చదువు

నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!

జనవరి 2013

కొన్ని పుస్తకాలు ఎంచేతో జీవితం మీద గొప్ప ఇష్టాన్ని కలిస్తాయి.  పుస్తకం ముగిసి పోయాక గొప్ప ఆలోచనలు అలా చుట్టు ముడతాయి. ఆ ఆలోచనలు అలా ముసురుకుంటూ ఉంటే , ఆ ఇష్టం తాలూకు మైకంలో అలా ఉండి పోవాలనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్లో చేరేదే ఫ్రెంచ్  నవల “భూమి”!  La Terre  పేరుతో దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా ఎంతో శ్రమకోర్చి…రాశారు.
ఇది రైతుల కథ. రైతులకు భూమి మీద ఉండే ప్రేమ, వ్యవసాయం మీద ఉండే వ్యామోహం,పాషన్ ఇవన్నీ కూలంకషంగా , క్షుణ్ణంగా చదివి రాయడం అంటే  సామాన్య మైన విషయం కాదు. వ్యవసాయ  స్వరూపాన్నే కాక, అప్పటి సామాజిక, రాజకీయ పరిణామాల పట్ల కూడ అవగాహన ఉండాలి. అందుకే జోలా ఒక గ్రామంలో మకాం పెట్టాడు. అక్కడి జనంతో కల్సి పోయాడు.  ఏడాదిలో సగం రోజులు అక్కడే గడిపాడు. అదే కాక ఫ్రెంచ్ వ్యవహాయం , పల్లె ప్రజల జీవితాల గురించిన పుస్తకాలు విరివిగా చదివాడు.రైతాంగ పోరాటాలు, వ్యవసాయ సమస్యలు, వంశపారంపర్యపు ఆస్థుల వివాదాలు వీటన్నిటి మీదా ఆయన ప్రముఖ సోషలిస్టు లతో  ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు.ఎంతో అధ్యయనం చేసాడు.

ఇదంతా ఒక డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ లోని సమాచారం ఆధారంగా ఒక జీవిత కథను కొన్ని పాత్రలతో నడిపి అద్భుతమైన ఫిక్షన్ ని సృష్టించడం మామూలు విషయం కానే కాదు. అది జోలా సాధ్యం చేశాడు. అందుకే ఎమిల్ జోలా రచనల్లో మిగతావి అన్నీ ఒకెత్తు, భూమి ఒకటీ ఒకెత్తు అని చెప్తారు. ఇది ఆయన అభిమాన రచన కూడానట .

(ఎమిల్ జోలా)

ఈ నవలను నేను ఒక సారి వేసవి సెలవుల్లో శాఖా గ్రంధాలయంలో సగం చదివాను. మర్నాడు మిగతాది చదవొచ్చని  షెల్ఫ్ లో పెట్టేసి , మర్నాడు వొచ్చి చూస్తే..ఇహ కనిపించలేదు. ఎంత వెదికినా దొరక లేదు . శాఖా గ్రంథాలయం వాళ్ళు కూడా “ఏమో, మాకు తెలీదు” అన్నారు. అసలే ఆ పుస్తకానికి గ్రంధాలయం సంప్రదాయం ప్రకారం ముందో పేజీ వెనకో పేజీ లేకపోవడం తో..పబ్లిషర్స్ ఎవరో ఏమిటో కూడా వెంటనే కనిపెట్ట లేకపోయాను.  ఫ్రెంచ్ నవల ఆధారంగా అనువాదకుడి పేరు దొరికింది. ఎన్ని షాపుల్లోనో వెదికాను కొనాలని.పాత పుస్తకాల షాపులన్నీ వెదికాను. విజయవాడ లెనిన్ సెంటర్ అంతా శక్తి కొద్దీ జల్లెడ పట్టాను.  ప్రయోజనం లేక పోయింది.  పన్నెండేళ్ళు అలా గడిచిపోయాక పబ్లిషర్స్ ఎవరో తెలిసి (హైద్రాబాదు బుక్ ట్రస్ట్), వాళ్ళకి ఉత్తరాలు రాశాను. వాళ్ళు ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదనీ, తమ వద్ద కూడా ఒకటే కాపీ ఉందని అదివ్వడం కుదరదని  మర్యాదగా చెప్పారు. ఆ పుస్తకం సగమే చదివానన్న “ఖాళీ తనం”  అలా  మనసు మూలల్లో ఉండి పోయింది. ఏదో అశాంతి పట్టుకుంది !

