కడిమిచెట్టు

నృత్య నాట్య తాండవ వేదిక -నర్తనశాల

మార్చి 2014

కొన్ని ఏళ్ల కిందట, అప్పుడే విశ్వనాథ వారి నవలలు చదువుకుంటూ సంభ్రమంతో తల మునకలవుతూ ఉన్నప్పుడు, స్నేహితురాలయిన రచయిత్రి అన్నారు ‘ ఆయన నాటకం నర్తనశాల చదవండి, అది చలం గారు రాసినట్లు ఉంటుంది ‘ అని. సంపాదించి చదివినప్పుడునాకు అలా అనిపించలేదు . అసలు చలం గారి సాహిత్యం తో ఏమైనా సంబంధం ఉందనీ అనుకోలేకపోయాను. దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలకి ఆ వైపుని చూపే ప్రయత్నం చేసినవారు విశ్వనాథ అని ఎందరికో తెలియదు. అదీ అటువంటిదేననిపించింది.

ఆ తర్వాత చాలా కాలానికి అర్థ తాత్పర్య సహితంగా తిక్కన గారి విరాటపర్వాన్ని గ్రహించే ప్రయత్నం చేశాను . వ్యాస భారతానికికొంతవరకూ సాధికారమైన తెలుగువచనానువాదం లభించింది. నా శక్తి మేరకు పరిశీలించాక తిరిగి విశ్వనాథ నాటకం చదివాను.

అప్పటికే మరొకరు చెప్పిన కథని తిరిగి ఎందుకు చెప్పాలనిపిస్తుంది? ఆ కవికో, రచయిత కో కథ మీద పట్టలేనంత ప్రేమ ఉండవచ్చు, ఎంత అంటే తనదీ అనేదాన్ని కొంత చేర్చకుండా ఉండలేనంత. ఆ పూర్వ కవులపైన గౌరవానికి భంగం రాకుండానే తనకు అక్కడ ఔచిత్యం మరొకలాగా అయితే ఎక్కువ భాసిస్తుందనిపించవచ్చు. పఠితల, ప్రజల హృదయాలలో , ఆలోచనాధారలో లీనమయిపోయిన కథలని తన పద్ధతిలో చెప్పుకురావటం కష్టం, మార్పుని ఒప్పించటం కనుక….
సులువు కూడానూ, అప్పటికే కనీసం మాధ్యమికమైన అవగాహన ఉంటుంది కనుక, తన చేర్పు ఉచితంగా , అందంగా ఉంటే చప్పున రాణిస్తుంది కనుక.

ఈ మార్పు చేర్పులలో న్యాయం పాటించే రచయితలు, కవులు – దుష్టపాత్రలలో సద్విషయాలను ఆరోపించవచ్చు, కానీ ఉత్తమ పాత్రలను దుష్టులుగా చూపకూడదు. ఎందుకంటే అది మూలచ్ఛేదం , కావ్యప్రయోజనం పూర్తిగా దెబ్బతింటుంది .
విరాట పర్వం లో వ్యాసులు శ్లేష ను అతి నిపుణంగా ఉపయోగించారని విన్నాను. సంస్కృతం రాని నాకు ఆ లోతులు తెలిసే అవకాశం లేదు. తెలుగులోనే ఉన్నా తిక్కన గారి రచన కూడా పూర్తిగా అర్థమైందనుకునే పాండిత్యం లేదు. ఏతావతా ఈ పరిశీలన స్థూల దృష్టితో చేసినది మాత్రమే.

కథ అందరికీ తెలిసినదే. పాండవులు, ద్రౌపది మారు వేషాలలో మత్స్యదేశపు రాజు విరటుడి కొలువులో సేవక వృత్తిని అవలంబించటం, రాజశ్యాలకుడైన కీచకుడు ద్రౌపదిని కామించి వేధించటం, రాణి సుధేష్ణ కీచకుడి మాటను కాదనే ధైర్యం లేక సైరంధ్రిని అతని ఇంటికి మదిర తెచ్చే నెపంతో పంపించటం , భీముడు రహస్యంగా అతన్ని మట్టుపెట్టటం , అర్జునుడు బృహన్నల వేషాన్ని వదిలి ఉత్తర గోగ్రహణం లో కురు సేనను ఓడించటం, చివరికి ఉత్తరాభిమన్యుల కల్యాణం.

