …దక్కడేమోననిపిస్తోంది. ఆ అడివిపిల్ల ఉస్తేన్ చేయగలిగినంతా చేస్తోంది . కానీ ఆమె తో పెద్ద చిక్కే వస్తోంది. తన భాషలో ఏవో మంత్రాలు వల్లిస్తున్నట్లుంది – చూస్తే భయం పుడుతోంది . అక్కడికీ మర్యాదగా చెప్పి చూశాను – ‘అమ్మాయీ, మేము క్రైస్తవులం, మా పద్ధతులు వేరే- ఇటువంటివి పనికిరావు, మానెయ్యి ‘ అని. ఎంతమాత్రమూ వినటం లేదు. ఎప్పటికన్నా ఎక్కువ చేస్తోంది తన వ్యవహారం. ఎంత అందమైందీ మంచిదీ అయితే మాత్రం- అడివి పిల్ల అడివిపిల్లే. మనకి సరిపోతుందా చెప్పండి. ఇక్కడికి రావటం మన మంచికి అవలేదండీ బాబూ – నాశనానికే వచ్చాం . అది మొదలైంది – మన పని కూడా అయిపోతే పూర్తయిపోతుంది- ఇక్కడే ఈ గుహల్లో శవాల మధ్యనా పిశాచాల మధ్యనే మన కథ ఆఖరు. వెళ్ళి లియో కి జావ కాచి ఇస్తాను – ఆ అడివిపిల్లి తాగనిస్తుందో లేదో. ”

అంత ఘోరమైన రాత్రిని అనుభవించి వచ్చినవాడిని , జాబ్ మాటలు మరింత కుంగదీస్తాయి కదా. కాకపోతే ఒక్క విషయం స్పష్టమైపోయింది – ఇక్కడినుంచి మేము బయటపడలేం. ఒకవేళ లియో కోలుకున్నా, ఒకవేళ రాజ్ఞి మమ్మల్ని వెళ్ళనిచ్చినా [ ఇది జరగదని నాకు తెలుసు. ఏదో ఆగ్రహపు పొంగులో మమ్మల్నందరినీ మాడ్చేయటమే ఖాయం ] , అమహగ్గర్ మనుషులు మమ్మల్ని ఉడకబెట్టుకు తినకుండా విడిచిపెట్టినా , ఆ అంతులేని బురద నేలల్లోంచీ , దారీ తెన్నూ తెలియని పర్వతాల మధ్యలోంచీ మేము దిగిన చోటికి వెనక్కి వెళ్ళటం పూర్తిగా అసంభవం. పోతే మిగిలిందేమిటి ? కథ ఎలా పరిణమిస్తుందో చూడటం మాత్రమే- ఆ కుతూహలమే , అదే అన్ని ఆశలూ అంతమయాక ఇలా నన్ను నిలబెడుతోంది. ఈ ఆయేషా విషయమంతా తెలుసుకుని తేల్చుకోవాలి – ఆమె ఎంత భయం పుట్టిస్తోందో అంతకన్నా ఎక్కువగా ఆకర్షిస్తోంది నన్ను.

లేచి, తయారై ‘ భోజనాల గది ‘ లోకి పోయి ఏదో తిన్నాననిపించాను. వెంటనే లియో ని చూసేందుకు వెళ్ళాను. అతని పరిస్థితి బాగా అడుగంటింది – నన్ను కూడా గుర్తు పట్టలేదు. ఎలా ఉన్నాడని ఉస్తేన్ ని అడిగాను – తల దించుకుని ఏడవటం మొదలెట్టింది. బొత్తిగా ఆశ లేదని అర్థమైంది. రాజ్ఞి ని అడిగితే ? లియో తనంతట తాను కోలుకోకపోతే , ఖచ్చితంగా రక్షించగలనని ఆమె చెప్పి ఉంది కదా ? వెళ్ళి అడుగుతాను…

ఈ లోపు బిలాలీ వచ్చాడు అక్కడికి. లియో ని చూసి చూసి తల అడ్డంగా ఆడించాడు.

