ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఎనిమిదవ భాగం

నవంబర్ 2016

8

యూనివర్సిటీ డైనింగ్ హాల్‌లో మేడ్ టు ఆర్డర్ శాండ్‌విచ్ కోసం లైన్లో నిలబడ్డ హమీర్ తన ముందు నిలబడ్డ ఆమెను చాలాసేపే చూశాడు. తన శాండ్‌విచ్ ట్రేని తీసుకుని, ఆమె ఒక్కతే టేబుల్ దగ్గర కూర్చుని వుండడాన్ని చూసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి, “ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ!” అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. వినబడలేదేమో అనుకుని ఆ లైన్‌ని రిపీట్ చేసి, “ఐ వజ్ స్టాండింగ్ బిహైండ్ యు ఇన్ ది లైన్,” అన్నాడు.

“వాటెబవుట్ దిస్ వ్యూ?” అనడిగింది లేవకుండానే.

“హార్డ్ టు టెల్. ది టేబుల్ ఈజ్ హైడింగ్ పార్ట్ ఆఫిట్,” అన్నాడు ఆ టేబుల్ దగ్గరే ఇంకొక కుర్చీలో కూర్చుంటూ. ఆమె లేచి నిలబడి టేబుల్ పక్కకి వచ్చి అతనికి పూర్తిగా కనిపించేలా నిలబడ్డది. “టర్నెరవుండ్,” అన్నాడు హమీర్. ఆమె తనచుట్టూ తాను తిరిగింది.

“నాట్ బాడ్,” అన్నాడు. “వండర్‌ఫుల్ అనుంటే ప్రెజెంట్ ఇచ్చేదాన్ని!” అన్నదామె.

“వండర్‌ఫుల్,” వెంటనే అన్నాడు.

“నేను చెప్పిన తరువాత అలా అనడానికి సిగ్గులేదా?” షార్ప్‌గా అడిగింది.

“సిగ్గుపడుతూ కూర్చుంటే ప్రెజెంట్స్ దొరకవని నా ఫ్రెండ్ చెబుతూండేవాడు.”

“నిన్ను ఎవరితోనూ ఇక్కడ చూసిన గుర్తులేదే!”

“ఇక్కడ కాదు, హైస్కూల్లో.”

“దట్ మేక్స్ మోర్ సెన్స్. అసలీ పిల్లాడికి మాట్లాడడం వచ్చా అన్న సందేహం కొన్ని క్షణాల క్రితం దాకా వుండేది.”

“పిల్లాణ్ణి పుట్టించగల వయసున్నవాణ్ణి పిల్లాడంటే కోపమొస్తుంది.”

“కోపమొస్తే ఏంచేస్తాడు?”

“పిల్లాణ్ణి పుట్టించగలనని ప్రూవ్‌ చేస్తాడు.”

“ఎప్పుడు పడితే అప్పుడే? ఈ క్షణాన కూడా?”

“ఏముందీ, టేబుల్ క్రింద శాంపుల్ తీసుకుని లాబ్‌కి పంపిస్తే చాలదా?” అనడిగాడు. తను ఆలోచనలో తప్పుచేస్తూ పట్టుబడ్డదని అర్థమైన ఆమె తన పెదాల మీద చిరునవ్వుకి చోటిచ్చింది.

“నీ స్మైల్ బావుంటుంది మీనా,” అన్నాడు హమీర్.

“నన్నెవరో పిలిచినప్పుడు నా పేరు నోట్ చేసుకునుంటావు గానీ, నిన్నెవరూ పిలవగా చూళ్లేదు గత రెండేళ్లల్లో,” మీనా జవాబిచ్చింది.

“నన్ను రెండేళ్లుగా అబ్సర్వ్ చేస్తున్నావన్నమాట!” హమీర్ కెందుకో ఆ క్షణాన కొంచెం గర్వమూ, తనని పట్టించుకుంటున్న ఒక మనిషి వున్నందుకు కొంచెం సంతోషమూ కలిగాయి గానీ వాటిని వెలుపలకు రానివ్వలేదు.

“అలా చేస్తోంది నేనొక్కదాన్నే అని అనుకోకు!”

“నేనంత పాపులర్ అని నాకు తెలియదు!” కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడు.

“పాపులర్ కాదు. ఎక్సెంట్రిక్. లేదా స్పెషల్. నా ఫ్రెండ్స్ ఎవరయినా నువ్వేం చేశావే ఆ బుధ్ధూచేత మాట్లాడించడానికి అనడిగితే నా బాక్ చూపించానని చెబుతాను.”