నర్తనశాల అనే పదబంధానికి రెండు మూడు స్థాయిలలో భాష్యం చెప్పుకోవచ్చు. రాజకుమారి ఉత్తర, అంతఃపుర స్త్రీలు, నాట్య గురువు బృహన్నల- ఇది ఒక స్థాయి. మారు వేషాలలో ద్రౌపది, పాండవులు…వారెవరో చదువరులకు తెలుస్తూ కథలో ఇతర పాత్రలకు తెలియని నాటకం..ఇది ఇంకొక స్థాయి. అటూ ఇటూ అయిపోయే ప్రాపంచిక సంపదలలో మనుషులు అందరూ ఆడవలసిన నాటకం అంతర్ధ్వనిగా మరొక స్థాయి. లోకైక మహానర్తకుడెవడో వాడి నాట్యానికి వ్యాఖ్యానం పరమమైన స్థాయి.

“నర్తకుని భంగి పెక్కగు
మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులున్
కీర్తిం ప నేరనెరెవ్వని
వర్తనములెఱుగరట్టివాని నుతింతున్”
- బమ్మెర పోతనామాత్యులు [శ్రీమదాంధ్రభాగవతం]

[ వేదవ్యాసులు మహాభారత రచన ముగించి వికలమైన తమ హృదయానికి శాంతికోసం నారదమహర్షి సూచన మేరకు మహాభాగవతం రచించుకున్నారు ]

* * *

వేయిరేకుల నల్లకలువ పాంచాల రాజకుమారి. యజ్ఞగుండం లోంచి పుట్టటమే యౌవనవతిగా. ఆ యౌవనం, శోభా వైభవం తుదిదాకా బీరుపోలేదు, అయిదుగురు బిడ్డలను కన్నా,ఎన్ని ఎన్ని ఇక్కట్లు పడినా. జన్మ చేత దివ్యమూ జీవనం వలన భౌమమూ అయిన మహా సౌందర్యం. ఆ విరుద్ధపు మేళవింపు లో తప్పించుకోలేనంతటి ఆకర్షణ. వైకుంఠం కాదు, కైలాసం కాదు, స్వర్గం ఆమె తొలిలోకం, చేయి చాస్తే అందుతుందేమో అనిపిస్తుంది. అయిదు అంశలుగా జన్మించిన స్వర్గాధిపతికి సామ్రాజ్ఞి- కాని, . దేవతాంశ సంభూతులు మాత్రమే ఆ భర్తలు, దైవమెత్తిన అవతారాలు కారు, కర్మ నిబద్ధులు. ఆ అడుగడుగు గండాలలో కాచేందుకు, లయించేందుకు దైవం వెన్వెంట సోదరస్థానీయుడై, పశుపతి యై.

వ్యాసుడి ద్రౌపది అభిజాత్యం గల క్షత్రియ. కీచకుడు సూతపుత్రుడనీ తనను అవమానించాడనీ పదే పదే వ్యాసుల ద్రౌపది కుమిలిపోతుంది. నావంటిదాన్ని అతను అవమానిస్తాడా అనే వేదన ఆమెది. తానెవరో అతనికి తెలియనే తెలియదాయె, తెలిస్తే మొదటికే మోసమాయె ! విరాటసభ లో తన అవమానం జరిగిన రోజు రాత్రి భీముడికి చెప్పుకునేటందుకు వెళ్లి అతను నిద్రపోతుంటే ” ఏమి, దీర్ఘనిద్ర లో ఉన్నావా ? ” అని ఎత్తిపొడుస్తుంది.

