కడిమిచెట్టు

సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]

మే 2014

”ఎవరు ఏ ఆత్మీయులను కోల్పోయినా ఆ స్థానాన్ని నేను భర్తీ చే స్తాను . పవిత్రమైన ధర్మబద్ధమైన ఎటువంటి బాంధవ్యాన్నైనా  స్వయంగా వారితో నెరపుతాను’

దుఃఖం లో మునిగి తేలి మొత్తమంతా మెత్తనై పోయిన  మహా రాజు ఒకరు తన ప్రజలను ఉద్దేశించి ప్రకటిస్తాడు. ప్రేమించటం అంటే ఏమిటో, పోగొట్టుకోవటం ఎలా ఉంటుందోతెలుసుకున్న తర్వాతి  కారుణ్యం  అది .  గ్రహపాటు వలన విస్మరించిన ప్రియురాలిని ఎట్టకేలకు కనుగొన్నప్పుడు అక్షరాలా ఆమె పాదాల మీద పడతాడు [ఏకాంతంగా కూడా కాదు, ఆ సన్నివేశం లో ఇతరులు ఉండే అవకాశం ఉంది ] ఆ పాత్రను సృష్టించినది పరమ సహృదయుడైన కవి, కాళిదాసు. ఆ కృతి అభిజ్ఞాన శాకుంతలం. మహాభారతం ఆది పర్వం లోని ఉపాఖ్యానం లో  ఆ నిష్టురుడనిపించే నాయకుడిని శాపగ్రస్తుడైన మహా ప్రేమికుడిగా మలచి ఇచ్చిన ఉదాత్తకల్పన అది .

సంస్కృత పంచ కావ్యాలలో మూడు ఆయనవి. వ్యాస వాల్మీకుల తర్వాత పెద్ద పీట ఆయనది. తన ఇష్టదేవత కాళీమాతకు సేవకుడనని  తప్ప ఏ వ్యక్తిగతమైన వివరాలనూ ఇవ్వలేదు, బుద్ధి పూర్వకంగానే వదలిపెట్టినట్లు తోస్తుంది. ” తన ముందరివారినుంచి తక్కువ తీసుకొని తర్వాతి వారికి చెప్పేందుకు తక్కువ వదలిపెట్టిన ” రచన కాళిదాసుది. ఇంతా చేసి అది ఆడంబరం లేని కవిత్వం.  వాచ్యం అయినది తక్కువ, స్ఫురింపచేసేది ఎక్కువ. ఆయన చేతిలో భాష ఒద్దికగా ప్రవహించింది, పదాలు ఆయన ఉద్దేశించిన అన్ని అర్థాలనూ  ఇచ్చాయి. ఆలోచనామృతం సాహిత్యం అన్న మాట అక్కడ సార్థకం. తరచేకొద్దీ ఒక్కొక్క పదమూ ఒక తలుపు తెరుస్తుంది. ఒక విషయాన్ని చెప్పేందుకు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయనిపించే మాటలలో ఒక్కదాన్నే ఏరుకొని వాడతారు. ఆ పదం ఎలా పుట్టిందో  [వ్యుత్పత్తి ] ఆ మూలం  అక్కడి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. కాళిదాసు తన ఉపమానాలను వ్యాకరణం, ఖగోళం వంటి శాస్త్రాలనుంచి కూడా తీసుకుంటారు. నూతనమైనవీ విలక్షణమైనవీ ఆ ఉపమలు. ఉదాహరణకి అనసూయా ప్రియంవదల తో ఉన్న  శకుంతలను రెండు విశాఖ నక్షత్రాలతో కలిసి ఉన్న శశాంక లేఖ లాగా ఉందంటారు. ఆయన  స్వయంగా జ్యోతిశ్శాస్త్రజ్ఞుడనీ ఉంది.

