ఇల్లు అనే కిటికీలున్న పెద్ద డబ్బాలో కూరుకుపోయి నివసించటం, కారు అనే ఇనుప డబ్బాలో కూర్చుని కార్యాలయానికి వెళ్లటం, ఆఫీసుగది అనే నాలుగ్గోడల డబ్బాలో పీల్చి వొదిలేసిన గాలినే మళ్లీ పీలుస్తూ పన్చేసి, ఆపై మళ్లీ ఇనుప డబ్బాలో దిగబడి డబ్బాయిల్లును చేరటం… డబ్బాలుడబ్బాలుగా మనుగడ సాగిస్తున్న డబ్బారేకుల సుబ్బారావులం మనం! తలుపులు మూసీ, ఏసీలు వేసీ మోసం చేసుకుంటున్నాం మనల్ని మనమే. మలయమారుతాలు కలయదిరిగే ఊరి బయటి వాతావరణానికి నోచుకోక బలి అవుతున్నాం గదుల్లోపలి మలినమైన గాలికి. వెన్నెల సోకని వెలితిగదుల్లో ఎన్ని హంగులున్నా అవి పరవశకరమైన ప్రకృతిస్పర్శకు సరి అవుతాయా? చల్లని రేయిలో చంద్రుణ్ని చూసి చాలా కాలమైందనే సంగతినే మరుస్తాం. పిండారబోసినట్టున్న వెన్నెల్లో నిండా మునగలేని నిర్భాగ్యులమై ప్రకృతితో బంధం తెంచుకునే వికృత జీవన పరిస్థితుల్నే వరిస్తాం. కృత్రిమ వాతావరణం నిండిన డబ్బాల్లాంటి గదుల్లో కూరుకుపోయి ‘తరిస్తాం’!
(పేరాగ్రాఫ్ కవిత)
డబ్బా ప్రతీకతో రాసిన మీ కవిత బాగుంది ఎలనాగ గారు.
వేముగంటి మురళీకృష్ణ గారూ, థాంక్స్.
డబ్బాల్లో మనుగడ చదివాను. ఇప్పటి జీవితం కనులముందు కదలాడింది. ఠంక్ యు సర్ ఫర్ యువర్ వండర్ఫుల్ presentation
రాజేంద్ర ప్రసాద్ గారూ, థాంక్స్.