చదువు

ఊబిలో దున్న!!

జనవరి 2014

ఒక దున్న పోతు!

గాలికి వదిలేస్తే పాపం… గడ్డి మేయడానికొచ్చి వాగులోని ఊబిలో తెలీక కాలు వేసి సగానికి పైగా దిగబడి పోయింది. ఎప్పుడు దిగబడిందో ఏమిటో, ఎవరూ పట్టించుకోరు దాన్ని!

గొబ్బి మండలు నరుక్కుపోడానికి ఆ దారిన వచ్చిన ఒక రైతు ఆ దృశ్యం చూస్తాడు. దాన్ని బయటికి తీయడానికి నిశ్చయించుకుంటాడు. ఎవరినైనా సాయానికి పిలుద్దామంటే ఆ సమయానికి ఎవరూ అక్కడ కనిపించరు. బయటికి తీయగలడో లేదో తెలీదు. కానీ ప్రయత్నం మాత్రం తప్పని సరి అని భావిస్తాడు. ఊబిలో దిగబడి, బయటికి వచ్చే ప్రయత్నం ఏదీ చేయకుండా (చేసిందో లేదో తెలీదు) తన బరువు, బాధ్యత మొత్తం అతని మీద వేసి నిశ్చలంగా, రికామీగా ఉండిపోయే దున్నపోతు, మరో వైపు దాన్ని తిడుతూనే, దాన్ని బయటికి లాగడంలో గల బాధలన్నీ అనుభవిస్తూనే ఆ పని ని చీదరించుకుంటూనే, దాన్ని బయటికి లాగేంత వరకూ విశ్రమించని మనిషి. చివరికి రాఘవులు దున్న పోతును ఊబిలోంచి బయటికి లాగడంతో నవల పూర్తవుతుంది.

వినుకొండ నాగరాజు గారి సంచలన నవల ఊబిలో దున్న!!

ఇంతే కథ! ఇంకేం లేదు.

అయితే ఇది ఇంత సులభంగా ముగియదు . అనుక్షణం పాఠకుడిని ఉత్కంఠకు గురి చేస్తూ ఏమవుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది.

కానీ ఈ కథనే రచయిత రాఘవులు పాత్ర ద్వారా ఈ కథ చెప్తూ ఉంటారు.

రాఘవులు దున్నపోతుని చూసాక ఏమి చేయాలో తేల్చుకోలేని సందిగ్ధం లో పడతాడు.

ఊబిలో దిగబడి పోయున్న్న దున్న పోతుని చూస్తూ చూస్తూ వదిలేయలేడు.. అలాగని ఒక్కడే దాన్ని బయటికి తీయడమా.. అసాధ్యం!

పోనీ తన దారిన తాను పోదామా? ఒక ప్రయత్నమంటూ చేయకుండా పోలేడు.ఇన్ని సంఘర్షణల మధ్య రాఘవులు దాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుని పనిలో దిగుతాడు.

ఆ పని లోకి దిగిన రాఘవులుకు దిగాక కానీ అదెంత కష్టమైన పనో తెలిసి రాదు. ఈ ప్రక్రియలో భాగంగా దున్నని లాగడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే అతడు తన జీవితాన్ని, తాను ఈ స్థితికి చేరడానికి దారితీసిన పరిస్థితులను, జీవితంతో తన పోరాటాన్ని, విజయాలను, అపజయాలను నెమరేసుకుంటాడు.

దున్నని లాగడానికి అతను ఒక వ్యూహాన్ని రచిస్తాడు. చేతిలో ఉన్న కత్తితో దగ్గర్లోని పొదల్లోని గొలగ మండల్ని నరికి

తెచ్చి ఊబిలో వేసి లోపలికి తొక్కి అప్పుడు బురద లో పట్టు దొరికాక దున్నని వాటి మీదుగా బయటికి తీసుకు రావాలని. ఈ వ్యూహ రచన అమలు జరుగుతూ ఉండగానే అతడి ఆలోచనా స్రవంతి సమాంతరంగా కొనసాగుతూ ఉంటుంది.

ఎన్నెన్నో ఆలోచనలు, వాటిలోనే ఎన్నో వైరుధ్యాలు
మరో పక్క కారుతున్న చెమట… అలసి పోతున్న శరీరం, దున్నని ప్రాణాలతో కాపాడాలనే ధృడ నిశ్చయం, కాపాడగలనా లేదా అని సడలుతున్న ధైర్యం .. వీటన్నిటి మధ్యా రాఘవులు తో పాఠకుడు ప్రయాణిస్తాడు

డిగ్రీ చేతికొచ్చాక రాఘవులు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడా దొరకదు. ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చేయడానికి సిద్ధ పడినా ప్రయోజనం లేక పోతుంది. తండ్రి కి పొలం ఉంటుంది . అప్పుడే కసి తో వ్యవసాయంలోకి దిగుతాడు. “ఒకడు నాకు ఉద్యోగం ఇచ్చేదేమిటి ? నేనే పది మందికి పని చూపిస్తాను” అనే ఆత్మ విశ్వాసంతో వ్యవసాయం మొదలు పెట్టి సఫలం అవుతాడు.

