రచయితలు మనుషులుగా నిష్క్రమించినా, రచనలుగా ఎప్పటికీ మిగిలే ఉంటారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే, అయ్యో వీళ్ళు బతికుండగా కలుసుకోలేక పోయినా కనీసం సమకాలికులుగా అయినా లేమే? అనిపిస్తుంది. అలాటి వాళ్లలో జాక్ లండన్, హెమింగ్వే తప్పకుండా ఉంటారు నా లిస్టులో. స్వేచ్ఛా ప్రవృత్తితో ఇష్టమైన జీవితాన్ని బతికినన్నాళ్ళూ గడిపిన వాళ్ళే ఇద్దరూ! జాక్ లండన్ కి రిగ్రెట్స్ ఏమీ లేవేమో గానీ హెమింగ్వే జీవితాన్ని, తనకు తానే రాసుకున్న మరణ శాసనాన్ని చూస్తే ఉన్నాయేమో అనిపిస్తుంది. సొసైటీ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని, తమ నిష్క్రమణ వెనుక సాగబోయే ఊహాగానాల్ని లెక్క చేయక మరణాన్ని కౌగిలించుకునే సెలెబ్రిటీల మనసుల్లో దాగున్న అగాథాలేమిటో, ఎంత లోతైనవో, ఎన్ని అగ్ని పర్వాతలను దాచుకున్నవో!
ఒకప్పుడు ఇతర భాషల గొప్ప సాహిత్యం ఏ నాండిటెయిల్ పుస్తకాల ద్వారానో పరిచయం కావడం, ఆ సమయానికి ఆయా రచయితలంతా మన గత జన్మలోని వాళ్ళు కావడం, తర్వాతెప్పుడో వాళ్ల పుస్తకాలను తీరిగ్గా చదువుకునేటప్పుడు “అబ్బబ్బా, ఇన్నాళ్ళూ వదిలి చాలా పొరపాటు చేశాను” అనుకోడం మామూలు ! పదో క్లాస్ లో అనుకుంటా “అతడు అడవిని జయించాడు” చదవడం ఫలితంగా హెమింగ్వే పరిచయం అయ్యాడు. అయితే ఆయన పుస్తకాలేవీ ఆ వెంటనే చదవలేదు. తర్వాత యూనివర్సిటీ రోజుల్లో ఎలాగో దొరికించుకుని చదివామనుకోండి.
గొప్ప రచయితల జీవన శైలి, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం పట్ల సగటు పాఠకుడికి ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది! మన దేశంలో రచయితల జీవిత విశేషాలను భద్రపరిచిన లోకల్ ప్రభుత్వాలు కనపడవు. గురజాడ ఇల్లో, చలం ఇల్లో, మ్యూజియాలుగా మార్చినా వాటిని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాటిని టూరిస్ట్ లకు ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఎంతవరకూ అభివృద్ధి చేసి వాటిని టూరిజం బ్రోచర్స్ లో చేరుస్తున్నారో, అసలు ఎంతమంది పాఠకులు వాటి కోసం చూస్తారు?…ఇవన్నీ అంతుపట్టే విషయాలు కావు. అమెరికాలో భౌతికంగా కనుమరుగైన దాదాపు అందరు రచయితల ఇళ్ళను మ్యూజియాలుగా మార్చి , వారికి సంబంధించిన వస్తువులను జ్ఞాపకాలుగా పదిలపరిచి మిగిలిఉన్న వాళ్ళకు చూపించడం ఒక అతిమంచి సంప్రదాయం.
ఓ హెన్రీ ఆస్టిన్లోనూ, శాన్ ఆంటోనియో లోనూ నివసించాడనీ, హెమింగ్వే క్యూబాలోనూ, కీ వెస్ట్ లోనూ నివసించాడని బహుశా చదవడం జరిగే ఉంటుంది గానీ, ఆస్టిన్లో నేనూ నివసిస్తాననీ, కీ వెస్ట్ పోయి చూస్తానని అప్పుడు ఊహించలేదు కాబట్టి గుర్తు పెట్టుకోలేదు. ఆస్టిన్లో మా ఇంటికి సరిగా ఐదు మైళ్ళ దూరంలోనే ఓ హెన్రీ ఇల్లు ఉందని తెలిసినపుడు ఆశ్చర్యం! తర్వాత ఆ ఇల్లు చూసినపుడు “గిఫ్ట్ ఆఫ్ మెజై” నేను ముట్టుకుని చూసిన ఆ రైటింగ్ టేబుల్ మీద రాశాడని తల్చుకుంటే గొప్ప సంతోషం కలిగింది.
