ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఏడవ భాగం

అక్టోబర్ 2016

ఫిబ్రవరిలో రెండవ శనివారం. రోజంతా ఫ్రీజింగ్‌కన్నా తక్కువగా వున్న టెంపరేచర్ సాయంత్రమయ్యేసరికి ఇంకో ఇరవై డిగ్రీలు క్రిందకు పడిపోయింది. హమీర్ అపార్ట్‌మెంట్‌లో మాత్రం అమాని చలిమంట లాగా అతణ్ణి చుట్టబోతోంది.

“మామ్ మూర్తి అంకుల్ వాళ్లింట్లో వుండడం మంచిదయింది,” అనుకున్నాడు హమీర్.

ఆరోజు పొద్దున్న అమాని టెక్స్ట్ పంపింది సాయంత్రం కలవాలంటూ – అతని అపార్ట్‌మెంట్లో. కాలికి కట్టు విప్పినాగానీ అతను తల్లితోబాటు ఇంకా మూర్తిగారింట్లోనే వుంటున్నాడు – వాళ్లు తమకీ కాలక్షేపంగా వుంటోందని బలవంతం చెయ్యడంవల్ల. రోహిత్ ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత అపార్ట్‌మెంట్ తీసుకుని వెళ్లిపోయాడు. అందుకని భవానిగారికి కూడా సరోజగారు అక్కడ వుండడం మంచి కాలక్షేపాన్నిస్తోంది.

జనవరిలో రోమియో అండ్ జూలియెట్ చూసిన తరువాత మళ్లీ అమాని వద్దనుంచీ మెసేజ్‌లేవీ లేవు ఆరోజు పొద్దున్న దాకా. అందుకే అమాని అపాయింట్‌మెంట్ ఇవ్వగానే హమీర్ ఎగిరి గంతేసి, సరోజగారు “ఇంత చల్లగా వున్నప్పుడు వెళ్లడం అంత అవసరమా?” అని అడ్డు తగుల్తున్నాగానీ అక్కణ్ణించీ బయటపడ్డాడు.

అమాని చెప్పిన సమయానికి గంట ముందుగానే అపార్ట్‌మెంట్‌కి చేరి, బయటినించీ దాన్లోకి అడుగుపెట్టేవాళ్లకి వింటర్ జాకెట్లకే కాక స్వెట్టర్లకి కూడా అవసరమే లేకుండా వుండేలా – ఇంకా చెప్పాలంటే స్వెట్టర్లు వేసుకునుంటే ఆ వేసుకున్నవాళ్లకి చెమటలు పొయ్యడమే కాక మంటలు కూడా పుట్టేలా థర్మోస్టాట్‌లో టెంపరేచర్‌ని సెట్ చేశాడు. తను క్యాజువల్‌గా వున్నానని చెప్పడాని కన్నట్టు షార్ట్, పల్చగా వుండే టీషర్టూ వేసుకున్నాడు. వచ్చేటప్పుడు 7-ఎలెవెన్‌లో ఆగి తెచ్చిన బీర్ సిక్స్ పాక్‌ని రెఫ్రిజిరేటర్లో పెట్టి, వైన్ బాటిల్‌ని కిచెన్ కౌంటర్‌మీద పెట్టాడు. అమాని తనని ఎందుకు కలవాలన్నదో తెలియకపోయినా అదంత ముఖ్య మనిపించలే దతనికి. అంతకన్నా కూడా, ఆమెని ఇంటిమసీలో నెక్స్ట్ స్టెప్‌కి ఎలా తీసుకెళ్లాలన్న ప్రశ్నేఅతని మదినిండా కమ్ముకున్నది. పైగా, ఆమె కలిసినప్పటినించీ ఆమె తన బ్రెస్ట్స్‌గూర్చి అడగడం, ఇంటికి తీసుకెడితే ఏంచెయ్యా లనుకుంటాడో చెబుతూండడం అతనికి ఆ నెక్స్ట్ స్టెప్ ఎంతో దూరంలో లేదనిపించేలా చేసింది. సోఫాలో కూర్చుని టీవీని ఆన్‌చేసి అన్య మనస్కంగానే చూస్తూ ఒక బీర్ పూర్తిచేశాడు.

కాలింగ్‌బెల్ శబ్దం వినగానే హమీర్ ఎగిరి గంతేసి లేచి వెళ్లి తలుపు తీసి చాలా క్యాజువల్‌గా వున్నట్టు కనిపించేలా నటిస్తూ అమానిని లోపలకు ఆహ్వానించాడు. ఆమె లోపలకు రాగానే తన హాండ్‌బాగ్‌ని సోఫా పక్కన పెట్టి, వింటర్ జాకెట్‌ని విప్పి అతని చేతికిచ్చింది. అతను దాన్ని క్లోజెట్లో తగిలించి వచ్చేసరికి అమాని స్వెటర్‌ విప్పింది.  దానికింద వున్న పల్చని, శరీరాన్ని హత్తుకుంటూ క్రిందకు జారుతున్న పింక్ కలర్ షర్టుని తను అంతకుముందు ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్టు అతనికి అనిపించింది. దానికింద బ్లాక్ స్కర్ట్.

“కెన్ ఐ ఆఫర్ యు సమ్‌థింగ్ టు డ్రింక్?” అని అడిగి వెంటనే నాలిక కరచుకున్నాడు. దానికి కారణం, ఆ షర్టుని కూడా తొలగించబోతున్న ఆమె అతని మాటలకి ఆ పనిని విరమించడం, ఆ షర్టుకీ ఆమె వక్షానికీ మధ్య మరే ప్రతిబంధకాలూ లేవని అతనికి స్పష్టంగా కనిపించడం.

ప్రశ్నార్థకంగా చూసిన ఆమె కళ్లకి,”బీర్? వైన్?” అని నోటితో జవాబిచ్చాడు. ఒక్కక్షణం ఆలోచించి, “వైన్,” అన్నది అమాని.

