విక్రమార్కుడు మర్రిచెట్టుపైనుంచీ బేతాళుడి శవాన్ని కిందకి దించి భుజాన వేసుకుని నడవడం మొదలుపెట్టిన తరువాత బేతాళుడు, “విక్రమార్కా, నీకు శ్రమ తెలియకుండా భవిష్యత్తులోంచి పట్టుకొచ్చిన అనసూయమ్మగారి అద్దాల కథ చెబుతాను విను,” అని అతనికి “వద్దు!” అనే అవకాశా న్నివ్వకుండానే మొదలుపెట్టాడు.
***
“ఇప్పుడి దెందుకమ్మా?” అన్నారు శాస్తుర్లుగారు చదువుతున్న మంత్రాలనాపి. అటు చూడు – అన్నట్టు రాగిణిని మోచేత్తో పొడిచి శాస్తుర్లుగారివైపు చూపించాడు రఘు.
“మీక్కాదులెండి,” అని నవ్వి, “చదివింపు,” అన్నారొకళ్లు. (“అదసలు చదివింపే కాదు. వీళ్లలా ఆమెని ఆట పట్టిస్తుంటారు,” అన్నాడు రఘు రాగిణి చెవిలో.)
“ఇప్పుడేం చదివింపు? ఇంకా తాళి కట్టందే!” అన్నాడాయన చిరాగ్గానే అయినా కొద్దిగా చిరునవ్వుని మొహానికి పులిమి. “ఇప్పుడేగా జీలకర్రా, బెల్లం అయింది?”
“అయ్యా, మీకిది కొత్తలెండి. ఆ చదివింపు కానిదే మీరు ముందుకి వెళ్లలేరు. ముందు చదివించండి,” అనుభవజ్ఞు డొకాయన సలహా యిచ్చాడు. అప్పటికీ శాస్తుర్లుగారు ఒప్పుకోకపోవడాన్ని చూసి పెద్దగా, “ఈ వివాహ మహోత్సవమునందు అనసూయమ్మగారు వధూవరుల నాశీర్వదించి ఇస్తున్నది ఒక అద్దం,” అన్నాడాయనే.
“పేకెట్టు విప్పకుండానే అందులో వున్నదేదో చెప్పేశారే,” అన్నారు శాస్తుర్లుగారు మొహాన పులిమిన నవ్వు ఎండిపోకుండానే.
“ఇక్కడున్నవాళ్లల్లో సగంమందికి తెలుసు. జాగ్రత్తగా విప్పమ్మా, మసేమన్నా వుంటే చేతి కంటుకుంటుంది,” అన్నదొకావిడ.
“అసలీవిణ్ణి ప్రతీ పెళ్లికీ ఎందుకు రానిస్తారో అర్థంకాదు,” సన్నగా విసుక్కున్నాడొకాయన. సన్నగా అన్నాడు గనుక దుర్గమ్మగారికి వినిపించక బ్రతికిపోయాడు గానీ లేకపోతే ఆవిడ విశ్వరూపాన్ని చూసేవాడు. “ఆవిడ ఏ పెళ్లిలోనూ పూనకంతో ఊగిపోలేదు, ఎవరినీ తిట్టలేదు, వేటినీ పగులగొట్టలేదు. ఈసా రెవరన్నా మా అమ్మని పల్లెత్తు మాటన్నారా, అవన్నీ నేను చేసి చూపిస్తాను!” అన్నదావిడ ఒక పెళ్లిలో – ఇలాంటి మాటలే ఆవిడకి స్పష్టంగా వినబడినప్పుడు. వాళ్ల చుట్టాల ఇళ్లల్లోని పెళ్లిళ్లల్లో తగవులాటలూ, కొండొకచో చేతికందిన వాటిని విసిరేసుకోవడాలూ అంత అసాధారణమేమీ కాదు.
గిట్టనివాళ్లు అనసూయమ్మ గారికి మతి చెడిందంటారు గానీ, దుర్గమ్మగారికీ ఆమె భర్తకీ మాత్రం ఆమె ఒక మౌని మాత్రమే. చుట్టపక్కాల్లో ఆవిడ తరాలవాళ్లు ఆమెమీద సానుభూతి చూపించారుగానీ, తరువాత తరాలవాళ్లకి మాత్రం ఆమె మతిచెడినదానిలాగా తప్ప వేరేగా ఎప్పుడూ అనిపించలేదు. ఈమధ్య ఆమె కనబడగానే హేళనచేద్దా మనుకునేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే దుర్గమ్మగారు తల్లిని తన కనుసన్నలలో ఉంచుకుంటుంది.
పెళ్లికూతురు పేకేజీ విప్పి అందులోని అద్దాన్ని బయటికి తీసింది. “అందులో నిన్ను చూసుకోమ్మా,” అన్నాడొకాయన. “తరువాత అల్లుడిగారికియ్యి!” పెళ్లికొడుకు చేతికెళ్లింది అద్దం. “అందులో నిన్ను చూసుకోవయ్యా! ఆఁ. ఇప్పుడు దాన్ని పక్కనపెట్టు. తరువాత మీరిద్దరూ పక్కపక్కన కూచున్నప్పుడు ఇద్దరూ కలిసి అందులో ఒకేసారి చూద్దురుగాని. ఆ తరువాత దాన్నామెకి ఇచ్చేద్దురుగాని!” (“ఇది తమ్ముడి కూతురి పెళ్లి గనుక మా పెద్దమావయ్య తేలిగ్గా పెద్దరికం వహిస్తున్నాడు,” అన్నాడు రఘు రాగిణి చెవిలో.)
“దాన్ని ఆవిడకి తిరిగిచ్చేస్తే అది బహుమతెలా అవుతుందండీ?” ప్రశ్నించారు శాస్తుర్లుగారు. “మీ పని మీరు కానివ్వండి,” అన్నదొకావిడ చిరాగ్గా. (“ఆవిడ మా రెండోమావయ్య భార్య. ఇందాక గొణిగింది వాళ్ల వియ్యంకుడు. ఈవైపున అమ్మమ్మని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ. మింగా లేదు, కక్కా లేదు!”)
“ఏమిటీ వెర్రితనం?” అని మగపెళ్లివాళ్లు తలని అడ్డంగా ఆడించడం స్పష్టంగానే కనిపించింది. (“అమ్మమ్మ అన్ని పెళ్లిళ్లల్లోనూ ఒకే అద్దాన్నిచ్చి వెనక్కి తీసుకుంటుందని ముందు అనుకున్నారుగానీ, వాటి ఫ్రేముల్లో తేడావుందని కనుక్కున్నవాళ్లు, ఈ పెళ్లిళ్ల పేరు చెప్పుకుని గది గోడలనిండా అద్దాల నమర్చుకుంటోందేమో నన్నారు. ఎప్పుడయినా మా ఇంటికొచ్చినప్పుడు ఆవిడ గదిలోకి తొంగిచూసి గోడలమీద అవి లేకపోవడంవల్ల నిరాశపడ్డారు గూడా. పక్కకెళ్లి మాట్లాడుకుందాం పద.”)