మళ్ళీ అన్వేషణ మొదలు.  చివరికి ఒక మిత్రుడి చొరవ, చలవ వల్ల ఆ అద్భుతమైన నవల నాకు దొ…రి..కిం…ది! విజయవాడ లెనిన్ సెంటర్ లోని ఒక పాత పుస్తకాల షాపు లోనే!
ఇక కథలోకి వస్తే…
“భూమి” నవల్లో  భూమే కథా నాయకి. భూమే ప్రతి నాయిక. నవల్లో వందల కొద్దీ పాత్రలుంటాయి. అన్నీ భూదాహంతో అలమటించేవే. భూమి మీద ప్రేమతో పరితపించేవే. ప్రతి ఒక్కరి జీవితం భూమితో, భూమి వలన,భూమి చేత అన్నట్లుగా భూమి తో అల్లుకుపోయి ఉంటుంది. ఎవరి జీవితాన్నీ విడిగా చూడలేం.

27 ఎకరాల సుక్షేత్రమైన  పొలం చేతిలో ఉన్న సంప్రదాయ వృద్ధ  రైతు పువాన్ తన పిల్లలు ఫానీ,జీసస్, బ్యుతో లకు భూమిని వాటాలేసి పంచడంతో కథ మొదలవుతుంది. నడుం వంగేదాకా భూమి తల్లికి సేవ చేసిన పువాన్ మరిహ శక్తి లేక భూమిని పిల్లలకు పంచి వాళ్లిచ్చే పరిహారంతో విశ్రాంతిగా శేష జీవితం గడపాలని నిశ్చయించుకుంటాడు. జీవితమంతా అతడికి చేదోడుగా నిల్చి వంచిన నడుం ఎత్తకుండా పని చేయడమే తప్ప నోరెత్తి ఎరగని భార్య రోజ్!

పువాన్ సోదరుడు మోషే, ఏకాకి గా మిగిలిన పీనాసి వృద్ధ సోదరి   లగ్రాండ్ !! మోషే ఇద్దరు ఆడపిల్లలు లిజా, ఫ్రాంస్వాజ్  లు! పువాన్ పిల్లలు ముగ్గురిలోనూ కొంత రౌడీ వేషాలున్న బ్యుతో పొలం పంపకాలు తనకు నచ్చలేదని, వాటా స్వాధీనం చేసుకోక అలిగి వెళ్లి పోతాడు. అతడు అప్పటికీ బాబాయి కూతురు లిజాను పెళ్లి కాకుండానే గర్భవతిని చేస్తాడు.(యురోపియన్ సమాజంలో వరసలు వేరే అని గుర్తుంచుకోవాలి). ఇంట్లో తెచ్చి పెట్టుకుని వదిలేసిన వేశ్యకు పుట్టిన కూతురు తప్ప వేరే సంసారం అదీ ఏమీ లేని జీసస్ మాత్రం ఈ భూమిని అమ్మేస్తే ఎన్నాళ్ళు తాగొచ్చు అని ఆలోచిస్తుంటాడు. లిజా,ఫ్రాంస్వాజ్  లు తండ్రి మరణించడంతో ఉన్న కొద్ది పాటి భూమినీ స్వయంగా సాగు చేసుకుంటూ రెక్కల కష్టంతో బతికే రైతు పడుచులు.

