ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – రెండవ భాగం

మే 2016

2

డెన్వర్‌లో విమానం ఎక్కేముందూ, ఎక్కిన తరువాతా కూడా మీనా ఎయిర్‌పోర్ట్‌లో కనబడడం గూర్చి హమీర్ ఆలోచిస్తూనే వున్నాడు. కళ్లు మూసుకుంటే – యూనివర్సిటీ డైనింగ్ హాల్లో లైన్లో ఆమె వెనుక అతను … తరువాత ట్రేలో పిజ్జా పట్టుకుని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న ఆమె ముందు నిలబడి… డాన్స్‌లో ఆమెని రెండు చేతులతోటీ నడుము దగ్గర పట్టుకుని గాలిలో ఎగరేస్తూ, తిప్పుతూ… మెడ వెనుక ఆమె జుట్టుని చేత్తో పక్కకు తోసి చెవి వెనుక ముద్దు పెడుతూ …

లాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని అతను పనిచేస్తుంటే అతని జుట్టుని చేత్తో చెరిపేస్తూ ఆ ఒళ్లోనే వాలుతూ … కిచెన్ సింక్ దగ్గర నిలబడి అతను గిన్నెలు కడుగుతుంటే, వెనకనించీ అతని అనాఛ్ఛాదిత ఛాతీమీద ఒక చెయ్యి వేసి ఇంకో చేతిని పొత్తికడుపుమీద వేసి హత్తుకుంటూ … ఆమె!

కత్తి పొత్తికడుపులో దిగిందా గుండెల్లోనా అని తరువాతెప్పుడో రోహిత్ అడిగితే రెంటికీ తేడా ఏమిటన్నాడు. గుండె పనిచేస్తోంది కాబట్టి మనసులోనే అన్నాడు. “అదే నీ పొత్తికడుపుకింద లేని గాయాన్ని కల్పించి నసపెడుతోంది. మా నాన్న వినే తెలుగు పాటల్లో నాకు నచ్చిన లైను – తెలుపో నలుపో జానేదేవ్ ఆ తేడా లిక్కడ లేనే లేవ్! ఎంజాయ్ లైఫ్ మాన్! కమాన్! కం విత్ మి టు డిసి వన్ ఆఫ్ దీస్ డేస్! దేరీజ్ సో మచ్ ఆపర్ట్యూనిటీ, యు నో, గాయాన్ని మాయం చేద్దాం,” అన్నాడు రోహిత్. అతని ఆ ఓపెన్ ఇన్విటేషన్ ఇంకా అలానే మూల పడివుంది.

“నువ్వు త్వరగా ఏదో తేల్చాలి. అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు! ఎన్నాళ్లిలా?” అంటారు భవాని గారు కలిసినప్పుడల్లా. మూర్తి అంకుల్ అంత ఓపెన్‌గా అనరు. ఆవిడ ఎలాగూ అంటోంది కదా అని అటు ఒక చెవిని వేసి వుంచుతారు.

తను నాన్నకి గానీ ఆయన తనకిగానీ బై చెప్పినట్లు గుర్తులేదు. తను స్కూల్‌కి వెళ్లిన తరువాత కదా ఆయన వెళ్లాలి? తను వెళ్లేటప్పుడు ఆయన బాత్రూంలో వున్నారా? పొద్దున్న స్కూల్‌కి వెళ్లే హడావిడిలో ఆయనకి ఏరోజు బై చెప్పాడో ఏరోజు చెప్పలేదో గుర్తుండడానికి ఆరోజుల్లో అతను పట్టించుకున్న దెప్పుడు?

మూసుకున్న కళ్ల వెనక మగత నిద్రకి జ్ఞాపకాలు తోడైనప్పుడు, “వుడ్ యు లైక్ సంథింగ్ టు డ్రింక్?” అని వినిపించి కళ్లు తెరిచి చూశాడు. “కాఫీ ప్లీజ్, బ్లాక్!” చెప్పాడు.

ఆమె ఇచ్చిన కాఫీని అతను అందుకుని ఒక సిప్ తీసుకున్నాడో లేదో కాప్టెన్ అనౌన్స్‌మెంట్ వినిపించింది.

“వుయ్ హావ్ ఎ మెకానికల్ ట్రబుల్ ఇండికేటర్ లైట్ కం ఆన్. ఎకార్డింగ్ టు ఫెడెరల్ రెగ్యులేషన్స్, వుయ్ హావ్ టు లాండ్ ఎట్ ది నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్. వుయ్ విల్ బి లాండింగ్ ఇన్ ఒమాహా, నెబ్రాస్కా. అక్కడ దిగిన తరువాత మెకానిక్కులు చూసి ఏం చెయ్యాలో చెబుతారు. ఎంతసేపు పడుతుందో తెలియదు గనుక అందరూ మీ కారీ-ఆన్‌లను తీసుకుని దిగాలి. రిపేర్ పూర్తయిన తరువాత మళ్లీ బోర్డ్ చేస్తాం.”