వాళ్లిద్దరూ కొంచెం దూరంగా వచ్చిన తరువాత రఘు చెప్పడం మొదలుపెట్టాడు. “ఆవిడ పెళ్లిళ్లకి తీసుకెళ్లిన అద్దాలు ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది, మొహం చూసుకోవడానికి షాపుల్లో అమ్మే రకం – వీటికి వెనుకవైపున కళాయి ఉంటుంది. రెండవది, అలాంటి అద్దాన్ని ఇంటికి పట్టుకొచ్చిన తరువాత కళాయి వుండే వైపున అట్టముక్కనో చెక్కముక్కనో తీసేసి క్లియర్గా ఉన్నవైపున ఆముదపు దీపాన్ని వెలిగించి దానితో మసిపట్టించిన రకం. ఆవిడకే కళాయి పుయ్యడం వచ్చుంటే ఆ మసితో పని ఉండేది కాదు.
“ఆవిడ అన్ని పెళ్లిళ్లలోనూ పైన చెప్పిన రకాల అద్దాలని మాత్రమే ఇవ్వలేదు. గాజు పలకలని – అంటే సీ త్రూ గ్లాస్ అన్నమాట – ఇచ్చిన సందర్భాలూ వున్నయ్యనేది అమ్మ. నాకు తెలిసి, బుచ్చెయ్యగారమ్మాయి సావిత్రి పెళ్లిలో అలాంటి దివ్వగా మొదటిసారి చూశాను. అవడానికి వాళ్లు బావా మరదళ్లేగానీ, ఉండేది పక్కపక్కన ఊళ్లల్లోనే అయినా గానీ, అబ్బాయి తల్లిదండ్రులకి ఆ పెళ్లి ఇష్టం లేదు. సావిత్రీ, ఆమె బావా రెండూళ్లకీ మధ్యనుండే మామిడి తోటల్లో కలిసి తిరగడం నేను చూశాను నా చిన్నప్పుడు. వాళ్లు మమ్మల్ని చూసినా, ఆ కాయలని కొట్టెయ్యడానికి నేనూ, నా స్నేహితులూ వెళ్లేవాళ్లం గనుక వాళ్ల రహస్యం మా దగ్గరా, మా రహస్యం వాళ్ల దగ్గరా భద్రంగా ఉన్నది. పెళ్లయిన తరువాత ఏదో ఒక సందర్భంలో సావిత్రి నాతో చెప్పింది – అమ్మమ్మ కూడా వాళ్లని చూసిందట. వాళ్ల పెళ్లిలో అమ్మమ్మ ఫ్రేము కట్టిన గాజు పలక నివ్వడాన్ని చూసి జనాలు, ‘దీని భావమేమి తిరుమలేశ?’ అని బుర్రలు గోక్కున్నార్ట. తరువాత, ‘ఆఁ, మిగిలిన రెండు రకాలు ఎందుకిస్తున్నదో తెలిసి చచ్చింది గనుకనా?’ అని సమాధాన పడ్డార్ట.
“ఒకవైపు కళాయి వేసున్న అద్దానికి రెండోవైపు మసిపట్టించి వున్నదాన్ని ఒకసారి ఇచ్చినప్పుడు పుచ్చుకున్నది ఒక మేనకోడలు. మసిపట్టిన అద్దంలో చూసుకొమ్మన్నందుకు, పైగా చేతికి కొంచెం మసి అయినందుకు ఆ పిల్లకి కళ్లమ్మట నీళ్లు ధారగా వచ్చెయ్యట. అయితే, అమ్మమ్మే దాన్లో కొంత భాగాన్ని వేలితో తుడిచి చూడమన్నదట. రెండోవైపు కళాయి వుంటే ఏం కనిపిస్తుంది? అప్పుడు, ఒక నాణెంతో ఆ కళాయిని కొంత గీకి, ఇప్పుడు చూడండి అని సంజ్ఞ చేసిందట. ఇప్పుడు రెండువైపులా కొంత తుడిచిన భాగం వున్నా గానీ అది పూర్తిగా ఓవర్లాప్ కాకపోవడంవల్ల ఒకవైపువాళ్లు రెండోవైపువాళ్లని చూడాలంటే ఆ అద్దాన్ని కొద్దిగా పైకో, కిందకో లేక ఒకపక్కకో కదపాలి. దానికితోడు, అంత అద్దంలోనూ రెండువైపులా కనిపించేలా చేసిన భాగం చిన్నది గనుక ఒక కన్నునైనా దానికి దగ్గరగా చేరిస్తేగానీ అవతలివాళ్లు పూర్తిగా కనపడరు.
“కానీ, కంటిని ఆ అద్దానికి దగ్గరగా చేర్చాలని చూడబోతే మాత్రం, ఆవిడకి కోపమొస్తుంది. దాన్ని వెంటనే లాక్కుని, దూరంనించే చూడాలని, లేకపోతే ఆ కళాయిని గీకేసీ, మసిని పుర్తిగా చెరిపేసీ చూడాలని సంజ్ఞ చేసి చెబుతుంది. నా చిన్నతనంలో తలుపు కంతల్లోంచో సందుల్లోంచో నేనలా చూస్తున్నప్పుడు నన్ను లాగి, తలుపుకి దూరంగా నిల్చోబెట్టడం నాకు బాగానే గుర్తు. అయితే, ఆ వయస్సులో నేను దొంగాట ఆడుతున్నప్పుడు, అలా చూడొద్దనడం నాకే నచ్చేదికాదు! అలాంటిది ఆ పెళ్లికొడుకు దాన్ని చిరాగ్గా పక్కన పడెయ్యడంలో వింతేముంది? అమ్మమ్మ బాధ పడుతుందేమోనని అమ్మ భయపడ్డదట గానీ ఆవిడ నిర్లిప్తంగా ఆ అద్దాన్ని తనతో వెనక్కి తెచ్చుకున్నదట!” అని ఆగాడు.
“మీ అమ్మమ్మ ఇచ్చే బహుమతుల గూర్చి నువ్వు చెప్పినప్పుడు వినడం వేరు, స్వయంగా చూడ్డం వేరు,” అని ఒక్క క్షణం ఆగి, “మన పెళ్లికి ఏ టైపు?” అనడిగింది. “పేషెన్స్, మై డియర్, పేషెన్స్!” రఘు జవాబిచ్చాడు.
పెళ్లికి ముందరే రాగిణి వాళ్ల ఇంట్లో అడుగుపెట్టడం దుర్గమ్మగారికి ముందు ఇష్టంలేదు గానీ, “కాలేజీలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్గా రోజూ ఇంటికి తీసుకొచ్చినప్పుడు లేని అభ్యంతరం పెళ్లి కుదిరిన తరువాతెందుకు?” అని రఘు అడిగితే ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. ఇప్పుడు తమ్ముడి కూతురి పెళ్లికి అయిష్టంగానే అయినా రాగిణిని రానిచ్చింది.