అలెగ్జీ అనే ఒక పెద్ద భూస్వామి కమతంలో పని చేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్  మీద మనసు పడినా, ఆమె మరీ పదహారేళ్ళది కావడం వల్ల,లిజాను చేసుకుంటే కొద్ది పాటి భూమి దక్కుతుందనే ఆశతోనూ లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు. ఈ లోపు ఊళ్ళో ఒక కొత్త రోడ్డు బ్యుతో వాటా పొలం పక్కగా పడటంతో బ్యుతో  పొలం విలువ పెరిగి పోతుంది. అతడు అపుడొచ్చి పొలం స్వాధీనం చేసుకోడమే కాక, తల్లిని చేసి వదిలేసిన లిజాను పెళ్ళాడతాడు. దాంతో లిజా పొలం కుడా అతగాడికి కల్సి వస్తుంది.

లిజాను పెళ్లాడి ఆమె ఇంట్లోనే కాపరం పెట్టిన బ్యుతో కి ఆస్తి  బయటికి పోనీకుండా ఉండాలనే దురాశతోఫ్రాంస్వాజ్  ని కూడా సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. దాంతో అక్కా చెల్లెళ్లిద్దరి మధ్యా విభేదాలు పొడసూపుతాయి. ఇంట్లో అశాంతి రేగుతుంది. బ్యుతోని అనుక్షణం అసహ్యించుకుంటూ తనని తాను రక్షించుకుంటూ ఉంటుంది ఫ్రాంస్వాజ్ . అతడు కనిపిస్తే  చాలు ఒళ్ళు మండి పోతుంది ఆమెకి.

రోజ్ మరణంతో (ఒక చిన్న వాగ్వాదం లో బ్యుతో తల్లిని ఒక తోపు తోయడం తో కింద పడి గాయాల పాలై మరణిస్తుంది) ఒంటరి వాడైన పువాన్ కి ఒప్పందం ప్రకారం నెల నెలా ఇవ్వాల్సిన ధాన్యం , డబ్బు ఇవ్వడం మానేస్తారు జీసస్ బ్యుతోలు! కూతురు ఫానీ తన ఇంట్లో ఉండమంటుంది కానీ ఆమె క్రమశిక్షణకు, శుభ్రతా నియమాలకు పువాన్ తట్టుకోలేక పోతాడు. అతడి బతుకు దుర్భరమవుతుంది. అతడి దగ్గర మిగిలిన డబ్బు కూడా కాజేయడానికి తన వద్ద వచ్చి ఉండమని ఆహ్వానిస్తాడు మురికి జీవి జీసస్. అతడి దగ్గర కూడా ఉండలేకపోతాడు పువాన్. గత్యంతరం లేక బ్యుతో లిజాల ఇంటికే చేరతాడు. అక్కడ బ్యుతో,  ఫ్రాంస్వాజ్ మీద చేయబోయే అత్యాచార ప్రయత్నాల్ని చూసి సహించలేకపోయినా..వారించే ప్రయత్నమూ చేయలేడు..బలహీనత వల్ల, నిస్సహాయత వల్లా!
ఈ విషయమై అక్కా చెల్లెళ్లకి గొడవలు, బ్యుతో చేతిలో లిజాకి తన్నులు, అతడితో గడిపేందుకు ఒప్పుకోమని చెల్లెలెకి అక్క వేడుకోళ్ళు… ఈ హింస పడలేక బ్యుతోని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్ ని  పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! ఆస్తి దక్కకుండా పోయినంద్కు పీక్కుంటాడు బ్యుతో! అక్కా చెల్లెళ్ల మధ్య ఆస్తి విషయమై తీవ్ర శత్రుత్వం నెలకొంటుంది. ఒక్కటిగా మెలిగిన ఇద్దరూ బద్ధ శత్రువులై పొతారు. ఫ్రాంస్వాజ్  గర్భవతి అవుతుంది.

