కధలతో బంధం ఊహ తెలిసీ తెలియని వయసులోనే మొదలవుతుంది మనందరికీ. అమ్మ చెప్పే మాటలను ఊ ఊ అంటూ కధలుగా వింటాం. ఊహ తెలిసే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కథలు జీవితం నుంచే పుడతాయని అర్థం చేసుకుంటాం. అవును, సాహిత్యం జీవితాన్ని ప్రతిబిమంచిపనుడే కల కాలం పాఠకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. తొలి తెలుగు కథ “దిద్దు బాటు” నుంచీ ఈ నాటి అస్తిత్వ వాద కథా సాహిత్యం వరకూ కథలన్నీ జీవితాన్ని ప్రతి బింబించేవే! కొన్ని జీవితాల్ని దిద్దేవి కూడానూ!
కథా సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అది క్లుప్తత! ఎంతో పెద్ద విషయాన్ని చెప్పాల్సి వచ్చినా దాన్ని కొద్ది మాటల్లో క్లుప్తంగా రెండు మూడు పేజీల్లో ముగించాలి. నవలా సాహిత్యాన్ని కున్న సౌలభ్యం ఈ విషయంలో కథలకు లేదు.
ఎంతోమంది తెలుగు రచయితలు కథా సాహిత్యానికి తర తరలా నుంచీ కొత్త వన్నెలు అద్దుతూనే ఉన్నారు. కొడవటి గంటి కుటుంబరావు, శ్రీపాద,చాసో,రావి శాస్త్రి, భరాగో వంటి సీనియర్లే కాక కేవలం కథా సాహిత్యానికే పరిమితమైన ఎంతో మంది రచయితలూ జీవన సౌరభాన్ని, జీవిత మకరందాన్ని కథల్లో భద్రంగా పొందు పరిచి ఉంచారు. కథా సాహిత్య పరిపుష్టి కి నిర్మాతలు వాళ్ళే ! యువ, జ్యోతి,విజయ,రేపు,ప్రభవ మహిళ, వనిత,వంటి మాస పత్రికలు ఇపుడు ఉనికిలో లేక పోయినా ఎంతో ఉత్తమ కథా సాహిత్యాన్ని పాఠకులకు అందించాయి.ప్రతి ఇంటా ఈ పత్రికలు రాజ్యమేలుతుండేవి. వీటికి మహరాజ పోషకులు మధ్య తరగతి మహిళలే!
ఒకప్పుడు కథల్లో మధ్య తరగతి జీవితం అద్భుతంగా ప్రతిబింబించేది. కొ.కు కథల్లో చదువు సంస్కారం కలిగిన ఎన్నో పాత్రలు మధ్య తరగతి వే! నీతికి బంధాలకు కట్టుబడి , అపార్థాల మధ్య నలిగే జంటల్నీ, సమాజం విధించిన కట్టు బాట్లను తోసి రాజని మనావ సహజ బలహీనతల్నే అనుసరించే ఎన్నో పాత్రల్నీ, ఇంట్లో పెంపకానికి, బయట ఎదురుకొవలసి వచ్చిన పరిస్థితులకూ మధ్య సందిగ్ధంలో పడి ఏది కరెక్టో తేల్చుకోలేని మధ్య తరగతి మనుషులెందరో ఆయన కనిపిస్తాయి. ఉమ్మడి కుటుంబం లో నలిగే వాళ్ళు ఎందరో! ఒక సరస్వతి,ఒక రాధ, ఒక రంగయ్య తాత మనవడు,సూరి, రాజేశ్వరి, సరితా దేవి, సరోజ… వీళ్ళంతా ఫక్తు మధ్య తరగతి మనుషులే!
భరాగో , శ్రీపాద ల కథల నిండా మధ్య తరగతి విశ్వరూపం దాలుస్తుంది.
వీళ్ళే కాక అసంఖ్యాక కథా రచయితలు మధ్య తరగతి మంద హాసానికి కథల్లో పెద్ద పీటే వేశారు.
