చదువు

సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ “కురూపి”

ఏప్రిల్ 2013

కుటుంబరావు గారి పాత్రల్లో అసాధారణ సౌందర్య వతులూ, మేధా సంపన్నులు ,ఆరడుగుల అంద గాళ్ళు ఉండరు. మన చుట్టూ ఉండే సాదా సీదా మనుషులు,వాళ్ళ మానవ సహజమైన కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళూ, కుట్రా,ప్రేమా, మోహం అన్నీ ఉంటాయి. మొత్తం మీద జీవితం  స్పష్టం గా ప్రతి బింబిస్తూ  కనిపిస్తుంది . అందుకే ఆయన కథలు చదువుతుంటే అదేదో పెద్ద సాహిత్యం టాగ్ తగిలించిన పుస్తకాలు చదువుతున్న ఫీల్ రాదు. గొప్ప విశ్లేషణ… ప్రతి రచనలోనూ  వరద కృష్ణమ్మ లాంటి ఫ్లో గుక్కతిప్పుకోనివ్వకుండా అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది. దాదాపు 8000 పేజీల సాహిత్య సృష్టి!

ఇప్పటికీ చదివినపుడల్లా విస్తు పోతుంటాను. అంత సాహిత్యాన్ని  ఎలా సృష్టించారని! ఆయన కథల్లో నాకు దాదాపుగా నచ్చనివి ఏమీ లేవు. కొన్ని మరీ మరీ నచ్చి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివినవి ఉన్నాయి. వాటిలో ఒకటి “కురూపి” పెద్ద కథ ! ఈ కథ ఆయన రచనల్లో చాలా మందికి నచ్చే కథ!
బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది ! అది జీవితాల్లో వెలుగు నింపుతుంది…  అది శాశ్వతమైనది  ! ఇదీ కథ

ఈ అంశం తో ఎన్నో కథలు వచ్చి ఉండ లేదేమో !! కురూపి కథ మాత్రం ఒక సారి చదివిన తర్వాత అలా మనసులో ఎప్పటికీ నిల్చి ఉండి పోతుంది . ఇందులో కథానాయిక సరస్వతి అనాకారి .  రచయితా ఆమె అనాకారి అని ఊరుకుంటాడు తప్ప ఆ అనాకారి తనాన్ని వర్ణించడు. విమర్శకుడు రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు ఆ పేరుతోనే విభేదిస్తారు . ఏదో ఒక శారీరక లోపం లేకుండా కురూపి అని ఈ కథకు పేరు పెట్టారని, అనాకారులంతా కురూపులు కాదని అంటారాయన.
కుటుంబరావు గారి స్త్రీ పాత్రలు వేటికవే ప్రత్యేకం గా ఉంటాయి . పార్వతి, రాజ్యం,లక్ష్మి, సరోజ,శాంత, శారద ,ఇందిర,శ్యామల ….. ఎవరికీ వాళ్ళే అద్భుత పాత్రలు. కాని సరస్వతి మాత్రం వీళ్ళు అందరికి భిన్నమైనది …. !

కురూపి కథను ఇక్కడ చదవొచ్చు: http://www.scribd.com/doc/131593137/Kuroopi

కథా సంగ్రహం :-

కథానాయకుడు ఒక రచయిత.  పేరు కనకం ! అతడికి ఆడవాళ్ళ మీద ప్రత్యేకించి గొప్ప అభిప్రాయాలేమి ఉండవు . బస్ లో కనపడి పలకరింపు గా నవ్విన సరస్వతిని చూసి అనాకారి కాబట్టి “సెక్స్ ఆకలి”  తో అలా సూచనో, ఆహ్వానమో పంపింది అని వెంటనే నిర్థారించు కుంటాడు.అతని చూపులో “ఇంత అనాకారి దానికి నేను కావల్సి వచ్చిందీ?” అన్న భావమే ఉంటుంది.