అది జారిపోయిన ఆపర్చ్యూనిటీ కాక జస్ట్ డిలేడ్ మాత్రమే అయ్యుంటుందని ఆశిస్తూ అతను రెండు వైన్ గ్లాసుల్లో వైన్‌ని పోసి ఒకదాన్ని ఆమెకిచ్చి, తను ఒకదాన్ని పట్టుకుని “చీర్స్!” అన్నాడు. ఆమె మెడిసిన్‌ని తీసుకున్నట్టుగా రెండు గుక్కలు వేసి ఆ గ్లాస్ ని పక్కన టేబుల్ మీద పెట్టి, లేచి నిల్చుని షర్ట్‌ని తొలగించి సోఫామీద వేసింది. హమీర్ బయటపడ్డ ఆమె నిండైన వక్షాన్ని చూస్తూ ఏం మాట్లాడాలో అర్థంకాక నిలబడ్డాడు. అమాని అతని చేతిలోని గ్లాస్‌ని పక్కన టేబుల్‌మీద పెట్టింది. అలా వంగుతున్నప్పుడూ, లేచి నిలబడుతున్నప్పుడూ తనలో కలిగించిన భూకంపాలని సృష్టించిన వక్షసంపదని తనివితీరా చూడ్డానికి అతనికి అవకాశం ఇవ్వకుండానే ఆమె తన చేతులతో అతని చేతులకి ఆ సంపద నిందించి, అతని పెదాలకి తన పెదాలని అందించడానికి కాలి మునివేళ్లపై నిలబడి గడ్డాన్ని పైకెత్తింది. అతని పెదవులు ఆమె పెదవులని తాకేటంతలో అతణ్ణి రెండు చేతులతోనూ వెనక్కు తోసి, సోఫామీదకి విసిరేసిన షర్టుని తీసుకుని దానితో ఛాతీని కప్పుకుంటూ సోఫాలో కాళ్లు పెట్టి ముడుచుకుని కూర్చుని, “ఐ కాన్ట్ గో త్రూ విత్ దిస్!” అని కళ్లు మూసుకుంది. ఆమె కళ్లనుంచీ నీళ్లు ధారగా కారడం హమీర్‌కి కనిపించింది.

ఆ పరిణామానికి విస్తుపోయిన హమీర్ మెల్లగా వెళ్లి ఆమె పక్కన సోఫాలో కూర్చుని ఒకచేత్తో ఆమె జుట్టులో వేళ్లుపెట్టి దువ్వుతూ, “వై నాట్?” అని మాత్రం అనగలిగాడు.

“బికాజ్ అయామ్ యూజింగ్ యు. అయామ్ ఎబ్యూజింగ్ యువర్ ట్రస్ట్!” అమాని జవాబిచ్చి, సోఫాలోనే అతనివైపుకు వంగి అతని ఒళ్లో తలపెట్టి, పక్కకు తిరిగి ముడుచుకుని పడుకుంది.

తన కుడిచేత్తో ఆమె కుడిభుజాన్ని నిమురుతూ, “వేర్ డజ్ ది క్వశ్చన్ ఆఫ్ యూజింగ్ ఆర్ ఎబ్యూజింగ్ కమ్ ఫ్రం? … యు నో, వుయ్ విల్ బి పార్ట్నర్స్! యు హర్డ్ ది థింగ్ అబవుట్ ది గూస్ అండ్ ది గాన్‌డర్ – రైట్?” మాటలని వెదుక్కుంటూ, ఆగిపోయిన ప్రోగ్రాంని మళ్లీ కొనసాగించాలని ప్రయత్నిస్తూ అన్నాడు.

ఆమె అలాగే పక్కకు తిరిగి వెల్లకిలా పడుకుని తిన్నగా అతని మొహంలోకి చూసింది. ప్రస్ఫుటంగా కనిపించిన ఆమె నల్లని కనుబొమలూ, మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్లూ, పొడవైన ఐలాషెసూ, సన్నని ముక్కూ, పల్చని పెదాలూ అతణ్ణి పిచ్చెక్కించాయి. అతను కుడిచేతి చూపుడువేలికి ఆమె పెదాల వంపుని పరిచయం చేసినా, తన చేతివేళ్ల వెనకభాగానికి ఆమె చెక్కిళ్ల మెత్తనిదనాన్ని నిమిరుతూ చెప్పించుకున్నా, ఆమె తన ఒడిలో తలపెట్టి అలాగే సోఫాలో పడుకుని వుండడం అతనికి ఇది స్కెడ్యూల్డ్ ప్రోగ్రామ్‌లో చిన్న లల్ మాత్రమే అన్న ధైర్యా న్నిచ్చింది.

“నేను ఫోన్లో నీతో మాట్లాడకపోవడం, టెక్స్ట్ మెసేజీలని మాత్రమే పంపడం, నేను కలవాలనుకున్నప్పుడే నిన్ను కలవడం – వీటివల్ల నేనో తిక్కల్దాన్ని అని నీకు అనిపించలేదా?” అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది అమాని.

“నాట్ యూజువల్ బిహేవియర్! అలాగని దాన్ని క్రేజీ అని అనలేనుగదా!”

“ఈ ఆర్నెల్లల్లో అయిదుసార్లు మాత్రమే నిన్ను కలవడం నీకు కోపం తెప్పించలేదా – ఏమిటీ తనో పెద్ద ప్రిన్సెస్‌లా బిహేవ్ చేస్తోందీ అని?”

“నువ్వు పక్కనుంటే బాగుండేది అని చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా యాక్సిడెంట్ తరువాత. ఒక వారం తరువాత మా అమ్మ వచ్చినా లోన్లీగా ఫీలయిన మాట మాత్రం నిజం. ఐ విష్‌డ్ యు వర్ దేర్! షి ఈజ్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ యు.”

“అందుకనే, నిన్ను స్కేటింగ్‌కి తీసుకెళ్లిన తరువాత గిల్టీగా ఫీలయ్యాను. స్విమ్మింగ్‌కి తీసుకెళ్లిన తరువాత మరికాస్త. బోట్‌రైడ్‌కెళ్లి, ముద్దుపెట్టిన తరువాత ఇంకొంత. ఇప్పుడయినా నాగూర్చి నీకు పూర్తిగా చెప్పకుండా ఇందాక మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తిచేసుంటే ఆ గిల్ట్ భారాన్ని మొయ్యడం ఇంక నావల్ల కాదనిపించింది. … నా బకెట్ లిస్ట్‌లోని ఐటంస్‌కి చెక్ మార్కులు పెట్టడానికి నిన్ను వాడుకున్నా నిప్పటిదాకా!” అని దృష్టిని అతని కళ్లమీంచి తప్పించింది.

“ఏ కాన్సర్‌తోనో లేక హార్ట్ ప్రాబ్లమ్‌తోనో కొద్ది రోజుల్లోనో లేక కొద్ది వారాల్లోనో టపా కట్టేస్తున్నానని చెప్పవుగదా?” అన్నాడు అపనమ్మకానికి కొద్దిగా హాస్యాన్ని మేళవించి.

“కాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ బాధ పెట్టేది ఒక్క రోగిని మాత్రమే. అంతకన్నా ఘోరమైనదాన్ని ఆపాలనివున్నా గానీ, నిస్సహాయతచేత నా పరిమితుల్లో నేనుంటూ లైఫ్‌లో సింపుల్ ప్లెజర్స్ రుచిచూద్దామని నేను గత ఆర్నెల్లుగా చేస్తున్న ప్రయత్నమిది!”