జ్ఞాపకాలెప్పుడూ బావుంటాయి. అవి మన ఇంట్లో వదులై పోయిన మడత కుర్చీ అయినా, ఫ్రేములూడి పోయి చెమ్మ చేరిన బ్లాక్ అండ్ వైట్ ఫోటొలైనా, మహా రచయితల ఫైర్ ప్లేసూ, పేము కుర్చీలైనా సరే..
ఆ క్రమంలోనే ఫ్లోరిడా అంచున, హెమింగ్వే కి ఎంతో ఇష్టమైన క్యూబా కి 90 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న కీ వెస్ట్ చూసేందుకు వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు అక్కడ హెమింగ్వే ఇల్లు ఉందని తెల్సింది. మయామి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వూరి మొదట్లో ఒక చిన్న రోడ్ హౌస్ లాంటి దగ్గర ఆగితే, అక్కడ పని చేస్తున్న అమ్మాయి, మొదటి సారి అక్కడికొచ్చామని తెలుసుకుని “ఏది మిస్ అయినా, హెమింగ్వే ఇల్లు మిస్ కాకండి” అని సలహా ఇచ్చింది. ఆయన రాసిన పుస్తకాల్లో తనకేవి నచ్చాయో ఎందుకు నచ్చాయో కూడా లంచ్ పూర్తయ్యే లోపు చక్కగా పంచుకుంది. “Fifth column and the first 49 stories చదివుండక పోతే కొనుక్కోమని రికమండ్ చేసింది. కథలు రాయాలనుకున్న వాళ్లెవరైనా సరే, అది చదివితే మంచి ఫలితం ఉంటుందని చెప్పింది.
బాగా డబ్బులు సంపాదించడం మూలానా, ఇష్టమైన రీతిలో స్వేచ్ఛా జీవనాన్ని గడిపిన మూలానా హెమింగ్వే లైఫ్ స్టైల్ ఎంతైనా వేరనిపిస్తుంది ! కానీ ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు స్త్రీలను వివాహమాడినా, ఆయనకు కావలసిందేదో దొరక్కుండా ఉండి పోయిందని, మనసులో ఎన్నటికీ పూడని ఒక ఖాళీ తనమేదో ఉందనీ అనిపిస్తుంది. యుద్ధ వాతావరణంలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేసినపుడు ఒక నర్స్ తో దాదాపుగా పండిన ప్రేమ ఒక్క సారిగా ఆమె తిరస్కారంతో రాలి పోవడంతో హెమింగ్వే చాలా కుంగి పోయి ఆ బాధను చాలా రోజులు మోసుకు తిరిగాడు. అందుకేనేమో ఆయన ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించిన భార్యలకు తనను తిరస్కరించే అవకాశం ఇవ్వలేదని అంటారు.ఈయనే ముందు విడాకులు ఇచ్చేశాడు.
కీ వెస్ట్ లో హెమింగ్వే నివసించిన అందమైన ఈ ఇల్లు ని 1851 లో మెరైన్ ఆర్కిటెక్ట్ తిఫ్ట్ అనే ఆయన కట్టుకున్నాడు. స్పానిష్ నిర్మాణ పద్ధతుల్లో పునాదులు తీసి, పటిష్ఠంగా సున్నపు రాతితో కట్టడం వల్ల ఇవాల్టికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న ఈ ఇల్లుని 1931 లో హెమింగ్వే కొనుక్కున్నాడు. అయితే ఆయన 1940 వరకు మాత్రమే ఆ ఇంట్లో నివసించాడు. పారిస్ లో పెళ్ళాడిన రెండో భార్య పాలిన్ మారీ ఫైఫర్ ని, ఆమె పిల్లలని అక్కడే విడిచి పెట్టి క్యూబా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక, పాలిన్ కి విడాకులిచ్చి నాలుగో భార్యగా తన పాత స్నేహితురాలు మేరీ వెల్ష్ ని పెళ్ళి చేసుకున్నాడు. చివరి వరకూ ఈమే అతని భార్యగా ఉంది.
