చదువు

ఈ కథల్లో కన్నీరు అంటే కరుణ!

ఫిబ్రవరి 2013

రోడ్డు మీద నడుస్తుంటాం, ఆఫీసులో పని చేస్తుంటాం,.ఏదో ఒక వూరు వెళ్తాం….! ఈ సందర్భాలు అన్నింటిలోనూ కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు కనిపిస్తారు. వారిలో కొందరు మనల్ని ఆకర్షిస్తారు. కొందరితో మాట్లాడతాం. కొందరితో స్నేహం కూడా చేస్తాం! మరి కొందరిని అసలు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, గమనించకుండా వదిలేస్తాం..!! అదిగో ఆ వదిలేసిన వాళ్ళే సుబ్బ రామయ్య గారి కథలకు వస్తువులుగా తిరిగి మనకు పరిచయం అవుతారు. మనసులోకి వచ్చిన ఒక ఆలోచనో స్పందింప జేసే ఒక సంఘటనో కాక, తన చుట్టూ ఉన్న మనుషుల్లోంచి సమాజం సులభంగా విసర్జించి పారేసిన వారిని తాను ఎన్నుకుని పరిశీలిస్తూ..ఆ అభాగ్యులతో పాటు ప్రయాణిస్తూ మనల్ని కూడా తనతో పాటు చేయిపట్టి ఈ కథల పొడుగునా తీసుకు పోతాడు రచయిత. ఒకటో అరో తప్పించి ప్రతి కథలోనూ జీవిత మధుర ఫలాలు చేతికందే లోపున చేజార్చుకున్న నిర్భాగ్యులూ, చేతికి అందకుండానే కాలాన్ని దాటిన అభాగ్యులూ….మనసుండి నలిగిపోయే మనుషులూ, కాల చక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ…వీళ్ళే అడుగడుగునా పలకరిస్తారు మనల్ని.

 

లబ్ధ ప్రతిష్టులెంతమందో సుబ్బ రామయ్య గారి గురించి మంచి ముక్కలు చెప్పనే చెప్పి ఉంచారు.  అయితే ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆ మాటల గురించి ఏమంటారంటే ” ఎందరు ఎన్ని రకాలు గా చెప్పినా అవన్నీ పాక్షిక సత్యాలే ననీ, వాటన్నింటినీ ఒక చోట చేర్చి చూస్తే ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగా నైనా సుబ్బరామయ్య గారి సాక్షాత్కరిస్తుంది అంటారు. నూటికి నూరు  పాళ్ళూ ఏకీభవించాల్సిన విషయం ఇది.

కథల్లో మృత్యు గీతం

 సుబ్బ రామయ్య గారి చాలా కథల్లో మృత్యుగీతం తో మొదలవడమో, అంతం కావడమో జరుగుతాయి. ఇది పాఠకుడిని మొదట్లో ఉలిక్కి పడేలా చేసినా రాను రాను ఆ పరిస్థితిని ఒకింత స్థైర్యంతో మామూలుగా కొద్ది పాటి విషాద భావనతో వాస్తవ భావనతో అంగీకరించే స్థాయికి పాఠకుడు చేరతాడు. నీళ్ళు కథలో కథానాయకుడు నీటిలోనే ప్రమాద వశాత్తూ మునిగి మరణించినపుడు గుండె జలదరిస్తుంది. ఆ తర్వాత  ముసురు కథలో కిరసనాయిలు తాగి ప్రాణం పోగొట్టుకున్న సింగార వేలు, నిప్పు కోడి కథలో తిండికి అలమటించి దిక్కు లేని చావు చచ్చే రామ కోటి, పూర్ణాహుతి లో రోడ్డు దాటుతూ దుర్మరణం పాలయ్యే రామేశం, కళ్ళ జోడు కథలో హటాత్తుగా గుండె పోటు పాలై మరణించే అవధాని, సతీ సావిత్రి కథలో పొట్ట కూటి కోసం సావిత్రి ఎవరితోనో గడపడానికి వెళ్తే పాలకు అలమటించి గొంతెండి ప్రాణాలు వదిలే పసి పాప, ఆకలి నొప్పితో విలవిల లాడి ఒకానొక వర్షపు వేళ కన్ను మూసే పీనుగలు మోసే కనకయ్య, పాటలు పాడి పాడి గొంతు కాన్సర్ తో దీన స్థితితో పోయే పంకజ వల్లి…. (కొంప మాత్రం మిగిలింది) స్టేజీ మీద గుండెపోటుతో ప్రాణాలొదిలే సత్యం,  వీళ్లందరి మరణాలు కథలు చదువుతున్న కొద్దీ ప్రతి కథకూ గుండెను కలచి వేస్తూనే….చావుని సైతం మౌనంగా అంగీకరిచగల స్థితికి పాఠకుడిని చేరుస్తాయి.

