కవిత్వం

ఆల్కెమీ రహస్యం

24-మే-2013

మనసుకుండలో కవ్వం కదిలి
కడుపులో సుళ్లు తిరిగాకే
కవిత్వం ఒలకాలి బయటికి
హృదయాన్ని ఊగజేసే
భావతీవ్రతే పునాది అయి
అందమైన ఊహల సౌధాలు
తెలివిడి నేత్రాల ముందర
నిలబడాలి నిటారుగా
పొగలకుండా పగలకుండా
పులుగు పిల్ల రాదు గుడ్డు లోంచి బయటికి

శుష్కశూన్య ఇసుకతిన్నెల మీద
చిగురింతల ఆశలు వృథా అవుతయ్
బీడువడ్డ కవన మరుభూమిలో
పదడంబాల ఎరువులు పని చేయవు

ఆల్కెమీ రహస్యం అందరికీ తెలియదు
దుక్కి దున్ని పండించే కళాసేద్యం
పూల పరుపులు పరచిన బాట కాదు
మనోమాగాణికి ఆరుతడి పెట్టి
భావబీజాల్ని చల్లుకోవాలి
గింజ గట్టితనం ఉట్టిపడేలా మొలిస్తేనే
మొక్కను వరిస్తుంది మొక్కవోనితనం