“ఫ్రంట్ చూసికూడా పారిపోలేదని జతకలుపు.”

” సో ఫార్ ఇట్స్ మై ఫ్రంట్ దట్ ఎట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ లుక్స్. యు ఆర్ ది ఫస్ట్ వన్ టు బి ఎట్రాక్టెడ్ బై మై బాక్. ఇంతకీ నీ పేరేమిటి పిల్లాడా?”

“హమీర్!”

“హమీద్?”

“కాదు, హమీర్!” ‘ర్‌’ని వత్తిపలుకుతూ అన్నాడు. “నేను ముస్లింని కాదు. నార్త్ ఇండియన్నీ కాదు. మా నాన్నకి ఇష్టమయిన రాగం పేరది!” ఎలిమెంటరీ, మిడిల్, హైస్కూళ్లల్లో తన పేరుని గురించి ఎదురయిన ప్రశ్నలన్నింటినీ గుర్తుపెట్టుకుని అన్నింటికీ కలిపి ఒకేసారి జవాబిచ్చాడు. “హమీర్ గొల్లపూడి.”

“మేమూ తెలుగువాళ్లమే. ఐ మీన్ – మా అమ్మా, నాన్న.”

“నువ్వు కూడా సీరియెస్‌గా వుంటావ్‌ గానీ ఇవాళ్లే కొంచెం రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నావ్.”

“నువ్వు నన్నంతగా అబ్సర్వ్ చేశావంటే, వాట్స్ మై స్పెషాల్టీ?” క్యూరియెస్‌గా అడిగింది.

“నీ చుట్టూకూడా పెద్ద గుంపులేవీ వుండకపోవడం!”

“గుంపులంటే నీ కిష్టం లేదా?”

“ఇష్టం లేకపోవడం కాదు, భయం!”

“ఎందుకు?”

“అవసరంలేని విషయాలని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని!”

“వెల్, ఫస్ట్ టైం విల్ బి పెయిన్‌ఫుల్,” అని కొంటెగా నవ్వింది.

“స్పీకింగ్ లైక్ ఏన్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ పర్సన్! బట్, అది నిన్ను టీజ్ చెయ్యడానికి నా డైలాగవ్వాలే?”

“ఐ హావ్ హర్డ్ ఫ్రం అదర్స్. ఐ వజ్ టాకింగ్ అబవుట్ ఫ్రెండ్‌షిప్స్ ఆర్ రిలేషన్‌షిప్స్ – మోస్టాఫ్ ది టైం డోన్ట్ స్టార్ట్ ఆన్ ఎ స్వీట్ నోట్, యు నో? దే మస్ట్ బి కల్టివేటెడ్!”

“లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు స్పెండ్ ఆన్ కల్టివేషన్. ఇట్ ఈదర్ క్లిక్స్ ఆర్ డజన్ట్!”

“ట్రబులల్లా, ప్రాబ్లంస్ అనేవి మొదట్లో మాత్రమే రావు. కానీ అవి ఎదురయినప్పుడు తెలుస్తుంది కల్టివేషన్ అవసరం అని.”

“దాని అవసరం లేకుండానే మాట్లాడుకుంటున్నాం కదా!”

“అవసరం ముందుముందు రాదని కాన్ఫిడెన్ట్‌గా చెప్పలేం. … మరీ సీరియెస్‌గా జరుగుతోంది ఈ కాన్వర్సేషన్. సాయంత్రం నువ్వు ఫ్రీ అయితే నీకు బీర్ కొనిపెడతాను సెలబ్రేట్ చేసుకునేటందుకు.”

“నీ బాక్ వ్యూ బావుందన్న అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికా?”

“దానితోబాటు MCATలో మంచి స్కోర్ వచ్చినందుకు.”

“కంగ్రాట్స్. అయితే, తరువాతి చదువు మెడిసిన్ అన్నమాట!”

“థాంక్స్! అన్నట్టు నీ వయసు 21 దాటిందా? లేకపోతే నిన్ను నా అపార్ట్‌మెంట్‌కి తీసుకుపోవాల్సి వుంటుంది.”

“ఒక క్షణం క్రితందాకా నా వయస్సు ఎప్పుడు 21 అవుతుందా అని ఎదురుచూశాను. ఇప్పుడు మాత్రం ఇంకో వారందాకా అలా జరగనందుకు సంతోషిస్తున్నాను.”