పాలిన్ మాత్రం మరణించే వరకూ కీ వెస్ట్ ఇంట్లోనే నివసించింది. ఆ తర్వాత ఆ ఇల్లు అదే వూర్లో దువాల్ స్ట్రీట్ కి (ఈ వీధి ఇక్కడ చాలా ప్రసిద్ధి. వ్యాపారమంతా ఇక్కడే జరుగుతూ, టూరిస్టులతో సందడిగా ఉండే బజారు ఇది ) చెందిన బెర్నిస్ డిక్సన్ కొని కొన్నాళ్ళు నివసించాక, (స్వతహాగా వ్యాపారస్తురాలు) ఈ ఇల్లుని హెమింగ్వే మ్యూజియంగా మార్చాలనే ఆలోచనతో (ప్రవేశం ఉచితం కాదు) ఇంటికి వెనుక ఉన్న చిన్న గదిలో తను ఉండటానికి నిర్ణయించుకుని ఇంటిని మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు ఉంచింది. ఆమె నివసించిన చిన్న గది ఇప్పుడు బుక్ స్టోర్ గా చెలామణిలో ఉంది. ఇప్పటికీ ఆమె వారసుల నిర్వహణ క్రిందే ఉన్నది మ్యూజియం.
విశాలమైన ప్రాంగణంలో, అతి చక్కని తోట లో నిలిచి ఉండే ఈ ఇల్లు వెనుక కూడా రెండంతస్తుల నిర్మాణం మరొకటి ఉంది. దాన్లో పై భాగంలో హెమింగ్వే స్టడీ రూం ఉంది. ముందువైపు ఉన్న ప్రధాన భాగంలో ఆయన జీవితాన్ని, జీవన శైలిని ఆవిష్కరించే ఫొటోలూ, వాడిన వస్తువులూ,ఆయన రచనల తాలూకు సినిమాల పోస్టర్లూ, ఆయన, పాలిన్ సేకరించిన కళా ఖండాలూ, పెయింటింగ్సూ.. వగైరాలు.
హెమింగ్వే గురించి చెపుతూ మన కూడా తిరిగే గైడ్ “హెమింగ్వే జీవితాన్ని ఆత్మ హత్యతో ముగించాడు” అని చెప్పే వాక్యం ఆ ఇంటిని చూడ్డం తాలూకు ఆనందానికి బ్రేక్ లా అడ్డు పడుతుంది. ఎన్నో సార్లు ఆత్మ హత్యా ప్రయత్నాలు చేశాక చివరికి ఐడహో లోని తన ఇంట్లో తన ప్రయత్నాన్ని స్వయంగా విజయవంతంగా ముగించాడు హెమింగ్వే.
ఆయన తండ్రి, సోదరి, వీళ్లంతా ఆత్మ హత్యలు చేసుకున్న చరిత్ర ఉంది కాబట్టి, సూయిసైడల్ టెండెన్సీ వాళ్ళ జీన్స్ లో ఉండొచ్చని కొందరు తీర్మానించడం కరెక్టో కాదో కానీ, హెమింగ్వే జీవితంలో చాలా పోగొట్టుకునే ఉంటాడని ఆయన గురించి చదువుతుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన , ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న మొదటి భార్య హాడ్లీకి విడాకులివ్వాల్సి రావడం హెమింగ్వే పైకి దర్పంగా కనిపించినా ఆయన్ని బాగా బాధ పెట్టిన సంఘటన. పారిస్ లో పరిచయమైన పాలిన్ తో ప్రేమలో పడి, ఆ విషయం హాడ్లీకి తెలియడం తో ఆమెకు విడాకులివ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన వివాహ బంధానికి పెద్దగా విలువ ఇచ్చినట్టు కనిపించదు.
