చాలా కాలమయింది మాట్లాడి అని గిరికి ఫోన్ చేస్తే “హలో” అన్న స్త్రీ గొంతు విని ఆశ్చర్యపోయాను. అది యామినిది కాదు. పెద్దయిన తరువాత వాళ్లమ్మాయి గొంతు ఫోన్లో ఎలా వుంటుందో విన్న గుర్తు లేదు. రాంగ్ నంబర్ అవడానికి వీల్లేదే అనుకుంటూ పది అంకెలూ చెప్పి, దీనికేనా నేను ఫోన్ చేసింది?” అనడిగాను. పాతికేళ్లుగా నోటికొచ్చిన నంబర్ అది. ఎలా మరచిపోతాను? “అవును” అని జవాబొచ్చింది. “గిరి…?” అని ఆగిపోయాను.
“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్” అని జవాబొచ్చింది.
ఆ వాక్యపు టర్థం పూర్తిగా మెదడులోకి చేరక, “ఈజ్ హి అవుటాఫ్ ది కంట్రీ?” అనడిగాను.
“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్ ఇన్ ది కంట్రీ ఆర్ అవుట్సైడ్ ది కంట్రీ” అన్నదా గొంతు.
ఆ జవాబుకు అదిరిపడ్డాను. ఆ స్త్రీ ఎవరో తెలియకపోయినా ఆవిడ మొదట చెప్పిన అయిదు ముక్కల సారం అర్థమై, “హౌ?” అన్నాను. “సర్జన్ చేతివాటం వల్ల –“ అని జవాబొచ్చింది. ఇంకే మనాలో తెలియక ఫోన్ పెట్టేశాను. ఆవిడే యామిని అయ్యుంటే ఇంకొన్ని వివరాలని తప్పకుండా కనుక్కుని వుండేవాణ్ణి.
“ఏమి టంత తొందరగా ఫోన్ పెట్టేశారు?” అడిగింది గాయత్రి.
“గిరి ఈజ్ నో లాంగర్ …” అని నోట్లోంచి మాట రాక ఆపేశాను.
గాయత్రి మొహం పాలిపోయింది. గొంతు పెగల్చుచుకుని,“అయ్యో పాపం! ఎలా?” అని అన్నది.
“సర్జన్ చేతివాటం వల్లట. ఆవిడెవరో మంట మీదున్నట్లుంది, సర్కాస్టిక్‌గా చెప్పింది. ఆపరేషన్ టేబుల్ మీద అయ్యుంటుంది.”
“పాపం! చాలా సరదా మనిషి. యామినికా ఇంకా యాభయ్యేళ్లు నిండలేదు,” అన్నది.
వాళ్లమ్మాయి సిరికి దాదాపు ఆరేళ్ల వయసప్పుడు వాళ్లుండే పశ్చిమ తీరాన్నుంచీ తూర్పు తీరాన వున్న మా ఇంటి కొచ్చారు. యామిని అప్పుడు వాడు సిరికి చెప్పిన బెడ్ టైం స్టోరీతో వాడిలోని ఒక పార్శ్వాన్ని గాయత్రికి పరిచయం చేసింది.
***
అనగనగా ఒక రాజకుమారుడు. అతను కాలేజీ కెడుతున్నప్పుడు ఒక రాజకుమారికి ఎదురుగా వెళ్లి – “ అని గిరి అంటూ వుండగానే సిరి అడ్డొచ్చి, “రాజకుమారి కూడా కాలేజీ కెళ్లేదా?” అని అడిగింది.
“అవును,” అని వాడనగానే, “ఇద్దరూ ఒకే కాలేజీ కెళ్లేవాళ్లా?” అని మళ్ళీ ప్రశ్న వేసింది.
“రాజకుమారులూ, రాజకుమార్తెలూ వేరువేరు కాలేజీల కెళ్లే వాళ్లు. … రాజకుమారుడు రాజకుమార్తెకు ఎదురెళ్లి, ‘నేను నీకు ఐ లవ్యూ అని చెబితే చెంపమీద కొడతావని నా స్నేహితులూ, ఐ లవ్యూ అని చెప్పకపోతే కొడతావని నేనూ పందెం వేసుకున్నాం. మాలో ఎవరిని గెలిపిస్తావ్?’ అనడిగాడు.” అని ఎఫెక్ట్ కోసం ఆగాడు.
“రాజకుమార్తె ఎవరిని గెలిపించింది?” సస్పెన్స్ తట్టుకోలేని సిరి అడ్డు తగిలింది.
“ఆ రాజకుమార్తె అతని కళ్లల్లోకి చూసి, ‘ఇంతకీ నువ్వు నాకు ఐ లవ్యూ అని చెప్పినట్టా కాదా?’ అనడిగింది.”
“దానికి ఆ రాజకుమారుడు, ‘ఇప్పటిదాకా నేనేం మాట్లాడానో నువ్వు విన్నావు గదా!’ అని జవాబిచ్చాడు. అప్పుడామె ఒక క్షణం ఆలోచించి, అతని చెంప పగులగొట్టి అక్కడి నుంచీ వెళ్ళిపోయింది.
(“ఇంతకీ ఎందుకు కొట్టినట్లు?” అనడిగింది గాయత్రి అర్థంకాక. “అతను మాట్లాడిన మొదటి వాక్యంలో ‘ఐ లవ్యూ’ అని రెండు సార్లున్నది! అంటే, చెప్పినందుకు!” అని యామిని జవాబిచ్చింది. కానీ, అసలతను ముందూ వెనకా ఏమీ లేకుండా స్పష్టంగా ఐ లవ్యూ అని చెప్పకపోవడం వల్ల, అని నా కనిపించింది.)
మరునాడు అతను మళ్లీ ఆమెకు ఎదురు వెళ్లి, ‘నీ చేతి వేళ్లకి నా చెంప అంటే ఇష్టమని నేనూ, కాదు, నా చెంపకి నీ వేళ్లంటే ఇష్టమని నా స్నేహితులూ పందెం కాసుకున్నాం. ఎవరిని గెలిపిస్తావ్?’ అని అడిగి, ‘దానికి నా వేళ్లూ, నీ చెంపా మళ్లీ సంప్రదించుకోవాలి అని చేతి వేళ్లతో అనిపిస్తా వేమో – నాకు కొంచెం క్లారిటీ కావాలి. నన్ను గెలిపించాలంటే ఈసారి నీ ఎడమ చేతికి పని చెప్పు!’ అని జోడించాడు.”
“ఆమె అతని మాట విన్నదా?” అడిగింది సిరి.
“శుభ్రంగా!”
“సిండరెల్లా గానీ, స్నోవైట్ గానీ రాజకుమారులని అలా కొట్టలేదే!” అడ్డు తగిలింది సిరి.
“వాళ్లు అమెరికన్లు. ఇండియన్లు అలాగే కొడతారు. మీ అమ్మ నడుగు కావాలంటే!”
“మీ డాడీ అలాగే మాట్లాడతారులే గానీ, సిండరెల్లా, స్నోవైట్లు కూడా ఎవరికో ఒకళ్లకి చెంపదెబ్బలు తగిలించే వుంటారు,” అన్నది యామిని.