“అపార్ట్‌మెంట్‌లోకి రానిచ్చే ముందర నీ వయసు ప్రూఫ్ చూపించాలి. 21 నిండిందని తెలిసిందనుకో, అప్పుడు నీ మొహంమీదే తలుపేస్తాను.”

“నాకా భయంలేదు. నేను పిల్లాణ్ణి కాదని ప్రూఫ్ చూపిస్తానేమోనని నువ్వే భయపడాలి!”

“పెర్ఫార్మెన్స్ ఏంగ్జయిటీకి గురవుతావేమో జాగ్రత్త! కనీసం ఓ ఇరవైమంది వుంటారక్కడ!”

“వాటెబవుట్ యువర్ బాయ్‌ఫ్రెండ్?”

“వాటెబవుట్ హిమ్?”

“అతను అప్‌సెట్ కాడా?”

“దేనికి?”

“నా పెర్ఫార్మెన్స్‌కి.”

“నీ పెర్ఫార్మెన్స్‌కి నువు అప్‌సెట్ అవకుండావుంటే చాలు. … ఎంతయినా నీకది మొదటిసారిగా!”

“నా గురించి బలే గెస్ చేశావే! స్పెషాల్టీకింద సైకాలజీ సెలెక్ట్ చేసుకుంటున్నావా?”

“సైకాలజీ చదవడానికి మెడికల్ డిగ్రీ అక్కర్లేదు బుధ్ధూ, సైకియాట్రీకి కావాలి! నీగూర్చి ఇక్కడ ఎకనామిక్సూ, ఇంజనీరింగ్, బయాలజీ చదివే దేశీ ఆడపిల్లలందరికీ తెలుసు!”

“నన్నంతగా ఎందుకలా నోటీస్ చేశారో?”

“నువ్వే, ‘హియర్ అయామ్, హియర్ అయామ్’ అంటూ అట్రాక్ట్ చేశావ్!”

“ఎప్పుడు?”

“ఒకరోజు స్టూడెంట్ సెంటర్లో. దాదాపు ఏడాదిన్నర క్రితం అయ్యుంటుంది. నీ ఫస్ట్ సెమెస్టర్లో.”

“పియానో వాయించినప్పుడా?”

“మూన్‌లైట్ సొనాటా.”

“అదే ఇక్కడ మొదటిసారీ, చివరిసారీను!”

“మళ్లీ వాయించలే దెందుకని?”

“అప్పుడు అక్కడక్కడా కూర్చుని మాట్లాడుకుంటున్నవాళ్లూ, చదువుకుంటున్నవాళ్లూ అందరూ వాయించడం అయిపోగానే చుట్టూమూగారు. కొందరు తరువాతకూడా పలకరించబోయారు.”

“కానీ నువ్వెవరితోనూ మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. అందుకే నీకు ఏరొగెంట్ అనీ, ఎక్సెంట్రిక్ అనీ పేరు.”

“అందుకే నాదారిన నేను బతకగలిగాను.”

“బట్, దట్ డే. ఇట్ వజ్ సో గుడ్. డిడన్ట్ ఇట్ గివ్యూ పీస్?”

“నో. మా డాడీని గుర్తుకుతెచ్చి ఫ్రెష్‌గావున్న గాయాన్ని బాగా మండించింది. హి యూజ్డ్ టు ఎంజాయిట్ ఎ లాట్.”

“డు యు ప్లే ఇట్ వెన్ యు గో హోమ్?”

“నో. దేరీజ్ నో పియానో ఎట్ హోమ్ … దేరీజ్ నో హోమ్.”

మీనా షాకయింది. అతను తండ్రి గూర్చి “యూజ్డ్ టు” అని పాస్ట్ టెన్స్ వాడిన సంగతి గుర్తుకొచ్చింది. మాటలకోసం వెదుక్కుంటూ, “యువర్ మామ్?” అని మధ్యలో ఆగిపోయింది.

“షి లివ్స్ ఇన్ హైదరాబాద్. బట్ దట్స్ నాట్ మై హోమ్. మై హోమ్ వజ్ వేర్ ఐ గ్రూ అప్. వేర్ మై మామ్ అండ్ డాడ్ లివ్డ్. అండ్ వేర్ ఐ హాడ్ ఎ పియానో!”

