“అట్లాగని పెద్ద బాధా ఉండదు” అనేది ఒక మో కవితలో మొదటి పంక్తి. ఈ పంక్తికి ముందు (తర్వాత కాదు) మీరేదన్నా పంక్తిని ఊహించి రాయగలరా? అది తమాషాగానూ ఉండవచ్చు, కవితాత్మకంగానూ ఉండవచ్చు, మీ ఇష్టం.
“అట్లాగని పెద్ద బాధా ఉండదు” అనేది ఒక మో కవితలో మొదటి పంక్తి. ఈ పంక్తికి ముందు (తర్వాత కాదు) మీరేదన్నా పంక్తిని ఊహించి రాయగలరా? అది తమాషాగానూ ఉండవచ్చు, కవితాత్మకంగానూ ఉండవచ్చు, మీ ఇష్టం.
ఏం? నీ కోసం ఈ ఊపిరి ఆగి పోతున్నా!
అట్లాగని పెద్ద బాధా ఉండదు
మనసు ముక్కలైనట్లన్పిస్తుంది.
అట్లాగని పెద్ద బాధా ఉండదు.
-
కలిసాం! .అదుగో…..వెళ్ళాలేమో! ….విడిపొయామా మళ్ళీ!…!
అట్లాని పెద్ద బాధా ఉండదు.
-
ఉండలేననడంలో, వెళ్ళాలనడంలో ఉంది బాధంతా- నిజానికి; లేనప్పుడు
అట్లాగని పెద్ద బాధేం ఉండదు.
-
అలవాటైపోయింది- వేచి చూడ్డం
అట్లాని పెద్ద బాధా ఉండదు.
-
రోజంతా దూరం జరిగే గడియారపు ముళ్ళు- రెండే సార్లు కలుస్తాయి!
అట్లాగని పెద్ద బాధేం ఉండదు
నువ్విక్కడ లేనప్పుడు! (రచన: రచిత్)
==================
మీరు “ఎప్పుడైనా చూశారా అతన్ని?”
బస్టాండ్ లో ఒద్దికగా కూలబడి శ్రద్దగా అడుక్కుంటూ కనిపిస్తాడతను
దూరం నుండి చూస్తే చంద్ర వంకలా కాదుగానీ వంగిన బాణంలా కనిపిస్తాడు
మా చెల్లెలు కవితలైతే ఎట్లా రాయదో ఇతను కూడా అంతే
కవితలకు ఆమడ దూరంలో అరచేయి చాస్తూ అడుక్కుంటాడు.
ఆకాశపు చిన్న కూతురికి తనే పెనిమిటి నన్నట్టు
ఆకాశం వైపు అల్యూమినం బొచ్చె సాచి అప్పుడప్పుడు కట్నం అడుగుతుంటాడు వాడు.
తన దగ్గరున్న ఖాళీ కోకు బాటిలే అతనికి “ఒక గొంతు తడిపే చెయ్యి.”
“జతకూడిన సంగతిని” గురించి పాడాలనుకుంటాడు కానీ అనుభవాలు గుర్తుకు రాక అల్లాడి పోతుంటాడు.
వర్షం అంటే ఇష్టం ఉండదు వాడికి,
నాలుగు మెతుకులు కురిసే మేఘం లాంటి జేబుల కోసం
ఎదురుచూస్తూ రోజులను ముళ్ళలా గుచ్చుకుంటాడు.
పస్తులను వస్తువులుగా ఊహించుకుంటూ గడపడం వాడికి పాలతో అబ్బిన విద్య.
***
ఓ రోజు… ఎట్లాగైనా వాడికి రెండువేల నోటు ఇద్దామని
ఎప్పట్లానే జేబు తడుముకున్నా
నోటు పొడిపొడిగా తగిలింది
ఎదురుగా చూస్తే… నా కంట్లో తడి నింపుతూ… వాడు కనిపించలేదు
నా మనసంతా శబ్దం చేసే నిశ్శబ్దమే అయ్యింది.
నలుపు రంగు పులుముకున్న సూర్యుడిలా ఆరిపోయిన వెలుగయ్యింది.
అప్పుడు
ఆశ్చర్యంగా
వాడుండే చోట ఒక గులాబీ మొగ్గేస్తూ కనిపించింది
పోన్లే
చీకటి పడకముందే
ఈ మొగ్గనైనా దత్తత చేసుకోవాలనుకున్నప్పుడు
నా మనసు పూర్తిగా పూసిన వెదురు పోద అయ్యి, పిల్లనగొయ్యలు కాసింది.
వాడు నా సోషల్ లైఫ్ నుండి వెళ్ళిపోయినందుకు
సంతోషంగా ఎప్పుడూ అనిపించలేదు సుమా
అట్లాగని పెద్ద బాధా ఉండదు.
***
(రోజూ మియాపూర్ బస్టాండులో అడుక్కుంటూ కనిపించే వాళ్ళందరికీ, ప్రేమతో )
ఒంటరి పక్షికి ఇల్లు ఆఫీసూ
రెంటికీ పెద్ద తేడా ఉండదు
అందుకని పెద్ద బాధా ఉండదు
నీ కోసం, కేవలం నీ కోసం పెట్టుకుంటున్నాను నాన్న అనే అమ్మాయి నుదుటిమీద ఉన్న
ఆవగింజంత బొట్టు చూసి
ఆవిరై పోతుంది తండ్రి ఆశ
అట్లాగని పెద్ద బాధా ఉండదు
గానుగెద్దు జీవితం
ఎద్దు నడుస్తూనేవుంటుంది
జీవితం మనం తెలుసుకోకుండా వెళ్ళిపోతుంది
అట్లాగని పెద్ద బాధా ఉండదు