“లేదు మామీ. యూ డోంట్ రిమెంబర్? సిండరెల్లాని స్టెప్ మదర్ కిచెన్లో నుంచీ బయటకు రానివ్వలేదు గదా. స్నోవైట్ కి కర్స్ వల్ల ఎవరిని కొట్టడానికీ ఆపర్చ్యూనిటీ దొరకలేదు.” అన్నది సిరి. “నువ్వూ, మీ నాన్నా ఇద్దరూ ఒకళ్లకొకరు సరిపోయారు!” అని యామిని విసుక్కుంది.
“ఆ రాజకుమార్తె ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె తల్లి –“
“రాణీగారు కదా!”
“ఆఁ. ఆవిడ, ఇప్పటిదాకా నువ్వు ఎవరో ఒకళ్లని చెంపమీద కొడుతూ నీ స్వయంవరాన్ని చాటుతున్నావని విన్నాను. దానిలో ఒకడు కావాలని నీ చేతి దెబ్బని రెండవసారి రుచి చూశాడని విని నా కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. మంచి సంబంధం. వదులుకోకు. అయితే, ఇక నుంచీ ఇలాంటి వాటిని ప్రైవేట్ గా చేసుకోవాలి అన్నది.”
“దెన్ దే గాట్ మారీడ్ అండ్ లివ్డ్ హాపిలీ ఎవరాఫ్టర్?”
“చిన్న ట్విస్ట్ వున్నదిక్కడ. వాళ్లిద్దరూ రెండు మూణ్ణెల్లు డేటింగ్ చేసిన తరువాత ఒక రోజున, పెళ్లి చేసుకుందాం అని అన్నది ఆ రాకుమారి. నువ్వు నన్ను కొట్ట నంటేనే అన్నాడు రాకుమారుడు. ఆ కండిషన్ కి ఒప్పుకునేది లేదు. నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే అదే కుదరంటే ఎలా? అని ఆమె వెళ్ళిపోయింది. దెన్ దే లివ్డ్ హాపిలీ ఎవరాఫ్టర్ – సపరేట్లీ!”
***
“కాలేజీలో గిరికి గర్ల్ ఫ్రెండ్స్ వుండేవాళ్లా?” యామిని నన్ను నిలదీసింది గిరి ఎదుట. వాళ్ల పెళ్లయిన తరువాత కలవడం మాకు అది మొదటిసారి. కుతూహలం సమంజసమే మరి!
“ఆ అనుభవం కావాలి అని వాడన్న మాట నిజమే!” కర్ర విరక్కుండా, పాము చావకుండా జవాబిచ్చా ననే అనుకున్నాను.
“ఏదీ, ప్రేమించిన అనుభవమా లేక దెబ్బ తిన్న అనుభవమా?” అన్నది గాయత్రి.
“ఆ ఒక్కటీ అడక్కు!” అన్నాడు గిరి.
“పోనీ, అది ఇండియాలోనా లేక అమెరికాకి వచ్చిన తరువాతా? అదయినా చెప్పండి,” అన్నది యామిని.
“అమెరికాలో ఆడపిల్లలు ఐ లవ్యూ అని చెప్పగానే చెంపమీద కొట్టరు – వాళ్లు ఇండియా నుంచీ వచ్చిన వాళ్లయినా గానీ!” యథార్థమే చెప్పాను.
“స్వానుభవంతో చెబుతున్నారు!” అన్నది గాయత్రి.
“రహస్యా లేమీ దాచవద్దు అని అనుకున్న వాణ్ణి గనుక ఆ అనుభవ మేదో చెప్పాను. ఇలా వ్యంగ్యానికి వాడుకుంటా వనుకుంటే చెప్పేవాణ్ణే కాదు,” అన్నాను.
“రాగా కదనకుతూహలం ఆలాపన మొదలయింది,” అన్నాడు గిరి. నాదీ, గాయత్రిదీ పేర్లలోని మొదటి అక్షరాలని కలిపి మమ్మల్ని రాగా గానూ లేక గారా గానూ పిలవడం గిరికి అలవాటు. మధువంతి పుట్టిన తరువాత మా ముగ్గురినీ కలిపి రాగా మధువంతీ అని ముద్దు చేస్తుంటాడు. “ఎప్పటి కయినా ఆ ఆలాప్ స్థాయి నుంచీ ఝాలా దాకా కాకపోయినా కనీసం జోర్ దాకా నయినా చేరుకుంటా రేమో నని ఆశపడుతూ ఎదురు చూస్తుంటే ఇప్పటి దాకా మిగిలింది నిరాశే!” అని జోడించాడు.
వాడు చెప్పిన కథలోని రాణీగారు తన కూతురు కిచ్చిన సూచనని మేం పాటించడం వల్ల గానీ, లేకపోతే ఫ్రీ పెర్ఫార్మెన్స్ చాలా తరచుగానే చాలా మందికి దొరికేది.
***
“ఇండియాలో వున్న రాజకుమారిని గిరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు?” అడిగింది గాయత్రి.
“పోయినవాళ్ల గూర్చి మంచే మాట్లాడమంటారు. ఈ క్షణాన నువ్వా ప్రశ్న వెయ్యడం ఆశ్చర్యకరంగా వున్నది,” అన్నాను కొంత చిరాకుతో.
“మీరు త్వరగా కంక్లూజన్స్ కి జంప్ చేస్తారు. నేనిప్పుడు చెడ్డగా ఏమన్నానని?” తను కోపంగా జవాబిచ్చింది.
ఆమె ప్రశ్నని గుర్తు తెచ్చుకుని చికాకు తగ్గించుకుని, “సారీ! అదే నాకూ అర్థంకాని విషయం. నేను అడిగినా వాడు చెప్పలేదు. తరువాత అడగడం మానేశాను,” జవాబిచ్చాను.
“నాకు నమ్మబుద్ది కావట్లేదు!” అన్నది గాయత్రి. ఏదో దాస్తున్నానే తన నమ్మకం.
నాకు ఆ లలిత విషయంలోనే కాదు వాడు అర్థం కానిది. రెజీనా, డెబ్బీ విషయాల్లో కూడా. లలిత ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి విషయం. నేను పిట్స్‌బర్గ్ లో ఎమ్మెస్ చేస్తున్నప్పుడు వాడితో మా ఊరు వచ్చింది రెజీనా. నేను న్యూజెర్సీలో వున్న వాణ్ణి విజిట్ చేసినప్పుడు వాడి పక్కన వున్నది డెబ్బీ. ఆ ట్రిప్ అంత తేలికగా మరచిపో గలిగేది కాదు.
వాడి అపార్ట్‌మెంట్ లో అద్దెకు తెచ్చి ట్రిపులెక్స్ సినిమా చూద్దామనుకున్నాం వాడి రూమ్మేట్లు ఇద్దరు దేశీలతో కలిసి. డెబ్బీ డజ్ డల్లాస్! ఆ కాలంలో చాలా పాపులర్ మూవీ అది. పక్క అపార్ట్‌మెంట్ లో వుండే ఇంకో ముగ్గురు దేశీలు జాయిన్ అయ్యారు. కళ్లని టీవీ స్క్రీన్ కి అప్పగిస్తూనే పక్కవాళ్లు వేసే జోకులకి పడీ పడీ నవ్వుతున్నాం. మధ్యలో వాడివైపు చూస్తే వాడి దృష్టి టీవీ మీద గాక నేలమీద కూర్చుని చూస్తున్న ఒకతని క్రాచ్ మీద వున్నది. ఆశ్చర్యపోయాను. తరువాత రెండు మూడుసార్లు వాడి వైపు చూసినప్పుడు దాదాపు అదే పరిస్థితి.