తిక్కన గారి ద్రౌపది ఎక్కువసార్లు కీచకుడు సూతుడనే ప్రసక్తి తీసుకురాదు. సామాన్యమైన తెలుగు ఇల్లాలి వలె కీచకుడితో ” అన్న, ….ఆడుబుట్టువులతోడ నీవును బుట్టినాడవు ” అంటుంది. సేవికా వృత్తి వలని దైన్యం ఎక్కువ ఆమె లో . అయినా ధర్మరాజుని సభలో నిందించేటప్పుడు, భీముడితో మొరపెట్టుకునేటప్పుడు అజ్ఞాతవాసం భంగమయితే ఏమి కానున్నదో అనే ఆలోచన ఆమె చేసినట్లు కనిపించదు. నిద్రపోయే భీముడిది దీర్ఘనిద్ర అనకుండా ” నీకు నిద్ర ఎలా పడుతోంది ? మీ అన్న ఇది సమయం కాదని చెప్పటం చేత విశ్రమించావా ఏమిటి? ” అంటుంది.

విశ్వనాథ ద్రౌపది పూర్తిగా రాజ్ఞి. లోతుగుండె గలది. పెదవి విప్పి పలికేదే తక్కువ. కీచకుడి ని భ్రమిపజేసి నర్తనశాలకి రమ్మనే సందర్భం లోనూ మూడు నాలుగు మాటల కంటె మాట్లాడదు. కీచకుడు సూతపుత్రుడని అనటం ఉండదు, ఎవరైనా ఒకటే ఆమెకి. అతను ‘ పాంచాలీ ‘ అని సంబోధించినప్పుడు మొట్టమొదట ఆమెకి తట్టేది అజ్ఞాతవాసం భగ్నం కావచ్చునని. అప్పుడే కీచకుడి చావును ఆమె నిర్ణయిస్తుంది. ” ఇతడనుమానించినాడు. మేధావియే. పాపము దుష్టగుణము వచ్చి త్రుంచుకొని పోవుచున్నది. [అజ్ఞాత వాసపు ] రహస్యము బయటకు ప్రాకకుండ నితని తొందరలో భూమికి దూరము చేయవలసినదే ” అనుకుంటుంది. ఇక్కడ భీముడు నిద్ర పోనే పోడు. ఆమె వస్తుందని తెలిసి ఎదురు చూస్తూ ఉంటాడు. అతను, ధర్మరాజు, సహదేవుడు, ద్రౌపది…అంతా ఒక కనబడని సూత్రం ప్రకారం నడుస్తారు, ఒకే పట్టు మీద ఉంటారు.
కీచకము అంటే గుల్లగా ఉన్న వెదురుబొంగు అని అర్థం. సిం హబలుడు అనేది ఇంకొక పేరు కీచకుడికి. పరస్పరవిరుద్ధాలైన ఈ రెంటిలో చివరకు కీచక నామమే సార్థకమైంది. అతను అలాగే విరిగిపోతాడు.

వ్యాసులు ఋషి. ఆయన చెప్పినది వేదం. అందుకు తెలుపు నలుపులలో చూపించినా చెల్లిపోయింది. అది అలా ఉంటే ఇది ఇలా ఉంటుంది అని ఆయన వాక్కు. వ్యాసుడి కీచకుడు కేవలం కాముకుడు. సైరంధ్రి ని ఏ విధంగానయినా పొందాలనే ప్రయత్నం లో కౄరంగా ప్రవర్తిస్తాడు. తన ఇంటికి పంపబడిన సైరంధ్రిని చేయిపట్టి లాగి వెంబడించి విరాటసభలో నేలకి ఈడ్చి ఆమె శిరస్సు ను తన్నుతాడు. జూదం తర్వాత కురుసభలో జరిగిన దానికి ఇది ఇటో, అటో. ఆమె లభించకపోతే మరణిస్తాననేటంత వాంఛ ఉన్నా సైరంధ్రి సాధారణ సేవిక కాదేమోననే అనుమానం ఉన్నా ఆమెతో అతని ప్రవర్తన మొరటుగానే ఉంటుంది.

