అనువాద కథ

నేను, అనుభవాన్ని, మాట్లాడుతున్నా

ఫిబ్రవరి-2014

1. నా గదిలో నివసించే వాళ్లు

నా డబ్బాను నేనే కొట్టుకోవాలా లేక వేరేవాళ్లు కొట్టాలా అన్నది యిక్కడి ప్రశ్న. నా డబ్బా కొట్టే వాడు మూర్ఖంగా నన్ను వదిలి వెళ్లాడనేది దురదృష్టకరమైన విషయమే అయినా అది వాస్తవం. అతనికి జీతం తక్కువై కాదుగాని, ఆక్రా నగర జీవితపు కోలాహలం నడుమ బలమైన చప్పట్లతో, కేరింతలతో నా డబ్బా శబ్దాన్ని వినపడేట్టు చేయలేకపోయాడతడు. ఇక అతడు లేని ఈ సమయంలో నాకిష్టమున్నా లేకకపోయినా బలహీనంగానైనా నా డబ్బాను నేనే కొట్టుకోవాలి మరి.

ముందు నా గురించిన పరిచయంలో నేను వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడిననీ, అమర్యాద చూపేటంత నిర్మొహమాటస్థుడిననీ చెప్పాలి. పొట్టిగా వుంటే లాభమనుకున్నప్పుడు ఎంతో పొట్టిగా, పొడుగ్గా వుంటే ఉపయోగమనుకున్నప్పుడు మరీ పొడుగ్గా మారుతాన్నేను. “సర్వకాలావస్థల మనిషి” అన్నది నా పరిహాసపు పేరు. ఏ లక్షణాలు వుంటే లాభం కలుగుతుందో ఆ లక్షణాల క్లిష్టమైన మిశ్రమాన్ని నేను. నేను బియ్యే పాసయ్యాను. ప్రాచీన, ఆధునిక కల్లుశాస్త్రాల్లో ఆనర్స్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. కిరసనాయిలు, పెట్రోలు, టర్పెంటైనాయిలు మొదలైన కొన్నింటిలో తప్ప, తాగటానికి అవకాశమున్న అన్ని పానీయాల విషయంలో నాకు ప్రావీణ్యముంది. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాలులో మెంబర్ని. బుసబుస పొంగే పానీయాలు కలిగించే మత్తు పట్ల నిరోధకశక్తి గురించిన శాస్త్రపు అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఆ విభాగానికి అధిపతిని. నా శరీరంలో పచ్చని రక్తం ప్రవహిస్తుంటుంది. అందుకే నా మెదడు ఎరాస్మస్ మెదడుకన్న ఎక్కువ సారవంతమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొనే ముఖ్య అతిథులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అత్యంత విలాసవంతమైన కారు లాంటి కారును నాకెందుకు ఇవ్వరా అని తికమక నిండిన మెదడుతో నాలో నేనే చర్చించుకునే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని నేను.

నేను ఆక్రా న్యూటౌన్లో బల్లులు, ఎలుకలు, గబ్బిలాలు ఆటంకం లేని స్వాతంత్ర్యాన్ని అనుభవించే ఒక గదిలో నివసిస్తాను. అవి యథేచ్ఛగా తమ మలమూత్రాలను నా మీద విడుస్తాయి. కొన్నిసార్లు నాతో పడకను కూడా పంచుకుంటాయనేది విషాదకరమైన వాస్తవం. నేను బయటికి వెళ్లి తిరిగొచ్చినప్పుడు అధికారాన్ని చూపుతూ అశ్రద్ధగా నా మంచం మీద పడుకుంటాను. వాటిని ప్రశ్నించేటంత ధైర్యమెక్కడిది నాకు? ప్రశ్నిస్తే అవి నా పడక మీదికి మళ్లీమళ్లీ వస్తాయి! నా కోరికలూ వాటి కోరికలూ వేరువేరు కావటం దారుణం. అవి ఎప్పుడూ నాతో విభేదిస్తాయి, కొట్లాడుతాయి.

నాకు మధ్యాహ్నపు కునుకు తీయాలనిపించినప్పుడు వాటికి ఆటలాడుకోవాలనిపిస్తుంది. సగం ఖాళీ వున్న పైకప్పు మీద అవి పరుగు పందెమూ, హైజంపూ, పోల్ వాల్టింగూ చేసుకుంటున్నప్పుడు దయతలిచి నన్నొక నిస్సహాయ ప్రేక్షకునిగా మౌనంగా వుండనిస్తే నాకేం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అటువంటి చర్య ఓర్పు వహించటంలో శిక్షణనిస్తుంది నాకు. కాని దయనీయమైన సంగతేమిటంటే, అవి నన్ను అలా ఉండనివ్వవు. కొన్ని సార్లు అవి హైజంప్ చేస్తున్నప్పుడు జారి నా మీద పడతాయి. వేరే సమయాల్లో కూడా వాటంతట అవే బ్యాలెన్సు తప్పి పెద్ద శబ్దంతో నా మీద పడి, నా శరీర భాగాల్ని కమిలేట్టు చేయటమే కాక, వాటి భరించరాని వాసనతో నన్ను కలుషితం చేస్తాయి. అట్లా జరినప్పుడల్లా నేను డాక్టరు దగ్గరికి పరుగెత్తటమే కాక, డబ్బులు పిండటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండే మెడికల్ షాపులను సందర్శించాలి. ఇదంతా నా ఆర్థిక వనరులకు పెద్ద బొక్క పెట్టే వ్యవహారం.

