పుస్తక పరిచయం

వెంటాడే కథలు; కతల గంప – స. వెం. రమేశ్

అక్టోబర్ 2017

స్తిత్వానికి మంచి భాషా, దాన్ని వాడుకోగల సత్తా తోడయితే కథలని ఎంత కళాత్మకంగా రూపొందించవచ్చో రమేశ్ గారు చూపిస్తారు “కతలగంప” సంకలనంలో. ఈ సంకలనంలోని 18 కథలు చదివితే ఈ రచయిత చిత్రించిన కాన్వాస్ విస్తీర్ణం అర్థమవుతుంది. వస్తువు ఈ కథల్లోని జీవితాలంత అపురూపం, చిత్రణ అనన్య సాధ్యం. అస్తిత్వం ఆయువుపట్టు అవడంవల్ల నేలని వదిలి సాముచేసే కథలేవీ కనిపించవు ఇందులో. గ్రామీణ వాతావరణమూ, దాన్ని అంటిపెట్టుకుని వుండే అచ్చమైన తెలుగు భాషా ఈ కథలకి సొబగులద్దాయి. బాట చెప్పిన, చెట్లు చెప్పిన, మట్టికుండ చెప్పిన, వానజల్లు చెప్పిన, మొయిలుకు చెప్పిన కథలూ, ఆ యా కథనాలకి దీటయిన వర్ణనలూ ఈ సంకలనానికి ప్రత్యేకం.

కొన్ని దశాబ్దాల జీవితాలని అతి దగ్గరగా చూపే చిత్రణమే గాక కమింగ్ ఆఫ్ ఏజ్ తో మొదలుపెట్టి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ) తెలుగు నేర్పడానికి పల్లెపల్లె తిరిగిన దాకా (ఆ అడివంచు పల్లె) ఎదురయిన ప్రతీ సంఘటనా అపురూపపు జ్ఞాపకంగా మారి అందంగా అలంకరించుకుని కనిపిస్తుంది. ప్రళయకావేరి తీరంలో రాష్ట్రవిభజనవల్ల తమిళనాడులో చేర్చబడ్డ పల్లెల్లోని తెలుగువాళ్ల జీవితాల చిత్రణతో ఈ సంకలనం మొదలవుతుంది. ఒక చిన్న బడి, హాస్పిటలు కూడా లేకపోవడమే గాక బస్సు రాకకు కూడా నోచుకోనివీ పల్లెలు. పన్నెండుమంది తమిళ, నూటయాభైమంది తెలుగు పిల్లలున్న చోట బడి అంటే చూరునుంచీ పెళ్లలు రాలిపడుతున్న చిన్న, పాత కట్టడం. ఆ చోటు తమిళనాడులో ఉన్నందున అక్కడ కట్టిన కొత్త గది తమకే కావాలంటారు తమిళ పిల్లలు (తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప). అసలు బడే లేనిచోట కడితే అరవబడే అవాలన్న ప్రతిపాదనకు సరే అందా మంటారు సర్దుకుపోదామనుకునే మనస్తత్వం ఉన్న కొందరు పెద్దలు (మీసర వాన). “మమ్మల్నేమో ఈ తమిళ తోడేళ్లకి యిడిసిపెట్టి ఆ సొరణే లేకుండా ఉండిపొయ్యిండారే ఆ ఆంద్రమోళ్లు” అంటాడు ఆశ్వత్తన్న (పదిమందికి పెట్టే పడసాల). ఈ ఘర్షణ తెలుగు జీవితమంటే యాభయ్యవ దశకంలో భాషాప్రాతిపదికన విభజింపబడ్డ ఇరవై జిల్లాలలో ఉన్నది మాత్రమేనని అనుకునేవా రందరికీ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించవలసిన విషయం, ఆ విభజన తరువాత అయిదు దశాబ్దాలకా అది ఇలా అచ్చులో కనబడిందీ అన్నది.