తిక్కన గారు కవి. శాసించటం కవుల పని కాదు, నచ్చజెప్పటం, ఒప్పించటం. అది అలా ఉన్నా కూడా ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పే అవసరం పడిన కాలం అది. తర్వాత కొన్నాళ్లకే ప్రబంధయుగం మొదలైంది. కాకతీయుల కాలం ఆయనది, జాయప సేనాని’ నృత్త రత్నావళి ‘ రచించిన కాలం. బహుశా’ పరకీయ ‘ [మరొకరి ప్రాపులోనో, వారికి భార్య గానో ఉన్నది ] అనే నాయిక ను కామించటం గుర్తించబడిన కాలం కూడానేమో

తిక్కన కీచకుడికి కొత్త విశేషణాలు ఇచ్చారు. అవి రూపాభిమాని [ తన రూపమూ ఎదటివారి అందమూ రెండింటి పట్లా ] , నానాభరణ ధరణశీలుడు [అలంకార ప్రియుడు ], దుర్విదగ్ధుడు [అవివేకి ] , బలగర్వితుడు అని. తర్వాత అతని పాత్రపోషణ మొత్తాన్నీ సూత్రప్రాయంగా చెప్పిన మాటలు ఇవి. సైరంధ్రి సౌందర్యాన్ని ప్రశంసించటం లో అతను ఇంచుమించు ఉత్తమ నాయకుడి స్థాయిలో పలవరిస్తాడు. ఆ వర్ణన పాదాల దగ్గరనుంచి ప్రారంభించటం విశేషం. దేవతల అందాన్ని అలా చెబుతారట, మనుషుల రూపాన్ని తల నుంచి కిందికి వర్ణిస్తారట. మోహోన్మత్తుడై తన ఇంటికి పంపబడిన ఆమెను కౌగలించుకోబోతాడు. రాజసభ దాకా వెంబడిస్తాడు. ఆమె వేగాన్ని నిలవరించేందుకు అందిన కేశపాశాన్ని పట్టుకోగా ఆమె ఆ ఊపుకి కింద పడుతుంది. ఆమె శిరస్సును తాడించటాన్ని తిక్కన పరిహరించారు. తన మన్మథ ప్రలాపాలకు సైరంధ్రి కళవళపడితే అది మోహం వలన అని అర్థం చేసుకునే అవివేకి. ఆమె భర్తలు గంధర్వులైనా మరొకరైనా తాను నిర్జించగలననే గర్వం అతన్ని అంతం చేసింది.

ఇంత అయినా అతని ఆరాధన లో నిజాయితీ ఉన్నట్లుగానే తిక్కన సూచించి వదులుతారు. కొన్ని ఎడల నవ్వు, ఇంకొన్ని ఎడల జాలి పుట్టిస్తారు. అది ఎలా సాధ్యపడిందంటే అతను అధముడనీ మూఢుడనీ ఎలాగా నెగ్గడనీ మనకి ముందు నుంచీ తెలుస్తూ ఉండే ఆయన నాటకశిల్పం వలన.

ఎవరు ధూర్తంగా ప్రవర్తిస్తున్నారో వారి వైపునుంచి కథ చెప్పుకురావటం , అది అవసరమైన వారికి వారి మాటలలోనే సమాధానం చెప్పటం. కీచకుడి పాత్రను మార్చి చిత్రించటం వెనుక తిక్కన గారి ఉద్దేశం అదే అయి ఉండాలి.
విశ్వనాథ నాటకం కీచకుడు సైరంధ్రి [ద్రౌపది ] ని చూసి తన్మయుడవటం తో మొదలై అతని వధ ను సూచిస్తూ ముగుస్తుంది. ఎందుకని ఆ మాత్రమే రాయదలచారు? నర్తనశాల అని పేరే కాని కీచకవధ కు తప్ప అది ఉపయోగపడినది లేదు. బృహన్నల పాత్ర కూడా నాటకం లో లేదు.

