ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – పదవ భాగం

జనవరి 2017

10

ఫిబ్రవరిలో అమానిని చివరిసారి కలిసినప్పటినించీ హమీర్ కొద్దిగా డిప్రెషన్లో గడిపాడనే చెప్పవచ్చు. ఒకపక్క దగ్గరగా వచ్చిందనుకున్న వ్యక్తి దూరమయిందన్న విషాదం. రెండోపక్క తనకు నచ్చిన అమానీకి ఏమీ చెయ్యలేకపోతున్ననే బాధ. ఇంకోపక్క ముదస్సర్ చేసిన అఘాయిత్యం గూర్చిన వార్తలు ఏ క్షణాన వినవలసి వస్తుందోనని మనిషిగా భయం. దానితోబాటే అమెరికన్ పౌరుడిగా తను ప్రభుత్వంతో సమాజానికి రాబోయే ప్రమాదంగూర్చి తనకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలా వద్దా అన్న సందేహం. ఒకవేళ అలా ప్రభుత్వానికి ఆ వార్తని చేరవేస్తే ఒక్క ముదస్సరే కాక అమానీ కుటుంబం, అటు ఏ పాపం ఎరుగని ముదస్సర్ తండ్రి కుటుంబం – రెండు కుటుంబాలూ తమ తప్పేం లేదని నిరూపించుకోగలిగినా సమాజంలో తోటివాళ్ల మధ్య తలెత్తుకుని తిరగలేక స్వంత బిజినెస్‌లని కూడా వదులుకుని ఇంకోచోటికి వెళ్లవలసి వస్తుందన్న ఎరుక. అమెరికాలో ఎన్నేళ్లు కష్టపడితే ఈనాడు అమాని తండ్రిగానీ ముదస్సర్ తండ్రిగానీ తమ బిజినెస్సుల్లో నిలదొక్కుకో గలిగారో అనుకున్నాడు.

తన దగ్గర వున్నది ఒక్క అమానీ కాంటాక్ట్ మాత్రమేనని కూడా అతనికి గుర్తుంది. ఆమె లాస్ట్ నేమే తనకి తెలియదు! ఆమె చెప్పిన వేటినీ అతను వెరిఫై చెయ్యడానికి కావలసిన వివరాలు అతని దగ్గర లేవని మాత్రం తెలుసు. ఇంక పోలీసుల దగ్గరకి వెళ్లి ఏం చెబుతాడు? ఒకవేళ ఆమె చెప్పినవన్నీ కట్టు కథలేమో? తనమీద సానుభూతిని అతని వద్దనుంచీ సంపాదించుకోవడానికి వేసిన నాటక మేమోనన్న సందేహం కూడా అతనికి వచ్చింది. కానీ, ఆమె బోట్ రైడ్‌లో ఇచ్చిన ముద్దూ, తన శరీరంతో పంచుకున్న క్షణాలని స్పష్టంగా ఆనందించినట్లు కనబడడం అతనికి గుర్తొచ్చి ఆమెని అనవసరంగా అనుమానిస్తున్నానని కూడా అతనికి అనిపించి సిగ్గుపడ్డాడు.

మార్చ్ నెలలో బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి గూర్చి వినగానే హమీర్‌కి మైండ్‌లో బాక్‌గ్రవుండ్‌లోకి తోసిన ముదస్సర్ గూర్చిన ఆలోచనలు ఠక్కున ముందుకి వచ్చాయి. ముదస్సర్ గనుక అలాంటి వెపన్స్‌ని ఇంకా పోగు చేస్తూనే వుంటే ఇలాంటివాళ్ల కోసమే ఎరవేసి పట్టేసే FBI వాళ్లు అతణ్ణి ఈ పాటికి పట్టుకుని వుండుంటార్లే అని సమాధానపడ్డాడు.  పైగా, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ కాండిడేట్స్ డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క, టెడ్ క్రూజ్ ఇంకొక పక్క ముస్లిముల మీద నిఘా వేసి వుంచుతాము అని గట్టిగా ప్రకటన లివ్వడంతో అసలు ఈ పాటికి ప్రభుత్వం ఆ పని చేస్తూనే వుండి వుంటుంది అని కొందరు కొలీగ్స్ అనడం అతను విన్నాడు గనుక అది ముదస్సర్‌ని భయపెట్టి చెక్‌లో వుంచడానికి తోడ్పడుతుందని ఆశపడ్డాడు. మళ్లీ, ప్రాణాలకే తెగించే వాడికి భయ మెక్కణ్ణించీ వస్తుంది అని కూడా తనని తనే ప్రశ్నించుకున్నాడు. అలాగని, ఏ క్షణాన ముదస్సర్ ఏం చెయ్యబోతున్నాడో అని అతను భయపడకుండానూ లేడు.

ఈ ఆలోచనల, భయాల మధ్యలో అతను నలుగుతుండగా జూన్ నెల రానే వచ్చింది.

***

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో దిగి వాన్ రెంట్ చేసుకుని మరిపోసాలో బెస్ట్ వెస్టర్న్ ఇన్‌కి హమీర్, సరోజగారు మూర్తిగారి కుటుంబ సభ్యులతో కలిసి చేరేసరికి సాయంత్ర మయింది. మూర్తిగారు, ఆండ్రూ లాబీలోకి వెళ్లి చెక్-ఇన్ చేసి రూమ్ కీస్ తీసుకువచ్చారు.

“ఈ హోటల్ మనవాళ్లదే,” అన్నారు మూర్తిగారు.

“మరే, మన చుట్టాలది!” అన్నారు భవానిగారు.

“కాదు. మన దేశీయులది, అని! రిసెప్షనిస్ట్ ఓ తెల్లావిడే గానీ, ఆవిడ వెనక ఆంజనేయస్వామి ఫోటోవుంది. లోపల ఓం జయ జగదీశ హరే అంటూ హారతిస్తున్నారు!” జవాబిచ్చారు మూర్తిగారు.

మూర్తిగారు, భవానిగారు, రోహిత్‌లు ఒక రూమ్‌లోనూ, ఆండ్రూ, విదుషి మరో రూమ్‌లోనూ, సరోజగారు, హమీర్‌లు ఇంకో రూమ్‌లోనూ సర్దుకున్నారు. హోటల్‌నించీ బయటపడి నాలుగంగలు వేస్తే వచ్చే పిజ్జా ప్లేస్ కెళ్లి డిన్నర్ కానిచ్చారు.

