నుడి-6 (ఏప్రిల్, 2016) జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈసారి నుడిని ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతగా నిలిచినవారు రవిచంద్ర ఇనగంటి.
ఇందులో పాల్గొన్న పాఠకులందరికీ కృతజ్ఞతలు. విజేతకు అభినందనలు. కొందరు కొత్తవారు పాల్గొన్నందుకు సంతోషం కలిగింది. ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వివరణలను చూద్దామా?
7 అడ్డం: అంతరిక్ష యానానికి అవసరమైన ఇది రావడం ఎటు? (3)
దీనికి జవాబు రాకెటు.
వివరణ: రావడం = రాక. రాక + ఎటు = రాకెటు
24 అడ్డం: సంగతి ప్రారంభం వున్నా లేకున్నా ఇది మాట్లాడటమే (3)
దీనికి జవాబు సంభాషణం.
వివరణ: సంగతికి ప్రారంభమైన ‘సం’ లేకపోతే వచ్చే భాషణం అన్నా అర్థం మారదు!
25 అడ్డం: తృష్ణ కోసం వెనుదిరిగిన ఏనుగు ముందు కోపంలో లోపం లేదు (3).
దీనికి జవాబు కోరిక.
వివరణ: ‘కోపంలో’ ‘లోపం’ లేదు (కోపంలో మైనస్ లోపం) = కో. వెనుతిరిగిన ఏనుగు (కరి) = రిక. కో + రిక = కోరిక = తృష్ణ!
1.నిలువు: పోనురాను రిపీట్ అయినది ఒకటి పోగా యుద్ధం చేశాను (3).
పోరాడు, పోరాట అని నింపారు ఒకరిద్దరు. దీనికి సమాధానం పోరాను.
వివరణ: ‘పోనురాను’ లో రిపీట్ అయినదేది? ‘ను’ అనే అక్షరం కదా. ఆ రెండు ‘ను’ల లోంచి ఒకదాన్ని (మొదటిదాన్ని) తీసేస్తే మిగిలేది పోరాను = యుద్ధం చేశాను.
2. నిలువు: ఇటు పక్కన కచేరి గోడ నిర్మాణానికి ఇది అవసరం కావచ్చు (3)
వివరణ: ‘ఇటు’ పక్కన ‘క’ చేరగా ఏర్పడే ఇటుక దీనికి జవాబు!
11. నిలువు: ఒకసారి ఆవిడ తన ఆజ్ఞను పోగొట్టుకోవాలి (3).
దీనికి జవాబు విడత. కొందరు వినత అని రాశారు.
వివరణ: ఆజ్ఞ = ఆన. ‘ఆవిడ తన’ మైనస్ ‘ఆన’ = విడత = (ఒక)సారి!
17. నిలువు: అంగీకరించు కాని తలను మార్చి కారంతో వచ్చేది వేసుకో (3).
ఉప్పులకో, ఉప్పులుకో అని పూరించారు కొందరు. దీనికి జవాబు ఉప్పేసుకో.
వివరణ: అంగీకరించు = ఒప్పేసుకో. తలను (మొదటి అక్షరాన్ని) ‘ఉ’ గా మార్చితే ఉప్పేసుకో. (కారంతో వచ్చేది = ఉప్పు)
19. నిలువు: నెల కింద పైకి వచ్చిన రంది మెదడు (3).
స్సుదమే, మదిరం, మాదిరం మొదలైన సమాధానాలతో పూరించారు కొందరు. దీనికి జవాబు మేదిరం.
వివరణ: నెల = మే (May). పైకి వచ్చిన (తారుమారైన) రంది = దిరం. మే + దిరం = మేదిరం = మెదడు
**** (*) ****
నేను ఏప్రిల్ 1న పంపిన పూరణ చూడండి. అన్నీ సరిగానే పంపించాను. కానీ ఎక్కడో పొరపాటు జరిగినట్టుగా వుంది.
సుభా గారూ,
6 నిలువును దండుగా అని పూరించారు మీరు.
మీరు ‘సైన్యంగా వృథా’ అన్ని ఇచ్చారు. అందుకని ‘దండుగా’ అని పూరించాను. ‘సైన్యం వృథా’ అని వుంటే దండుగ అని పూరించేదానిని.
దండు = సైన్యం. కనుక, సైన్యంగా = దండుగ. ఇక వృథా = దండుగ. మీరు చెప్పినట్టు సైన్యం వృథా అని యిస్తే సైన్యంకు సమానార్థక పదమైన దండు జవాబు అవుతుంది, దండుగ తప్పు జవాబు అనుతుంది. వృథాగా? అని ప్రశ్నార్థకంతో ఇస్తే అప్పుడు దండుగా అన్నది సరైన సమాధానమయ్యే అవకాశముంటుంది.
శ్రీయుతులు ఎలనాగ: దయచేసి గడిని మామూలుగా కూర్చండి. ఈ కొత్త నమూనా ఒక గడి కాదు. ఒకదానికొకటి సంబంధం లేని తొమ్మిది చిన్న గడులు. దీనివల్ల గడి పూరించే సరదా పోను, కొత్తగా ఒరిగిన క్లిష్టత ఏమీ లేదనే నా అభిప్రాయము. అందునా మీరు ఇస్తున్నవి క్రిప్టీక్ ఆధారాలు కదా. ఉదాహరణ నిమిత్తం: పాత గడి అయినా, ఇదైనా 90-95శాతం వరకూ నింపేందుకు నాకు అదే 20-30 నిమిషాలు పడుతుంది. ఒకటో రెండో ఆధారాలు పూరించకపోవడానికి గడి నమూనా కారణం కాలేదు, ఇప్పటిదాకా కూడానూ.
ఏతావాతా నా సలహా ఏమంటే ఇట్టి పద్ధతికి బదులుగా బదులుగా మామూలు గడి వాడి, ఆధారాలకు సమాధానాలు పొడుగ్గా ఉండేవి, 6 లేదా 8 అక్షరాలు, లేదా అంతకంటే పొడుగు ఉన్నవి, ఎంచుకుంటే గడి మరింత కష్టమూ అవుతుంది, పూరించడానికి ఉత్సాహము ఉంటుంది. ఉదా: 1అడ్డం 11అక్షరాల ఒకే ఆధారం అయితే ఎంత బాగుండగలదు! అలానే, మీ సమయాన్ని బట్టి గడి కుడా కొంత పెద్దది ఎంచుకోగలరేమో ఆలోచించగలరు.
సహవాసి గారూ,
నిస్సంకోచంగా మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు. మీరు చెప్పినదాన్ని దృష్టిలో వుంచుకుంటాను. ఈలోగా మిగతా పాఠకుల ఉద్దేశమేమిటో కూడా తెలిస్తే బాగుండును.