అతని గుండెలోతుల్లో దాక్కున్న వ్యధ ఆమెకు లీలామాత్రంగా కనిపించి ఆమె చలించి, టేబుల్‌మీద పెట్టివున్న అతని కుడిచేతిని తన రెండుచేతులతోనూ పట్టుకుంది ఓదార్పు నివ్వడాని కన్నట్టు. అంత ఇంటిమేట్‌గా అనిపించిన అనుభవం దొరకడం హమీర్‌కి తండ్రి కనిపించకపోయిన తరువాత అది మొదటిసారి. ‘సమ్‌వన్ టు లీన్ ఆన్?’ అని ఆశపడ్డాడు.

***

“ఇంకనుంచీ నీ పేరు నీనా,” అన్నాడు హమీర్ పక్కకు తిరిగి పడుకునున్న మీనా నడుముని కుడిచేత్తో చుట్టి దగ్గరకు లాక్కుని వెనకనుంచీ గట్టిగా హత్తుకుంటూ. ఆమె చెప్పినట్లుగా టెక్నికల్ టర్మ్ మైక్రోబయోమ్ అవచ్చేమో గానీ, ఆమె శరీర పరిమళం అతని నాసికాపుటాలకీ, ఆమె స్పర్శ అతని శరీరంలోని అణువణువుకూ పరిచయం.

“ఎందుకనో?” మీనా అడిగింది.

“నీవు” అంటూ తన కుడిచేత్తో ఆమె కుడిచేతి చూపుడువేలిని పట్టుకుని ఆమె ఛాతీమధ్యలో తాకించి, “నాదానివి” అంటూ అదే వేలిని తన పెదాలకి ఆనిస్తూ అన్నాడు. “ఆ పదాల్లోని మొదటి రెండక్షరాలనీ కలిపిన షార్ట్‌ఫామ్ అది!”

“సో లవ్‌లీ!” అని ఆమె అతనివైపు తిరిగి అతని ఎడమచేతిమీద తలని ఆనించి అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది – “నేను నిన్ను ‘నానీ’ అని పిలిస్తే అర్థవంతమవుతుందా?”

“నాయొక్క నీవు? అర్థవంత మయినా కాకపోయినా నన్నట్లా ఇప్పటిదాకా పిలిచిన వాళ్లెవరూ లేకపోవడంవల్ల అది స్పెషలవుతుంది!” అన్నాడు.

“ఐ లవిట్!”

“నాలుగురోజులు నన్ను చూడకుండా వుండడం బావుంటుందా?” అంటూ అతను ఆమె ఛాతీమీద చేతిని ఆనించి, “ఇది నా హోమ్ అని చెప్పిన తరువాత నువ్వెళ్లిపోతే మళ్లీ హోమ్‌లెస్ అవుతాను గదా!” అన్నాడు.

“కాదు. వెకేషన్ కెళ్లిన ట్లవుతావు!” అమాని జవాబిచ్చింది.

“ఐ డోన్ట్ లైకిట్.”

“నిన్ను నాతో తీసుకెడదామంటే మా మమ్మీకి కోప మొస్తుందేమోనని భయం. చెబితే రానివ్వదు. చెప్పకుండా తీసుకెడితే సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది.”

“పోనీ వెళ్లకు. ఇక్కడే వుందాం. నీ డార్మ్‌స్ క్లోజ్ చేస్తేనేం? నా అపార్ట్‌మెంట్‌లో వుందువుగాని. వుయ్ కెన్ బి ఇంటిమేట్ ది హోల్ ఫోర్ డేస్!”

“మా మామ్‌తో అది కుదిరేది కాదు. సెమెస్టర్ బ్రేక్స్‌లో కూడా వెళ్లకపోతే – షి విల్ గో నట్స్. నాకోసమే బ్రతుకుతూంటుంది. స్పెల్లింగ్ బీ అనీ, హిస్టరీ బీ అనీ చిన్నప్పటినించీ తోమింది. దానికి తోడు కరాటే, టెన్నిస్!  నాకు సిబ్లింగ్స్ వుండుంటే ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదు. నా పెళ్లికోసమని జ్యుయెల్రీని నా చిన్నప్పటినించే కొనడం మొదలుపెట్టింది తెలుసా? మెడిసిన్లో సీట్ రాకపోతే వచ్చే సెమెస్టర్లో గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్లిచేసేస్తా ననేది.”

“అయితే ఇంకేం, మెడిసిన్లో సీటు రాలేదనుకుని నీ స్ప్రింగ్ సెమెస్టర్ అవగానే పెళ్లిచేసేసుకుందాం.”

