ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – తొమ్మిదవ భాగం

డిసెంబర్ 2016

9

“రండి, రండి. ఈ దసరాల సమయంలో మీ రాక మా కెంతో ఆనందాన్నిస్తోంది,” అన్నారు మూర్తిగారు. ముందుగా వనజగారు, ఆవిడ వెనక రావుగారు, చివరగా మీనా మూర్తిగారింట్లోకి ప్రవేశించారు. లివింగ్ రూమ్‌లో అప్పటికే ఆయన కుటుంబ సభ్యులుండడం చూసి అటువైపు అడుగేశారు.

“మా ఆవిడ భవాని, అమ్మాయి విదుషి, అబ్బాయి రోహిత్, హమీర్ వాళ్లమ్మగారు సరోజ గారు!” మూర్తిగారు పరిచయం చేశారు.

“మీకీపాటికి తెలిసేవుంటుంది గానీ, నౌ యు కెన్ పుట్ ది ఫేసెస్ టు ది నేమ్స్ – నా భార్య వనజ, ఏకైక పుత్రిక మీనా,” రావుగారు తనవంతు పరిచయం చేశారు.

అప్పటికే రెడీగా వున్న స్నాక్స్‌ని అందించారు విదుషి, రోహిత్‌లు.

అక్కడ వున్న పియానోని చూసి, “మామ్, హమీర్ ప్లేస్ పియానో వెరీ వెల్,” అన్నది మీనా.

“పదేళ్లబాటు నేర్చుకున్నాడు,” అన్నారు సరోజగారు.

“వెల్, ఇది మీదే గదా!” అన్నారు మూర్తిగారు.

“అవునుగానీ, ఇప్పుడు మీరు తీసు కెడతా నంటే మాత్రం ఆయన ఇంకొకదాన్ని వెదుక్కోవాల్సుంటుంది,” అన్నారు భవానిగారు.

“డాడ్, యు ఆర్ లెర్నింగ్ పియానో?” ఆశ్చర్యపోతూ అడిగింది విదుషి.

“నౌ దట్ ది కాట్ ఈజ్ అవుటాఫ్ ది బాగ్, యస్! ఇప్పుడు నిన్నూ, వాణ్ణీ ఆ క్లాసులకనీ, ఈ యాక్టివిటీకి అని తిప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ ఫ్రీ టైమ్‌ని ప్రొడక్టివ్‌గా వుపయోగిద్దామనీ!” అన్నారు మూర్తిగారు.

“అయామ్  ప్రౌడాఫ్ యు, డాడ్! యు విల్ బి ఏన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ ఎ లాటాఫ్ పీపుల్!” అన్నది విదుషి సోఫాలో కూర్చున్న ఆయన మెడచుట్టూ వెనకనుంచీ చేతులువేసి తలమీద ముద్దుపెడుతూ.

“మీరు వాయిస్తా నంటే వినడానికి సిధ్ధంగా వున్నాం, ” అన్నారు అప్పటిదాకా సైలెంట్‌గా వున్న రావుగారు.

“యస్, డాడ్,” అన్నది విదుషి.

“మరింకేం! వాయించి వినిపించండి!” అన్నారు వనజగారు.

“నేనింకా ఆ స్థాయికి రాలేదు గానీ, కావాలంటే హమీర్ వాయించవచ్చు,” అన్నారు మూర్తిగారు.

“నీకు వాయించడం వచ్చా?” మీనాని అడిగారు సరోజగారు.

“రాదు ఆంటీ,” జవాబిచ్చింది మీనా.

“కమాన్ మాన్! ఐ డోన్ట్ రిమెమ్బర్ ది లాస్ట్ టైమ్ ఐ హర్డ్ యు ప్లే. గివ్ అజ్ ఎ ట్రీట్!” ఎంకరేజ్ చేశాడు రోహిత్.

“ఇది బావుంది. మా కాలంలో పెళ్లిచూపులంటే చూడ్డాని కొచ్చిన మగపెళ్లివాళ్లు అమ్మాయిని అడిగేవాళ్లు పాడమనో, వీణ వాయించమనో!  ఇక్కడ ప్లేసులు తారుమా రయ్యాయి,” అన్నారు సరోజగారు.  రావుగారు చటుక్కున భార్యవైపు చూసి ఆమె మొహం ఎర్రబడడం గమనించారు.

“మేం అమ్మాయిని చూసుకోవడానికి మిమ్మల్ని రమ్మనమనే చెప్పాం.  మీ అందరికీ రావడానికి కుదరడం లేదనీ, మీరు ఇండియానుంచీ రాగానే అలిసిపో యుంటారనీ మూర్తిగారే మమ్మల్ని రమ్మన్నారు!” అన్నారు వనజగారు కొంచెం అఫెన్స్‌నీ కొంచెం డిఫెన్స్‌నీ జతకలిపి.