పైకప్పు మీద ఆటలు లేనప్పుడు కూడా, కొన్నిసార్లు పైవాటాలో వుండే మిస్ సన్ అనే ఆవిడ బ్రెడ్ తయారు చేస్తుంది. అందుకోసం ఆమె ఉపయోగించే పొయ్యి సరిగ్గా నా నెత్తి మీదే వుండటం, ఆ పైకప్పు సగం ఖాళీగా వుండటం – వీటి వల్ల చాలాసార్లు బ్రెడ్డు కంటె ఎక్కువగా నేనే కాలుతాను. నేను యింట్లో వున్నప్పుడు బ్రెడ్డు తయారు చేయొద్దని ఆమెను ఒప్పించటం అసాధ్యం.

ఎంతటి దుర్భర పరిస్థితిలోనైనా కొంత సుఖం ఉంటుందని నేను మిస్ సన్ తో అనవచ్చుననుకోండి. ఎందుకంటే ప్రతి సాయంత్రం ఆమె నాకు ఐస్ క్రీమ్ యిస్తుంది. కనుక అదొక ఊరట. కాని ఆ ఎలుకల, బల్లుల సంగతి?

నేను వాటితో ఏదైనా మాట్లాడాలి కదా. కాబట్టి నా వయసుకూ, అనుభవానికీ, జ్ఞానానికీ గౌరవం యిచ్చి, ఆ పిచ్చిపనుల్ని ఆపాలని అన్నాను వాటితో.

“ఓ మానవా! మా హక్కుల మీద దురాక్రమణ చేయకు. మేమేం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో శాసించకు. ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో నియంతలకు తావు లేదని తెలుసుకో. నువ్వు నాలుగు మూలల్ని అద్దెకు తీసుకుంటే మేము పైకప్పు మీది రెండు భాగాలను అద్దెకు తీసుకున్నాం. మేము నీకు కనపడొద్దనుకుంటే, నీ మీద పడిపోవద్దనుకుంటే నీ శాస్త్రజ్ఞానాన్నంతా ఉపయోగించి, నీ నాలుగు మూలల్ని మా రెండు వైపులనుండి వేరు చేస్తూ అతి మందమైన మరో కప్పును నిర్మించుకో. అది చాతకాకపోతే గమ్మున వుండు” అన్నాయి ఆ ప్రాణులు.

ఆ విధంగా ధిక్కరించబడి, ఒక కిరాయిదారుకు ఉండవలసిన వినయవిధేయతల్తో ఇంటి యజమానిని కలిసి, ఎలుకలు, బల్లులు, గబ్బిలాలు చేస్తున్న ఆగడాల గురించి ఆయనతో మొర పెట్టుకున్నాను. ఖర్చు అన్నమాటను వింటేనే గజగజ వణికి ఆమడ దూరం పరుగెత్తే మా యింటి ఓనరు మరో పైకప్పును నిర్మించడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేడు.

ఐనా సలహాలూ ప్రార్థనలూ మొదట్లో ఎంత వృథా అనిపించినా కొన్నిసార్లు అవి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాయి. మరో పైకప్పును నిర్మించాలనే నా ప్రతిపాదన మొదట్లో మా ఓనరుకు పెద్ద సముద్రంలో చెంచాడు పంచదారను కలిపినంత చప్పగా అనిపించినా చివరకు కొంత మేలు చేసింది. సమస్య నుండి తప్పించుకోవాలని మా ఓనరు ఒక సమర్థవంతుడైన రక్షకుణ్ని నియమించుకుంటే ఈ హృదయవిదారకమైన పరిస్థితి నుండి సులభంగా గట్టెక్కవచ్చునన్నాడు. అంటే నా ఆర్థిక వనరులకే బొక్క పెట్టుకోవాలన్న మాట. మునుపటిలానే ఉండటమో, లేక ఒక సంరక్షకుణ్ని జీతంతో నియమించుకుని శాశ్వతమైన ఆర్థిక అస్థిరత్వాన్ని కొనితెచ్చుకోవటమో – ఈ రెండింటిలో ఏదో వొకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది నాకు. ఇల్లు ఖాళీ చేసి గదికోసం వెతుకుతుంటే మర్యాదస్తులమైన మనకు ఆక్రా నగరంలో ఎవరైనా తెలిసినవాళ్లు ఎదురు పడితే తప్పించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే అలా తప్పించుకోకపోతే మనం గది లేని జానీవాకర్లమని వాళ్లకు తెలిసిపోతుంది.

