చదువు

ఒక మిస్టీరియస్ మునెమ్మ!

మార్చి 2013

తెలుగు నవలా సాహిత్యం లో మునెమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథా నాయిక అంటే మునెమ్మ! ఒంటి చేత్తో  కథను నడిపిస్తూ, ఆమె ధైర్య సాహసాలకు, నిబ్బరానికి చకితులవుతున్న పాఠకులను చేయి పట్టి కథ చివరంటా లాక్కు  పోతూ…తను మాత్రం స్థిత ప్రజ్ఞురాలై నడిచిపోతుంది. డాక్టర్ కేశవ రెడ్డి గారి సంచలనాత్మక నవల మునెమ్మ 2007 లో చతురలో మొదట ప్రచురితం అయ్యాక..హైద్రాబాదు బుక్ ట్రస్ట్ విడిగా పబ్లిష్ చేసింది.

బహుళ ప్రజాదరణ పొందిన ఈ నవల అంతే స్థాయిలో విమర్శలకు కూడా గురైంది. రచనా శిల్పం గురించి మునెమ్మ చిత్రణ గురించి, పత్రికల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. కొన్ని మరీ వ్యక్తిగత స్థాయిలో చేసుకున్న పరస్పర దాడుల్లా కూడా అనిపించక మానవు. మునెమ్మ మీద బోల్డు చర్చలు, అభిప్రాయాలు..విశ్లేషణలు..పరిశోధనా వ్యాసాలూ !!

మునెమ్మ కథ కాస్త చెప్పుకుందాం! రాయల సీమ లో ఒంటిల్లు అనే కుగ్రామానికి చెందిన జయరాముడి భార్య మునెమ్మ. ఆమె పెళ్ళి నాడే ఇంట్లో పుట్టిన కోడెదూడ పెరిగి పెద్దయి బొల్లి గిత్తగా ఆ ఇంట్లో దాదాపు సభ్యుడిగా(?) మసలుతుంటుంది. జయరాముడు గిత్తను తీసుకుని వెళ్తుంటే చూసిన వాళ్ళు వాళ్ళిద్దరినీ రామ లక్ష్మణులే అనుకుంటారు.

ఒకరోజు బొల్లి గిత్త పొలంలో గడ్డి కోస్తున్న మునెమ్మ వీపు మీద రెండు కాళ్ళు ఎత్తి ఆనిస్తుంది. ఆ చర్యలో జయరాముడికి లైంగికోద్రేకం కనిపిస్తుంది.  వెంటనే అతడు గంగ వెర్రులెత్తి పోయి గిత్తను చావబాది మర్నాడు ఎక్కడో దూరాన ఉన్న పశువుల సంతకు తోలుకుపోయి అమ్మేయాలని నిశ్చయించుకుంటాడు. మొదట  గిత్తను అమ్మడానికి ససేమిరా అన్న జయరాముడి తల్లి ….అది చేసిన పని విని నిర్ఘాంత  పోయి అమ్మేయడమే మంచిదని అభిప్రాయ పడుతుంది.

దగ్గరలోని పోటుమిట్ట గ్రామం లోని కమిషన్ ఏజెంట్ (తరుగులోడు) సాయంతో గిత్తను సంతలో అమ్మడానికి తోలుకు పోతాడు జయరాముడు. అయితే రెండు రోజుల తర్వాత గిత్త ఒక్కటే తిరిగి వస్తుంది. జయరాముడు రాడు. గిత్త సంత లో అమ్ముడై పోయిందని మాత్రం దాని కొమ్ముకు అంటించిన చీటీలో ఉంటుంది. అతడు ఏమయ్యాడో అని ఆలోచిస్తూ ఉండగానే కలత నిద్రలో మునెమ్మకు ఒక కల వస్తుంది. ఆ కలలో జయరాముడు శవమై కనిపిస్తాడు. అతడు చనిపోయాడని ఆ కల ఆధారంగా (తన విశ్వాసాల ప్రకారం) నిర్థారించుకున్న మునెమ్మ అతడిని ఎవరు చంపారో, ఎలా చంపారో వెదకడానికి బయలు దేరుతుంది.  వారి మీద పగ తీర్చుకోవాలని మునెమ్మ ధ్యేయం! జయరాముడి బంధువైన సినబ్బ(ఇతడే కథ ను మనకు చెప్పే నెరేటర్. ఇతడి మాటల్లోనేకథ అంతా నడుస్తుంది) తను కూడా ఆమెకు తోడు గా వస్తానంటాడు. ఇద్దరూ కల్సి బయలు దేరతారు.