“ఈక్వల్స్ మధ్య ఫార్మాలిటీ సేముంటాయండీ? నామటుకు నాకు మగపెళ్లివాళ్లు ఎక్కువనీ ఆడపెళ్లివాళ్లు తక్కువనీ ఏంలేదు. అయామ్ వెరీ ఇన్‌ఫార్మల్, ” అన్నారు మూర్తిగారు వాతావరణాన్ని తేలిక చెయ్యడానికి ప్రయత్నిస్తూ, ఆవిణ్ణి శాంతపరచడానికి.

“దిసీజ్ అమెరికా ఆంటీ! అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ!” అని విదుషి సరోజగారికి చెప్పి మీనావైపు తిరిగి, “పియానో బాగా వాయించలేదని ఈ సంబంధం కుదరదని అనడానికి మాత్రం నీకు వీల్లేదు మీనా!” బెదిరించింది.

“డోన్ట్ వర్రీ! హి ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ మి దట్ ఛాన్స్!” మీనా జవాబిచ్చింది.

“డాడీ, యు నో, మీనా, నేను మిడిల్ స్కూల్లో క్లాస్‌మేట్లం! దే మువ్డ్ ఎవే ఆఫ్టర్ దట్,” విదుషి తండ్రితో చెప్పింది.

“వావ్! ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్. బోతాఫ్ యు ఆర్ స్టడీయింగ్ మెడిసిన్ టూ! యు కెప్ట్ ఇన్ టచ్?” అన్నారు మూర్తిగారు.

“నాట్ అంటిల్ ఐ హర్డ్ అబవుట్ హర్ ఫ్రమ్ హమీర్! అప్పటినించీ ఫేస్‌బుక్ కాంటాక్ట్.”

“నువ్వు వాయించడం నేను విని గూడా చాలా కాలమయిందిరా,” ఇంకే మాలస్య మన్నట్టు అన్నారు సరోజగారు.

“ట్యూన్ చేయించి ఇంకా నెలకూడా కాలేదు! పియానో టీచర్ మొదటిసారి రాగానే అవుటాఫ్ ట్యూన్, వినలేకుండా వున్నాను, ముందు అర్జెంట్‌గా ట్యూన్ చేయించాలి అన్నారు.  ఏడాది కోసారి చేయించాలి అని గుర్తు చేస్తే నెలక్రితం మళ్లీ ముట్టచెప్పాను.  డబ్బు లయితే పోయాయి గానీ, నాకు మాత్రం ఆ ట్యూన్ చేయించినదాని ఫలితం ఏమీ వినిపించలా! ” అన్నారు మూర్తిగారు.

“యు నీడ్ ఎ మ్యుజీషియన్స్ యియర్ ఫర్ దట్ డాడ్!” అన్నది విదుషి.

“ప్లీజ్!” మౌనంగానే పెదవులని కదుపుతూ హమీర్ తనవైపు చూస్తున్నప్పుడు మీనా అడిగి, పెద్దగా, “మూన్‌లైట్ సొనాటా! ” అన్నది.

హమీర్ వెళ్లి పియానో ముందు కూర్చుని, కీబోర్డుకు వున్న కవర్ తీశాడు.

“ఐ డోన్ట్ హావ్ ది స్కోర్ బుక్. ఆ సీటుకింద అరలో వుండి వుంటే తప్ప! ” అన్నారు మూర్తిగారు.

“వాడికి పుస్తకం అక్కర్లేదు!” అని సరోజగారు, “హి డజన్ట్ నీడ్ ది బుక్!” అని మీనా ఒకేసారి అనగానే విదుషి మూర్తిగారి వైపు చూసి నవ్వింది.

హమీర్ వాయించిన ఆ పదిహేను నిముషాలూ తన్మయులై విన్నారు దాదాపు అందరూ. పదిహేను నిముషాలు ఎక్కువన్నట్టుగా సోఫాలో మధ్యలో అటూ ఇటూ కదిలారు వనజగారు. మధ్యలో ‘మంచినీళ్లు కావా’లన్నట్టు ఆవిడ సంజ్ఞ చేస్తే విదుషి లేచి వెళ్లి తెచ్చిచ్చింది. అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు.

“కొన్ని తప్పులున్నాయ్! ” అన్నాడు హమీర్.

“మాకు తెలియదు, చెప్పకు! ” అన్నారు మూర్తిగారు.

“ఆయన కెంత యిష్టమో, ఈ పాటంటే!” అని కళ్లు తుడుచుకున్నారు సరోజగారు.  ఆ మాటలతో అక్కడ ఒక్కసారి నిశ్శబ్దం నెలకొంది.

ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేద్దామని,  “నైస్ టు సీ యు ఎగైన్! వుయ్ విల్ బి సీయింగ్ మోర్ ఆఫ్ ఈచ్ అదర్!” అన్నారు మూర్తిగారు మీనాతో.

“ఎగైనా? అంటే నువ్వింతకు ముందే ఆయన్ని కలిశావా? నాకు చెప్పలేదేం?” వనజగారు మీనాని నిలదీశారు.