కథ విషయానికొస్తే కనకం ఒక రచయిత. మామూలు మనిషి! అందుబాటులోకి వచ్చిన ఆడవాళ్లను మొహమాటాలు లేకుండా  అందుకునే  స్వభావం కూడా !  ప్రేమ అంటే అతనికి సెక్స్ తప్ప మరొకటి కాదు!  చాలా మంది లాగే స్త్రీని అతడు తన హార్మోన్స్ తోనే గుర్తిస్తాడు . అతని అభిమాని ఒకరి చెల్లెలు సరస్వతి అతనికి పరిచయం అవుతుంది. 24 ఏళ్ళ సరస్వతి అనాకారి. లెక్చెరర్ గా పని చేస్తుంటుంది.  మొదటి సారి చుసిన తర్వాత కనకం ఆమెను గుర్తు అయినా పెట్టుకోడు . అందుకే ఆమె ఆ తర్వాత రోడ్డు మీద కనిపిస్తే ఎవరో అనుకుంటాడు .
ఆ తర్వాత కనకం వాళ్ళింటికి వస్తూ పోతూ ఉంటాడు. పరిచయ క్రమంలో కనకం  తో సరస్వతి అనేక విషయాల గురించి చర్చిస్తుంది. అతను  రచనలని సునిశితంగా విశ్లేషిస్తుంది. అతని కథల్లో అనాకారి పాత్రలు లేవని ఎత్తి చూపుతుంది. అందమైన పాత్రలుంటే ఆ అందానికో ప్రయోజనం ఉండి తీరాలని, లేకపోతే శిల్పం దెబ్బ తింటుందని విమర్శిస్తుంది. అప్పటివరకూ కనకం ఆ సంగతే గమనించడు . అందరూ అతని రచనల్ని మెచ్చుకోడమే తప్ప ఈ విధంగా అంతవరకూ ఎవరూ విమర్శించలేదు. ఆమె తన జీవిత లక్ష్యాలను,. రచనా విధానాన్ని, నమ్మకాల్ని చాలెంజ్ చేస్తున్నట్లు అతడు భావిస్తాడు . రచనను విమర్శించడం అంటే ఒకరకంగా  రచయిత జీవితాన్ని విమర్శించడమే అని కుటుంబ రావు గారు అంటారు . అంటే రచన అనేది ఊహల్లోంచి కాక, రచయితా జీవితంలోంచే (అతని పరిశీలనల నుంచి) పుట్టాలని ఆయన  స్పష్టంగానే చెప్పినట్లు తోస్తుంది.

అందరూ మెచ్చుకునే కనకం రచనల్లో కొన్ని లోపాలున్నాయని సరస్వతి ఎత్తి చూపిస్తే తప్ప కనకం వాటిని గుర్తించడు. లోకంలో అందమైన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు అల్ప సంఖ్యాకులే! అల్పసంఖ్యాకులను ప్రతిబింబించే సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించ లేదని సరస్వతి అన్న మాటలు కనకానికి ఛెళ్ళున తగుల్తాయి. అందమైన పాత్రల ద్వారా పాఠకులను వశపరచుకోవచ్చంటుంది సరస్వతి!

అనాకారి పాత్రతో కథ రాయగలరా అని సవాలు విసురుతుంది. అంటే తనమీదే కథ రాయగలరా అని అడిగిందని అనుకోవచ్చు .

అసలు సాహిత్యంలో పాత్రలు అందగాళ్ళు అంద గత్తెలూ అయి ఉండాలా ? అనాకారులు ,రూపసులూ కాని వాళ్ళు సాహిత్యం లో పాత్రలు గా ఉండ దగరా ? ఈ పాయింట్ మీద కథలో కొంత చర్చ నడుస్తుంది ఇద్దరి మధ్యా !!