మొగుడు పోయిన చెల్లవ్వ రెండు బరిగొడ్లను కొని పాలుతీసి పోసి, తెల్లవారగానే ఇడ్లీలూ, వడలూ, సాయంత్రం బోండాలు, జంతికలు అమ్మి కష్టపడి కూతురు పెళ్లిచేస్తే ఆయమ్మ మొగుడు పోయి మళ్ళీ కొడుకు సత్యాన్ని తీసుకుని తల్లిచెంతకే చేరింది (ఊడల్లేని మర్రి). పొలాన్ని అమ్మల్లా అతన్ని పట్నంలో చదివిస్తే, ఆమెకున్న ఇంటిని అమ్మేసి ఆమెకి నిలువనీడ లేకుండా చేస్తాడు ఆ మనవడు. ఇలాంటి జీవితాల గూర్చి విననివాళ్ళు లేకపోవచ్చు గానీ కథనం చివరిదాకా చదివిస్తుంది.

శెడి రడ్డిండ్లు శేరిండ్లేవాళ్లే గానీ రడ్డిండ్లకు శేరి శెడినోళ్లు లేరు (పదిమందికి పెట్టే పడసాల) అంటూ అన్నిచోట్లా ఒకేలా ఉండని వర్ణ వ్యత్యాసాల గూర్చిన కథ ఇది. దీనికి భిన్నంగా ఉండే కథ “అబ్బిళింత.” కౌగిలింత అనే అర్థమయినా అబ్బిళింతల చవిగోలును తెలుసుకోవాలంటే సున్నిత మనస్కులయిన పిల్లల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా చేసే ఈ వర్ణ వ్యత్యాసాల కథని పూర్తిగా చదవాల్సిందే.

మొగుడు బాలిరెడ్డి వెంటతెచ్చిన ఏనాది పిల్ల జిలకర మీద మండిపడ్డా, ఆ పిల్ల పోయిన తరువాత ఆమె కూతురు పద్నావతిని చన్నుకుడిపి బతికించింది బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె). ఆ పిల్లమీద తండ్రివరసని కూడా పట్టించుకోకుండా బాలరెడ్డి చేసిన దాష్టీకాన్ని ఆపలేకపోయింది గానీ, తన స్వంత కొడుకు కూడా దాన్నే తలపెట్టడంతో మొగుణ్ణీ, కొడుకునీ వదిలేసి కూతురుకు పెళ్ళిచేసి, ఆమె చుట్టపక్కాలే ఆమెని దూరంగా ఉంచడంతో ఒంటినిట్టాడి బతుకు బతికింది ఆమె.

చిన్నతనంలో ఊహ తెలియనప్పుడే మొగుణ్ణి కోల్పోయి తమ్ముడి పంచన చేరి, నడి వయసులో నిమ్న కులానికి చెందిన వాడితో పొందుపెట్టుకుందని ఆ తమ్ముడి చేతే జీవితాన్ని “రయికముడి ఎరగని బతుకు” చేయించుకున్న కథ కన్నెమ్మది. వస్తువు పాతదే అయినా ఆకట్టుకునే కథనం. కుమ్మరి చేతుల్లో రూపొందే కళాఖండాల వివరాలు పాఠకులకు అదనపు ప్రతిఫలం.

అల్లమదేవి పదాన్నీ, అడవి అంచున పంటపొలాల మీద ఆధారపడి బతికే మాదిగ కుటుంబాలు ఏనుగుల కోపాన్ని ఎలా కాచుకుంటాయనే వైనాన్నీ, నాగారాజనే ఒక కాపు మగాడు సిరివన్నె అనే కొత్త పెళ్లికూతురుమీద చెయ్యబోయిన దాష్టీకానికి బుద్దిచెప్పడాన్నీ కలగలిపిన కథ “సిడిమొయిలు.” ఏనుగుల మందని దారిమళ్లించే వివరాలు ఉత్కంఠభరితంగా చిత్రించారు రచయిత.