“నేనేదో పనిమీద బౌల్డర్ వెడితే అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో హమీర్, మీనా కనిపించారు. టోటల్లీ యాక్సిడెంటల్,” అన్నారు మూర్తిగారు.

“అయినా సరే, నాకు చెప్పొద్దూ?” రెట్టించారు వనజగారు.

“మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎంతోమందిని కలుస్తూంటారు. అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు?” రావుగారు సర్దిచెప్పబోయారు.

“మనం ఆ ఎంతోమంది ఇళ్లకు వెళ్లడంలేదుగా! ఇది నాకు చెప్పడం మానేసింది,” అన్నారు వనజగారు కొంచెం కోపంగానే.

“మీరెప్పు డొచ్చారు ఇండియానించీ?” రావుగారు సరోజగారిని అడిగారు మాట మార్చడంకోసం.

“ఎంత, ఇంకా నలభై ఎనిమిది గంటలు కాలేదు,” జవాబిచ్చా రావిడ.

“మీ ఫ్లయిట్ టైంకే వచ్చిందా?” మూర్తిగారు ఎంక్వయిర్ చేశారు.

“టేకాఫ్ గంట ఆలస్య మయింది గానీ, నాన్‌స్టాప్ గదా, బయల్దేరితే చాలు!” అన్నారు రావుగారు.

“మీరు ఎకాయకీ మా యింటికి రావల్సింది. హోటల్లో దిగుతామని ఇన్‌సిస్ట్ చేశారు,” అన్నారు మూర్తిగారు.

“వచ్చేసారినించీ తప్పకుండాను – వియ్యాలవారి వీసా స్టాంప్ వెయ్యగానే!” అన్నారు రావుగారు.

“ఆ స్టాంప్ వెయ్యగలను, వెయ్యలేను అని రెండు జవాబులూ ఇస్తాను. ఎందుకంటే, మీకు వియ్యాలవారు సరోజగారు. కానీ, హమీర్ నాకు కొడుకులాంటివాడు. అందుకని వియ్యాలవారి కారెక్టరైజేషన్ని తప్పించుకోను. వాడిముందే పొగుడుతున్నాను – మీకు ఇలాంటి టఫ్‌నెస్‌ వున్న కారెక్టర్ ఇంకెక్కడా కనిపించదు. వాట్ హి హాజ్ బీన్ త్రూ! మీనా, యు ఆర్ వెరీ లక్కీ!” అన్నారు మూర్తిగారు.

“ఐ నో అంకుల్, థాంక్యూ!” అన్నది మీనా.

“హమీర్ కూడా. మాకొక్కర్తే కూతురు. మెడిసిన్ పూర్తవుతుంది ఇంకో రెండేళ్లల్లో. అది పూర్తయేదాకా ఆగొచ్చు కదే అంటే అది వినిపించుకోవట్లేదు,” అన్నారు వనజగారు.

“మరేం లేదు – వివాహం విద్య నాశాయ అన్న నానుడిని నమ్ముతుంది మా ఆవిడ,” అన్నారు రావుగారు.

“నానుడుల కేమండీ, బోల్డుంటాయి. నేను పిహెచ్.డి చదువుతున్నప్పుడు పెళ్లిచేసుకున్నాను. భవాని సహకారంతోనే పూర్తిచెయ్యగలిగాను!” అన్నారు మూర్తిగారు.

“ఆ లెక్కన హమీర్ ఉద్యోగం మానేసి మీనాకి రెండేళ్లు వంటచేసి పెట్టాలి!” వనజగారు నవ్వుతూనే అన్నాగానీ అక్కడున్న హమీర్ తరఫు వాళ్లందరికీ మాత్రం అరవై మైళ్ల స్పీడ్‌తో వెడుతున్న కారుకు సడెన్ బ్రేక్ వేసిన ట్లనిపించింది.

“దాందే ముందండీ! ఈ కాలంలో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే గడిచే దెట్లా?” భవానిగారు వాతావరణాన్ని తేలికపరచబోయారు.

“చూడు చెల్లెమ్మా, మన హమీర్ ఇష్టపడ్డది ఈ మీనాని. నీకు ఇప్పటికి చూడ్డానికి వీలయ్యింది,” అన్నారు మూర్తిగారు.

“అమ్మాయి బంగారపు బొమ్మలా వున్నది. వాడిష్టపడ్డాడు, తనిష్టపడ్డది. మీ ఆ శీర్వాదం వున్నది. అది వాడికి చాలా ముఖ్యం. మీరు కొండలా అండగా లేకపోతే ఏమయిపోయేవాళ్లమో!” కళ్లొత్తుకుంటూ అన్నారు సరోజగారు. మరచిపోగలిగేవా ఆ స్మృతులు?

“మీ నమ్మకా లేమిటో మాకు తెలియదు. ముహూర్తం పెట్టించడానికి మాకు తెలిసిన పురోహితు డున్నాడు. మీరు అడగమంటే అడుగుతాను. కాదూ, మీ పురోహితుణ్ణి సంప్రదించినా సరే!” అన్నారు మూర్తిగారు.

