క్షణం క్రితం వరకూ
విలవిలలాడిపోతూ ఏమీ తోచనితనం
ఏమీ అనుకోలేని ఏమీ కాని ఏమీ చెయ్యలేని వేళ
ఏం దాచుకోవాలో ఏం విసిరిపారేయ్యాలో వివేకి౦చలేని
అయోమయపు పొగమంచు సమయం
ఆహ్వానించిన కలలు అల్లంత దూరానే సంశయిస్తూ ఆగిపోతే
పరచిన తివాసీ పైన అనుకోని అతిధుల్లా ఆసీనులైన వైరాగ్యాలు
రెక్కలన్నీ రాలిపోయి మిగిలి పోయిన తొడిమలా …
చుట్టూచుట్టూ కమ్ముకునే వెచ్చని గాలి
వెన్నునిమిరి నిశ్శబ్దాన్ని వెచ్చని శాలువాగా
కప్పుతుంది
నాలుక చివర తొణికిసలాడే ఉద్విగ్న రూపాలను
నీలి నింగి ఒంపిన వెన్నెల చురక పెదవులకు అడ్డంపడి
సమన్వయతను సముదాయిస్తుంది
హద్దులు చెరిపేసుకున్న సహనం
గట్టుతెగిన గోదారిలా తీరాలను ముంచెత్త్తుతుంది
చీకటి ముంపు తీసిన క్షణాలకు దూరంగా
మాటల సెలయేర్లు గులకరాళ్ళను తడుముతూ
అడుగులు సారిస్తాయి.
ఇంకెంత
ఈ పున్నమి వెన్నెల కుంగి కృశించి
కనుమరుగయే౦దుకు ?
ఆపక్కన పిందెలు పిందెలుగా శకునాలు పలికే
పూత మామిడి
ఈ వంకన గొంతు సవరి౦చుకుంటూ
ఇంకా రెక్కలు రాని పిల్ల కోయిలలు
ముంగిట పూలుపూలుగా రాలి గాలి పరిమళమవుతున్న
మల్లెపందిరి
కాస్సేపు ఓపిక పట్టాలి మరి
కనురెప్పపాటులో
ఎక్కడి తీపి పలుకుల్లోనో కలగలిపి
పంచుకున్న మాధుర్యాలు మాటలై సరిగమలై
చుట్టూ మారుతున్న వసంతం రంగులై
ఇంకెందుకు ఘోషలూ ఘోషాలూ
ఈ క్షణాన్నే తూర్పు సంధ్యగా మార్చుకు
రేపటి కొత్త తరానికి ఆహ్వానం పలికేందుకు
మాటలతోరణాలు సమకూర్చుకుంటూ..
March 17, 2014 7:25 AM
(జయభేరి మొదటి భాగం – కవితలు 1)
బావుందండి.
శుభాకాంక్షలు.
క్షణం క్రితం అయోమయం
క్షణాలకు దూరంగా సహనం
ఇంకెంత కాసేపు ఒపికపడితే
కనురెప్ప పాటులో ఘోషలూ ఘోషాలూ మాయం
ఈ క్షణం తూర్పు సంధ్యగా మారి
మాటల తోరణాలతో రేపటి కొత్త తరానికి ఆహ్వానం పలుకుతుంది
స్వాతి శ్రీపాద గారూ చాలా బాగుంది మీ కవిత
భావం చాల బాగుంది.
చిన్న చిన్న పదాలల్లో పెద్ద పెద్ద భావాలూ.