ఆ చర్చలు, ఆమె అభిప్రాయాలు ఇంట్లో ఆమె ప్రవర్తన ,  స్వభావం గమనిస్తున్న కనకానికి ఆమెలో ఎనలేని ఆకర్షణ కనిపిస్తుంది. పార్క్ లో ఆమె బెంచీ మీద కూచోగానే ఆ పక్కన కుచున్న వాడొకడు ఆమె వైపు చూసి లేచి వెళ్ళి పోతాడు. కనకానికి మాత్రం ఆమెను మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని అనిపిస్తుంది. ఆమె తన కథల మీద చేసిన నిష్పాక్షికమైన విమర్శ, నిక్కచ్చి అభిప్రాయాలు అతన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆమె తన వదిన మీద చెప్పిన కొద్ది పాటి ఫిర్యాదులు(ఇల్లు సర్దుకోదని, తను వాడే అద్దం మీదైనా మరకలు తుడవదని) సైతం అతని కంటికి సహృదయంతో చెప్పినవి గానే కనిపిస్తాయి. “తన కథలను తప్పు పట్టినప్పుడు కూడా తను చెప్ప దల్చుకున్న దానికంటే తక్కువే చెప్పింది తప్ప ఒకరి తప్పును ప్రచారం చెయ్యడం లో తనకు ఆనందం ఉన్న దానిలా మాట్లాడ లేదు ” కాబట్టి వదిన గురించి ఆమె చెప్పిన ఫిర్యాదు లో కూడా అతనికి సమంజసమైన ధోరణే కనిపిస్తుంది

లతా పాటకు పరవశిస్తుందని, అన్న పిల్లలని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుందనీ, మనుషుల్ని నిశితంగా చదువుతుందని గమనించాక కనకానికి ఆమె ఎంతో సౌందర్య వంతంగా కనిపిస్తుంది.

ఆమె అన్న కూతురు హాస్పటల్లొ బ్రెయిన్ ఫీవర్ తో మరణిస్తే.. ఆ వార్త సరస్వతి ని ఎంత కుంగదీస్తుందో అన్న భావనతో కళ్ళనీళ్ళు నింపుకుంటాడు. నిజానికి ఆ పాపతో అతనికి ఎలాటి బంధమూ లేదు. సరస్వతి సున్నిత హృదయం  ఎంత గాయపడుతుందో అన్న భావన అతని కన్నీటికి కారణం !!
ఆమె ప్రవర్తన ద్వారా, స్వభావం ద్వారా, ఆలోచనల ద్వారా ఆమె హృదయ సౌందర్యాన్ని గుర్తిస్తాడు.  ఎలాటి  సెంటిమెంట్స్ లేని అతని మొద్దు హృదయాన్ని కూడా తన హృదయ సౌందర్యం తో కరిగిస్తుంది సరస్వతి !

కథ చివర్లో మేనకోడలు చనిపోయిందని కుమిలి పోతున్న సరస్వతిని కనకం ఎంతో ఆర్తి తో ఓదారుస్తాడు . తనకు తెలీకుండానే ఆమెను దగ్గరకు తీసుకుని వీపు నిమురుతూ నిజంగా ఓదారుస్తాడు. గాఢ నిద్ర లో సరస్వతి అతని డొక్కలోకి దూరుతుంది . ఆ క్షణం లో సరస్వతి కి తానూ తల్లి అయినట్లు గా తోచి కనకానికి నవ్వు వస్తుంది . ఈ చివరి వాక్యం తో కథ సంపూర్ణం అవుతుంది . సరస్వతి మీద అతనికి ఏర్పడిన ఆత్మీయతను, అనురాగాన్ని ఈ వాక్యం ఒక్క సెకను లో పాఠకుడికి  పూర్తిగా పట్టి ఇచ్చేస్తుంది .