“కాన్సర్‌నీ హార్ట్ ప్రాబ్లంస్‌నీ మించిన సమస్య లేముంటయ్?” అపనమ్మకంగా అడిగాడు హమీర్.

“ఆ ప్రాబ్లమ్ పేరు ముదస్సర్.”

“నిన్నేమయినా హరాస్ చేస్తున్నాడా?”

“నన్నే కాదు. మా అక్కనీ, ఏమీ తెలియని వాళ్ల పిల్లలనీ, మా అమ్మీనీ, బాబానీ! ఇక్కడితో ఆగుంటే సమస్యే వుండకపోను. అలాంటి వ్యక్తులవల్ల బాధపడే కుటుంబాలు ప్రపంచంలో ఎన్ని లేవు? వాడి స్పెషాల్టీ ఏమిటంటే, వాడు జన్మనిచ్చిన తల్లినికూడా రొమ్ముమీద కొట్టే వ్యక్తి. అన్నంపెట్టిన చేతిని నరకాలనుకునే వ్యక్తి.”

“వాడి ప్రవర్తనకీ నీ బకెట్ లిస్ట్‌కీ సంబంధ మేమిటి?”

“ఈ జీవితంలో నాకు దొరకనివేమిటో బాగా అర్థమయింది. అందుకే, దొరకనివాటిని దొరకపుచ్చుకుందామని!”

“నాక్కొద్దిగా అర్థమయ్యేలా చెప్పు!”

“బాబా మా కుటుంబాన్ని తీసుకుని అమెరికా వచ్చేసరికి నాకు ఎనిమిదేళ్లు. అక్కకి పది. కర్ణాటకలో గుల్బర్గా దగ్గరనుంచీ వచ్చాం. అంకుల్ – బాబా బ్రదర్ – మా బాబాకంటే పదేళ్లు పెద్దవాడు. ఇంజనీరింగ్ చదివి అమెరికా వచ్చారు. ఆయన స్పాన్సర్ చేసిన గ్రీన్‌కార్డ్‌తో వచ్చాం. బాబాకి చదువు అబ్బలేదు. అందుకని అంకులే ఆయనచేత ఒక గ్రోసరీ స్టోర్ ఓపెన్ చేయించారు. దాన్లో బాబాకీ, అమ్మీకీ వారంలో ఏడురోజులూ సరిపోయేది. సెలవులంటూ వుండవు. దాంతో, సురయా – అదే, మా అక్కయ్య – చదువుని గూర్చి ఆలోచించడానికి వాళ్లకి కుదర్లేదు. మాకు ఇంగ్లీష్ రాకపోవడం ముఖ్యమైన అడ్డంకి. సురయా భయపడి స్కూల్‌కి వెళ్లే ఆలోచనని దగ్గరకే రానివ్వలేదు. నేను స్కూల్‌కి వెడతానంటే బాబా వద్దనలేదు. అమ్మీ, బాబా గ్రోసరీ స్టోర్‌తో బిజీగా వుండడంతో సురయానే ఇంటిపనంతా చూసుకునేది. నాకు ఎలిమెంటరీ స్కూల్లో ఫ్రెండ్స్ వుండేవాళ్లు కారు – భాషతో ప్రాబ్లం కనుక. మిడిల్ స్కూల్‌కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిన తరువాత కొంచెం ఫర్లేదు; క్లాసులోవున్న ఇండియన్లతో మాట్లాడగలిగేదాన్ని. అయితే, మా పారెంట్స్ నన్నెప్పుడూ ప్లేడేట్స్‌కి తీసుకువెళ్లేవాళ్లు కారు. వాళ్లకి తీసుకెళ్లే తీరికేదీ? అందుకని నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ దొరకలేదు. హైస్కూల్లోనూ అదే పరిస్థితి.

“సురయా మొగుడి రూపంలో మా కొంపకి సైతాన్ వచ్చాడు. ముదస్సర్ బాబా పాకిస్తాన్‌నుంచీ. అంకుల్ స్టెర్లింగ్‌లో కార్ రిపేర్ షాప్ పెట్టుకున్నారు. ఆయనకి బాబా పరిచయమయిన తరువాత, ఆయనకి ఒక కొడుకున్నాడని తెలిసింది. ఇద్దరూ మాట్లాడుకుని సురయాకీ ముదస్సర్‌కీ నికా చేద్దామనుకున్నారు. అంకుల్ మంచివాడే. ఈ సాలానే ఒక పెద్ద సైతాన్! ఆ పెళ్లయేటప్పటికి నేను హైస్కూల్లో జూనియర్ యియర్ పూర్తిచేశాను. 2006లో ఇలా పెళ్లయిందో, లేదో, ఆ సైతాన్ నన్ను చదువు మానిపించమన్నాడు. వాడు సురయాని బాధలు పెడతాడని బాబా  భయపడ్డారేమో తెలియదు గానీ, ‘పోనీ, మానెయ్యకూడదా?’ అని నన్ను అడిగారు. కుదరదని నేను మొండికేస్తే హైస్కూల్లో సీనియర్ యియర్ పూర్తిచెయ్యనిచ్చారు.

“ఆ డిసెంబర్లో కాలేజీలకి అప్లై చెయ్యబోతున్నప్పుడు ముదస్సర్‌ పెద్ద గోలచేశాడు – ఆడవాళ్లు చదవకూడదని ఖురాన్‌లో వున్నదని. ఇండియాలో వున్నప్పుడు అప్పుడప్పుడూ బాబా మసీదు కేమయినా వెళ్లేవారేమోగానీ, ఇక్కడికొచ్చిన తరువాత స్టోర్ నడపడంలో పడి అసలు వెళ్లడంగూర్చి ఆలోచించడమే మానేశారు. అయినా గానీ, సురయా కాపురం గూర్చిన వర్రీకొద్దీ, “ఆ చదువు నీకు అంత అవసరమా?” అని నన్ను ప్రశ్నించారు. ఆయన నడిపే గ్రోసరీ స్టోర్‌కి పోటీగా కొరియన్ స్టోర్ వచ్చి, ఇండియన్ ఐటంస్ అన్నీ తెచ్చి, మా స్టోర్‌కి రాబడిని బాగా తగ్గించింది. అది ఆయన ముఖ్యమయిన బాధ.

