కొత్త పుస్తకం కబుర్లు

కొత్త చూపు – అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి

జనవరి 2015

జీవితం తునకలు తునకలుగా తెసుకుని ఆ మానవ వైరుధ్యాలను, వ్యక్తిత్వాల అల్పత్వాలు, ఔన్నత్యపు శిఖరాగ్రాలూ, సమస్త జీవన విస్తారాలను మనముందు౦చి తనదైన తీరులో రచయిత్రి కొత్త కోణం ఆవిష్కరిస్తున్న కధలు ఈ కొత్త చూపులో కనిపిస్తాయి. సమస్యలకు తొలి మూలం అయిన మానవ నైజాన్ని ఇది౦తేలే అన్నంత సులువుగా ఆవిష్కరించి తనదైన అభిప్రాయం పాత్రల పట్ల సానుభూతికో సమ భావనకో చూపిన గల్పికలు. జీవితంలో ఉన్నట్టే ఎన్నో పాత్రలు ఆపాత్రాల మధ్య అనుసంధానం ఏ పాత్ర ఏ పాత్రకు బొమ్మో బొరుసో చదివిఆకళి౦పు చేసుకునే విషయం
పాఠకుల మేధకే వదిలారు , చదివి ఆలోచించ వలసిన కధలు.

కొత్త చూపు
రచన: అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి
వెల: రూ 120
ప్రతులకు నవోదయ బుక్ హవుస్
కాచిగుడా క్రాస్ రోడ్స్
హైదరాబాద్ -27

***

గౌరీలక్ష్మి గారి కధ మీకోసం:

సీ…..రియల్

“బ్రతుకు పిల్ల లకై ధారవోయు తల్లి తండ్రులూ ..

కొవ్వొత్తులై కాలిపోవు ప్రేమ మూర్తులూ …”

సాయంత్రం ఏడు గంటలయ్యింది. బ్యాక్ గ్రౌండ్ పాటతో “అమ్మా – నాన్నా” సీరియల్ వందో ఎపిసోడ్ మొదలయ్యింది, ఒక వృద్ద జంట ఉన్నదంతా ఖర్చు పెట్టి నలుగురు కొడుకుల్నీ చదివించి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు  చేస్తారు. చివరికి వాళ్ళంతా తల్లి తండ్రులకి తిండి పెట్టడానికి కూడా బాధ పడుతూ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఇంట్లోంచి పంపేస్తూ ఉంటారు.ఆర్ధికంగా ఏ ఆధారమూ లేక నలుగురు కొడుకులూ కోడళ్ళ మధ్య నలుగుతూ జీవనం సాగిస్తూ ఉంటారా ముసలి దంపతులు. స్థూలంగా ఇదీ కధ.

” ఎంత బాగా తీసారమ్మా సీరియల్ !” కవిత మావగారన్నారు సోఫా లోంచి వంగి టీపాయి మీదున్న ద్రాక్ష పళ్ళు తీసుకుంటూ.

“లోకరీతి …చూస్తున్నదే కదా ..” అంది అత్తగారు తనూ గుప్పెడు పళ్ళు తీసుకుని దివాన్ పై పడుకుంటూ.

టీ.వీ. చూస్తూ కూరలు కోసుకుంటున్న పెద్ద కోడలు కవిత వాళ్ళిద్దరి మాటలకూ చిన్నబోయింది. అక్కణ్ణుంచి లేచి, వంట చేసి ఎనిమిది కల్లా  అత్తా మావలకి భోజనం వడ్డించింది. తొమ్మిది కాగానే వాళ్ళిద్దరూ పిల్లల బెడ్ రూమ్ లో డబుల్ కాట్ పై పడుకుని నిద్రపోయారు.

తొమ్మిది దాటాక కవిత భర్త శ్రీపతి, కొడుకూ, కూతురూ వచ్చారు. అంతా భోజనాలు చేసి సర్దుకుని పడుకు నేటప్పటికి కవితకి రాత్రి పదకొండయ్యింది. పిల్లలు  హాల్లో దీవాన్ పై ఒకరూ, సోఫాలో ఒకరూ పడుకున్నారు.