ఇవాళ కథలు రాస్తున్న వాళ్ళేమీ తక్కువ సంఖ్యలో లేరు. ఎన్నో కథలు. వైవిధ్యమైన కథలు. కథంటే ఇలాగే ఉండాలన్న నిర్వచనాల హద్దులు చెరిపేసి కొత్త పుంతలు తొక్కిన కథలు ఇవాళ వస్తున్నాయి.
అస్థిత్వ వాదాలు, సైన్స్ ఫిక్షన్, మాండలికాలు ప్రధానం గా సాగే ప్రాంతీయ వాద కథలు… నగరం జీవితాల్ని ఎలా కబళిస్తుందో ఒళ్లు జలదరించేలా ఆవిష్కరించే కథలు, ప్రవాసాంధ్ర జీవితాల కథలు… రోజూ పుట్టుకొస్తున్నాయి.
వీటిలో మధ్య తరగతి ఇంకా బతికి ఉందా? అదేదో ఒక కథలో ఉక్రోషపు కోపం వచ్చిన మిడిల్ క్లాసు సుబ్బారావొకడు “గుడిసెలూ జిందాబాద్, మేడలూ
జిందాబాద్, పెంకుటిళ్ళు డౌన్ డౌన్” అంటాడు.
జీవితపు బండిని చచ్చేలా లాగుతూ, చెంచాడు భవసాగరాలు అతికష్టం మీద ఈదుతున్నా, సునాయాంగా లాగేస్తున్నట్టు పోజు పెట్టే ఆ సుబ్బారావులు, వారి భార్యలు, .. ఇంకా కథల్లో బతికిఉన్నారా?
మధ్య తరగతికి ఇప్పుడు నిర్వచనం మారింది. ఒకప్పుడు సైకిల్ మధ్యతరగతి వాహనమైతే ఇవాళ కనీసం మారుతీ కారు ! కానీ.. మేకప్ మారినా, లోపల సంఘర్షణ అలాగే ఉంది. అది మధ్య తరగతి ఆస్థి!!
ఇవాళ వస్తున్న నగరీకరణ కథల్లో, ఇంకా అనేక రకాల కథల్లో ఈ మధ్య తరగతి ఇంకా తొంగి చూస్తూనే ఉందా?
అలాటి కథలు ఇంకా రావలసిన అవసరం ఉందా?
ఇవాళ జీవితంలో వేదననూ, నలిపివేతనూ, చిత్రించే అలాటి కథలు ఏ యే రచయితలు రాస్తున్నారు? మీ దృష్టికి వచ్చిన అలాటి కథలేమిటి? వాటిని మీరు స్వాగతిస్తారా? మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవడం కథా సాహిత్యాన్ని కృత్రిమంగా మార్చేస్తుందా?
పాఠకులుగా, రచయితలుగా .. మీరేమంటారు?
సుజాత గారూ మీ రచన బాగుంది.అప్పట్లో రచయితలు,రచయిత్రులూ చాలావరకూ మధ్యతరగతికి చెందినవారె కావటాన వారి రచనల్లొ వారి పరిసరాల జీవితం.సమస్యలు ప్రతిబింబించేవి. ఇప్పుడు ప్రపంచీకరణ నేపధ్యం లో మధ్యతరగతి చాలావరకు మాయమైపోయింది ఆ స్తానం లో ఎగువమధ్యతరగతి వున్నతతరగతులు చేరిపోయాయి. అన్ని తరగతుల్లొనూ మహిళలు ఎక్కువగా టీవీలలొని ధారావాహికలకు అలవాటు పడిపోయారు.ఇప్పుడు రాస్తున్నది చదువుతున్నదీ సాహిత్య రంగం లో వున్నవాళ్ళు మాత్రమే .అందులొ కూడా కొందరు తమవి తప్ప మరొకరివి చదవని వాళ్ళు కూడా వున్నారు.అస్తిత్వ వాదాలు వచ్చాక తమ కుటుంబం లోని పాత జీవితాల్ని,కిందతరగతులజీవితాల్ని రచనల్లొకి కొందరు తీసుకువస్తున్నారు.