ఫ్రాంస్వాజ్ కి పిల్లలు పుడితే ఆస్తి పరాయి ఇంటికి పోతుంది. అందుకే అక్కడి మూఢ నమ్మకం ప్రకారం , గర్భ వతి అయిన ఆ పిల్ల పొట్ట మీద శిలువ ఆకారంలో చేత్తో గీత గీయాలని నిర్ణయించుకుంటారు లిజా బ్యుతోలు! అలా చేస్తే కడుపు పోతుందని వాళ్ళ నమ్మకం. ఒంటరి గా పొలానికి వస్తున్న ఆమెను అటకాయిస్తాడు బ్యుతో! ఆమె మీద అత్యాచారం చేస్తాడు. లిజా అందుకు సహకరిస్తుంది.
అక్కా చెల్లెళ్ల మధ్య పోరాటం. ఆ పోరాటంలో లిజా తోసిన తోపుకి ఫ్రాంస్వాజ్ కొడవలి మీద పడి తీవ్ర గాయాల పాలవుతుంది.  ఈ ఘాతుకాన్ని అంతటినీ గడ్డి వాము వెనక నుంచీ చూసిన పువాన్ హడలి పోతాడు. మూడు రోజుల మరణ యాతన తర్వాత ఫ్రాంస్వాజ్ తను పట్టు తప్పి కొడవలి మీద పడ్డానని అందరికీ చెప్పి మరణిస్తుంది.  ఆమె భర్త పేరు మీద ఆస్తి రాయక పోవడం తో ఆస్తి అంతా లిజా బ్యుతోల పరమవుతుంది.

ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న పువాన్ ని కూడా లిజా బ్యుతోలు హతమారుస్తారు. జాన్ ఒంటరి వాడై పోతాడు మళ్ళీ. ఆస్తి భార్య తన పేరు మీద రాయనందుకు కొంత నొచ్చుకుంటాడు. ఇక ఆ వూరిలో ఉండబుద్ధి కాక సైన్యంలో చేరడానికి వెళ్ళి పోతాడు.

ముందు చెప్పుకున్నట్లు ఈ నవల్లో అసంఖ్యాక పాత్రలు కనిపిస్తాయి. రోజ్ సోదరుడు చార్లెస్ కుటుంబం, భూమి మీద ప్రేమతో నష్టాలొస్తున్నా సరే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తూ భూమిని వదిలి పోలేని అలెగ్జీ, అతని ఇంట్లో పని చేస్తూ…పరాయి మగాళ్ళ కోసం నిరంతరం అర్రులు చాచే దాసీ జాక్ లిన్, తినడానికి గింజలు లేక నానా చాకిరీ చేస్తూ అమ్మమ్మ లగ్రాంద్ ఆదరణకు నోచుకోని పాల్మీరు, ఆమె మతి స్థిమితం లేని తమ్ముడు ఇలారియోం, ఇరుగు పొరుగులు లఘ్రీమా, మాక్రోం, ,బెక్యూ, చర్చి ఫాదర్ గోబెదార్, ఇంకా ఊర్లో పెద్ద మనుషులూ…..ఇలా!

వీళ్లంతా భూమి కోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. ఆ మట్టి కి సేవ చేస్తూ ఆ పరిమళాల్లో పరవశించి పోవాలని తపన పడుతుంటారు. పగలు కక్షలు పెంచుకుంటారు. రక్త సంబంధాలను కూడా లెక్క చేయక…అత్యా చారాలకు హత్యలకు ఒడిగడతారు.  అంతా కలిసినపుడు తాగి తందనాలాడతారు మళ్ళీ!

ఈ నవల్లోని ప్రతి పాత్రనూ నగిషీలతో చెక్కిన రచయిత పని తనం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. తమకంటూ ఏమీ మిగుల్చుకోక పిల్లల కు సర్వంధార పోసి అధోగతి పాలైన తండ్రి గా పువాన్ కళ్ల ముందు నిల్చి పోతాడు.