సాధారణంగా బిచ్చగాడికి తప్పించుకునే మార్గముండదు. కానీ నాకు ఆ వెసులుబాటు వుంది కనుక రెండో మార్గాన్నే ఎంచుకుని, ఒక అత్యంత సామర్థ్యమున్న మార్జాలం గారిని సంరక్షకునిగా నియమించుకున్నాను.

నిజానికి మార్జాలం గారు చాలా సమర్థులని నిరూపించుకున్నారు. కేవలం రెండు రోజుల్లోనే నా సహ కిరాయిదార్లు మౌనాన్నీ, నిశ్చలత్వాన్నీ కనబరిచారు. అవి ఏ కొంచెం తమ ఉనికిని చూపించినా తమ అస్తిత్వాన్ని కోల్పోయి, గౌరవ మార్జాలం గారి భక్షణ సామర్థ్యాన్ని పెంచటానికే ఉపయోగ పడ్డాయి. ఆయనగారి చురుకైన మీసాలూ, ప్రకాశవంతమైన కళ్లూ సాహసచర్య కోసం ఎప్పుడూ ఉవ్విళ్లూరుతూ రెడీగా వున్నాయి. ఎప్పుడైనా ఎలుకగానీ, బల్లిగానీ హైజంపు చేయటానికో, పోల్ వాల్టింగ్ చేయటానికో ప్రయత్నిస్తే , మార్జాలం గారి పదునైన గోళ్లు దాన్ని చీల్చి, పసందైన విందుగా మార్చేవి. తమను తాము శక్తిమంతులుగా నిలుపుకోవటానికి నీరసంగా ప్రయత్నించిన కొన్ని ప్రాణులు చిక్కి శల్యమయ్యాయి. వాటి చర్మం ఒక అసాధారణమైన, దైవికమైన పారదర్శకతను సంతరిచుకుని, ఎముకలు లెక్కపెట్టగలిగేంతగా చిక్కిపోయాయవి. అవి మరణం వైపు పరుగులెత్తే సజీవ అస్థిపంజరాలయినయ్.

పరిస్థితులు ఆశావహంగా మారినయ్. అత్యంత ఘోరం నుండి ఓ మోస్తరు ఘోరానికి, ఆ తర్వాత కొంచెం ఘోరానికి, తర్వాత మంచికి, ఆ తర్వాత మరింత మంచికి మారాయి కాని, దురదృష్టవశాత్తు అవి చాలా సంతృప్తికరంగా మారలేదు. అతి దివ్యమైన పరిస్థితులు రాకముందే ఒక చాలా విషాదకర సంఘటన జరిగింది.

ఒక శనివారం నాటి ఉదయాన – అంటే ఈస్టర్ పండుగకు ఒక రోజు ముందు – సూర్యుడు ప్రపంచాన్ని తన ఆకర్షణీయమైన, సమ్మోహకరమైన పండుగనవ్వుతో ముంచెత్తినప్పుడు, మరునాటి ఈస్టర్ పండుగను ఒక చక్కని విందుతో జరుపుకోవాలని నిశ్చయించుకున్నాను నేను. ఒక గినీని ఖర్చు చేసి ఒక సీమకోడిని కొని, దాన్ని నా పక్కవాటాలో వుండే “కరుణ”కుమారి గారికి పంపి, ఈస్టర్ నాడు దాని కూరను నా డైనింగ్ టేబులు మీద వుండేట్టు చూడమన్నాను.

ఈ పని కోసం నేను “కరుణ”కుమారినే ఎందుకు ఎంచుకున్నానంటే, ఆమెకు వంట చేయటం బాగా వచ్చు. “కదంబ” పాఠశాలలో గృహశాస్త్ర విభాగానికి అధిపతి అయిన కరుణకుమారికి, నా కోరికకు వాస్తవ రూపమివ్వగల సామర్థ్యముంది. ఎప్పట్నుంచో ఎదురు చూసిన ఈస్టర్ పండుగ, మంచిమంచి వంటదినుసులతో వండబడి రుచికరమైన శోర్వలో మునిగిన సీమకోడితో పాటు రానే వచ్చింది. దాని అద్భుతమైన వాసనను చూసిన ప్రతి ముక్కూ ఆపుకోలేని ఆనందంతో ఎగిరి గంతెయ్యాల్సిందే. నాకు నోరూరింది. నా నాలుక ఆగలేక నాట్యం చేయడం మొదలెట్టింది. నాకళ్లు కూడా ఆ రుచిని గుర్తించి మెరవసాగినయ్. కళ్లతో రుచినెలా గుర్తిస్తారని అడక్కండి నన్ను. ఎందుకంటే దానికి సమాధానం తెలియదు నాకు. మొత్తానికి దాని వాసన వర్ణించలేనంత అద్భుతంగా వుంది.