పాత్ర చిత్రణ
సరస్వతి వదిన జయలక్ష్మి అందమైనదే ! పైగా దానికి మెరుగులు కూడా దిద్దుతూ ఉంటుంది . అయినా కూడా జయలక్ష్మి కనకాన్ని వికర్షిస్తుంది తన ప్రవర్తన ద్వారా ! అందగత్తె అయిన జయలక్ష్మి ముందు అనాకారి సరస్వతి తన హృదయ సౌందర్యం, సౌకుమార్యం వాళ్ళ ఎలివేట్ అవడం మనకు తెలీకుండానే జరిగి పోతుంది . ఇది పాఠకుడికి వెంటనే తట్టకపోయినా అందం ముందు అనాకారి తనం ఎలివేట్ అవడం గొప్పగా అనిపిస్తుంది.
ఎనిమిదో అధ్యాయంలో చివరి ఘట్టం చాలా కీలకమైనది కనకం రచనలోని  ముగింపు సమస్యను తేల్చేయటమే కాదు; సరస్వతి పట్ల అతని దృక్పథాన్ని కూడా స్పష్టం  చేస్తుందీ సన్నివేశం.  అలాగే  అతడి అనూహ్య  భావోద్వేగం వెనకున్న మనసును  సరస్వతి గ్రహించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ  అనూహ్యమైన మలుపు ఆసక్తికరంగా నడుస్తుంది.
కనకం అనాకారి ని హీరోయిన్ గా పెట్టి కథ రాసినపుడు దాని ముగింపు ఎలా ఉంటుందో సరస్వతికి చెప్పక “ఎలా ఉంటే బాగుంటుంది?” అని అడుగుతాడు.
ఆ పైన ఆమె చెప్పిన రెండు మూడు విశ్లేషణాత్మక వాక్యాలు అతని బుర్ర తిరిగి పోయేలా చేస్తాయి. అతడు ముగ్ధుడై పోయి చప్పున ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు.
సరస్వతి లో గొంతుకతో “థాంక్స్” అని బయటికి వెళ్ళి పోతుంది. దీనితో కనకం పై ఆమెకు ఎలాటి అభిప్రాయం ఏర్పడిందీ పాఠకుడికి సులువు గానే  అవగతమవుతుంది. అలాగే కనకానికి కూడా ఆమె స్వభావం, మేథ మీద కల్గిన ఇష్టమే అతని చొరవకు కారణం తప్ప ఇతరత్రా సానుభూతి లాంటి అంశాలు కావని సూచిస్తాడు రచయిత.

అందుకే ఆమె చెప్పిన రెండక్షరాల “థాంక్స్” అనే పదం అతని కథకు ముగింపుగా మారుతుంది.

రచయితా, విమర్శకుల అభిప్రాయం :
ప్రబంధాల నుంచి ఈ నాటి వరకు సాహిత్యం లో నాయికా నాయకులు అందరూ అందగాళ్ళు, అందగత్తె లే ! ఒకవేళ అందాన్ని వర్ణించక పోయినా అనాకారులుగా మాత్రం చిత్రించరు. దీన్నిప్రశ్నించడం కథకుడి ఉద్దేశంగా తోస్తుంది .
ఈ కథ మీద రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు (విశాలాంధ్ర వేసిన కొ.కు సాహిత్యం 5వ సంపుటానికి ముందు మాట ) ఒక వ్యాసం రాసారు . సాహిత్యంలో ఇతిహాసాల నుంచి చరిత్ర వరకు రుక్మిణి, సీత,శకుంతల,వరూధిని, అనార్కలి ఇత్యాదులంతా మహా సౌందర్య రాశులే! వాళ్ళు అంత అందంగా లేకపోతే ఆయా కథా నాయకులకు వారి మీద ప్రేమ పుట్టేదేనా? కథానాయికలెవరూ అందంగా లేకుండానే వారి మీద ప్రేమ పుట్టిందని రాస్తే పాఠకులు నమ్ముతారా? లోక విరుద్ధమైన దాన్ని ఎవరూ నమ్మరు కనుక సాహిత్యంలో పాత్రలు అందంగా ఉండే తీరాలి.కనుకే అందం రచనా శిల్పానికి అండగా ఉందన్న రీతిలో ఆ వ్యాసం లో కొంత భాగం సాగుతుంది .