ఫ్రాన్స్ లోని ఆ వ్యవసాయ క్షేత్రాల వర్ణనా, వాళ్ళ ఆచార వ్యవహారలు,ద్రాక్ష తోటల్లో యువతీ యువకుల విహారాలు ఇవన్నీ ఫ్రెంచ్ పరిమళాన్ని అద్దుకుని ఆ వాతావారణం అంతా కళ్ళకు కడుతుంది. యురోపియన్ సమాజపు విచ్చలవిడి సెక్స్ సంబంధాలు, ముతక హాస్యాలు నవలంతా పరుచుకుని ఉంటాయి అంతర్లీనంగానే అయినా! అంతే  కాక ధాన్యానికి మద్దతు ధర లభించడం గురించిన చర్చలు, ఆధునిక యంత్రాల వినియోగం పట్ల విభిన్న అభిప్రాయాలు, ఎన్నికలు, వాటి మీద రైతుల అభిప్రాయాలు, అజ్నానాలు , రైతాంగ పోరాట చరిత్ర..ఇవన్ని ఈ నవలలో విస్త్రతంగా చోటు చేసుకుంటాయి. ఇవి కథకు అంతరాయాన్ని కలిగించవు సరి కదా, పాత్రలే ఆ చర్చల్లో పాల్గొనడం వల్ల మరింత ఆసక్తి కరంగా తోస్తాయి !

అంత విచ్చల విడి తనం మధ్యలోనూ…ఫ్రాంస్వాజ్ పట్ల తన ప్రేమను మనసులోనే దాచుకుని ఎలా వ్యక్త పరచాలో తెలీక మధన పడే జాన్ బహు సున్నితంగా కనిపిస్తాడు.మరో వైపు జీవితాంతం తాను అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యా చారం చేసినపుడు ఫ్రాంస్వాజ్ భావ ప్రాప్తిని పొంది పరవశంతో కేకలు వేయడం పాఠకుడిని నివ్వెర పోయేలా చేస్తుంది. అను క్షణం తాను పైకి అసహించుకున్నా, తన శరీరం కోరుకుంది బ్యుతోనే అని ఫ్రాంస్వాజ్ చావ బోయే ఆఖరి క్షణాల్లో గుర్తించడం ఫ్రాంస్వాజ్ కే ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

అడుగడుగునా రైతుల స్వార్థం  , స్వాభిమానం, మొండి తనం స్వలాభం, మూర్ఖత్వం,, కుట్ర, కృతఘ్నత మోసం, దగా..వీటన్నిటినీ వారి కఠోర  శ్రమ, కటిక దారిద్ర్యాల వెలుగులో పాఠకుడు సరిగా అర్థం చేసుకోవాలని, వాటిని సహజ మానవ ప్రవృత్తి గా చూడాలని ముందు మాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాళ్ళని చెడ్డ వాళ్ళు గా కాక “మనుషులు” గా అర్థం చేసుకోవాలి అంటాడు.
ఈ నవల కోసం ఎమిల్ జోలా సేకరించిన నోట్స్ అంతా పారిస్ లైబ్రరీ లో ఇప్పటికి కట్టలు కట్టలుగా భద్రంగా ఉందట. ఇలాంటి ప్రయత్నం మన తెలుగు సాహిత్యం లో ఏదైనా జరిగిందేమో తెలియదు. జరిగినా ఆనాటి నోట్స్ అంటా భద్రంగా దాచేంత  శ్రద్ధ మనకు ఉన్నట్లు తోచదు.

ఇంత చెప్పుకున్నాక అనువాదం గురించి చెప్పుకోక పొతే ఈ నవలా పరిచయం పూర్తయినట్లు కాదు. దీన్ని ప్రముఖ అనువాదకుడు సహవాసి తెలుగులోకి అనువదించారు.