దిగిన గంట తరువాత స్టేటస్‌ని అప్‌డేట్ చేశారు. “దీనిలో ఒక పార్ట్ రిప్లేస్ చెయ్యాలి. అది డెన్వర్‌నించీ రావాలి. నెక్స్ట్ ఫ్లయిట్‌లో పంపిస్తారు. ఈలోపల, ఆ రిపేర్ అయినదాకా మిమ్మల్ని వెయిట్ చేయించడమా లేక ఇంకో విమానాన్ని ఎక్కించడమా అనేదికూడా ఆలోచిస్తున్నాం.”

తరచుగా ప్రయాణించే ప్రయాణీకుడు ఒకడు ఏం కాబోతోందో అరటిపండుని వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు. “ఇదేమీ లండన్ కాదు. కనీసం డెన్వర్ కూడా కాదు – రకరకాల ఎయిర్లయిన్లు ఇక్కణ్ణించీ బయల్దేరడానికి. ఆ బోర్డు మీద చూడరాదూ? ఒక రెండు, మూడు ఎయిర్లయిన్లు మాత్రం రోజుకి రెండు ఫ్లయిట్లని ఇక్కణ్ణించీ నడుపుతాయి. ఇంక వేరే విమానాన్ని పంపిస్తారేమో నని అనుకోవడానికి ఇదేం చిన్న విమానమేం కాదు. బోయింగ్ 767! ఇలాంటివి రోడ్డు పక్కన టాక్సీల్లాగా వెయిట్ చేస్తూ కూర్చోవు సర్వీసులోకి తీసుకురావడానికి. దీని రిపేర్ అయ్యేదాకా ఇక్కడ కూర్చోవడం తప్ప మనం చెయ్యగలిగిన దేమీ లేదు.”

అతనన్నట్లుగానే గంట తరువాత ఎయిర్‌లైన్ వాళ్లు ఇంకొక గంటలో డెన్వర్‌నించీ బయల్దేరే ఫ్లయిట్లో ఆ పార్టు వస్తుందనీ, రిపేర్ అయిన తరువాత ఈ విమానంలోనే పాసెంజర్లని పంపుతామనీ చెప్పి, వాళ్లకు కలిగిస్తున్న అసౌకర్యానికి చింతిస్తూ అక్కడ వెయిట్ చేయిస్తున్నందుకు క్షమాపణగా ఫుడ్ వోచర్లని ఇస్తున్నాం, వచ్చి తీసుకొమ్మన మన్నారు. వాటిని అక్కడ దొరికే ఏ తిండి పదార్థాలని కొనుక్కోవడానికయినా ఉపయోగించవచ్చు నన్నారు.

హమీర్ ఆ వోచర్‌కోసం లైన్లో నిలబడ్డప్పుడు ముందు నిల్చున్నామెని చూశాడు. నల్ల జీన్స్ పాంటు, వంటికి హత్తుకుపోతూ లేత పింక్ కలర్ టాప్. మెడ దగ్గరే ఆగిపోతున్న నల్లని గిరజాల జుట్టు. “నాట్ బాడ్!” అనుకున్నాడు.

వోచర్ తీసుకుని చుట్టూ చూసిన తరువాత అతనికి అర్థమైంది అది ఎంత చిన్న ఎయిర్‌పోర్టో. తరచుగా చేసిన ఇండియా ప్రయాణాల వల్ల లండన్ హీత్రో, ఫ్రాంక్‌ఫర్ట్, వాషింగ్టన్ డల్లస్ ఎయిర్‌పోర్టుల పక్కన అది చాలా చిన్నదిగా కనిపించింది.  హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పదోవంతుకూడా అది వుంటుందని అతనికి అనిపించలేదు. ఉన్న నాలుగు గేట్లూ పక్కపక్కనే వున్నాయి. సావనీర్లమ్మే ఒకషాపూ, హాట్‌డాగ్స్‌నీ, చికెన్ వింగ్స్‌నీ, వాటితోబాటు బీర్‌నీ అమ్మే ఒక షాపూ, పక్కనే, కూర్చుని తినేలా ఒక రెస్టారెంటూ – వీటిల్లో ఏదీ అతనికి అంత అట్రాక్టివ్‌గా అనిపించలేదు. హాంబర్గర్, ఫ్రెంచ్‌ఫ్రైస్, సోడాని తీసుకుని ట్రే పట్టుకుని చుట్టూ చూస్తే కూర్చోవడానికి ఖాళీగా ఏ టేబులూ కనిపించలేదు. దూరంగా ఒక టేబుల్ దగ్గర ఇందాక క్యూలో తనముందు నిలబడివున్న అమ్మాయి చిప్స్ తింటూ కనిపించింది. దగ్గరగా వెళ్లి, “మే ఐ జాయిన్ యూ?” అనడిగాడు. ఆమె తలెత్తి చూసి భుజాలని ఎగురవేసి, మళ్లీ చిప్స్ తినడం మొదలుపెట్టింది.