“రెండు ప్రాబ్లంస్. మొదటిది, నీ బాచెలర్స్ పూర్తికావడానికి అప్పటికి ఇంకా ఏడాది వుంటుంది. రెండవది, మెడిసిన్ పూర్తయేదాకా మా మామ్‌ కుదరనివ్వదు. నా గోల్స్ అన్నీ చిన్నప్పటినించే సెట్‌చేసి వుంచింది.”

“ఇంకా నాలుగున్నరేళ్లా? నో వే!” అని ఆగి, “అసలు పెళ్లెందుకు చేసుకుంటారు? ఇందుకేగా!” అన్నాడు ఆమెని గట్టిగా కౌగిలిలో బంధిస్తూ.

“పెళ్లికే కాదు, ఫస్ట్ టైం కలయికకి కూడా ముహూర్తాలు పెడతార్ట తెలుసా?” అన్నది మీనా.

“మరి దాన్ని ఆల్రెడీ వయొలేట్ చేసేశాం కదా!”

“అందుకని నిన్ను ఏకంగా మా యింట్లో నా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాలా?”

“దట్స్ ఎ గ్రేట్ ఐడియా! ఈసారి థాంక్స్‌గివింగ్‌కి వాళ్లింటికి రావట్లేదనీ, నీ వెనుక మీ యింటికొస్తున్నాననీ మూర్తి అంకుల్‌కి చెబుతాను. ”

“మా మామ్ కేమని చెప్పాలి?”

“ఒక హోమ్‌లెస్ పర్సన్‌కి హోమ్ ఇస్తున్నానని చెప్పు!”

“ఆవిడ నిన్ను చింపిరిజుట్టుతో, పెరిగిన గడ్డంతో, చిరిగున్న బట్టలతో, చేతిలో ఒక బౌల్‌తో ఊహించుకుంటుంది.”

“ఆ గెటప్ తెచ్చుకోవడం చాలా ఈజీ! ఏ పాన్ హాండ్లర్‌కి పది డాలర్లిచ్చినా ఇస్తాడు. కాకపోతే ఇరవై. రిప్లేస్‌మెంట్ బట్ట లిచ్చిన తరువాతలే!”

“ఆ గెటప్‌తో నిన్ను మా ఇంటి ఛాయలకే రానివ్వదు.”

“మరెలా? ఈ కాలేజీలో నీకూ నాకూ కలిపి ఇదే చివరి థాంక్స్‌గివింగ్ బ్రేక్. వచ్చే ఏడాది నేనిక్కడే వున్నా నువ్వు వేరే కాలేజీలో వుంటావు గదా!”

“నీ బాచెలర్స్ అవగానే నాకు దగ్గరగా ఉద్యోగాన్ని వెదుక్కుని వస్తావులే అని అనుకున్నా, ముందు నీ సీనియర్ యియర్ పూర్తిచెయ్యాలి గదా! ఆ ఏడాదిలో నన్నల్లుకోకుండా ఎలావుంటావ్?”

“ఓ మానెకిన్‌ని తెచ్చుకుంటా. అదయితే ఎదురు చెప్పదు. … మరి నువ్వెవరిని అల్లుకుంటావ్?”

“ఒక మాన్‌ని.”

“ఆఁ?”

“డోన్ట్ వర్రీ. ఎవరిని అల్లుకున్నా అది నువ్వే అని అనుకుంటాను.”

“నో వే! దిస్ హోమ్ ఈజ్ మైన్ అండ్ మైన్ ఓన్లీ!” అంటూ ఆమె ఛాతీమీద తల పెట్టుకున్నాడు.

“… పోనీ, నిన్ను ఒక ఫ్రెండ్‌లాగా తీసుకెడతా. అంటే – నీకు గెస్ట్ బెడ్రూం. మా యింట్లో వున్నంతసేపూ నో టచింగ్!”

“అది మరీ భయంకరమయిన కండిషన్. నో బెనిఫిట్స్? ఎదురుగ్గా కనిపిస్తూ ముట్టుకోకూడదంటే అది టార్చర్. దానికి బదులు నేను మా అంకుల్ వాళ్లింటికి వెళ్లడమే బెటర్.”

“ఓకె. ఓన్లీ సీక్రెట్ టచింగ్ విల్ బి ఎలవుడ్.”

“అలా అని నువ్వు చెప్పకపోయినా అవి జరిగేవే. మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్!”