కథ ఫ్రాన్స్ లో నడుస్తున్నా, వాతావరణం దాన్నేస్ఫురింప జేస్తున్నా….అచ్చ తెలుగు పదాలు మాటలు కోకొల్లలుగా చోటు చేసుకున్న అద్భుతమైన అనువాదం ఈ నవలను  పూర్తిగా తెలుగు వారికి సొంతం చేసేస్తుంది. బాటిల్స్  అనే మాట వాడాల్సి వచ్చినపుడల్లా పక్కా గ్రామీణ భాషలో దాన్ని (ఎందుకంటే కథ యావత్తు పల్లె లోనే నడుస్తుంది మరి) “బుడ్లు ” గా అభివర్ణిస్తాడు. “మూడు తూర్లు“(మూడు సార్లు), “ఇటు ఒచ్చే తలికి “(ఇటు వచ్చే సరికి), “పడ్డ” (గేదె), చల్ల మాపటి వేళ ,చేను కాడికి.. గెనం  మీద( గట్టు మీద)ఇలాంటి పల్లె పదాల పరిమళా లతో  నవల యావత్తు ఘుమ ఘుమ లాడి  పోతుంది. ఎక్కడా బిగి తగ్గని, ఆసక్తి సడల నివ్వని అనువాదం! పర భాషా సాహిత్యాన్ని తెలుగులోకి ప్రతిభా వంతంగా పరిచయం కావాలంటే అనువాదం ప్రభావ శీలంగా  ఉండి  తీరాలని ఈ నవలలో నిరూపణ  అవుతుంది.

కొస మెరుపు ఏమిటంటే…ఈ నవల రాసిన తర్వాత యాభై ఏళ్ళకి ఎమిల్ జోలా అల్లుడు ఈ నవలలో వర్ణితం అయిన  రోన్య గ్రామానికి మూలమైన పల్లెకి వెళ్ళాడట. నవలలో పాత్రలన్నీ ఆ గ్రామం లోనిమనుషులే ! ఆ నవల వెలువడిన తర్వాత ఆ గ్రామం లో వారందరికీ దాని కథ తెలిసింది. వూళ్ళో వాళ్ళందరికీ నవల కొట్టిన పిండే! నవలలో పాత్రలన్నీ కారుడు గట్టిన స్వార్థం మూర్తీభవించిన పాత్రలే కాబట్టి, ఆ పాత్రలన్నింటికి వూర్లో మనుషులే మోడళ్ళు కాబట్టి, పాపం వాళ్ళేమైనా నోచ్చుకున్నారేమో అని ఆయన విచారించ బోయాడు.  తమ పల్లెను, పల్లీయుల్ని చెత్త గా  అభివర్ణించి నందుకు  వాళ్ళు ఏమి కోపం తెచ్చుకోలేదు. అయితే ఎవరిని వారు ఆయా పాత్రలతో సరి పోల్చుకోకుండా “ఫలానా బ్యుతో పాత్ర..అబ్బో బహు చెత్త…అదిగో ఆయనే ఆ పాత్రకి మూలం” అంటూ చెత్త పాత్రలన్నింటిని ఇరుగు పొరుగు వారితో యిట్టె పోల్చేసారట. డగ్లస్ పార్మి చెప్పినట్లు ఈ ధోరణిని కుడా మనుషుల సహజ లక్షణం గా మనం అంగీకరించాల్సిందే! ఫలానా చెత్త పాత్ర లక్షణాలు నాలో ఉన్నాయి అని ఎవరు ఒప్పుకుంటారేం మరి??

ఈ నవలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు 1983లో వేసారు. ప్రస్తుతం బయట ఎక్కడా అందుబాటులో లేదు. ఇలాంటి మంచి పుస్తకాలను మళ్లీ  వేసే బాధ్యతను పబ్లిషర్స్ తీసుకుంటే ఎంత బాగుంటుందో!
తెలుగు లో ఇది అందుబాటులో లేకపోయినా ఇంగ్లీష్ వెర్షన్ pdf రూపం లో ఇక్కడ లభ్యం.
http://ia700208.us.archive.org/14/items/thesoil00zolauoft/thesoil00zolauoft.pdf