అనువాద నవల

రాజ్ఞి – పదహారవ భాగం

నవంబర్ 2016


[సెప్టెంబర్ నెల సంచిక తరువాయి]

యం తో వణికిపోతూ ఆయేషా చేయి పట్టుకుని ఆ అగడ్త ని దాటుతున్నాను – కనీసం అలా అనుకున్నాను, కాని కాళ్ళకి నేల తగల్లేదు .

” పడిపోతున్నాను ” – కేక పెట్టాను.

” ఏం పర్వాలేదు. ముందుకి రా, నేను చూసుకుంటాను ” – ఆయేషా.

ఆయేషా మీద నాకు అంత విశ్వాసం ఎక్కడుందని ! నా నాశనం అక్కడ రాసి పెట్టి ఉందన్నదే నా గాఢమైన నమ్మకం. కాని తప్పదు , అదొక పరీక్షా సమయం నాకు.

” కాళ్ళు కిందికి వదిలేయి ” – ఆమె అరిచింది.

అలాగే చేశాను. రెండు అడుగులు గాలిలోకే పడ్డాయి . నా పని అయిపోయిందనుకున్నాను. కానీ , కాదు – మరొక క్షణం లో గట్టి రాతి నేల తగిలింది. ఆ తరువాయి ఏదో తెలియకపోయినా , గాల్లో కలిసిపోనందుకు – అప్పటికి, దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. మరొక రెండు క్షణాలలో లియో కూడా నా పక్కకి జారి పడ్డాడు.

” ఓహొయ్ ముసలాడా , చేరావన్నమాట నువ్వు కూడా ! భలే ఉంది కదా ఇదంతా ” – లియో పరాచికం.
పెద్ద పెద్ద కేకలతో జాబ్ కూడా మా మధ్యకి వచ్చి పడ్డాడు. ఆయేషా మమ్మల్ని లాంతర్లు వెలిగించమని ఆజ్ఞాపించింది. అదృష్టవశాత్తూ అవి దెబ్బ తినలేదు. దీపం నూనె నింపిన లోహపు కూజా కూడా సురక్షితం గానే చేరింది.

అగ్గిపుల్లలు వెలిగిస్తే అవి ఎంచక్కా మండాయి – ఆ విషయం లో ఆ దిక్కుమాలిన చోటుకీ లండన్ లో మా ఇంటి డ్రాయింగ్ రూమ్ కీ కాస్త కూడా తేడా లేదు.

రెండు నిమిషాలలో మా లాంతర్లు భేషుగ్గా వెలిగాయి. మా విచిత్రమైన పరిసరాలు చూస్తే ఒళ్ళు జలదరించింది. ఆయేషా మాత్రం నిశ్చలం గా చేతులు కట్టుకుని నిలుచుని ఉంది. మేమున్నది ఒక రాతి చావడి లో . అది సగం సహజమైన గుహగానూ మరొక సగం పనిగట్టుకుని కొండలో తొలిచినట్లూ ఉంది. పై కప్పు కిందికి వాలి వెనక భాగం లో కలుస్తోంది. పూర్తిగా కాదు – ఆ ఖాళీ లోంచి చూపు సారించేందుకు ధైర్యం చాలలేదు. అడుగు భాగం ఆ చివరన ఆధారం లేనట్లుగా గాలిలో ఊగుతూ ఉంది.

ఏ మాట కామాటే , మేమున్న చోట పొడిగా, వెచ్చగా ఉంది. మమ్మల్ని చీల్చేందుకు సిద్ధం గా ఉండిన కొండ మొన మీద పడకుండా భద్రం గానే ఉన్నాం అక్కడ.

” మొత్తానికి వచ్చాం ఇక్కడికి ” – ఆయేషా అంది. ” ఆ రాతి చరియ మీతోబాటు విరిగి పడిందనే అనుకున్నాను – సరాసరి భూగర్భం లో సమాధి అయి ఉండేవారు. ఈ బుద్ధి తక్కువ మనిషి – [ జాబ్ ని చూపిస్తూ ] చెక్క పలకని విరగ్గొట్టేశాడు . వెనక్కి వెళ్ళేందుకు వేరే ప్రణాళిక వేసుకోవాలి నేను. సరే, దాని సంగతి తర్వాత. కాసేపు విశ్రాంతి తీసుకోండి. మనం ఎక్కడున్నామని అనుకుంటున్నారు మీరు ? ”

” తెలియదు ”

” ఒకానొకప్పుడు ఈ గాలిగూడే తన ఇల్లుగా ఒక మనిషి ఏళ్ళ తరబడి ఇక్కడ నివసించాడు. మనం మొదట ప్రవేశించిన ఆ బిలం ఎదురుగా , నేల మీద , జనం ఆహారమూ నీరూ దీపం నూనే నివేదనగా వదిలి వెళుతుండేవారు. పన్నెండు రోజులకొకసారి అతను బయటికి వెళ్ళి వాటిని తెచ్చుకునేవాడు. నమ్ముతావా హాలీ ఈ సంగతిని ? ”
మా జవాబుకోసం ఎదురు చూడకుండా , కొనసాగించింది.