ఎప్పుడో విన్న “బడకొడితి” అన్న జంతువు వెదుకులాట గూర్చిన కథ శీర్షిక కూడా ఆ జంతువు పేరే. దాని గూర్చిన కొన్ని వివరాలివి: “అది గాడిదంత ఎత్తు ఉండచ్చు లేదా కుక్కంత ఎత్తు ఉండచ్చు. దానికి ముక్కుమీద కొమ్ము ఉండచ్చు లేదా దవడల్లోనుంచి కోరలు పొడుచుకుని వచ్చుండచ్చు. దాని వీపుమీద పెద్ద బిందెడు నీళ్లు పట్టేంత గుంట ఉండచ్చు లేదా …” భార్యల గూర్చి భర్తలు చేసే అన్ని రకాల ఫిర్యాదులూ దర్శన మిస్తాయి ఇందులో. ఆ జంతువు చివర్లో దర్శనమిస్తుంది.

కాపు కుటుంబంలో పనిచేసిన మాలోళ్ల మంగమ్మ అంటరానితనం ఆ ఇంట్లో మూడు తరాల్లో ఎలా మారిందో ఒక మరవరి (ఇంజనీర్) కొడుకు చెప్పిన కథ ఇది (కాకికి కడవడు పిచిక్కి పిడికిడు). మంగమ్మ రెక్కల కష్టంతో పండించిన ధాన్యాన్ని ఆ పంటచేను కొన్నది తాము అయినందుకు ‘కాకికి కడవడు పిచిక్కి పిడికిడు’ అంటూ కొలతలేసినా మారు పలకని మంగమ్మ మొగుడికి దొంగతనాన్ని అంటగట్టి వెళ్లగొడుతుండగా అంటుంది: “మీరందురూ మీపని కోసమే అంటును పక్కన పెట్టినారు. మీ లోపలి అంటును మటుకు గట్టిగా అట్నే పెట్టుకోనుండారు. పనులు తీరిపోగానే అది మళ్లా బయటకు వస్తా ఉండాది.” మంగమ్మ ఇక్కట్లు గుండెని కలచక మానవు, వాటికి కారణమయిన సమాజపు రీతులమీద కోపమూ రాక మానదు. అంటరానితనం తుదముట్టించిన అగ్రహారం పిల్లా, కథకుని ప్రేమ కథ “మాదిగపుటక కాదు.”

అరవళ్లి సూరవళ్లి కత, నల్లతంగ కత, కాంతరాజు కత, కమ్మపణితి కత, రేణిగుంట రామిరెడ్డి కత, … ఆ ఊరి మగాళ్ల మోడికోళ్ల కతలు చాలా వున్నాయి ఆ మాదిగ అవ్వ “కతల గంప”లో. తనను కాపాడుకోలేక పోయింది గానీ కూతురునే గాక ఆ చుట్టుపక్కల పల్లెల్లోని ఆడకూతుళ్ళ నందరినీ ఆ మగాళ్ల దౌష్ట్యాన్నుంచీ తప్పించాలనుకుని ఆ కతల నమ్ముతూ బతుకుతోంది. బర్రిగొడ్డయినా ఆవుగొడ్డయినా ఆడబతుకే అట్టాంటిది అబయా అంటుంది రుప్పిణవ్వ.

అలాంటి ఆశయంతోనే బతికింది సునందమ్మ (పాంచాలమ్మ పాట). ధర్మరాజు జూదంలో పణంగా పెట్టి ఓడిపోయిన ద్రౌపదిని కృష్ణుడు రక్షించాడు గానీ ముద్దురెడ్డి సునందమ్మని పణంగా పెట్టి ఓడిపోతే మునిరామ నాయుణ్ణించీ రక్షించడానికి ఎవరూ లేరు. ఆమె ఆ వైనాన్ని ఆ పల్లెలో చాటింపు వెయ్యడమే గాక తల నెగరేసి శేషజీవితాన్ని అక్కడే గడపడం ఆమె ఆ పల్లెవాసులకు చేసిన గొప్ప సహాయం. ఇది బాట చెప్పిన కథ కూడా. ఈ రెండు కారణాలవల్ల కథకు “పాంచాలమ్మ బాట” అని పేరుపెట్టి వుండాల్సిం దనిపిస్తుంది.

“అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్క సామనలుపుతో మినుకుతుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడుతుంటాది.” అంటూ మొదలవుతుంది “మెయిలు నొగులు.” అప్పుడప్పుడూ రాక్షసుడిలా తయారయి ఊళ్లోని ఆడవాళ్లకి కొడుకు చేస్తున్న ఎనలేని అపచారాన్ని సహించలేక చేతులు ముడుచుకుని కూర్చోని తల్లి చిన్నారవ్వ కథ ఇది.

రాగమ్మతో బంధాన్ని వర్ణ వ్యత్యాసమని రవ్వమ్మ అడ్డంకొట్టి కొడుకు రాజయ్యకి రాణెమ్మతో మనువుచేసింది (చెట్లు చెప్పిన కత). ఆస్తి పోయిన తరువాత రెండేళ్ల రాదను, తల్లినీ తీసుకుని మాలవాడలో రాగమ్మని చేరతాడు రాజయ్య. రాణెమ్మ పుట్టింటికి చేరుకుంటుంది. రాదని కొన్నేళ్లు పెంచిన తరువాత ఆమెను మాలపిల్లగానే ఊరు పరిగణిస్తోందని గ్రహించి రవ్వమ్మ ఆ పిల్లని రాణెమ్మ చెంతకు చేరుస్తుంది. పెళ్లయిన తరువాత తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఎత్తుకుని పెంచిన తల్లిని చూడనంటుంది. వలపూ, జీవితం సామాజికంగా వర్ణ వ్యత్యాసం కోరే బలీ ముడివడివున్న కథ ఇది.

ఈ కథాంశాల ఎత్తుని మించినవి వీటిల్లోని భాష, వర్ణనలు, ఉపమానాలు.

ప్రళయ కావేరి మాండలీకంలోని సొబగులకు రచయిత కలం ఎన్ని వన్నె లద్దిందో!

మచ్చుకి కొన్ని -

ముసలి ఉసురునూ పసి ఊపిరినీ …; పెళపెళలాడే పసను లేకపోయినా కళకళలాడే మొగము ఆ అమ్మిది; (చెట్లు చెప్పిన కత)

… బూరగమ్మల కడగండ్లకన్నా జిలకరమ్మల కల్లేట్లు పెద్దవి. (ఒంటి నిట్టాడి గుడిసె)

ఇంటెడు అగచాట్లనూ ఒంటెడు పాట్లనూ … (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

తూరుపు పేట దడబుడ చప్పుళ్లు లేని, మంది లొడలొడలు మట్టుకే ఉండే తావు. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

ఆ మాండలీకానికి తోడుచేసిన అద్భుతమయిన వర్ణనలు ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి.

మచ్చుకి కొన్ని -
కూటికుండనూ కూరాకుచట్టినీ ఎగకట్టి పాలదుత్తను ఉట్టిమింద పెట్టి కన్ను కొరికింది రెయ్యమ్మ. కడుపే కాలిందో కన్నే కుట్టిందో ఎగిరి పాలదుత్తను తన్నింది జాబిల్లి. పాలదుత్త పగిలి మిన్నంతా వెన్నెలయి కురిసింది. (చెట్లు చెప్పిన కత)

గాలివానకు కొట్టుకొని పొయి ఊరికి ఎడంగా కుప్పగా పడిన ఎండుతాటాకుల మోపు మాదిరిగా ఆ బయల్లో నిలిచి ఉంటాది గోపాలక్రిష్ణ కొటాయి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

వక్కాకు గములు, పొవ్వాకు కలిసిన వక్కాకు గవులు, ముక్కుపొడి గబ్బు, చెమట కంపు, మన్ను మణము, పేడ వాడ, నాటుసారాయి గదురు, చుట్టపొగ పొలపము, మిడి అత్తరు గత్తు, ఎగరతా పైనొచ్చిపడే ఉచ్చబుడ్డల వేదు … మంది నుంచి ఇన్ని పొలుపులు వెలువడతాయని అప్పుడే తెలిసింది వాడికి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ). ప్రతీ వాసనకీ తెలుగులో ఒక పేరున్నదని ఎంతమందికి తెలుసంటారు?