కాబట్టి నా డైనింగ్ టేబుల్ చుట్టూ వున్న వాతావరణాన్ని ఆ సీమకోడికి తగ్గట్టుగా మార్చి ఒక రికార్డును సృష్టించాలనుకున్నాను. దాన్ని ఆనందంగా టేబులు మీద వుంచి, “అంతా మింగండి” అనే క్యాంటీన్లో “లక్కీ ఫెలోవి నువ్వు” అనే మద్యం సీసాను కొనుక్కుని, నా నోట్లోని లాలాజలాల ఊటనూ, ఆకలినీ మరింతగా పెంచుకోవాలనుకుని బయటికి బయల్దేరాను. ఈలోగా నాకు అత్యంత విశ్వాసపాత్రుడైన మార్జాలం గారు టేబులును చూస్తూ అక్కడే నిల్చున్నారు. వెళ్లే ముందు, నేను లేనప్పుడు కొత్తవాళ్లు ఎవరైనా లోపలికి వస్తే తరిమికొట్టాల్సిందిగా మార్జాలం గారికి ఆజ్ఞను జారీ చేశాను. నేను డెబ్భైఏడు గజాల దూరం వెళ్లాక కూడా ఆ వంటకం తాలూకు వాసన రావటం గమనించాను. ఈ దేశంలోని మగాళ్లు ఒక వేళ “లక్కీ ఫెలోవి నువ్వు” అనే మద్యం సీసాను కొనటానికి వెళ్తున్నప్పుడు నాకున్నంత నిజాయితీతో, వివేకంతో ప్రవర్తిస్తే , దేశం అద్భుతమైన పురోగతిని సాధించి ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ స్వర్గంగా మారుతుందనేది నిజం. మద్యం సీసాను కొనుక్కుని వెనుతిరిగాను నేను. నా యింటికి యాభై గజాల దూరంలో వున్నప్పుడు పరిశీలిస్తే నాకు ఏ వాసనా రాలేదు. మక్కురంధ్రాలు మూసుకుపోయాయేమోననుకుని ముక్కును గట్టిగా చీదాను. అయినా ఎటువంటి వాసనా లేదు. ఆశ్చర్యం, నేను ఇంకా దగ్గరికి వచ్చినా వంటకపు వాసనే లేదు. ఈసారి గట్టిగా గాలి పీల్చుకుని పరీక్షించాను. కాని ఫలితం సున్నా అయింది. నేను సాధ్యమైనంత వేగంగా పరుగెత్తి యిల్లును చేరుకుని చూద్దును కదా, కోడికూరా లేదు మరేదీ లేదు. నా పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవాళ్లు?

కోపంతో, నిరాశతో నా కళ్లు కదలాడుతుంటే, తీవ్రమైన అసంతృప్తితో నా కంఠం వణుకుతుంటే, అద్భుతమైన వంటకాన్ని కోల్పోయిన బాధతో నా నాలుక తీపు పెడుతుంటే, నా సంరక్షకుని మీదికి ప్రశ్న తర్వాత ప్రశ్నను విసిరాను. “లోపలికి వచ్చిన ఆ కొత్త ప్రాణి నాకు మహా చిరాకు తెప్పిచటంతో మీరు ఆదేశించిన విధంగా దాన్ని తరిమేశాను” అన్నారు మార్జాలం గారు.
“అట్లా అన్నానా నేను? అయినా ఒక వంటకం కొత్త ఆగంతుకుడెలా అవుతుంది?” అని అడిగాను. “అది ఆపలేనంత వాసనను వ్యాపింపజేసింది. దాంతో ఇక్కడి గాలి కలుషితమై పండుగ వాతావరణమంతా చెడిపోతుందని భావించి, దాన్ని పారేశాను” అని సమాధానం వచ్చింది.

“ఎక్కడ పారేశావు?”

“అయ్యో విడ్డూరం. దాన్ని అక్కణ్నుంచి తీసి, వాసన రాని చోటుకు మార్చాను”.

నాలో ఆశాభావం కదలాడుతుంటే మనసును చిక్కబట్టుకుని, దాన్ని వుంచిన ప్రదేశమేదో అడిగాను.

“అయ్యో చోద్యం పాడుగానూ. జరిపోయిందానికి విచారించటమెందుకు? దాన్ని నా కడుపులో పెట్టాను” అని మార్జాలం నుండి సమాధానం వచ్చింది.