” ఆ మనిషి – అతని పేరు నూట్. అతనొక యోగి . కోర్ జాతి వారి విజ్ఞానాన్నంతా సాధించుకున్న తాత్వికుడు , శాస్త్రవేత్త. ప్రకృతి రహస్యాలనెన్నిటినో ఛేదించగలిగాడు. నేను మీకు చూపించబోతున్న ఆ జీవ జ్వాలను కనిపెట్టినదీ అతనే. కానీ దానిలో స్నానం చేయలేదు. ఆ జ్ఞానాన్ని ఎవరికీ బోధించలేదు. హాలీ, నీ లాగే – పుట్టినవారు గిట్టక తప్పదనే అతను బలం గా నమ్మాడు. నేను ఈ ప్రాంతాలకి వచ్చాక , జనం అతని గురించి చెప్పుకునేది విన్నాను. అతను ఆహారం కోసం బయటికి వచ్చే రోజున వేచి ఉండి , రహస్యం గా అతన్ని వెంబడించి లోపలికి వెళ్ళగలిగాను. నా సౌందర్యం తో చాతుర్యం తో అతన్ని వశం చెసుకున్నాను. కొన్ని రహస్యాలని నాకు విశదీకరించాడు. ఆ జీవ జ్వాలని నాకు చూపించాడు – కానీ అందులోకి నన్ను ప్రవేశించనివ్వలేదు. అతను చాలా వృద్ధుడి గా కనిపించాడు కనుక, కొన్నాళ్ళ తర్వాత వెళ్ళి , అతను మరణించి ఉంటే ఆ జ్వాల లో స్నానం చేయవచ్చునని అనుకుని తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకే కాలిక్రేటస్ , అతని తో బాటు ఆ ఈజిప్ట్ ఆడది అమెనార్టస్ నేనున్న చోటికి వచ్చారు. నా ప్రేమని స్వీకరించని కాలిక్రేటస్ ని ఎలాగైనా సాధించాలనే లక్ష్యం తో మళ్ళీ అక్కడికి వెళ్ళాను. యోగి అప్పటికి మరణించి ఉన్నాడు. ఆ దేహం ఇక్కడి ధూళి లోనే కలిసిపోయి ఉంటుంది ”

నేల మీద ఆనించి ఉన్న నా చేతికి తగిలిన దేన్నో యథాలాపం గా వెలికి లాగాను. అదొక మానవ దంతం. ఎత్తి పట్టుకుని ఆమె కి చూపించాను. విరగబడి నవ్వింది.

” అవును. అతనిదే అయి ఉంటుంది. భౌతికం గా మిగిలి ఉన్నది ఇదొక్కటేనేమో గాని, అతని జ్ఞానం ఇక్కడ ప్రకాశిస్తూనే ఉంది. సరే, ఆ రోజు – కాలిక్రేటస్ ని పొందలేని నాడు బ్రతికినా చచ్చినా నాకు ఒకటే అనిపిస్తున్న వేళ, బహుశా చావే మేలని దాన్ని కోరుకుంటున్న వేళ – ఆ జ్వాలలో ప్రవేశించాను. సజీవం గా ఇవతలికి వచ్చాను. నా లోకి ప్రసరించిన ఆ బ్రహ్మాండమైన జీవ మహత్త్వాన్ని మీకు మాటలలో వివరించలేను. అద్భుతమైన సౌందర్యం నన్ను ఆవరించింది.
ఆ గర్వం తో తిరిగి వచ్చి కాలిక్రేటస్ ని ఇక్కడికి తీసుకొచ్చి – అర్థించాను. అతనికి శాశ్వత జీవనమూ తరగని లావణ్యమూ అక్కర్లేకపోయాయి. పరాజ్ముఖుడై అమెనార్టస్ ని కౌగలించుకున్నాడు. నా ఆగ్రహం లో, ఉన్మాదం తో – అతన్ని చంపేసుకున్నాను. తెలివి వచ్చి శోకం లో కొట్టుకుపోయాను.

ఆ నల్లని ఈజిప్ట్ ఆడది – అమెనార్టస్ , నన్ను దాని దేవుళ్ళందరి పేరనా తిట్టిపోసింది. ఐసిస్, ఒసిరిస్ ల పేరునా, నెఫ్ థిస్ , అనుబిస్ ల పేరునా , సెఖెత్ , సేత్ ల పేరునా నా నాశనం కోరుతూ నన్ను శపించింది. దాని పూర్వుల శక్తి ఏదో నా నుంచి దాన్ని రక్షించింది. ఏమీ చేయలేకపోయాను. కాలిక్రేటస్ శరీరాన్ని వెనక్కి చేర్చాక దాన్ని ఆ బురదనేలల్లోకి వదిలేయించాను. బ్రతికిందో చచ్చిందో తెలియదు మొన్నటి దాకా. బ్రతికి బిడ్డని కన్నట్లుంది, ఆ సంతతి లో నువు మళ్ళీ పుట్టావు, నా దగ్గరికి తిరిగి వచ్చావు .