కవిత అత్తగారు మణెమ్మ, మావగారు వెంకట్రావు గారూ హైదరాబాద్ వచ్చి రెండు నెలలయ్యింది. వెంకట్రావు గారు హై స్కూల్ టీచర్ గా చేసి పదేళ్ళ క్రితం రిటైర్ అయ్యారు. వారికి   పశ్చిమ గోదావరి కోపల్లె లో సొంతిల్లూ, ఇద్దరి పేరా చెరో రెండెకరాల పొలమూ ఉంది. కొడుకు లిద్దరి దగ్గరా రెండు మూడు నెలలు ఉంటూ మధ్యలో సొంతూరికి పోయి పొలాల పంటలూ, రాబడీ అవీ చూసుకుంటూ ఉంటారు.

అటూ ఇటూ తిరగడం ఎందుకు ? మొత్తానికి వచ్చెయ్యమని కొడుకులిద్దరూ చెప్పారు. వెంకట్రావు గారు సరేనన్నారు. కానీ మణెమ్మ గారు ఒప్పుకోలేదు. “పూర్తిగా ఇక్కడే ఉంటే మనకొచ్చే ఆదాయం లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటే మనకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుంది” అని భర్తకు బోధించిందావిడ. దాంతో వెంకట్రావు గారు “చూద్దాం లెండర్రా ! మాకింకా ఓపికుంది కదా ” అని సమాధాన పరిచారు కొడుకుల్ని.

మణెమ్మ వెంకట్రావుల తొలి సంతానం కూతురు రాధ.  ఆమె భర్త పెద్ద పెద్ద బిల్డింగు కాంట్రాక్టులు చేసే సంస్థ కి అధినేత. అల్లుడు బాగా ఆస్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడని భారీ గానే పెళ్లి చేసారు వెంకట్రావు దంపతులు.  పెద్ద కొడుకు, కవిత భర్త శ్రీపతి ఓ ప్రైవేటు కాలేజిలో మాథ్స్ లెక్చరరు. ట్యుటోరియల్  సెంటరులో కూడా పని చేస్తాడు.  అతని కొడుకూ, కూతురూ  ఇంజనీరింగ్ పూర్తి చేసి టెంపరరీ ఉద్యోగాలలో చేరారు. కూతురు పెద్దది. ఇప్పుడా  పిల్ల పెళ్లి చెయ్యాల్సి ఉంది. కొడుకు చిన్నవాడు. వెంకట్రావు గారి చిన్నకొడుకు రఘు విజయవాడలో ఒక ఫార్మా కంపెనీ లో కెమిస్ట్ గా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరూ కొడుకులే.

ఒకరోజు ఉ దయం టిఫిన్ లయ్యాక, పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక తండ్రి దగ్గరి కొచ్చి కూర్చున్నాడు శ్రీపతి. కవిత గుడికి వెళ్ళింది. ఏదో చెప్పాలని వచ్చిన కొడుకు వైపు చెప్పమన్నట్టు చూశారు వెంకట్రావు గారు.

” నాన్నా!అమ్మాయి ఉద్యోగం చేస్తున్నాకానీ, కట్నాలు బాగానే అడుగుతున్నారు. మారేజీ బ్యూరో  వాళ్ళు  వివరాలలో కట్నం ఎంతిస్తారు అని కూడా వ్రాయమంటున్నారు. సొంతిల్లు కట్టుకునేసరికి పిల్ల లెదిగిపోయారు. ఎక్కువగా దాచలేక పోయాను నాన్నా ” అన్నాడు శ్రీపతి.

“అమ్మాయిలు తక్కువున్నారంటారు. బోలెడు డిమాండ్ అంటారు. అయితే మనదాకా వచ్చేసరికి కట్నాలు తప్పవంటావా ?” మణెమ్మ గారు నవ్వింది.

“పెళ్లి ఖర్చు నేనుసర్దుకుంటాను, అయితే మీరు నాకొక సాయం చెయ్యాలి. మీ పొలం మీ స్వార్జితం. మాకు హక్కు లేదు. అడగ కూడదు. అయినా అడుగుతున్నాను. మీ రెండెకరాల్లో ఒకటి మీ తదనంతరం నాకు రాస్తే అది అమ్మాయికి కట్నంగా ఇస్తానని చెప్పుకుంటాను. అలా  చేస్తే కాస్త మంచి సంబంధం వస్తుంది కదా నాన్నా” నెమ్మదిగా అడిగాడు శ్రీపతి.

చెట్టంత కొడుకు అలా అడగ్గానే తండ్రి ప్రాణం కొట్టుకు లాడింది. కొడుకు వీపు నిమురుతూ ప్రేమగా ఏదో అనబోయారు.