“ఇది మరీ దుర్మార్గం. ఎలుకలు మొదలైనవాటికీ, అమాయకమైన ఒక రుచికరమైన వంటకానికీ మధ్య వున్నభేదాన్ని నువ్వు గుర్తిస్తావనుకున్నాను. నువ్వొక సమర్థుడివైన సంరక్షకుడివనుకున్నాను. హానికరమైన చేతకాని చవటవనుకోలేదు. నిజంగా మూర్ఖుడు బడికి వెళ్లినా వెళ్లకపోయినా మూర్ఖుడే” అన్నాను.

ఆ బలమైన తుంటరి మార్జాలాన్ని పట్టుకుని నిర్దయగా, తనివితీరా బాదాలని ప్రయత్నించాన్నేను. కాని మార్జాలం తప్పించుకుని పారిపోవటంతో నాకు సంరక్షకుడే లేక మళ్లీ మొదటి దుస్థితికి చేరుకున్నాను.

2. కొత్తగది కోసం అన్వేషణ

పండుగ మరునాడు నేను కొత్తయింటి కోసం వెతుకుతూ ఆత్రుతతో యిల్లిల్లూ తిరిగాను. ఊహించని విధంగా, అడ్వర్టైజ్ మెంట్లలో కనిపించే భవనం లాంటి మంచి ఇల్లొకటి అద్దెకు కనపడింది నాకు. ఆధునిక భవన నిర్మాణ శాస్త్రం తాలూకు వైభవమంతా అందులో గోచరించింది నాకు.

ప్రపంచాన్ని జయించినంత గర్వంతో, ధీమాతో ఆ యింటి యజమానిని కలవటానికి లోపలికి వెళ్లాను. ఆయన ఆనందకరమైన సురాపానంలో మునిగి వున్నాడు. అతని గుబురు మీసాలు బహుశా తను తాగే చిక్కటి తాటికల్లును వడగట్టటం కోసమే ఉన్నాయేమో. అతని కళ్లు ఆకలిగొన్న గద్దకళ్లలా కదులుతున్నాయి. అతడు తాగిన తాటికల్లు మూలంగా ఒక చురుకైన అమెరికన్ లా మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్లో అతి చురుకైనవాళ్లు, నిర్జీవులు అని రెండు రకాలవాళ్లుంటారని గమనించాన్నేను. నేను నమస్కారం చేసినప్పుడు ఇంటి యజమాని చెప్పిన సమాధానాన్ని బట్టి అతనికి ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాదని తెలిసిపోయింది నాకు. అతడు మాట్లాడింది కూడా నేను ఒక్క ముక్కా అర్థం చేసుకోలేకపోయాను.
మేం ఒకరినొకరం చూసుకున్నాం. అద్దెయిల్లు గురించి మాట్లాడుకునేటప్పుడు మౌనం మహా అనర్థదాయకం. వేరే పని కోసం వచ్చివుంటే నేను మౌనాన్నే పాటించేవాణ్నేమో. కాని యిక్కడ అలా చేయలేను కదా. ఇంతలో మా మాటల్ని తర్జుమూ చేసే ఒక మనిషి దొరికాడు నాకు. నేను చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాననీ, అందువల్ల నేను ఈ యింట్లో వున్నప్పుడు అమ్మాయిలు నాకోసం వేటాడుతూ వస్తారనీ అన్నాడతడు. ఇంటి ఓనరు కూడా అతనికి వంత పలికాడు. నాకు పెళ్లి కాలేదని ముందే ఎందుకు అనవసరంగా చెప్పానా అనుకున్నాను. ఇట్లా అంటాడని ముందే ఊహిస్తే చిన్నవాడిగా కనిపిస్తున్నా నాకు పెళ్లయిందనీ, ఒక భార్యా ఇద్దరు పిల్లలు కూడా వున్నారనీ చెప్పేవాణ్ని.

ఏది ఏమైనా ఆయన అన్నదాంట్లో సారముంది. ఒక పెళ్లైనవాడికి యిల్లును అద్దెకిస్తే ఇల్లాలు ఆ యింటిని రోజూ ఊడ్వటమూ, పొయ్యి వెలిగించటమే కాక ఇంటి బాధ్యతను తీసుకుంటుందని అతని ఉద్దేశం. ఆ రెండు విషయాలు ఆ ఘనా దేశస్థుని హృదయానికి చాలా దగ్గరైన విషయాలు.