మరునాడు వాడితో “డెబ్బీ డజ్ డల్లాస్?” అనడిగాను కుడిచేతి వేళ్ళని మధ్యలో సందు వుండేలా గుప్పిట ముడిచి నోటి దగ్గరకు తెచ్చి పైకీ, క్రిందకీ ఆడిస్తూ.
“డెబ్బీకి బదులు ఏ దేవికో అయ్యుంటే ఆ ప్రశ్న వేసేవాడివా?” సూటిగా వచ్చిన ఆ ప్రశ్నకు ఖంగుతిన్నాను. “తెల్ల వాళ్లయితే తేలిగ్గా వచ్చి పక్కలో వాలిపోతా రనీ, అదే దేశీలయితే పెళ్లయేదాకా పాతివ్రత్యాన్ని పాటిస్తూ వుంటా రనీ – ఈ స్టీరియోటైప్ ఆలోచనల నుంచీ ఎప్పుడు బయటపడతావ్?” చికాగ్గా అడిగాడు. మా స్నేహం అండర్ గ్రాడ్యుయేట్ అప్పుడు మొదలయింది కాబట్టి ఊరుకు నుంటాడు గానీ లేకపోతే చెయ్యి చేసుకునే వాడేమో ననిపించింది.
ఆ ట్రిప్పులోనే వరల్డ్ ఫేమస్ ఫార్టీ సెకండ్ స్ట్రీట్ కి తీసుకు వెళ్లాడు అడల్ట్ షో చూపించమని అడిగితే. తిన్నగా అక్కడికి తీసుకెళ్లిన వాడితో మెచ్చుకోలుగా, “ఇక్కడికి రావడంలో మంచి అనుభవం వున్నట్లున్నదే!” అన్నాను. భుజాల నెగురవేశాడు.
ఇవన్నీ గాయత్రి కెందుకు చెబుతాను? “ఉండేవాళ్లు,” అన్నాను.
“మన పెళ్లయేటప్పటికి?” నా సమాధానంతో సరిపెట్టుకోకుండా రెట్టించింది.
“వాడి గర్ల్ ఫ్రెండ్స్ చిట్టా తయారుచెయ్యడానికి నాకు అవకాశమన్నా వుండాలా? వాడు న్యూ జెర్సీలో, నేను పిట్స్‌బర్గ్ లో మాస్టర్స్ చేసింది అని ఎన్నిసార్లు గుర్తు చెయ్యమంటావు? వాడేం చేస్తున్నాడో చెబితే గదా నాకు తెలిసేది!”
“అవే కాదు తమరు తెలుసుకోవాల్సింది. ఆడవాళ్లకి ఏ రంగులు నప్పుతాయో, స్కిన్ టోన్ బట్టీ ఎలాంటి మేకప్ వేసుకోవాలో కూడా. అయినా ఇవన్నీ గిరికి తెలిసినంతగా ఇంకే మగవాళ్లకీ తెలుసు ననుకోను. మిమ్మల్ని అనుకోని ఏం లాభం?” అన్నది నన్ను పూచికపుల్ల కింద తీసిపారేసి నిట్టూరుస్తూ.
గాయత్రి అమెరికా వచ్చినప్పుడు మొదట జే.ఎఫ్.కే. ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి క్రిస్మస్ టైంలో నాతో బాటు వాడూ వచ్చాడు గానీ, ఇండియా నుంచీ అప్పుడే రావడం వల్ల ఎముకలు కొరికే ఆ చలిలో తనతో సైట్ సీయింగ్ చేయించకుండా సమ్మర్ వచ్చిన తరువాతే గాయత్రిని న్యూ యార్క్ చూపించడానికి తీసుకెళ్లింది. చీరెల షాపింగ్ కి క్వీన్స్ కి తీసుకెళ్లినప్పుడు తనకి ఏ రంగులు నప్పుతాయో చెప్పడంతో ఆగకుండా వాటిని కొనిపించేదాకా వాడు వదలలేదు.
“నా కిప్పటికీ ఆశ్చర్యమేస్తుంది ఆ రోజు బ్యుటీషియన్ చేత చేయించిన నా మేకప్పుని తలుచుకుంటే!” అన్నది గాయత్రి. మేకప్పుని గూర్చిన ఆ రెవరీలో గాయత్రి వుంటే, దానికి సంబంధించే నాకు గుర్తున్న అంశాలు నా మెదడు నిక్షేపాల్లో నుంచీ బయట కొచ్చాయి.
ఆ కాలంలో విజయవాడ నుంచీ వచ్చిన కాలేజీ అమ్మాయిలు మేకప్పుకి అంతగా అలవాటుపడ్డ వాళ్లు కాదు. అందుకే న్యూ జెర్సీ నుంచీ బయలుదేరి పిట్స్‌బర్గ్ కి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు గాయత్రి ఎన్ని వందల సార్లు అద్దంలో చూసుకున్నదో గుర్తు లేదు.
అలా చూసుకోని క్షణాల్లో రెండు మూడు సార్లన్నది – “ఆ ఫోటోలో వున్నది గిరే నంటే నమ్మబుద్ది కాలేదు!” అని.
వాళ్ల యూనివర్సిటీలో వుండే ఒక ప్రొఫెసర్ తెలుగు సాంస్కృతిక సమితిలో వేసిన కన్యాశుల్కం నాటకంలో వీడి చేత మధురవాణి వేషం కట్టించారట. ఆ నాటకం గ్రూప్ ఫోటోలో వాడు చెబితే గానీ తెలియనంతగా గుర్తుపట్ట లేకుండా వున్నాడు.
“మేకప్ చేసిన వాళ్ళ ప్రతిభ అది. నేను చేసినదల్లా మీసం తీసెయ్యడమే!” అన్నాడు గిరి.
“చీరెవరు కట్టార్రా?” కుతూహలం తోసుకుని గొంతు లోంచి బయటకు రాగా అడిగాను.
“పాపం, ఆ రామప్ప పంతులు గారి భార్య తెగ ముచ్చట పడింది. జాకెట్టు, లంగాలని ఆవిడే కుట్టిచ్చిందిలే. అయితే, దానివల్ల ఆ దంపతుల మధ్య తగాదా లొస్తాయని భయపడి డైరెక్టర్ గారే కట్టారు,” గిరి జవాబిచ్చాడు.
“నేను ఆ నాటకం చూశా గదా! ఏం గ్లామ రనుకున్నారు? విడియో వున్నది గానీండి, నిజంగా చూడడం వేరు. ఆ కులుకూ, ఆ హొయలూ, అరె, గొంతు కూడా అచ్చం అమ్మాయిదిలా మార్చాడండీ!” అన్నాడు వాడి రూమ్మేట్.