కొత్త కొత్త పద్ధతులు , సహకార వ్యసాయం అమల్లోకి తెస్తాడు. తన దగ్గర పని చేసే వాళ్ళకు రాబడిలో అయిదింట మూడొంతులు ప్రతిఫలంగా ఇస్తాడు. సమితి అధ్యక్షుడు అవుతాడు. చైతన్య వంతమైన కార్య క్రమాల్లో ఎన్నో రకాలుగా పాలు పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాణానికి కూడా హాని ఏర్పడుతుంది. ఒక పక్క దానికి భయపడుతూనే మరో పక్క తన పని తాను చేసుకు పోతుంటాడు.

ఇవన్నీ ఆలోచిస్తూనే అతడు దున్నను లాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. ఊబిలోని బురదను ఎత్తి పొస్తున్న కొద్దీ ఇంకా ఇంకా బురద చేరుతూ ఉంటుంది.పాములు కనిపిస్తుంటాయి. దున్న పోతు సహకారం ఏమీ ఉండదు. దానికి ఆహారం నీరు కావాలేమో అని అవి తెచ్చి ఇస్తూనే మరో పక్క శ్రమ ఎక్కువై పోయి, దున్నని బయటికి లాగలేనేమో అన్న భయంతో దున్న ని , బూతులు తిడతాడు , బాగా కొడతాడు.ఎంతగా అంటే రక్తం వచ్చేలాగా!

ఈ క్రమంలో రాఘవులు కూడా ఊబిలో దిగబడతాడు కూడా! అయితే ఎలాగో సంబాళించుకుని బయట పడతాడు. ఎంతో శ్రమకు గురవుతాడు.

దున్న కాలు రాఘవులు కాలి మీద పడి దాని బరువుకు అతని కాలు నలిగి పోతుంది.తీవ్రమైన బాధలో కోపంతో దున్నని చావగొడతాడు రాఘవులు.

శ్రమ ఫలించి దున్నని ఊబిలో నుంచి బయటికి తీయడంతో కథ ముగుస్తుంది

ప్రచురణ కర్తలు దీన్ని గుఢార్థ స్పురణల సాంకేతిక నవలగా పేర్కొన్నారు. వారు అలా చెప్పక పోయినా, ఈ నవల ఒక గూడార్థాన్ని స్ఫురింపజేస్తోందని నవల చదవడం మొదలు పెట్టిన కాసేపటికే రాఘవుల ఆలోచనాధోరణి వల్ల అర్థమై పోతుంది. ఊబి అనేది ఒక కుళ్ళు వ్యవస్థ. అందులో ఇరుక్కు పోయింది మనిషి. దున్న పోతుని మనిషిగా భావించ వచ్చు. లేదా కుళ్ళు, అవినీతి వంటి అవలక్షణాల ఊబిలో మునిగి పోయిన వ్యవస్థగా నైనా భావించ వచ్చు. దాన్ని సంస్కరించడానికి, ఆ కుళ్ళు నుంచి బయటికి లాగడానికి చదువుకున్న, వ్యక్తిత్వం కల్గిన మనుషులు నడుం కట్టాలి… ఇదే ఇందులోని గూడార్థం.

నవల విశేషాలు:

రచయిత ఈ నవలకు మొదట పెట్టిన పేరు “దున్నపోతు” ! అయితే ప్రచురణ కర్తలు దాన్ని “జై కిసాన్” గా మార్చి, రచయిత అభ్యంతర పెట్టడం తో “ఊబిలో దున్న” అనే పేరు ఖాయం చేశారు. అంతకు ముందే ఎమెస్కో వేసిన నవల “జై జవాన్” బాగా అమ్ముడు పోయి ఉండటం వల్లనూ, కథ మొత్తం రైతు ఒక్కడే నడపటం వల్లనూ పబ్లిషర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే నాగరాజు గారు అందుకు ఒప్పుకోలేదు. ఆ “ఆడ రచయిత్రుల” రచనల స్ఫూర్తి తో తన నవలకు పేరు పెట్టడానికి ఆయన సుతారమూ అంగీకరించలేదు.