“ఈవిడ ఇలా ఇస్తుంటే మీ తాతయ్య ఏమనేవారో?” దుర్గమ్మగారి చిన్నతనంలోనే ఆవిడ తండ్రి పోయారని రాగిణికి తెలుసుగానీ, అంతకంటే వివరాలు తెలియకపోవడంవల్ల. “అవునూ, మీ ఇంట్లో మీ తాతయ్య ఫోటో కనిపించదెందుకని?” అతని ఆలోచనలకి అడ్డొస్తూ అడిగింది. అతనికి తెలిస్తేగా, చెప్పడానికి!
***
ఆ తరువాత నెలరోజులకే – వాళ్ల పెళ్లి ముహూర్తానికి నెలరోజుల ముందరే – అనసూయమ్మగారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆవిడ కొడుకులు ఊళ్లోనే వున్నా గానీ, తరువాతి కార్యక్రమాలన్నీ దుర్గమ్మ గారింట్లోనే జరిగాయి. అన్నింటికీ ఆవిడే సారథిగా పనిచేసినా, అలసిపోయినప్పుడు ఏదో కుర్చీలోనో లేక మంచంమీదో తలవాల్చకుండా భర్త భుజాన్ని ఆవిడ వెదుక్కోవడం కొత్తేమీ కాదు రఘుకి.
పన్నెండో రోజు కార్యక్రమాలన్నీ పూర్తయి చుట్టపక్కాలందరూ వెళ్లిన తరువాత తల్లి సొలసి వాలిపోయినప్పుడు రఘు అమ్మమ్మ గదిలోకి వెళ్లి చుట్టూ చూశాడు. మంచం, కుర్చీ, గోడలమీద పటాలూ, ఒక చిన్న చెక్క బీరువా, ఎప్పటిదో ఒక భోషాణం కనిపించాయి. అన్నీ అతను చిన్నప్పటినించీ చూసినవే! రాగిణి తాతయ్య ఫోటో గూర్చి అడగడం కనీసం పదిహేనేళ్ల క్రితం ఒకసారి అతను దుర్గమ్మగార్ని, “అందరిళ్లల్లో లాగా మనింట్లో తాతయ్య ఫోటో కనిపించదే” మని అడగడాన్ని గుర్తుకు తెచ్చింది. అతనే తాతయ్య గూర్చి అడిగాడో ఆవిడకి తెలుసుగానీ జవాబు మాత్రం చెప్పలేదు. పోనీ, ఆయన ఎలా ఉంటారో చెప్పమని అడిగాడు. “నేనే చూళ్లేదురా, నీకేం చెప్పేది?” అని జవాబిచ్చింది. బీరువాలోగానీ, లేక భోషాణంలోగానీ ఆ ఫోటో దొరకవచ్చనిపించి మొదట బీరువా తలుపులు తీసి వెదికాడు. ఆవిడ బట్టలు తప్ప మరేమీ కనిపించలేదు.
మంచంమీద కూర్చుని భోషాణం మూత తీసి దాన్ని నిల్చోబెట్టబోతుంటే అది వెనక్కి పడి, గోడక్కొట్టుకుని శబ్దం చేసింది. దాన్నిండా అతనికి కనిపించినవి రకరకాల అద్దాలు. అన్నీ ఫ్రేముల్లోనే ఉన్నాయి. ప్రతీ ఫ్రేముమీదా ఒక జంట పేరు రాసివుంది. దుర్గమ్మగారి మేనమామలవీ, మేనత్తలవీ, పిన్నులవీ, బాబాయిలవీ, రఘు తల్లి తరఫునా తండ్రి తరఫునా అన్నదమ్ములవీ, అక్కచెల్లెళ్లవీ, వాళ్ల పిల్లలవీ అన్నీ కలిపి కనీసం మూడు తరాలు. కొన్ని చుట్టుపక్కల తెలిసినవాళ్లవి. క్రితంనెల పెళ్లిలో వధూవరుల పేర్లు రాసున్న ఫ్రేంలోని అద్దం తప్పితే మిగిలిన ఫ్రేముల్లోని అద్దాలన్నీ పగిలే ఉన్నాయి. అతితక్కువవాటిల్లో మాత్రం ఆ పగుళ్ల సంఖ్య మూడు లేక నాలుగు దగ్గర నిలిచిపోయింది; చాలావాటిల్లో లెక్కలేనన్ని. అట్లాంటివాటిల్లో ఆ వెనక అట్టముక్కో లేక చెక్కముక్కో సపోర్టు లేకపోతే, అవి వున్నాగానీ కొన్ని సెల్లో టేపులు పగిలిన ముక్కలని పట్టి ఉంచకపోతే, ఫ్రేముని అలాగే వదిలేసి ఆ ముక్కలన్నీ ఎప్పుడో తమదారిన తాము వెళ్లిపోయేవి.
రెండు గాజు పలకలు మాత్రం వీటికి వేరేగావున్నాయి. ఈ రెండింటికీ ఫ్రేమున్నదిగానీ వెనక అట్టముక్కగానీ చెక్కముక్కగానీ సపోర్టులేవు. ఆ రెండూకూడా రెండువైపులా మసిపట్టివున్నాయి. మొహానికి రెండడుగుల దూరంలోవుంచి చూస్తే ఒకదాంట్లోంచి కొద్దిగానయినా అవతలివైపు కనిపిస్తోందిగానీ, రెండవదాంట్లోంచి చూసినప్పుడు అవతలివైపు కొంచెమయినా కనిపించాలంటే మాత్రం, తలుపుకన్నానికి కంటిని ఆనించినట్లుగా పెడితే తప్ప అవతలివైపు ఏమీ కనిపించట్లేదు.
“దానిమీద పేర్లు చూశావా?” తల్లి గొంతు వినిపించి ఉలిక్కిపడి తిరిగిచూశాడు. “అమ్మమ్మ ఆ భోషాణం తెరిచినప్పుడల్లా ఆ మూత అలాగే గోడక్కొట్టుకుని శబ్దమొచ్చేది. ఆ శబ్దం నన్నీ గదిలోకి లాక్కొచ్చేది. ఇప్పుడూ అంతే. ఆ శబ్దాన్ని విని ఆవిడేనని ఒక్ఖ క్షణం భ్రమపడ్డాను. దానిమీది పేర్లు చదువు!”
“సత్యవతి, నారాయణ.”
“పెద్దమామయ్య కూతురు, అల్లుడు.”
కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమించుకుని, పెద్దలు అనుమతివ్వరేమోనని గుళ్లో పెళ్లిచేసుకున్నారు. కులాంతర వివాహంకూడా. మామయ్యకి కోపమొచ్చి మొహం చూపించద్దన్నాడు. స్నేహితుల సహాయంతో కాపురం పెట్టారు. ఇద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కోపాలొచ్చినప్పుడు, “అనవసరంగా నిన్ను చేసుకుని ఈ గతి తెచ్చుకున్నాను,” అని ఒకళ్లమీద ఒకళ్లు అరుచుకుంటూంటారు. మావయ్య ఇంట్లో లేనప్పుడు అప్పుడప్పుడూ అత్తయ్య దగ్గరకొచ్చి సత్యవతి ఏడుస్తూంటుందని విన్నాడు.