మరునాడు పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న రూమ్‌లో ఎరేంజ్ చేసిన బ్రెక్‌ఫాస్ట్ చెయ్యడానికి అందరూ బయలుదేరుతుంటే, “రూమ్‌లో హీట్ లేదు కదా! నాకు ఫర్లేదు గానీ మామ్‌కి మాత్రం రాత్రి బాగా చలేసింది,” అన్నాడు హమీర్.

“వాళ్లు హీట్ ఆఫ్ చేసేసినట్లున్నారు వింటర్ అయిపోయిందని. మనకింకా చలిగానే వున్నది,” అన్నారు మూర్తిగారు.

“లెట్స్ గో అండ్ కంప్లైన్!” అన్నాడు ఆండ్రూ.

వాళ్లని బ్రెక్‌ఫాస్ట్ చెయ్యడానికి పంపి, మేనేజర్‌తో కంప్లైన్ చెయ్యడానికి ఆండ్రూ, హమీర్ వెళ్లొచ్చి వాళ్లని ఆ లౌంజ్‌లో జాయిన్ అయారు. అక్కడ మీనా తన తల్లితో మాట్లాడుతూండడాన్ని చూసి హమీర్ ఆశ్చర్యపోయాడు. మూర్తిగారు కూడా మీనా తండ్రి రావుగారితో మామూలుగానే మాట్లాడుతూ కనిపించారు. హమీర్ రావడాన్ని చూసి రావుగారు, మీనా మెల్లిగా వాళ్ల టేబుల్ దగ్గరనుంచీ వెళ్లిపోయారు. సరోజగారు మీనాతో మాట్లాడుతున్నదంటే మీనాని ఆవిడ క్షమించేసినట్లా? హమీర్‌కి అర్థంకాలేదు.

బ్రెక్‌ఫాస్ట్ అయిన తరువాత అతనితో ఎవరూ మీనా ప్రసక్తి తేకుండానే యోసమిటికి బయలుదేరారు. వాన్‌ని ఆండ్రూ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్క సీట్లో మూర్తిగారు కూర్చున్నారు. మధ్య వరుసలో వున్న రెండు సీట్లల్లో సరోజగారు, భవానిగారు కూర్చున్నారు. విదుషి, హమీర్, రోహిత్ చివరి రోకి పరిమిత మయ్యారు.

హైవే 140 మీద వెడుతున్నప్పుడు అన్నివైపులా కనిపిస్తున్న సీనరీని చూసి అందరూ  అచ్చెరువందారు. వెడుతున్నప్పుడు రెండుపక్కలా కొండలమీద చెట్లతోబాటు దూరంగా ముందుకూడా కొండల వరుస కనిపిస్తోంది.  అంటే, కొద్దిసే పయిన తరువాత రోడ్డు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న కొండల చుట్టూ కూడా మెలికలు తిరిగి సాగుతుందన్నమాట.  ఎడమవైపున దాదాపు రోడ్డు నానుకుని మెర్సెడ్ రివర్ ప్రవహిస్తుంటే రెండోవైపున రోడ్డు నానుకునే కొండ మొదలవుతోంది. ఆ నదికి ప్రారంభం ఆ కొండలమీద వింటర్లో పడ్డ మంచు కరగడం అని ఆండ్రూ చెప్పాడు.

“మన గంగా నది హిమాలయాల్లో పుట్టినట్లు!” అన్నారు భవానిగారు.

రోడ్డుపక్కగా కారు నాపి, దిగి, ఫోటోకోసం ఆ ఒడ్డుమీద నిలుచుని కాసేపు ఆ నీటి గలగలలని విన్నారు. ఆ గలగలలు, ప్రవహిస్తున్న నీరు అడ్డంగా వున్న కొండరాళ్లతో జరిపే సంభాషణలు.

మళ్లీ వాన్‌లో వెళ్లడం మొదలుపెట్టిన తరువాత గుర్తొచ్చిన టెన్నిసన్ పోయెమ్‌ని విదుషి పెద్దగా చదివింది.

I chatter over stony ways,
In little sharps and trebles,
I bubble into eddying bays,
I babble on the pebbles.

I wind about, and in and out,
With here a blossom sailing,
And here and there a lusty trout,
And here and there a graying.

I slip, I slide, I gloom, I glance,
Among my swimming swallows,
I make the netted sunbeam dance,
Against my sandy shallows!

And out again I curve and flow,
To join the brimming river,
For men may come and men may go
But I go on forever!

“నిజమే కదా, ఈ నది ఎన్నివేల సంవత్సరాలనుండీ ప్రవహిస్తోందో! మనుషు లొస్తున్నారు, పోతున్నారు!” అన్నది.

“అయామ్ ఇంప్రెస్డ్!” అన్నాడు ఆండ్రూ రేర్ వ్యూ మిర్రర్‌లో చూస్తూ. “ఎప్పుడు చదివావ్ దీన్ని?”

“హైస్కూల్లో!”

“యువర్ మెమరీ ఈజ్ వెరీ గుడ్!”

“దట్స్ వై యు హావ్ టు బి కేర్‌ఫుల్ విత్ హర్. నువ్వు ఈపాటికి ఏమేం అన్నావో అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టుకుంది. దే విల్ బి యూజ్డ్ ఎగైన్స్ట్ యు!” అన్నాడు రోహిత్ వెనక సీట్లోంచి.

“అనుభవంతో చెబుతున్నట్లున్నావ్!” అన్నాడు ఆండ్రూ.

“ఆబ్సొల్యూట్లీ. గుర్తున్నంత వరకూ కనీసం ఇరవయ్యేళ్ల అనుభవం!”

“ఆ పోయెమ్‌లో ఒక వీక్‌నెస్ చెప్పనా?” అడిగాడు ఆండ్రూ.

“వద్దన్నా చెబుతావ్ గదా, అడగడ మెందుకు?” అన్నది విదుషి.

“ఎందుకే పాపం అతన్ని అంతలేసి మాట లంటావ్?” అన్నారు భవానిగారు అల్లుడి మీద జాలితో.

“థింక్ అబవుటిట్ లాజికల్లీ. ఎక్కడో కొండమీద కొన్ని మంచుకణాలు కరిగి ఒక నీటిబిందువుగా మారతాయి. అలాంటి గజిలియన్ల నీటి బిందువులన్నీ కలిసి ప్రహించి కొంతకాలం తరువాత సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రంలో నీరు ఆవిరయి ఎక్కడో వాన రూపంలోనో లేక హిమాలయాల్లోనో, కిలిమంజారోమీదో, లేకపోతే వింటర్లో మన చుట్టుపక్కలో మంచురూపంలోనో కురుస్తాయి. అంటే, అదే నీటిబొట్టు ఎప్పుడూ ఒకేనదిలో గానీ, ఒకే బ్రూక్‌లో గానీ వుండట్లేదన్న మాట!” అన్నాడు ఆండ్రూ.

“భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మ లాంటి దన్నమాట ఈ నీటిబిందువు!” అన్నారు మూర్తిగారు.

“హైస్కూల్లో వరల్డ్ రెలిజియన్స్ క్లాస్‌లో చదివాం – హిందువులు ఆత్మకు మరణం లేదని నమ్ముతారని. ఈ నీటిబిందువు కూడా అలాంటిదే నంటున్నాడు ఆండ్రూ,” అన్నాడు హమీర్.

“నీ లాజిక్ ప్రకారం, నది అంటే, కోండల్లో మొదలై, సముద్రం చేరేదాకా నీళ్లు పోవడానికి భూమిమీద చేసిన ఒక gash – పర్ర మాత్రమే!” అన్నది విదుషి.

“కరక్ట్!” అన్నాడు ఆండ్రూ.

ముందు రెడ్ లైట్ కనిపించి వాన్ ఆగితే, “కొండల మధ్యలో కూడా సిగ్నల్ లైట్లుంటయ్యన్నమాట!” అన్నారు మూర్తిగారు. గ్రీన్ లైట్ వచ్చి బయలుదేరిన తరువాత వాళ్లకి అర్థమైంది – టెంపరరీగా వేసిన ఒక వంతెన మీంచి ఆ నదిని దాటి అవతలిపక్క ఒడ్డుమీద ప్రయాణించడం కోసం దాన్ని వేశారనీ, ఆ వంతెన ఒక కారు మాత్రమే పట్టే వెడల్పు వుండడంవల్ల రెండువైపులా ట్రాఫిక్ వెళ్లడానికి ఆ బ్రిడ్జిని ఉపయోగించేలా నియంత్రించడానికి ఆ లైట్ కావలసి వచ్చిందనీ.

(మెర్సెడ్ నదిని దాటడానికి వేసిన టెంపరరీ బ్రిడ్జ్; రాక్‌స్లైడ్‌ని కుడిపక్కగా కింద చూడొచ్చు)

“దీన్ని నది అన్నారుగానీ, ఒక యాభై గజాల వెడల్పు కూడాలేదు. అదే, కృష్ణా, గోదావరులైతే కనీసం కిలోమీటరు వెడల్పుంటాయ్ అన్నారు సరోజగారు.

“మీరు చెబుతోంది విజయవాడ దగ్గరి కృష్ణానది గూర్చీ, రాజమండ్రి దగ్గరి గోదావరి గూర్చీను. కొండల్లో పుట్టినచోట అవికూడా సన్నగానే వుంటయ్!” అన్నారు మూర్తిగారు.

“లుక్ ఆన్ ది రైట్ సైడ్! యు విల్ సీ ది రీజన్ ఫర్ దిస్ డీటూర్,” పాయింటవుట్ చేశాడు ఆండ్రూ. తాము అటువైపు ప్రయాణించిన రోడ్డులో ఒక ఫర్లాంగ్ మేర పక్కనున్న కొండమీంచి జారిపడిన మట్టీ, రాళ్లూ కలిసి ఆ దారిని కప్పేశాయి. దానికి రెండువైపులా వున్న హెవీ కన్స్‌ట్రక్షన్ ఎక్విప్‌మెంట్‌ని చూస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నం మొదలైందని అర్థమయింది.

(Rockslide over Highway 140)

ఎదురుగా వచ్చే ట్రాఫిక్కే లేకుండా అలా ఒక అరమైలు ప్రయాణించిన తరువాత కుడివైపున వున్న బ్రిడ్జ్ మీద ఆ నదిని దాటి మళ్లీ ఆ నదికి కుడివైపు ఒడ్డుమీద ప్రయాణించడం మొదలుపెట్టారు.

యోసమిటి నేషనల్ పార్క్‌లో ప్రవేశించడానికి ఎంట్రన్స్ ఫీ కట్టి, అదే రోడ్డుమీద వంద గజాలు కూడా ప్రయాణించకుండానే కుడిపక్కన మెర్సెడ్ నదీ, దానికి రెండుపక్కలా హుందాగా రెండు కొండల వరుసలూ ప్రకృతి అందాలకి వన్నె లద్దుతూ కనిపించాయి. ఇక్కడ కొండరాళ్లు వాళ్లు ముందు చూసిన రాళ్లకంటే చాలా పెద్దవి. నది ఉరవడికూడా ఎక్కువగానే వున్నది. ఆగి ఫోటోలు తీసుకున్నారు గానీ, చూడడానికి ఇంకా చాలా వున్నాయి అని మళ్లీ వాన్ ఎక్కి బయలుదేరారు.

కొంచెం దూరం ముందు కెళ్లిన తరువాత రోడ్డుకు ఎడమపక్క కార్లు ఆపివుండడాన్ని గమనించి వాళ్లూ వాన్‌ని పార్క్ చేసి దిగారు. ఎంట్రన్స్ ఫీ రసీదుతోబాటు ఇచ్చిన మాప్ చూసి, “ఎదురుగా కనిపిస్తున్నది ఎల్ కాపిటన్ – ది కేప్టెన్!” అన్నారు మూర్తిగారు.

(El Capitan)

 ”నీకు గుర్తున్నదా, క్రితం ఏడాది జనవరిలో ఇద్దరు కుర్రాళ్లు ఇంత స్టీప్‌గా కనిపిస్తున్న ఈ ఫేస్‌ని సేఫ్టీ హార్నెస్ లేవీ లేకుండానే వట్టి చేతులతో ఎక్కడం?” ఆండ్రూ విదుషికి గుర్తుచేశాడు.

“ఐ డూ రిమెంబర్!” అన్నాడు హమీర్.

“ఈ ఫేస్‌ని వట్టి చేతులతో ఎక్కారా!” ఆశ్చర్యపోయారు భవానిగారు.

“వాళ్లమ్మ ఎట్లా ఎక్కనిచ్చిం దసలు?” కనిపిస్తే నాలుగు చివాట్లు పెడతానన్న ధోరణిలో అడిగారు సరోజగారు.

