చదువు

యాభయ్యేళ్ళ సూపర్ హిట్ నవల “చక్రభ్రమణం”

నవంబర్ 2013

కోతి కొమ్మచ్చి మొదటి భాగం లో ముళ్లపూడి ఇలా అన్నారోచోట.
“ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు.

కొ కొ కొ రా కో-
కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కొడవటిగంటి కుటుంబరావు
కొమ్మూరి సాంబశివరావు
కోడూరి కౌసల్యాదేవి
రాధాకృష్ణ-

కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల సూపర్ సెన్సేషన్ … ఆడా మగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కుని, అద్దెకు తెచ్చుకుని, ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయారు.

‘ఈ కొ కొ రా కో ల తర్వాత మెగా రైటర్సు వచ్చారు. యద్దనపూడి సులోచనారాణి (సెక్రటరీ), ముప్పాళ్ళ రంగనాయకమ్మ (స్వీట్ హోం), యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం), మల్లాది వెంకట కృష్ణమూర్తి (తేనెటీగ) వంటివారు- ఆరణాలు అర్థరూపాయి రేట్లతో ఏడాదికి ఒక వెయ్యి పుస్తకాలు చెల్లడం కష్టమైన రోజుల నుంచి ఒక వారంలో పదివేల పుస్తకాలు అమ్మగల ఊపును తెచ్చారు’.

అంటే రమణ భాషలోనే చెప్పాలంటే…

వీళ్ళని ఇలా అనొచ్చు-
య ము య మ :-)

1960, 70 ల్లో రచయిత్రులు తెలుగు పాఠకులని ఆడా మగా తేడా లేకుండా తమ గుప్పిట్లో కట్టి పడేసి సీరియల్స్ రాసిన కాలం! అదొక ప్రవాహం. ఐతే ఆ ప్రవాహం రెండు పాయలుగా , దేని అస్తిత్వం అది కోల్పోకుండా విడి విడిగానే ప్రవహిస్తూ సమానంగా జనాదరణ పొందాయి.

వీటిలో ఒకటి పాఠకుల్ని, ముఖ్యంగా యువ మహిళా పాఠకులని కలల ప్రపంచంలో తేలియాడిస్తూ, ఊహా లోకాల్లో విహరింపజేస్తూ …వాస్తవానికి కుసింత దూరంగా ఉన్నా, పాఠకుల్ని ఊహల పల్లకీ ఎక్కించి ఊరేగించే రచనా ప్రవాహం. పడవలంతేసి కార్లూ, డిస్నీ మూవీస్ వాడి లోగో లాంటి ఆకాశ హర్మ్యాలూ,సొంత తోటలూ, లాన్లూ, కంపెనీలూ, వీటికి అధిపతి గా అందగాడైన హీరో!పౌరుషాలు, ఆత్మ విశ్వాస ప్రకటనలు, కాసిన్ని కన్నీళ్ళు అపార్థాలు, చివరికి సుఖాంతాలు. ఈ నవలలు వినోదానికే తప్ప వికాసానికి పనికొచ్చేవి కాదు! ఈ ప్రవాహాన్ని జాగ్రత్తగా నడిపించింది కోడూరి కౌసల్యా దేవి,యద్దనపూడి సులోచనా రాణి, మరియు ఆర్ సంధ్యా దేవి లాంటి మరి కొందరు రచయిత్రులు.

మరొకటి.. నేల విడిచి సాము చేయకుండా, మనిషి జీవితాన్ని, మనస్తత్వాలని విశ్లేషిస్తూ మధ్య తరగతి మందహాసాల్ని, జీవితంలోని ఒడిదుడుకుల్ని, తార్కికంగా రేగే ప్రశ్నల్ని ఆవిష్కరిస్తూ వినోదాన్ని కథ ద్వారా అందిస్తూనే మానసిక వికాసానికి దార్లు వేసిన రచనలు! ఆ తరం ఆడపిల్లల్లో మంచి సాహిత్యాన్ని చదివే అలవాటు పెంచింది ఈ తరహా రచనలే! రంగనాయకమ్మ, బీనాదేవి,వాసిరెడ్డి సీతాదేవి, పవని నిర్మల ప్రభావతి … వీళ్ళంతా ఈ వర్గం రచయిత్రులు

చక్రభ్రమణం నవల లో విషయం ఏమీ ఉండదు. పందొమ్మిదేళ్ళ అమ్మాయి రాసిన కుటుంబ కథ! మంచి మనస్తత్వాలు, అనురాగాలు, ఆప్యాయతలు, వాటి మధ్య కొద్ది అపార్థాలు, పశ్చాత్తాపాలు. వీటిని పేని అల్లిన కథ !!