కరివేపాకు తుంపి బాక్స్ లో వేస్తున్న మణెమ్మ గారు దాన్నలాగే వదిలేసి గబుక్కున వచ్చి భర్త పక్కన కూర్చుంది.

“ఇదిగో అబ్బాయ్! రోజులు బాగా లేవు.ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ మీకు రాసి కూచుంటే రేపు మాకు అవసరం వస్తే ఎవరు చూస్తారు ?” అడిగింది మణెమ్మ గారు కరుగ్గా, భర్త నోరు విప్పే అవకాశం ఇవ్వకుండా.

“ అదేంటమ్మా ! తమ్ముడూ నేనూ మిమ్మల్ని చూడకుండా వదిలేస్తామా ? అంత భయం ఎందుకమ్మా ? నాన్నగారికి పెన్షన్ కూడా వస్తుంది కదమ్మా !” ఆశ్చర్యం, అవమానం కలగలిసిన గొంతుతో అన్నాడు శ్రీపతి.

మణెమ్మ గారు కొడుకు మొహం చూడకుండా భర్త వైపు చూస్తూ ,” ఆ పెన్షన్ ఏ మూల కొస్తుందనుకున్నావ్? మాకు తిరగడానికి  చార్జీలకే అయిపోతాయి. ఇంకా ఆ పొలం పంట నామ మాత్రమే. అయినా ఆ పొలం మాది. అమ్మేసుకుని ఖర్చు పెట్టుకుంటాం. మీ ముగ్గుర్నీ ప్రయోజకుల్ని చెయ్యడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడయినా సుఖ పడదాం అనుకుంటున్నాం. ఆ పొలం మీద ఆశలు పెట్టుకోకండి” అనేసింది ముందే  ఆలోచించి పెట్టుకున్నట్టుగా.

హతాశుడయిన శ్రీ పతి తండ్రి వైపు చూశాడు. ఆవిడ మాటకు ఎదురు లేనట్టు తండ్రి మౌనంగా పేపర్ లో తల పెట్టుకోవడంతో మెల్లగా లేచి వెళ్ళిపోయాడతను.

రెండు రోజులు చాలా బాధ పడ్డాడు శ్రీపతి. మనవరాలికైనా ఆస్తి ఇద్దామని వాళ్ళకీ వయసులో కూడా అనిపించకపోవడం, మేమే అమ్మేసుకుని సుఖపడతాం అనడం అతనికి జీర్ణం కావడానికి వారం రోజులు పట్టింది. తర్వాత పోనీలే, వాళ్ళ భవిష్యత్తుకై వాళ్ళు జాగ్రత్తపడడం న్యాయమేనేమో ! అనుకుని సర్దుకున్నాడు.

ఒక రోజు కొడుకూ, మనవలూ ఉద్యోగాలకి వెళ్ళాక, కోడలు కవిత కూరలకి వెళ్ళాక భర్త నడిగింది మణెమ్మ

“ఏవండీ ! అమ్మాయికి పెళ్లి రోజుకి పాతిక వేలూ పంపారు కదా !’

” ఆ ! ఆ !  బ్యాంకు ఎకౌంటు కి ట్రాన్స్ ఫర్ చేశాను ” అన్నాడాయన.

“మరి మధ్యాన్నం ఫోనులో అమ్మాయి ఆ మాట అనలేదే ! పంపారో లేదో అని నేనూ అడగలేదు ”

అందావిడ.

“వాళ్లింకా చూసుకోలేదేమో ! అల్లుడి గారికి వచ్చే బిజినెస్ లాభాల్లో ఇదొక లెక్కా ఏమిటి? మురిసిపోవడానికి !” అన్నాడు వెంకట్రావు గారు  కించిత్ గర్వంగా.   ఆయన మొహం చూస్తూ ఉన్న మణెమ్మ గారికి కూడా సంతోషం కలిగింది. ‘ అమ్మాయి జాతకురాలు ‘ మనసులో మురుసుకుంటూ “సరి.. సరి ..చిన్నాడికి చెప్పండి హెల్త్ చెకప్ చేయించుకోవాలి పది వేలు పంపమని ” అంది నవ్వుతూ.

“అమ్మాయి మొన్నొచ్చినప్పుడు నల్లపూసలు పాతబడ్డాయి మార్చమంది. నా దగ్గరో పది వేలు న్నాయి మరో పది వేలేస్తే గానీ కొత్తవి రావు” అంది మళ్ళీ వివరంగా

“వాడు ఫోన్ చేసినప్పుడు చెబుతాన్లే ” అన్నాడు వెంకట్రావు గారు.