ఇవాళ ఈ కథనంతా రాగ ద్వేషాలు లేకుండా తలచుకుంటున్నాను. నీ నుంచి దేన్నీ కప్పి పుచ్చాలని అనుకోవటం లేదు. ఇందులో మంచి కన్న చెడే ఎక్కువ ఉంటే ఉండనీయి – చక్రభ్రమణం పూర్తయింది. చావో, బ్రతుకో – మనకి ఏది ప్రాప్తించబోతూ ఉందో నిర్ధారణగా తెలియదు. తెలియటం లేదు నాకు. ఒక్కటి మాత్రం నిజం – నీ పైని నా ప్రేమ. దానికి ఇన్ని వందల ఏళ్ళు గా ఏ చలనమూ లేదు. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం నీతో కలిసి ఉండటం లోనే దొరుకుతుంది. నిన్న మొన్న – మళ్ళీ , నిన్ను ప్రేమించిన ఆడదాన్ని చంపేశాను. చంపాలనుకోలేదు – వెళ్ళిపొమ్మని వదిలేశాను , దాని మొండితనం వల్ల …తప్పలేదు. నా శక్తి సామర్థ్యాలలోంచి ఆ అహంకారమూ నాకు సంక్రమించింది. నీకు – బహుశా , ఆ శక్తి అంత హాని చేయదేమో , ఏమైనాగానీ, జాగ్రత్త – దానికి బానిసవు కాకు.

ఇదిగో. చూడు – నా మేలి ముసుగు పైకెత్తి. నా మొహం లోకి చూస్తూ , చెప్పగలిగితే – నన్ను క్షమించానని చెప్పు. ”

ఆమె మాటల కన్న వాటిలోని మార్దవం మమ్మల్ని ఎక్కువగా చుట్టుముట్టింది. అందులో ప్రపంచం లోని స్త్రీత్వం అంతా ఉంది. లియో నీ అది స్పృశించింది, అతను కదిలాడు. భ్రమ దో భ్రాంతి దో అయిన ప్రభావం కాదు అది. సమ్మోహపు ఇంద్రజాలం కాదు. ఆ నిమిషం లో అతను ఆమెని నిజం గా, హృదయ పూర్వకం గా ప్రేమించాడు. అతని కి కన్నీళ్ళు వచ్చాయి. చప్పున వెళ్ళి ఆమె పల్చని మేలి ముసుగు ని పైకెత్తి ఆ నేత్రాల గాఢత్వం లోకి చూస్తుండిపోయాడు.
” ఆయేషా – మనస్ఫూర్తి గా ప్రేమిస్తున్నాను నిన్ను. క్షమ ఎంతవరకూ సాధ్యమో అంతవరకూ ఉస్తేన్ ని చంపిన విషయం లో నిన్ను క్షమిస్తున్నాను. తక్కిన విషయాలేవీ నాకు తెలియవు – అవి నీకూ భగవంతుడికీ మధ్యన తేలవలసినవి. ఇదివరకెప్పుడూ లేనట్లుగా , నిన్ను ప్రేమిస్తున్నాను , చివరి వరకూ నిన్ను అంటి పెట్టుకు ఉంటానని వాగ్దానం చేస్తున్నాను ”

వింతయిన గర్వం తో, దాని తో కలిసిన వినయం తో ఆయేషా పలికింది.

” నా ప్రభువు నా పైన ఇంత కరుణను వర్షించాక , నా వంతు వాగ్దానాన్ని నేనూ చెప్పుకోవాలి కదా ” – అతని చేతిని తన తల మీద పెట్టుకుని కాస్త వంగి ఒక మోకాలుని నేల మీద ఆనించి మోకరిల్లింది. అతని తలని వంచి ముద్దు పెట్టుకుంది.
” ఈ చుంబనం తో – నా ప్రభువు కి నా విధేయతను ప్రకటిస్తున్నాను. భార్యా ధర్మాన్ని అవలంబిస్తున్నాను ”

తన చేతిని అతని గుండె మీద పెట్టి – ” నా పాపాల సాక్షి గా, శతాబ్దాల నా ఒంటరి నిరీక్షణసాక్షి గా, అమేయమైన నా అనురాగం సాక్షిగా , ప్రాణం దేని నుంచి ఉద్భవించి తిరిగి దేనిలో లీనమవుతుందో ఆ లోకాతీతమైన శక్తి సాక్షి గా -
నా స్త్రీత్వం సఫలమైన ఈ తరుణం లో , నేను వాగ్దానం చేస్తున్నాను – చెడును పూర్తిగా త్యజించి మంచినే పాటిస్తానని. ఋజుమార్గాన్ని తప్పి ప్రవర్తించనని, నా జ్ఞానం దారి దివ్వెగా సత్యదర్శనానికే ప్రయాణిస్తానని. నా జీవితాంతమూ – అది కాసేపటి తర్వాతనో , మరెన్ని శతాబ్దాలు గడిచాకనో – ఎప్పుడైనా , అప్పటివరకూ – తిరిగి నా చేతుల్లోకి వచ్చిన నా భర్త ని ప్రేమించి గౌరవిస్తానని.