“అట్రాక్టివ్‌గా చేద్దామని ప్లాన్ వున్నా అది ఇప్పుడే చెప్పను. యు హావ్ ఎ ఛాయిస్. మీ అంకుల్ వాళ్లింటికి వెడతావో, నాతో వస్తావో నీ యిష్టం!”

“అంత క్లియర్‌గా చెప్పిన తరువాత ఏం చేస్తాను? ముందే చెబుతున్నా. చివరికి అక్కడ దూరంగా వుంచి, సారీ అని చెప్పావనుకో, దానికి పనిష్మెంట్‌గా తిరిగొచ్చిన మరునాడు – అంటే సోమవారంనాడు – మొత్తం క్లాసు లెగ్గొట్టించి నిన్నల్లుకుపోతా!”

“దట్స్ రీజనబుల్. ముందు మమ్మీకి ఫోన్ చెయ్యనివ్వు,” అని తన సెల్ తీసుకుని ఇంటి నంబర్ డయల్ చేసింది. “మామ్, అయాం బ్రింగింగ్ ఎ హోమ్‌లెస్ పర్సన్ విత్ మి ఫర్ ది బ్రేక్ నెక్స్ట్ వీక్!”

“నీ కేమయినా బుధ్దుందటే? హోమ్‌లెస్ పర్సన్స్‌కి దూరంగా వుండాలని తెలియదూ? పైగా ఇంటికి కూడా తెస్తా నంటున్నావు. చారిటీకి కూడా హద్దూ పద్దూ వుండాలి! ఇదంతా ఆయన పెంపకంవల్ల వచ్చిన గోల. నా మాటెవరు వింటారు గనుక? మీ డాడీతో చెప్పుకో.  ఆ నాలుగురోజులూ నేనే ఎక్కడికన్నా పోతాను!” అన్నదావిడ అవతలిపక్కనుంచీ.

“రిలాక్స్ మామ్. ఈ బ్రేక్‌కి ఎవరన్నా నాతోబాటు ఇంటికొస్తున్నారంటే వాళ్లకి ఈ దేశంలో హోమ్ లేనట్టేగా!”

“ఫారిన్ స్టూడెంటా? అదేదో ముందే చెప్పొచ్చుగా! అమ్మాయేనా?”

“కాదు, అబ్బాయి!”

“ఏ నల్లవాణ్ణో, చుంచుమొహంవాణ్ణో పట్రావట్లేదు గదా!”

“మా దేశంవాడు,” “మా”ని వత్తి పలుకుతూ అంది.

“అంతేలే. మా దేశం వేరు, మీ దేశం వేరు!”

“అవును మరి. మా దేశం అమెరికా, మీ దేశం ఇండియా.”

“నీ బాయ్‌ఫ్రెండా?”

“అన్నీ అనుమానాలే!”

“బాయ్‌ఫ్రెండంటూ చదువు నాశనం చేసుకుంటావని నా భయం!”

“దానికి ఫెర్టిలైజర్ వేసి నీళ్లు పోస్తూండు. తొందర్లోనే పెరిగి, పెద్దై కాయలు కాస్తుంది.”

“చాలా బావుందమ్మా, నీ వ్యంగ్యం! నువ్వు తల్లివయిన తరువాత చూస్తా నువ్వు నీలాంటి పిల్లలతో ఎలా డీల్‌చేస్తావో!”

“ఆవిడ అంత కుతూహల పడుతోంది గదా, మరి ఆలస్యమెందుకు?” అన్నాడు హమీర్ ఆమెని నడుముకు గట్టిగా హత్తుకుంటూ.

“బై మామ్!” అని చెప్పి ఫోన్ హాంగ్ చేసి, “నాట్ నౌ! ఐ హావ్ ఎ ప్రాజెక్ట్ టు ఫినిష్,” అంటూ అతని చేతిని పక్కకుతీసి లేవబోయింది.

“మూన్‌లైట్ సొనాటా ప్లేచేస్తా!”

“నౌ యు హావ్ టెంప్టెడ్ మీ! థర్డ్ మువ్‌మెంట్!!”

“అది వయొలెంట్‌గా వుంటుందంటావు గదా!”

“వయొలెంట్‌గా కాదు. విగరస్‌గా! సమ్‌టైమ్స్ ఐ లైక్ ది ఫస్ట్ వన్, సమ్‌టైమ్స్ ది థర్డ్!”