ఈ నవలకు 1974 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించగా దాన్ని రచయిత వినుకొండ నాగరాజు గారు తిరస్కరించారు.పైగా ఆ పైన “నేనెందుకు అవార్డును తిరస్కరిస్తున్నాను” అనే కవర్ పేజీతో తాను నడుపుతున్న “కమెండో” పత్రికను ప్రత్యేక సంచిక గా విడుదల చేసారు. అకాడమీ ప్రకటిత ఆశయాలకు అనుగుణం గా పని చేయడం లేదు కాబట్టి అవార్డును తిరస్కరిస్తున్నానని ఆయన ప్రకటించినా, కమెండో లోని వ్యాసాల విశేషాలు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. అవార్డులు తిరస్కరించని రచయితల పట్ల, అప్పటికే అవార్డులు స్వీకరించిన రచయితలు, కవుల పట్ల, వారి రచనల పట్ల చాలా చులకన భావాన్ని రచయిత వాటిలో వ్యక్తం చేశారు.

అంతే కాక ఈ నవల చదివే పాఠకులు ఒక మానసిక స్థాయిలో ఎదుగుదల కలిగిన వాళ్ళు అయి ఉండాలని కూడా ప్రకటించడం విస్మయాన్ని కలగ జేస్తుంది. ఇది పాఠకుల స్థాయిని కించ పరచడమే అవదా?? నవల రాసాక దాన్ని ఏ స్థాయి పాఠకులు చదవాలో రచయితే చెప్పడం సమంజసం ఎలా అవుతుంది ?

రచయిత సూచించినట్లు ఇది ఒక గూడార్థాన్ని సూచించే నవల అయినా, ఊబిలోంచి దున్నని లాగడం తో పోల్చినా , వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టడం అంత తేలికైన పనేమీ కాదు.

ఈ నవల ఒక తిరుగుబాటు నవలగా రచయిత అభివర్ణిస్తూ, అలాటి తిరుగుబాటు సాహిత్యానికి కూడా తాము అవార్డు ప్రకటిస్తున్నామని ప్రచారం చేసుకోబోయిన సాహిత్య అకాడమీ వాళ్ళని నడ్డి విరగదన్నినట్లు చెప్పుకున్నారు.
అవార్డు ని తిరస్కరించడం వరకూ బాగానే ఉంది కానీ దానికి రచయిత చెప్పిన భాష్యం మరీ కొండంత గా కనిపిస్తుంది.
ఇవన్నీ అలా ఉంచితే …

నవల్లో రాఘవులు “లెఫ్టిస్టు” గా కనిపిస్తాడు. (ఆ కారణం చేతనే అతనికి ఉజ్జోగం కూడా దొరకదు) !కనిపించిన మరుక్షణమే అందుకు విరుద్ధంగాప్రవర్తిస్తుంటాడు . కాస్త శాస్త్రీయ దృక్పథం, అభ్యుదయపు ఆలోచనలు ఉన్నాయే అని మనం సంబర పడే లోపు అతడి ఆలోచనలు పక్క దారి పడతాయి . ఆధునిక, అభ్యుదయ భావాలు కలిగిన వాడినని నవలంతా చెప్పుకుంటూనే మరో పక్క, దున్న దాని “కర్మ కొద్దీ” ఊబిలో దిగబడిందంటాడు. దాన్నలా వదిలేసి వెళ్ళి పోతే తాను “గోహత్య” చేసినట్లు అవుతుందని భావిస్తాడు.

“ఆడది మెత్త దనానికి ప్రతి రూపమవ్వాలి. ప్రకృతి లో ఇచ్చేది మగాడు, తీసుకునేది ఆడదీ! మగాడు చురుకు దనానికి, ఆడది స్థబ్దతకూ ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు ఆ ప్రవృత్తులు ప్రకృతిని అనుసరించి అలాగే సాగాలి” అని తన భార్య స్థబ్దత ను అనుసరిస్తూ తను కల్పించే రక్షణ కోసం పాకులాడుతున్నందుకు సంతోషిస్తాడు. గర్భంతో ఉన్న భార్యను తల్చుకుని “చివరికి ఆడది ఒట్టి ఆపరేటస్” అని ఇట్టే తేల్చేస్తాడు.

రచయిత పుస్తకాన్ని అంకితం ఇచ్చిందెవరికో చూడండి!

“వయసు మళ్ళిన అజ్ఞానానికి, మొక్కే నిర్భాగ్యులకూ, అల్పత్వానికి, అసమర్థతకు, ఆడతనానికి … పిరికి పందలకూ పరాన్న జీవులకు….సానుభూతి తో అంకితం ..!”

అన్ని అవలక్షణాల్లో ఒకటిగా ఆడతనాన్ని కూడా ఒకటిగా రచయిత గుర్తించారు. ఇది మింగుడు పడని విషయం !

రాఘవులు ఒక పక్క దేవాలయాల మహాత్యాన్ని రాసే రచయితలని అసహ్యించుకుంటూనే, ఊబిలోకి కాళ్ళు దిగబడి పోతుంటే “భగవంతుడా, రక్షించ”మని వేడుకుంటాడు.