బయలు దేరినప్పటి నుంచీ ప్రతి చోటా సమాచారం సేకరించుకుంటూ దాన్ని విశ్లేషించుకుంటూ….జయరాముడిని ఎవరు చంపారో కనుక్కుని వాళ్ళని మునెమ్మ చట్టానికి దొరకని సహజ న్యాయ” పద్ధతిలో  తుదముట్టించడం తో కథ సమాప్తం!

ఈ నవల్లో కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాముఖ్యం! బిగి సడలని…ఉత్కంఠ నిండిన కథనం వల్ల పాఠకుడు దాని వెనుక పరుగులు తీస్తాడు. కథ మొత్తం మనకు సినబ్బ చెప్తూ ఉంటాడు. మునెమ్మ మనోభావాలను కుడా సినబ్బే వర్ణిస్తాడు.కథ మధ్యలో సందేహాలు వస్తున్నా…….కథనం లోని గొప్ప దనం వల్ల ….వాటిని పక్కకు నెట్టి ఏమి జరిగిందో చదివేద్దాం అన్న ఉత్కంఠ పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వక కథను చదివిస్తాయి. సినబ్బే ప్రయోక్త గా కథలోని ప్రతి సంఘటన నడుస్తుంది. , భీభత్స ప్రధానమైన దృశ్యాలను , కట్టలు తెంచుకున్న మునెమ్మ దుఖాన్ని, చివరకు బొల్లి గిత్త చేసే .ప్రళయ తాండవాన్ని, తరుగులోడి చావును…ఇవన్నీఅతడే  చెప్తాడు. సినబ్బ పాత్రలోనే రచయిత మనకు స్పష్టంగా కనిపిస్తుంటాడు.

మునెమ్మ పాత్ర చిత్రణ 

మునెమ్మ అసలు సిసలు కథా నాయికగా ఈ నవల్లో విశ్వరూపం దాలుస్తుంది.  నిబ్బరం, ఆలోచన, తర్కం, కంటికి కనపడనీయని పగ ఇవన్నీ మునెమ్మ కి అలంకారాలు.  మునెమ్మ ప్రస్థానం అతడు అడవిని జయించాడు నవలలో ముసలి వాడిని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఇద్దరిలో కామన్ గా కనపడే లక్షణం కర్తవ్య దీక్ష, కర్తవ్య సాధనకు ..అడ్డు వచ్చిన కష్టాన్ని పక్కకు నెట్టి ముందుకు సాగడం!

పల్లెటూరి అమాయక స్త్రీ అయినా మునెమ్మ కథలో చాలా పరిణతి  చెందిన, చదువుకున్న స్త్రీ వలె “కొటేషన్స్” లో పెట్టుకో దగ్గ మాటలు మాట్లాడుతుంది.(పెళ్ళి సమయంలో వీరి బాగుల్దానిలా ఉందని ఆమెను అంతా అనుకుంటారు) జీవితమే ఆ పరిణతి  నేర్పిందని అనుకున్నా…..అపరాధ పరిశోధకు రాలి స్థాయిలో ఆమె చిక్కు ముళ్లను విప్పుతూ..పోవడం కొంత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆమెలో నిగూఢమైన తెలివి తేటలు ఉన్నాయని పాఠకుడికి అర్ధమవుతుంది . ఆమె మానసిక ప్రపంచంలో రేగిన కల్లోలం కుడా ఆమె చేత అటువంటి పరిణతి చెందిన మాటలు సందర్భానుసారంగా మాట్లాడించి ఉంటుందని కుడా మరో పక్క తోస్తుంది.