“ఆ యిద్దరితోనూ పోట్లాడి, మొత్తానికి కమ్యూనిటీ కాలేజీలో చేరాను. యూనివర్సిటీలతో పోలిస్తే ట్యూషన్ తక్కువే. పైగా ఇంట్లో వుండి వెళ్లిరావచ్చు. ఈ ప్రలోభపెట్టే పాశ్చాత్య సంస్కృతి కళ్ల ముందాడించే దుష్ప్రభవాలకి లోనవుతున్నానని ముదస్సర్ ఎప్పుడూ పనిగట్టుకుని మా యింటికి వచ్చి, నన్ను కూర్చోబెట్టి గంటలగ్గంటలు ఉపన్యాసా లిచ్చేవాడు. వాటిని తప్పించుకోవడానికి కాలేజీలో ఎక్స్‌ట్రా కోర్సులు తీసుకుంటే, నేను కాలేజీలో ఎవరితోనో తిరుగుతున్నానని వాడికి అనుమానం. నామీద నిఘా కూడా పెట్టించాడు.

“రెండేళ్లయేసరికి నా కౌన్సిలర్, నన్ను జార్జ్ మేసన్ యూనివర్సిటీకి మారమని సలహా యిచ్చారు – నా ప్రతిభని వుపయోగించుకోవడానికి అదే సరయిన ప్లేస్ అని. ముదస్సర్ మళ్లీ గోలపెట్టాడు – అక్కడ చాలామంది చెడిపోయిన వాళ్లున్నారనీ, వాళ్లల్లో ఇండియన్సే ఎక్కువమంది వున్నారనీ, వాళ్లతో చేరి నేను చెడిపోవడం తనకిష్టం లేదనీ. వాడు చేసే వుద్యోగం అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు వాళ్ల బాబాకి మెకానిక్‌గా హెల్ప్ చేసేవాడేమోగానీ, అప్పటికి పూర్తిగా మానేసి ఇంట్లో కూర్చుంటున్నాడు. పైగా, వేరే కాపురం పెట్టి, ఆ ఖర్చులన్నీ వాళ్ల బాబామీద రుద్దుతున్నాడు. నా క్లాస్ స్కెడ్యూల్స్ అన్నీ పనిగట్టుకుని నా దగ్గర్నుంచీ తెలుసుకుని, తన డొక్కుకార్లో నన్ను ఇంటినుంచీ పికప్ చేసుకుని, కాలేజీలో దించి, తరువాత మళ్లీ ఇంటిదగ్గర డ్రాప్ చేసేవాడు.

“పెళ్లవగానే రెండేళ్లల్లో ఇద్దరు పిల్లలని కన్నది సురయా. ముదస్సర్ వాళ్లని స్కూల్‌కి పంపనివ్వడు. వాళ్లుంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు వాళ్లని స్కూల్‌కి ఎందుకు పంపించట్లేదని ఎవరో అడిగారని చీప్ నైబర్‌హుడ్‌లో ఒక టవున్ హోమ్‌లోకి ఫ్యామిలీని మార్చాడు. అక్కడ వీడిలాంటివాళ్లే చాలామంది. డ్రగ్ రిలేటెడ్ షూటింగ్సో లేక డెత్సో వుంటే తప్ప పోలీసులుకూడా అక్కడకి రారు. అక్కడికి మారిన తరువాత సురయాని గానీ పిల్లల్ని గానీ బయటికి రానివ్వకపోవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు ఏం పాపం చేసుకున్నారో గానీ, వాళ్లకి స్కూలు కెళ్లడానికే గాదు, బయట ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఫ్రీడమ్ లేదు.

“గ్రాడ్యుయేట్ అయిన తరువాత ఏ కాలిఫోర్నియాలోనో ఉద్యోగం వెదుక్కుని వెళ్లిపోదాం అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే నాకోసం తనే ఉద్యోగం పట్టుకొచ్చాడు – లోకల్‌గానే, తన స్నేహితుడి కంపెనీలో – అక్కడంతా ‘మనవాళ్లే’ నంటూ. నా ఉద్యోగం నేనే వెదుక్కుంటానంటే వాడింకా మొండికేసి, బాబా చేత, సురయా చేత కూడా వత్తిడి పెట్టించాడు.

“ముదస్సర్ మా జీవితాల్లోకి ప్రవేశించిన తరువాత నా జీవితంలో నాకు ఏ విషయం గూర్చయినా స్వాతంత్ర్యం మిగిలిందంటే అది నా తిండి విషయంలోనే! వాళ్ల పెళ్లయిన తరువాతే నాన్-వెజిటేరియన్ తినడం నేను పూర్తిగా మానేసింది.  అది, వాడికి, ‘ఇన్‌డిపెన్డెన్ట్‌గా వుండడం నాకిష్టం’ అని తెలియజెప్పడానికి! మొహరంకీ, బక్రీదుకీ మా యింటికొచ్చినప్పుడు నా తిండిగూర్చి కామెంట్ చెయ్యకుండా ఒక్కక్షణం వుండలేడు. పైకి వాణ్ణి ఇగ్నోర్ చేసినట్టే కనిపిస్తాను గానీ లోపల మాత్రం మండుతూంటుంది. ఆఖరికి బట్టల విషయంలో కూడా నాకు స్వాతంత్ర్యం లేదు. నా అపార్ట్‌మెంట్‌లో సర్‌ప్రైజ్ ఇన్‌స్పెక్షన్లు చేసి ఇస్లాంకి విరుధ్ధమంటూ బట్టలని ట్రాష్ బాగ్‌లో పట్టుకెళ్లి పారేస్తూంటాడు. ఈ షర్ట్ ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్టు నీకు గుర్తుండే వుంటుంది. ఈ స్కర్టూ, అప్పుడు వేసుకున్న జీన్సూ కూడా స్నేహితురాలి పెళ్లికోసం కొనుక్కున్నవి.  జార్జ్ మేసన్లో క్లాస్‌మేట్. పెళ్లికి ఇన్వైట్ రాగానే ఎగిరి గంతేశా – వీడినించీ రెండురోజులయినా తప్పించుకోవడానికి వీలవుతుందని.  ఇంత ప్లెయిన్‌గా వున్న డ్రస్ గూర్చికూడా వాడు గోలపెట్టాడు – స్కర్ట్‌మీద సన్నసన్న మెరుపులున్నాయనీ, ఆ పింక్‌కు బదులు లూజ్‌గా వుండే నల్ల చొక్కా వేసుకొమ్మనమనీ. ఇవ్వి ఇన్నాళ్లు నా దగ్గరున్నయ్యంటే కారణం నేను వాటిని నా మాట్రెస్‌కీ బాక్స్ స్ప్రింగ్‌కీ మధ్యలో దాచడం. పెళ్లి నించీ తిరిగొచ్చిన తరువాత ఎంత గోలచేశాడో!