వాన్ ఎక్కిన తరువాత, “నెక్స్ట్ స్టాప్ యోసమిటి విలేజ్?” అడిగాడు ఆండ్రూ.

“దానికన్నా ముందే చాలా దగ్గర్లో Bridal veil ఫాల్స్ వున్నాయి, చూద్దామా?” మాప్‌ని చూసి అడిగాడు రోహిత్. అయితే, దాన్ని చూడడానికి వాన్‌ని పార్క్ చేసిన తరువాత ట్రెయిల్ పట్టుకుని కొంతదూరం నడవా ల్సొచ్చింది. తీరా అది కనిపించిన తరువాత, పీలగా వున్న ఆ ఫాల్స్‌ని చూసి, “రాజుని చూసిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొట్టబుధ్ధయిందన్న సామెతలాగా, నయాగరా ఫాల్స్‌ని చూసిన కళ్లకి ఇది ఏమాత్రం ఆనడంలేదు!” అన్నారు సరోజగారు.

మళ్లీ వాన్ ఎక్కి యోసమిటీ విలేజ్ దగ్గర ఆపి దిగిన తరువాత, “ఇక్కణ్ణించీ వెర్నల్ ఫాల్సూ, నెవాడా ఫాల్స్‌ల దగ్గరికి ట్రెయిల్స్‌మీద నడుచుకుంటూ వెళ్లాలి,” అన్నాడు ఆండ్రూ.

“ఎంత దూరం నడవాలి?” అడిగారు భవానిగారు.

“అదే ట్రెయిల్ మీద నడుచుకుంటూ పోతే హాఫ్ డోమ్ దాకా వెళ్లొచ్చు. నేను రేప్పొద్దున్న చేసేది అదే. రౌండ్ ట్రిప్ పధ్నాలుగు గంటలు పడుతుంది,” అన్నాడు.

“అంతదూరం మేం నడవలేంగానీ, ఒక గంట నడుద్దామా?” అన్నారు భవానిగారు.

“లంచ్ చేసి బయలుదేరదామా?” అన్నది విదుషి.

“అంతగా జనాల్లేరు గానీ, ఇంకొకవారం ఆగితే స్కూళ్లు క్లోజ్ చేస్తారు గనక్ ఫ్యామిలీ వెకేషన్స్‌కి వచ్చేవాళ్లతో ఈ ప్లేస్ బిజీగా వుంటుంది,” అన్నాడు ఆండ్రూ చుట్టూ చూసి.

వాళ్లు పిజ్జాలు తెచ్చుకుని బయట కూర్చుని తింటున్నప్పుడు, ఎదురుగా ట్రాష్ కాన్ కనిపిస్తే దానికి దగ్గరగా వెళ్లి చూసివచ్చారు మూర్తిగారు.

“ట్రాష్ కాన్‌ని గూడా అంత పరిశీలనగా చూడాలా?” అడిగారు భవానిగారు.

“అది మామూలు ట్రాష్ కాన్ గాదు, బేర్ ప్రూఫ్! అంటే, రాత్రిళ్లు ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతూంట య్యన్నమాట!” అన్నారు మూర్తిగారు.

హమీర్‌కి బ్రైనార్డ్ లేక్ దగ్గరి తన అనుభవం గుర్తొచ్చింది.

“నువ్వు రేప్పొద్దున్న ఆరు గంటలకల్లా ట్రెయిల్ ఎక్కాలంటున్నావు. ఆ చీకట్లో బేర్స్ వుంటే?” భయంగా అడిగారు భవానిగారు.  ఆవిడకి కూడా హమీర్ అనుభవం గుర్తుంది.

“ఒక్కణ్ణే కాదుగా వెడుతోంది! రేపు హాఫ్ డోమ్ ఎక్కడానికి పర్మిషన్ వున్నవాళ్లంతా దాదాపు ఒకేసారి బయలుదేరాలి. పైగా, బేర్స్ చప్పుళ్లకి భయపడతాయి. అందుకని, అవి వుంటయ్యని తెలిసిన చోట్ల వాటికి, మేమొస్తున్నామని చెప్పడానికి గంట కొడుతూ నడుస్తూంటారు,” అన్నాడు ఆండ్రూ. ఆ జవాబుతో ఆమె మనసు కొంచెం కుదుటపడ్డది.

“రెస్ట్‌రూమ్‌కి వెళ్లొస్తా,” అని హమీర్ అటువైపు నడుస్తుంటే ఎదురుగా మీనా వస్తూ కనిపించింది.

“నన్ను వెంటాడుతున్నా వెందుకు?” అన్న హమీర్ ఆలోచనలు అతని పెదాలగుండా వెలువడబోతున్న క్షణంలో ఆమె నోట్లోంచి “అయామ్ సారీ!” అన్న మాటలు వెలువడ్డంవల్ల అతని నోట్లోనే ఆగిపోయాయి. ఆమె కళ్లు అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ అతనికి అర్థం అయినట్లేవుండి, గుప్తంగా వుండే భావాలని అతనికి చేరవేశాయి.

“నన్ను వెంటాడడానికి ఇంత దూరం రావాలా?” అతను అనుకున్నంత తీవ్రత మాటల్లో వుండకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలగజేసింది.

“వాటిఫ్ ఐ సే ఐ విల్ కమ్ టు ది ఎండాఫ్ ది ఎర్త్?” ఎదురు ప్రశ్న వేసింది మీనా.

ఆమె అందించిన ఆలివ్ బ్రాంచ్‌ని అందుకోవడానికి సిధ్ధంగా లేక, “టూ లేట్ ఫర్ దట్!” అని అక్కణ్ణుంచీ కదిలాడు. “ఎంత పొగరు! పెళ్లక్కర్లేదని వెళ్లిపోయి, ఒక్క అయామ్ సారీతో మా క్షోభ నంతటినీ మరచిపొమ్మంటోంది!” తనలో గొణుక్కున్నాడు.

ఆమె మెడ వంపులో తన తలని ఆనించడాన్ని అతను మరునాడు కోరుకుంటాడని అతనికి ఆ క్షణాన తెలియదు.

***

లంచ్ అయిన తరువాత పక్కనే వున్న విజిటర్స్ సెంటర్‌కెళ్లి అక్కడ 3-డి లో అమర్చిన యోసమిటి నమూనా చూశారు. గ్లేసియర్ కరిగి ఆ నీరు ప్రవహించడంవల్ల ఆ వ్యాలీ ఏర్పడిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అందువల్లే కొన్ని కొండల ఉపరితలం బాగా నున్నగా వున్నదనీ, కొండల్లాగా కనిపిస్తున్న కొన్ని ఇసుక, రాళ్లూ కలిసి వేసిన మేట మాత్రమే అనీ తెలిసి ముక్కుమీద వేలేసుకున్నారు – “ఇదంతా నీటి కోతవల్ల ఏర్పడిందా!” అంటూ.