“అవసరం అని చెప్పండి. ఈ కారణం చెప్పేరు సుమా! మీరసలే అయోమయం !” అందావిడ అనుకూలుడైన భర్తను మురిపెంగా చూస్తూ.

ఆ తర్వాతి నెలలో చిన్న కొడుకు పంపిన డబ్బుతో కూతురికి నల్లపూసలు కొని ఆనందంగా నిట్టూర్చింది మణెమ్మ.

“ఈరోజు నా పుట్టిన రోజు నానమ్మా !” అని కాళ్ళకు దండం పెట్టిన మనవరాలికి ఇద్దరూ చెరో వందా పెట్టి దీవించారు మణెమ్మ దంపతులు.

“దసరా వస్తోంది కదా! మేం వచ్చి మూడు నెలలయ్యింది కూడా !చిన్నాడి దగ్గరికి వెళతాం. కనక దుర్గమ్మ ఉత్సవాలు చూస్తాం ” అన్న తల్లి దండ్రుల మాటకు “మీ ఇష్టం అమ్మా ! మీకెప్పుడు రావాలనుంటే అప్పుడు రండి మళ్ళీ !” అన్నాడు శ్రీపతి ఆప్యాయంగా.

“అలాగే నాన్నా! “అన్నారు వాళ్ళు.

అనుకున్నట్టుగానే చిన్నకొడుకు ఇంటికి బయలు దేరారు ఇద్దరూ. చిన్నకొడుకు రఘు విజయవాడ బస్ స్టాండ్ కొచ్చి నిలబడ్డాడు. ఆటోలో ఇంటికి తీసుకు వెళ్ళాడు. మనవలిద్దరూ “ఏం తెచ్చావ్ నానమ్మా మా కోసం?” అంటూ వాటేసుకున్నారు.

“మేమేం తెస్తాం నాయనా! ముసలాళ్ళం. ఇక మీరే ఉద్యోగాలు చేసి మాకు తేవాలి ” అంటూ మనవల్ని ముద్దు పెట్టుకుంది మణెమ్మ.

“అయ్యగారి ఎంసెట్ రాంక్ ఎంతట?”  చిన్న మనవడి భుజంమీద చెయ్యి వేసి అడిగారు తాత వెంకట్రావు గారు.

“చాలా పెద్ద ర్యాంకు తాతయ్యా ! మీరు తట్టు కోలేరు. అందుకే చెప్పను” అన్నాడు చిన్నాడు అల్లరిగా నవ్వుతూ .

“చూడండి మావయ్యా ! అన్నయ్య ఫ్రీ తెచ్చుకున్నాడు నాకు రాలేదే అని బాధ లేదు వీడికి” అంది చిన్న కోడలు సునీత నవ్వుతూ.

“నేనూ ముందు పుట్టి ఉంటే నాకూ వచ్చేది మంచి ర్యాంకు. వెనక పుట్టిన వాడి  ర్యాంకు కూడా వెనకే మరి ..”అమ్మ జడ లాగుతూ అన్నాడు వాడు.

“వీడుంటే నవ్వులేనే తల్లీ !” అంది మణెమ్మ మనవడి బుగ్గలు పిండుతూ.

ఆ రోజు ఆదివారం. ఉరుకులూ పరుగులూ లేవు. అంతా తీరికగా వంటయ్యాక భోజనాలు చేసి పడుకున్నారు. సాయంత్రం టీలు తాగుతుండగా గుర్తొచ్చింది మణెమ్మ గారికి.ఆత్రంగా అడిగేసింది.

“సునీతా! నువ్వు అమ్మా నాన్నా సీరియల్ చూస్తావా ? మీకసలు వస్తుందా ?”

“ఎందుకు రాదత్తయ్యా! నేను ఒక్క దాన్నే చూస్తాను ” అంది సునీత

“కడుపు తరుక్కు పోతుందనుకో చూస్తుంటే. మీ మావయ్యా కూడా చూస్తారు” అంది మణెమ్మ

“త్వరగా వంట చేసేసుకుని చూద్దాం” అంది సునీత పనులు మొదలు పెడుతూ . “అల్లాగే ” అంటూ కోడలు పని చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంది మణెమ్మ.