అది పిల్లగోయి పాడినట్టు లేదు. గూట్లోని బెళవాయి కువకువమన్నట్టు ఉండాది. కట్టుకొచ్చిన పిక్కిలిగువ్వ పోతుగువ్వను పిలిచినట్టు ఉండాది. పచ్చముడ్డి కందిరీగ చెండుమల్లికి జోలపాడినట్టు ఉండాది. ముంతమావిడి పండుకోసం మునెక్క కూతురు ముదిగారంగా ఏడిచినట్టు ఉండాది. గుబ్బలమాను మీద జోడు జీరంకులు గీపెట్టినట్టు ఉండాది. (మెయిలు నొగులు)

జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వగూటిని నిమరతా కురిసింది. తలవాకిట దోగాడుతున్న పసిబుగ్గమీద చిటికేస్తా కురిసింది. దుమ్ముదుప్పటిని కప్పుకున్న చెట్టుచేమలను కడగతా కురిసింది. పగిలి నెర్రెలుబారిన బీళ్లను పదునెక్కిస్తా కురిసింది. చిట్టెదురు గుబురులో పిల్లంగోయి పాటయి కురిసింది. కోనేట్లో తామరాకుల మీద జారిపడతా కురిసింది. కనుమలో ఎగిరే చిలకముక్కును మెరిపిస్తా కురిసింది. ఉమ్మరిల్లిపోయిన మేనులు చెమ్మగిల్లేటట్టు కురిసింది. (బడకొడితి)

అప్పుడే అలికి ఎర్రమన్ను ఓరు తీసిన నట్టింట్లో ముగ్గుబుట్ట ఒలికినట్టుగా ఉండేది బూరగవ్వ. (ఒంటి నిట్టాడి గుడిసె)

పిలపిలమని గోలచేసే పులిచింతగువ్వల పసను ఆయమ్మిది. (ఒంటి నిట్టాడి గుడిసె)

చింతనిప్పుల మీది నివురు నెరుపు ఆ బిడ్డది. (ఒంటి నిట్టాడి గుడిసె)

తలాకిట కళ్లాపి చల్లి, ఎర్రమన్నుతో ఓరు తీసి, చుక్కల ముగ్గు వేసిందంటే ఆ వన్నెల వారసను చూడడానికి వానవిల్లే దిగివచ్చేది. (ఒంటి నిట్టాడి గుడిసె)

తలపుల గోళ్లతో గీరుకొని నెంజును పచ్చిపుండు చేసుకొనేది. గాయపడిన నెంజు నెత్తురయి ఆ అమ్మి కళ్లల్లో నుంచి కారిపోయేది. (చెట్లు చెప్పిన కత)

పువ్వరిసి మానుమింద పగిడిగువ్వ పకపక నగే పొద్దు, గురిగింజ పొదలలో గీజనగువ్వలు కువకువలాడే పొద్దు, … అంటూ పలురకాల పొద్దులు; పైర్లు వెన్నులిడిచే కాలం, చేన్లపైన ఏనుగులు దాడులు చేసేకాలం అంటూ పలురకాల కాలాలు. (ఆ అడివంచు పల్లె)