ఇంకా – ఇంకేం చెప్పాలి ! మాటలు లేవు. రావు. చాలవు.

హాలీ, నా వాగ్దానానికి సజీవమైన సాక్షివి నువ్వు. ఈ ఈదురు గాలు ల పైన మా వివాహపు ఒప్పందాలని రాసుకుంటున్నాము, స్వర్గం వరకూ వాటిని ఆ గాలులు మోసుకుపోవు గాక ! ఈ భూ భ్రమణ పరిభ్రమణాలలో మా బాసలు కలిసి శాశ్వతమవు గాక !

పెళ్ళి కానుకగా – నా అనశ్వర సౌందర్యాన్నీ అనంతమైన జీవనాన్నీ అతుల్యమైన విజ్ఞానాన్నీ అమూల్యమైన సంపత్తినీ – నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. ప్రపంచపు ఘనులందరూ విజ్ఞాన ఖనులందరూ నీకు పాదాక్రాంతులవుతారు. నీ వెలుగు ను చూడలేక కళ్ళు మూసుకుంటారు. వారి మనస్సులనూ మేధలనూ నువ్వు ఆసాంతమూ ఒక్క లిప్త లో చదివేయగలుగుతావు.

మరొకసారి నిన్ను నేను ముద్దాడితే – భూమి పైనా సముద్రం పైనా నిప్పు పైనా గాలి పైనా నీకు అవసరమైనంత మేరన అధికారం వస్తుంది, వాటిని శాసించి మార్చగలుగుతావు. నీకు జబ్బు చేయదు, ముసలితనం రాదు . భయమూ దుఃఖమూ వాటి నీడలని కూడా నీ మీద వాల్చలేవు.

ఇవి చాలవు. రా, వెళదాం. శాశ్వత జీవనాన్ని ఇవ్వగల జ్వాల వైపుకి. ఇక వెనుదిరగటమన్నది లేదు. ఏమైనా
కానీయి ”

ఆయేషా ఒక లాంతరు తీసుకుని ఊగులాడుతూన్న గుహ వెనక భాగం చివరకి వెళ్ళి ఆగింది. మేము అనుసరించాము. ఊహించని విధం గా అక్కడ నుంచి కిందికి దిగే వీలు ఉంది. రాతి లో అక్కడక్కడా మెట్ల లాగా ఏర్పడి ఉన్నాయి. ఆమె లాఘవం గా దిగటం మొదలు పెట్టింది. ఆ వెనకే , చేతయినట్లుగా మేము కూడా. బాగా నిట్ట నిలువు
గా ఉన్న సొరంగం వంటి దాని లో – పడుతూ లేస్తూ ప్రయాణించాము. ఎక్కడికో తెలియదు. ఆ పర్వత గర్భం లోకి, అంతే. వీలైనంతవరకూ కొండ గుర్తులు పెట్టుకునే ప్రయత్నం చేశాను – బతికి బాగుంటే వెనక్కి వచ్చేందుకు.
అరగంటకి పైగా నడిచాక, ఆ భూభాగం సన్నబడింది. అదొక గరాటా ఆకారం లో ఉందని గ్రహించాను- దాని చివరకి చేరుతున్నామని అర్థమైంది. అక్కడినుంచి దారి మరీ ఇరుకయిపోయింది. పూర్తిగా వంగి నేల మీద పాకుతూ వెళ్ళవలసి వచ్చింది.

ఆ దారి చివరన – అక్కడొక అతి విశాలమైన గుహ – దాని గోడలూ పై కప్పూ కనుచూపు మేరలో లేవు. మా గొంతుల ప్రతిధ్వనుల వల్లా , అక్కడి గాలి బాగా సాంద్రం గా ఉండటం వల్లా మాత్రమే అదొక గుహ అని గ్రహించగలిగాము. పాతాళ నరకం లో పాపాత్ముల మాదిరిగా , ఆయేషా వెనక బిక్కు బిక్కుమంటూ వెళుతున్నాం. ఆ గుహ అంతమయాక సన్నని సొరంగం గుండా ఇంకా చిన్నగా ఉన్నదానిలోకి ప్రవేశించాము. దీని గోడలూ పై కప్పూ కనిపిస్తున్నాయి. గోడలలో చీలికలు – నా పరిజ్ఞానం ప్రకారం , చాలా శక్తి వంతమైన వాయువు ఏదో పేలటం వల్ల సంభవించినవై ఉండాలి. ఈ గుహా దాటి, మళ్ళీ ఒక సొరంగం – దాని అవతల మటుకు – కొంచెంగా వెలుతురు.

ఆయేషా ఊరట తో నిట్టూర్చింది.