అతను కూర్చుని తినడం మొదలుపెట్టిన తరువాత ఆ క్రితం రాత్రి కలా, మీనా కనబడి జ్ఞాపకాల తుట్టెని కెలకడం గుర్తొచ్చి అతణ్ణి చికాకుపెట్టి అతని మౌనాన్ని చెదరగొట్టాయి.

“ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ!” అన్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా మొహాన్ని పెట్టింది. “ఐ వజ్ స్టాండింగ్ బిహైండ్ యు,” అన్నాడు ఎయిర్‌లైన్ కౌంటర్‌వైపు కళ్లతో చూపిస్తూ.

“ఆర్ యు హిట్టింగ్ ఆన్ మి?” నిర్మొహమాటంగా ప్రశ్నించింది.

ఆ ప్రశ్నలో కోపంకాక ఆసక్తి మాత్రమే వినిపించడంతో, “ఈజ్ ఇట్ రాంగ్?” అని అడిగాడు.

“ఐ కుడ్ హావ్ బీన్ మారీడ్!” అన్నదామె.

“వై వుడ్ ఇట్ ఛేంజ్ ది సీనరీ?  … ఐ డోంట్ సీ ఎ రింగ్ ఆన్ యువర్ ఫింగర్,” హమీర్ జవాబిచ్చాడు.

“ఐ మే నాట్ హావ్ పుటిట్ ఆన్!”

“హైడింగ్ దట్ యు ఆర్ మారీడ్! ఈవెన్ బెటర్!”

“…”

“ఐ రియల్లీ ఎంజాయ్‌డ్ ది వ్యూ,” హమీర్ రెట్టించాడు.  ఆమె అతణ్ణి ఆపడానికి ప్రయత్నించకపోవడాన్ని గమనించి మరికాస్త ముందుకు వెళ్లాడు – “ఐ థాట్ యు వర్ గోఇంగ్ టు స్టాండ్ అప్ అండ్ సే, వాటెబవుట్ దిస్ వ్యూ!”

అతని కళ్లల్లోకి సూటిగా చూసి అన్నదామె – “ఇట్స్ క్లియర్ దట్ యు హావ్ సం ప్రాక్టీస్ విత్ దట్ పికప్ లైన్!”

“ప్రాక్టీస్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్!” కొంటెగా అన్నాడు.

“వర్ యు సక్సెస్‌ఫుల్ దట్ టైం?”

“ఆబ్సల్యూట్లీ. నౌ, ఐ నో యు ఆర్ గోయింగ్ టు స్టాండప్ అండ్ ఆస్క్ మి అబవుట్ ది అదర్ వ్యూస్, బికాజ్ యు ఆర్ కాన్‌ఫిడెంట్ ఆఫ్ యువర్సెల్ఫ్!”

ఆలోచించడానికి ఒక్కక్షణం ఆమె తీసుకోవడంవల్ల తన అంచనా తప్పయిందేమోనని అతనికి సందేహం వచ్చినా గానీ, ఆ అమ్మాయి మెల్లగా లేచి టేబుల్ పక్కకి వచ్చి అతనికి పూర్తిగా కనిపించేలా నిల్చుని, “ఓకె. వాటెబవుట్ దిస్ వ్యూ?” అనడగడం మాత్రం హమీర్‌కి ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

ఆమె వేసుకున్న పింక్ టాప్ మెడచుట్టూ వున్న కుచ్చీలు ఆమె వక్షాన్ని చేరి విడివడి, తాము హత్తుకున్న వక్షపు ఎత్తులని ప్రస్ఫుటంగా చూపించి, జలపాతంలా క్రిందకు దుమికాయి. ఆ చొక్కా టెక్స్‌చర్ చాలా సున్నితంగావుండి ఆ వక్షపు మెత్తదనాల గుట్టుని రట్టుచేస్తోంది. ఆ చొక్కాని జీన్స్ పాంటులో టక్‌చెయ్యడంవల్ల నడుం వంపుకి కూడా ఆ రంగు హంగు నిచ్చింది. మెరిసే ఆమె మేను ఛాయ మెడక్రిందా, మోచేతుల పైన చొక్కా వదిలేసిన చోటునుంచీ దర్శన మిచ్చింది.

“బ్యూటిఫుల్. నౌ టర్న్ ఎరవుండ్!” అన్నాడు.

ఆమె మెల్లగా తనచుట్టూ తాను తిరిగి, కుడి చేత్తో మెడ వెనుక జుట్టుని సరిచేసుకుంటూ, ఎడమ చేతిని నడుంమీద వేసి పోజిస్తూ క్షణకాలం నిల్చొని, కుర్చీలో కూర్చుంది.

