ఎడిటర్స్ పిక్

ఒకే ఒక్కడు ఇస్మాయిల్

ఏప్రిల్ 2017


భావచిత్రాల ద్వారా బలమైన అనుభూతిని అందించే ప్రతిభావంతులైన కవులలో ఇస్మాయిల్ ఒకరు. దృశ్యవర్ణనకు కవితాత్మకతను జోడించి, దాని మనోహరత్వాన్ని పాఠకుల అంతరంగాల్లో రిజిస్టర్/ఎస్టాబ్లిష్ చేయడమనే కళ ఆయనకు బాగా తెలుసు. దీన్ని సాధించటం కోసం ఏవైనా ప్రత్యేకమైన, అరుదైన పదాలను ఏరి కూర్చుతాడా అంటే అదీ లేదు. మామూలుగా అందరం మాట్లాడుకునే అలతి అలతి పదాలతోనే అలవోకగా సాధిస్తాడు ఆ విద్యను. భావాలను పదాల ద్వారా అద్భుతంగా దృశ్యమానం చేయటంలో ఆయన దిట్ట. లేదా దీన్నే దృశ్యాలు మెదడులోకి చొరబడేలా వాటిని పదాల్లో పొదగడం అనవచ్చునేమో. ఈ రెండు వాక్యాల మధ్య స్వల్పమైన భేదం ఉంటే ఉండొచ్చును కాని, ఇటువంటి నేర్పు ఉన్నవాళ్లకు హైకూలను రాయటం సులభం అవుతుందనుకుంటాను. అయితే హైకూలను రాయటానికి అదొక్కటే సరిపోదు. ఈ కింది రెండు హైకూలను గమనించండి. రెండవ దాంట్లోని ఊహాశక్తి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.

కిటికీలోంచి చూస్తే వెలుతురు నిండిన బెజ్జాలతో
పిల్లంగోవిలా ఊళ వేసుకుంటూ దూసుకుపోతోంది రైలు

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు

అందరిలా కాకుండా విషయాలను నిత్యనూతనంగా, విలక్షణంగా దర్శించటం కొందరు కవులకే సొంతమైన వరం. ఇస్మాయిల్ కవిత్వంలో ఇది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.

తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని పీకిపారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)

ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి ప్రపంచంలోంచి నిష్క్రమించాడనో, అదృశ్యమయ్యాడనో అంటాం సాధారణంగా. కాని, ఇక్కడ ఆ పిల్లే ప్రపంచపు ముల్లును పీకి పారేసిందట. ఇట్లా వ్యత్యస్తమైన ఊహ చేయటంలోనే ఉంది కవి ప్రతిభ.

ఇద్దరికీ సంబరమే
సముద్రపొడ్డున జనానికీ
జనాల ఒడ్డున సముద్రానికీ

ఇందులో కూడా జనాల ఒడ్డున సముద్రం అనేది విలక్షణమైన ఊహ. కవితా వాక్యాల్లో జీవన తాత్వికతను రంగరించటం ఇస్మాయిల్ కవిత్వానికి వున్న మరో మంచి పార్శ్వం.

ఇస్మాయిల్ గారి గురించి నెట్లోనూ, ఇతర పాతపత్రికల్లోనూ వచ్చిన వ్యాసాల, ఆడియోవీడియోల సమాహారమే ఈ నెల వాకిలి ఎడిటర్స్ పిక్.

***

భాషని శుభ్రపరిచి , తెలుగు కవిత్వానికి ఒక నిసర్గ సౌందర్యాన్ని తెచ్చిన ఆయన పదహారేళ్ళకి తన మొదటి కవిత రాసారు. తర్వాత కవిత్వంలో తనదైన మార్గాన్ని అన్వేషించుకుంటూ పదహారేళ్ళపాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ తపస్సులో తెరుచుకున్న అంతర్నేత్రాలతో ఆయన లోకాన్ని దర్శించారు. ఆ చూపులోని కరుణకి లోబడి సమస్త ప్రకృతీ మౌనంగా తలవంచుకుని ఆయన కవిత్వంలోకి ప్రవేశించింది. “దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది” అని కృష్ణ శాస్త్రి స్వేచ్ఛా గీతానికి సరిహద్దు గీయగల తాత్వికుడు, “ఇరుచెంపల్నీ ఒరుసుకుంటూ పారే ప్రియురాలి కురుల సెలయేరులా” అనగల భావుకుడూ, “అక్షరారణ్యాల్ని విస్తరింపజేసాడీ కవి, ఒక మొక్క నాటితే సంతోషిద్దును” అని ఛలోక్తులు విసరగల చతురుడు , “నేనొక గబ్బిలాయిని/పాత స్నేహపు చూర్లు పట్టుకు వేలాడతాను” అని ప్రకటించిన స్నేహశీలి, వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో ఒకే ఒక్కడు ఇస్మాయిల్. జీవితం మీద అంతులేని ప్రేమని కలిగిస్తాయి ఈయన కవితలు…

- మూల సుబ్రహ్మణ్యం

***

1. ఇస్మాయిల్ రచనలు కొన్ని (ఈమాట పత్రిక).

2. “ఇస్మాయిల్ తో ఇష్టంగా…” అనే శీర్షికతో సారంగా పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాలు.

3. ఇస్మాయిల్ మిత్ర మండలి బ్లాగు.

4. ఈమాట ఇస్మాయిల్ ప్రత్యేక సంచిక.

5. మూల సుబ్రహ్మణ్యం వ్యాసం ‘ఆకుపచ్చని కవి’.

6. ఇస్మాయిల్ గారి కవిత “గోదావరి టాం టాం”

7. వీడియో.

**** (*) ****