” వచ్చాం. రండి, వెళదాం. ఇదే భూమి మొత్తానికీ గర్భం. ప్రాణమనేది ఇక్కడే ధరించబడుతుంది – మనుషులూ జంతువులూ చెట్లూ – అన్నిటిచేతా ! ”

ఆమె వడివడిగా నడుచుకుపోయింది, పడుతూ లేస్తూ వెనకన మేము. మనసులలో భయమూ కుతూహలమూ సమంగా ఉన్నాయి. ఎక్కడికి వెళుతున్నాం ? ఏమి చూడబోతున్నాం ? వెళ్ళే కొద్దీ వెలుతురు ఎక్కువ కనిపిస్తూంది. దీపస్తంభం నుంచి వస్తున్న కాంతిపుంజాల కి లాగా వెడల్పాటి కిరణాలు ఆ చీకట్ల లోకి పడుతున్నాయి. దానితోబాటు గుండెలు అవిసిపోయే శబ్దం – ఉరుములు ఉరుముతున్నట్లు , చెట్లు విరిగిపడుతున్నట్లూ. అమ్మయ్య. దాటేశాం.

మూడవ గుహ లోకి అడుగుపెట్టాము. అది ఇంచుమించుగా యాభై అడుగుల పొడుగున, అంతే ఎత్తున, ముప్ఫై అడుగుల వెడల్పు తో ఉంది. నేల మీద మెత్తని ఇసుక పరచుకుని ఉంది. గోడలు నున్నగా ఉన్నాయి , దేని వల్లనో ఊహించలేకపోయాను. ఇక్కడ చీకటిగా లేదు – మృదువైన గులాబిరంగు కాంతి వ్యాపించి ఉంది , అది ఎంత బావుందో మాటల్లో చెప్పలేను. అది ఎక్కడినుంచి వస్తోందో మొదట అర్థం కాలేదు. చూస్తుండగానే గుహ కి ఆ చివరన పెద్ద ధ్వని. పొడవాటి జ్వాలా స్తంభమొకటి అక్కడ భగ్గుమంది. దాదాపు నలభై సెకండ్ల పాటు అది ఎంచలేనన్ని రంగులున్న ఇంద్రధనుస్సు లా ప్రకాశించి మాయమైంది – గుహ లో తిరిగి గులాబి రంగు వెలుతురు నిండింది.

” రండి ! దగ్గరికి రండి ! ” – అయేషా ఉద్వేగం గా ఆజ్ఞాపించింది. ” ఇదే జీవ జ్వాల. ప్రపంచానికి ప్రాణం వచ్చేది ఇక్కడినుంచే – ఇది లేనిదే మొత్తం మృత్యుశీతలమైపోతుంది. ఇందులో స్నానం చేసి శక్తివంతులు కండి ! మీ లో ఉన్న జీవశక్తి వెయ్యి జన్మల వెనకన తెచ్చుకున్నది, అంతకంతకూ వడకట్టబడి పలుచన అయినది – ఈ మూలాధారం నుంచి మీరు పొందగలిగే దానికి ఏ పరిమితులూ వర్తించవు ”

వెళ్ళి అక్కడ నిలుచున్నాము. ఆ జ్వాలా స్తంభపు ప్రాణ స్పందనకు చేరువవుతున్న కొద్దీ మాకు ఎక్కడ లేని జవసత్త్వాలూ వస్తున్నాయి. బ్రతికి ఉండటమనేది అంత ఆనందమనీ అంత గొప్పదనీ ఇదివరకెప్పుడూ స్ఫురించనేలేదు. గాలిలో ఎగరాలనిపించింది , ఎగురుతున్నామనే అనిపించింది – తేలిగ్గా, బలంగా – గరుడపక్షులకి లాగా.

ఒకరి మొహాలొకరం చూసుకున్నాము. పెద్దగా నవ్వాలనిపించింది. జాబ్ పగలబడి నవ్వాడు – అతను ఏ కాస్తయినా నవ్వి వారం రోజులైంది. ఆ దివ్యమైన మాదకత మమ్మల్ని కమ్ముకుని ముంచెత్తుతోంది. మానవ మేధ తాలూకు వికాసాలన్నీ నాకు అందుతున్నాయి ఆ క్షణాలలో. ఎన్నెన్నో గొప్ప భావాలు ఎగసి పడుతున్నాయి. షేక్ స్పియర్ చెప్పినంత బాగా కవిత్వం చెప్పగలని తోచింది. కొత్త కొత్త వీ మహిమాన్వితమైనవీ అయిన దారులన్నీ నాకు తెరుచుకుంటున్నాయి.

ఆ లోపల మళ్ళీ ఆ తీవ్రమైన ధ్వని. జ్వాలా స్తంభం తిరిగి మా ముందర స్పందించి వెలిగి మాయమైంది- ఎక్కడికో, ఎందులోకో తెలియదు. అది కనిపించినంతసేపూ ఆయేషా చేతులు సాచి దాన్ని ఆవాహన చేస్తున్నట్లు నిలుచుంది.