సాధారణంగా రచయితలు తమ నవలలకు ముందు మాటో, ఉపోద్ఘాతమో రాస్తుంటారు.అయితే కుటుంబరావు గారు “కురూపి” కథకు ఉపోద్ఘాతం రాశారు. దాంట్లో ఆయన అందవిహీనత వ్యక్తి గత సమస్యా? లేక సాంఘికమా అన్న విషయం మీద కొంత చర్చించారు. ఎందుకంటే ఆడవాళ్ళ అందం పెళ్ళికి ఒక అర్హతగా గల సమాజం ఇది. చర్చ తర్వాత ఇది పూర్తిగా వ్యక్తిగతమూ కాదు, పూర్తిగా సామాజికమూ కాదని అంటారాయన. ఈ సమస్యకు ఆధ్యాత్మికం గా మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అంటారు. (ఆధ్యాత్మికం అంటే పరలోకానికి సంబధించింది కాదని స్పష్టత ఇస్తారు)

మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతులలో అందం ఇచ్చేది ఒకటి మాత్రమే!అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయి. తన తల్లి అందమైనదా కాదా, బామ్మ అందమైనదా కాదా అన్న సంశయం పిల్లలను ఎన్నడూ బాధించదు. గాంధీ బొమ్మ, జవహర్ లాల్  బొమ్మ కనిపిస్తే ఎంతమంది హృదయాలు ఆనందంతో నిండేదీ జనం ఊహించవచ్చు….. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలు జీవితం నిండా ఉంటాయి.  ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఉండే గోడలు పడిపోయాక, అటువంటి అనుభూతులు పెరుగుతాయి.వాటికి విలువ కూడా పెరుగుతుంది. ఈ మాట వ్యక్తం చెయ్యడానికే కురూపి రాశాను” అని వివరిస్తారు.

ఈ మాటల్ని జాగ్రత్త గా పరిశీలిస్తే కథ తాలూకు ఆత్మపాఠకుడి కి అవగతం అవుతుంది .

బాహ్య సౌందర్యాన్ని మించిన ఆత్మ సౌందర్యం జీవితాల్లో సౌందర్యాన్ని నింపుతుందని కథకుడి అభిప్రాయంగా వెల్లడి అవుతుంది .
అసలు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
నాయికా నాయకులు అందంగా ఉంటే-  కథాగమనం వేగంగా సాగటానికి  వెసులుబాటూ,  పాఠకులను  త్వరగా ఆకట్టుకోవటం అనే ప్రయోజనమూ  ఉంటాయి.  కానీ అనాకారి నాయకా నాయకుల కథలు రాయాలనీ,  ఈ సమస్యను  సాహితీ ప్రక్రియగా మలుద్దామనీ  రచయితలు పెద్దగా ఆలోచించరు.
ఎందుకంటే ‘అనాకారితనం ’ సమస్యను కొ.కు.  తప్ప ఇతర తెలుగు రచయితలు పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఈ కురూపి కథలో అందాన్నీ,  మంచి స్వభావాన్నీ; దురుసు స్వభావాన్నీ,  సంస్కారాన్నీ కాంట్రాస్టుగా  చూపిస్తాడు రచయిత. ఇదంతా కృత్రిమంగా కాకుండా కథలో స్వాభావికంగానే నడుస్తుంది.

యాభై ఏళ్ల క్రితం (మొదటి ప్రచురణ 1963 జ్యోతి మాస పత్రిక లో ) రాసినా , చదివినప్పుడల్లా కొత్త ఆలోచనల్ని , సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ “కురూపి”.

ఈ మధ్య విరసం వేసిన కుటుంబరావు గారి సాహిత్యం ఎనిమిదో సంపుటం లో ఈ కథను చదవొచ్చు .