“అయితే, ఆ పెళ్లికోసమని డెన్వర్ వెళ్లే రెండ్రోజుల ముందర సురయా నాకొక భయంకరమయిన వార్తని చెప్పింది. ఆ ముదస్సర్ వల్ల అదే గాక, దానితోబాటు పిల్లలూ, బాబా, అమ్మీ, నేను, వాడి తరఫువాళ్లూ, అందరం సర్వనాశన మవబోతున్నాం. అదిగానీ, నేను గానీ చెయ్యగలిగిందేమీ లేదు. ఒకవేళ చెయ్యగలిగిన దేమయినా వున్నాగానీ దాని ఫలితాలు కూడా దారుణంగానే వుంటాయి.

“బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ వున్న డ్రస్ బావుంటుందనుకున్నా గానీ, ఆ నలుపే నా జీవితంగా వ్యాపించిందని డిప్రెషన్లోకి వెళ్లాను – ఆ పెళ్లిలో! కెన్ యూ బిలీవిట్? సీ దిస్ బ్లాక్ స్కర్ట్? కలర్ ఆఫ్ సారో! కలర్ ఆఫ్ డార్క్‌నెస్! అప్పుడు వేసుకున్నదే. దానికి తోడు ఆ విమానం చెడిపోవడం. అది కూలిపోయుంటే బావుండే దనుకున్నాను ఆ ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని.

“అప్పుడు నన్ను వెదుక్కుంటూ వచ్చిన ఆశాకిరణానివి నువ్వు. కాలేజీ రోజుల్లో కూడా ఏ ఇండియనూ నాదగ్గరకు రావడానికి గానీ, నాతో మాట్లాడ్డానికి గానీ ఇంటరెస్ట్ చూపలా. అలాంటిది నువ్వు నాతో మాట్లాడ్డమే కాకుండా రెచ్చగొట్టే మాటలతో మొదలుపెట్టావు. అప్పుడనిపించింది నాకు – నేనొక బకెట్ లిస్ట్‌ని ఎందుకు తయారుచేసుకోకూడదని! నీ సహాయంతోనే ఇవాళ్టిదాకా నిరాశా వూబిలో కూరుకుపోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను! యు హావ్ బీన్ మై రే ఆఫ్ లైట్ అండ్ హోప్!

“ఆర్నెల్ల క్రితందాకా నేనుకూడా ఎవరినో ఒకళ్లని నికా చేసుకుని వెళ్లిపోతానన్న ఆశవుండేది. అది అంతరించిపోవడానికి కారణం ఇక్బాల్. ఇది ఫిబ్రవరి కదా, వాడు ముదస్సర్‌ని దాదాపు సంవత్సరం క్రితం కలిశాట్ట – సురయా చెప్పింది. ఇక్బాల్ కలిసేముందు దాకా అమెరికా ఓ సైతాన్ల దేశమని ముదస్సర్ ఎంత తిట్టినా, వాడు కలిసిన తరువాతే గన్లూ, బాంబులూ ముదస్సర్ దగ్గర చేరడం మొదలుపెట్టింది. అమెరికా వచ్చిన పదేళ్ల తరువాత కూడా పాకిస్తాన్‌కి వెళ్లాలని అనుకోని ముదస్సర్ ఏడెనిమిది నెలలక్రితం అక్కడికి కెళ్లొచ్చాడు.  ఇక్బాల్ వాడితో వెళ్లాడో లేదో నాకు తెలియదు గానీ, వాడు కలవమన్నవాళ్లని ముదస్సర్ కలిశాడని, అక్కడ ఈ వెపన్స్‌ని వాడడంలో ట్రైనింగ్ కూడా తీసుకుని వుంటాడని నా నమ్మకం.  వాడు పాకిస్తాన్లో వున్నప్పుడే నాకు కొద్దిగా సురయాతో మాట్లాడ్డానికి వీలయ్యింది. ఇక్బాల్‌తో కలిసి వాడు చెయ్యబోయే పని మమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఆ విషయం డెన్వర్ వెళ్లే ముందరే నాకు బాగా తెలిసొచ్చింది. ఎందుకంటే, పాకిస్తాన్ వెళ్లే ముందర ఆ వెపన్స్ అన్నింటినీ ఇంట్లోంచి ఖాళీ చేస్తే సురయా ఊపిరి పీల్చుకున్నది గానీ, వాడు ఆగస్టులో వెనక్కు రాగానే – అంతకు ముందున్నవాటికంటే ఎక్కువ సంఖ్యలో అవి ఇంట్లో బేస్‌మెంట్లో చేరడాన్ని చూసి సురయా గుండె బేజారెత్తిపోయింది. వాడు వెయ్యికళ్లతో కాపలా కాస్తూ సురయా, నేనూ మాట్లాడుకోకుండా వుండేలా చూసినా, నా డెన్వర్ ట్రిప్పుకు రెండ్రోజుల ముందు అది నాకు ఆ వార్తని చేరవేసింది.

“డెన్వర్లో పెళ్లి సందడి చూసిన తరువాత – అది ఒక ఇండియన్ పెళ్లిలే, తెల్లవాణ్ణి చేసుకుంటోంది – ఆ తరువాతనించీ రిటర్న్ ట్రిప్‌లో ఒమహా ఎయిర్‌పోర్టులో నిన్ను కలిసేదాకా నా జీవితంలో వుండడానికి అవకాశమే లేని ఆనందాలన్నీ నాకు కళ్లముందు క్లియర్‌గా కనిపించాయి. నువ్వు నన్ను కలియడానికీ, మాట్లాడ్డానికీ ఆసక్తిని చూపించావు గనుక నేను నిన్ను వాడుకోవాలని – అవును, వాడుకోవాలని – అనుకున్నాను.