అదీ ఆమె మొదటి నవల. పైగా బహుమతి పొందిన నవల. పత్రికా భాషలో చెప్పాలంటే అశేష పాఠకావళిని విశేషంగా ఆకట్టుకోవడం వల్ల సంచలన నవలగా మిగిలిన కథ! అన్నపూర్ణా బానర్ కి సూపర్ హిట్ దక్కించిన “డాక్టర్ చక్రవర్తి” సినిమాగా రూపొందిన నవల ఇది.

ఆంధ్ర ప్రభ అప్పట్లో నిర్వచించిన శుభకృత్ ఉగాది నవలల పోటీలో ఈ నవల ప్రథమ బహుమతి పొందింది. నవలల పోటీకి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ రచయిత గోపీ చంద్ అన్న పూర్ణా వారికి (ఆ బానర్ దే “చదువుకున్న అమ్మాయిలు ” సినిమాకి గోపీ చందే మాటల రచయిత) “ఈ నవల అద్భుతంగా ఉందనీ , దాన్ని సినిమా గా తీస్తే సూపర్ హిట్ అవడం ఖాయమనీ, నవల బయటికి వస్తే ఎవరో ఒకరు హక్కులు కొనేసే అవకాశం ఉంది కాబట్టి త్వర పడమనీ..సూచించారు .

ఈ విషయంలో కొంత తాత్సారం జరుగుతూ ఉండగా, నవల మార్కెట్లో విడుదలై మరింత ప్రజాదరణ పొందింది. ఇహ అప్పట్లో పాఠకులు ఎంత శ్రద్ధగాను, తీరికగానూ కూడా ఉండే వారంటే ఎంతోమంది పాఠకులు ఈ నవల్ని సినిమాగా తీయమని అన్న పూర్ణా బానర్ కి ఉత్తరాలు రాశారట. పైగా ఏ పాత్రకి ఏ నటి/నటుడు సరిపోతారో సూచిస్తూ!! నిజంగానే ఆ తర్వాత అన్న పూర్ణా సంస్థ పాఠకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ వారిలో మెజారిటీ సూచనల ప్రకారమే నటీ నటుల్ని ఎన్నిక చేశారు.

అన్నపూర్ణా అధినేత దుక్కి పాటి మధుసూదన రావు రాజమండ్రి వెళ్ళి ఈ నవల హక్కులు కొనేశారు. సంభాషణలు రాయమని కౌసల్యా దేవినే కోరారు కానీ “పెళ్ళి కావలసిన ఆడపిల్ల సినిమాకి మాటలు రాయడం కోసం ఊళ్ళు తిరగడం హోటళ్ళలో ఉండటం మంచిది కాదులెండి“అని ఆమె తల్లి దండ్రులు ఆ అవకాశాన్ని తిరస్కరించారు.

ఈ నవల ఎంతటి పాఠకాదరణ పొందిందంటే ఇది తెలుగు నాట పాఠకుల సంఖ్యనే ఏకంగా పెంచి పారేసిందంటారు. అందుకే అప్పటికి అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న కె.విశ్వనాథ్ పాఠకుల అంచనాలకు తగ్గట్టు తాను ఈ సినిమాని తీయగలనా అని సందేహించి, వచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించి గురువు గారైన ఆదుర్తికే అప్పజెప్పారట.
డాక్టర్ చక్రవర్తి సినిమా చూడని వారెవరూ దాదాపుగా తెలుగు నాట ఉండరు కాబట్టి, కథ గురించి ప్రస్తావించడం అనవసరమే! నిజానికి అదేమీ గొప్ప కథ కూడా కాదు. సినిమాలో కొన్ని చోట్ల చక్రవర్తి పాత్ర “నస” గా కూడా అనిపిస్తుంది. “ఎంత సేపటికీ విషయం తేల్చడేం”అని విసుగొస్తుంది కూడా!

అద్భుతమైన సంగీతం, అందాలొలికే సావిత్రి, వ్యక్తిత్వం నిండిన ఆమె పాత్ర, ఏ ఎన్నార్ నటన..ఇవన్నీ కలిపి సినిమాని సూపర్ హిట్ చేశాయి.

రెండు దశాబ్దాల క్రితం వరకూ పాఠకులు వార పత్రికల్లో , కథలు చదివడమే కాక తార్కికంగా విశ్లేషిస్తూ ఉత్తరాలు రాసే వారు.(ఇప్పుడు చీల్చి చెండాడ్డానికి సోషల్ నెట్ వర్క్ లు ఉన్నాయనుకోండి)

చక్రభ్రమణం సీరియల్ ప్రచురించినన్ని రోజులూ అలా అసంఖ్యాకంగా పాఠకుల ఉత్తరాలు అంధ్ర ప్రభ ఆఫీసు నిండా నిండిపోయేవి. అన్నీ ప్రచురించడం సాధ్యం కాదని యాజమాన్యం చేతులెత్తేసింది కూడానూ. వాటి లోంచి పాఠకుల ఉత్తరాలు కొన్ని వాకిలి పాఠకులు సరదాగానూ, సీరియస్ గానూ చదువుకునేందుకు సేకరించాము!
చాలా మంది మంది పాఠకులు “మీ (మా)ఆంధ్ర ప్రభలో” అంటూ పత్రికను own చేసుకుంటూ ఉత్తరాలు రాయడం అప్పట్లో సంప్రదాయంగా ఉండేదనుకుంటాను. :-D