కీ వెస్ట్ లో హెమింగ్వే జీవితం చాలా ఉల్లాసంగానే గడిచింది.సహజంగానే ప్రకృతి సౌందర్యంతో, నాలుగు వైపులా పర్చుకున్న నీలి రంగు కల్సిన ఆకుపచ్చని అనంత జలరాశితో కీ వెస్ట్ ఎంతో అందమైన ప్రాంతం. అక్కడే ఆయనకు ఒక స్నేహితుల గుంపు తయారైంది. అందరూ కల్సి విశాలమైన సముద్ర జలాల్లో విహారాలకు వెళ్ళడం, చేపలు పట్టడం, అప్పుడప్పుడు బాతుల వేట, ఉదయాన్నే నవలలో కథలో రాసుకోవడం.. ఇలా హాయిగా గడిచి పోయింది. ఆ స్నేహితులందరితో ఉన్నప్పుడే ఆయనకు “పాపా” (స్పానిష్ లో “డాడీ” అని అర్థం) అనే నిక్ నేమ్ వచ్చిందట. ఆ పేరు ఆయనకు క్యూబా వెళ్ళాక కూడా కొనసాగింది.
క్యూబాలో హెమింగ్వే ఇల్లు కూడా చాలా పెద్దది.ఎకరాల కొద్దీ స్థలంలో పెద్ద తోటలో బోలెడంత మంది స్నేహితులతో హెమింగ్వే చక్కని జీవితమే గడిపాడిక్కడ. “ఓల్డ్ మాన్ అండ్ ది సీ” ఇక్కడే రాశాడు కూడా! అంతే కాదు, క్యూబా పోరాటవాదుల పట్ల సానుభూతితో కూడా ఉండేవాడు. “చెగెవారా, కాస్ట్రోల తర్వాత క్యూబా ప్రజల్లో అంతటి గొప్ప ఆరాధనని సొంతం చేసుకుంది హెమింగ్వేనే” అంటాడు జాకొబో టైమర్ మాన్ అనే జర్నలిస్ట్.
మయామి గ్లోబ్ పత్రిక లో పని చేసే Denne Bart Petitclerc అనే రిపోర్టర్ హెమింగ్వే పుస్తకాల ద్వారా ప్రభావితుడై, చక్కని వాక్యం కూడా రాయడం నేర్చుకుని, ఆయన కి ఉత్తరాలు రాస్తుండేవాడు. తర్వాత కలుసుకున్నాడు కూడా! క్యూబా లో హవానా లో హెమింగ్వే తో గడిపిన రోజుల్ని ఆయన అక్షరీకరించడమే కాక అది “పాపా” అనే సినిమాగా కూడా (స్క్రీన్ ప్లే రాశాడు) రూపొందించడం లో పాలు పంచుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యే నాటికి జీవించి లేడు. ఈ సినిమాలో మనం హెమింగ్వే, ఫైఫర్ పాత్రలను చూడొచ్చు. ఇందులో ఆయన మీద కోస్టల్ సెక్యూరిటీ ఒక కన్నేసి ఉంచినట్టూ, క్యూబన్ పోరాట యోధుల కి ఆయన ఆయుధాలు కూడా సరఫరా చేసినట్టూ దృశ్యాలు చోటు చేసుకున్నాయి కూడా (కోస్టల్ సెక్యూరిటీ బోటు వెంటాడుతుంటే తన ఫిషింగ్ బోటు లో దాచిన తుపాకులన్నీ సముద్రంలో పారేస్తాడు హెమింగ్వే)
ఈ సినిమాలోనే హెమింగ్వే మనసు స్థిరంగా లేదనీ, ఆయన ఆలోచనలు ఆత్మహత్య వైపు మళ్ళుతున్నాయనీ సూచించే దృశ్యాలున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి నిజానికి. వాటిలో ఏ ఒక్కటో కారణం అనడం స్పెక్యులేషనే! వెంటాడుతున్న అనారోగ్యం, వివిధ సందర్భాల్లో దెబ్బలు తగిలి ఎంతకీ మానని గాయాలు, పాత స్నేహితులంతా ఒక్కొక్కరుగా మరణించడం, ఇవన్నీ కారణాలే. వీటన్నిటివల్లా 55 ఏళ్లకే ఇంకా ఎక్కువ వయసు పైబడిన వాడిలా హెమింగ్వే కనిపించే వాడని టైమర్ మాన్ కూడా అంటాడు. అయితే మేరీ తో ఆయన వైవాహిక జీవితం కూడా కనిపిస్తున్నంత అందంగా లేదని ఈ సినిమాలో స్పష్టం అవుతుంది. ఇద్దరికీ తరచూ మాటా మాటా పెరగడం, దెబ్బలాడుకోవడం సాధారణంగా మారుతుంది. పెతిత్ క్లెర్క్, హెమింగ్వే చిరకాల స్నేహితుడు ఇవాన్ షిప్ మన్ ని అడుగుతాడు “ఎందుకిలా ఉన్నారు వీళ్ళు?” అని.
అతడంటాడు “చాలా జంటల లాగే పెళ్ళి బంధం అయితే ఉంది గానీ, వారిద్దరి మధ్య సరైన సాహచర్యం, స్నేహం లేవు. ఏ పెళ్ళి లో అయినా కొన్నాళ్ళకి ఇలాగే జరుతుంది. నిజానికి నా పెళ్ళి కూడా అలాటిదే. అసలు ఎవరిది మాత్రం కాదనీ?” అంటాడు.
హెమింగ్వే తన మిత్రుడితో మాట్లాడుతూ ఫైఫర్ కోసం హాడ్లీని వదిలి పెట్టానని బాధ పడతాడు. మేరీ కూడా గొడవలైనపుడు “వెళ్ళు, ఆ హాడ్లీ దగ్గరికే పో” అంటుంది.
ఎన్నో గొప్ప రచనలు చేసి, ఎంతో ఆర్జించి, స్వేచ్ఛాజీవి అయి తనకు ఇష్టమైనట్లు జీవించిన (ఖాకీ షార్ట్స్ ధరించి, ఒక్కోసారి చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, రెండో ప్రపంచ యుద్ధానికి సాక్ష్యంగా తన జ్ఞాపకాలను కథలు గా రాసుకుంటూ, చేపలు పడుతూ, తాగుతూ, స్నేహితులతో కలుస్తూ, కొత్త వాళ్లతో ఇట్టే స్నేహాలు చేస్తూ రెగ్రెట్స్ లేకుండా బతికాడు) హెమింగ్వే. తట్టుకోలేని సంఘర్షణల వల్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు.
ఆ సంఘర్షణ ఏమిటన్నది ఆయనకే తెలిసి ఉండాలి తప్ప ఇంకెవరికీ కాదు.
హెమింగ్వే హౌస్ (మ్యూజియం) లో పని చేసే స్టాఫ్ అన్ని చోట్ల లాగే చాలా స్నేహ పూర్వకంగా స్వాగతించి అన్ని విశేషాలూ వివరిస్తారు. వాళ్ళలో ఒకతను చెప్పాడు “హెమింగ్వే వల్ల కీ వెస్ట్ మరింత ప్రాచుర్యం పొందింది. అంతకు ముందు ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. కానీ హెమింగ్వే ఇక్కడ నివసించాడని తెలిశాక, అనేక మంది ఈ ఇల్లు చూడ్డం కోసం, ఆయన సమక్షంలో ఉన్నట్టు కాసేపు అనుభూతిని కల్పించుకోవడం కోసం కూడా ఇక్కడికి రావడం మొదలైంది. ఇక్కడికి వచ్చిన ఏ టూరిస్టూ ఈ ఇల్లు చూడకుండా వెళ్ళడు”
మార్జాల సంపద:
హెమింగ్వే గురించి గూగుల్ లో ఏదైనా వెదుకుతున్నపుడు, Hemingway’s cats అన్న సజెషన్ తప్పకుండా వచ్చి తీరుతుంది. పిల్లులంటే హెమింగ్వేకి ప్రాణం. ఆయన భార్య పాలిన్ కి కూడా! వాళ్లు పెంచుకున్న పిల్లుల తాలూకు సంతతి,వాటి సంతతి, ఇలా వృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంట్లో అరవై కి పైగా పిల్లులు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆరేసి కాలి వేళ్ళు ఉన్న పిల్లులే!ప్రతి పిల్లికీ ఒక ప్రత్యేకమైన పేరు. ఆ అరవై+ పేర్లను స్టాఫ్ గుర్తు పెట్టుకోడమే కాక, ఒకేలా కనిపిస్తున్న రెండు పిల్లులలో ఏ పేరు దేనిదో కూడా గుర్తించి పిలవడం ఒక ఆశ్చర్యమైతే, అవి చక్కగా పేర్లకు స్పందిస్తూ దరి చేరడం మరొక ఆశ్చర్యం. ఆ పిల్లులన్నిటికీ ఆయన స్నేహితుల పేర్లు, వాళ్ళ ఇంటిపేర్లు (లస్త్ నమెస్) కొనసాగుతున్నాయి. హెమింగ్వే కీ వెస్ట్ ఇంట్లో ఈ పిల్లులు ఒక పెద్ద విశేషం. ఈ ఇంటి బయట నిత్యం సందర్శకులు బారులు తీరి నిల్చుని కనిపిస్తారు. సెలవు రోజుల్లో చెప్పనే అక్కర్లేదు.
ఇంటి ఆవరణలోనే సాహిత్య ప్రియులైన వధూ వరులు పెళ్ళి చేసుకునే వెడ్డింగ్ ప్లాన్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
హెమింగ్వే తమ రాష్ట్రంలో ఉండటం ఫ్లోరిడా కే గర్వకారణమని ఫ్లోరిడా జనం, తమ దేశంలో ఉండటం వల్ల ఆయన తమ వాడేనని క్యూబా ప్రజలూ భావిస్తుంటారట. ఆయన్ని ఒక ఒక జనం మనిషిగా, ఒక ఫ్రీ స్పిరిట్ గా, ఒక అద్భుతమైన వ్యక్తిగా అందరూ గుర్తించాలని క్యూబా ప్రజలు డిమాండ్ చేస్తారట కూడా.
హెమింగ్వే జీవితం అసలు ఎన్నడూ తీరిక లేని, విరామమే ఎరగని ఒక విలాసవంతమైన, వికాసవంతమైన గొప్ప జీవ కావ్యం.(ఈ విలాసాల్లో స్నేహితులూ, హాబీలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ, ప్రణయాలూ భాగాలు. డబ్బు కంటే ఇతరవాటికి ప్రాముఖ్యం ఎక్కువ, వాటిలో డబ్బుతో దొరికేవి ఉన్నప్పటికీ)
హెమింగ్వే ఉత్తుంగ తరంగమై ఎగసి పడిన ఒక అల! అది ఎలా నేల కూలిందన్న దానికంటే ఎంత ఎత్తుకి ఎదిగి, ఎంత మందిని ప్రభావితం చేసిందన్నదే ముఖ్యం! ఆ ఎత్తులకు, ఆయన జీవన శైలికి, జీవితానికి సాక్ష్యాలుగా, ఆయన యుద్ధంలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేసిన నాటి నుంచీ, పారిస్ జీవితం, పెళ్ళిళ్ళు, చేపల వేట, బాతుల వేట, సముద్రంలో సాహసాలూ, వీటన్నిటి ఫొటోలూ ఆ ఇంట్లో కనిపిస్తాయి. రాసుకోడానికి ఆయన వాడిన పోర్టబుల్ టైప్ రైటరూ ,పెన్నులూ, ఆయన పుస్తకాల కలెక్షనూ, కాఫీ తాగిన కప్పూ,కూచున్న కుర్చీ, కాళ్ళు పెట్టుకున్న ఓటోమన్..ఇవన్నీ ఆ కాసేపైనా హెమింగ్వే సమక్షాన్ని కల్పించక మానవు.
చరిత్రలో గొప్ప గొప్ప కవులూ రచయితలూ చాలా మందే స్వచ్ఛందంగా జీవితాన్ని ముగించుకున్నారని చదివినపుడు వాళ్లలో ఫ్రీ స్పిరిట్ హెమింగ్వే కాకుండా, సముద్ర సాహసాలతో, జర్నలిస్ట్ గా, రచయితగా , స్వేచ్ఛను ప్రేమిస్తూ జీవించిన జాక్ లండన్ కూడా ఉన్నాడనీ, ఆయన కూడా ఆత్మహత్యకే “పాల్పడి ఉండొచ్చనీ” తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
**** (*) ****
చాలా బాగా రాసారు..
బాగుంది. లోపల ఖాళీలని నింపడం చాలా కష్టం. ఒంటరితనం భయంకరమైనది.
భీమ్లిలో చెలం గారింట్లో కూడా పిల్లులున్నాయి.