“గ్రాండ్ కాన్యాన్ కూడా అలాగే ఏర్పడింది గదా!” అన్నారు మూర్తిగారు.

అక్కణ్ణించీ బయలుదేరి కర్రీ విలేజ్ దగ్గర్ వాన్‌ని పార్క్‌చేసి నడిచి హాపీ ఐల్స్ బ్రిడ్జి మీద మెర్సెడ్ రివర్‌ని దాటిన తరువాత కుడిపక్కన జాన్ మ్యూర్ ట్రెయిల్ కనిపించింది. అక్కడ నడిచే దారంతా తారు రోడ్డు వేసివుండడం ఒక్క ఆండ్రూకి తప్ప అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. దానిమీద నడవడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే కొండ ఎత్తు పెరుగుతూండడం తెలిసివచ్చింది. ఒకపక్కనించీ హోరున వినవస్తున్న నది శబ్దం, రెండోవైపునించీ దాన్ని డ్రౌన్ చేస్తున్నట్లుగా నడకే అలవాటులేనివాళ్లు పడుతున్న ఆయాసం.

“ఇంక నడవలేం,” అన్నారు భవాని, సరోజగార్లు.

“వెర్నల్ ఫాల్స్‌నయినా చూడండి వెనక్కి తిరిగేముందు. ఇంతదూరం వచ్చాం కదా!” అన్నాడు ఆండ్రూ.

“మెల్లిగానే నడవండి. తొందరేం లేదు గదా! నేను వీళ్లతో వస్తూంటాను. మీరు వెళ్లండి,” అన్నారు మూర్తిగారు. ఆ నడక ఆయనకీ ఆయాసాన్ని తెప్పిస్తోంది.

“అక్కడ వెంకటేశ్వరస్వామి గుడి వున్నది తెలుసా?” అన్నాడు రోహిత్.

“అదే  నిజమయ్యుంటే ఈపాటికి బస్సులు వెళ్లడానికి వీలయ్యేలా రోడ్లని ఎప్పుడో వేసేవాళ్లు. మాకీ నడక తప్పేది,” జవాబిచ్చారు భవానిగారు. విదుషి నవ్వి రోహిత్ భుజమ్మీద చరిచింది. కుర్రవాళ్లు నలుగురూ తొందరలోనే పెద్దవాళ్లకు కనిపించకుండా మాయమయిపోయారు.

ఆ నలుగురూ నడుచుకుంటూ వెర్నల్ ఫాల్స్ కనిపించే బ్రిడ్జ్ దగ్గరకి వచ్చేసరికి అది అక్కడ ఆ ఫాల్స్‌ని దాటడానికి వేసిన బ్రిడ్జ్ మాత్రమేననీ, దానిమీద నిల్చొని చూస్తే ఒకవైపున కొంచెం దూరంలో వెర్నల్ ఫాల్స్, దానికి వీపుపెట్టిచూస్తే డౌన్‌స్ట్రీంలో నీటిప్రవాహమూ కనిపిస్తయ్యని వాళ్లకి తెలిసింది. “నువ్వు మమ్మల్నేమీ చెయ్యలేవు చూసుకో,” అని చెబుతున్నట్టుగా పెద్దపెద్ద కొండరాళ్లు అడ్డంగా నిల్చుంటే వొదిగిపోతున్నట్టు నటిస్తూ వాటిచుట్టూ తిరిగిపోతోంది నది నీరు.   ఆ బ్రిడ్జ్‌ని దాటిన తరువాత ట్రెయిల్ ఎడమపక్కకి తిరిగి దాని ఒడ్డునే కొనసాగింది.

(Vernal Falls)

“నెక్స్ట్ స్టాపీజ్ వెర్నల్ ఫాల్స్! అంటే ఎదురుగా కనిపిస్తున్న ఫాల్స్‌మీంచి పడే నీటి ఎత్తుకి,” అన్నాడు ఆండ్రూ.

మాప్‌ని చూసి, “ఇక్కణ్ణించీ మైలుకిపైగా వున్నది దూరం. పైగా, ఇది ఫ్లాట్ గ్రవుండ్ మీద నడిచినట్టేం కాదు. నేను రాలేను,” అన్నది విదుషి.

(Vernal Falls Downstream view)

“అయితే నువ్విక్కడే ఆగిపోతావా? కాసేపట్లో మీ పారెంట్స్ కంపెనీ యిస్తారు?” అన్నాడు ఆండ్రూ. వాళ్లలాంటి విజిటర్లు అక్కడున్నారు కాబట్టి జంతువులు ఎటాక్ చేస్తాయనే భయమేమీ లేదు. అక్కడొక పెద్ద రాయిమీద ఆమె కూర్చున్న తరువాత ఆమెకు కెమేరాని ఇచ్చి హమీర్, రోహిత్‌లతో ఆండ్రూ బయలుదేరాడు. ఆ ఫాల్స్ ఇంకా యాభై అడుగుల ఎత్తులో వుందనగా ఆ జలపాతం నించీ వచ్చే తుంపర దారిలో రాళ్లమీద పడి జారిపడతామని భయపడేలా చేస్తోంది. అక్కడక్కడా హాండ్ రెయిల్స్ వున్నాయి గానీ కిందకు దిగేవాళ్లకి దారినివ్వడంకోసం కొన్నిచోట్ల పక్కకు తిరిగి నిలబడవలసి వచ్చింది. ఆ జలపాతం పడే చోటుకు పక్కగావున్న అబ్సర్వేషన్ డెక్‌మీదనించీ కిందకు చూసి, “అద్భుతం!” అనుకున్నారు.

“విదు డజన్ట్ నో వాట్ షి ఈజ్ మిస్సింగ్!” అన్నాడు ఆండ్రూ.

హమీర్, రోహిత్ అక్కణ్ణించీ వెనక్కు తిరుగుదా మన్నారు. సమ్మరే కదా అనుకుని వాళ్లిద్దరూ షార్ట్స్ వేసుకొచ్చారు. ఆ ఫాల్స్‌మీద నుంచీ పడ్డ తుంపరలు వాళ్ల కాళ్లని తడిపెయ్. దానివల్ల ఆ ఎత్తులో వాళ్లకి బాగా చలివేస్తున్న ట్లనిపించింది. సరే, ఎలాగో నేను రేపు వస్తాను కదా అనుకుని ఆండ్రూ కూడా వెనుదిరిగాడు.