అతను చేతిని ఆమెకి షేక్‌హాండ్ నివ్వడానికి ముందుకు చాచి, “అయాం హమీర్!” అన్నాడు.

ఆమె ఆ చేతిని అందుకోకుండా, “నౌ ఇట్స్ యువర్ టర్న్!” అన్నది. అర్థ మవలేదని చెప్పిన అతని మొహంలోని భావాలని చూసి, “స్టాండప్ అండ్ స్లోలీ టర్న్ అరవుండ్!” అన్నది.

ముందు ఆశ్చర్యపోయినా, సన్నగా నవ్వి హమీర్ కుర్చీలోంచి లేచాడు. ఎడమచేతిని కిందకు వాల్చి, కుడిచేతి వేళ్లని జుట్టులోనికి పోనిస్తూ, తలని కొద్దిగా పైకెత్తి, క్రీగంట ఆమెని చూస్తూ నిలబడ్డాడు. తరువాత తనచుట్టూ తాను మెల్లగా తిరిగి, కుర్చీలో కూర్చున్నాడు.

ఆమె తన చేతిని షేక్‌హాండ్ నివ్వడానికి ముందుకు చాపి, “అయాం అమాని,” అన్నది.

అతనా చేతిని అందుకుంటూ, “లుక్స్ లైక్ యు లైక్‌డ్ వాట్ యు సా,” అన్నాడు.

“బ్లూ జీన్స్ అండ్ ఆక్వా కలర్ టీ షర్ట్ – దట్స్ ఎ నైస్ కాంబినేషన్!” అని అమాని జవాబిచ్చింది.

“దట్ వుడ్ బి, ఈవెన్ ఆన్ ఎ మానెకిన్!” అన్నాడు తనడిగిన ప్రశ్నకు జవాబు రాలేదని తిన్నగా చెబుతూ.

“ఓకె. ఐ విల్ ఫీడ్ యువర్ ఇగో. దట్ కాంబినేషన్ లుక్స్ గుడ్ ఆన్ యు. బట్… దట్ బట్ ఈజ్ ఎ టాడ్ బిగ్,” అన్నది.

“దట్స్ బిలో ది బెల్ట్!” అన్నాడు కొద్దిగా కోపగించుకుంటూ.

“వెల్. దట్ బట్ ఈజ్ బిలో ది బెల్ట్,” అన్నది కొంటెగా.

టేబుల్ మీద పెట్టిన ఆమె చేతిమీద చేయివేస్తూ, “యువర్ నేమ్ ఈజ్ స్పెల్ట్ AMANI?” అనడిగాడు. “యస్,” అన్నదమె.

“ఆర్ యు కాల్డ్ ఆమని ఎట్ హోమ్?” “నో.”

“ఐ హావ్ ఎ ఫ్రెండ్ హూస్ నేమ్ ఈజ్ స్పెల్ట్ AVANI. ఆమెని పేరెంట్స్ అవని అని పిలుస్తారు. కానీ ఇండియన్స్ కానివాళ్లు మాత్రం అవాని అని పిలుస్తారు. అందుకని అడిగాను.”

“ఐ నో. అలా అడిగిన వాళ్లల్లో నువ్వు మొదటివాడివి కాదు. కాలేజీలో నేను కలిసిన ఇండియన్లంతా నువ్వడిగినట్లే అడిగారు. మా పేరెంట్స్ కర్ణాటక నుంచి. మేం ఇంట్లో మాట్లాడేది ఉర్దూ గానీ, కన్నడంలో కూడా మాట్లాడగలం. నీ పేరు సరిగా విన్నానో లేదో కన్ఫర్మ్ చేసుకోనివ్వు. హమీద్?”

“కాదు, హమీర్,” “ర్”ని వత్తి పలికాడు. హాంబర్గర్ని ఒక బైట్ తిన్న తరువాత ఆమె ముందున్న చిప్స్ పేకెట్లని చూసి అడిగాడు. “ఓన్లీ చిప్స్?”

“ఆ వోచర్ ఎలౌ చేసే పదిహేను డాలర్లకీ నాకిక్కడ తినడానికి దొరికేవి చిప్సూ, కుకీలూ మాత్రమే!” అమాని జవాబిచ్చింది.

“యు ఆర్ ఎ వెజిటేరియన్!” ఆమె మౌనమే జవాబు చెప్పింది. “మేమూ వెజిటేరియన్లమే ఇంట్లో. కాలేజీ కెళ్లిన తరువాత ఇది అలవాటయింది,” అన్నాడు చేతిలో తింటున్నదాన్ని కళ్లతో చూపిస్తూ.

“నేను నీ బట్ గూర్చి కామెంట్ చేసిన తరువాత నువ్వు నా బ్రెస్ట్స్ గూర్చి కామెంట్ చేస్తావనుకున్నాను,” అన్నది అమాని.