“మనింటి దగ్గర గుళ్లో శాస్త్రి గారున్నారు గదా! ఆయన్నడుగుదాం,” అన్నారు వనజగారు.

“ఆయన ఇండియా వెళ్లారు గదా! పైగా, జనవరిదాకా రారని విన్నాను!” అన్నారు రావుగారు.

“ఇదేమయినా అంత అర్జెంటు విషయమా? కాకపోతే ఫోన్లు లేవా మాట్లాడ్డానికి?” జవాబిచ్చారు వనజగారు.

“అంటే, ఇక్కడ సెలవు రోజయితే ఎక్కువమంది రావడానికి వీలవుతుందని జులై 4న, లేకపోతే క్రిస్మస్‌కీ న్యూ యియర్‌కీ మధ్యలోనూ పెళ్లిళ్లని పెట్టుకుంటార్ట. అలాగని మీనాయే కాక నా కొలీగ్స్ కూడా చెప్పారు.  క్రిస్మస్ ఇంకో రెణ్ణెల్లల్లో వుంది. ఇప్పుడే ప్రయత్నించకపోతే  వెన్యూలు దొరక్కపోవచ్చు. జులై అంటే మరీ తొమ్మిది నెల లాగాలి,” అన్నారు రావుగారు.

“అంత తొందరయితే వచ్చే నెల్లో థాంక్స్‌గివింగ్ సెలవుల్లో చేసెయ్యండి, ఓకె?” అన్నారు వనజగారు రావుగారివైపు కొరకొరా చూస్తూ.

ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన మొహాన్ని ఎవరూ చూడకూడదన్నట్లు తలవంచుకుని కూర్చుంది మీనా. మొహంలో భావాలేమీ కనిపించనీయకుండా ఎదుటి మనిషిలోంచి అవతలకి చూస్తున్నట్లున్నాయి రావుగారి చూపులు.

“పెళ్లవగానే మీరు ఇండియా వెళ్లిపోతారు గదా!” వనజగారు సరోజగారిని సూటిగా చూసి ప్రశ్నించారు. హమీరే గాక మూర్తిగారి కుటుంబ సభ్యులంతా స్టన్ అయ్యారా ప్రశ్నకి.

ముందు తేరుకున్నది హమీర్. “మామ్ మాతోనే వుంటుంది!” అన్నాడు.

“ఆరేళ్లుగా ఇండియాలో వుంటున్నారు గదా! మళ్లీ ఇక్కడికొచ్చి ఈ చలికేం అలవాటుపడతారు?” అన్నారు వనజగారు.

“ఆవిడ ఇంతకుముందు వుండలేనని వెళ్లినమాట నిజమే గానీ, ఇంక వెళ్లనివ్వను!” అన్నాడు హమీర్.

“నువ్వుండమన్నా నేనుండలేనురా. అయినా, కొత్తగా పెళ్లయినవాళ్ల మధ్యలో నేనెందుకు?” అన్నారు సరోజగారు.

“మామ్! నాకీ వరల్డ్‌తో వున్న ఒకేఒక కనెక్షన్‌వి నువ్వు. నాతోనే వుంటావు!” అన్నాడు హమీర్.

“కాదని ఎవరంటారు? ఇండియాలో వున్నా, ఇక్కడవున్నా అదే కనెక్షన్ కదా! దానికింత రాధ్ధాంత మెందుకు? మా అత్తగారిలాగా విడిగా ఇండియాలో వుంటే ఆవిడకీ సుఖంగా వుంటుంది. అలవాటయిన ప్లేసు. అక్కడ ఆవిడకి పనివాళ్లున్నారు. డ్రైవరున్నాడు. ఇక్కడవన్నీ కుదుర్తాయా ఏమిటి? కాదంటారా? మాట్లాడ రేమండీ?” వనజగారు భర్తని గద్దించారు.

“మా మామ్ మనతోనే వుండడం నీకు అభ్యంతరమని నాకు చెప్పలేదెందుకు?” హమీర్ మీనాని ప్రశ్నించాడు.

“పెళ్లి కాకుండానే మా ముందే దాన్నిలా నిలదీస్తున్నాడంటే పెళ్లయిన తరువాత దాని బతుకెలా అఘోరిస్తుందో నేనిప్పుడే ఊహించగలను!” అన్నారు వనజగారు.

“మామ్! యు ఆర్ మేకింగ్ ఎ మౌంటెన్ అవుటాఫ్ ఎ మోల్ హిల్!” మీనా చెప్పడానికి ప్రయత్నించింది.

“ఇప్పుడు నీకలాగే అనిపిస్తుందే! అదే, అత్తగారిని ఇంట్లో పెట్టుకున్న తరువాత ఆవిడ వంట చెయ్యడానికీ, పిల్లలని సముదాయించడానికీ ఓపిక లేదని చేతులెత్తేస్తే, ఈ రోగమనీ, ఆ రోగమనీ ఆవిణ్ణి డాక్టర్ల చుట్టూ తిప్పాల్సొస్తే అప్పుడు ఈ అమ్మమాట ఎంత విలువైనదో తెలిసొస్తుంది!” అన్నారు వనజగారు.