కిందకు దిగడం తేలికయిన పనే కాబట్టి వాళ్లు త్వరగానే విదుషి కూర్చున్న చోటుని చేరుకోగలిగారు. అప్పటికి పెద్దవాళ్లు ముగ్గురూ అక్కడకు చేరుకున్నారు. వాళ్లతో మీనా, ఆమె తండ్రి రావుగారు మాట్లాడుతూ వుండడాన్ని చూసి, “వీళ్లు నన్ను బంకలా పట్టుకుని వున్నారెందుకని?” అనుకున్నాడు హమీర్. పొద్దున్న బ్రెక్‌ఫాస్ట్ టైమ్‌లో మూర్తిగారు వాళ్లతో మాట్లాడడం చూశాడు కాబట్టి ఇప్పుడతనికి అది ఆశ్చర్య మనిపించలేదు.  మూర్తిగారు రావుగారికీ, మీనాకీ ఆ ఫాల్స్ బాక్‌గ్రవుండ్‌లో ఫోటో తీసి, తమ ఏడుగురికీ తియ్యమని కెమేరాని రావుగారి కిచ్చారు.

కిందకు దిగిన తరువాత అలాగే ముందుకు పోతే మిర్రర్ లేక్ చూడచ్చన్నాడు ఆండ్రూ. కాదు, ఇంక నడవలేం, ఎడమవైపుకు తిరిగి హాపీ ఐల్స్ బ్రిడ్జీని దాటి పార్కింగ్ లాట్‌కి వెడదామన్నారు భవాని, సరోజ గార్లు. సరే, వాళ్లకి మరునాడు హాఫ్ డోమ్‌ని గ్లేసియర్ పాయింట్‌నించీ చూపించిన తరువాత ఆ లేక్ దగ్గరికి తీసుకెళ్లు అని విదుషికి చెప్పాడు ఆండ్రూ.

***
వాన్‌లో బయలుదేరిన తరువాత కాసేపు మౌనంగా బయటకు చూస్తూ కూర్చున్నాడు హమీర్. మిగిలినవాళ్లు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోలేదు. కాసేపటికి బర్‌స్ట్ అయ్యాడు – “వాళ్లతో మీరెట్లా మాట్లాడగలుగుతున్నా రసలు? మామ్, నువ్వు కూడా!” అంటూ.

అతను అన్న ఆ “వాళ్లు” ఎవరో అందరికీ అర్థమయిన తరువాత వాన్‌లో కాసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది. విదుషి ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసింది – “వావ్! అనుకున్న దానికన్నా ఎక్కువసేపే కంట్రోల్ చేసుకున్నావ్,” అంటూ.

“యు మీన్ – దిస్ వజ్ ప్లాన్డ్?” హమీర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. “వై ఈజ్ దిస్ కాన్‌స్పిరసీ? మామ్, హౌ కుడు యు జాయిన్ దెమ్?” కోపంగా అడిగాడు.

“ఇందులో కాన్‌స్పిరసీ ఏమున్నదిరా. ఒకప్పుడు నువ్వు చేసుకుందా మనుకున్న అమ్మాయే కదా!” అన్నారు సరోజగారు.

“నీకు చేసిన అవమానాన్ని అంత తేలిగ్గా ఎలా తీసిపారెయ్య గలుగుతున్నావ్?” కోపానికి చికాకుని కలగలిపి అడిగాడు.

“పిల్లలన్న తరువాత తప్పు చెయ్యకుండా ఎలావుంటారు? అయినా, అందులో ఆ పిల్ల తప్పేమున్నది? తల్లి మనసు నొప్పించకుండా వుండడంకోసం తన జీవితాన్నే శాక్రిఫైస్ చెయ్యడానికి సిధ్ధపడిందిగదా – నీలాగే?” అన్నారావిడ.

“ఇప్పుడా తల్లే పోయేసరికి ఆ శాక్రిఫైస్ అవసరం లేకుండా పోయిందన్నమాట!” వ్యంగ్యంగా అన్నాడు.

“ఇప్పటిదాకా పెళ్లికి నో చెప్పినా, ఆవిడే బ్రతికుంటే ఇంకో సంవత్సరం అయిన తరువాత అయినా ఆవిడ మనసు నొప్పించకుండా వుండడంకోసం ఇంకొకళ్లని పెళ్లి చేసుకుని మీనా ఎంత బాధపడేదో ఆలోచించు!” అన్నది విదుషి.

“ఇది తెలుగు సినిమా శాక్రిఫైస్! అమెరికాలో పుట్టి, పెరిగి, ఇలా ఆలోచించే వాళ్లుంటారా?” పక్కనే కూర్చున్న విదుషివైపు తిరిగి అడిగాడు హమీర్.

“నువ్వు, మీనా ఒక విధంగా స్పెషల్. విదుషికి రోహిత్ వున్నాడు గానీ, రావుగారి తరువాత మీనాకీ, నా తరువాత నీకూ రక్త సంబంధీకులు ఇంకెవరుంటారు? మీరేమో ఇండియా వచ్చి సెటిలయే ఆలోచననే దగ్గరకు రానివ్వరు. మీకీ దేశంలో అంకుల్స్ గానీ, కజిన్స్ గానీ లేరు. మేమంటే చిన్నప్పటినించీ మా కజిన్స్‌తోనూ, అంకుల్స్‌తోనూ, ఆంటీలతోనూ అనుబంధాలతో పెరిగాం గానీ, మీరు ఇండియా వచ్చినా గానీ ఇండియాలో వున్నా గానీ హలో అంటే హలో అనుకునేటంత తప్ప మీకు వాళ్లతో బంధా లేముంటాయి? మీ డాడీ, నేనూ ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచీ ఇక్కడ బతకడం గూర్చే చూసుకున్నాం తప్పితే, ఈ విషయా న్నెప్పుడూ ఆలోచించలేదు. తరువాతి తరంగూర్చి మా మొదటి తరం వాళ్లు అంతగా ఆలోచించరేమో!” అన్నారు సరోజగారు.

“ఎప్పటినించీ ప్లాన్ చేశావ్?” విదుషిని అడిగాడు హమీర్.

“నువ్వు లాస్ట్ సెప్టెంబర్లో బౌల్డర్ వెళ్లే ముందునించీ.”