కథలోని ప్రతి అంశాన్నీ పాఠకులు నిశితంగా గమనిస్తూ ఉండేవారు కూడా! ఉదాహరణకి …
కథలో… చక్రవర్తి దంపతులు తొలిసారి తమ ఇంటికి వచ్చిన సందర్భంలో మాధవి ”కూర్చోండి టీ తెస్తాను” అంటుంది. ఐదారు వాక్యాల తర్వాత ”కాఫీలయ్యాక చాలాసేపు కబుర్లలో పడ్డారు” అని రాశారు రచయిత్రి.
ఈ సూక్ష్మమైన తేడాను కూడా గమనించి అప్పట్లో ఆంధ్రప్రభ పాఠకులొకరు ఎత్తి చూపుతూ లేఖ రాశారు.
దీంతో ఈ సీరియల్ పుస్తకంగా వచ్చినపుడు ‘టీ’ని ‘కాఫీ’గా మార్చి తన పొరపాటు దిద్దుకున్నారు రచయిత్రి! ( వంటింట్లో టీ పొడి అయిపోయి, కాఫీ పెట్టి వుండొచ్చు – అని సమర్థించుకోవచ్చంటారా? సరే, మరి ఆ సంగతి ఆమె అతిథులకు చెప్పినట్టు ఎందుకు రాయలేదని మళ్ళీ అడుగుతారు పాఠకులు! )

కాఫీ అయితే ఏంటి, టీ అయితే ఏంటి అని విసుక్కుని రచయిత్రి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నవలలో సవరించుకోడం గమనించ దగిన విషయం!

ఈ సీరియల్ కి బొమ్మలు వేసింది ఇక్కడ ఇలస్ట్రేషన్స్ లో శంకర్ అని కనిపిస్తున్నా.. అది బాపు గీత అని కాస్త గమనిస్తే తెలిసి పోతోంది.

ఈ నవల గురించి కోడూరి కౌసల్యా దేవి విజయ చిత్ర సినిమా పత్రికలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.

“నేను మొదట రెండు మూడు కథానికలు వ్రాసి, ఆ అనుభవంతో ‘చక్ర భ్రమణం’ అనే నవల వ్రాశాను. ధారావాహికంగా ప్రచురింపబడిన ఆ నవలకు విశేషాదరణ లభించడం, ఆ తర్వాత ప్రముఖ నిర్మాత శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు గారు చిత్రనిర్మాణానికి హక్కులు కావాలని అడగడం, అందుకు నే నంగీకరించడం జరిగింది. సగటు ప్రేక్షకునికి అర్థమయ్యే టైటిల్ కావాలంటే నేనే ‘డాక్టర్ చక్రవర్తి’ పేరును సూచించాను.”
– కోడూరి కౌసల్యాదేవి (విజయచిత్ర 1974)

19 ఏళ్ళ ప్రాయంలో ఆమె రాసిన మొదటి నవలకే అంత ప్రాచుర్యం లభించడం ఒక ఎత్తు అయితే, ఆ నవల లో ఆమే శైలి కూడా ప్రాథమిక స్థాయిలో కాక చేయి తిరిగినట్లుగానే పరిణతి చెంది కనిపిస్తుంది.

ఆ నవల తర్వాత ఆమె బహుశా “చక్రం” సెంటిమెంట్ తో మరి కొన్ని నవలలకు అలాటి పేర్లే పెట్టారు. అవి.. భాగ్యచక్రం, ధర్మచక్రం, సంసారచక్రం, దిక్చక్రం, చక్రవాకం, చక్రనేమి !!

గొప్ప మలుపులు, వగైరాలు లేక పోయినా ఆనాటి వాతావరణంలోని అనుబంధాలకు అద్దం పట్టిన ఉదాత్తమైన కథ ఇది. వ్యక్తిత్వం నింపుకున్న మాధవి పాత్ర పాఠకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

అందుకే ఈ నవల తొలి నవలా చిత్రంగానే కాదు, అశేష పాఠకుల్ని సంపాదించుకున్న నవలగా కూడా సంచలనమే!
కాసేపు వాకిలి పాఠకులంతా అరవయ్యో దశకంలోకి ప్రయాణిస్తూ, ఈ ఇలస్ట్రేషన్స్, పాఠకుల ఉత్తరాలు చూస్తూ నవల చదివి రండి :-)

 

పాఠకుల ఉత్తరాలు: