నుడి

నుడి-9 (జూలై 2016) & నుడి-8 (జూన్ 2016) ఫలితాలు

జూలై 2016


నుడి-8 (జూన్, 2016) జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈ సారి నుడిని ఒక్కరు కూడా ఆల్ కరెక్ట్ గా పూరించలేదు.

ఒక తప్పుతో పూరించిన వారు:
1. కామేశ్వర రావు.

రెండు తప్పులతో నింపిన వారు:
1. సుజాత
2. మాడిశెట్టి రామారావు
3. రామ్మోహన్ రావు తుమ్మూరి
4. పి. సి. రాములు.

వీరందరికీ అభినందనలు. ఆధారాలలోంచి కొన్నిటికి వివరణలు కింద యిస్తున్నాను.

8 అడ్డం: కట్టడానికి బలాన్నిచ్చేది మళ్లీ మొదలవుతుందా? (3). దీనికి జవాబు పునాది.
వివరణ: పునః = మళ్లీ. ఆది = మొదలు. పునః + ఆది = పునాది.

9 అడ్డం: కవాటం ఆలోచనకు అదనపు కొమ్ము (3). దీనికి జవాబు తలుపు.
వివరణ: ఆలోచన = తలపు. రెండవ అక్షరానికి కొమ్ము ఇస్తే వచ్చేది తలుపు = కవాటం.

12 అడ్డం: రాత్రిలో రంకు హిట్లరు పోకడను సూచిస్తుంది (4). దీనికి జవాబు నిరంకుశ.
వివరణ: రాత్రి = నిశ. ‘నిశ’లో ‘రంకు’ను చేరిస్తే వచ్చేది నిరంకుశ = హిట్లరు పోకడ.

15 అడ్డం: అరవై నిమిషాల్లో కోడి తిరిగితే ఒక దుర్గం వస్తుంది (4)
వివరణ: అరవై నిమిషాలు = గంట. తారుమారు చేసిన ‘కోడి’ని ‘గంట’లో చేర్చితే వచ్చేది గండికోట. కనుక, అదే సరైన సమాధానం.

5 అడ్డం: శ్రీకృష్ణుడు చూసిన తండ్రి (3). దీనికి జవాబు కన్నయ్య.
వివరణ: చూసిన = కన్న. తండ్రి = అయ్య. కన్న + అయ్య = కన్నయ్య

2 నిలువు: చెయ్యి ముందు హిందీలో కూడా ఉంటే భయంకరమే (3)
వివరణ: హిందీలో ‘కూడా’ = భీ. చెయ్యి = కరం. భీ + కరం = భీకరం.

3 నిలువు: లతకు వ్యాపారంలో 33.33% నష్టం వచ్చి తడబాటుతో కలిగే దిగులు (4)
వివరణ: లతకు వ్యాపారం: ఇందులో 6 అక్షరాలున్నాయి. 33.33% అంటే 1/3. 6 లో 1/3 = 2. ‘లతకు వ్యాపారం’ అనే 6 అక్షరాల్లోంచి ‘పారం’ అనే చివరి 2 అక్షరాలను నష్టపోతే (కోల్పోతే) మిగిలేది ‘లతకువ్యా’. ఇది తడబాటుకు లోనైతే (మార్పు చెందితే) వచ్చేది వ్యాకులత = దిగులు! కనుక, సమాధానం వ్యాకులత.

6 నిలువు: తల్లిలాంటిది అంతు లేని అడవిలో ఈదిన నడుము చిక్కుకుంది (3)
వివరణ: అడవి = వనము. అంతు లేని అడవి = వన. ఈదిన నడుము = ది. ‘వన’లో ‘ది’ని చేర్చితే వచ్చేది వదిన = తల్లిలాంటిది. అదే సమాధానం.

10 నిలువు: ఆరోగ్యం యావత్తు పోయి ఆ బీమారి మిగిలింది (1, 2).
దీనికి జవాబు ఆ రోగం.
వివరణ: ‘ఆరోగ్యం’ లోంచి ‘యా’ ‘వత్తు’ మైనస్ అయితే మిగిలేది ఆ రోగం!

12 నిలువు: సంతోషం లేని స్థితిలో శ్రుతి కూడా ఉండదు (3).
చాలా మంది నిషాదం అని నింపారు. దీనికి జవాబు నిర్వేదం.
వివరణ: శ్రుతి = వేదం.

13 నిలువు: కొమ్ము లేని ఆటజంతువు కొస విరిగిన బండిని సూచిస్తుంది (3)
వివరణ: చదరంగంలోని పావు అయిన ‘శకటు’ లోంచి చివరి కొమ్మును తీసేస్తే ‘శకట’ వస్తుంది. బండి = శకటము. కొస విరిగింది కనుక, శకట జవాబు అవుతుంది.

21 నిలువు: ఈ కార్డు కొందరికి వరం కనుక ఆపరేషను ఆపవద్దు (3)
వివరణ: ఆపరేషను మైనస్ ఆప = రేషను. అదే జవాబు.

22 నిలువు: సుందరంగా అంగలో వేసిన అర పాదం (3).
దీనికి జవాబు అందంగ. చాలా మంది అందంగా అని పూరించారు.
వివరణ: అర పా‘దం’ = దం. ‘అంగ’లో ‘దం’ను చేర్చితే వచ్చేది అందంగ = సుందరంగా.

14 అడ్డం: ఉదాహరణకు కులు. కాని, ప్రథమార్ధం మాత్రమే (1).
దీనికి ఒక్కరు కూడా సరైన సమాధానాన్ని రాయలేదు. అందరూ ‘కు’ అని నింపారు. దీనికి జవాబు ‘లో’.
వివరణ: అరకు, కులు, కూర్గ్ మొదలైనవి లోయకు ఉదాహరణలు కదా. కాబట్టి ఇక్కడ అసలైన ఆధారం లోయ అన్నమాట. దాన్లోని ప్రథమార్ధం = లో.