వ్యాసం వేసిన ప్రశ్న చర్చించ దగిందే. దానికి శీలా సుభద్రా దేవి గారి వివరణ బాగుంది.
సుజాత గారూ, బావుంది మీరడిగిన ప్రశ్న. అయితే మీరంటున్న – అప్పటి కథల్లో ఉన్న – మధ్యతరగతి యొక్క అర్థం ఇప్పుడు మారిపోయింది కదా? అంటే ఒకప్పుడు సైకిల్ మధ్యతరగతి వాహనం అయితే ఇప్పుడు బైక్ – కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మధ్యతరగతి కథల జీవితం ప్రతిబింబిస్తున్నట్లే ఇప్పటి కథల్లో. ఈ మధ్య ఒక పత్రిక ఎడిటర్ కి ఫోన్ చేసి ‘కథ రాశాను పంపమంటారా?’ అని అడిగితే ‘అమ్మో! వద్దు. ఇంకా ఆర్నెల్ల దాకా వేయడానికి మా దగ్గర కథలున్నాయన్నారు. ఆహా! తెలుగు సాహిత్యానికి మంచి రోజులొచ్చాయనుకున్నాను. కాదా!? శీలా సుభద్ర గారన్నట్లు చదివే వారి కంటే రాసే వాళ్ళు ఎక్కువయ్యారా!!? కథల్లో మధ్యతరగతి జీవితం ప్రతిబింబిస్తుందా అనే దానితో పాటు కథా తీరు, క్వాలిటీ ఎలా ఉంది?
ప్లీజ్ రచయితలూ చర్చించండి.
మీరు చర్చకు పెట్టిన అంశం సాహిత్యాభిమానులకు ఆసక్తికరమైనదీ, ముఖ్యమైనదీ. మధ్యతరగతి జీవితాలు కథల్లోంచి అంతర్థానమయ్యే పరిస్థితి వస్తే అది సాహిత్యానికి మేలు చేసే పరిణామం కాదు- సమాజంలో వీరు ప్రధాన భాగం కాబట్టి. మీరు పేర్కొన్న మధ్యతరగతి ‘సంఘర్షణ’ను గాఢతతో చిత్రిస్తున్న కథలు మాత్రం పెద్దగా రావటం లేదనిపిస్తోంది!
నిజమే మధ్యతరగతి స్థితిగతులు మారాయి.ప్రపంచీకరణతో ఆర్ధిక పరిస్థితి మెరుగు కావడం తో సమస్యలు డబ్బు గురించికాక మానవ సంబంధాల చుట్టూ మొదలయ్యాయి. అందుకే కథల నేపథ్యం మారింది. ఇప్పుడు కథలు, పాతతరానికి,కొత్త తరానికి మధ్య నలుగుతున్నమధ్య వయస్కుల సంఘర్షణ, తల్లి దండ్రుల అదుపాజ్ఞలలో పెరిగి వారిపట్ల భాద్యతతో ఉంటూ తమను ఏ మాత్రం లెక్క చేయని,పట్టించుకోని పాశ్చాత్య నాగరికతని,జీవన విధానాన్ని వంటబట్టించుకున్న కొడుకులు కూతుర్ల నిర్లక్షాన్ని అనుభవిస్తూన్నతల్లిదండ్రుల గురించి, అధిక సంపాదన తోవచ్చే సమస్యలు, స్త్రీల ఆర్ధిక స్వేఛ్చ తో వస్తున్న తెగింపు, ధైర్యంల గురించి, వస్తున్నాయి. సాహిత్యం ఎప్పుడూ ఆ కాలం లోని సాంఘీక ఆర్ధిక ,మనవ సంబంధాల గురించే వుంటాయి.