నేనేం తప్పు చేశానో తెలుసుకున్నాను. బ్రహ్మచారినని చెప్తే సులభంగా ఇల్లు దొరుకుతుందనుకున్నాను కానీ దానికి విరుద్ధంగా జరిగింది. అంతకు ముందు నేను చెప్పిన మాటల్ని మార్చాలా వద్దా అనే సందేహం కలిగింది నాకు. నాకు పెళ్లి కాలేదంటే నిశ్చితార్థం కూడా కాలేదని అర్థంకాదనీ, నిజానికి ఒక అమ్మాయితో సంబంధం నిశ్చయమైందనీ, ఒక వారం రోజుల తర్వాత పెళ్లి చేసుకుని భార్య సహా కొత్త యింట్లో దిగుతాననీ చెప్పాను. నా భార్య ఆయన వచ్చినప్పుడల్లా యిల్లును ఊడుస్తుందనీ, పొయ్యిని వెలిగిస్తుందనీ భరోసా ఇచ్చాను.

నెలకు పన్నెండు పౌండ్ల అద్దె చొప్పున ఆ రెండు గదులూ హాలూ వున్న యిల్లును చేజిక్కించుకోవటానికి నేను పెళ్లి చేసుకోవటం ఒక నిర్బంధ షరతు అయింది. నా అత్యంత ఆప్తమిత్రుల సలహా ప్రకారం ఒక నైట్ క్లబ్బును సందర్శించటానికి ప్రణాళిక వేసుకున్నాను. అక్కడైతే పెళ్లి చేసుకోవటానికి నాకొక అమ్మాయి దొరుకుతుందని ప్లాను.

చివరికొకనాడు క్లబ్బుకు వెళ్లాను. నాకున్న బోలెడంత అనుభవసారాన్నంతా ఉపయోగించి, నా ముఖంలోనే, నా తీరులోనే అంతా కనిపింపజేయాలనుకున్నాను. మూడు బీర్లకు ఆర్డరిచ్చాను. ఖరీదైన సిగరెట్టును వెలిగించి, గొప్పోడి లాగా నటించడం మొదలెట్టాను. వలను విసిరి పెద్ద చేప కోసం ఎదురు చూడసాగాను. నా కోరిక ఫలించింది.

నేను ఉత్సాహంగా బీరు తాగుతుంటే ఇద్దరు అందమైన మ్మాయిలు నా దగ్గరికి వచ్చారు. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. వాళ్లు నాకు మర్యాదపూర్వకంగా నమస్కరించటంతో నా హృదయం ఆనందంతో గంతులేసింది. వాళ్ల నవ్వుకు సమాధానంగా నేనూ నవ్వాను. వాళ్ల నవ్వులో ప్రపంచమంత అర్థముందని గ్రహించాన్నేను.

వాళ్లలో ఒకామె నిల్చుని వుండే నాతో హృదయం విప్పి మాట్లాడసాగింది. “మిమ్మల్నెక్కడో చూసినట్టుంది” అన్నదామె. “కావచ్చునండీ. నేనొక పెద్ద పైలట్ను. ఘనా దేశాన్ని మొత్తం నా ప్రయాణంతో చుట్టేశాను. అందుకే నేను మీకు తెలుసనుకుంటా. అసలు నేనే ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను” అన్నాను. వాళ్లు ఒక రహస్యమైన ఆరాధనపూర్వక వీక్షణాన్ని విసురుతూ నవ్వారు.

నా ఊహాలోక సుందరీమణుల్లానే ఉన్నారు వాళ్లు. ఒక అందమైన యువకుని ఆకాంక్షకు తగ్గట్టుగానే వున్నారు. వాళ్ల మెరిసే ముఖాల అందాన్ని, అట్టులాగా మందంగా పూసిన లిప్ స్టిక్ మూలంగా ఎంతో ఎరుపెక్కిన వాళ్ల పెదాల్ని, వాళ్ల శరీరాల్నుండి వెలువడే సువాసనల్ని చూసి, నా తర్కజ్ఞానంతో ఈ విధంగా అనుకున్నాన్నేను. అట్లు పోయటం లాంటి ఆధునిక ఆకర్షణీయమైన ప్లాస్టరింగ్ కళలో వాళ్లు నిపుణులు. అత్తరు చల్లే శాస్త్రంలో డాక్టరేట్లు వాళ్లు.

వాళ్ల కళ్లు ప్రేమసముద్రంలో ఈదుతుంటే నన్ను వదిలిపోవటానికి ఎంత మాత్రం తొందరను చూపకుండా నా ముందరే నిల్చున్నారు వాళ్లు. నా పక్కన కూచోవలసిందిగా వాళ్లను కోరాలనుకున్నాను. కానీ వెంటనే వాళ్ల రూపాల్ని గమనించి ఆగిపోయాను. వాళ్లెంత గంభీరంగా, గౌరవప్రదంగా కనిపించారంటే, నా ప్రతిష్ఠాత్మకమైన రూపం వాళ్ల ఠీవితో సరితూగలేదనిపించింది. వాళ్లు హుందాతనంతో, లావణ్యంతో వికసించారు. అతి సన్నని నడుముతో, తీగల్లాగా, నున్నని చర్మంతో, సౌందర్య సామ్రాజ్యంలోని ఒక భవనంలో అతి సన్నని దారాలతో ఎంతో నైపుణ్యం చూపి అల్లి వేలాడదీసిన వస్త్రకళా చిత్రాల్లా ఉన్నారు వాళ్లు.