ఆ నాటకం విడియో నేనూ, గాయత్రీ చూశాం. మైక్ సిస్టం బాగోలేక డైలాగ్స్ సరిగా వినిపించలేదు గానీ, వాడి హావభావాలూ, వయ్యారాలూ సహజ స్త్రీ అభినయానికి చాలా దగ్గరలోనే వున్నా యనిపించింది. దానితో బాటే, ఎప్పుడో మరచిపోయిన ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ యియర్లో రాగింగ్ అప్పుడు మా బాచ్ లో వీడు అమ్మాయిలలాగా నడవడం పెద్ద హిట్ అన్న సంగతి గూడా గుర్తొచ్చింది.
“ఈ మధ్య ఫేస్ బుక్ లో గిరి నుంచీ పోస్ట్ లు ఏవీ లేవా?” గాయత్రి అడిగింది.
“చూసినట్లు గుర్తు లేదు,” అని అక్కవుంట్లో లాగిన్ అయ్యాను. వాడి పోస్ట్ లు ఏవీ గత రెండేళ్లల్లో వాడి పేజీలో నాకు కనిపించలేదు గానీ, నాకోసమే నన్నట్లుగా మెమరీస్ అంటూ నా పేజీలో మూడేళ్ల క్రితం మేము గిరి కుటుంబంతో వున్న ఫోటోలు దర్శన మిచ్చాయి. మధు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మెడికల్ ప్రోగ్రాంలో చేరే ముందర మేం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి చివర్లో ఫ్రీమాంట్ లో వాళ్లింటి కెళ్లినప్పటివి అవి.
“యాగీ!” అన్నాను గిరి వాళ్లింట్లో అడుగు పెట్టే ముందర తలుపు తీసిన వాళ్ళిద్దరినీ చూస్తూ రెండు చేతులూ చాచి. వాడు మమ్మల్ని “రాగా” అన్నప్పుడు వాళ్లు మరి “యాగీ” గాక మరే మవుతారు?
“జాతకా లెట్లా కుదిరె య్యన్నారో గానీ బతుకే యాగీ అయిపోయింది!” అన్నదట యామిని గాయత్రితో ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు.
“మేమేదో సుఖంగా వున్నామని అనుకోకు! నా నోట్లోంచి ఏమొచ్చినా ఆయనకు తప్పే. నిమిష నిమిషానికీ కయ్యానికి కాలు దువ్వుతుంటాడు,” అని గాయత్రి బదులిచ్చి వుంటుందని నా నమ్మకం. నాతోనే అంటుంది కాబట్టి నా వెనకగా ఏమీ అనక్కర్లేదు మరి! మాకు అయిదు కార్లు న్నాయంటే మాకు ఆరున్నాయని పోటీ పడేవాళ్ళు ఒక రక మయితే, నేను సైకిల్తో సరిపుచ్చుకో వలసిందే అని ఒకళ్లు అంటే, నీకు అదన్నా వున్నది, నేను రెండు కాళ్లతో సరిపుచ్చుకో వలసిందే అని అనే వాళ్లు ఇంకో రకం మరి!
“నువ్వు డాక్టరువి. గిరి ఐటీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. మీ అమ్మాయి శ్టాన్‌ఫర్డ్ లో చదువుతోంది. బ్రహ్మాండ మయిన లొకేషన్లో విశాలమయిన ఇల్లు. మీ యింటి కిటికీలోంచి చూస్తే ఎదురుగా కొండలు కనిపిస్తాయి. మీదీ లైఫంటే!” అన్నదట గాయత్రి.
“ప్చ్!” అన్నదట యామిని. “ఏదో చెప్పబోయి ఆపేసింది,” అన్నది గాయత్రి తరువాత నాతో.
వాళ్లిద్దరూ వంటింట్లో మాట్లాడుతూ వుండగా లివింగ్ రూంలో గ్రీక్ గాడెస్ వీనస్, మైకెలాంజెలో రూపొందించిన డేవిడ్ శిల్పాల నమూనాలని చూసి, “మీ ఇద్దరికీ చెరొకటా?” అన్నాను కవ్వింపుగా. వీనస్ విగ్రహం పారిస్ లూవర్ లోని శిల్పానికి నమూనా అయితే, డేవిడ్ విగ్రహం ఇటలీలోని ఫ్లారెన్స్ మ్యూజియంలో శిల్పానికి నమూనా. వీనస్ విగ్రహం నడుము పైన ఏ ఆచ్ఛాదన లేకుండానూ, డేవిడ్ విగ్రహం పూర్తిగా నగ్నంగానూ వుంటుంది. రెండూ కూడా స్త్రీ, పురుష ఆకృతులకి అద్భుత మయిన నమూనాలు.
“రెండూ నాకే!” అన్నాడు గిరి.
“నీకు కళల మీద ఆసక్తి లేదేమిటి?” యామినిని అడిగాను డిన్నర్ టైంలో – ఇంట్లో డెకరేషన్ అంతా గిరి ప్రతిభే నని యామిని అన్నప్పుడు.
“అదేమిటి అలా అంటారు? చెయ్యాలని వుండే వుంటుంది. హాస్పిటల్ నుంచీ వచ్చిన తరువాత ఇంకా ఓపిక ఎక్కడుంటుంది?” అన్నది గాయత్రి యామినిని వెనకేసుకు వస్తూ.
“నేనేదో చేస్తాను. గిరికి అది నచ్చదు. గాయత్రి అన్నట్లు తనకున్నంత తీరిక నాకేదీ?” అన్నది యామిని. ఆ మాటల్లో చురుకు నాకే గాక గిరికి కూడా తగిలిం దనే నా నమ్మకం. గిరిది రెగ్యులర్ అవర్స్ ఉద్యోగం మరి.
“కావాలని పని కల్పించుకుంటే తీరి కెక్కడ దొరుకుతుంది” అన్నాడు గిరి.
“పనిలో నిమగ్న మవుతే ప్రశాంతత దొరుకుతుంది,” అన్నది యామిని గిరిని సూటిగా చూస్తూ.
“ఇంజనీ ర్లవుతే ఆఫీసులో కంప్యూటర్ల మీద మోనోపోలీ ఆడుకున్నా రోజంతా వెబ్ సర్ఫింగ్ చేసినా అడిగే వాడుండడు. సర్జన్ల పనంటే మాటలా? కాన్సంట్రేషన్ లేకపోతే పేషెంట్ హరీ మంటాడు,” అన్నది గాయత్రి. అయితే, యామిని స్పెషాల్టీ గైనకాలజీ అన్న సంగతి మరిచిపోయి వుంటుంది.
“ఇంటికి వచ్చిన వాళ్లంతా ఒక్క డెకరేషన్ మాత్రమే గాక వంటనీ, బయట ఫార్మల్ ఫంక్షన్ లల్లో కలిసిన వాళ్లు నా చీరెల రంగులనీ, జాకెట్ డిజైన్లనీ మెచ్చుకుంటూ వుంటే అంతా గిరి ప్రతిభే నని చెప్పడానికి నాకు మంట పుడుతుంటుంది. దాదాపు పదేళ్లనించీ ఆ బాధ లేదులే. అడగడం మానేశారు అందరికీ జవాబు తెలుసు గనుక. ఈ సంసారంలో నేను మొగుణ్ణీ, గిరి పెళ్ళామూ అయితే ఇద్దరమూ సుఖంగా వుండేవాళ్ళం,” అన్నది యామిని. ఆమె కళ్లవైపు చూడడానికి భయంవేసి తల దించుకుని పళ్ళెంలోకి చూస్తూ వుండిపోయాను.