మధ్య తరగతి అంతర్ధానం అయింది అని నేను అనుకోను .. వాణీల చీరల , మధ్య తరగతి బదులు.. చూదీదార్, జీన్స్ పాంట్ల అప్పర్ మిడిల్ క్లాసు వచ్చింది .. షేప్ మారింది .. వీటి వల్ల , ఇంకా సంక్లిష్టమైన ఇబ్బందులు , ఈ అప్పర్ మిడిల్ క్లాసు ఎదుర్కొంటోంది…ఉదాహరణకి , పాత రచనల మధ్య తరగతి లో విడాకులు తక్కువ, సహజీవనాలు వింత .. ఇవాళ అవి సహజం అయిపోతున్న నేపధ్యంలో .. అప్పర్ మిడిల్ క్లాస్ విత్ మధ్య తరగతి విలువలు లో కాంఫ్లిక్ట్ చాలా ఎక్కువ.. ఎందుకంటె, ఇవాళ మధ్య తరగతి థర్డ్ ఏసీ క్లాస్ లో ఉంది కదా .. మంచి చర్చ సుజాత గారూ.. మీరు ఎక్కువ రాయకపోవటం వల్ల నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా ..
ఎక్కడకి పోతుంది మన మధ్య తరగతి జీవన విధానం — అక్కడే వుంటుంది– ఎందుకంటే అది మధ్య తరగతి కాబట్టి
కాకపోతే జీవన ప్రమాణాలను గురించి మాట్లాడుకుంటే
— జీవన స్థాయి (సాంకేతికంగా) పెరగచ్చ్చేమో గానీ
— ఆలోచనా స్థాయి (నాణ్యత లేని ) అక్కడే వుంది
— ఆడపిల్లలు ఇంకా అలానే మోసపోతున్నారు — మగ పిల్లలింకా అలానే ఏడుస్తున్నారు — అత్తా కోడళ్ళు కూడా అంతే మరి
మధ్య తరగతి మనిషి తన ఇంటి గదుల సంఖ్యను పెంచుకుంటూ మనసు గదిని ఇరుకు చేసుకుంటున్నాడు.ప్రేమరాహిత్యoలో పల్టీలు కొడుతూ వ్రుడ్డాశ్రామల వైపు ఆశగా ఎదురు చుఉస్తున్నాడు.”లేమి” బ్రతుకు మీద ఇష్టాన్ని పెంచుతుంది.
మధ్య తరగతి అంటే ఏమిటి ? అటు శ్రీమంతులు కానీ ఇటు పేదలు కానీ కానటువంటి రెంటికీ చెడ్డ రేవళ్ళు. మారింది రేవళ్ళు కాదు. వాళ్ళు ఉపయోగించే ఉపకరణాలు, వారి ఉపాధులు, వసతులు, సౌకర్యాలు వంతి భొఉతికమైనవే తప్ప, ఆశలు, ఆరాటాలు, కుళ్ళుబోత్తనం, అన్నీ అలాగే ఉన్నాయి. పై తరగతి, కింది తరగతి ఉన్నంతకాలం మధ్యతరగతి కోడా మధ్యన గబ్బిలంలా వేళ్ళాడుతోనే ఉంటుంది.
మధ్య తరగతిని గబ్బిలంతో పోల్చటం బాగుంది.
అయినా మధ్య తరగతి కథల్లోంచీ అంతర్థానం అయితే నష్టం ఎమిటి ? కొన్ని దశాబ్దాలకాలం తెలుగు కథలనీ నవలలనీ మధ్య తరగతే శాశించినది కదా ? ఇంకా మధ్య తరగతినే పట్టుకు వేళ్ళాడితే మిగిలిన తరగతులకు స్థానం ఎక్కడ దొరుకుతుంది ? గత రెండు మూడు దశాబ్దాల కాలంగా మిగిలిన తరగతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రానిద్దాం. వాటినీ కొంత కాలం ఏలనిద్దాము. మనం మధ్య తరగతిని ఎంత వద్దనుకున్నా కథల్లోకి ఏదో విధంగా మధ్య తరగతి దూసుకు వస్తూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.