రెండో గాజు పలకమీద “సావిత్రి, నరసింహారావు” అని ఉన్నది. “బుచ్చెయ్య గారమ్మాయి,” అన్నదావిడ. ముందుదానికంటే ఇది చాలా నయం. దీనిమీద కూడా మసి ఉన్నమాట నిజమే గానీ ఏపక్కనించీ చూసినా అవతలిపక్క మరీ అంతగా కనిపించకుండా ఏమీ లేదు.
చాలా ముక్కలున్న అద్దంమీద “రుక్మిణి, కృష్ణుడు” అని ఉన్నది. “రెండో మామయ్య,” అన్నదావిడ. ఆ పేర్లున్నఅంత సారోఫుల్ జంట ఇంకేదీ వుండదనిపిస్తుంది. పేకాట్లో ఓడిపోయినప్పుడు తాగొచ్చేవాడు. ఇదేంటని అడిగిన పెళ్లాన్ని కొట్టేవాడు. ఆవిడ పైకప్పు ఎగిరేలా ఏడ్చేది. ఆయన నిషా దిగేకొద్దీ ఆవిడ నోరు పెరిగేది. ఆయన చేతిలో మళ్లీ జీతం డబ్బులు పడేదాకా ఆ నోరు అలానే సాగుతూండేది. అప్పుడు పేకాట మొదలు! ఆరోగ్యం చెడి, ఇప్పుడు పిల్లిలా తయారయ్యాడు.
“పెళ్లిపిలుపు రాగానే బజారుకి పోయి ఒక అద్దాన్నో, గాజుపలకనో కొనుక్కొచ్చేది. డబ్బులు ఎంతగా దాచినా ఎలాగోలా దొరకపుచ్చుకునేది,” అన్నది అతను పెట్టెలోంచి తీస్తున్న ఫ్రేములని చూస్తూ. “‘ఎంత? ఒక అద్దమేగా! అదికూడా పెళ్లిపిలుపొచ్చినప్పుడు మాత్రమే. ఈమాత్రం దానికి అంత కష్టపెట్టడం అవసరమా?’ అన్నారు మీ నాన్న. తరువాత దాన్ని పట్టించుకోవడం మానేశాను. మా అన్నయ్యల పెళ్లిళ్ల సమయంలో మాత్రం ఇంట్లో అద్దాలు ఎలా మాయమయ్యాయని విసుక్కునేవాళ్లు.”
ఒకటి రెండు అద్దాలు సుత్తితోకొట్టి పగులగొట్టినట్లున్నాయి. అలాంటివాటికి వెనకవైపు ఎంత అట్టముక్కో లేక చెక్కముక్కో సపోర్టున్నా ముందువైపున మూణ్ణాలుగు సెల్లోటేపు ముక్కల అతుకులుగూడా కావలసి వచ్చింది. వాటిమీద పేర్లుగూడా రాసి వున్నాయి. “పిల్లల పేర్లు,” అన్నది దుర్గమ్మగారు నిర్లిప్తంగా. “మనింటికొచ్చినవాళ్ల మాటల్లో తిట్టుకున్నారనో, కొట్టుకున్నారనో, లేక విడిపోబోయేంతవరకూ వస్తే మధ్యవర్తిత్వం జరుగుతోందనో ఎవరి కాపురం గూర్చిన వివరాలు దొర్లినా ఆ రోజు ఒక అద్దం పగలగొట్టడమో గాజు పలకకి మసిపుయ్యడమో జరిగేది. ఆ రోజున ఆవిడ కళ్ల నీళ్లు పెట్టుకుని దిగులుగా కూర్చునేది.”
పెట్టెలో అడుగున కనిపించిందొక ఫ్రేమ్. అందులో ఉన్న అద్దానికి ఒక పగులు – ఒక చివరినుండి మరో చివరిదాకా. ఆ అద్దంమీద తిలకంతో రాసివున్న తన తల్లిదండ్రుల పేర్లని చూసి రఘు ప్రశ్నార్థకంగా తల్లివైపు చూశాడు.
“నేనూ, మీ నాన్నా మొదటిసారీ, చివరిసారీ పోట్లాడుకున్న సంఘటనకి అది రిజిస్ట్రేషన్. అమ్మమ్మ అది నాకు చూపించిన తరువాత మరెప్పుడూ మేం పరుషవాక్యాలు పలకలేదు. అందుకావిడకి జన్మాంతరం కృతజ్ఞులం మేమిద్దరమూ కూడా. ఇంట్లోవున్న ఒకేఒక అద్దానికి – నేను బొట్టు పెట్టుకునేందుకు వాడిన అద్దానికి – ఆ గతిపట్టింది. ”
“ఈ అద్దాల వ్యవహారం ఎప్పుడు మొదలైందసలు?”
“అమ్మమ్మ ఎడమ కంటిమీద గాయం మానిన మచ్చ గుర్తుంది కదా, అప్పుడని చెప్పచ్చు.”
“వాళ్లాయన విసిరేసిన అద్దంవల్ల అయ్యుండాలి!” అన్నాడు చటుక్కున – గాయానికీ, అద్దానికీ లంకెని ఊహించేసి. నిశ్శబ్దాన్ని జవాబుగా తీసుకుని, కొద్దిగా అపాలజెటిక్గా, “ఆయన ఫోటో ఎప్పుడూ చూసిన గుర్తులేదు. ఆ బీరువాలోనో, లేక ఈ పెట్టెలోనో ఉండకపోతుందా అని వెదకడం మొదలుపెట్టాను,” అని జోడించాడు.
“ఎవరయినా ఒక రావణాసురుణ్ణీ, ఒక కీచకుణ్ణీ చూడాలనుకుంటారా? నిజం చెప్పాలంటే, వాళ్లే నయం ఆయనకంటే. రాక్షసు లెప్పుడూ పరాయివాళ్లని మాత్రమే హింసించారు,” అన్నదావిడ.
అనసూయమ్మగారి నలభై అయిదేళ్ల మౌనానికి కారణం తెలిసిన ఒకేఒక వ్యక్తి తన తల్లి అని రఘు కర్థమయింది.
“పెళ్లయ్యేసరికి ఆవిడకి పదిహేనేళ్లు. పెళ్లికొడుక్కి పాతిక. ఉండేది పల్లెటూరు. అప్పటికే రకరకాల తిరుగుళ్లుండేవట. అయినా ఆ కాలంలో ఇలాంటి సమాచారాలు పెళ్లిళ్ల నెప్పుడాపాయి గనుక? పెళ్లాన్ని కొడుతుంటే అడ్డమొచ్చేవాళ్లు లేరు. అయిదేళ్లల్లో నలుగురు పిల్లలు. గర్భవతి నెక్కడ కొడతాడోనని భయపడి నాలుగోనెల రాగానే తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి పురుడు పోసి తరువాత మూణ్ణెల్లకి పంపేవార్ట. సంవత్సరానికి తొమ్మిదినెలలు ఈవిడ ఇంట్లో లేకపోవడాన్ని సాకుగా తీసుకుని పక్క ఊళ్లో ఒకర్తెని ఉంచుకున్నాట్ట. దానికి తోడు తాగుడొకటి! ఆయన ఇంట్లో అడుగు పెడుతున్నాడంటేనే ఈవిడకి గుండెల్లో దడొచ్చేదట.” అని వచ్చి రఘు పక్కన మంచంమీద కూర్చుంది.