ఈ పుస్తకంలోని ఉపమానాలు ఈ రచయితకు ప్రత్యేకం. ఎన్ని ఉదహరించినా తక్కువే ననిపిస్తుంది. అయినా, మచ్చుకి కొన్ని -
మనపాటికి మనం ఎవర్నీ పట్టించుకోకుండా ఏవో తలపోతల్లో మునిగి బాట ఓర్న ఒదిగి నడిచిపోతుంటే, వెనకనించి వచ్చిన తులవగొడ్డు ఎత్తి కుదేసినట్టుగా, ఉన్నట్టుండి తగులుకొనింది నాకీ వెన్ను నెప్పి. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

పొదల వానకు పొటమరించి పొట్లపూల వానలో పగలబడి పూస్తాదే గోరింట …; మింద మంచు పడితే మోదుగ పూసినట్టు, పైన ఈడు పది రాగమ్మ కూడా పూసింది. (చెట్లు చెప్పిన కత)

కాసేపటికి వట్టిపొయిన పత్తిచేలో తిరుగులాడే ఒంటరితుమ్మెద రోదలాగా పెరిగి పెద్దదయింది ఆ పాట సద్దు (ఎందుండి వస్తీవి తుమ్మెదా)

జమ్ముగుబురులో జోపానంగా పెట్టుకున్న గుడ్లను జంగుపిల్లి ఎత్తుకొని పోతే, గుండెలు పగిలేటట్లు అరస్తాదే నీళ్లకోడి, అట్లుంది ఆమె ఏడుపు. (ఎందుండి వస్తీవి తుమ్మెదా)

నడిరెయ్యిలో ఒళ్లెరగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, … (ఒంటి నిట్టాడి గుడిసె)

ఆ మాటతో ఉచ్చెంటికను పెరికినట్టు అనిపించి ఒళ్లుమండి పైకి చూసినాను. (ఒంటి నిట్టాడి గుడిసె)

పెట్టకోడి తను పెట్టిన గుడ్లను రెక్కలకింద పొదుక్కొన్నట్లు అరవై ఇండ్లను అబ్బిళించుకొని ఉందాపల్లె (ఆ అడివంచు పల్లె)

… అని పిల్లలపంది మాదిరిగా ఎదురు తిరిగి అరిచింది. (ఒంటి నిట్టాడి గుడిసె)

గ్రామీణ సామెతలు కూడా కొల్లలుగానే కనిపిస్తాయి. మచ్చుకి కొన్ని -

అవ్వకు అణిగినట్టు, మనవడికి తీరినట్టు … (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

తెగించింది తెరువుకు పెద్ద, విడిచింది వాడకు పెద్ద; దున్నపోతు అన్నాక దున్ని చావాల, అన్నదమ్ములు అన్నాక వేరుపొయి చావాల; సారె వానలో నానితే సన్నికల్లు కూడా నొగులు పడతాది; గూట్లో పెడితే గూబ ఎత్తుకు పోతాది బీట్లో పెడితే పిల్లి ఎత్తుకొని పోతాది (చెట్లు చెప్పిన కత)

ఆంగ్ల పదాలు దాదాపు ఈ పుస్తకంలో కనిపించవనే చెప్పవచ్చు. అందువల్ల తెలుగు భాషాభిమానులకు ఈ పుస్తకం సంతోషాన్ని తప్పక కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ వాడుక సాధారణమయిన ఆంగ్ల పదాలకు కూడా బదులుగా అచ్చ తెలుగు పదాలే దర్శనమిస్తాయి. మచ్చుకి కొన్ని -

పేరేగి (కారు); పట్టేగి (ట్రైన్), తానేగి (ఆటో), తోలేరు (డ్రైవర్), కూటిల్లు (హోటల్), మందులిలు (హాస్పిటల్), అలపలుకి (సెల్ ఫోన్), చిరువాలు (సిగ్నల్), ఎనికెన (కంప్యూటర్), తూకువెళుకు (లాంతరు), మైనంతిత్తి (ప్లాస్టిక్ బాగ్)

ఒంటరిగా మిగిలిన చెల్లవ్వ (ఊడల్లేని మాను), కెంచక్క (మాదిగపుటక కాదు), సునందమ్మ (పాంచాలమ్మ పాట), బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె), చిన్నారవ్వ (మెయిలు నొగులు), పెండ్లి చేసుకోకుండా మిగిలిపోయిన మద్దూరవ్వ, లచ్చుమవ్వ (ఆ అడివంచు పల్లె) ఈ రచయితకు ఆప్తులు. వాళ్ల కడగండ్లకు తను మున్నీరై పాఠకులచేత కన్నీరు పెట్టిస్తాడు.