“ఆర్యూ అఫిషియల్లీ ఫ్లర్టింగ్?” ఆ ప్రశ్న అడగ్గానే ఆమె బ్రెస్ట్స్ మీదకు వెళ్లిన తన చూపులని ఆమె కళ్లమీదకు మరలిస్తూ ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు.

“వై నాట్? ప్లేన్ రిపేర్ ఇప్పుడిప్పుడే పూర్తయ్యేటట్లు లేదు. పైగా, నా ప్రశ్న వినగానే ఎలాగో నీ చూపులు అక్కడికే వెళ్లాయి!”

“ఆ తరువాత పెదాల మీదుగా కళ్లని చేరాయి గదా!”

“పెదాలమీద ఎక్కువసేపు ఆగలేదుగా! పోనీలే, కళ్లు నచ్చినట్లున్నాయ్. వాటిమీద కవిత చెబుతావేమిటి?”

“మా నాన్న మా అమ్మకోసం రాసిన కవితని ఇంట్లో ఫ్రేము కట్టి పెట్టారు. అది చెబుతా. తెలుగులో వుంటుందనుకో, ట్రాన్స్‌లేట్ చెయ్యమని మాత్రం అడక్కు. చెయ్యగలను గానీ నా ట్రాన్స్‌లేషన్ అంత బావుండదు.”

“కన్నడ తెలుగుకి దగ్గరగా వుంటుందని విన్నాను. నువ్వు చెప్పు. కనీసం శబ్దాలని ఎంజాయ్ చేస్తాను.”

“కనురెప్పల మూతల్లో నునుచీకటి పరవశమై

చిరునవ్వుల మిలమిలలో ఎగసిపడే తారకనై

కనుసన్నల కావించే సరసపు సిరిమువ్వనై

ఆ కన్నుల నిండిపోనా, ఎల్లపుడూ

ఆ నవ్వుల పండిపోనా

ఆ గలగల నందుకోనా!”

“వినడానికే బాగుంది. అర్థం ఇంకా బావుండే వుంటుంది.”

“మూడేళ్ల క్రితం ఆ స్క్రిప్టుని ఇంగ్లీషులో రాసుకుని బైహార్ట్ చేశాను. అర్థం కూడా చెప్పించుకున్నా ననుకో. ఒక వాలెంటైన్స్‌డేకి రాసి మా మామ్‌కి ప్రెజెంట్ చేశార్ట.” హమీర్‌కి తండ్రి గుర్తొచ్చి మెదడు ఒక్కక్షణం మసకబారింది. తలవిదిల్చి ఆమె ఎడమ చేతివేళ్లవైపు చూసి అన్నాడు మాటమారుస్తూ – “ఆ చేతిని అలంకరించే ఉంగరం నీ చెంతకి చేరకపోవడమే ఆశ్చర్యకరం!”

“నీ ద్వారా ఎవరికయినా చేరిందా?”

“వెనక్కి వచ్చేసింది కూడా!”

“సారీ టు హియర్ దట్!”

“వెల్, ఇట్ వజ్ నాట్ మెన్ట్ టు బి! నీ సంగతేమిటి?”

“నాట్ మెన్ట్ టు బి!”

“హియర్ ఈజ్ ఏన్ అప్‌డేట్. ది పార్ట్ హాజ్ అరైవ్డ్ అండ్ ది మెకానిక్స్ హావ్ స్టార్టెడ్ వర్కింగ్!” అనౌన్స్‌మెంట్ వినిపించింది. మిగిలిన పాసెంజర్లతో బాటు హమీర్, అమానిలు గ్లాస్ విండో దగ్గరకెళ్లి బయటకి చూశారు. ఒక ఇంజెన్ ప్లేన్ నుంచీ వేరుచెయ్యబడి నేలమీద పెట్టివుండడం వాళ్లకి కనిపించింది.

“ఈ రిపేర్ ఇవాళ పూర్తయ్యేటట్లు లేదు!” అన్నాడు హమీర్ సందేహిస్తూనే ఆమె చేతిని తనచేత్తో అందుకుంటూ.

“రెండువందలమంది చూస్తున్నప్పుడు రిపేర్ చెయ్యాలంటే కష్టమే మరి. పెర్ఫార్మెన్స్ ఏంగ్జయిటీ!” అన్నది కొంటెగా అతనివైపు చూస్తూ.

“మోర్ ఫ్లర్టింగ్?” అడిగాడు హమీర్‌.

“వై నాట్?” అన్నదామె పెదవికి అదోరకపు వంపుని జోడించి.

మరో నాలుగు గంటల తరువాత వాళ్ల విమానం వాషింగ్టన్ దిశగా ప్రయాణించింది.

 

@ @ @

 

2015 నవంబర్ -

“ఈసారి థాంక్స్‌గివింగ్‌కి యాభై డిగ్రీల వెదర్ అంటే ఆశ్చర్యంగా వుంది. గత ఇరవయ్యేళ్లలోనూ ఇంత వార్మ్ వెదర్ గుర్తులేదు ఈ సమయంలో!” అన్నారు మూర్తిగారు టేబుల్ మీద సమోసాల ట్రేని పెడుతూ.