“దేనికో తెలుసా? నా జీవితంలో అప్పటిదాకా దొరకని చిన్న చిన్న ఆనందాలని చేర్చిన బకెట్ లిస్ట్‌లోని ఐటమ్స్‌కి చెక్ మార్క్ పెట్టడంకోసం. చిన్న లిస్టే అయినా అందులోని అన్ని ఐటమ్స్‌కీ చెక్ మార్క్ పెట్టడానికి నువ్వు సహాయం చెయ్యగల వనిపించింది. అలాగని అవి అన్నీ ఒకేసారి సమకూరేవి కాదు. అందుకే నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడ్డం మొదలుపెట్టాను. అలా అయితే నీకు నామీద ఆసక్తి పోకుండా వుంటుందని. మేం రెస్టన్లో వున్న మూడేళ్లల్లోనూ నేను స్విమ్మింగ్ పూల్‌లో అడుగు పెట్టిందిలేదు. స్కేటింగ్ రింక్ వైపు చూసిందే లేదు. కానీ, మా బాబా గ్రోసరీ స్టోర్‌కి వెళ్లినప్పుడు దాని పక్కన వున్న కరాటే స్టూడియోకీ, అలాగే బాలే డాన్స్ స్టూడియోకీ వచ్చిన పిల్లలనీ, ఆ స్టూడియోల ముందు నడుస్తున్నప్పుడు ఆగి గాజు అద్దాల్లోంచి వాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌నీ చూసినప్పుడు నా చిన్నప్పుడు గుల్బర్గా వీధుల్లో స్వేఛ్ఛగా తిరిగిన రోజులు గుర్తొచ్చాయి; ఆ కాలంలో అంతకు మించి ఆశించింది లేదు. ఆశించడానికి ఆస్కార మెక్కడున్నది గనుక! నా పిల్లలకి అలాంటి వాటిల్లో తప్పకుండా ట్రెయినింగ్ ఇప్పించాలనుకున్నాను గానీ, అసలు ‘నా పిల్లలు,’ అన్న ఆలోచనకే కొన్ని వేలమైళ్ల దూరంలో వున్నానని తెలుసు గనుక, నాగూర్చి మాత్రమే ఆలోచించాను. ఒలింపిక్స్‌ని టీవీలో చూసినప్పుడు నన్ను ఆకట్టుకున్నవి స్కేటింగూ, స్విమ్మింగూ. ఆ అనుభవాలు ఒక్క సారయినా కావాలనుకున్నాను.

“వాటితోబాటే, రొమాంటిక్ ఎక్స్‌పీరియెన్సెస్ – మూవీ & డిన్నర్, తరువాత బోట్ రైడ్! బై ది వే, డోన్ట్ గెట్ మి రాంగ్. దీస్ అర్ ది క్లాసికల్ టైప్ రొమాన్సెస్. ఐ మేడ్ ది స్విమ్మింగ్ అండ్ స్కేటింగ్ ఆల్సో రొమాంటిక్, డోన్ట్ యు అగ్రీ? అయితే వీటన్నింటినీ పక్కపక్క రోజుల్లోనే చెకాఫ్ పెట్టేస్తే వుండే గుర్తులు ఇందాక నేను రెండుగుక్కల్లో అరగ్లాస్ వైన్ ఖాళీ చేసినటువంటివి; లేకపోతే అరకిలో స్వీట్లని అయిదునిముషాల్లో తినడంలాంటిది. అంటే, అనుభవం దొరుకుతుంది గానీ, కావలసిన గుర్తులు మిగలవు, మిగిలిన వాటిల్లో అందముండదు. దానితో బాటే, నిన్ను ఊరించడంలో వున్న అనుభవం – అనుకోకుండా బోనస్‌గా దొరికింది – అది కేక్ మీది ఐసింగ్ లాగా ఎంత బావున్నదో తెలుసా? నేను కేక్ అంటోంది నాకు మిగిలిన అనుభవాన్ని! ప్రతీసారీ నిన్ను కలిసినప్పుడల్లా మిగిలిన ఆ అనుభవాన్ని మళ్లీ కలిసేదాకా ఆస్వాదిస్తూనే వున్నాను.

“నిన్నలా దూరంగా వుంచడం నాకూ బాధ కలిగించింది. అలా అని, స్విమ్మింగ్ తరువాతో లేక ఇంకా వెనక్కెళ్లి స్కేటింగ్ తరువాతో నన్నీ గెటప్‌లో ప్రెజెంట్ చేసుకున్నా ననుకో, ఎంతయినా మగాడివి గనుక నన్ను ‘షి ఈజ్ టూ ఈజీ’ అనుకుని ఆ తరువాత పట్టించుకోకపోయే ప్రమాద మున్నది. నాకు ఒక్కొక్క ఐటమ్‌నీ చెకాఫ్ చేస్తున్నకొద్దీ ఆనందంతో బాటే చెప్పలేని బాధ కలిగిందన్న సంగతి కూడా చెప్పాలి – నీకు ఇంతకన్నా దగ్గర కాలేకపోతున్నందుకు.

“అనార్కలి, సలీముల్లాగానూ, రోమియో, జూలియెట్ల లాగానూ తరచుగా కలవడానికి నీకూ నాకూ వున్న ఉద్యోగాలవల్ల కుదరకపోయినా, కనీసం ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా వీల్లేకుండా అడ్డంపడ్డాడు ముదస్సర్.  కాలేజీలో చేరిన రెండేళ్లదాకా నాకు సెల్‌ఫోన్ ఇవ్వనీకుండా చేశాడు. తరువాత ఫామిలీ ప్లాన్ అనిచెప్పి మా ముగ్గురి ఫోన్లనీ – బాబాదీ, అమ్మీదీ, నాదీ – తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎంతయినా ససుర్, వున్న ఒకే మగదిక్కు, అని బాబా అడ్డం చెప్పలేదు. కలిసినప్పుడల్లా నా ఫోన్ లాక్కుని అందులో కాంటాక్ట్స్‌లో కొత్తగా ఎవరయినా చేరారేమోనని వెదుకుతుంటాడు. అందుకనే నేను నీ నంబర్ని,” అని తన చేత్తో అతని చేతిని పట్టుకుని తన తలకాయవైపు పాయింట్ చేసి, “ఇక్కడ భద్రంగా దాచుకున్నాను,” అని కంటిన్యూ చేసింది. “నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరికి టెక్స్ట్ మెసేజులని పంపిస్తున్నానో ఆన్‌లైన్లో అకవుంట్లో లాగ్ అయి చూస్తూంటాడు. వాడికి తెలియని నంబర్‌కి నా ఫోన్‌నించీ కాల్ వెడితే వెంటనే అడుగుతాడు – ఎవరితో మాట్లాడుతున్నానో చెప్పమని. అందుకనే ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో నీతో మాట్లాడిన తరువాత నీ ఫోన్లని నేను ఆన్సర్ చెయ్యలేదు. దానిగూర్చి కూడా అడిగాడు – అన్నిసార్లు నీకు ఈ నంబర్‌నించీ కాల్స్ వచ్చెయ్యెందుకు? అని. ఎవరో టెలిమార్కెటర్ అయ్యుంటాడు. అందుకనే నేను ఆన్సర్ చెయ్యలేదు గదా అని జవాబు చెప్పాను. నా అదృష్టం కొద్దీ నేను నీకు పంపిన టెక్స్ట్‌లు నెలకు ఒకసారి మాత్రమే అయినా గానీ వేరే బిల్లింగ్ సైకిల్‌లో వున్నందువల్ల ఆ నెంబరే రిపీట్ అయిందని గమనించినట్లు లేడు.