నాకు సమాధానం నాందీ పద్యాలను తరచి చూస్తే కనబడటం మొదలు పెట్టింది. ఆ రెండింటిలో ఒకటి పరమశివుని మూడో కన్నుని , ఆయన చేసిన కామదహనాన్ని ప్రస్తుతించేది. ‘ ఓహో ‘ అనిపించింది. రెండో పద్యం శివతాండవం గురించి.. రూఢి అయింది రచయిత ఉద్దేశం. తమాషా ఏమిటంటే దీనికి మూలం వ్యాసభారతం లో ఉంది. కీచకుడు సైరంధ్రి లభించక పోతే శంకరుడిని ప్రార్థిస్తానని అంటాడు ” ప్రభూ, నన్ను సైరంద్రితో కలుపు, లేదా మరణాన్ని ప్రసాదించు ” అని. శివుడి ఆ ఎంపికను, ఆజ్ఞను నాందిలో వాడారు విశ్వనాథ.


ద్రౌపదీ లావణ్య వాహిని లో కొట్టుకు పోతూ దిక్కు తోచని అభిశప్తుడిగా కీచకుడు ఇక్కడ గోచరిస్తాడు. ఆమెని చూసిన క్షణం నుంచీ శాంతి ఎరగని దీనత్వం ఎంతటిదయినా ఆమె తిరిగి ప్రేమించి తీరాలనిలేదు. చెప్పీ ఒప్పించబోయీ కాసింత నొప్పించీ అతను ఏమీ సాధించలేకపోతాడు. ఒక మాట్లాడబోయే ప్రయత్నం తో ఆమె పరుగెత్తి వెళ్లిపోతూ ఉంటుంది. అతను వెంబడిస్తాడు .” ఆగు, నేను చెప్పేది ఆలకించు, ఎందుకు భయపడిపోతావు ” అంటాడే కాని ఆమెను రాజసభ దాకా తరమడు. తననుంచి దూరంగా పరుగెత్తేటప్పుడు కీచకుడి నోట ఈ పద్యం నాటకంలో , ఇటువంటి ధోరణే మొత్తం-ఇంచుమించు భావకవిత్వం లాగా.“ఆ గమనరేఖ నన్నెంత యాహరించు ?
దూరమునకెంత సౌందర్య వారి రాశి
ఆ ఎగురుచున్న నీదు చేలాంచలముల
వెలది నా ప్రాణములు ముడివేసుకొందు”ఇక తన్ని అవమానించటం ఎక్కడ?

చివరి చివరికి ఊరికే ఆమెని చూసి అయినా సంతోషిస్తాను, ఆమె నిలబడిన నేలకి నమస్కరిస్తాను అనే దశ కి వెళతాడు. చెలికాడయిన శారద్వతుడు ” ఈ భక్తి దైవము యెడలనయిన కైవల్యమొసగెడివాడే ” అంటాడు. ” ఇంతకన్న కైవల్యమేమిటి ” అని కీచకుడి సమాధానం.పరకాంతను, పతివ్రతను సాధించదలచినప్పుడే మరణం తప్పనిసరి పరిణామం. కానీ ఇతనికి పుణ్యలోకాలు రాకపోయినా ఉత్తమమైన పునర్జన్మ వస్తుందేమోనన్నట్లుగా ఉంటుంది ఆ పాత్ర చిత్రణ.