ఆ రోజు సీరియల్ చూశాక “ అమ్మయ్య ఇక బెంగ లేదు రోజూ చూడచ్చు”  అంది మణెమ్మ కోడలితో నవ్వుతూ. సునీత కూడా నవ్వింది.

దసరా ఉత్సవాలకి మణెమ్మ దంపతులిద్దరూ దుర్గ గుడికి రోజూ వెళ్లారు. విజయ దశమి రోజు అంతా వెళ్లి అమ్మ వారి దర్శనం చేసుకున్నారు. “అమ్మా నాన్నా” సీరియల్ క్రమం  తప్పకుండా ముగ్గురూ చూస్తున్నారు.తీరిక వేళల్లో దానిపై చర్చలు కూడా జరుగు తున్నాయి. ఈ సీరియల్ కధలో ముసలి దంపతుల్ని నిర్లక్ష్యం చేస్తున్న కొడుకూ కోడళ్ళ లా కాకుండా మా కొడుకులూ కోడళ్ళూ మంచి వాళ్ళు అని అత్తగారు కానీ మావగారు కానీ అంటే బావుండును అనిపించేది సునీతకి. కానీ వాళ్లి ద్దరూ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించాలేదామెకు.

నెల గడిచింది. రఘు చిన్న కొడుక్కి ఎక్కువ ఫీజు కట్టి ఇంజనీరింగ్ సీట్ తీసుకోవలసి వచ్చింది. బ్యాంకు లోన్ తీసుకోవాలనుకున్నాడు రఘు. అతనిది ప్రైవేటు ఉద్యోగం కాబట్టి ప్రాపర్టీ ఉన్న వ్యక్తి హామీ కావాలని చెప్పారు. రఘుకి సొంతిల్లు కూడా లేదు. అన్న శ్రీపతి కి ఫోన్ చేసి సలహా అడిగాడు. అప్పుడు చెప్పాడు శ్రీపతి. “నాన్నగారు తన పొలం ఎప్పుడైనా అమ్ముకుంటానన్నారు. కాబట్టి నువ్వు అమ్మని హామీ పత్రం పై సంతకం పెట్టమని అడుగు. అమ్మ పేర్న రెండెకరాలున్నాయి కనక ఆమె పెట్టొచ్చు” అని.

తల్లినీ తండ్రినీ కూర్చోబెట్టి చెప్పాడు రఘు. “అమ్మా ! బ్యాంకు లోన్ పెడదా మనుకుంటున్నాను. నీ పేరున పొలం ఉంది కదా నువ్వు హామీ సంతకం చెయ్యమ్మా !”

కొంతసేపు వెంకట్రావు గారూ, మణెమ్మ గారూ మాట్లాడలేదు

“వాడికుద్యోగం వచ్చాకా ఆ లోన్ వాడు తీర్చేసుకుంటాడు. ఈ లోగా నాకు వీలయితే నేనూ, పెద్దాడి కుద్యోగం వస్తే వాడూ తీ ర్చేస్తాం. మీకే ఇబ్బందీ కలగనివ్వనమ్మా ” అన్నాడు రఘు

‘నువ్వే సమాధానం చెప్పగలవు’ అన్నట్టు భార్య వైపు చూశారు వెంకట్రావు గారు. మణెమ్మ గారు గొంతు సవరించుకుని మొదలు పెట్టింది.

“నీకు అవసరం ఉండి అడిగావు బానే ఉంది చిన్నోడా! కానీ ఆ పొలం రెండెకరాలూ తల్లి ఆస్తి కాబట్టి అక్కకి వెళ్తాయిరా ! దానికి ఇలాంటి లింకులు పెడితే బావుండదు. బావ ఏమన్నా అనగలడు కూడా  ! అంచేత ఇంకెవరినన్నా అడుగు నాన్నా” అని ముగించింది.

తల్లి మాటలకి రఘు షాక్ తిన్నాడు. “అమ్మా ! అక్కకి నాన్నగారు  రెండెకరాల పొలం, కట్నం, బంగారం ఇచ్చి పెళ్లి చేసారు. లాంచనాలకనీ, డెలివరీలకనీ, అక్క పిల్లలకనీ బాగానే ఖర్చు పెట్టాం. నీ పొలం కూడా అక్క కే ఇస్తావా ?” తల్లి కడుపులోని ఆలోచనకు ఆశ్చర్య పోతూ అన్నాడు రఘు.