మునెమ్మ 1930 ల నాటి ఒక సాధారణ పల్లెటూరి స్త్రీ! ఆమె కలలో కనిపించే దృశ్యాలను సందేశాలుగా నమ్ముతుంది. బహుశా ఆత్మలు ఆవహించడాన్ని కూడా నమ్ముతుంది.  భర్త ఆచూకీ కనుక్కోడానికి బయలు దేరిన మునెమ్మ ఈ మూఢ నమ్మకాలకు అతీతురాలు కాదు. అసలు మునెమ్మ ఈ పయనంలో ఏదో ఒక శక్తి ఆవేశించిన దానిలా …నిబ్బరాన్ని ప్రదర్శిస్తుంది. తొణకదు బెణకదు.

“సమయం వచ్చినపుడు ఈ గొడ్డే కాదు, ఈడ నుంచి మద్ది పాలెం దాకా రోడ్డు మీద ఉండే ప్రతి కంకర రాయీ మాట్లాడుతుంది”

“రోడ్డుకిరువైపులా ఉండే ప్రతి చెట్టు కిందా ఆయన (మరణించిన భర్త) చేతులు చాచి నన్ను పిలిచినాడు”

“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు  ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం ఇవన్నీ ఆలోచించే వచ్చామా?”

“సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం! చేప కోసం గాలం వేసినపుడు బెండు తైతక్క లాడగానే లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినపుడు కదా లాగుతాం?”

వినిపించని వాటి గురించి, కనిపించని వాటి గురించేరా మనం ఆలోచించాల్సింది”

“ఆ రాత్రి నాకు కలొచ్చినప్పటి నుంచీ నేను వేస్తున్న ప్రతి అడుగూ ఆయన (భర్త జయరాముడి) అంత్య క్రియల్లో భాగమే! అంత్య క్రియలంటే ఇవే”

ఇలా నిబ్బరంగా, తెలివి గా లోతుగా మాట్లాడుతూ మునెమ్మ తన వ్యక్తిత్వాన్ని , వైఖరిని పాఠకులకు స్పష్ట పరుస్తుంది.

ఆమె తనకు వచ్చిన కలను తన మనసులో దాగిన భయానికి ప్రతి బింబంగా భావించక, అది జయరాముడు తన చావు గురించి ఆమెకు పంపిన సందేశంగా భావిస్తుంది.  ఆ సందేశంతోనే ముందడుగేస్తుంది. ముందుమాటలో కవయిత్రి జయప్రభ “రచయిత అరవయ్యేళ్ళ నాటి కథనే ఎన్నుకున్నామునెమ్మ పాత్రను చిత్రిస్తున్నపుడు..సమకాలీన స్తీల ఆలోచనల ప్రభావం ఆయన మీద అనివార్యంగా పని చేసినట్లుంది” అంటారు. ఈ మాటతో ఏకీభవించాలని  అనిపించదు  . గ్రామీణ స్త్రీలలో ఉండే స్థైర్యం, ధైర్యం,విచక్షణ, ఇవన్నీ జీవితం నేర్పే అవసరాలే ! వాటితో పాటు పగ ఒకటి మునెమ్మ కు కొత్త కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఆ కర్తవ్యం లోంచే పరిశోధన దిశగా ఆలోచిస్తుంది.

ఆమె నిర్ణయించుకున్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోదు. అది నెరవేరాక, ఇక ఏడుస్తూ కూచోదు. నిస్పృహకు లోను కాదు. లేచి బతుకు బండి ముందుకు సాగేందుకు ముందడుగేస్తుంది. అవసరం అన్నీ నేర్పుతుంది రా సినబ్బా, మాట గొడ్డుకు కూడా వర్తిస్తుంది” అనేసంచలనాత్మక, మార్మిక ,సందేహాత్మక  వ్యాఖ్యతో కథను ముగిస్తుంది.