‘ విశ్వనాథ సౌందర్యదర్శనం’ అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించిన యు.ఎ.నరసిం హమూర్తి గారు ఈసత్వగుణసంపన్నుడైన కీచకుడి సృష్టిఅద్భుతమని అంగీకరిస్తూనే ఈ తీరు విశ్వనాథ పైన పాశ్చాత్య సాహిత్యం వలన వచ్చిన ఉదాత్త సంస్కారాన్నో లేక విశ్వనాథ వారి విలక్షణమైన పూర్వజన్మ సంస్కారాన్నో సూచిస్తుందని అభిప్రాయ పడ్డారు. నాకు ‘ కాదు ‘ అనే తోచింది. ఈ నాటకం రచన 1924 లో. అప్పటి స్వేచ్చా ప్రణయ సిద్ధాంతపు నేపథ్యాన్ని ఊహించుకుంటే ఆయన ఏమి చెప్పదలచారో తెలుస్తుంది. తీవ్రమైన ,గాఢమైన అనురక్తి ఎలా ఉంటుందో బొమ్మ కడుతూనే దాని అచ్చపుదనమెంతటిదయినా – దేశ కాల పరిస్థితుల రీత్యా ఒక హద్దును అతిక్రమించినప్పుడు ,అవతలివారు స్పందించనప్పుడు ,ఆ ఉద్వేగాన్ని ఆమోదయోగ్యంగా చేయలేదని .

అసాధారణమైన లోకజ్ఞతా అమితమైన మృదుత్వమూ రెండూ సమంగా ఉన్న సాహిత్యకారులకు మాత్రమే సాధ్యమయేది అది.
సైరంధ్రి పైని వ్యామోహం తో బాధ పడే కీచకుడిని శారద్వతుడు ఊరడిస్తూ ఉంటాడు. కథ చెప్పనా అని, ” అనగనగా ఒక రాజు ” అంటాడు.

కీచకుడు ” ఆ రాజుకి ఏడుగురు కొడుకులా ? ” అని అడుగుతాడు.

” కాదు, నలుగురే, పెద్దవాడు అడవికి వెళ్ళాడు .. అతని భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకు వెళ్లాడు ”

” ఈ కథ నాకు తెలియును ” [కీచకుడు ]

” నీకుతెలియదు,[ తెలిస్తే ఇలా ప్రవర్తించవు అని ధ్వని] చివరకు ఏమయినది ? ”

” ఇంకొక కథ చెప్పుము ” అని మాట మారుస్తాడు కీచకుడు

ఒంటరిగా అదేపనిగా తలపోస్తున్నప్పుడు ఆమె పాంచాలి ఏమో అని అతనికి అనుమానం వస్తుంది. తనది తప్పేమో అని తర్కించుకుంటాడు ఇలాగ ” అందందు నా చేసిన పుణ్యకార్యములును నీ మహా పాపరాశి లో మునిగిపోయినవి. నేను సుక్షత్రియుడను కాను గనుకనే నాకీ నీచపు బుద్ధులని కూడ విరోధులు గుసగుసలాడుచున్నారు ” నిర్జించలేనంత తృష్ణ కు దాసుడై పోయినందుకు తనను తాను నిందించుకుంటాడు.

అతని అంతర్మథనం చివరి వరకూ కొనసాగుతుంది .సంకేతస్థలానికి కూడా వెళ్లటం మానేద్దామా, పోనీ వెళ్లి పశ్చాతాపాన్ని ప్రకటిద్దామా అనుకుంటాదు. ఇందులో మోసం ఉందా అన్న సందేహమూ వస్తుంది అతనికి. అయినా , బుద్ధిః కర్మానుసారిణీ !

అతను మరణించబోయే రోజున దీర్ఘాయుష్మాన్ భవ అని స్నేహితుడు దీవిస్తాడు, రాగల ఆపద తెలుస్తూ ఉంటుంది అతనికి. కామిని లభించాలని దీవించరాదా అంటాడు కీచకుడు. ” నాలుగు రోజులు బ్రతికినా చాలు, ఆమె లభిస్తే. ఆమె పూలు కోసిన లతను కౌగలించుకుంటాను, ఆమె నిలబడిన నేలను గుండెకద్దుకుంటాను ” అనే కీచకుడి ధోరణికి
శారద్వతుడు అది కుతర్కమంటాడు. [,ఇటువంటి తర్కం వేరే తెలుగు కావ్యాలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకి వరూధిని ప్రవరాఖ్యుడితో అనే మాటలలో. సైరంధ్రీ దేవకాంత అనే కీచకుడు నమ్ముతూ ఉంటాడు. ]

నాగరికుడూ, ఏకాగ్రచిత్తుడూ, మనస్వీ, ఏ మాత్రమో వివేకీ… ఇన్ని అయినా , కీచకుడి మోహం ధర్మవిరుద్ధం.
ఎవరి ధర్మం? అని ప్రశ్నిస్తే ఎవరిని కామించాడో ఆమె ధర్మం.