“ముగ్గురబ్బాయిల తరువాత నేను పుట్టాను. ఉమ్మడికుటుంబమే అయినా, నేను పుట్టిన తరువాత తాతయ్య ఆవిణ్ణి దింపడానికొచ్చేసరికి ఇంట్లో పెద్దవాళ్లు లేరు. అత్తమామలు తీర్థయాత్రలకని వెళ్లారు. ఆయన అన్నయ్యేమో పొలంపనులని పట్నమెళ్లారు. ఆ తోడికోడలు అమ్మమ్మకంటే ఓ రెండేళ్లు పెద్ద, అంతే. వాళ్లకి పిల్లల్లేరు. మా తాతయ్య అక్కడ రెండ్రోజులున్నా ఈయన గానీ ఆయన అన్నయ్య గానీ అయిపులేరు. ఇంట్లో ఉన్నది నలుగురు చిన్నపిల్లలు, ముగ్గురాడవాళ్లు – అమ్మమ్మా, ఆవిడ తోడికోడలు, కొన్ని నెలలు సహాయంగా ఉంటుందని తెచ్చిన పార్వతమ్మ అనే ఆవిడ. వాళ్లకి భారమవుతూ అక్కడుండడం ఇష్టంలేక ఆయన వెళ్లిపోయారు.
“అది గుడ్డి దీపాల కాలం. ఎలక్ట్రిసిటీ పల్లెటూళ్లకింకా రాలేదు. చీకటి పడిన తరువాత, ఆయన ఆ రాత్రి ఇంటికి గనుక వస్తే అప్పటికి అలంకరించుకుని ఉండకపోతే కోపం తెచ్చుకుంటాడని ఆవిడ గూట్లో దీపంపక్కన అద్దం పెట్టి ఉంచింది. రాత్రెప్పుడో తలుపు ధడధడా చప్పుడయితే, నిద్రపోతున్నదికాస్తా మంచంమీంచి ఒక్క ఉదుటున లేచి తలుపు తీసేముందర అద్దంలో ఒకసారి చూసుకుని వెళ్లి తలుపు తీసిందట. ఆమాత్రం ఆలస్యానికే ఆ మహానుభావుడు తిట్లు లంఘించుకున్నాట్ట. అప్పటికే తప్పతాగున్నాడు. అంత మైకంలో గూడా ఆవిడ అలంకరణనీ, గూట్లో దీపాన్నీ, దానిపక్కన అద్దాన్నీ చూసి, ‘ఇంత రాత్రప్పుడు నీకు సింగారం కావలసివచ్చిందటే, దొంగముండా,’ అని ఆ అద్దాన్ని ఆవిడమీద విసిరేశాడు. అదావిడ మొహానిక్కొట్టుకుని కిందపడి ముక్కలైంది. ఈవిడ అద్దం దెబ్బవల్లకన్నా గూడా ఆ షాక్కి తట్టుకోలేక అక్కడే కుప్పకూలింది. ఈయన అరుపులకి నిద్రలేచి ఏడుస్తున్న పిల్లలని సముదాయించుతూ వేరేగదిలో ఉండడంవల్ల పార్వతమ్మ ఈవిణ్ణి పట్టించుకోలేకపోయింది.
“ఆ రోజు చాలామంది ఖర్మలు కాలెయ్. వాళ్లల్లో ఆ తోడికోడలు ఒకర్తి. ఆవిడ గదిలో ఈయన దూరి తలుపు గడియ వేశాట్ట. ఆవిడ పెద్దగా అరిచినా లంకంత కొంపలో, చుట్టుపక్కల అంతగా జనం లేనిచోట అవెవరికి వినిపిస్తయ్? ఆ అరుపులకి అమ్మమ్మకి స్పృహవచ్చి తలుపు సందులోంచి లోపలికి చూసి అక్కడ ఆ గుడ్డివెలుగులో జరుగుతున్న ఘోరం అర్థమై తలుపు కానుకుని కూలిపోయిందట.
“ఆ తోడికోడలు వంటిమీద స్పృహ లేనట్లుగా ఆ గదిలోంచి బయటికి వచ్చినప్పుడు ఈవిడ శిలలాగా కూర్చొని చూస్తూండిపోయిందట. తుఫాను తరువాతి నిశ్శబ్దం ఇల్లంతటా. పిల్లల్ని నిద్రపుచ్చి బయటికి వచ్చి పార్వతమ్మ చూద్దును గదా, పగిలిన అద్దం ముక్కల్లో ఒకదాన్ని రక్త మోడుతున్న చేత్తో పట్టుకుని గుమ్మానికి ఆనుకుని కూర్చున్న అమ్మమ్మ కనిపించిందట. గదిలోపల వాళ్లాయన వంటినిండా గాయాలతో నిర్జీవుడై పడున్నాట్ట. బాగా తాగుండడంవల్ల ప్రతిఘటించే అవకాశమే లేకుండా తుదిశ్వాస విడిచాడు.
“పార్వతమ్మ తెలివి తెచ్చుకుని, ఈవిడకి తలనిండా నీళ్లుపోసి, తుడిచి, బట్టలని కట్టి, తీసుకొచ్చి నాపక్కన పడుకోబెట్టి, హత్యాయుధాన్ని కడిగి, మిగిలిన అద్దం ముక్కలతోబాటు పక్కకి ఊడ్చిపెట్టింది. తరువాత రక్తంతో తడిసిన ఆవిడ బట్టలని ఉతికి ఆరేసింది.
“మరునాడు ఆవిడ తోడికోడలు శవం ఊరి చెరువులో తేలింది. దానితోబాటు ఈయన శవం అన్నయ్య గదిలో దొరకడంవల్ల వాళ్లన్నయ్య శత్రువులెవరో వదినెగారిమీద అఘాయిత్యం చెయ్యబోతుంటే ఈయన అడ్డం వెళ్లుంటాడనీ, ఆ గదిలో జరిగిన విధ్వంసమంతా వాళ్లమధ్య జరిగిన యుధ్ధం వల్లనేననీ, ఆయన్ని మట్టు బెట్టిన తరువాత ఆ దుండగులు ఆవిణ్ణి ఎత్తుకెళ్లుంటారనీ ప్రజలే కాక పోలీసులు కూడా నిర్ణయాని కొచ్చారు. ఆయన శరీరంమీది గాయాలని చూసి కత్తికోసం వెదికారు గానీ అది ఆ ఇంట్లో దొరకలేదు. అనసూయమ్మగారిని మాత్రం ఎవరూ అనుమానించలేదు. ఆ కాలంలో సాంప్రదాయిక కుటుంబంలోంచి వచ్చి, నలుగురు పిల్లలున్న ఇరవయ్యేళ్ల భార్యని హంతకురాలిగా ఎవరనుమానిస్తారు?