డిన్నర్ అయిన తరువాత మళ్లీ నేనూ, గిరీ మాత్రం లివింగ్ రూంలో ఆఫ్టర్ డిన్నర్ డ్రింక్ తీసుకుంటు న్నప్పుడు డేవిడ్ శిల్పం మీద దృష్టిని నిలిపి గిరి అన్నాడు – “ఎవరో అన్నారు – ది మోస్ట్ బ్యూటిపుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ది మేల్ హ్యూమన్ బాడీ అని!”
“మోస్ట్ ఆఫ్ ది మేల్స్ విల్ డిసగ్రీ విత్ యు. ఆ వీనస్ బాడీ చూడు ఎంత అందంగా ఉన్నదో!” అన్నాను.
“ఐ సా ఎ మోస్ట్ బ్యూటిపుల్ థింగ్ రీసెంట్లీ,” అన్నాడు గిరి.
“ఎక్కడ?”
“రెస్ట్ రూంలో యూరినల్ దగ్గర. అక్కడ నిలబడి పక్కకు చూసినప్పుడు,” అన్నాడు మాటరాఫ్ ఫాక్ట్ గా. అదిరిపడ్డాను. వాడి అపార్ట్ మెంట్ లో ట్రిపులెక్స్ సినిమా చూస్తున్నప్పుడు వాడి దృష్టి ఒకతని క్రాచ్ మీద వుండడం గుర్తొచ్చింది. “ఎందుకంత షాకవయ్యావు? అందాన్ని మెచ్చుకోవడంలో తప్పేంటి? తెల్లగా, నున్నగా, పొడుగ్గా, ఎంత మెజస్టిక్ గా ఉన్నదో తెలుసా? దాని ముందు ఈ డేవిడ్ ఎందుకూ కొరగాడు.” అన్నాడు వాడే.
“మైకెలాంజెలోకి అంతకన్నా గొప్ప మోడల్ దొరికి వుండడు,” తేరుకుని జవా బిచ్చాను.
“కానీ, నేను చూసిన ఆ అందానికి తగిలించి వున్న శరీరాన్ని చూస్తే రోత పుట్టింది. ఈ శిల్పానికి ఆ అందమే తగినది,” అన్నాడు ఆ డేవిడ్ శిల్పాన్నే చూస్తూ.
ఈ గిరి నాకు తెలియ దిప్పటి వరకూ. ఇందాక యామినీ, ఇప్పుడు గిరీ - ఈ సంభాషణలని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకుని వుంటారని అనుకోను.
“ఇంట్లోకి అడుగు పెడుతూనే మమ్మల్ని యాగీ అన్నావు. మరి మీ సంగతేమిటి? రాగా మోహనమా, శివరంజనా, లేక కదనకుతూహలమా?” అన్నాడు మాట మార్చి.
“మోహనం కాలం మధువంతి ఎలిమెంటరీ స్కూల్ పూర్తయేవరకు. మిడిల్ స్కూల్లో దాని చదువును గూర్చి మొదలయిన కదనకుతూహలం అది కాలేజీలో చేరిన తరువాత కూడా కంటిన్యూ అయింది. ఇప్పుడు మధు పెళ్లి గూర్చిన ఆందోళిక తనకి, పాలించు కామాక్షీ అంటూ మధ్యమావతి నాకూను. మీ యాగీ ఏ రాగంలో?”
“అహీర్ భైరవ్, మాయామాళవగౌళ, రాగా భీభత్స్!”
“ఆ చివరిది ఎప్పుడూ వినలేదే?”
“నైట్ ఆన్ ఎ బాల్డ్ మౌంటెన్ దొరుకుతుంది యూ ట్యూబ్ లో. విను. తెలుస్తుంది.” జవాబిచ్చాడు.
వాళ్లింట్లో గడిపిన ఆ రెండు రోజులూ భీభత్సానికి నిర్వచన మనిపించింది నాకు. అందుకే, తిరిగి వచ్చి, “చేరాం” అని టెక్స్ట్ పంపిన తరువాత వాణ్ణి కాంటాక్ట్ చెయ్యలేదు. వాడి నుంచీ కూడా నిశ్శబ్దం వుండడం నాకు ఆశ్చర్య మనిపించలేదు.
“మీరు రెండు వారాల్లో ఆఫీసు పనిమీద శాన్ ఫ్రాన్సిస్కో వెడుతున్నట్టున్నారు గదా, నన్ను కూడా తీసుకు వెళ్ళండి. యామినిని పరామర్శించి వద్దాం,” అన్నది గాయత్రి. ”రావచ్చా?” అని యామినికి టెక్స్ట్ పెట్టి, “ఓకే” అనిపించుకుంది కూడా.
***
“యామిని రావడానికి కొద్దిగా ఆలస్య మవుతుందని చెప్పింది. లోపలకు రండి,” అన్నది తలుపు తీసినావిడ. అందంగా, ఆ చీరెలో హుందాగా వున్నది. తేరిపార చూడడం సభ్యత కాదని కళ్లని బలవంతంగా పక్కకు తిప్పాను. “మీరు బాగా కావలసిన వాళ్లని చెప్పింది. రండి,” అంటూ ఫామిలీ రూంలోకి దారి తీసింది. ఆవిడ వెనకే మేమూ వెళ్లాం. చుట్టూ చూశాను. గోడల మీదా, కాఫీ టేబుల్ మీదా అంతకు ముందు వున్న ఫోటోలకి ఈవిడ చీరె కట్టుతో గిరి కూతురు సిరితో వున్న ఫోటో జతచేరింది.
“యామినిని నాతో కలిసి ఫోటో తీసుకొమ్మన మంటే వినదు. కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను,” అని ఆవిడ వంటింట్లోకి దారి తీస్తుంటే, గాయత్రి ఆమె వెనుకే వెళ్ళింది. నేను కాఫీ టేబుల్ మీది పుస్తకా న్నొకదాన్ని చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చున్నాను.
“ఎన్నాళ్ళయింది ఇక్కడికి వచ్చి?” అని గాయత్రి అడగడం స్పష్టంగానే వినిపించింది. దాని వెనకే, “రెండేళ్లు దాటింది,” అన్న ఆవిడ జవాబు కూడా.
“యామిని మీకు నా పేరు చెప్పే వుంటుంది గానీ, మీ పేరేంటి?”
“గిరిజ.”
“మీ వారేం చేస్తుంటారు?”
“ఐ యాం నాట్ మారీడ్.”
“ఇంత అందంగా వున్నారు. మిమ్మల్నెవరూ ఎగరేసుకు పోలేదంటే ఆశ్చర్యంగా వున్నది.”
“స్టిల్ లుకింగ్.”