ముఖ్యంగా  “గాలి” కథలో కమల ముసలి తండ్రి మరణం తడి అడ్డం పడి చూపు మసక బారేలా చేస్తుంది. పెళ్ళి కాని కూతురు, ఆమె ముసలి తండ్రి ఒక పెద్ద భవనంలోని చిన్న ఇంట్లో అద్దెకుంటారు. కొడుకు ఎక్కడో దూరాన ఒక ఫాక్టరీలో పని చేసి పంపే కొద్ది డబ్బుతో బతుకు వెళ్ళదీస్తుంటారు. ఒక నడి వేసవిలో గాలి బిగదీసుకు పోయిన రోజున…కొద్ది పాటి గాలి కోసం ఆ ముసలి తండ్రి పడే యాతన యాతన కాదు. ఏమి చేయాలో తోచని కూతురు చేతిలో అన్న నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదువుకుని మరో వైపు కుమిలి పోతూ ఉంటుంది. అంతలో స్త్రీ లోలుడైన ఆ ఇంటి యజమాని రాగా, తండ్రికి కాసింత ఫాన్ గాలి అందించాలనే ఒకే ఒక్క కోరికతో అతనితో తీయగా మాట్లాడి అతని ఇంటికి వెళ్ళి, ఎలాగో ఒక టేబుల్ ఫాన్ పట్టుకొస్తుంది. ఇంటికి చేరి ఫాన్ పెట్టేసరికే గాలి లేక, ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో తండ్రి మరణించి ఉంటాడు. మరో వైపు ఉత్తరంలో….ఆమె అన్న ఫాక్టరీ చక్రాల మధ్య పడి మరణించాడనే వార్త ఆమెను ఆ క్షణంలో నలిపి వేస్తూ ఉంటుంది. ఏదో విషాదం జరగబోతూందని ముందే ఊహిస్తున్నా…ఈ ముగింపు గుండె చిక్క బట్టినట్లు బిగించేస్తుంది.

రోజు వారీ జీవితమే సరికొత్తగా…

మృత్యువు తరచుగా ఈ కథల్లో కనిపిస్తున్నా….మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు, ప్రవర్తించని సహజ ఘటనలూ కథల్లో చోటు చేసుకుని ప్రతి కథా ఆసాంతం చదివేలా ఉంటాయి.బహుశా రచయిత వ్యక్తి గత జీవితంలో అలవోగ్గా ఎదురయ్యే రోజువారీ సంఘటనలే ఆయన చేతిలో పడి అద్భుతమైన శిల్పం తో మెరికల్లాంటి కథలు గా తయారై పాఠకుల ముందుకు వచ్చి ఉంటాయన్న అనుభూతి కల్గుతుంది.

 

చిన్నమ్మ నవ్విందిలో పేదరికం వల్లనే అయినా అవిటి కూతురు పట్ల చిన్నమ్మ ప్రవర్తించే తీరూ, నాలుగు రాళ్ళు సంపాదించడానికి అదే చిన్నమ్మకు దేవుడిలా వచ్చి సహాయ పడే మాష్టారూ, “ముసురు” కథలో భర్త ను పోగొట్టుకుని దీన స్థితిలో ఉన్న పెరియ నాయకి ని , నలుగురి ఎద్దేవా మాటలూ భరిస్తూ ఆమె తరఫు వారొచ్చే దాకా కాపాడే వ్యక్తి, తనకే మింగ మెతుకులేని స్థితి లో మరొక వ్యక్తికి  ఉన్నంతలోనే మందులిప్పించి సేవలు చేసే కామేశం (పూర్ణాహుతి), తను చేసేది చిన్న పనే అయినా తల్లీ బిడ్డల్ని ఆదుకునే సహాయ రాజు, వీధి పాపగా పెరిగి, మరో వీధి పాపకు జన్మనిచ్చి నదిలో మునిగిపోయే కామాక్షి……వీళ్ళంతా మనసులో చేరి ఆ పైన మెదడుని ఆక్రమించి ఆలోచనల్ని సాగు చేస్తూ ఉండిపోతారు.
మనుగడ కోసం తీవ్ర స్థాయిలో పోరాటం సాగించే అనేక పాత్రలు అల్లిబిల్లిగా ఈ కథల్లో చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యం,పేదరికం మీద పడ్డా ఆకలి మాత్రం చావని మాచమ్మ…ఏవో నాలుగు మాటలు చెప్పి అవధాని ఇంట్లో భోజనం కానిస్తుంది. (కళ్ళజోడు)! డబ్బులు తేవడం లేదని తండ్రి చేతిలో చచ్చేట్లు దెబ్బలు తిన్న  పసివాడు ముస్తఫా మద్య నిషేధం సమయంలో కూరగాయల సంచిలో మందు సీసాలు అందరికీ అందజేస్తాడు..మైళ్ళకు మైళ్ళు నడిచి. పైగా అడుగుతాడు “పోలీసయ్య గారు కష్టపడి బతకమన్నారుగా! చూడండి..నేనెంత కష్టపడుతున్నానో, నిన్న ఒక కేసు కోసం ఏకంగా ఆరుమైళ్ళు నడిచాను ఎండ గాలిలో! నాది కష్టం కాదా సార్..” అని! కొడుక్కు భారం కాకూడదనో ఏమో…ఇంట్లో చెప్పకుండా బస్టాండ్ దగ్గరా సినిమా హాళ్ల వద్దా యాచన చేసి పది పైసల బిళ్ళలు సంపాదించే మురారి డెబ్భై ఏళ్ళ తల్లీ…