అప్పుడు అంది.
” రా. కాలిక్రేటస్ . తరుణం వచ్చింది. ఈసారి ఆ జ్వాల వచ్చినప్పుడు అందులోకి ప్రవేశించు. దుస్తులు పూర్తిగా తీసి వెళ్ళు – అప్పుడు నీకు అది హాని చేయదు. గుండె నిండుగా దాన్ని లోపలికి తీసుకో, ఒక్క పిసరు కూడా వృధా పోనీకు. నీ అణువణువనా దాన్ని వెలగనీయి ”

లియో అన్నాడు – ” సరే , ఆయేషా. నేను పిరికి వాడిని కానుగానీ అది నన్ను పూర్తిగా నాశనం చేయదనే నమ్మకం ఏదనే అనుమానం వస్తోంది నాకు. అయినా సరే. నువ్వు ఎలా చెబితే అలాగే ”

ఆయేషా ఒక్క నిమిషం ఆలోచించింది. ” నీకు అనుమానం రావటం లో తప్పేమీ లేదు కాలిక్రేటస్. నేను అందులోకి వెళ్ళి ఏ హానీ జరగకుండా బయటికి వచ్చాననుకో – అప్పుడు నమ్మకం కలుగుతుందా నీకు ? నువూ వెళతావా లోపలికి ? ”

” అక్కర్లేదు లే ఆయేషా. వెళతాను . నేనే వెళతాను. నువ్వు చెబుతున్నావు కదా ”

” నేను కూడా ” – అరిచాను.

ఆయేషా నవ్వింది. ” అదేమిటి హాలీ ? నీకు అంతకాలం బ్రతకటం ఇష్టం లేదన్నావు కదా ? ”

” ఏమో. తెలియదు. ఏదో ఆకర్షిస్తోంది నన్ను. ఆ జ్వాలని రుచి చూసి జీవించాలనే తొందర కలుగుతోంది ”

” సరే అయితే. కాని నేనే ముందు వెళతాను ” – ఆయేషా అంది. ” నా లావణ్యమూ శక్తీ ఇంకా ఇనుమడిస్తాయేమో – కాకపోయినా నాకేమీ హాని జరగదు కదా. ఇంకొక కారణం కూడా ఉంది. ఇదివరకు నేను అందులోకి ప్రవేశించినప్పుడు నా మనసు నిండా అమెనార్టస్ మీది క్రోధమూ మత్సరమూ , కాలిక్రేటస్ మీది లోభమూ ఉన్నాయి- బయటికి వచ్చాక ఆ దుర్గుణాలే నాలో ముద్రించుకు ఉండిపోయాయి. ఇప్పుడు నాకు కోరదగినదింకేమీ లేదు , ఈ ప్రశాంతి నే ఈ తృప్తి నే నా లో నిలిపి ఉంచుతుందేమో ఆ జీవజ్వాల …

లియో, నువ్వు వెళుతున్నప్పుడు కూడా నీ రాగ ద్వేషాలని వీలైనంతగా వదిలించుకు వెళ్ళు. నీకు జరిగిన అతి గొప్ప మంచి సంఘటననే గుర్తు చేసుకో. పసి తనం లో మీ అమ్మ పెట్టిన ముద్దుని ఊహించుకో. ఆ ఆహ్లాదపు వెండి గంటలనే నీలోపల మ్రోగించుకుంటూ వెళ్ళు.
సిద్ధం గా ఉండు ”

కొద్ది క్షణాల విరామం. ఆయేషా తన శక్తిని సమీకరించుకుంటున్నట్లుగా కనిపించింది. మేమంతా నిశ్శబ్దంగా ఒదిగి ఉండిపోయాము.

ఎట్టకేలకి – దూరం నుంచి ఆ ధ్వని వినిపించటం మొదలైంది. ఆయేషా చురుగ్గా శిరోజాలని బంధించి ఉంచిన దువ్వెన వంటిదాన్ని తీసేసింది. నడుముకి ఉన్న సర్పాకారపు వడ్డాణాన్ని వదులు చేసింది – దుస్తులు జారిపోయాయి , ఆమె దేహాన్ని నేల వరకూ జీరాడే కేశరాశి కప్పి వేసింది. ఆడమ్ కి ఈడెన్ తోట లో కనిపించిన ఈవ్ ఇలా ఉండి ఉంటుందా – ఇంత స్వచ్ఛం గా, ఇంత పవిత్రం గా ?

జ్వాల దగ్గరికి వస్తోందనిపించింది. దంతం తో మలచినట్లున్న తన బాహువు ని లియో మెడ చుట్టూ వేసి పలవరించింది ఆయేషా.

” నిన్నెంత ప్రేమిస్తానో నీకెప్పుడైనా అర్థమవుతుందా ప్రియతమా ” – అతని నుదుటిని ముద్దాడి ఆమె వెళ్ళి జ్వాలా స్తంభం ప్రసరించే దారిలో నిలుచుంది. ఆమె మాటలలో చేత లో కాంక్ష లేదు, ఆశీర్వచనం ఉంది.