“మీనా పుట్టిన ఏడాదికి నీకు డబుల్ టైఫాయిడ్ వచ్చినప్పుడు దాన్ని పెంచింది మా అమ్మేనని మరిచిపోయినట్టున్నావ్!” అన్నారు రావుగారు.

“అది ఇండియాలో గదా! అలా చెయ్యకపోతే చుట్టుపక్కలవాళ్లు ఆడిపోసుకుంటారని భయపడి!” వెంటనే వనజగారి దగ్గరినుంచీ రిటార్ట్ వచ్చింది.

“ఇంతకీ మనం హమీర్, మీనాల పెళ్లిగూర్చే మాట్లాడుకుంటున్నామా?” మూర్తిగారు సంభాషణని అసలు విషయంవైపు మళ్లించడానికి ప్రయత్నించారు.

“ఈ విషయం తేలితే, అప్పుడు!” అన్నారు వనజగారు.

మొహం ఎర్రబడగా, “నీనా! నువ్వు, నేను ఈ విషయం డిస్కస్ చేశాం. మళ్లీ ఇప్పుడిదేమిటి?” ప్రశ్నించాడు హమీర్.

“నిండా పాతికేళ్లు లేవు. దానికేం తెలుస్తాయి నిజజీవితంలో సాధకబాధకాలు? ఎవరయినా అనుభవించడాన్ని చూసిందా? అంతెందుకు? మీ అమ్మగా రెక్కడున్నారు మూర్తిగారూ?” వనజగారు మూర్తిగారిని నిలదీశారు.

“ఆవిడ పోయి రెండేళ్లయింది,” మూర్తిగారు జవాబిచ్చారు.

“సారీ టు హియర్ దట్. ఆవిడ మీతోనే వుండేదా?”

“ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమా?” అడ్డం రాబోయారు రావుగారు.

“మనకో రూలూ, ఎదుటివాళ్ల కింకో రూలూ అనే ద్వంద్వ వైఖరి అంటే నాకు మంట. అందుకే అడుగుతోంది. చెప్పండి మూర్తిగారు!”

“ఆవిడ పోయేదాకా మాతోనే వున్నది!” కోపా న్నదిమిపెట్టుకుంటూ మూర్తిగారు జవాబిచ్చారు.

“మీ ఆవిడ గొప్పది. భవాని గారు, మీకో నమస్కారం. మా అత్తగారు పోయేవరకు మా బావగారి దగ్గరే వున్నది. ఆవిడ అమెరికా వచ్చిన ఒక్కసారీ రోగమొచ్చి ఎక్కడ అడ్డంపడుతుందోనని హడలి చచ్చాను. నేను మానవమాత్రురాలిని గనుక నాకు చేతనయినంతలో దానికి సుఖవంతమైన బ్రతుకు నివ్వాలనుకుంటున్నాను. మీ కున్నటువంటి గొప్పదనం నాకే లేనప్పుడు మా అమ్మాయికి అంటుతుందని నేననుకోను. మీరు దేవుళ్లు. మీకో నమస్కారం!” అన్నదావిడ చేతులు జోడించి.

“నీ కింతగా ఇష్టం లేదని ఇంటిదగ్గరే చెప్పివుండాల్సింది!” అన్నారు రావుగారు.

“ఆమాత్రం తెలివితేటలు నాకూ వున్నాయి. నాకేదో అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వుండేది గానీ, ఇందాక ఇక్కడి కొస్తున్న దారిలోనే ఈ పెళ్లయితే దాని భవిష్య త్తేమిటో పూర్తిగా అర్థమైంది గనుకనే ఇప్పటికయినా కళ్లు తెరిచినందుకు సంతోషిస్తున్నాను,” అని ఆవిడ రావుగారి నోరు మూయించారు.

“మామ్! పేరెంట్స్ పిల్లల దగ్గరుండడం ఇండియన్స్‌లో అన్‌కామన్ కాదు గదా! బామ్మ పెదనాన్న దగ్గరున్నట్లు?” అన్నది మీనా.

“ఇండియన్స్‌లో గూడా, పెళ్లయిన పదేళ్లకో, లేక ఇరవయ్యేళ్లకో అలా చేరడం వేరు, పెళ్లయిన దగ్గర్నించీ తోకలాగా వుండడం వేరు. అలాంటి తోకలేవీ లేకుండా బతికినదాన్ని గనుకనే అలాంటి సుఖాన్ని నీకివ్వా లనుకుంటున్నాను!”

“వుయ్ నెవర్ డిస్కస్డ్ దిస్!” అన్నది మీనా.

“అవసరం రాలేదు గనుక. అయినా, మీ బామ్మ మీ పెదనాన్న గారింట్లోనే వుండడం, మనింట్లో వుండకపోవడం చూసయినా గ్రహిస్తావనుకుంటే  ఆమాత్రం తెలుసుకోకపోవడం నా పెంపకంలో లోపంవల్ల ననుకోవాలి,” అంటూ నుదుటిమీద అరచేత్తో కొట్టుకున్నా రావిడ.