“తరువాత మా అమ్మమ్మా, తాతయ్యా మా అన్నయ్యలనీ, నన్నూ పెంచి పెద్దచేశారు. తల్లిలాగా నన్ను చూసుకున్నది మాత్రం పార్వతమ్మ. నాకు ఊహ తెలిసి నప్పటినించీ అమ్మమ్మనోరు విప్పడం ఎరుగను. షాకు వల్ల పిచ్చిదయిందన్నారు. మాట్లాడకుండా ఒక మూల కూర్చునేదిగానీ పిచ్చి చేష్టలేవీ ఎప్పుడూ చెయ్యలేదు. గత పాతికేళ్లుగా ఆలోచిస్తే నాకు అర్థమైనదేమంటే – మా తాతగారిల్లు ఎప్పుడూ పూజలు, పునస్కారాలతో హడావుడిగా ఉండేది. అక్కడ, పుణ్యంగూర్చీ, పాపంగూర్చీ నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. అవి ఆవిడకి బాగా వంటబట్టి ఆవిణ్ణి మహిషాసుర మర్దినిని చేసెయ్. దానితోబాటు మమ్మల్ని ఒక పాపి పిల్లలుగా చూసి, ఆయన వారసత్వం మాలో ఎక్కడ కనిపిస్తుందోనన్న భయంతోనే ఆవిడ నోట మాట పెగల్లేదని నా నమ్మకం.
హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు గానీ, రావణాసురుడికి ఇంద్రజిత్తు పుట్టలేదా? ఆ సమయంలోనే చుట్టుపక్కల సంసారాల్లోని ఘర్షణలని గమనించడం ఆవిడ మొదలుపెట్టివుండాలి.
“నా పెళ్లయిన కొన్నేళ్లకి మా తాతయ్య పోయినప్పుడొచ్చింది సమస్య. మా అమ్మమ్మని తమతో తీసుకుపోవడానికి మా మేనమామలు సిధ్ధమేగానీ, ఈ పిచ్చిచెల్లెల్ని తీసుకెళ్లడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. అప్పటికి పెద్దమామయ్యకి పెళ్లయిందిగానీ, ఈ పిచ్చి అత్తగారిని తమతో తీసుకెళ్లడానికి వాళ్లావిడ ఒప్పుకోలేదు. మా కెవ్వరికీ తల్లిప్రేమ అనేది తెలియదు గనుక ఆవిడెప్పుడూ పరాయిదానిలాగే కనిపించింది. చిన్నప్పటినించీ పార్వతమ్మ నన్ను పెంచింది గనుక, నాకు ఆవిడ దగ్గర చనువెక్కువ గనుక ఆవిడ దగ్గర ఏడ్చాను – ‘మేమేం పాపం చేశామో మాకిలాంటి తల్లి దొరికిందీ’ అని. ‘తప్పు. మేమెంత పుణ్యం చేశామో మా కిలాంటి తల్లి దొరికిందీ అని గర్వపడాలి!’ అన్నదావిడ. నేను తెల్లబోయి చూస్తుంటే అప్పటిదాకానే కాక ఇప్పటిదాకా కూడా ఇంకెవరికీ తెలియని ఈ వివరాలని నాకు చెప్పింది.
“అప్పుడు నేను మా అమ్మ దగ్గర కెళ్లి, ఓ మూల కూర్చున్న ఆవిడ కాళ్లమీద తలబెట్టుకుని ఏడ్చాను. ఇలా -” అంటూ మంచంమీద పక్కకి వాలి రఘు కాళ్లమీద తల పెట్టి ఏడ్చింది. అతనికీ కళ్లమ్మట నీరు ధారగా కారింది. కొంచెం సేద తీరిన తరువాత చెప్పడం కొనసాగించింది.
“తల్లిప్రేమ నోచుకోని దాన్నని మీ నాన్న నన్ను ఇప్పటికీ ప్రేమగా చూస్తారు. తల్లిదండ్రులున్న ఆడపిల్లలకే పెళ్లికావడం కష్టం – కాబోయే అల్లుడికి అత్తారిల్లంటూ ఒకటున్నాగానీ. అలాంటిది నన్ను అత్తారింటి ఆశలేం లేకుండా ఆయన పెళ్లిచేసుకోవడం నా అదృష్టమనే భావించాను. ఆ చనువుతో ఆయన్ని పొలంగట్టు మీదకి తీసుకెళ్లి ఈ కథంతా చెప్పి అమ్మమ్మని మనతో తెచ్చుకుందా మన్నాను. ఆయనకూడా కంటతడిని తుడుచుకుని, ‘తప్పకుండా,’ అన్నారు. ‘కొడుకే తనతో తీసుకెళ్లడానికి కుదరదన్నప్పుడు అల్లుడెలా తీసుకెడుతున్నాడబ్బా?’ అని ఆశ్చర్యపడినా, ఆ సంతోషంలో ఇంకెవరూ ఏ ప్రశ్నా వెయ్యలేదు – అలా చేస్తే ఆయనెక్కడ మనసు మార్చుకుంటాడోనని!
“మనింటికొచ్చిన తరువాత కూడా ఆవిడ మౌనవ్రతాన్ని వీడలేదు. మా నలుగురి పెళ్లిళ్లూ అయిన తరువాత ఆవిడ మనసు కొంచెం కుదుటపడి ఏమయినా మాట్లాడ్డం మొదలు పెట్టేదేమో గానీ, రెండో కొడుకు తాగి రావడం, వాళ్లావిణ్ణి కొట్టడం ఆవిడకి వాళ్లాయన పాపాన్ని అనుక్షణం గుర్తుచెయ్యడంవల్ల మనశ్శాంతికి దూరమయి మౌనిగానే మిగిలిపోయింది. కాలక్రమాన అస్తమానమూ చీకటిగదిలో కూర్చోవడం మానేసి బయటికి వచ్చి వీధిలో తిరిగే ప్రజలని ప్రహరీగోడమీదుగా చూడడం, చుట్టుపక్కలవాళ్లని గమనిస్తూండడం మొదలుపెట్టింది.
“నాన్న పేరూ, నా పేరూ రాసున్న అద్దంలో ఒక పగులుంది చూశావా? నీకు నాలుగో అయిదో ఏళ్లున్నప్పుడు నాన్నతో పోట్లాడాను – ‘మీ తమ్ముడు బిజినెస్ పెడతానంటే ఆస్తినంతా తెగనమ్మి పెట్టుబడికోసమని ఇచ్చేస్తే మనగతి ఏంకాను?’ అని. నీకు తెలుసుగా, ఆయన ఎప్పుడూ అందరి మేలుగూర్చీ ఆలోచిస్తారని? ‘వాడు పైకొచ్చే అవకాశముంటే మనం అడ్డు తగలకూడ’ దన్నారు. ‘వాడు వీధిని పడితే మనకి అగౌరవంకాదా?’ అనడిగారు. అవతల కొనేవాడు రెడీగావున్నాగానీ నా పట్టు సడల్లేదు. మేమెప్పుడూ అంత ఘర్షణపడలేదు. రెండు మూడు రోజులు మా మధ్య మౌనం రాజ్య మేలింది. అప్పుడు అమ్మమ్మ నన్ను తన గదిలోకి తీసుకెళ్లింది. నా తలని తన తలదగ్గరకు లాక్కొని రెండింటినీ ఈ అద్దంలో చూపించిది. అప్పటికది పగల్లేదులే! ఈ అద్దాన్ని వెనక్కి తిప్పి, ఫ్రేముని రెండు చేతులతోనూ పట్టుకుని ఆ అట్టముక్కమీద బొటన వేళ్లతో కొంచెం నొక్కింది. ఫట్ మని పగిలిందా అద్దం. ఆ పగులు ఇటు మూలల్ని కలుపుతూనూ లేదు అటు భుజాల మధ్యగానూ లేదు. దానిష్టమొచ్చిన రీతిలో ఉన్నది కదా! ఆ పగిలిన అద్దంలో మళ్లీ మా తలలని పక్కపక్కన పెట్టి చూపించింది. నా అదృష్టంవల్ల ఆవిడ చెప్పబోయింది నాకు మాటల అవసరం లేకుండానే అర్థమయింది.