కథనం-శిల్పం

మునెమ్మ నవల ను సినబ్బ మాటల్లో చదువుతాం మనం! రచయితే సినబ్బ! ఈ కథలో కథనమే ముఖ్య భూమిక వహించి పాఠకుడిని ముందడుగు వేయిస్తుంది. అయితే ఈ నవల రాయడంలో రచయిత ఒక ప్రత్యెక  పద్ధతిని ఎంచుకున్నారు. జయప్రభ దాన్ని మాజిక్ రియలిజం“  పోల్చారు. రచయిత ఈ కథలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని చెప్పీచెప్పనట్లు గా  అస్పష్టంగా చెప్పి వదిలేశారు.  బొల్లి గిత్త మునెమ్మ ను తాకిన సంఘటన మీద స్పష్టత ఉండదు. నిజంగానే మునెమ్మకు గిత్త మీద , పెంపుడుజంతువు  మీద ఉండే వాత్సల్యం తప్ప మరో భావం ఉందా లేదా? బొల్లి గిత్త ఏ దృష్టి తో తన మీదకు వచ్చిందన్న విషయాన్ని మునెమ్మ గ్రహించిందా  లేదా?

జయరాముడు గిత్తను ఎందుకు చచ్చేట్లు బాదాడో తనకు తెలీదని అత్త సాయమ్మతో చెప్తుంది. ఎందుకు అమ్మేస్తానంటున్నాడో కూడా అంతు పట్టనట్లు వ్యవహరిస్తుంది.  గిత్తను అమ్మడానికి ముందు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సాయమ్మ  , గిత్తను చావబాదిన  కారణం విన్నాక  , దాన్ని అమ్మేయడానికి అభ్యంతరం వ్యక్త పరచక మౌనం వహిస్తుంది. అప్పుడైనా మునెమ్మ కు  అనుమానం రావాలి సాయమ్మ మౌనం పట్ల!!   పైగా తన వీపు మీద కాళ్ళు ఆనించాకే, మునెమ్మ కళ్ళ ముందే దాన్ని జయరాముడు చావ బాదుతాడు . ఎద్దు చర్యలో కోరిక ఆమెకు కనిపించక పోయినా , తన ప్రాణానికి హాని జరగ బోయిందన్న కారణం తో జయరాముడు కొట్టి ఉంటాడని తోచదా? అపరాధ పరిశోధనలో చిక్కు ముళ్ళను అవలీలగా విప్ప గలిగిన మునెమ్మ కు? చివరికి సాయమ్మ పరిస్థితి ఏమైనట్లు?  మునెమ్మ ఇంటి నుంచి బయలు దేరాక ఇక సాయమ్మ ప్రసక్తే ఉండదు.

నవల చివర్లో గిత్తను ఉద్దేశిస్తూ  “పిలగాడిని వదులు” అని అనడం కూడా కొంత సందిగ్థతకు దారి తీస్తుంది. పిలగాడా అనేది మునెమ్మ మోహం కమ్మిన వేళ భావావేశంతో భర్తను పిల్చుకునే ముద్దు పేరు అని రచయిత చెప్పక పోయుంటే ఈ సందిగ్థతకు తావు ఉండేది కాదు.  బొల్లి గిత్త కు అటువంటి భావనలు లేవని మునెమ్మ నమ్మి ఉంటే  “అది ఆడోళ్ళ మీదకు పోతోందని” తరుగులోడిని  రెచ్చ గొట్టే వ్యూహం లో భాగం గా  అంటుందా? . ఈ మాట మునెమ్మ ఎందుకు వాడింది?  కథను విశ్లేషించిన అంబటి సురేంద్ర రాజు దీన్ని మాంత్రిక కథనంగా వర్ణిస్తారు. కథతో పాటే సందేహాలు వస్తున్నా, మునెమ్మ సాగిస్తున్న పరిశోధన సందేహాలను పక్కన పెట్టించి తనతో పాటు ముందుకు లాక్కెళుతుంది.

అలాగే ఈ నవలలో తరుగులోడి  చావు చాలా హింసాత్మకంగా ఆవిష్కరిస్తాడు రచయిత. బొల్లి గిత్త అతని పేగుల్ని తీసి కొమ్ములకు చుట్టుకోవడం, అతడి కడుపు లోంచి బయటికి వచ్చి పాదాల వరకు వేల్లాడుతూ ఉండిన కొమ్ముని తొక్కుకుంటూ ముందుకు వెళ్లి పడి  పోవడం, అతని పేగుల్ని బొల్లి గిత్త ఇళ్ళ కప్పుల మీదకు విసిరేయడం, అతడి మృత దేహాన్ని తొక్కుతూ నాట్యం చేయడం ఇత్యాది దృశ్యాల వర్ణన భీభత్సంగా ఉండటం ….బహుశా మునెమ్మ పగ తాలూకు తీవ్రతకు తగిన ఫలితం దక్కిందని చెప్పడానికి కావొచ్చు!!  కాని ఆ ఆ దృశ్య చిత్రణ చాలా వెగటు కల్గిస్తుంది.