మళ్ళీ మరో వైపు తన అభ్యుదయం కబుర్లు ఆలోచనలు సాగుతూనే ఉంటాయి.

ఇలా రాఘవులు పాత్రలో అంతులేని వైరుధ్యాలు పేజీ పేజీకి గోచరమవుతుంటాయి. అందరూ సమానంగా ఎదగాలని కోరుతూనే, తన కింద అనేక మంది పని చేయాలనీ తాను వాళ్లకు నాయకుడిని కావాలనీ అంటాడు.

దున్నని కాపాడాక దాన్ని గ్రామం కోసం ఉపయోగించాలని, మంచి పనులు చేయాలని ఒక పక్క ఆలోచిస్తూనే మరో పక్క “నీ ముందు తరాలన్నీ నాకు కృతజ్ఞులై ఉండాలి” అని దర్పం ప్రదర్శిస్తాడు దున్నతో!

కొన్ని సార్లు రాఘవులు లో ఈ వైరుధ్య ధోరణి ఎంత ప్రబలంగా కనిపిస్తుందంటే మానవ సహజ బలహీనతల్ని ఆవిష్కరించడానికి రచయితే అతని పాత్రని అలా తీర్చి దిద్దారు ..అని అనిఅని సర్ది చెప్పుకోవాలేమో అనిపించేంత. కానీ రాఘవులు సాధించిన ప్రగతీ విప్లవ భావాలు అతని ఆలోచనలకు భిన్నంగా ఆవలి వైపు కనిపిస్తూ ఉంటాయి.

ఈ నవలా రచన చైతన్య స్రవంతి శైలిలో సాగుతుంది కాబట్టి ఆపకుండా చదివిస్తుంది. ఆసక్తి కరమైన శైలి. పదాలు, సహజ సిద్ధమైన వర్ణనలు!

రాఘవులు ఆలోచనలు ఎలా సాగినా అతడు ఊబిలోంచి దున్నను బయటికి తీయడానికి ఎంత శ్రమ పడ్డాడో అదంతా ఆ ఊబి ఒడ్డున కూచుని చూసిన ఫీలింగ్ పాఠకుడికి కల్గుతుంది. రాఘవులు చివరికి పొందిన అలసట పాఠకుడు కూడా పొందుతాడు. ఆ బురద, ఆ చల్లగాలి, ఆ రొచ్చు వాసన, ఆ దున్నపోతుని జలగ పీడించిన నొప్పి, జల జలా స్రవించిన దాని వెచ్చని రక్తం…ఆ దున్న నిస్సహాయత, రాఘవులు చావబాదుతున్నా కనీసం కొమ్ము విసరలేని దాని దైన్య స్థితి .. ఇవన్నీ పాఠకుడు కూడా అనుభూతి చెందుతాడు .

చివరిలో దున్న ఊబిలోంచి బయటకు రాబోయే సమయంలో నిస్సత్తువ తో చతికిల బడితే పిచ్చి కోపంతో దాన్ని రక్తం ఓడేలా చావబాది , మారడానికి ప్రయత్నించని మనుషులని ఈ రకంగా మార్పుకు సిద్ధం చేయవచ్చని స్ఫురింప జేస్తాడు రాఘవులు.
ఎంతో ఉత్కంఠ తో నవల మొదలు పెట్టాక నవల సాగిన విధానం, కళ్ళకు కట్టినట్లు సాగే గమనం నవలను పూర్తీ చేయిస్తాయి. అయితే రాఘవులు వైరుధ్య ధోరణి పాఠకుడిని నిరుత్సాహానికి కు గురి చేస్తుంది.

మొత్తం మీద నవల పూర్తయ్యే సరికి … దున్నను ఊబిలోంచి లాగిన రాఘవులు కంటే ఎద్దు సాయంతో ధైర్యంగా ముందుకు సాగి పగ దీర్చుకున్న మునెమ్మ గొప్ప హీరోయిన్ అనిపించింది….. నాకు! హెమింగ్వే “Old man and the sea” స్ఫూర్తి తో వచ్చిన నవలగా కేశవ రెడ్డి గారి ‘అతడు అడవిని జయించాడు” ను చాలా మంది గుర్తిస్తారు. అయితే ఈ నవల దానికంటే చాలా రోజుల ముందే హెమింగ్వే నవల స్ఫూర్తి తో రాసినట్లు స్పష్టమవుతుంది.

కొద్ది రోజుల క్రితమే కినిగే ఈ పుస్తకాన్ని ఈ బుక్ గా అందుబాటులోకి తెచ్చింది. తప్పక చదివి చూడండి.

కినిగే లింక్: http://kinige.com/kbook.php?id=2408&name=Oobilo+Dunna

*** * ***