హమీర్ షాకయ్యాడు. “అంటే, డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో మీనా నన్ను కలవడం యాక్సిడెంట్ కాదన్నమాట!”

“ఏమాత్రం కాదు. నీ ట్రిప్ ఐటినరరీని నువ్వు మామ్‌కిచ్చినా గానీ, అందువల్ల నాకు తెలిసినా గానీ, అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నిన్నెట్లా కలవగలదో అని మీనా బెంగపెట్టుకుంది. నీకు గుర్తుందో, లేదో, నువ్వు వెనక్కి తిరిగివచ్చే రోజున ఎయిర్‌పోర్ట్‌లో నువ్వెక్కడ వున్నావని నీకు ఫోన్ చేసి ఎందుకు కనుక్కున్నా ననుకున్నావు? తను నిన్ను తప్పకుండా కలవగలిగేలా చెయ్యడంకోసం! ఆ ముందురోజు రాత్రి నువ్వు ఆండ్రూతో మాట్లాడుతునప్పుడు నీ ఫ్లయిట్ వివరాలు కన్‌ఫర్మ్ చేసుకోవాలని తనకి గుర్తులేదు. కనీసం మాట్లాడుతోంది నీతోనని నాకు చెప్పివుంటే అప్పుడు నేనయినా గుర్తుచేసి అడిగించేదాన్ని,” అన్నది విదుషి.

“నేను చెప్పానా, విదుషి మెమరీ ఎంత పవర్ఫుల్లో! సీ ఆండ్రూ, తొమ్మిది నెలల తరువాత కూడా ఎలా గుర్తుపెట్టుకుందో!” అన్నాడు రోహిత్.

“యు ఆర్ టెల్లింగ్ మి! ఐ హియర్ ఇట్ ఎవిరి డే,” జవాబిచ్చాడు ఆండ్రూ.

“ఎనీవే, ఇట్ వజ్ ఎ బ్లెస్సింగ్ ఆల్సో. ఆండ్రూ ఆ వివరాలు కనుక్కోకపోవడంవల్ల నేను రియల్‌టైమ్‌లో మీనాని నీ దగ్గరకు గైడ్ చెయ్యడానికి వీలయ్యింది.”

పాత గాయం ఇంకా మదిలో సలుపుతూండడంచేత హమీర్ వ్యంగ్యంగా అన్నాడు – “అంటే, వాళ్లమ్మ పోయిన మూణ్ణాలుగు నెలలకే అడ్డం తొలగింది కదా అని ఎగురుకుంటూ వచ్చిందన్నమాట!”

“మరీ అంత తిక్కగా మాట్లాడకు! అంతగా ఎగురుకుంటూ వచ్చేదే అయితే ఆవిడ పోయిన మరునాడే నీకు ఫోన్ చేసేది!” విదుషి కోపంగా జవాబిచ్చింది.

“మూణ్ణాలుగు నెలలు ఆగితే చాలని ఎవరు చెప్పారో?”

“వాళ్లమ్మ బిహేవ్ చేసిన తీరు అసభ్యంగా వున్నదని వాళ్ల డాడీ చెప్పార్ట. మీ అమ్మ పెళ్లంటే ఒక పిల్లాణ్ణీ, ఒక పిల్లనీ కలిపి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేస్తే చాలు అనే భ్రమలో వున్నది, మాకప్పుడు ఆ సమాజంలో అది తప్పలేదు గానీ, మీ జెనరేషన్లో వాళ్లు మీరంతట మీరే నిర్ణయించుకున్న తరువాత మేం కాదని అనడం మూర్ఖత్వం అవుతుంది, అని ఆయన మీనాకి చెప్పార్ట. ఇటు భార్య మాటకి ఎదురుచెప్పి ఆవిణ్ణి నొప్పించడం యిష్టంలేక, అటు కూతురు బాధపడడం చూసి తట్టుకోలేక తను పోకపోవడమే ఆశ్చర్యకరం అన్నాట్ట ఆయన. అందుకే, వాళ్లమ్మ పోయిన పదిరోజులకే మీనాని కూర్చొబెట్టి, ఇప్పుడు నీకు ఒకే పేరెంటు, హమీర్‌కీ ఒకే పేరెంటు. నువ్వు పెళ్లిచేసుకునే వాడెవడో, ఏదో చుట్టపు చూపుగా తప్ప నన్ను నీ ఛాయలకే రానివ్వనంటే ఏం చేస్తావ్? అని అడిగార్ట. ఆ సంగతి అమ్మనే అడక్కపోయారా అన్నదట మీనా. ఆయన అడిగాట్ట. ఒకవేళ తనే పోతే ఆవిడ పరిస్థితి ఏమవుతుందని. ఆవిడ మొండిగా, దానిగూర్చి నేను ఆలోచించను. ఆ అవసరం వచ్చినప్పుడు చూస్తాలే అన్నదట!”

“ఈ గోలేదో తను డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లోనే చెప్పొచ్చుగా! ఈ హైడ్ అండ్ సీక్ దేనికి?” మీనామీద తనకోపం ఐస్‌క్రీమ్‌లా కరుగుతుండగా అడిగాడు హమీర్.

“నువ్వు హర్ట్ అయ్యావని తెలుసు. పైగా, బ్రేక్ అయిన తరువాత మొదటిసారి కలిసినప్పుడు, మా అమ్మ పోయింది, మనమింక పెళ్లిచేసుకోవచ్చు అని ఎలా చెబుతుంది? నువ్వు చాలా హోస్టైల్‌గా బిహేవ్ చేశావని చెప్పిందిలే, ఏడుస్తూ. నీకో విషయం తెలుసా? ఆ ఎయిర్‌పోర్ట్‌లో తను నిన్ను కలిసిన తరువాత ఏ వూరికీ వెళ్లలా. తిన్నగా బౌల్డర్లోని తనింటికే వెళ్లింది.

“నాతో శాన్ ఫ్రాన్సిస్కో వెడుతున్నట్లు చెప్పిందే!”

“అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నిన్ను సెక్యూరిటీ క్లియరెన్స్ అయిన తరువాత గేటు చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడా ష్యూర్‌గా కలవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే, తనుకూడా ఎక్కడికో ఒకచోటికి వెళ్లడానికి టికెట్ కొనుక్కోక తప్పలేదు. నీ ఐటినరరీని మామ్ దగ్గర తీసుకున్నాను. నువ్వు ఏ వూరెళ్లినా మాకు ఆ డీటెయిల్స్ ఇచ్చిగానీ వెళ్లకూడదని రూలుంది గదా మరి! నీ ఫ్లయిట్ ఎన్నింటికో చెప్పాను. అలాగే నువ్వు కాఫీ ఎక్కడ కొనుక్కుంటున్నావో చెప్పాను. అప్పటికీ, నిన్ను దూరంగా చూసిన తరువాత కలవకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోదా మనుకున్నదిట. ఫోన్లో నాకు చెబితే కోప్పడ్డాను. వాడికి ప్రస్తుతం గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, ఇంకా డిప్రెషన్లోనే వున్నాడు, పైగా, మా పేరెంట్స్ గానీ, ఇండియాలోవున్న ఆంటీగానీ ఏ పెళ్లి సంబంధం చెప్పినా ఇంటరెస్ట్ చూపించట్లేదు అని వున్న నిజాన్ని చెప్పి నేనే ఎంకరేజ్ చేశాను నిన్ను కలవకుండా వెళ్లొద్దని!” అన్నది విదుషి.

“అయితే, తనూ, వాళ్ల నాన్నా ఈ ట్రిప్పుకి ముందరే మీతో మాట్లాడి వుంటారు,” అన్నాడు హమీర్ ముందు సీట్లల్లో కూర్చున్న పెద్దవాళ్లవైపు చూస్తూ. మొహాలు అతనికి కనిపించకపోయినా, వాళ్ల మౌనమే అతనికి జవాబిచ్చింది.

“వాళ్లమ్మ పోయిన తరువాత గానీ నీ జీవితంలో మీ డాడీ లేని లోటుని అర్థం చేసుకోలేక పోయిందట!” అన్నది సరోజగారు.

“మామ్, మీనా నీతో ఎన్నిసార్లు మాట్లాడింది నువ్వు వచ్చిన తరువాత?” క్యూరియాసిటీతోనే అయినాగానీ, ఇంటరాగేట్ చేస్తున్నట్లు హమీర్ తల్లిని అడిగాడు.

“కనీసం … అరడజను సార్లయ్యుండదూ? ప్రతీ సారీ, అయామ్ సారీ ఆంటీ ఫర్ వాట్ వుయ్ పుట్ యు త్రూ అన్నది.”

“నువ్వేం చెప్పావ్?”

“నా దేమున్నదమ్మా, నువ్వు, వాడు పెళ్లి చేసుకుందా మనుకున్నారు. తరువాత నువ్వు వద్దనుకున్నావు. ఇప్పుడు నీకు వాడు కావాలనిపిస్తోంది. అదేదో నువ్వే వాడికి చెప్పు, అన్నాను,” అన్నారు సరోజగారు.

“నువ్వు డెన్వర్ నించీ వచ్చిన తరువాత నీకు ఫోన్ చెయ్యడానికి రెండు, మూడుసార్లు ట్రైచేసిందట. నువ్వే కాలర్ ఐడిలో చూసి బ్లాక్ చేశావుట. ఫ్రెండ్ నంబర్నించీ చేసినా గానీ తన గొంతుని వినగానే ఫోన్ పెట్టేశావని చెప్పింది,” అన్నారు భవానిగారు.

“మీ విషయంలో వేలుపెడుతున్నానని కాక, మీ డాడీలాగా ఆలోచించి చెబుతున్నా ననుకో. మీనా మంచిపిల్ల. నిన్ను కావాలనుకుంటోంది. ఇంతకన్నా గొప్ప సంబంధం నీకు దొరకదు!” అన్నారు మూర్తిగారు.

“అమాని కూడా తనని కావాలనుకుంది. కానీ, ఆమెకోసం ఏ త్యాగమూ చెయ్యగలిగే పరిస్థితిలో తాను లేడు. ఇక్కడ ఏ త్యాగమూ అవసరంలేదు గానీ మనసు ఇంకా పాత విషయాలని గుర్తు చేస్తూ మొరాయిస్తోంది,” అనుకుని మౌనంగా వుండిపోయాడు హమీర్.

అప్పటికి వాళ్ల వాన్ హైవే 140మీద మెర్సెడ్‌కు చేరే ముందున్న ఒకేఒక లైట్ దగ్గర ఆగి, డైవర్షన్ తీసుకుని అవతలి ఒడ్డుమీద వున్న రోడ్డుమీద వెళ్లడం మొదలుపెట్టింది. ఎడమపక్కన అవతలి ఒడ్డున కనిపిస్తున్న ఆ రాక్‌స్లైడ్‌ని వెనక విండో సీట్లో కూర్చున్న రోహిత్ విడియో తియ్యడం మొదలుపెట్టాడు.

“దానిక్రింద ఏదన్నా కారు ఇరుక్కునిపోయి వుండుంటే?” అన్నాడు ఆండ్రూ డ్రైవ్ చేస్తూనే దాన్ని చూస్తూ.

“ఎవరయినా కళ్లతో చూసివుంటే తప్ప అక్కడ అలాంటిది జరిగిందని ఎవరికీ తెలిసే ఛాన్సే లేదు,” అన్నాడు రోహిత్.

“ఆ రాక్‌స్లైడ్ ఎప్పుడు జరిగిందో?” అన్నారు మూర్తిగారు తనలోనే తను అనుకుంటున్నట్లుగా.

హమీర్ తన స్మార్ట్ ఫోన్లో చెక్ చేసి, “2006లో,” అన్నాడు.

“ఏ నెల?” మూర్తిగారు అడిగారు ఆదుర్దాని కప్పిపుచ్చుకుంటూ.

“ఏప్రిల్!” హమీర్ జవాబిచ్చాడు.

“తారీకు వివరాలు ఏమయినా వున్నాయా?” అడిగారు మూర్తిగారు. తనకి ఆ క్షణానే హార్ట్ ఎటాక్ వస్తుం దనిపించిం దాయనకి.

“ఏప్రిల్ నెల్లో చివరివారం,” హమీర్ జవాబు చెప్పాడు.

“సరోజగారు వాలిపోతున్నారు, కారాపండి!” అరిచారు భవానిగారు.

ఇంతకాలం మరుగునపడివున్న 2006 ఏప్రిల్ నెల చివరివారం సిగ్నిఫికెన్స్ అప్పుడు గుర్తొచ్చింది హమీర్‌కి. అప్పుడే కదూ, తన తండ్రి జాడ తెలియకుండా పోయినది, కారుతో సహా?

ఇంకా ఉంది..