ఆమె తెచ్చి యిచ్చిన కాఫీ తాగుతున్నప్పుడు వచ్చింది యామిని. బాగా చిక్కిపోయింది. గాయత్రి వయసు దయినా గానీ, హఠాత్తుగా పదేళ్లు మీద పడ్డట్లు కనిపించింది.
“నీ ఆప్త మిత్రుణ్ణి కావలించుకున్నావా?” గిరిజని అనడిగింది వస్తూనే.
“భయపడతాడని ఆ పని చెయ్యలేదు. పైగా, అలా చేస్తే గాయత్రి ఊరుకుంటుం దేమిటి? మీద పడి రక్కుతుంది,” అన్నది గిరిజ.
“పోనీ, గాయత్రికి హగ్ యిచ్చి వుండాల్సింది,” అన్నది యామిని.
“నువ్వు రాకముందు ఆ పని చేస్తే, నువ్వు న్యూస్ బ్రేక్ చేసిన తరువాత తనూ, వాడూ కూడా ఏ మనుకుంటారో నని ఆ పని చెయ్యలేదు,” గిరిజ జవాబిచ్చింది.
నేనూ, గాయత్రీ సంభ్రమంతో ఒకళ్ల మొహాలు ఒకళ్లం చూసుకుని ప్రశ్నార్థక మొహాలతో గిరిజ వైపు తిరిగాం.
“మీట్ గిరిజ. యు న్యూ హర్ యాజ్ గిరి బిఫోర్,” అన్నది యామిని.
“న్యూ జెర్సీలో చూసిన మధురవాణి వేషంలో లాగానే వున్నది. ఇంట్లోకి రాగానే అనుకున్నాను ఎక్కడో చూసినట్లున్నదే అని!” అన్నది గాయత్రి.
“అప్పటికీ ఇప్పటికీ ముఫ్ఫయ్యేళ్ల తేడా మరి!” అన్నది గిరిజ.
నేను గిరిజని కళ్లార్పకుండా చూశాను. అలా చూడడం సభ్యత అవునో కాదో ఆలోచించే పరిస్థితిలో లేను.
“అంతలా చూడకు. సిగ్గేస్తోంది. వచ్చి నీ ఒళ్లో వాలిపోదా మని నా కనిపిస్తే గాయత్రికి కష్టం,” అన్నది గిరిజ. నా ఒళ్లు గగుర్పాటు చెందింది.
ముందు తేరుకున్నది గాయత్రి. “మీరు తొందరగా కంక్లూజన్ కి వచ్చేసి అందరినీ హడలుగొడతారు,” నాతో అని, గిరిజ వైపు తిరిగి, ”మీరు ఆయనతో ఏం చెప్పారో గానీ, మీరు” అని ఆగి, చేత్తో గాలిలో పైకెళ్లి పోయినట్లు చూపిస్తూ, “అనుకున్నా రీయన,” అన్నది.
“గిరి?” అని వాడడిగితే, “హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్,” అన్నాను అన్నది గిరిజ పకపకా నవ్వుతూ.
జవాబుగా, సోఫాలో ప్రక్కన కూర్చుని నిశ్శబ్దంగా తన ఒళ్లో తల పెట్టి పడుకున్న యామినిని చూసి నివ్వెరపోయింది గాయత్రి.
“టెక్నికల్ గా, గిరి ఈజ్ నాట్ డెడ్. ది పర్సన్ యు ఆర్ లుకింగ్ యట్ డజ్ నాట్ హావ్ సంథింగ్ హి వజ్ బార్న్ విత్. దట్సాల్,” అన్నది గిరిజ.
“నో. గిరి ఈజ్ డెడ్,” అన్నది యామిని విసురుగా లేచి కూర్చొంటూ.
గిరిజ నవ్వింది. “రమణ మహర్షి, ‘నేను’ అంటే ఎవరు? ఈ చెయ్యి నేనా, ఈ కాలు నేనా అంటూ దేహంలో అన్ని భాగాల గూర్చీ అలా అడిగారట. నువ్విప్పుడు జవాబు చెప్పావు. మా తల్లిదండ్రులు నామకరణం చేసింది ఇప్పుడు నా శరీరంలో లేని భాగాని కని!” అన్నది గిరిజ.
“డోంట్ బి రిడిక్యులస్!” అన్నది యామిని.
“ఇది నిన్ను పెళ్లాడినప్పుడు వున్న తలే. కనిపించే ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులే గాక శరీరం లోపల దాక్కున్న ఊపిరి తిత్తులు, గుండెకాయ, కిడ్నీ, అన్నీ అవే. ఇప్పుడు నా శరీరంలో లేని భాగాన్ని ప్రపంచంలోని అనేకమందితో బాటు నువుకూడా ఎప్పుడూ కళ్లతో చూడలేదు. దిసీజ్ ది ట్రూత్.” అన్నది గిరిజ.
“ఐ సా మెనీ అదర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. … కానీ అది అప్పుడప్పుడూ అయినా నా శరీరానికి ప్రకృతి సహజంగా అమర్చే సుఖాన్నిచ్చింది,” అన్నది యామిని.
“అది నిజం. ఇప్పుడు నేను కూడా ఆ సుఖం కోసమే తాపత్రయపడుతున్నాను,” అన్నది గిరిజ . గాయత్రి సోఫాలో నాకు దగ్గరగా జరిగి నా చేతిని గట్టిగా పట్టుకుంది.
“ముఫ్ఫయ్యేళ్లుగా నువ్వు చూసిన మొహమే యిది. ఆచ్ఛాదన లేని నా ఛాతీని మాత్రం నువ్వు ఎప్పుడూ చూడలేదు. పెళ్లిలో కూడా చొక్కా వేసుకునే కూర్చొన్నాను. నా చిన్నప్పుడే మా అమ్మ అనేది – చొక్కా లేకుండా ఎప్పుడూ కనపడవు. ఆడపిల్లలా ఆ సిగ్గేమిట్రా? అని. రియలైజేషన్ త్వరగానే కలిగినా గానీ, ఇట్ టుక్ మి టైం టు మేక్ ది డెసిషన్,” అన్నది గిరిజ నాతో.
“ది ఛేంజ్ మస్ట్ హావ్ బీన్ డిఫికల్ట్” అన్నాను నోరు పెగల్చుకుని.
“నాట్ యాజ్ హార్డ్ యాజ్ లివింగ్ విత్ ది రాంగ్ అటాచ్ మెంట్ ఆల్ దీజ్ యియర్స్,” అన్నాడు – అన్నది గిరిజ.
“ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎక్స్‌పెన్సివ్ టూ!” అన్నాను.
“యస్. హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యదు. యామిని సేవింగ్స్ లేకపోతే ఇది సాధ్యమయేది కాదు. ఐ విల్ ఆల్వేస్ బి థాంక్ ఫుల్ ఫర్ హర్ కంపానియన్షిప్ అండ్ ఫైనాన్సింగ్,” అన్నది గిరిజ.
“ఈ మగాళ్ల కెప్పుడూ డబ్బుల గోలే. ఫీలింగ్స్ గూర్చిన ఆలోచనే వుండదు,” విసుక్కుంది గాయత్రి.