” ఈ రాత్రికి చచ్చిపోతాడు ”

నా గుండె జారిపోయింది. ” అయ్యో, అలా అనకండి తండ్రి గారూ ”

” రాజ్ఞి నిన్ను చూడాలట, కబురు చేసింది . ఇవాళైనా జాగ్రత్తగా మసలుకో- నిన్న నువ్వు పాక్కుంటూ లోపలికి వెళ్ళనందుకు నిన్ను బతకనివ్వదనే అనుకున్నాను. సభ తీర్చి ఉంది ఇప్పుడు , మీకు హాని చేయబోయినవారిని విచారించి తీర్పు చెప్పేందుకు ”

నేను అతని వెనకాలే నడిచాను. ఆ సభాభవనం అతి విశాలమైన గుహ – నేను ఇంతవరకూ చూడనిది. ఇక్కడి గోడల మీది శిల్పాలు ఇంకా అపూర్వంగా ఉన్నాయి. మధ్యలోంచి ఒక పక్కకి దారి ఉంది. అలా వెళితే ‘ ఇదివరకటి మనుషుల ‘ సమాధులు చాలా వస్తాయనీ ఎ వరూ అటువైపుకి వెళ్ళరనీ బిలాలీ చెప్పాడు. అదృష్టం తిరిగి అన్నీ సవ్యంగా జరిగితే గనక అక్కడ నా పురావస్తు శోధనని కొనసాగించాలనిపించింది.

అక్కడంతా చాలా మంది అమహగ్గర్ లు కోలాహలం గా తిరుగుతున్నారు – కొందరు పసుపుపచ్చటి బట్టల్లో, ఎక్కువ మంది పులిచర్మాలలో. ఒక చివరన వేదిక లాంటిది ఉంది. దాని మీద ఒక ఆసనం వేసి ఉంచారు. అది కుర్చీకి ఎక్కువా సిం హాసనానికి తక్కువా లా ఉంది. నల్ల చేవ కర్ర తో మలిచి , దంతపు పనితనం తో నగిషీలు చెక్కారు. గడ్డితో తయారు చేసిన దిండు, పాదాలు ఆనించుకుందుకు వేరే చిన్న ఎత్తు పీట.

అంతలో కలకలం . అందరూ ” హీయా ! హీయా ! ” అని లయబద్ధంగా వల్లిస్తూ నేల మీద మోకరిల్లిపోయారు. వాళ్ళెంత నిశ్చలంగా ఉండిపోయారంటే వాళ్ళ మధ్యలో నిలుచునే ఉన్న నేనొక్కణ్ణే బతికి ఉన్న మనిషిని అనిపించాను. ఆయుధాలు ధరించి ఉన్న అంగరక్షకులు సోల్పుగా నడిచి వచ్చి కుర్చీ కి రెండు వైపులా వరసగా నిలబడ్డారు. ఆ తర్వాత మూగ వాళ్ళు – ముందు మగవాళ్ళు, తర్వాత దీపాలు పట్టుకుని ఆడవాళ్ళు. ఆ వెనక , నిలువెల్లా తెల్లటి ముసుగు ధరించి రాజ్ఞి వచ్చి కూర్చుంది. తక్కినవారికి అర్థం కాకూడదనో ఏమో, నన్ను గ్రీక్ భాష లో పలకరించింది.

” ఇలా వచ్చి కూర్చో హాలీ. మిమ్మల్ని దాదాపుగా హత్య చేయబోయిన ఈ అనాగరికుల పట్ల ఏం తీర్పు చెబుతానో విందువు గాని. నా గ్రీక్ కాస్త నట్టుతోంది, క్షమించు. చాలాకాలమైపోయింది ఈ భాష లో మాట్లాడి, నాలుక సహకరించటం లేదు అంతగా ”

నేను వినయంగా వంగి లేచి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాను.

” రాత్రి బాగా నిద్రపట్టిందా ? ” – ప్రశ్నించింది.

” లేదు రాజ్ఞీ. కంటి మీద కునుకే లేదు ” – నిజం చెప్పేశాను, లోలోపల – నేను రాత్రి ఎక్కడున్నానో ఆమెకి తెలుసేమోనని హడలిపోతూ.

” నాకూ సరిగ్గా నిద్ర పట్టలేదు హాలీ. నా కలల్లో నువ్వు నన్ను పిలుస్తున్నట్లు అనిపించిందేమిటో ”

” ఏమి కలలు కన్నారు రాజ్ఞీ ? ”

” నేను ప్రేమించినవారి గురించీ ద్వేషించినవారి గురించీ ” – అనేసి, మాట మార్చేందుకో ఏమో –
వెంటనే, అరబిక్ లో ” వాళ్ళని తీసుకురండి ” అని అంగరక్షకుల నాయకుడికి ఆజ్ఞ ఇచ్చింది.

అతనూ అతని అనుచరులూ కుడి పక్కన ఉన్న మార్గం లోకి నిష్క్రమించారు. నేల మీద మోకరిల్లి ఉన్న జనం లో కొంతమంది అప్పుడప్పుడు, కొద్ది కొద్దిగా తలలెత్తి రాజ్ఞి ని [ లేదా ఆమె దుస్తులని , అవే కదా కనిపిస్తున్నది ] చూసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి వాళ్ళ జీవితకాలం లో ఒకసారి కూడా ఆమె దర్శనం కాదు గనుక వాళ్ళు ఆ అవకాశాన్ని వినియోగించుకుందామని చూస్తున్న ట్లున్నారు.