“అయినా ప్రయోజన మేముంది? డిన్నర్ టైంకి ఎలాగూ చల్లబడుతోంది – ఆరుబయట కూర్చుని తినడానికి వీల్లేకుండా,” అన్నారు భవానిగారు అవెన్లోంచి లసాన్యా ట్రేని బయటకు తీస్తూ.

“డిన్నర్ టైంకి ఆ టెంపరేచర్ వుందంటే, గ్లోబల్ వార్మింగ్ వల్ల మాన్‌హటనూ, మయామీ నీళ్లల్లో ముణిగున్నాయని అర్థం మామ్!” అన్నది విదుషి సలాడ్‌కోసం కారెట్లని తురుముతూ.

“ఇట్ విల్ హాపెన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్,” అన్నాడు ఆండ్రూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని. అతనేమన్నా పని చేస్తానన్నా భవానిగారు చెయ్యనివ్వరు.

“నాటిఫ్ వుయ్ ఎలెక్ట్ హిల్లరీ క్లింటన్ నెక్స్ట్ యియర్,” అన్నాడు రోహిత్ పొయ్యిమీద నుంచీ సాంబార్ గిన్నెని తీసి టేబుల్ మీద పెడుతూ.

“తండ్రికీ, కూతురుకీ పట్టదు గానీ, వీడు మాత్రం పాలిటిక్స్‌లో యాక్టివ్!” అన్నారు భవానిగారు చిప్స్ పాకెట్‌ని చింపి వాటిని బేసిన్లో పోస్తూ.

“ఫామిలీకి కనీసం ఒకళ్లయినా లేకపోతే మన అభిప్రాయాలు పాలిటీషియన్లకి ఎలా తెలుస్తా యాంటీ?” అన్నాడు హమీర్ గరిటెలనీ, చెంచాలనీ టేబుల్ మీద పెడుతూ.

“గుడ్ పాయింట్!” అన్నాడు ఆండ్రూ.

“కార్లమీద ఆ హిల్లరీ క్లింటన్ స్టిక్కర్లు అతికించాడు వద్దురా అన్నా వినకుండా!” కంప్లైంట్ చేశారు భవాని గారు, కిచెన్ కౌంటర్‌మీద బిర్యానీని కలుపుతూనే.

“తప్పేముం దాంటీ, అందులో?” అడిగాడు హమీర్ డిన్నర్ ప్లేట్లు తీసుకెళ్లి టేబుల్‌మీద పెడుతూ.

“ఎంతయినా ఇది కన్సర్వేటివ్ నైబర్‌హుడ్ కదా! ఇక్కడ రిపబ్లికన్లకి ఓటు వేసేవాళ్ల మధ్యలో వున్నాం. వాళ్ల మధ్యలో ఇలా చాటింపు వేసుకోవడం అంత సేఫ్ కాదని ఆంటీ వుద్దేశం!” అన్నారు మూర్తిగారు వాళ్లు చేసే పనులని చూస్తూ నిలబడి.

“ఇండియన్లం కాబట్టీ, ఇక్కడ ఇరవయ్యేళ్లకి పైగా వున్నాం కాబట్టీ అంత ప్రాబ్లం కాదనుకో!” అన్నారు భవాని గారు.

“అదే మనం పాకిస్తానీలమో, లేక ఇండియానుంచే వచ్చిన ముస్లిములమో అనుకో, కార్లమీద డొనాల్డ్ ట్రంప్ స్టిక్కర్లని అతికించేసుకోంగానే ప్రాబ్లం మాయమయిపోయే దంటావా మామ్?” రోహిత్ తల్లి నడిగాడు.

హమీర్ ఉలిక్కిపడ్డాడు.

“యు వర్ స్టార్టిల్డ్!” అన్నాడు అతణ్ణి గమనించిన ఆండ్రూ.

“మి? నా ముస్లిం కొలీగ్ గుర్తుకొచ్చాడు. అతనెలా ఫీలవుతుంటాడోనని అనిపించింది,” హమీర్ తడబడుతూ జవాబిచ్చాడు.

అంతకు ముందు పదిరోజుల క్రితం పారిస్‌లో ISIS జరిపిన మారణకాండలో అమాయకులైన 130మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇంకో 368 గాయపడడం వాళ్లందరి ఆలోచనల్లోనూ ఇంకా ఫ్రెష్‌గానే వున్నది.