“అందుకే ఏడుస్తుంటాను. నేను డాక్టర్ని కాకపోతే, ఆ సంపాదనే లేకపోయుంటే, ఇలా జరగడానికి అవకాశమే వుండేది కాదని,” అన్నది కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.
“భగవంతుడు అలా రాసిపెట్టాడు. ఏం చేస్తాం?” అంటూ గాయత్రి భుజం చుట్టూ చేయి వేసి యామినిని దగ్గరకు లాక్కుంది.
“సిరి ఎలా తీసుకుంది?” అడిగాను.
“కాలిఫోర్నియాలో వుండడం మంచి దయింది. ఎల్జీబీటీ గూర్చిన అవేర్‌నెస్ హైస్కూల్లోనే కలుగజేస్తారు కాబట్టి,” అన్నది గిరిజ.
“నిన్ను సిరి ఏమని పిలుస్తుంది?” గాయత్రి సందేహిస్తూనే అడిగింది.
“డాడ్ అనే. బయోలాజికల్ గా అంతే కదా?” ఫాక్చ్యువల్ గా చెప్పింది గిరిజ.
“అందుకే, మీ అమ్మ కూడా ఏడుస్తోంది – నువ్వు నాకు కొడుకు గానే పుట్టావు, అందుకే నువ్వు నాకెప్పుడూ కొడుకువే అని! నీకింత అన్యాయం జరుగుతుందని అనుకోలే దమ్మా అంటూ ఆవిడ ఒకటే ఏడుపు. మా ఇద్దరిలో ఎవరం ఎక్కువ ఏడిచా మన్నది ఆ దేవుడే చెప్పాలి,” అన్నది యామిని.
“ఎంత మంచి అత్తగారో చూడు! తనని మళ్లీ పెళ్లి చేసుకొమ్మన్నది. నాక్కూడా ఒక సంబంధం చూడమన్నాను,” అన్నది గిరిజ.
“డూ యు ఎలోవ్ హర్ టు బ్రింగ్ డేట్స్ ఇన్‌టూ ది హవుస్?” యామినిని అడిగాను.
“సిరికి చెప్పినదే చెప్పాను – నో ఓవర్నైట్ స్టే ఇన్ ది హవుస్, అండ్, దట్ టూ ఈజ్ లిమిటెడ్ టు ది లివింగ్ రూం ఓన్లీ,” అన్నది యామిని.
“మేం మధుకి చెప్పిందీ అదే!” అన్నది గాయత్రి.
“హౌ ఈజ్ లైఫ్?” గిరిజని అడిగాను.
“వర్క్ లైఫ్ ఈజ్ ఫైన్. వెరీ సపోర్టివ్. పైగా, ఒబామా వున్నప్పుడు చాలా ఫెడరల్ రూల్స్ వచ్చెయ్ నాలాంటి వాళ్లని ఎలా సక్రమంగా చూసుకోవాలో చెబుతూ. సుప్రీం కోర్ట్ కూడా నాలాంటి వాళ్లకీ మీలాంటి వాళ్లకీ వుండే హక్కుల్లో ఎటువంటి తేడాలు లేవన్నది. సోషల్ లైఫే, అది కూడా తెలుగువాళ్ల మధ్యలో మాత్రమే ఇబ్బంది,” అన్నది గిరిజ.
“అంతకు ముందు ఇక్కడ తెలుగు అసోసియేషన్స్ లో నాటకాల్లో రెగ్యులర్ గా స్త్రీ పాత్ర ధరించేవాడు గిరి. గత పదేళ్లలో కొంచెం తగ్గింది నా పోరు వల్ల అని కాదు గానీ, మధుకి ఊహ తెలిసిన తరువాత బాగుండదు అన్న నా ఆలోచనలో ఇంగితం కొంచెమయినా కనిపించడం వల్ల కావచ్చు. ఆ వేషాల్లో అందరి మెప్పుదలనీ పొందాడు – అందం గూర్చీ, నటన గూర్చీ కూడా. వాళ్లల్లో ఒకళ్లు గిరిజని ఒక గ్రోసరీ షాపులో చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చి, ‘ఎక్కడ వేస్తున్నారు నాటకం? ఈసారి ముందే మేకప్ వేసుకుని వేడుతున్నట్టున్నారే!’ అనడిగి, జవాబుని విని ఖంగుతిన్నారు. వాళ్ల కిప్పుడు మాతో ఎలా మెలగాలో తెలియదు. నేను కనిపించినప్పుడు సానుభూతి చూపిస్తా మంటారు. కొంతమంది తప్పు నాలో వుండడం వల్లనే ఇలా అయింది అని బాహాటంగానే అన్నారు. ఇటు తప్పించుకుని తిరగలేము, అటు తప్పించుకోకుండా మసలలేము,” అన్నది యామిని.
“ఇరవయ్యేళ్లుగా తెలిసిన ఇండియన్ కుటుంబాల్లోని మగవాళ్లతో ఇప్పుడు మా ఇద్దరికీ చిక్కే,” నన్నది గిరిజ.
“తనని గూర్చిన కుతూహలంతోనూ, నా గూర్చిన ఆశతోనూ!” అన్నది యామిని.
“నాది దురాశ కావచ్చునని ఒప్పుకుంటాను గానీ, మా వేర్వేరు లవ్ లైఫులు ఎలా వున్నా గానీ, తను నా స్నేహితురాలిగా వుండాలన్నది నా బలమైన కోరిక,” అన్నది గిరిజ.
“తన డెలివరీ నా చేతుల మీదుగా జరగాలట!” అని కళ్లు తుడుచుకుంటూ అక్కణ్ణించీ లేచి వెళ్లిపోయింది యామిని.
***
“అది సాధ్యమా?” గాయత్రి నన్నడిగింది మరునాడు కార్లో కూర్చొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరగానే. అంతకు ముందు రాత్రి వాళ్లింట్లో మా బెడ్రూంలో మేమిద్దరం మాత్రమే వున్నా గానీ, ఆ యింట్లో ఆ ప్రశ్న అడగడం అసభ్యత అని తనకి అనిపించడం వల్ల అయివుంటుంది ఇప్పటిదాకా ఆగింది.
“మగవాడికి కానుపు అని ఎక్కడో తెలుగు పేపర్లో చదివిన గుర్తు. ఇలాంటి విషయాలు ఎందుకో ఆ పేపర్లల్లోనే ఎక్కువగా దర్శన మిస్తుంటాయి. యుటిరస్ ని అమర్చి హార్మోన్ల ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది సాధ్యంట,” నాకు తెలిసినది చెప్పాను.
“అచ్చం ఆడదాన్లాగే వున్నాడు కదలికలతో, చేష్టలతో కలిపి. గొంతు సంగతి సరేసరి,” అన్నది గాయత్రి.