ఆ రోజు మా మీద దాడి చేసినవారిలో చావగా మిగిలినవారు , దాదాపు ఇరవై మంది అక్కడికి తీసుకు రాబడ్డారు. వాళ్ళ మొహాల్లో సాధారణం గా నిలిచిపోయి కనిపించే నిర్లిప్తపు చిరాకు తోబాటు ఇప్పుడు భయం కూడా తెలుస్తోంది. అందరిలాగా మోకరిల్లబోయారు-

” నిలబడే ఉండండి, నిలబడే ” – ఆజ్ఞాపించింది.

మాకు తీవ్రమైన హాని తలపెట్టినవాళ్ళే అయినా, వాళ్ళని చూస్తే అప్పుడు జాలే కలిగింది. రాణి ఒక్కొక్కరినీ తన కళ్ళ గంతల వెనక నుంచి పరీక్షగా చూస్తోంది- రెండు మూడు నిమిషాల తర్వాత నన్ను అడిగింది.

” వీళ్ళని గుర్తించగలవా ? ”

” చిత్తం రాజ్ఞీ ! ఇంచుమించుగా అందరినీ గుర్తించగలను ” – వాళ్ళు నన్ను మిర్రి మిర్రి చూశారు.

” జరిగిందంతా నీ మాటల్లో చెప్పు ”

వీలైనంత క్లుప్తంగా – వాళ్ళు నరమాంసభక్షణను తలపెట్టి , మా నావికుడు మహమ్మద్ చావు కి కారణమవటం, ఎదిరించిన మాతో తెగబడి యుద్ధం చేయటం, మేము ప్రాణాలతో బయటపడినా లియో కి తీవ్రమైన గాయం తగిలి ప్రమాదస్థితిలోకి వెళ్ళటం – అంతా వివరించాను. అందరూ నిశ్శబ్దంగా విన్నారు, రాజ్ఞి తో సహా. నేను చెప్పటం పూర్తయాక రాజ్ఞి బిలాలీ ని అదంతా నిజమేనా అని ప్రశ్నించింది. బిలాలీ , మోకరిల్లి ఉన్నవాడు లేవకుండానే తల మాత్రం ఎత్తి అవునన్నాడు. రాజ్ఞి ఇంకే సాక్ష్యాలనూ అడగలేదు.

” విన్నారుగా ” – ఆమె గొంతు మామూలుగా లేదు – అతి స్పష్టంగా, ఒళ్ళు జలదరించేలా ఉంది. సందర్భానికి తగినట్లు తన కంఠాన్ని పరి పరి విధాలుగా మార్చగలదు, ఇదీ ఒక ఘనత ఆమెలో. ” పిల్లల్లారా, చాలా దుష్టంగా ప్రవర్తించారు, నా ఆదేశాన్ని ధిక్కరించారు. చెప్పండి, మీకు ఏ శిక్ష వేయాలి ? ”

చాలా సేపు వాళ్ళెవరూ మాట్లాడలేదు. చివరికి వాళ్ళలో ఒక నడివయసు మనిషి సంజాయిషీ ఇచ్చాడు. తెల్లవాళ్ళకి హాని చేయరాదని మాత్రమే రాజ్ఞి ఆదేశంగా తమకు చెప్పారనీ, వాళ్ళతో ఉన్న నల్లవాడిని గురించి ఏమీ చెప్పబడిఉండలేదనీ , వాళ్ళలో ఒక స్త్రీ అతన్ని ఉడకబె ట్టి తినాలనే ప్రతిపాదన చేసిందనీ – ఆ తర్వాత జరిగినదాంట్లో అతని తో బాటు ఆమె కూడా చచ్చిపోయిందనీ చెప్పుకొచ్చాడు. మా మీద చేసిన దాడి తాత్కాలికమైన ఆవేశం తో జరిగిందనీ అందుకు చాలా పశ్చాత్తాపపడుతున్నామనీ కూడా చెప్పాడు. వాళ్ళందరినీ రాజ్యపు పొలిమేర కి అవతల బురద నేలల్లో వదిలి పెట్టవలసిందనీ, అక్కడే ఆయుర్దాయమున్నంతకాలం బతికి చచ్చిపోతామనీ అభ్యర్థించాడు- కానీ అంత క్షమ ను రాజ్ఞి తమ పైన చూపుతుందని అతనికేమీ నమ్మకం ఉన్నట్లు లేదు.

చాలా సేపు అంతా నిశ్శబ్దం.రాజ్ఞి, మోకరిల్లిన జనం, అపరాధులు, అంగరక్షకులు , మూగవాళ్ళు – ఎవరూ కదల్లేదు, మెదల్లేదు. దీపాల వెలుతురు ఆ రాతి గోడల మీద వింత వింత ఆకృతులను సృష్టించటాన్ని గమనిస్తుండిపోయాను నేను. రాజ్ఞి ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది.