“ఇంక ఏ ముస్లిమునీ నమ్మకూడదనడం మొదలుపెడతారు పాశ్చత్య దేశాల్లోని కన్సర్వేటివ్‌లు – ఇప్పుడు కొందరు రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ కాండిడేట్స్ అంటున్నట్టు. ఆ అభిప్రాయాలని విని, ఉడుకురక్తం ప్రవహించే ముస్లిం కుర్రాళ్లకి కోపమొస్తుంది. వాళ్లల్లో కొందరు రాడికల్స్ అలాంటివాళ్లకి బుధ్ధిచెప్పడానికి ISISలో చేరి అటాక్ చేస్తారు. వాటిని చూపించి, ఈ పరిస్థితి వస్తుందని మేమెప్పుడో వార్నింగు నిచ్చాం అంటారు పాశ్చాత్య కన్సర్వేటివ్‌లు. దిస్ ఈజ్ ఎ విషియస్ సర్కిల్,” అన్నారు మూర్తిగారు.

“వేరీజ్ ది టర్కీ?” అడిగాడు హమీర్.

“అవునవును, తేవడం మర్చిపోయారేమిటి, కొంపదీసి? ఈ సమయంలో ఏ షాపులూ తెరిచివుండవు కూడాను!” హడావుడిపడ్డారు మూర్తిగారు.

“డాడీ, మీరేం కంగారు పడకండి. మమ్మీ అవెన్లోంచి ఎప్పుడో బయటకుతీసింది. ఆ పక్కన వున్నది చూడండి,” అని చెప్పింది విదుషి.

“సో, ఆండ్రూ! ఆర్యూ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఫేక్ టర్కీ?” అడిగాడు హమీర్.

“హి విల్ ఈట్ ది రియల్ వన్ టుమారో. హిజ్ మామ్ విల్ సెట్ ఎసైడ్ హిజ్ షేర్!” అన్నది విదుషి ఆండ్రూ మెడచుట్టూ చేతులు వేసి అతని వెనక నిలబడుతూ.

“ది ఓన్లీ టైం దిస్ యియర్!” అన్నాడు ఆండ్రూ ఆమె చేతులమీద చేతులు వేస్తూ.

డైనింగ్ టేబుల్‌మీద అన్నీ చేరిన తరువాత అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. మూర్తిగారు అందరికీ గ్లాసుల్లో వైన్ నింపి, తన గ్లాసుని పైకెత్తి, “హాపీ థాంక్స్‌గివింగ్!” అన్నారు.

“అంతకు ముందునించీ కూడా ఇక్కడ ఇలాగే డిన్నర్ చేసినా 2006 నించీ మాత్రం ఈ డిన్నర్ నాకు స్పెషల్. థాంక్యూ అంకుల్ అండ్ ఆంటీ ఫర్ ది టెంత్ యియర్ ఇన్ ఎ రో,” అన్నాడు హమీర్ తన గ్లాసుని పైకెత్తి.

“వెల్, టెక్నికల్లీ స్పీకింగ్, ఎక్సెప్టింగ్ వన్ టైం,” అన్నాడు రోహిత్.

“ఇప్పుడా టెక్నికాలిటీ అవసర మంటావా?” కోపంగా అడిగారు మూర్తిగారు.

“ఐ వజ్ జస్ట్ సేయింగ్!” అన్నాడు రోహిత్ గొణుగుతూ.

“అంతకుముందు కనీసం మూడేళ్ల ముందునించీ నువ్వు వచ్చావు మీ అమ్మానాన్నలతో,” అన్నారు భవాని గారు.

“మీరు లేకపోతే నేనూ, అమ్మా ఏమయ్యుండేవాళ్లమో! తలచుకుంటేనే భయమేస్తుంది!” అన్నాడు హమీర్.

“ఇది పాత పాటే గానీ, నీ డెన్వర్ ట్రిప్ గూర్చి చెప్పు. తిరిగి వచ్చిన తరువాత ఇదే కలవడం!” అన్నది విదుషి.

“ఇట్ వజ్ గుడ్. ఐ హాడె నైట్‌మేర్ ఆన్ ది లాస్ట్ నైట్,” అని తను బ్రైనార్డ్ లేక్ రిక్రియేషన్ పార్క్‌కి వెళ్లడంగూర్చీ, తనకు వచ్చిన కలగూర్చీ చెప్పాడు.

భవానిగారికి గుండె ఆగినంత పనయ్యింది. “ఇంక అలాంటి పిచ్చిపన్లేమీ చెయ్యకు. నిజంగా ఆ బేర్ పక్కనుంటే ఏం చేసేవాడివి? నీ మాట అట్లావుంచు. నీకే మయినా అయితే మేం మీ అమ్మకేమని చెప్పాలి? ఆవిడ తట్టుకోగలదా? ఆవిడ కాబట్టి ఇంకా నెట్టుకొస్తోంది గానీ, నాకయితే ఎప్పుడో గుండె ఆగిపోయుండేది!” అన్నదావిడ కోపంగా.

“ఎందుకలా ఆవేశపడతావు? ఇప్పుడేమీ కాలేదుగా!” మూర్తిగారు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.