“సుందరీమణులారా! మీ పక్కన ఆసీనుణ్నై వుండే మహాభాగ్యాన్ని నాకు కల్పిస్తారా?” అనే వాక్యాన్ని నేను ముగించానో లేదో, ఆ సౌందర్యదూతలిద్దరూ ఠకీమని నాకు చెరొక పక్కా కూలబడ్డారు. మార్చిమార్చి చూసినకొద్దీ వాళ్లలో కొత్తకొత్త సౌందర్య ప్రపంచాలు కనపడసాగినయ్ నాకు.

వాళ్లు సూర్యునంత వెచ్చగా, చంద్రునంత చల్లగా, చెప్పరానంత సమ్మోహకరంగా వున్నారు. అందమైన చేతివేళ్లతో, మరింత సొంపైన చేతిగోళ్లతో గ్లాసుల్ని టకటక కొట్టారు. వాళ్లు తాగిన మద్యానికి బిల్లు చెల్లించే అధికారం అప్పుడు నాదే కనుక, ఆ కష్టతరమైన పనిని నేను ఎంతో మనోనిబ్బరంతో నిర్వహించాను. రకరకాల బ్రాండ్ల మద్యాల కోసం ఆర్డర్లు వేసే అధికారం మాత్రం వారికే దక్కింది. వాళ్లతో సాహచర్యం నిజంగా చాలా ఖరీదైనదని తేలిపోయింది. అలంకరణ శాస్త్రంలో వాళ్లెంతో నిపుణులే కాక, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ లో కూడా వాళ్లు బాగా ప్రవీణులైన మెంబర్లని తెలిసింది.

ఒక్క కోకాకోలా తప్ప మిగతా తాగగలిగిన పానీయాలన్నిటినీ వాళ్లు అద్భుతమైన గుండెనిబ్బరంతో సేవించారు. వాతావరణం చాలా ప్రశాంతంగా, కళాత్మకంగా వుంది. వీళ్లలాగా ఉన్నవాళ్లు కొందరు, పూర్తి విరుద్ధంగా ఉన్న మరి కొందరు స్త్రీలు లోపలికి రాసాగారు.

డాన్సు మొదలైంది. నా యిద్దరు యువతుల నడుములు చాలా చిన్నగా, ఎటంటే అటు వంగే విధంగా ఉన్నాయి. వాళ్లు అడుగులు కదిపే విధానం గొప్పగా వుండటం వల్ల, మాంబో అనే లాటిన్ అమెరికన్ నాట్యానికీ, క్యాలిప్సో అనే మధ్యధరా సంగీతానికీ అనువైన విధంగా డాన్సుచేశారు. వాళ్ల పెదవులు ఎంత సున్నితంగా, కోమలంగా వున్నాయంటే, అవి చిరునవ్వును తప్ప వేరే దేన్నీ మోయలేకపోయాయి.

ఆ క్లబ్బులో అందరు స్త్రీలూ ఇదే విధంగా లేరు. కొందరి రూపాలు, ప్రవర్తనలు ఇప్పటిదాకా చెప్పినదానికి భిన్నంగా ఉన్నాయి. వాళ్ల రూపాల్లో, స్వభావాల్లో, ప్రవర్తనా విధానాల్లో అనంతమైన వైవిధ్యాన్ని గమనించాను నేను. కాని వారిలో ఎంత వైవిధ్యమున్నా వాళ్ల ముఖాల్ని చూస్తుంటే ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకీభవించి, పెళ్లి గురించి ఎంత మాత్రం తొందర పడవద్దనే అభిప్రాయంతో వున్నారనిపించింది. వాళ్లంతా తొమ్మిది రోజుల ప్రేమవ్యవహారం అనే అద్భుతమైన పుష్పం కోసం అర్రులు చాస్తున్నారని గ్రహించాను. ఎంత ప్రయత్నించినా, బుజ్జగించినా పెళ్లి చేసుకుని కాపురం చేసే విధంగా వాళ్లను ఒప్పించలేమని తెలిపోయింది. అక్కడున్న స్త్రీలలో ఒక్కరు కూడా కనీసం వారం రోజుల కోసం సైతం భర్తను కలిగివుండటానికి సిద్ధంగా లేరు.