“ఓకె దెన్! యువర్ టో టు షోల్డర్ ఈజ్ ది పర్ఫెక్ట్ కీబోర్డ్ లెంగ్త్!” అని పక్కమీంచి లేచి కుర్చీని బెడ్‌పక్కకి లాగి అందులో కూర్చున్నాడు. మీనా మంచంమీద చివరకు జరిగి అతనికి దగ్గరగా వెల్లకిలా పడుకుంది. హమీర్ వేళ్లు ఆమె శరీరంమీద నాట్యంచెయ్యడం మొదలుపెట్టాయి.

***

“వీళ్లిద్దరూ ఏంచేస్తున్నారు?” అంటూ చేతులు తుడుచుకుంటూ వచ్చి భర్త పక్కన కూర్చున్నారు మీనా తల్లి వనజగారు.

“బేస్‌మెంట్లో సినిమా చూస్తున్నట్లున్నారు. శబ్దాలు వినిపించడంలా?” జవాబిచ్చారు రావుగారు.

“సినిమానే చూస్తున్నారో లేక టీవీ సౌండ్ పెద్దగా పెట్టి వెధవ్వేషా లేస్తున్నారో ఎవరికి తెలుసు?”

“అలా వెయ్యాలనే అనుకుంటే ఇక్కడికి రావలసిన అవసరమే లేదు. యూనివర్సిటీలో ఏంచేస్తున్నారో నువ్వు చూడొచ్చావా?”

“తల తిరుగుడు మాటలు కట్టిపెట్టి వాళ్లని పైకొచ్చి కూర్చుని ఆ చూసేదేదో ఇక్కడే కూర్చుని చూడమనండి!”

“దాని పక్కన కూర్చుని సూపర్‌వైజ్ చేసే కాలం దాటి అయిదేళ్లయింది. నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే మాట్లాడకుండా వుండడమే ఉత్తమం!”

వనజగారు కాసేపు ఏం మాట్లాడలేదు. తరువాత, “మేమిద్దరం పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాం అంటుందేమో!” అన్నారు.

“మంచిదేగా! పెళ్లిసంబంధాలు వెదికే పని తప్పుతుంది. ఎంతయినా తెలుగువాళ్ల పిల్లాడు.”

“ఏం మంచిది? దీనికంటే ఒక ఏడాది చిన్న! ఇదేమో డాక్టరవబోతోంది. అతను డిగ్రీ పూర్తిచేసి వెంటనే ఉద్యోగంలో చేరడానికే ఇంకో ఏడాదిన్నర పడుతుంది! ఇటు వయసులోనూ, అటు చదువులోనూ, పైగా సంపాదించే శక్తిలోనూ – ఏ విధంగా చూసినా వరహీనమే!”

“అన్నింటినీ ఆర్థిక సంబంధాలతో ముడిపెట్టకు. మీ చెల్లెలు డాక్టర్. బాంక్ ఉద్యోగిని చేసుకోలేదూ?”

“ఎప్పటిమాట చెబుతున్నారు? అప్పుడంటే తప్పక. ఇప్పుడంత ఖర్మేం పట్టింది?”

“నీకు అల్లుడుగా వచ్చేవాడు డాక్ట రయితే చాలు – తెల్లవాడయినా, నల్లవాడయినా!”

“నల్లవాళ్లనీ, ఆ చైనీసు వాళ్లనీ పొరబాటున కూడా ఒప్పుకోను. దేశం గొడ్డుపోయినట్లు ఇంతమంది ఇండియన్లే వుండగా ఇంకొకళ్ల అవసర మేముంది?”

“నీతో వాద నెందుకు గానీ, అది వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం!”

“… పాపం హమీర్‌ది విషాద గాధ కదా!”

“పోయినవాళ్లు సుఖంగా వుంటారు, బతికున్నవాళ్లకే చచ్చే చావు అని ఎక్కడో చదివిన గుర్తు. అతనికి చిన్నవయసులోనే ఇంత కష్టం!”

“అతన్ని చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు.”

“ఎందుకనో?”

“ఎందుకనేమిటి? మామగారి గోలే లేదు. అత్తగారా ఇండియాలో వుంటుంది. అందుకని ఆ పిల్ల తల్లిదండ్రులున్న వూళ్లోనే గనక కాపురం పెడితే ఎంచక్కా వాళ్లింట్లోనే వుండొచ్చు – ఇల్లరికంలాగా అన్నమాట. వేరే వూళ్లో వున్నా కూడా, క్రిస్మస్‌కి ఒకళ్లింటికీ, థాంక్స్‌గివింగ్‌కి ఇంకొకళ్లింటికీ స్ప్లిట్ చేసుకోవాల్సిన అవసర ముండదు.”