“హమీర్, ఐ థింక్ ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ క్లియర్!” అన్నారు మూర్తిగారు.

“నీనా – సారీ, మీనా! వన్ లాస్ట్ టైం! వాట్స్ యువర్ ఆన్సర్?” అడిగాడు హమీర్.

మీనా కళ్లల్లోంచి జలజలా నీళ్లు రాలాయి. “అయామ్ సారీ హమీర్! మా అమ్మ అభిప్రాయం ఇదని నాకిప్పటిదాకా తెలియదు!”

“ఇప్పుడు తెలిసిందిగా! వాట్ డు యు వాంట్ టు డు అబవుటిట్?”

“ఇందాక నువ్వన్నావే, నీకీ వరల్డ్‌తో వున్న ఒకే కనెక్షన్ మీ మామ్ అని? ది సేమ్ వే హియర్. దీజ్ ఆర్ మై టు కనెక్షన్స్ టు దిస్ వరల్డ్.  జస్ట్ లైక్ యు, ఐ ఆల్సో డోన్ట్ హావ్ ఎనీ అదర్ రిలెటివ్స్ ఇన్ దిస్ కంట్రీ. హూ వుడ్ ఐ గో టు ఇఫ్ ఐ నీడ్ హెల్ప్?  యు ఆర్ లక్కీ టు హావ్ దిస్ గ్రేట్ అంకుల్స్ ఫామిలీ టు టర్న్ టు. ఐ డోన్ట్ హావ్ ఎనీవన్. చిన్నప్పటినించీ తన ఆశలన్నీ నామీదే పెట్టుకుని బ్రతికింది. ఈ క్షణాన నేను ఆమెతో ఏం మాట్లాడినా అది అనుచితమే అవుతుంది. ఇంటి కెళ్లిన తరువాత ఆమెని కన్విన్స్ చెయ్యగలనన్న నమ్మకం నాకుంది. గివ్ మి ఎ ఛాన్స్!”

“నువ్వావిణ్ణి కన్విన్స్ చెయ్యగలవన్న నమ్మకం గానీ, ఆశ గానీ నాకేమాత్రం లేవు. ఆవిడ అంత స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పిన తరువాత మేకతోలు కప్పి ఆవిణ్ణి తీసుకువచ్చినా ఈ తోడేలు రూపాన్ని మాత్రం నేను మరచిపోలేను!” అన్నాడు హమీర్.

“నన్నంత మాట అన్న తరువాత ఇంకా కూర్చుంటారేం? లేచి పదండి!” సోఫాలోంచి లేచి విసవిసా నడుచుకుంటూ వనజగారు తలుపుదగ్గరకు నడిచారు. రావుగారికి భార్య ననుసరించడంకన్నా వేరే మార్గం కనబడలేదు. మీనా ఆయన వెనక బయల్దేరబోయింది గానీ, “గివ్ మి ది రింగ్ బాక్!” అని హమీర్ గద్దించడంతో ఆగిపోయింది.

“నేనింకా మా అమ్మను కన్విన్స్ చెయ్యగలననే అనుకున్నాను. నువ్వు అంత తొందరపడుతున్నప్పుడు నే నెందుకు ఆపాలి? టేకిట్!” అని విసురుగా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని అతని చేతిలో పెట్టి వడివడిగా తండ్రివెనుక నడిచింది. గుమ్మంలోంచి బయటకు వెడుతూ తలుపుని శ్లామ్‌ చేసింది.

“అన్‌బిలీవబుల్!” అన్నారు మూర్తిగారు వాళ్లు వెళ్లినవైపు చూస్తూ. ఆయనకింకా ఇదొక పెద్ద కలలాగానే వున్నది. పెద్దలు కలిసి మాట్లాడుకోవడం ఓ చిన్న ఫార్మాలిటీ అనే అనుకున్నారు గానీ దానివల్ల ఇంత చేదు అనుభవం మిగులుతుందని ఆయన ఏమాత్రం ఊహించలేదు.  పిల్లలు పెళ్లి చేసుకుంటా మంటే తల లూపిన తల్లిదండ్రులే ఆయనకి తెలుసు నప్పటిదాకా. దేరీజె ఫస్ట్ టైమ్ ఫర్ ఎవిరిథింగ్ అన్న ప్రావెర్బ్ ఆయనకి గుర్తొచ్చింది.

“ఐ డోన్ట్ నో వాట్ హర్ ప్రాబ్లం ఈజ్! ఐ వజ్ ఇచింగ్ టు ఆస్క్ దెమ్ టు గెటవుట్!” అన్నాడు రోహిత్.

“అదే ఆలోచన నాక్కూడా వచ్చింది గానీ సభ్యత కాదని వూరుకున్నాను. వాళ్లకి సిగ్గులేకపోతే మనకికూడా వుండకూడదని రూలేం లేదుగా!” అన్నారు మూర్తిగారు.