“కాకూడదనే! పదేళ్లపాటు వాణ్ణి కొడుకులాగా చూసుకున్నందుకు వాళ్లమ్మతోబాటు నేనుకూడా ఏడవాల్సొస్తుంది. ఇకముందు ఒంటరిగా అలా తెలియనిచోట్లకి వెళ్లకు. అలాంటిచోట్ల నువ్వు మాయమయినా ఎవరికీ తెలియదు!” అన్నారావిడ.

“కరెక్షన్ మామ్! రెంటల్ కారుందిగా! అది ఎవరిపేరు మీదున్నదో కనుక్కోవడానికి పోలీసులకి క్షణమయినా పట్టదు!” అన్నాడు రోహిత్.

“అప్పుడు కనుక్కున్నారు, ఇప్పుడు కనుక్కుంటారు! వీడొకడు, అన్నింటికీ తగుదునమ్మా అంటూ తయారవుతాడు!” అని అక్కణ్ణించి ఆవిడ విసురుగా లేచి కిచెన్లోకి వెళ్లిపోయింది.

“నీకెందుకురా, నోరు మూసుకునుండక?” అని విదుషి తమ్ముణ్ణి గసిరి తల్లి వెనుక కిచెన్లోకి వెళ్లింది. అక్కడ కన్నీళ్లని తుడుచుకుంటున్న తల్లిని కౌగిలించుకుని, “ఇప్పుడేం కాలేదుగదా!” అన్నది.

“మేమేమో వాణ్ణి కొడుకులాగా చూసుకుంటున్నాం. డెన్వర్‌నించీ వచ్చిన రెణ్ణెల్లదాకా ఆ సంగతి మాకు చెప్పాడేమో చూడు!” అన్నారు భవానిగారు.

విదుషి ఆవిడ చెవిలో, “ఎవరినయినా కలిసి వుంటాడ్లే! ఆ ఎక్సయిట్‌మెంట్లో మరిచిపోయుంటాడు,” అన్నది గుంభనగా. ఆవిడ కళ్లు విస్మయంతో విప్పారి ఏదో అనబోయేంతలో హమీర్ అక్కడికి వచ్చి తప్పుచేసినట్లు నిలబడ్డాడు.

“ఆంటీ! మమ్మీ డాడీ నాకు జన్మనిస్తే, నాకు మరో జన్మ నిచ్చినవాళ్లు మీరు, అంకుల్. ఇదేమీ అంతగా చెప్పాల్సిన విషయంగా గానీ, దాచాల్సిన విషయంగా గానీ అనుకోలేదు. నా తప్పే!” అన్నాడు.

“ఆంటీ ఎమోషనల్ అని నీకు తెలుసుగదా! అంత పట్టించుకోవాల్సినదేం లేదులే! ఏంటి భవానీ అలా డిన్నర్ టేబుల్ ముందునించి లేచిపోవడం? అల్లుడున్నాడన్న సంగతికూడా మరిచిపోయి?” సున్నితంగా మందలించారు మూర్తిగారు అక్కడకు వచ్చి.

“అయాం సారీ ఆండ్రూ!” అన్నారావిడ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటూ.

“ఆర్యూ టేకింగ్ యువర్ మామ్ సంవేర్ డ్యూరింగ్ ది ఇండియా ట్రిప్?” ఆండ్రూ హమీర్‌ని అడిగాడు.

ఆశ్చర్యపోయాడు హమీర్ తన కప్పటిదాకా అలాంటి ఆలోచనే రానందుకు. “స్టూడెంట్‌గా కాలేజీలో వున్నప్పుడు ప్రతీ వింటర్ బ్రేక్‌కి అమ్మదగ్గర కెళ్లినా అప్పుడు నేనేమీ సంపాదించట్లేదు గనుక ఆ నాలుగు వారాలూ ఆమె దగ్గరే ఆ హైదరాబాదులోనే గడిపాను. ఉద్యోగంలో చేరిన తరువాత నాకు దొరికే సెలవు ఏడాదికి రెండు వారాలే అవడం ఆవిణ్ణి నిరాశకు గురిచేస్తోంది ఈ అయిదేళ్లనుండీ. ఇక్కడికి వస్తే నెలల తరబడి నాతో వుండొచ్చు గదా, రమ్మంటే రాదు. ఈ ఏడాదే ఆ సెలవు మూడు వారాలకి పెరిగింది. క్రితం ఏడాది మీ పెళ్లికి వచ్చినప్పుడు  మాత్రమే కొన్నాళ్లు ఇక్కడుంది. యు గేవ్ మి ఎ గ్రేట్ ఐడియా! ఆగ్రాకి తీసుకుపోతాను. నేనుకూడా చూళ్లే దిప్పటిదాకా!’ జవాబిచ్చాడు హమీర్.

అయితే ఆవిడే అతణ్ణి చూడ్డానికి నెల తిరక్కుండానే రావలసి వస్తుందని అతనికి ఆ క్షణాన తెలియదు.

[ఇంకా ఉంది...]