చూస్తుండగానే ఆ జ్వాల ఆమెను బంగారపు అల్లిక తెర లాగా చుట్టు ముట్టింది. ఆమె నుదుటి పైన, శిరోజాల పైన, మోహనమైన ముఖం పైన, తేజోవంతమైన నేత్రాలలో, మెడ పైన, వక్ష స్థలం పైన , హస్తాల పైన , నడుము చుట్టూ, ఊరువు ల పైన, పాదాల పైన – ఆ దివ్య జ్వాల ధగధగమని మెరిసిపోయింది. ఆయేషా నవ్వుతూ నిలుచుంది. ఆ దృశ్యం లోకోత్తర వైభవం తో కళ్ళకి మిరుమిట్లుగొలిపింది. తిరిగి ఒకసారి దాన్ని చూడగలనంటే ఏమయినా చేయగలను నేను !

అంతలో – ఉన్నట్లుండి – మార్పు. ఏమిటో తెలియదు, మార్పు. ఆమె నవ్వు మాయమైంది. ముఖం బిగుసుకుంటోంది. శరీరం కుంచించుకుపోతున్నట్లైంది. కళ్ళలో వెలుగు తగ్గిపోతోంది.

నా భ్రాంతి ఏమో అని కళ్ళు నులుముకుని చూశాను. ఆ జ్వాల ఆయేషాను విడిచి వెళ్ళింది, మాయమైంది.

ఆమె తడబడే అడుగులతో లియో వైపుకి వచ్చింది. అతని బుజం పైన చేయి వేసింది. ఆ చేతి పుష్టీ లావణ్యమూ ఏమై పోయాయి ..అది – అది వార్థక్యం వచ్చినట్లుంది!!!! లియో కీ అది అర్థమవుతోంది. అతి ప్రయత్నం తో గొంతు పెగల్చుకుంటోంది – ” ప్రియా, ఏమైంది నాకు ? ఏమవుతోంది ? తల తిరుగుతోందేమిటి ? చూపు ఆనటం లేదే ? ” అయోమయం గా జుట్టుని సవరించుకోబోయింది, అది మొత్తం ఊడి పడిపోయింది, ఆమే నేల పైకి కూలిపోయింది.
ఆ దేహం లో అతి వేగం గా మార్పులు వచ్చేస్తున్నాయి. చర్మం వందల కొద్దీ వేల కొద్దీ ముడతలు పడుతోంది. అస్థి మాంసాలు శుష్కించిపోతున్నాయి. సమున్నతమైన ఆమె ఆకృతి చిన్నదై నెలల పసిబిడ్డ పరిమాణానికి వచ్చేసింది. ఎందుకోగాని శిరస్సు మాత్రం పూర్వపు పరిమాణం లోనే ఉంది .

భగవంతుడా ! ఆ దివ్య సౌందర్య మూర్తి ఎక్కడ – ఈ వికృత వైపరీత్యం ఎక్కడ !

ఆమె చనిపోతోంది. మాకు తెలుస్తోంది. ఆమెకీ తెలుస్తోంది.

చూడలేకపోతోంది, కాని మాట ఇంకా వస్తోంది.

బొంగురు గా – ” ప్రియా, కాలిక్రేటస్ – మర్చిపోకు నన్ను- నా దుస్థితి కి కరుణ చూపు – నేను వస్తాను – మళ్ళీ – ఇంకా ఎక్కువ అందంగా …నిజం. వ- స్తా- ను ” మాట ఆగింది. ఆమె మరి కదలలేదు.

రెండు వేల ఏళ్ళ నాడు కాలిక్రేటస్ ని వధించిన చోటనే ఆయేషా కూడా మరణించింది.

మేము నిశ్చేష్టులమై అక్కడ ఎంత సేపున్నామో తెలియదు. కొన్ని గంటలు గడిచిపోయి ఉంటాయి. ఆ జ్వాల మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లు వచ్చివెళ్ళిందో తెలియదు , మేము దాన్ని పట్టించుకోలేదు. ఆయేషా నిర్జీవ శరీరం మా ముందు అలాగే పడి ఉంది.

జరిగినదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని అప్పటికి నా మెదడు మొదలు పెట్టింది.

ఏమయి ఉంటుంది ? ఒకసారి అనంత జీవన యౌవనాలని ఇచ్చిన జ్వాల మరొకసారి వార్థక్యాన్నీ మృత్యువు నీ ఎందుకు ఇచ్చింది ? దాని స్వభావం లో మార్పు వచ్చిందా ? లేక ఆయేషా శరీరం ఆ జ్వాలని మరొకసారి భరించలేకపోయిందా ? మొదట జరిగిన చర్యకి రెండవసారి జరిగినది విరుగుడు గా పని చేసిందా ? ఆలోచిస్తున్న కొద్దీ అదే నిజమనిపించింది. తాను ప్రసాదించినదాన్నంతా ఆ జ్వాల రెండోసారి వెనక్కి తీసేసుకుంది- ఫలితం గా ఆయేషా కి రెండు వేల ఏళ్ళ వయసూ ఒక్కసారే వచ్చేసింది.

అంతే.