” విశ్వాసం లేని కుక్కల్లారా, విషపు పురుగుల్లారా ! నరమాంసభక్షకులై ఈ తెల్లవాళ్ళకీ వాళ్ళ నౌకరుకీ హాని తలపెట్టారు. నా ఆజ్ఞ ను ధిక్కరించారు . ఎంత ధైర్యం రా మీకు ? మీ తల్లిదండ్రులు నేర్పలేదా మీకు – ఈ నేలన నా మాటే శాసనమని, కలలో కూడా జవదాటరాదని ? నేను తలచుకుంటే ఈ గుహ మీమీద కూలిపోతుంది, సూర్యుడు ఉదయించటం మానేస్తాడు, గాలి వీచటం మానేస్తుంది – అప్పుడు మీరు మాత్రమే కాదు, మీ జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి వాళ్ళు గనకే, పుట్టుకతో దుర్మార్గులు గనకే – మీలో మీరు కొట్టుకు చచ్చేవారు , నేను మీ బాధ్యత తీసుకునేదాకా. ఇప్పుడు మీరు చేసిన నేరం క్షమించరానిది – మిమ్మల్ని చిత్రహింసల కి గురి చేసి గాని చంపకూడదు. హింసా శాలకి నడవండి అంతా ”

[ తర్వాతి కాలంలో నేను ఆ ప్రదేశాన్ని దర్శించాను. మానవమాత్రుడెవరూ ఊహించలేని శిక్షలు , వేటికవి ఎలా అమలు జరపాలో సూచించే శిల్పాలు అతి వివరంగా చెక్కి ఉన్నాయి అక్కడ. ఆ గోడలన్నీ అపరాధుల రక్తం తో తడిసిఉన్నాయి.ఇంతకన్న రాసేందుకు నాకు చేతులాడటం లేదు ]

జనం లో నిశ్శబ్దం హాహాకారాలతో చెదిరిపోయింది. అపరాధులు నేల మీద పడి శోకాలు పెడుతూ దయ చూపమని ప్రార్థించారు. వాళ్ళని క్షమించమనీ , లేదా తేలికపాటి శిక్ష వేయమనీ – అదీ కాకపోతే సులువు గా చంపెయ్యమనీ నేను కూడా రాజ్ఞిని ప్రాధేయపడ్డాను.

” లేదు హాలీ ” – ఆమె తిరిగి గ్రీక్ లో మాట్లాడింది. తన సమకాలికుల పద్ధతిలో మాట్లాడటం వల్ల నేను ఆమె భాషను త్వరగా అర్థం చేసుకోలేకపోతున్నాను గాని, ఆమె కి ఆ భాషలో పాండిత్యం ఉందని అయితే స్ఫురిస్తోంది. ” వీళ్ళ సంగతి నీకు తెలియదు. ఈ తోడేళ్ళని వదిలిపెట్టానా, మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ బతకలేరు. వీళ్ళు రక్తపిపాసులు హాలీ, ఇప్పుడు ఈ నిమిషం లో కూడా మీ మీదపడి అందరి ప్రాణాలూ తీయాలనే వీళ్ళ ఉద్దేశం. నా రక్షకభటులు ఎంతమంది ఉన్నారని – అదేమీ పెద్ద సైన్యం కాదు. వీళ్ళని భయం తోనే పాలించాలి, బలం తో కాదు. నా సామ్రాజ్యం అంతా కాల్పనికం, ఊహాధీనం. తరానికి ఒక్కసారి మాత్రం ఇలా వీళ్ళని శిక్షించినట్లుగా చేయవలసిన అవసరం పడుతుంటుంది. నా అంతటిదాన్ని నేను ఈ తుచ్ఛుల మీద పగ తీర్చుకుంటానా? నా క్రూరత్వానికి కూడా వీళ్ళు తగరు.నా లాగా ఇంత కాలం జీవించి ఉన్నవారికి ఉద్వేగాలు ఉండవు, ఆసక్తులు ఉన్న చోట తప్ప. అటూ ఇటూ తారట్లాడే మబ్బు పింజలవంటివి నా ఈ ఆగ్రహావేశాలు – వాటి వెనక ఆకాశం వంటి లక్ష్యం ఒకటి ఉంది. ఈ మనుషులు చావవలసిందే, నేను చెప్పినట్లే చావవలసిందే ”

అంగరక్షకుల పెద్ద వైపు తిరిగి,

” నేను ఏం చెప్పానో అదే జరిగితీరాలి ” .

[ఇంకా ఉంది]