విమర్శలు-వివాదాలు:

ఈ నవల మీద చాలా విమర్శలే వచ్చాయి. మొదటగా కాత్యాయని(చూపు) సంధించిన విమర్శనాస్త్రం పెను సంచలనాన్ని సృష్టించింది.

“గిత్తకూ మునెమ్మకూ రచయిత సంబంధం అంటగట్టారని”  ఆరోపిస్తూ ఈ ధోరణి పై, ఈ రచన పై ఆమె  ధ్వజమెత్తారు. “అవసరం అన్నీ నేర్పుతుంది రా సినబ్బా, మాట గొడ్డుకు కూడా వర్తిస్తుంది అన్న వాక్యాన్ని ఆమె సునిశితంగా విమర్శిస్తారు.  మునెమ్మ, గిత్త జీవనోపాధి మాత్రమే కాక పరస్పర “అవసరాల ఆధారంగా” ఒక ప్రాతి పదిక ఏర్పర్చుకున్నట్లు రచయిత  స్పష్టం చేసారని ఆమె ఆరోపణ. గిత్త రంకె లో భర్త గొంతు మునెమ్మకు వినిపించడం, రహస్య సంకేత నామం తో మునెమ్మ గిత్తను పిలవడం ఇందుకు సాక్ష్యాలని కాత్యాయని అంటారు. ఆమెను సమర్థిస్తూ డాక్టర్ భారతి (గీతాంజలి) జంతువులు తమ సెక్స్ వాంఛలను ఎటువంటి పరిస్థిత్లోనూ మనుషుల పట్ల ప్రకటించవని పశు వైద్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా సాధికారకంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రీయ పధ్ధతి లో ఆమె చేసిన విమర్శ చాలా న్యాయంగా తోస్తుంది. ఇదొక వికృత శిల్ప విన్యాసమని తెలకపల్లి రవి విమర్శించారు. “సామాజికతకు, సహజాతాలకు మధ్య సంబంధాన్ని రచయిత సవ్యంగా అర్థం చేసుకోలేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

అయితే ఈ విమర్శల్ని డాక్టర్ కేశవ రెడ్డి కొట్టి పారేశారు.  జంతువుల్లో బోర్ డమ్ సెక్స్ భావాలు మామూలేననీ, ఆవులలోను , స్త్రీలలోనూ ఉండే  ఒకే రకమైన హార్మోను వల్ల ఎద్దులు అలా స్త్రీల పట్ల ఆకర్షితులు కావడం సహజమే నని అన్నారు. ఈ లెక్కన  ఎద్దులు కోరిక కల్గినపుడల్లా స్త్రీల వైపు ఆకర్షితులైతే పల్లెల్లో స్త్రీల ప్రాణాలు ఏమై పోవాలని డాక్టర్ భారతి ప్రశ్నిస్తారు. ఈ   పరస్పర విమర్శా ప్రతి విమర్శల సిరీస్ లో కొంతమంది రచయితను, మరి కొంతమంది విమర్శకులను సమర్థించారు.  తెలుగు సాహిత్యంలో సాహితీ విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగే సందర్భాలను తరచూ చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది.  రచయిత ధోరణిని పర్వర్షన్ గా కాత్యాయని, తెలకపల్లి రవి పరిగణించగా, రచయిత అంతకంటే ఒక మెట్టు దిగి విమర్శకులను హిస్టీరిక్ రోగులుగా  వర్ణించడం, వారిని They mean nothing to me అనడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆయన అసహనాన్ని స్పష్ట పరుస్తుంది.  They mean nothing to me అంటున్నపుడు వారి విమర్శలకు జవాబు ఇవ్వడం అవసరమా అన్న ప్రశ్న రేకెత్తుతుంది. విమర్శలు ఇలా విషయం మీద కాక వ్యక్తి గత స్థాయికి దిగడం ఆరోగ్య కరమైన ధోరణి కానే కాదు.