ఆయేషా ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఆ సమాధులలో నివసించినంత కాలమూ ప్రకృతి నియమాలు ఎక్కువగా అతిక్రమించబడలేదు కాబోలు ! తృప్తి పడి , సంతోషంగా – తన శాశ్వత యౌవన సౌందర్యాలతో ఆయేషా మళ్ళీ ప్రపంచం లోకి వెళ్ళకూడదు కాబోలు – ప్రకృతి పగ తీర్చుకుంది కాబోలు !

మెల్లి మెల్లిగా నాకు కాళ్ళూ చేతులూ ఆడటం మొదలెట్టాయి. ఆయేషా దుస్తులు వదిలిన చోటనే పడి ఉన్నాయి. గబ గబా వెళ్ళి వాటిని తీసుకుని ఆమె పార్థివదేహం పైన కప్పివేశాను – ఆ వైపుకి చూడకుండా , లియో తేరుకునే లోపలే.

జాబ్ మెదలకుండా బోర్లా పడుకుని ఉన్నాడు. వెళ్ళి కదిలించాను. చలనం లేదు. ఇటు తిప్పి చూశాను – గుండె మరొక్కసారి జారిపోయింది. జాబ్ బ్రతికిలేడు. అయ్యో – అసలే దెబ్బ తిని ఉన్న అతని మనసు ఈ అఘాతానికి తట్టుకోలేకపోయింది. భయం తో ప్రాణాలు వదిలాడు…

లియో తెప్పరిల్లుతున్నట్లు కనిపించాడు. జాబ్ సంగతి చెప్పాను – ‘ ఆ ‘ అని మాత్రం అనగలిగాడు. వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఇంకొకరికి గొప్ప అభిమానం – కాని, ఆ స్థితిలో – లియో కి ఏడ్చే ఓపిక మిగిలి లేదు.

” ఏం చేద్దాం ఇప్పుడు ? ” – లియో పొడి గొంతుక తో అడిగాడు.

” వెనక్కి వెళ్ళిపోదాం. నువ్వు – అందులోకి వెళ్ళాలనుకుంటే తప్ప ” – జ్వాల వైపుకి చూపించాను.

” అది నన్నూ చంపేస్తుందంటే తప్పకుండా వెళతాను ” – విరక్తిగా నవ్వాడు. ” నేను వెనుకాడి ఉండకపోతే – ఇది – జరిగి ఉండేది కాదు. కాని అది నన్ను చంపకుండా అనంతమైన జీవితాన్నిస్తే – ఊహూ. నాకు ఓపిక లేదు . రెండు వేల ఏళ్ళు బ్రతికి ఆమె కోసం ఎదురు చూడలేను , నా వల్ల కానేకాదు. నా సమయం వచ్చాక వెళ్ళిపోవటమే నాకు సరైనది. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంకుల్ హాలీ ”

తల అడ్డంగా తిప్పాను. అటువంటి ఉత్సాహమేమీ నాకు మిగల్లేదు. అన్నేళ్ళు ఈ బ్రతుకుని ఈడ్చాలనిపించటం లేదు. పైగా- ఆ జ్వాల ఎవరినేం చేస్తుందో ఎవరికి తెలుసు ! ఈ మారు మూలన, అంత్యక్రియలకి కూడా అవకాశం లేని చోట చావటం దేనికి ?

” సరే అబ్బాయీ. వీలైనంత త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ చావు తప్ప తోడేమీ లేదు మనకి. అదీ, ఆ లాంతర్లు
పనికొస్తే ”

” పనికొస్తాయనుకుంటాను. నూనె కూడా ఉంది కొంచెం ” – లియో ముక్తసరిగా అన్నాడు.

జాబ్ చేతులని ఒకసారి ప్రేమగా స్పృశించి వది లాము – అంతకన్నా మా ఆ ఆప్తుడికి ఇంకేమీ చేయగల స్థితిలో లేము. దుస్తులని తొలగించి ఆయేషా ని చూడాలనుకోలేదు. విడిగా పడి ఉన్న ఆమె శిరోజాలని తీసి వాటి పరిమళాన్ని ఆఘ్రాణించాడు లియో.

” ఆమె మళ్ళీ వస్తానంది – నాకోసం. మర్చిపోవద్దంది. ఎందుకు మర్చిపోతాను – ఎలా మరపు వస్తుంది ? శపథం చేసుకుంటున్నాను నేను కూడా – ఇక్కడ నుంచి బ్రతికి బయట పడితే, మరొక స్త్రీ తో నిమిత్తం లేకుండా జీవితాంతమూ ఆమె కోసమే ఎదురు చూస్తూ గడిపివేస్తాను ”

” ఎలా వస్తుందో, ఎలా గుర్తు పడతామో ” – మనసులో అనుకున్నాను.

వాళ్ళిద్దరినీ అక్కడ వదిలేసి బయల్దేరాము. చాలా దూరం నడిచాము- చాలా చాలా దూరం.

[ ఉపసంహారం - ముగింపు , వచ్చే భాగం లో ]