నుడి

నుడి – 18

ఏప్రిల్ 2017

Nudi 18 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-17 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.
ఈ సారి ‘నుడి’ని ఒక్కరు కూడా ఆల్ కరెక్ట్ గా పూరించలేదు. ఒక తప్పుతో పూరించినవారు ఎనమండుగురు. వారు:

1. రవిచంద్ర ఇనగంటి
2. కార్తీక్ చంద్ర పి. వి. ఎస్.
3. పి. సి. రాములు
4. తుమ్మూరి రామ్మోహన్ రావు
5. మమత
6. దేవరకొండ
7. టి. చంద్రశేఖర రెడ్డి
8. రమా దేవి

చాలా మంది 27 నిలువు దగ్గర తడబడ్డారు.

ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వాటికి వివరణలను చూద్దాం.

1 అడ్డం: ఇక్కడ అరకుక్క anagram. అందులోని అక్షరాలను మార్చితే ‘అక్కరకు’ వస్తుంది.
6 అడ్డం: హిందీ భాషలో సోనా = బంగారం. సోనా = పడుకోవాలి (హిందీలోనే).
9 అడ్డం: గుడి = దేవాలయము. దేవాలయము మైనస్ దేవా = లయము = సృష్టికి విరుద్ధమైనది.

12 అడ్డం: నక్కలు లోని మధ్యఅక్షరం ‘క్క’ బక్కచిక్కితే (వత్తును కోల్పోతే) అది ‘క’ గా మారుతుంది. ఫలితంగా నక్కలు నకలు అవుతుంది. నకలు = కాపీ.

14 అడ్డం: దహనమయ్యే = మండే (Mon day)
15 అడ్డం: ఒక = ఓ. కోయిల = పికము. తోక లేకుంటే పిక మిగుల్తుంది. ఓ + పిక = ఓపిక.
22 అడ్డం: రావాలి కాని ‘రా’లేదు అన్నాం కనుక, రావాలి మైనస్ రా = వాలి = వీరుడు.
24 అడ్డం: ఆమని = వ‘సంత’ము. అందులో మధ్యన వున్న సంత సమాధానం.
26 అడ్డం: ఆంగ్ల దారి = వే (way). బయట రెండు వైపులా ‘కారి’ని అమర్చితే వచ్చే కావేరి సమాధానం.
28 అడ్డం: కరాలు = చేతులు. కొసను ఖండిస్తే చేతు మిగుల్తుంది. చేతు = చేసెదను (గ్రాంథికంలో)
33 అడ్డం: పంది కామం మైనస్ మంది = పంకా. పంకాలు = బురదలు. అసంపూర్ణం అంటున్నాం కనుక, పంకా మిగుల్తుంది.
35 అడ్డం: కకకక = ‘క’లు. కలుపుట మైనస్ కలు = పుట = పేజీ.

36 అడ్డం: సమాధానమైన బోయీలు ఆధారంలో as it is గా ఉన్నదే కనుక, ఏ అక్షరాన్నీ రవ్వంతైనా మార్చకుండా జవాబును రాయాలి. కొందరు బోయిలు అని రాశారు. ఎక్కడైతే అక్షర/పద క్రీడ (wordplay) ఉంటుందో, అక్కడ అవే అక్షరాలను ఉపయోగించి సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది.

37 అడ్డం: గానం = పాట. తిరగేసిన గానం = టపా. కేక విశేషణం = గావు (గావుకేక అంటాం కదా). సులువుగా మైనస్ గావు = సులు. టపా + సులు = టపాసులు.

1 నిలువు: గౌరవం = మానం. అవమానం మైనస్ మానం = అవ. శిరస్సు = తల. అవ + తల = అవతల = అటు వైపు.

2 నిలువు: నా ఊహకు: ఇందులోని రెండవ గురువు (రెండు మాత్రల అక్షరం) ఊ. నా ఊహకు మైనస్ ఊ = నాహకు. దీన్ని తారుమారు చేస్తే వచ్చేది కుహనా = కపటమైన.

3 నిలువు: సగం అనుమానం = అను. అనుకోనిదే మైనస్ అను = కోనిదే. పైకి వచ్చింది (తారుమారైంది) కనుక ‘దేనికో’ వస్తుంది.
4 నిలువు: 100,000 = లక్ష. ణాణాణాణా = ‘ణా’లు. లక్ష + ణాలు = లక్షణాలు. వ్యాధి లక్షణాలు అంటాం కదా.
6 నిలువు: So = సో. సోరాములో ‘రా’ లేదు కనుక, మిగిలే సోము జవాబు.
8 నిలువు: బంగారం = కనకం. అసంపూర్ణం కాబట్టి కన వస్తుంది. కన = చూడ(గా) (గ్రాంథికంలో).

13 నిలువు: ఇక్కడ ఎనిమిది రకాల పుష్పాల పేర్లను ఇచ్చి, ఒకదాని పేరును బయటికి లాగమని అడగటం జరిగింది. ఆ ఎనిమిదింటిలో ఏదీ జవాబు కాదు. ఆధారంలో మరొక పువ్వు పేరు (కలువ) కూడా దాగివుంది – “మల్లికలు వచ్చి”లో. అయితే అది ఒకే పదంగా లేదు. రెండవ, మూడవ అక్షరాల మధ్య ఎడం ఉంది. దాన్నే గుర్తు పట్టాలి.

14 నిలువు: మంద = గుంపు. మందహాసం అన్నా, హాసం అన్నా నవ్వే.
15 నిలువు: దహించుకుపోయి = కాలి. సమాధానమైన ఓ బాలికాలో ‘కాలి’ కిందనుండి పైకి ఉంది.
16 నిలువు: జగడము = కలహము. శత్రువు = అరి. కలహ + అరి = కలహారి.

18 నిలువు: తోక లేకుండా దు‘న్ని’ = దు. అడ్డదిడ్డంగా ‘పోతున్న’ = న్నపోతు. దు + న్నపోతు = దున్నపోతు = మహిషం.

21 నిలువు: ఆల్కలీ (alkali) = క్షారం. మొదటి అక్షరం పొట్టిదైతే క్షరం వస్తుంది. క్షరం = నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. క్షయం అంటే కూడా నాశనం కాబట్టి, అక్షయంకు కూడా అదే అర్థం వస్తుంది.

27 నిలువు: దీన్ని చాలా మంది ఛేదించలేకపోయారు.
వేరైన, వేరుకు, వేళ్లుకు, వేరుగ, వేరుక, వేరులు, వేరయి – ఇన్ని రకాలుగా నింపారు. ఐదుగురు దీనికి సరైన సమాధానాన్ని రాశారు కాని, వేరే ఆధారాలకు జవాబులను తప్పుగా నింపారు.
ఈ ఆధారానికి సమాధానం వేర్వేరు. వివరణ చూడండి. భిన్నమైన = వేరు (different); మూలం = వేరు (root). వేరు + వేరు = వేర్వేరు.

32 నిలువు: ఇక్కడ ‘తాను బలి’ anagram కనుక, తాలిబను సమాధానం. కొందరు తాలిబాను అని రాశారు. ‘తాను బలి’ లోని అవే అక్షరాలను తారుమారు చేయగా వచ్చే ‘తాలిబను’ను సమాధానంగా రాయాలి. ఏ అక్షరాన్నీ కొంచెం కూడా మార్చకూడదు. ఎందుకంటే ఇక్కడ wordplay ఉంది.

**** (*) ****