 

తన చెప్పుల జత దొంగిలించాడని తెల్సి కూడా వెంకట్రావు మీద కోపం తెచ్చుకోలేని (చెప్పుల జత)కథకుడు ..అతను వెళ్ళిపోయాక కూడా “కళ్ళ ముందు అదే దీనాకృతి..నెమ్మదిగా నడిచిపోతూ..”అనుకుంటాడు !! తన తల్లి చావాలని కోరుకున్న చలపతికి తన కొత్త్త టైపు మెషీన్ ఇచ్చేసి వెళ్దామనుకుంటాడు సుందరం. పైగా “ఖరీదుకే లెండి, నెమ్మది మీద వీలును బట్టి నెలకింతని డబ్బు పంపండి” అంటాడు. (గుండెలో పాము)..!! ఈ కథ నాకు చాలా నచ్చిన కథ రెండో సంకలనం లో !!
కథల్లో వాతావరణం కూడా మనసులో గుబులు దిగులు రేపుతూ వెంటాడుతుంది.  మండిపోయే ఎండలూ, చుక్క నీరు లేని ప్రాంతాలు, గాలాడని ఉక్క పోత గదులూ,విఢిచిపెట్టని ముసురూ…..జాడించి కొట్టే వాన…ముంచుకొచ్చే వరదా…వీటన్నిటి వెనుకా…విషాదాల ఛాయలే! చాలా సేపు ఆలోచనల్లో పడేస్తాయి కథలు, పాత్రలూ! కథలతో పాత్రలతో మనసుని పిండేస్తూనే వాటి ద్వారా ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తాడు రచయిత.
కోదండం గారి కల,కొళందవేలు బొమ్మ, ముసురు,చీకటి,దగ్ధ గీతం, పీట,అలజడి, దుర్దినం, కోరిక..ఇవన్నీ మనసులో అలజడిని రేపుతూనే కట్టి పడేసే ఆణిముత్యాలు.

 

తన కథలన్నీ విషాదాంతాలే అయినా వాటి లక్ష్యం  పాఠకుల చేత కన్నీళ్ళు పెట్టించడం కానే కాదని సుబ్బరామయ్య అంటారు. అలాంటి లక్ష్యాలు సాహిత్య ప్రయోజనాలు కావని కూడా అంటారాయన. పట్టలేని దుఃఖాన్ని, క్లేశాన్ని పంచే కొన్ని కథలను  తాను కరుణ రసాన్ని వాహిక గా చేసుకుని చాలా ఆగ్రహంతో రాశానని చెప్తారు.  ఆయన కథలన్నీ పట్టణాల్లో కనిపించే దైన్య స్థితిని, నలిగి పోయిన మనుషుల్నే చూపిస్తాయి తప్ప పల్లె జీవనాన్ని ప్రతిబింబించవు. దానికాయన కొంత చింతిస్తారు కూడా! “కాలువ మల్లయ్య వంటి రచయితలు నోచుకున్న భాగ్యం తనకు కలగలేదంటారు. “మట్టి వాసన అంటారే..అదేమిటో నాకు తెలియదు. పట్టణాల్లో సుళ్ళు తిరిగే మురుగు కంపు మాత్రమే నాకు తెలుసు.దాని గురించి మాత్రమే రాశాను. తెలియని వాటి జోలికి వెళ్ళి చేతులు కాల్చుకునే అలవాటు లేదు” అని స్పష్టం చేశారు ఒక ఇంటర్వ్యూలో!

 

శ్రీ సుబ్బరామయ్య గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం, ఆయన కథలకే కాదు,వాటి లోని ప్రతి పాత్రకూ దక్కిన గౌరవంగా భావించాలి. ప్రముఖ పుస్తకాల షాపుల్లో వారి రెండు కథా సంకలనాలూ లభిస్తున్నాయి.