“నా లిస్ట్‌లో రెండు ఐటమ్స్ చెకాఫ్ అయిన తరువాత పారిస్‌లో నవంబర్లో, థాంక్స్‌గివింగ్‌కి రెండువారాల ముందు, ఉగ్రవాదుల అటాక్ జరిగింది. అది ఆ శాన్ బెర్నార్డినో కపుల్‌మీద చూపించినంత ప్రభావమూ ముదస్సర్‌మీద చూపించింది.  వాళ్లు చేశారు, వీడు చెయ్యడానికి సిధ్ధపడ్డాడు. అంతే తేడా! దానికితోడు, ఆ శాన్ బెర్నార్డినో అటాక్‌లో భార్యకూడా పాల్గొనడాన్ని చూసి – గుర్తుందా, డిసెంబర్ 2వ తేదీ నాడు? సురయాని కూడా తనతోబాటు తీసుకువెళ్లడానికి బలవంతంగా ఒప్పించాడు – లేకపోతే పిల్లలని చంపుతానని బెదిరించి. ఆ సంగతి తెలిసిన తరువాత నా బకెట్ లిస్ట్ నన్ను తొందరపెట్టడంవల్లే నేను నిన్ను చల్లగా వున్నా డిసెంబర్లో బోట్ రైడ్‌కి రమ్మనమంది. దట్ వజ్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్, బై ది వే! థాంక్ యు!

“సో, నా చిన్న బకెట్ లిస్ట్‌లో ఇది చివరి ఐటమ్. ముదస్సర్ ఎప్పుడు వాడి ఈవిల్ ప్లాన్‌ని అమలు చేస్తాడో తెలియదు. ఫిబ్రవరిదాకా ఆగాడంటేనే ఆశ్చర్యంగా వుంది. ఇంకెంతో కాలం ఆగుతాడనుకోను. అందుకే ఈ తొందర. లాస్ట్ ఐటమ్ ఆన్ ది లిస్ట్. నౌ మై కాన్షియెన్స్ ఈజ్ క్లియర్. ఆర్ యు యాంగ్రీ ఇనఫ్ విత్ మి టు త్రో మి అవుట్, ఆర్, డు యు స్టిల్ వాన్ట్ టు గో త్రు విత్ ఇట్? ఇఫ్ యు రియల్లీ వాంట్ టు త్రోమి అవుట్ – ఎ రిక్వెస్ట్. యూ హావ్ గివెన్ మి ఫైవ్ వండర్ఫుల్ మెమరీస్. వన్ మోర్ ప్లీజ్!” అని హమీర్ కళ్లల్లోకి చూసింది. ఆమె కళ్లు ధైర్యాన్ని నింపుకున్నట్టున్నా,  ఛాతీని కప్పుతూ షర్ట్‌ని పట్టుకున్న ఆమె చేతివేళ్లు వణకడం అతని కళ్లకి స్పష్టంగానే కనిపించింది.

హమీర్‌కి తాను విన్నదంతా ఒక కల అయ్యుంటే బావుణ్ణనిపించింది. తండ్రి కనిపించకుండా పోవడంవల్లా, మీనా ప్రవేశించిన తరువాత ఆశ్చర్యకరంగా నిష్క్రమించడంవల్లా – చుట్టుపక్కల ఇండియన్స్‌ని చూసినప్పుడల్లా తన జీవితమే ఎందుకింత కాంప్లికేటెడ్‌గా వున్నదా అని అనుకున్నాడు. అమానిని కలిసిన తరువాత తన స్టెప్‌లో ఒక బౌన్స్ వచ్చిందని అతనికి తెలుసు. దాన్ని లైఫ్ లాంగ్ నిలుపుకుందా మనుకుంటున్న దిశగా అతను అడుగేస్తున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా ఆమెని కౌగలించుకుని నీకు నేనున్నాను అని ధైర్యం చెబుదామనే వున్నది గానీ, తండ్రి అదృశ్యమవడంతో తలక్రిందులయిన తల్లి జీవితాన్ని తను టెర్రరిస్ట్ కేసులో నిందితుడై ఇంకా అల్లకల్లోలం చెయ్యడానికి అతనికి మనస్కరించలేదు. ఎందుకంటే, 9/11 తరువాత అందులో పాలుపంచుకున్న వాళ్లకి ఆతిథ్య మిచ్చారన్న నేరానికి ప్రాసెక్యూట్ చెయ్యబడి శిక్షలు పొందినవాళ్ల గూర్చి అతను విన్నాడు.

“వై డోన్ట్ యు గో టు ది పోలీస్ అండ్ వార్న్ దెమ్ అబవుట్ ముదస్సర్?” అమానిని అడిగాడు.

“వాడు మారణాయుధాలని పోగుచేస్తున్నమాట, వాడు టెర్రరిస్టులకి సింపతైజర్ అన్నమాట, దేశద్రోహం చెయ్యాలని అనుకుంటున్న మాట – అన్నీ కూడా నిజాలే. కానీ, అలా అనుకోవడమే క్రైంగా ఇంకా ఎక్కడా నిర్ణయింపబడలేదుగా? పైగా, సెకండ్ అమెండ్‌మెంట్‌ని అడ్డంపెట్టుకుని ఈ దేశంలో ఎంతమంది ఎన్ని రకాల గన్‌లని వాళ్ల దగ్గర పోగుచేసుకుంటున్నారో అందరికీ తెలుసు.  ప్రజల దగ్గర గన్లు లేకపోతే ఆరెగాన్లో 41రోజులపాటు జరిగి క్రితంవారమే ముగిసిన స్టాండాఫ్ ఎలా సాధ్యమయింది? అందుకని ముదస్సర్ ప్లానేమిటో తెలిసేదాకా ఏమీ చెయ్యలేను. తెలిసిన తరువాత పోలీసుల దగ్గరకి వెళ్లకుండా వుండనూ లేను – మా జీవితాలన్నీ నాశన మయినా గానీ,” జవాబిచ్చింది అమాని.