“హార్మోన్ల ట్రీట్మెంట్ తో బాటు ఆడవాళ్ల లాగా కదలికలకీ, చేష్టలకీ ట్రైనింగ్ నిచ్చారట. వాడికి వాటితో అవసరం లేదనుకో. మేం కాలేజీలో వుండేటప్పుడు అక్కడి కొందరు అమ్మాయిల నడకలనీ, చేష్టలనీ అనుకరించి చూపి మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేవాడు. పాతికేళ్ల నాటి మధురవాణి విడియో నువ్వు చూడనే చూశావు. … మెడిసిన్లో అడ్వాన్స్‌మెంట్స్ వల్లనే ఇదంతా సాధ్యం. ఇప్పటిదాకా లోపలివి గానీ, బయటివి గానీ మెడ క్రింది అవయవాలని మాత్రమే మార్చారు గానీ, వచ్చే ఏడాది ఒక మనిషి తలని వేరొక మొండానికే ఏకంగా అమరుస్తారట! ఇంక మానవులకి సాధ్యం కానిదే ముంటుంది?”
“మనం మూడేళ్ల క్రితం వచ్చినప్పుడే యామిని చెప్పింది గిరి క్రాస్ డ్రస్సర్ అని. అర్ధంకాక అంటే ఏమిటని అడిగాను. గిరికి ఆడవాళ్లలాగా వేషం వేసుకోవాలనీ, అలంకరించుకోవాలనీ అమితమయిన కోరికట. కూతురి వయసు పెరుగుతున్నకొద్దీ ఆ వెర్రి పోకడలని దాన్నుంచీ దాచడానికి కష్టపడవలసి వచ్చేదట. వారంలో ఒకరోజన్నా అలా వుండకపోతే గిరికి పిచ్చెక్కిన ట్లుండేదట. అందుకని యామినే మధుని వీకెండ్స్ లో యాక్టివిటీలకి తనే తీసుకెళ్లి గిరికి ఇంట్లో వుండడానికి అవకాశ మిచ్చేదట. మొదట్లో వర్క్ వల్ల అని యామినితో అబద్ధం చెప్పాట్ట గానీ, అది ఎక్కువకాలం సాగకపోవడం వల్ల బయటపడాల్సి వచ్చిందట్లే. మగవాళ్ల హార్మోన్లేవో వుంటాయటగా -”
“టెస్టాస్టిరోన్“
“ఆ. అవే. సెక్స్‌లో ఆసక్తి పూర్తిగా కరువవుతోందని వాటిని పుచ్చుకొమ్మందిట కూడా. డాక్టర్ అవడం వల్ల అనుమాన మొచ్చిందట గానీ, అది నిజం కాకూడదని ఎన్నో దేవుళ్లకి మొక్కుకున్నదిట కూడా!” అన్నది గాయత్రి కళ్లు తుడుచుకుంటూ.
“నానుంచీ ఎంత దాచివుంచావు? ‘ఆడవాళ్ల నోట్లో నువ్వుగింజ నానదు’ అన్న నానుడిలో నిజం ఏమాత్రం లేదని నిరూపించావు!” అన్నాను ఆశ్చర్యపోయి.
“గిరి ప్రేమ వ్యవహారాల గూర్చి మీరు నాకు చెప్పారేమిటి?” అన్నది గాయత్రి ఎత్తిపొడుస్తూ.
“ఇంకా కాలేజీ విషయాల గూర్చేనా నువ్వు మాట్లాడుతోంది? అప్పటికీ, ఇప్పటికీ కూడా నాది అదే సమాధానం. నాకు తెలిస్తేనే కదా నేనే మయినా చెప్పేది? కానీ, ఆలోచిస్తే ఇప్పుడనిపిస్తోంది – ఇండియాలో లలిత ప్రేమ వ్యవహారంలో తన గూర్చిన అనుమానంతోనే వాడు దాన్ని బ్రేక్ చేసుంటాడు.”
“మరి అమెరికాలో డెబ్బీ, రెజీనాల విషయంలో?”
“తేలిగ్గా సంభాషణ జరపగలగడం వల్ల వాళ్లు ఫ్రెండ్స్ అయివుండవచ్చు. తరువాత రొమాన్స్ విషయాని కొచ్చేసరికి కొంచెం ముందు వెనుకలుగా వాళ్లే దూరం జరిగారో, లేక వాడే దూరంగా జరిగాడో?” అన్నాను. న్యూయార్క్ లో వాడు నన్ను తిన్నగా ఫార్టీ సెకండ్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళడం, అది అప్పటికే ఎన్నోసార్లు వాడు అక్కడికు వెళ్లివుండడంవల్ల అని నేను అనుకోవడం గుర్తొచ్చింది. అక్కడ తనమీద అపనమ్మకాన్ని తొలగించుకుని వాళ్లకి దగ్గరయ్యుండాలని అనుకున్నాను. వాళ్ల సాంగత్యంలో అనుభవం వల్లనే లలితతో చెయ్యని సాహసం యామినితో చేశా డనిపించింది. పైగా, అది తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం, చేసిన పెళ్లి.
“ఇట్లాంటివాళ్లు అసలు పెళ్లి చేసుకోకూడదు!” అన్నది గాయత్రి.
అలాంటి శాసనాన్ని అమలుపరచే శక్తి ఇప్పటిదాకా ఎవరికీ వున్నట్లు దాఖలాల్లేవు. అందుకని నా అభిప్రాయాన్ని మాత్రం తెలియపరచాను – “గిరిజ కోరిక సఫల మవ్వాలని కోరుకుంటున్నాను గానీ, పుట్టే ఆ పిల్లో, పిల్లాడో సమాజంలో ఎలాంటి పరిస్థితుల నెదుర్కోవలసి వస్తుందో నని ఆలోచిస్తున్నాను.”
వాడు నాకెప్పుడూ అర్థమయేటంత దగ్గర కాలేదని అనిపించింది. కానీ, జీవితంలో నలభయ్యేళ్లకి పైగా నరక మనుభవించాడని గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి.
****(*)****
Dramatic story on a rather taboo topic. Interesting. Is it inspired by the TV show, Transparent?
One thing I entreat you – please avoid writing entire dialogues in English.
బయట ఈ అంశంపై బోలెడన్ని వార్తలు వస్తున్నా సాహిత్యంలో మాత్రం ఇది అంటరాని అంశం అయింది.
మనదేశంలో హిజ్రాలు వాళ్ళ స్థితిగతులు, సమస్యల మీదా కథలేమయినా వచ్చాయేమో తెలియదు.
కథనంలో గిరి, గిరిజగా మారిందనేది పాఠకుడికీ కూడా కథకుడితో పాటుగా ఆశ్చర్యం కలిగించిన తీరు బాగుంది.
ఇది ఇటీవల చాలా (ముఖ్యంగా మధ్యతరగతి) కుటుంబాల్లో వినిపిస్తున్న గంభీరమైన సమస్య.దీనికి పరిష్కారం వెదకడానికి ముందు అవగాహన కావాలి. ఆ అవగాహనకు కొంతవరకూ సహకరించే ఈ కథ ఆ దిశలో ఇంచుమించు తొలి అడుగు అనవచ్చు. సంభాషణల్లో కొన్ని ఇతరులతో పంచుకుందుకు ఇబ్బందికరమైనవే ఐనా – ఈ కథాంశానికి అవి అవసరమే. కథకి పెట్టిన పేరును పట్టి – కథాంశం ఊహకందినా, అదే నిజమైతే ఆశ్చర్యం కలిగించింది కథన చాతుర్యం. యామిని, గిరి పాత్రల్ని ప్రతిభావంతంగా రూపిందించారు. రచయితకి అభినందనలు.