అనలు విషయమేమిటంటే, ఎప్పుడూ పురుషులకు స్త్రీల పట్లా, స్త్రీలకు పురుషుల పట్లా ఆసక్తి వుంటుంది. ఇందుకు నేను మినహాయింపునేం కాను. నేను మగవాళ్లను అంతగా పట్టించుకోను. వాళ్లు సహాయం చెయ్యరనీ, ఒకవేళ చేస్తున్నట్టు పోజు కొట్టినా నా మీద కత్తి నూరటమే చేస్తారనీ నా అనుభవంతో తెలుసుకున్నాను. మహా ఐతే తమకోసం తాము అన్నీ సమకూర్చుకుంటారు వాళ్లు.

పూర్తిగా నిరాశతో ఆ ప్రదేశాన్ని వదిలాను నేను. గాయపడ్డ నా కోరిక మీద రాసేందుకు ఏ మలామూ దొరకలేదు. కేవలం వివాహితుల్ని మాత్రమే ఆహ్వానించే ఆ అద్దె యింట్లో చేరాలనే ఆలోచనను మానుకున్నాను. అందని ద్రాక్ష పుల్లగానే ఉంటుంది మరి. చక్కని వాస్తునిర్మాణాన్ని కలిగిన భవనం అదొక్కటే కాదనీ, నగరంలో మరెన్నో మంచి యిళ్లున్నాయనీ, నిజానికి ఆ యిల్లు ఊరికి దూరంగా విసిరేసినట్టుందనీ సరిపెట్టుకున్నాను. నా నిస్పృహను ఆ విధంగా పోగొట్టుకునే ప్రయత్నం చేసాను.
మళ్లీ మళ్లీ మళ్లీ ప్రయత్నించాలన్నది సామెత. అందుకే నేను మళ్లీ మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. ఈ సారి పరిస్థితుల్ని బాగా పరిశీలించాకే నోరు విప్పాలనుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఒక ఇల్లు అద్దె కోసం వున్నసంగతి తెలిసింది నాకు.
పరిస్థితుల్ని బాగా పరిశీలించాననుకున్నాక, బ్రహ్మచారులకే ఆ యిల్లు అద్దెకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గ్రహించాను. కాబట్టి ఒక మంచి పెద్ద కోటును తొడుక్కుని, ఖరీదైన చుట్టను వెలిగించి, ఒక ప్రత్యేకమైన గొప్ప వ్యక్తిగా కనిపించేలా ప్రయత్నిస్తూ సాహసకార్యం మీద బయల్దేరాను. ఒకస్నేహితుని పాపను నా చేతుల్లో పెట్టుకుని ఆ యింటిని చేరాను. ఈ సారి మహాదుష్టురాలిలా, గయ్యాళిలా కనిపించే స్త్రీ ఒకామె నన్నాహ్వానించింది. నా గురించిన ఏ సమాచారాన్నీ ఇవ్వకుండా ఏ పని మీద వచ్చానో చెప్పానావిడకు.

“ఈ పాప నీ కూతురేనా?” అని అడిగిందామె. నేను అవునన్నాను. “ఈ పాప నీకు పవిత్రమైన దాంపత్యబంధం ద్వారా పుట్టిందా, లేక నీ అదుపు లేని కాముకత్వం ద్వారానా?” అని ప్రశ్నించింది. “నేను అట్లాంటి వెధవ పనులెప్పుడూ చేయనని తెలుసుకోండి. అంటే ఈ పాప నాకు పవిత్ర దాంపత్య బంధం ద్వారానే పుట్టిందని అర్థం” అన్నాను. “అయితే నువ్వొక వివాహితుడివని అనుకోనా?” అన్నదామె. అవుననన్నాను నేను. “నీకు పెళ్లయింది. నీకు నా గది అద్దెకు కావాలి. పెళ్లైనవాడెవడూ నాకు స్నేహితుడు కాడు. కనుక అట్లాంటివాడికి నేను గదిని అద్దెకివ్వను” అన్నదామె. నిరసనతో నేను తల గోక్కోవటానికి ప్రయత్నిస్తుంటే ఆమె గర్వంగా అక్కణ్నుంచి వెళ్లిపోయింది, నీకిష్టమైతే అక్కడున్న కుర్చీలతో, బల్లలతో మాట్లాడుకో అన్నట్టుగా.

పెళ్లయిందా కాలేదా అన్నది ప్రశ్న. అయితే దానికి సమాధానం నీ జాతకంలోనే వుంటుంది తప్ప నీ దగ్గర కాదు. ఎందుకంటే నీకు పెళ్లైనా కాకపోయినా నీకు ఇల్లు దొరకనూ వచ్చు, దొరక్కపోనూ వచ్చు.

 

ఆంగ్ల మూలం:పీటర్ క్వామె బువాహిన్
స్వేచ్ఛానువాదం: ఎలనాగ