“మరి నా పుట్టింటి వాళ్ళిచ్చింది అక్కకి ఇవ్వవలసిందే కదా నాన్నా !” అంటున్న అమ్మ అమాయకమైన మొహం వెనక, మాటల వెనక రఘు కి తొలిసారిగా మరో వ్యక్తి కనిపించినట్లయ్యింది. కాస్తంత తమాయించుకుని మళ్ళీ అన్నాడు.

“అమ్మా ! అక్క మా ఇద్దరి కన్నా ధనవంతురాలు, మంచి స్థితి లో ఉంది. మా ఇద్దరికీ ఉద్యోగాలే తప్ప …”

” అది దాని అదృష్టం ! అలా అని మనం ఇవ్వవలసింది ఇవ్వక పోవడం తప్పు కదా రఘూ !” అంది మణెమ్మ అనునయంగా. తియ్యని అమ్మ మాటల వెనక ఏదో చేదు నెమ్మదిగా తోచినట్టయింది రఘుకి . గొంతులో బాధ సుడులు కట్టింది.అవమానంతో మాట పెగిలి రాలేదు. అమ్మనీ నాన్ననీ కొడుకులు చూడాలి.ఆస్తులూ, నగలూ కూతుళ్ళ కివ్వాలా ? ఇదేం న్యాయం ? అమ్మా నాన్నల కింత పక్ష పాతమా !కొంత సేపటికి అతని ఆక్రోశం చల్లారింది. వివేకం మేల్కొంది.

“సరే అమ్మా !ఎవరినైనా అడుగుతాను ” అని లేచాడు.

నారాయణ అనే  మిత్రుడొకరు తన ఫ్లాట్ పేపర్లు తెచ్చిచ్చి షూరిటీ సంతకం చెయ్యడంతో రఘు  పనయ్యింది.

“ఒరేయ్ ! నువ్వు నాకు అమ్మ కన్నా ఎక్కువరా !” అంటూ ఆ మిత్రుణ్ణి కౌగలించుకున్నాడు రఘు. “అంతంత అతిశయోక్తులు అవసరమంటావా!” అని నవ్వేశాడతను.

రఘు చిన్న కొడుకు ఇంజనీరింగ్ కాలేజిలో చేరాడు. మరో నెల గడిచింది. అత్తా మావలతో కలిసి సునీత రోజూ చూస్తున్న సీరియల్ లోని వృద్ధ దంపతుల కష్టాలూ, కన్నీళ్ళూ సాగుతూనే ఉన్నాయి.   ఒక రోజు సునీత తమ్ముడు హర్ష ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసాడు రఘుకి. ” బావా నేను ఫ్యామిలీతో ఈ ఆదివారం వస్తున్నాను. ఒక వారం మీ దగ్గర ఉంటాం. తర్వాత అమ్మ దగ్గరికి అంతర్వేదిపాలెం వెళతాం. తర్వాత మా అన్న ఇంటికి వైజాగ్ వెళతాం.తిరుపతి కూడా వెళ్ళాలి. ఈ మొత్తం ప్రోగ్రాం లో మీ ఫ్యామిలీ అంతా నాతో ఉండాలి. మీకు వీలు కాదంటే మా అక్కయినా నాతో ఈ నెలంతా ఉండాలి. ఇది నా అభ్యర్ధన, ప్రార్ధన ఇంకా ఇంకా ..” అన్నాడు ఒక్క గుక్కలో.

“సర్లే చూద్దాం! ముందు రావయ్యా బామ్మర్దీ !” అన్నాడు రఘు ప్రేమగా ఫోన్ పెట్టేస్తూ.భార్యకి హర్ష టూర్ గురించి చెప్పాడు.

సునీత “అబ్బో ! నేనేమన్నా ఎడపిల్లననుకుంటున్నాడా, వీడితో తిరగడానికి !” అంది సంబరంగా.

తర్వాత కొడుకులిద్దరికీ ఈ సంగతి చెప్పింది.”వెళ్ళమ్మా ! ఫర్వాలేదు.  మేం మేనేజ్ చేసుకుంటాం ” అన్నారు వాళ్ళిద్దరూ ఉదారంగా. సునీత పొంగి పోయింది. ” నా బంగారు కొండలు ” అంటూ కొడుకులిద్దర్నీ ముద్దు పెట్టు కుంది.

