ఎడిటర్స్ పిక్

విశ్వనాథ సత్యనారాయణ

మే 2017

నుషులను అర్థం చేసుకోవటమూ, అపకారం జరిగితే మనసులో పెట్టుకోకుండా ఉండటమూ, మననీ ఎదటివారినీ కూడా క్షమించుకోగలగటం విశ్వనాథ గారి రచనల నుండి నేర్చుకావొచ్చు. చుట్టూ ఉన్నదాన్ని దాటి ముందుకూ నేలబారుతనాన్ని మించి ఎత్తుకూ చూడగల రచయిత. తనదైన తాత్విక దృక్పథం అతి బలవత్తరంగా ఉన్నప్పటికీ దానికి అవతల ఉన్నవారిపట్లా తీర్పు చెప్పేయరు. మానవీయమైనదంతా ఆయనకు పట్టుబడింది… అతిమానుషమైన దాని కోసం చేసే సాధన లౌకికానికి అడ్డురాలేదు. ప్రపంచాన్ని, కాలగమనాన్ని అంగీకరించేశాంతిని ఆయన వదులుకోలేదు. గిరికుమారుని నవయవ్వన ప్రేమగీతాలనుంచి, కిన్నెరసాని పరుగులమీదుగా ప్రవహించి, భ్రష్టయోగి తత్వాన్ని చూపిన విశ్వనాథ గారి అసమాన కవితా ప్రతిభ, నవరసాల మేళవింపుతోసాగే ఆయన కాల్పనిక సృజనలను స్మరిస్తూ ఈ నెల ఎడిటర్స్ పిక్.

***

“సగరుడు రాముని వంశంలోని రాజే! అతను రాజ్యం చేసినదీ అయోధ్యే. అందుకే కథ మొదలుపెడుతూనే, “భూమి అనే స్త్రీకి పెట్టిన పునుగు బొట్టు లాంటిది, అయోధ్య అని, ఒక చక్కని నగరం ఉంది. మీకు తెలుసా?” అని విశ్వామిత్రుడు అడుగుతాడు. “ఓ మాకు తెలుసు!” అని నవ్వుతూ జవాబిస్తారు రామలక్ష్మణులు. “ఓహో మంచిది, మంచిది! అయితే కథలోని మేలు సగం మీకు తెలిసిపోయినట్టే! అనగ అనగ సగరుడనే రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు.” ఇలా మొదలవుతుంది. తెలుగువాళ్ళు కథ చెప్పడంలోని ఒడుపంతా ఇందులో ఒడిసిపట్టారు విశ్వనాథ. ఈ కాలంలో ఎంతమంది పెద్దవాళ్ళు పిల్లలకి యిలా కథలు చెప్తున్నారు?”…

విశ్వనాథ కవితా వైభవం గురించి భైరవభట్ల కామేశ్వరరావుగారి వ్యాసం “నేనెఱిగిన విశ్వనాథ”. (పొద్దు పత్రిక)


యన మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఈ చిన్ని ఉదాహరనే చాలు.

బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. ”నీ పేరేమిటి ?” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది.

”ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా?” అనడిగాడు.

”ఆయనతో నీకేం పని” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన.

”పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే!” అన్నాడా అబ్బాయి తాపీగా.

అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది.

”వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది” అని గయ్యిమన్నారు.

దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి ”లేరా అబ్బాయ్! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా!“ అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.

విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ!

“మన మహనీయులు” బ్లాగ్ లోనుంచి ఒక వ్యాసంలోని భాగం. విశ్వనాథ గీవిత, రచనా సంగ్రహం, కొన్ని సరదా సందర్భాలు, ఇతర విశేషాలు కలగలిపిన వ్యాసం ఇది. పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవొచ్చు.


న శిష్యుడి ఇంట్లో పెళ్ళి సందర్భంగా, వధూవరులని ఆశీర్వదిస్తూ ఆయన రాసిన పద్యాల కథా కమామీషూ… ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాసం “విశ్వనాథ: వివాహాశీస్సులు” (ఈమాట).


కవి పూర్వ జన్మలో ఒక యోగి-ట. గొప్ప యోగదీక్షతో సమాధిలో నిర్వికారమైన పరబ్రహ్మం గురించి తపస్సు చేస్తున్న వేళ, ఒక పట్టరాని సౌందర్య పిపాస (అంటే సౌందర్యాన్ని తాగాలనే విపరీతమైన కాంక్ష) తగులుకొని ఆ యోగి తపస్సు భంగమైపోయింది. అప్పుడా భ్రష్టయోగి కవిగా జన్మించాడట. తపోదీక్షలో ఉన్న తన మనసు ఎలా ప్రాపంచిక విషయాలపై మోహం చెంది, యోగ భ్రష్టుడై. తాను కవిజన్మ పొందాడో మరొక మూడు పద్యాలలో వర్ణించే పద్యకవిత.

“భ్రష్టయోగి”. ఇది విశ్వనాథ సత్యనారాయణగారు 1926కి పూర్వం రాసింది, అంటే అతని తొలినాళ్ళ కవిత. కవిగా తనని తాను కనుగొంటున్న కొత్తలో రాసుకున్న కవితన్నమాట. ఒకవైపు గాఢమైన ఆధ్యాత్మికత, మరో వైపు తీవ్రమైన భావోద్రేకం – ఈ విచిత్రమైన అవస్థలోంచి తాను కవిగా అవతరించానని తెలుసుకున్నారతను. ఒక రకంగా ఇది సిసలైన ఏ కవికైనా వర్తించే విషయమే. కవికి లోచూపు, వెలిచూపూ రెండూ ముఖ్యమైనవే కదా! (భ్రష్టయోగి పుస్తక సమీక్షనుంచి ఒక భాగం)

పూర్తి సమీక్ష ఇక్కడ.


ఆన్లైన్ లో ఆయన నవలలు ఇక్కడ చదవవచ్చు.


విశ్వనాథ గారి గురించి కిరణ్ ప్రభ టాక్ షో.