“ఆవిడ గదిలోంచి బయటికి వచ్చిన తరువాత మీ నాన్న, ‘పోనీ, అమ్మకుండా దానిమీద అప్పు తీసుకుంటే?’ అన్నారు. ఆయనకసలు అప్పు చెయ్యడమంటే ఇష్టంలేదు. అలాంటిది, నాకోసం తన ఆదర్శాన్ని మార్చుకోవడానికి కూడా సిధ్ధపడ్డారు. ‘ఎలాగయినా సరే. మీ ఇష్టం,’ అన్నాను. ‘అసలు దానికి మనమెందుకు పెట్టుబడి పెట్టాలి? ‘ అని వాదించిన దాన్ని అలా ప్లేటు ఫిరాయించేసరికి షాకు తిన్నారు. ఇంకొన్నిసార్లు అడిగి అది నిజమే అని నిర్ధారించుకున్నారు. ఆ దెబ్బతో అత్తగారిమీద గౌరంకూడా పెరిగిపోయింది. అదృష్టం కలిసొచ్చో, అలా రాసివుండడంవల్లనో కానీ, మీ బాబాయి బిజినెస్లో నిలదొక్కుకుని, ఆ అప్పుని తీర్చగలిగాడు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ బాధపడతాను – మీరు చేసేది బాగాలేదు అని అనకుండా, ఇలా చేస్తే ఎలా ఉంటుందీ – అని వేరే మార్గం చూపిస్తే ఎంత బాగుండేది! అని.
“మహాత్ములకి తమ అవసానకాలం సమీపించిందని తెలుస్తుందంటారు. ఇందాక అన్నానే, ఆవిడ మాట్లాడ్డం నేనెప్పుడూ వినలేదని? ఆవిడ పోయే ముందురోజు రాత్రి తొమ్మిది గంటల దాకా అది నిజం. ఆ రాత్రి పడుకోబోయేముందు ఆవిడ నా చెయ్యి పట్టుకుని తన మంచంమీద కూర్చోబెట్టుకుంది. నా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడబోయింది. నోరు తడారినట్లు ముందు మాట పెగల్లేదు. తరువాత అన్నది – ‘తల్లిగా నీకేం చెయ్యకపోయినా నన్ను నీ కూతురిలాగా చూసుకున్నావు. నా అదృష్టం.’ అంతే! ఆవిణ్ణి కావలించుకుని ఏడ్చేశాను. ఇంకా మాట్లాడుతుందేమోనని చూశాను. అహఁ. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. మరునాడు సూర్యోదయం సమయంలో ఆవిడ గదిలోకి వెళ్లాను. మామూలుగా ఆవిడ అప్పటికి మెలకువగానే వుంటుంది. కళ్లు తెరిచే ఉన్నాయి. నన్ను గుర్తు పట్టామని తెలిపాయి. నేను చూస్తూండగానే ఆ కళ్లల్లో కాంతి అదృశ్యమయింది.”
ఆవిడ తలమీద అలాగే చెయ్యేసి నిమురుతూ కాసేపు నిశ్శబ్దంలో గడిపిన తరువాత ఆ భోషాణంలోకి చూస్తే రఘుకి అడుగున ఒక చిన్న గుడ్డమూట కనిపించింది. “నీకు తెలిసే ఉండాలి. ఆ చిన్నమూటేమిటమ్మా?” అడిగాడు.
లేచి కూర్చుంటూ, “వాళ్లాయన మొహంమీదకి విసిరేసిన అద్దం కిందపడి పగిలిందని చెప్పాగా! పార్వతమ్మ అమ్మమ్మని స్నానం చేయించి నాపక్కన పడుకోబెట్టి బట్టలుతికి లోపలికి వచ్చేసరికి ఈవిడ ఆ అద్దం ముక్కలని గుండ్రాయితో నూరుతూ కనిపించిందట. ఆవిడ రావడం ఒక్కక్షణం ఆలస్యమయ్యుంటే – ఊహించడానికే భయమేస్తుంది. నువ్వు పోతే నీ పిల్లల నెవరు చూస్తారనుకుంటున్నావు, వాళ్లేమయిపోతారో ఆలోచించావా? అని పార్వతమ్మ చివాట్లేసిందట. తండ్రి బుధ్ధులు వాళ్లకొస్తే చూసి తట్టుకోలేనని అమ్మమ్మ బావురుమందట. అయితే, ఈ పొడిని మూటకట్టి భద్రంగా వుంచు. ఎప్పుడు తట్టుకోలేకపోతే అప్పుడే దాన్ని విప్పచ్చు. అంతేతప్ప లేనిపోని భయాలకి పోయి అనవసరంగా ముక్కుపచ్చలారని పిల్లలకి తల్లిని ఇప్పుడే దూరంచెయ్యకు – అని ఆవిణ్ణి దారిమళ్లించి ఆ గుడ్డ మూటని భోషాణంలో పడేయించిందట.
“మనింటి కొచ్చిన మొదట్లో ఈ భోషాణం మూత గోడక్కొట్టుకున్న శబ్దాన్ని విని, హడలిపోయి పరుగెత్తుకుంటూ ఈ గదిలోకి వచ్చేదాన్ని ఆవిడ ఆ మూటని విప్పుతోందేమోనని భయపడుతూ, అంత బలీయమైన కారణాలు ఈ మధ్యలో ఎక్కడ కనిపించెయ్యా అని గబగబా ఆలోచిస్తూను. అందుకే ఆ శబ్దం నన్నెక్కడున్నా పట్టి పిలుస్తుంది. మెల్లిగా ఆ దడ తగ్గి అది కుతూహలంలోకి మారిందనుకో. కానీ పాత అలవాట్లు అంత తొందరగా ఎలా పోతాయి? ”
“అమ్మమ్మ మీ పెళ్లికి ఎలాంటి గాజు పలక వున్న ఫ్రేముని ఇచ్చేదో ఐడియా వుంది,” అన్నదావిడ భోషాణం తలుపు మూస్తూ.