తెలుగు భాష ఇతనికి ప్రాణం. “వేల ఏండ్ల మాదిగల ఉనికికి ఆటపట్టు ఈతావు. ఈడ ఆటా మాటా పాటలు మటుకే కాదు, పైరు ఎన్నుపై వాలి కూసే నీలిగువ్వ కూత తెలుగు. కానల్లో కోనల్లో సందెపొద్దుల్లో యిగిడి. కొండగాలితో కలిసివొచ్చి పల్లెంతా పరుసుకొనే అడవిపూల తావి తెలుగు. మాపుసరి మాదిగా పల్లెంతా కమ్ముకొని మత్తెక్కించే నంజర కూర కమ్మదనం తెలుగు. పనిచేసే మాదిగపిల్ల నొసటి సిరుసెమట తెలుగు. బిడ్డకు సన్నుగుడిపే పొద్దయి, సేపిన రొమ్ములు రైకముడిని కోసేస్తుంటే, పనిచేయలేక పనినింకా లేవలేక ఆ బాలింత పడే యెతలు తెలుగు. నల్లటి మెయిలు నుంచి కారే తెల్లటి తోలి సినుకు తెలుగు. ఈడ పుటక తెలుగు, సావు తెలుగు, పుటక సావులకు నడానుండే బతుకంతా తెలుగే” అంటూ పల్లె ప్రజలకి తెలుగు నేర్పడానికి వెళ్లిన ఈ తెలుగు భాషాభిమాని ‘ఆ అడివంచు పల్లె’లో పులకించిపోతాడు.

“ఆ అడివంచు పల్లె” తో బాటు చాలా కథలని మాకొద్దు అన్న పత్రికలు ఈ కథలన్నిటినీ చదివి ఆనందంగా ఆస్వాదించిన తరువాత రచయిత వ్యక్తిత్వం పూర్తిగా అర్థమై, అరెరే అని నాలిక్కరుచుకునే అవకాశం మెండుగా వుంది. వీటిల్లో మూడు మాత్రమే “వలపత్రికల” (web magazines)లో, మూడు “భూమిక”లో ప్రచురింపబడ్డాయి. రెండుమూడింటిని వార్షిక సంకలనాల్లో చూసిన గుర్తు. అందరికీ అందుబాటులో లేని మిగిలిన కథలని సంకలనంగా ప్రచురించినందుకు “మల్లవరపు వెలువరింత”లకు నాలాంటి పాఠకులు తప్పక ధన్యవాదాలు చెబుతారు. వెయ్యి ప్రతులూ త్వరగా అమ్ముడయిపోయి రెండూ, మూడూ కాక పదుల సంఖ్యలో పునఃప్రచురణలతో ఈ సంకలనం వెలుగు చూడాలనీ, వాటిల్లో ఇంకొన్ని పదాలకు అర్థాల నివ్వాలనీ (ఉదా: సిడిమొయిలు) కోరుకుంటున్నాను. ఆ పునఃప్రచురణలో ప్రతి కథకీ చివర్లో కొన్నికొన్ని పదాలకి అర్థాల నివ్వడం కాకుండా అన్ని పదాల అర్థాల పట్టికని పుస్తకం చివర్లో అకారక్రమంలో ఇస్తే పాఠకులకు సౌలభ్యంగా ఉంటుంది.

***

పుస్తకం: కతల గంప (కథలు)
రచయిత: స. వెం. రమేశ్
ప్రతులకు: 1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180. ఫోను: +91 90101 53505

**** (*) ****