రఘు మాత్రం “మరి అమ్మా, నాన్నా ఎలా ? హర్ష వారం రోజులున్నాక అతనితో నువ్వెళ్ళి పోతే ఎలా ?అమ్మ కసలే ఇంకొకరింట్లో పని చేయడం అలవాటుండదు ” అంటూ కొంతసేపు ఆలోచించాడు. “ఒక నెల మా ఊరికి వెళ్లి రమ్మంటాన్లే” అన్నాడు చివరికి. “మా తమ్ముడు వెళ్ళగానే పిల్చేద్దాం” అంది హుషారుగా సునీత.

తల్లికి తండ్రికి పరిస్థితి అంతా వివరించి అన్నాడు రఘు “ఒక్క నెల మన ఊరిలో పనులుంటే చూసుకుని వెంటనే వచ్చెయ్యండి నాన్నా!”

అలాగే లేరా ! అంటారేమో అనుకున్న తల్లీ, తండ్రీ మౌనంగా ఉండిపోవడంతో ఖిన్నుడయ్యాడు రఘు. ఏం మాట్లాడాలో తెలీలేదు. ‘ నాన్న గారు చదువుకున్నవారు అయినా అర్ధం చేసుకోకుండా ఇలా నిష్టూరంగా చూడడం ఏంటి ?’  అని బాధ పడుతూ ఊరుకున్నాడు రఘు.  అత్తా మావలు అలిగినట్టుగా తమ నలుగురితో  సరిగా మాట్లాడకుండా ముభావంగా ఉండడం సునీతకి ఇబ్బందిగా ఉంది. గిల్టీగా కూడా ఉంది.’ ఈ హర్ష గాడు ఇప్పుడే రావాలా ?’ అనుకుంది బాధగా.

హర్ష ఫ్యామిలీ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఇల్లంతా సందడిగా మారిపోయింది. వారం తర్వాత హర్ష ఫ్యామిలీతో సునీత ప్రయాణానికి సిద్ధమైంది.

మణెమ్మ, వెంకట్రావు గారూ కుడా తమ ఊరికి వెళ్ళడానికి తమ బాగ్ లు సర్దుకున్నారు. హర్ష ఫ్యామిలీతో  షాపింగ్ కి  వెళ్ళాడు.

సుజాత మంచి చీరా, జాకెట్టు బొట్టు పెట్టి అత్తగారికి ఇస్తూ “మళ్ళీ వచ్చెయ్యండి” అంది ప్రేమగా.”వస్తాం. వెళతాం. మీ ఆనందానికి అడ్డం రాము లేమ్మా ” అంది మణెమ్మ మొహం గంటు పెట్టుకుని

సునీత చిన్నబోయి బిక్క మొహం వేసింది.

ఇంతలో టీ వి లో “ అమ్మా నాన్నా” సీరియల్ మొదలయ్యింది.

“అమ్మ ఆటో తీసుకొచ్చాను” అంటూ వచ్చాడు రఘు.

పిల్లలింకా రాలేదు. మావగారు బాగ్ అందుకుని సోఫాలోంచి లేచారు.  “నడవండి.ఆ సీరియల్ చూసి చూసి ..మన బతుకూ అలాగే అయ్యింది.” అంది  మణెమ్మ గారు  చెప్పులేసుకుంటూ.

ఆ మాట విన్న సునీత అవాక్కయ్యింది.

రఘు సూట్ కేస్ ఆటోలో పెట్టడానికి వెళ్ళాడు.తల్లి అన్న మాట వినలేదు. సునీత కూడా అత్తా మావలతో పాటు బైటికి వచ్చి చెయ్యి ఊపింది. వాళ్ళ నెక్కించుకున్న ఆటో బయలు దేరింది.  లోపలికి వచ్చి సోఫాలో కూలబడింది సునీత. రెండు నెలలుగా రెండుపూట్లా టిఫిన్లు చేస్తూ, ప్రతి పూటా ఏం కూర వండను? అని అత్తా మావలని అడిగి వంట వండింది. పిల్లల్ని కూడా తప్పించి పళ్ళూ , స్వీట్లూ వాళ్ళకే పెడుతూ తను చేసిన సేవల్ని గుర్తించక పోగా, వెళుతూ, వెళుతూ   అత్తగారన్న మాటల్ని తలచుకుంది.

‘ నిజంగానే అత్తా మావల జీవితం ఈ సీరియల్ లా ఉందా ?’ అనుకుందామె అయోమయంగా టీ.వీ.కట్టేస్తూ.

**** (*) ****