***
“విక్రమార్కా, విన్నావుగా! అనసూయమ్మగారిది విషాద కథ అనడంలో ఏ మాత్రం సందేహంలేదు. కానీ, ఆవిడ అద్దాల కథే అంతుపట్టని విషయం. పెళ్లిళ్లలోనే ఆవిడ ఆ అద్దాలని ఇచ్చింది గనుక ఆవిడ ఉద్దేశంలో పెళ్లికీ, అద్దాలకీ ఏదో లంకె ఉండేవుండాలి. ఆ సంబంధమేమిటి? ఆ మూడు రకాల అద్దాల కథ వెనక వున్న అంతరార్థమేమిటి? ఆవిడే బ్రతికుంటే రఘు-రాగిణుల పెళ్లికి ఎలాంటి అద్దాన్నిచ్చేది? సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు బేతాళుడు.
“నువ్వు కథ చెబుతుండగానే నేను కూడా భవిష్యత్తులోకి తొంగిచూసి ఆ సమాజం ఎలావున్నదో అర్థంచేసుకున్నాను. అనసూయమ్మగారికి అద్దం ఫ్రేము పెళ్లికి ప్రతీక. దాని వెనకవుండే చెక్కముక్క లేక అట్టముక్క, మీ వెనక మేమున్నామని వాళ్ల కుటుంబాలు, బంధుమిత్రులు ఇచ్చే ఆసరాకి ప్రతీకలు. పెళ్లికొడుకునీ, పెళ్లికూతురినీ పక్కపక్కన కూర్చుని అద్దంలో చూసుకొమ్మనడంలో అంతరార్థం, ఆ ఫ్రేములోనూ, ఆసరాతోనూ వున్న ఆ జంట ఎంత అందగా వున్నదో చూసుకొమ్మనమని. అద్దం మాత్రం, ఆ జంటకి మాత్రమే వర్తించే అందం. అదే అద్దం ముక్కలైనప్పుడు దాన్లో వాళ్ల బొమ్మ వికృతంగా వుంటుంది కదా? అలాగే, దానికి మసిపట్టినా బొమ్మ స్పష్టంగా కనబడదు. ఆ భావాన్ని తెలియపరచడానికి ఆవిడ ప్రయత్నించిందిగానీ, మాట్లాడకపోవడంవల్ల నవ్వులపాలైంది. మరీ బీటలు వారిన అద్దాన్ని కలిపివుంచే టేపులు ఆ దంపతుల పిల్లలకి ప్రతీకలు. ఇక ఆవిడ విషయానికే వస్తే, కొందరికి పెళ్లి ముక్కలవుతుందేమోగానీ, ఆవిడకి మాత్రం అది తుత్తినియలై పోయింది. ఆ ఫ్రేములో ఇమిడినందుకు ఆవిడకి భర్తవైపునించీ సంక్రమించిన ఆస్తి పిల్లలని పోషించడాని కక్కర కొచ్చింది కానీ, అది ఆవిడ కెన్నడూ మింగుడు పడలేదనిపిస్తుంది.
“మొహాన్ని చూసుకునే అద్దం పోలిక అందరు దంపతులకీ వర్తిస్తుంది గనుక అది రఘు, రాగిణులకి ప్రత్యేకమేమీ కాదు. అనసూయమ్మగారు తెలివైనది గనుక ఆవిడ సావిత్రీ-నరసింహారావు, సత్యవతీ-నారాయణల ప్రేమ పెళ్లిళ్లు వాళ్ల దాంపత్య జీవితంలో తను ఆశించినంత అవగాహనని కలిగించలేదని గ్రహించే ఉంటుంది. దానికి ముఖ్య కారణాలు మూడు. ఒకటి – పెళ్లయ్యే ముందరే ఈ దంపతుల్లో ఒకరిగూర్చి ఒకరికి కొంత తెలుసు గానీ అది సంపూర్ణంగా మాత్రం కాకపోవడం. రెండు – పెళ్లయేదాకా పెరిగిన వాతావరణం దాంపత్యంలోని భాగస్వాములకి వేరేగా వుండడం. మూడు – పెళ్లైన దగ్గర్నుంచీ పరిసరాలవల్ల నయితేనేం బంధుమిత్రుల ప్రభావంవల్ల నయితేనేం భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయానికి దారితీసే అవకాశాలు ఎన్నో సహజంగానే రావడం.
సంసారనౌకని చాకచక్యంగా నడపడమంటే భిన్నాభిప్రాయాలు ఛిన్నమనస్కులని కానీయకుండా చూసుకోవడం, మసిపుయ్యడానికి కొత్తగా వచ్చిన అవకాశాలని ఇరువురిలో ఎవరూ అందిపుచ్చుకోకపోవడం. కోపాలొచ్చి అరుచుకున్నారంటే, తెలిసి చేసుకున్నా మనుకుంటున్న అవతలివాళ్ల అంతరంగంమీద మసిపుయ్యడమేగా! ఆ అవకాశాలు సావిత్రి సంసారంకంటే సత్యవతి సంసారానికే ఎక్కువ కలిగెయ్. ఇద్దరి సంసారాలకీ కూడా, మొదటి రెండు కారణాలూ మూడవదానికి ఆజ్యం పోసెయ్. అంటే, వీళ్ల దాంపత్యాలు అనసూయమ్మగారు మొదట ఊహించినట్లు అవతలివైపు స్పష్టంగా కనిపించే గాజు పలకలు మాత్రం కావు.
“రఘు, రాగిణుల సాన్నిహిత్యం కాలేజీ చదువు మధ్యలో మొదలయింది గనుక వీళ్ల మధ్య అవగాహనకూడా కొన్నేళ్లకి మాత్రమే పరిమితమవుతుంది. అదికూడా, కాలేజీ అయిన తరువాత రోజుకి రెండు, మూడు గంటలకి మాత్రమే! పైగా, సినిమా హాళ్లల్లోనూ, పార్కుల్లో ఒకళ్ల ఒళ్లో ఇంకొకరు తలపెట్టి కళ్లల్లోకి చూసుకుంటూనూ గడిపే క్షణాలు మోహవీక్షణాల గడియలు మాత్రమే గనుక పెళ్లి సమయానికి వాళ్ల మధ్య ఏర్పడిన అవగాహననికూడా ఇరువైపులా స్పష్టంగా కనిపించే గాజు పలకతో పోల్చలేం. మొదట రెండువైపులా కళాయి పట్టించి, తరువాత రెండువైపులా అక్కడక్కడా కొంత తుడిచిన గాజు పలకతో పోలికే వీళ్లకి సరి అయినది. అనసూయమ్మగారు అలాంటి గాజుపలకనే రఘు, రాగిణులకి ఇచ్చివుండేది. పెళ్లైన తరువాత ఆ కళాయిని తుడుస్తూ దుర్గమ్మ గారు, ఆవిడ భర్త లాగా దాంపత్యంలోని అందాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారో లేక ఎవరికి చేతనయినంత మసిని వాళ్ల శాయశక్తులా పూస్తూ జీవితాన్ని సాగదీస్తారో రఘు, రాగిణుల ఇష్టం. మరీ మసిపడితే పగులగొట్టి చూడాలనే ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉన్నదని వాళ్లు గ్రహించాలి,” అన్నాడు విక్రమార్కుడు.
ఆ సమాధానం వినగానే బేతాళుడు విక్రమార్కుడి భుజం మీదినించీ మాయమై చెట్టుమీదకి చేరుకున్నాడు.
**** (*) ****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్