ఒక కొరియన్ కుర్రాడు గన్ తీసుకుని యూనివర్సిటీలో కొందరిని కాల్చి చంపినందుకు సెంటర్‌విల్‌లో వున్న అతని తల్లిదండ్రులు పబ్లిక్‌కి క్షమాపణలు చెప్పడం హమీర్‌కి గుర్తొచ్చింది. అలాగే, ఇంకోచోట మతి స్థిమితంలేని కొడుకు గన్ తీసుకుని బయల్దేరాడని యూనివర్సిటీవాళ్లకి తల్లిదండ్రులే చెప్పిన ఉదంతంకూడా అతని మదిలో మెదిలింది. రెండూ అతనున్న ఏరియా చుట్టుపక్కల జరిగినవే. ముదస్సర్ చెయ్యా లనుకుంటున్న తప్పు సామాన్యమైనది కాదని హమీర్‌కి తెలిసినా, ఎవరు ఏంచెయ్యాలో నిర్దేశించగల పరిస్థితిలో తానులేడని అతనికి అర్థమయింది. అయిదు కలయికలతోనే తనవద్ద ఇంత ఓపెన్‌గా మాట్లాడేలా తనని నమ్మిందంటే అతనికి ఆమెమీద ప్రేమతోబాటు జాలికూడా కలిగింది. ఎవరికోసమో కాక తనకోసం మాత్రమే తన జీవితాన్ని అనుభవించడాన్ని కోరుకోవడం ఏమాత్రం అసమంజసం కాదు. అందరూ సాధారణంగా కోరుకునే సంసార జీవితం తనకి అందుబాటులో వుండబోవట్లేదని గ్రహించిన తరువాత ఆమె చిన్న బకెట్ లిస్ట్‌ని తయారుచేసుకోవడమూ ఊహాతీతం కాదు. అంత తెగువ వున్న ఆమె పరిస్థితులకి ఎంత బందీ అయిందో అర్థమయిన హమీర్‌కి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. మీనా తరువాత తనకి జీవితం శూన్యం అని రాజీపడ్డ అనంతరం అమాని కనిపిస్తే తనకికూడా ఒక జీవితం వుండబోతోందని ఆశపడ్డాడు. ఇప్పుడు తనతోబాటు ఆమెకి కూడా ఒంటరి జీవితమేనని అతనికి అర్థమయింది.

“బై ది వే, ముదస్సర్ నన్ను ట్రాక్ చేస్తున్నాడని నా నమ్మకం. రెస్టన్ అంటే ఇష్టం వుండడంవల్లనే గాక వాడి ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికీ కనిపించకుండా వుండడానికే నిన్ను కలవడానికి మొదట్లో రెస్టన్‌ని సెలెక్ట్ చేసుకున్నది.  ఆ స్కేటింగ్ రింక్ చుట్టుపక్కలా, స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కలా ఎక్కువమంది తెల్లవాళ్లు నివసించడాన్ని గమనించి, ముదస్సర్ అక్కడికి వచ్చే ఛాన్స్ తక్కువే అని నిర్ధారించుకున్నాకే నిన్ను అక్కడ కలిసింది. వాడు నల్లవాళ్ల చుట్టుపక్కల వున్నంత కంఫర్టబుల్‌గా తెల్లవాళ్ల పక్కన వుండడని చాలా కాలం క్రితమే గ్రహించాలే! అది నల్లవాళ్ల మీద సానుభూతి వల్లో లేక ఆ నల్లవాళ్లకంటే తను ఎక్కువ అన్న అహంకారంవల్లో పూర్తిగా తెలియదు. బోట్ రైడ్‌కి వాషింగ్టన్ వెళ్లక తప్పలేదు.  అయితే, నేను వాషింగ్టన్‌కీ, ఆ తరువాత క్రిస్టల్ సిటీకీ వచ్చినట్టు వాడు కనిపెట్టాడు. ఇప్పుడు కూడా, ఎందుకయినా మంచిదని నా కారుని పక్క బ్లాక్‌లో పార్క్ చేసి చుట్టూ చూసుకుంటూ వచ్చాను.  ఎవరూ ఫాలో కాలేదులే. మరీ బిట్టర్ కోల్డ్‌గా వున్నదిగదా, ఇవాళ! నేను FBI వాళ్ల నేమయినా కలుస్తున్నానేమోనని వాడి అనుమానం. దాని నివృత్తికోసం నన్ను ఫాలో అవడానికి ఇక్బాల్ సహాయం చేస్తూ వుండవచ్చు! అందుకే, మనం కలవడం ఇది చివరిసారి,” అన్నది అమాని. “ఇంకో విధంగా అయితే మొదటిసారి కూడా,” అన్నది దృష్టిని అతని కళ్లమీంచి తప్పిస్తూ కనురెప్పలని వాల్చి.

హమీర్‌ ఆమె ఛాతీమీది షర్ట్‌ని తీసివేసి, ఆమె మెడవద్ద మొదలుపెట్టి నాభిదాకా కుడిచేతి వేళ్లని పియానో మెట్లమీద కదిపినట్లుగా ఆడించాడు.

“పియానో వాయిస్తున్నావా?” అడిగింది అమాని.

“Rachmoninoff 3rd piano concerto, allegro,” జవాబిచ్చాడు. Hauntingగా మొదలయ్యే ఆ మెలొడీ అంటే అతని కెంతో యిష్టం.  కొద్దిసేపటికే ఎడమచేతిని ఆమె మెడకిందవేసి, కుడిచేత్తో నడుముని చుట్టి పైకి లేపి కావలించుకున్నాడు. మరి కొంచెం సేపటికే ఆ concerto intermezzo స్పీడందుకుంది.

ఉరితీతకు గురయ్యే వ్యక్తి తన చివరి భోజనాన్ని – తనకు నచ్చే పదార్థాలు ఎన్నున్నా గానీ – ఆనందంగా ఆస్వాదించలేకపోవచ్చు గానీ, ఎడారిలా మిగలబోయే అమానికి ఆమె జీవితంలో మొదటిసారీ, చివరిసారీ కూడా ఆనందపు టంచులని చూపాలని హమీర్‌ ఆరాటపడ్డాడు.

***

అమాని వెళ్లిన తరువాత మళ్లీ ఒకసారి ఆమె పేరుకి అర్థాన్ని ఇంటర్నెట్లో వెదికాడు. Hopes, aspirations, wishes, అని తెలిసింది. అతని గుండె బరువెక్కింది.  వైన్ బాటిల్ పూర్తిచేసిన తరువాత రెఫ్రిజిరేటర్ తలుపు తీసి ఒక బీర్ తెచ్చుకుని సోఫాలో కూర్చుని తాగడం మొదలుపెట్టాడు.

ఎంతవద్దన్నా అమాని పరిష్వంగపు అనుభూతులు అతనికి అంత ఇన్‌టిమేట్‌గా పరిచయమున్న ఇంకొక ఒకే ఒక వ్యక్తి మీనాని గుర్తుకు రానీయకుండా ఆపలేకపోయాయి.

[ఇంకా ఉంది...]