“ఇలాంటి మనుషు లుంటారని నాకివ్వాళే తెలిసింది!” అన్నారు భవానిగారు.

“ఇప్పుడే కాదు, ఎప్పుడూ వున్నారు భవానీ. ఇండియాలో చూస్తున్నాగా! ఎటొచ్చీ, ఈ సంభాషణ పెళ్లయిన తరువాత వచ్చుంటే పాపం వీడు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయేవాడు. మన అదృష్టం బావుంది,” అన్నారు సరోజ గారు.

“దీన్ని అదృష్టమని ఎలా అంటారు?” అడిగింది విదుషి.

“అంటే,” అని చెప్పబోయి, అనవసరమని ఆగిపోయారు మూర్తిగారు.

“ఆవిడ కెందుకో ఈ పెళ్లంటేనే ఇష్టం లేనట్టుంది,” అన్నారు భవానిగారు.

“డాక్టరు కూతురుకి నేను తగనని ఆవిడ నమ్మకం. సంపాదించడం మొదలయిన తరువాత తన శాలరీ నా శాలరీకి కనీసం రెండు రెట్లుంటుందిట!” అన్నాడు హమీర్.

“అలాగని నిన్ను నువ్వు తక్కువచేసుకోకు. అదిమాత్రం సహించలేను. నువ్వు మాస్టర్స్ చెయ్యొచ్చు, కాకపోతే ఎమ్బీయే చెయ్యొచ్చు. ఇంద్రా నూయిలాగా, ఓ కంపెనీకి సీఇవో కావచ్చు. మీనా తండ్రేమీ బిల్ గేట్స్ లాగా బిలియనీర్ కాదు. మీ నాన్నలాగా, నాలాగా పైకొచ్చినాయనే.  తన కూతురు జీవితాన్ని చేజేతులా నాశనం చేస్తున్నదని ఆవిడకి అర్థంకావడంలేదు. నీకన్నా డబ్బున్నవాణ్ణి అల్లుడిగా తేగలదేమోగానీ, నీకన్నా గొప్పవాణ్ణి మాత్రం కాదు. నో పాయింట్ ఇన్ క్రైయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. యు హావ్ టు మువాన్!” అన్నారు మూర్తిగారు. “ఎంగేజ్‌మెంట్ అయిన తరువాత మీ నాన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ పంపిన హాఫె మిలియన్ డాలర్ల చెక్కుని ఆ ఆనంద సమయంలో మీకిద్దా మనుకున్నాను. పూర్తిగా ఏడేళ్లు అవకుండానే, ఆరేళ్లకే పంపించారు! నిన్ననే వచ్చింది,” అన్నారు అక్కడే పెట్టివున్న కవర్ని హమీర్ కిస్తూ.

“మువింగ్ ఆన్లో మాకంటే ఎవరికి ఎక్కువ అనుభవ ముంటుంది అంకుల్?” అన్నాడు హమీర్ ఆ కవర్ని అందుకుని తల్లి భుజంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుంటూ.

***

అమాని వెళ్లిపోయిన తరువాత హమీర్‌ని నిరాశ కమ్మేసి అతని మెదణ్ణి శూన్యంతో నింపింది. తల నానించడానికి ఒక బుజమూ, ఒక బోజమూ, చెయ్యివెయ్యడానికి ఒక నడుమూ, కమ్ముకోవడానికీ, కప్పుకోవడానికీ ఒక మనసూ తేలిగ్గానే దొరికెయ్యనుకున్నాడు మీనా కలిసిన తరువాత. అయితే, మీనాతో బ్రేకప్ తరువాత వాటిల్లో ఏదీ అంత తేలికగా దొరికేది కాదని మెల్లిగా తెలిసొచ్చింది. మీనా తరువాత పెళ్లిచేసుకొమ్మనమని తల్లి ఎంత పోరుపెట్టినా, అతను దాదాపు ఒక సంవత్సరంపాటు పట్టించుకోలేదు. పట్టించుకుందా మనుకునేటప్పటికి అటు తల్లికీ, ఇటు మూర్తిగారి కుటుంబానికీ కూడా విసుగొచ్చి సంబంధాలను చెప్పడం మానేశారు. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో మీనా కనిపించడం అతనికి అగ్నిమీద ఆజ్యం పోసినట్లయింది. అమాని అతనికి జీవితంలో ఎదురుచూడడాన్ని నేర్పించింది. ఆమె అందించిన పాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్‌బో తనతోబాటే వుంటుందని అనుకున్నాడు గానీ అది రెయిన్‌బోతో కలిసి అదృశ్యమైపోతుం దనుకోలేదు.

