ఈ సంచికలో

పుస్తక విమర్శకు ఆహ్వానం

జూన్ 2017

వాకిలి జూన్ సంచికకు స్వాగతం!

“ఈ పుస్తకం కొని అలమరాలో భద్రంగా దాచుకోదగింది”. “…ప్రక్రియకు ఈ రచయిత్రే(తే) ఆద్యురాలు(డు)”. “తన జాతి/వర్గం/ప్రాంతం/మతం/కులం/జెండర్ కోసం నిరంతరం పలవరిస్తుంటాడు”. “ఎంతో సున్నితమయిన కవి. ఎక్కడా ఎప్పుడూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు”. “తన శత్రువుని సరిగ్గానే గుర్తించాడు, గుర్తించటమే కాదు సూటిగా శషభిషలు లేకుండా గురిపెట్టాడు. గురిపెట్టటమే కాదు తనేమిటో ప్రపంచానికి ప్రకటించాడు…”. “అతడి కవిత్వాన్ని మౌనంగా చంపే పెద్ద కుట్ర జరుగుతోంది”. “సాహితీలోకం అతడికి బ్రహ్మరథం పట్టింది”. “కాలం అతన్ని కలగనింది. నిజానికి కాలాన్ని అతడే కన్నాడు”. “కాదు అతడొక్కడే కనీ వినీ ఎరుగని ఒకే ఒక కవి (లేదా రచయిత)…”

కవిత/ కథ/ పుస్తకం మీద ఇలాంటి రివ్యూలు పత్రికల్లో తరచూ వస్తుంటాయి.

అది తెలుగే, కానీ తెలుగు పాఠకులకు అర్థం కాని ఓ సరికొత్త భాష. పైన ‘పుస్తక విమర్శ’ లేదా’ సమీక్ష’ అని ఉంటుంది గానీ, అది ఆయా విమర్శకునికీ రచయితకూ మధ్య జరిగే ఓ రహస్య సంభాషణ. పొరపాటున ‘వాట్స్ ఆప్ ‘ లోనో ‘మెసెంజర్’ లోనో పెట్టబోయి పత్రికకు పంపారా అనుకుందామనుకొంటే కింద సమీక్షకుడి ఫోన్ నంబర్ ఉంటుంది – ఆ రొజే ఒక వంద పరామర్శ ఫోన్కాల్ సంభాషణలని ఆశిస్తూ.

అనేక పేరాల కొద్దీ చదివినా ఆ రచన ఏమిటో, ఆ పుస్తకంలో ఏముందో, దాని ప్రత్యేకత, లోటుపాట్లు ఏమిటో తెలియవు – పొగడ్తలు తప్ప. లేదా పై మొత్తానికీ భిన్నంగా తిట్ల వర్షంలో ముంచెత్తటమే లక్ష్యంగా మరో రకం సమీక్షల బహిరంగ యుద్ధం. వీటిని తలదన్నే ఇంకోరకం – అసలా పుస్తకాన్నే చదవకుండా అందులో ఏముందో ఊహించి తెలుసుకొని పేజీలకొద్దీ రాయగలిగే ప్రతిభని సొంతంచేసుకొన్న మరో తరం విమర్శకులూ/ సమీక్షకులూ.

పాఠకులకు సంబంధం లేని ఇలాంటివాటికి భిన్నంగా అచ్చమైన పుస్తక విమర్శను ‘వాకిలి ‘ ఆహ్వానిస్తోంది. ఉత్తమమయిన విమర్శకు లేదా సమీక్షకు ప్రతినెలా బహుమతి ఇవ్వబోతోంది. ప్రతి నెలా ఒక మంచి సమీక్షా వ్యాసానికి ఆ రచయిత మన దేశంలో ఉంటే 1000 రూపాయల అమెజాన్ గిఫ్ట్ కార్డ్ లేదా విదేశాల్లో ఉంటే 20 డాలర్ల Barnes & Noble గిఫ్ట్ కార్డ్ ఇస్తాము.

ఈ సూచనలు పాటించండి:

1. పరిచయం చేయబోయే పుస్తకం వివరాలు (కథా? నవలా? వ్యాసావళా? మరోటా?) వివరంగా రాయండి.

2. సమీక్ష రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన ప్రధాన ఉద్దేశ్యం.

3. పుస్తకంలో నచ్చినవీ, నచ్చనివీ – కట్టె, కొట్టె, తెచ్చె – అన్నట్లు కాకుండా వివరంగా ఉదాహరణలు సహా ఉండాలి.

4. అన్నీ సుగుణాలే కాకుండా లోటుపాట్లతో కూడిన సద్విమర్శ కూడా ఉండాలి.

5. కేవలం పుస్తకం గురించే ఉండాలి కానీ, ఆ రచయితపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఉండరాదు.

6. ఈ పుస్తకం చదవమని కానీ, కొనమని కానీ సిఫార్సు చేస్తారా?

7. సంక్షిప్తంగా కాకుండా వీలయినంత పరిశీలనతో, విశ్లేషణతో ఉండాలి.

8. 1990వ సంవత్సరం తర్వాత ప్రచురింపబడ్డ తెలుగు పుస్తకాలను మాత్రమే సమీక్ష కోసం ఎంపిక చేసుకోవాలి.

గమనిక: బహుమతి ఇచ్చే / ఇవ్వని విషయంలో సంపాదకులదే తుది నిర్ణయం. మీ సమీక్షలను ప్రతినెలా 20 వ తేదీలోగా పంపించండి.


ఈ సంచికలో:

బయటికి అందంగా, బలంగా కనిపించే వివాహ బంధాలు నిజానికి పెళుసుగా ఉంటాయని నిగూఢంగా చూపించిన సుజాత గారి అనువాద కథ ‘ఆ తెల్లని ఇల్లు’;

రచయిత తత్వాన్ని పరిచయం చేసే మెహెర్ గారి కథ(లు) ‘రెండు రచయితల కథలు’;

ఇంతకుముందు ‘బౌండరీ దాటిన బాలు’ లాంటి చక్కని కథలని వాకిలి పాఠకులకు అందించిన మధు పెమ్మరాజు గారి కలం నుండి మరో కథ, ఆధునిక బంధాలలోని సంక్లిష్టతను సున్నితంగా స్పృశించిన కథ, ‘ఫైండింగ్ డోరీ’;

ఎంతో మంది ప్రశంశలు అందుకున్న ‘గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల గురించి సురేష్ గారు రాసిన వ్యాసం;

ఇంకా-
హరి బొద్దున గారి కథ ‘డెజిగ్నేటెడ్ పార్ట్ నర్’, మైథిలి గారి కొత్త కాలమ్ ‘దీపాలు పెట్టే వేళ’, ఎలనాగ గారి నుడి, కవితలు, ప్రకటనలు యధావిధిగా.