“హోమ్‌లెస్ పిల్లాడిమీద నీ కన్ను అప్పుడే పడినట్టుందే!”

“నేనేం చేసుకుంటాను? ఇంకెవరయినా సంబంధాలు చూస్తుంటే చెబుదామని, అంతే! అవునూ, అతణ్ణి పట్టుకుని హోమ్‌లెస్ అంటుందేమిటి ఇది? నేనింకా ఎవరో పిచ్చోడయ్యుంటా డనుకున్నాను.”

“అతనికి అందరిలాగా అయాం గోయింగ్ హోమ్ అని చెప్పడానికి లేదుగదా, అందుకని. అంతే తప్ప ఏ బ్రిడ్జీల క్రిందో పడుకుంటున్నాడని కాదు. యూనివర్సిటీలో ఇది కడుతున్నంత ఫీజూ కడుతున్నాడుగా!”

“ఏమో, కడుతున్నాడో, లేక అదన్నట్టుగా ‘హోమ్‌లెస్,’ అని జాలిపడి యూనివర్సిటీ వాళ్లు స్కాలర్షిప్ యిస్తున్నారో! ఆ రెడ్డిగారి భార్య చెప్పినట్టు దీనిలాంటివాళ్లకి స్కాలర్షిప్పు లివ్వరు – డబ్బులు కట్టగలం గదా అని మనలాంటివాళ్ల చేత మొత్తం కక్కిస్తూంటారు!”

“మిగిలిన వాళ్ల సంగతి తెలియదు గానీ, ఇతను మంచి కుర్రాడి లాగానే వున్నాడు. మీనాలాగే స్వంత ప్రతిభతో ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాడు. కష్టాల్లో వున్న ఒక తెలుగు వాళ్లబ్బాయికి అలాంటి స్కాలర్‌షిప్ ఇస్తే, ఆ యూనివర్సిటీ వాళ్లు మంచిపనే చేశారని అనుకోవాలి.”

“అంతేలెండి. మీరు నన్నెప్పుడు సపోర్టు చేశారు గనక ఇప్పుడు చెయ్యలేదనుకోవడానికి! … నా బాధ మీకర్థం కాదు. ఇంతకాలం ఎవరినీ ఇంటికి తీసుకురానిది ఇప్పుడితణ్ణి పట్టుకొచ్చిందంటే నాకు వర్రీగా వున్నది. వెళ్లేటప్పుడు చెబుతాను వెధవ్వేషా లెయ్యకుండా బుధ్ధిగా చదువుమీద కాన్సన్‌ట్రేట్ చెయ్యమని!”

“నువు చెప్పేది చెబుతావు, అది చేసేది ఎలాగో చెయ్యక మానదు. నా సలహా అల్లా, నువు ఏమీ మాట్లాడకుండా వుండడం. ఇంకో ఆర్నెల్లల్లో ఎలాగో మీనా వర్జీనియా టెక్ వదిలి వెళ్లక తప్పదు – అక్కడ మెడిసిన్ ప్రోగ్రాం లేదు కాబట్టి. హమీర్‌కి చదువు పూర్తిచెయ్యడానికి ఇంకో ఏడాది ఎలాగో పడుతుంది. లాంగ్ డిస్టేన్స్ రిలేషన్‌షిప్స్ కాలాన్ని తట్టుకుని సర్వైవ్ అయ్యేవి చాలా తక్కువ అని ఎక్కడో చదివిన గుర్తు. పైగా, మెడిసిన్లో దీనికి ఊపిరి సలపనంత వర్కెలాగో వుంటుంది. అందుకని నీకు సమస్య వుండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ నిలిచిందనుకో, ఆ దూరాన్ని తట్టుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికినందుకు సంతోషించి, అవార్డుగా పెళ్లి చేసేద్దాం!” అన్నారు రావుగారు.

ఆయనతో వాదించి లాభం లేదని అనుకున్నారో, లేక మీనా తన మాట వింటుందన్న నమ్మకంతో వున్నారో గానీ, వనజగారు ఆయనను ఖండించలేదు. అలాగని సైలెంట్‌గా వున్నంత మాత్రాన ఆవిడ ఒప్పుకున్నట్టే నని ఆయన భ్రమపడడానికి ఆవిడతో గల సంబధం ఆ క్రితం రోజు నించీ మొదలవలేదు గదా!

ఇంకా ఉంది..