అతను అదృశ్యం చేసింది తెచ్చిన సిక్స్ పాక్ లోని బీరునీ, వైన్ బాటిల్లోని వైనునీ. బీరు బాటిల్స్ అన్నింటినీ పూర్తిచేసిన తరువాత వైన్ బాటిల్‌ని చేత్తో పట్టుకున్నప్పుడు, “అయామ్ గోయింగ్ టు బి వేస్టెడ్ టుమారో!” అనుకున్నాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. మెలకువ వచ్చింది మరునాడు పదకొండు గంటలకే అయినా, తలకాయ పగిలిపోతోంది. దానితోబాటు వాంతులవడం మొదలుపెట్టాయి. నీళ్లు తాగినా ఇమడడంలేదు. రోహిత్‌కి కాల్ చేశాడు.

” అయామ్ వేస్టెడ్, మాన్! టెర్రిబుల్ హాంగోవర్. ఇట్లా వెళ్లి మామ్‌ని చూళ్లేను. ఆవిడ కంగారు పడుతుంది ఈ వామిటింగ్స్‌కి. ఐ కాన్ట్ డ్రైవ్ దేర్ ఎనీవే. ఆవిడ నన్ను చూడకపోయినా ఏమయిపోయానో అని వర్రీ అవుతుంది. కెన్ యు డ్రాప్ మి ఎట్ యువర్ పేరెంట్స్ ప్లేస్?”

“యు సీమ్ టు హావ్ హాడ్ వన్ హెక్ ఆఫ్ ఎ పార్టీ. వాట్స్ ది అకేషన్?” అడిగాడు రోహిత్.

“మై గర్ల్‌ఫ్రెండ్ బ్రోకప్ విత్ మి!”

రోహిత్ ఆశ్చర్యపోయాడు. ” నీకు యాక్సిడెంట్ అయ్యేముందు డిసిలో చూశాను -  ఈజ్ దట్ హర్?”

“యా. దట్స్ హర్!”

“సారీ టు హియర్ దట్ మాన్! హాంగాన్ దేర్. లెట్ మి సీ వాట్ ఐ కెన్ డు,” అని రోహిత్ ఫోన్ పెట్టేసి విదుషికి కాల్ చేశాడు. “కెన్ యు పికప్ హమీర్ అండ్ డ్రాప్ హిం ఆఫ్ ఇన్ మెక్లీన్? హి ఈజ్ వేస్టెడ్ అండ్ ఈజ్ ఇన్ హిజ్ ఎపార్ట్‌మెంట్. నేను న్యూ జెర్సీలో వున్నా. లేకపోతే నేనే పికప్ చేసుకునేవాణ్ణి.”

“హి ఈజ్ నాట్ దట్ బిగ్ ఎ డ్రింకర్. వై ఈజ్ హి వేస్టెడ్?”

“హిజ్ గర్ల్‌ఫ్రెండ్ బ్రోకప్ విత్ హిమ్.”

“మీనా బ్రోకప్ విత్ హిమ్ ఎగైన్?” విదుషి ఆశ్చర్యపోయింది.

“వాట్ డు యు మీన్ బ్రోకప్ విత్ మీనా? దట్స్ నాట్ హూ హి హాజ్ బీన్ సీయింగ్!”

“ఆర్యూ ష్యూర్?”

“యస్. ఆ అమ్మాయిని డిసెంబర్‌లో డీసిలో చూశా గదా! మీనాని ఆమాత్రం గుర్తుపట్టలేనా?”

“డెన్వర్‌నించీ వచ్చిన తరువాత నించీ వాడు డేట్ చేస్తోంది మీనాని కాదా? ఆ మధ్య హమీర్‌ని ఒబ్లీక్‌గా డేటింగ్ ఎనీబడీ అనడిగితే వాడు మీటింగ్ ఓన్లీ వన్స్ ఎ మంత్ అంటే మీనాయే అనుకున్నా.  ఎంతయినా లాంగ్ డిస్టేన్స్ రిలేషన్షిప్ కదా అని! ఓ మై గాడ్!” అనడం వినిపించింది గానీ, ఆమె ఖాళీగా వున్న చేత్తో తల పట్టుకోవడం రోహిత్‌కి కనిపించడానికి అది విడియో కాల్ కాదు మరి.

“ఏమయింది? వై ఈజ్ ఇట్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లం?”

“ఐ కాన్ట్ టెల్ యు. … పేరెంట్స్‌ని చూడ్డానికి ఆండ్రూ ఎల్లికాట్ సిటీ వెళ్లాడు. అక్కణ్ణించీ హమీర్‌ని పికప్ చేసుకొమ్మనమని చెబుతాను. స్టమక్ అప్సెట్ అని చెప్పి ఏవో మందు లిచ్చినట్లు నటిస్తాడు. ఈలోపల హమీర్‌కి ఫోన్‌చేసి ఐస్ చిప్స్‌ని చప్పరిస్తూండమను,” అని ఆండ్రూకి ఫోన్ చేసింది.

***

ఆండ్రూ నీరసంగా వున్న హమీర్‌ని తీసుకురావడాన్ని చూసి అందరూ కంగారుపడ్డారు గానీ, అతను డాక్టర్ కేర్లో వున్నందుకు సంతోషించారు.

ఇంకా ఉంది..