విశ్వనాథ కల్పనలో ఇంకొక విశేషం సుధేష్ణ. వ్యాసభారతంలో, ఆంధ్రమహాభారతం లో ఆమె ఇంచుమించు ఒకేలా ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ ఉండి కూడా కీచకుడిని మెప్పించక తప్పని స్థితిలో సైరంద్రిని మదిర కోసం కీచకుడి దగ్గరికి పంపుతుంది. ఆమె నీతిసీలలు వదులుగా అనిపిస్తాయి, ఏ ఉద్దేశం తో చేసినా. ఇక్కడి సుధేష్ణ కీచకుడిని తీవ్రంగా మందలిస్తుంది. వల్లకి అనే పరిచారిక పన్నిన వ్యూహం లో కీచకుడు, సుధేష్ణ ఇరుక్కుంటారు. ఆ వల్లకికీ ప్రత్యేకమైన కారణమేమీ ఉండదు, అందరు పరిచారికల వలె సైరంధ్రి ఎందుకు ఉండదనే అక్కసు తప్ప.

” వెళ్లమని సెలవా ? ” అని సైరంధ్రి అడిగిన ప్రశ్నకు మదిర మత్తులో ”ఊ ” అంటుంది సుధేష్ణ. ఈ పాత్రను పైకి ఎత్తటం లో విశ్వనాథ కు కారణాలు ఉన్నాయి. పాండవులంతటివారు ఆశ్రయం పొందేందుకు ఎంచుకున్న ఒక రాజ్యాన్ని ఏలుతున్న రాణి ఆ విధంగా ప్రవర్తించదు, ప్రవర్తించరాదు అని ఒకటి అయితే ఎవరివలన పాండవుల వంశం నిలబడిందో ఆ ఉత్తరను కన్న తల్లి అటువంటిది కాకూడదు అని ఇంకొకటి.

ఆ రెండు కథనాలలో లేని పద్ధతిలో ఉత్తరను ఉత్తమురాలయిన రాజకుమారిగా, అవసరమయితే మేనమామ కీచకుడినీ అప్రయత్నంగా నిలవేసే ధర్మాగ్రహం చూపగలదానిగా తీర్చారు. సైరంధ్రి, వలలుడి వేషం లో ఉన్న భీముడు ఆమె పైన చూపే పుత్రికా వాత్సల్యం అపురూపంగా ఉంటుంది. ఈడు వచ్చిన కొడుకులున్న తల్లిదండ్రులకు యోగ్యురాలైన అమ్మాయి కనబడితే పడే ముచ్చట అంతా అక్కడ ఉంటుంది.

ఉన్నతమైన మోహమూ, భక్తి అనవలసినంతటి ఆరాధనా కలిపి తాను సృజించిన కీచకుడి పైన విశ్వనాథకు జాలి, సానుభూతి, గౌరవం ఉన్నాయి. భారతీయనాటకం లో మృతిని దృశ్యం చేయకూడదు . కాని అతని చావును మరొక పాత్రతో చెప్పించేందుకు కూడా ఆయనకు చేతులు ఆడలేదు. అంత సంప్రదాయవాదికీ లోపల అంత మెత్తదనం ఉంది. ” నాయనా , ఇది పద్ధతి కాదోయీ ” అని బుద్ధి మార్చే ప్రయత్నం చేస్తారు.

” ఏమి కామమోయీ, ఏమి కామము ? ” అని గర్జించేందుకు ఆయనకు పది సంవత్సరాలకు పైగా పట్టింది. ఆ నిర్దాక్షిణ్యపు నీతి కథ ‘ చెలియలి కట్ట ‘ 1935 లో వచ్చింది.

*** ** ****