బొల్లిగిత్తలో మునెమ్మ భర్తను చూడటం అంటే…..కేవలం రక్షకుడిని చూసిందా? లేక మరో దృష్టితోనా అనేది ఈ నవల్లో ఎక్కడా రచయిత స్పష్టంగా చెప్పక వదిలేయడం ఈ అస్పష్టతకు కారణం. అంబటి సురేంద్ర రాజు కూడా” భర్త మరణానికి కారణమైన బొల్లి గిత్త ఆ భర్త “స్థానాన్ని భర్తీ చేయడం” పొయెటిక్ జస్టిస్ అనడం మరింత సందేహానికి తావిస్తుంది. ఏ రకంగా భర్తీ చేస్తుందన్నది ఆయనా స్పష్టంగా చెప్పరు.

అయితే మునెమ్మకు కొన్ని మూఢ నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి భర్త ఆత్మ బొల్లి గిత్తను ఆవేశించి తరుగులోడిని చంపాలని ఆమె ఆకాంక్షించిందని, అందుకే “పిలగాడిని వదులు” అని సినబ్బతో అని ఉంటుందని, ఆ కారణం చేతనే ఆమె గిత్త రంకె లో భర్త గొంతును వినగలిగి ఉంటుందని సామాన్య పాఠకుడు భావించే అవకాశం కూడా లేకపోలేదు.  అయితే దీనికి కూడా రచయిత నుంచి స్పష్టమైన మద్దతు నవల్లో కనిపించదు. నర్మ గర్భమైన వాతావరణాన్ని,  మాటల్ని (అవసరం అన్నీ నేర్పుతుందని, అది గొడ్డుకు కూడా వర్తిస్తుందని మునెమ్మ అన్న మాటకు ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి..) సృష్టించి ఆ ఖాళీని, సందేహాల్ని పాఠకుల మెదడులో వదిలి ఊరుకుంటాడు.

గిత్త ఒక జంతువు. దానికి “అవసరం” ఏముంటుంది? పగ ప్రతీకారం తీర్చుకునే అవసరం దానికి ఉంటుందా? పైగా….అది ఏ క్షణం లో ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేమని మునెమ్మే అంటుంది. కాబట్టి..దానికి ఆలోచన లేదు. మరి దానికి ఉండే అవసరం ఏమై ఉండాలి?  అనే సందేహం పాఠకుడిని  వెంటాడి తీరుతుంది. 1985 తర్వాత తెలుగు నవలలు-స్త్రీవాద దృక్పథంఅనే అంశం మీద సమర్పించడానికి  మునెమ్మ పాత్రను ఎంచుకుని ఈ నవల మీద పరిశోధనా వ్యాసం రాసిన డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు గారు  ఈ చివరి వాక్యానికి సంబంధించి ” కథనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పెళ్ళయి ఆరేళ్ళయినా పిల్లలు పుట్టక పోవడానికి భర్త లోపాన్నేదైనా  రచయిత సూచించాలనుకంటున్నాడా?” అని సందేహాన్ని వ్యక్తం చేశారు.

ఇవన్నీ పాఠకుడు తనకు తానే ఊహించుకున్న జవాబులతో తృప్తి పరచుకోవాలి తప్ప నవల్లో ఇదమిత్థంగా “ఇదీ జరిగింది” అని రచయిత చెప్పడు.

అసంఖ్యాక పాఠకుల ఆదరణకు పాత్రమై, అదే స్థాయిలో విమర్శలకూ గురైన సంచనల పాత్ర మునెమ్మ!

పాఠకుల్లొ  ఆసక్తిని, అనురక్తిని కల్గించడం తో పాటు, అనుమానాలను, సందేహాలను, సందిగ్ధాలను అదే స్థాయిలోరేకెత్తించిన ఒక మిస్టీరియస్ నవల గా మునెమ్మ ను చెప్పుకోవచ్చు.

తప్పక చదవాల్సిన నవల! హైదరాబాదు  బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ నవల అన్ని షాపుల్లోనూ లభ్యం!