” ఆత్మని  ఆకట్టుకొని కట్టిపడేసేవి అన్నిటికీ , తృప్తి పరచి విందు చేయగల అన్నిటికీ నెలవైనది  శాకుంతలం .  యౌవన  వసంత  పుష్పాలు,  పరిణత హేమంత ఫలాలూ ఒక్కసారే ఒకే చోట అక్కడ. …స్వర్గ మర్త్య లోకాలు ముడివడిన ఆ పేరు, ఆ చోటు  శాకుంతలం.  ”  [Goethe ]

భారతీయుల ఈ పున్నెపు పంట పాశ్చాత్యులకి అనువాదమవటం వారి అదృష్టం. వారు గుర్తించినంత మాత్రాన దాని ఘనత ప్రత్యేకించి హెచ్చదు.  18, 19 వ శతాబ్దాలలో వారి వారి ప్రతిభనూ దృక్పథాన్నీ అనుసరించి భాషాంతరీకరణం చేసినవారెవరినీ [William Jones, Monier-Wiliams మొదలైనవారు] భారతీయతను పూర్తిగా ప్రతిబింబించలేదని తప్పు పట్టలేమని కూడా  నాకు అనిపిస్తుంది. ఆ నాటకపు ఉత్తమత్వాన్ని తమ దేశపు ప్రజలకి ఆమోదయోగ్యంగా చేరవేసే క్రమం లో చేసుకున్న మార్పులు అవి… కొంతమేరకు కలోనియల్ తప్పిదా లు దొర్లిఉండవచ్చు.

ఈ దేశపు చరిత్రకారిణి ఐన రొమిల్లా థాపర్ ఆయనను విమర్శించారు… మహాభారతం లో సబల గా కనిపించే శకుంతలను పితృస్వామ్యపు బందీ గా , బలహీనురాలిగా చిత్రించారని.  కావచ్చు, కాకపోవచ్చు.

శతపథ బ్రాహ్మణం లో శకుంతల ప్రసక్తి ఉంది. అప్సరస కుమార్తె గా కాక అప్సరస గానే ఆమె చెప్పబడింది. కుమారుడు భరతుని ప్రస్తావనా ఉంది. పద్మపురాణం స్వర్గ ఖండం లో శకుంతల కథ కాళిదాసు చెప్పినదానిని పోలి ఉంది. తెలుగులో పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి వ్యాస కాళిదాసుల కథలను  కలిపి శృంగార శాకుంతలం రచించారు .

ఋషి అయిన వ్యాసులు శకుంతలోపాఖ్యానం లో లోకవృత్తాన్ని వ్యాఖ్యానిస్తారు. బుద్ధి తో  అర్థం చేసుకోవలసిన వృత్తాంతం అది. కాళిదాసు రచన హృద యాన్ని గురి చూస్తుంది. వీటిలో ఒకటి మెఱుగైనదని, మరొకటి కాదని అనగల వీలు లేదు. తన నాయకుడిని నిష్కళంకుడిగా నిరూపించేందుకు కాళిదాసు మనసారా చేసిన  ప్రయత్నం ఒక అద్భుతంగా పరిణమించింది. బహుశా ఆయన ఇచ్చిన ధైర్యం వల్లనే భవభూతి సాక్షాత్తు శ్రీరామచంద్రుడినీ తన ఉత్తరరామచరితం లో దిద్దారు, నాటకాన్నిసుఖాంతం  చేశారు.

మహాభారతం లో వేట నిమిత్తం వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూసి మోహావిష్టుడవుతాడు.తన పుట్టు పూర్వోత్తరాలను శకుంతల యే అతనికి చెబుతుంది.   కణ్వ మహర్షి ఫల సేకరణకు అరణ్యం  లోకి వెళ్ళి ఉండి కొంతసేపు ఎదురు చూస్తే తిరిగివచ్చే పరిస్థితి అది. అయినా దుష్యంతుడు తొందర పడతాడు, తొందర పెడతాడు గాంధర్వ వివాహానికి. శకుంతల ఆలోచనాశీల , తనకు కలగబోయే  కుమారుడు పట్టాభిషిక్తుడయే షరతు మీద దుష్యంతుడిని చేరతానని అంటుంది. ఆ ఒప్పందానికి ఒప్పుకొని కా సేపు మాత్రమే అమెతో ఉండి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కణ్వమహర్షి తిరిగి వస్తాడు. ఇక్కడ దుష్యంతుడి వాంఛ, శకుంతల . ముందుచూపు..రెండూ లౌకికమైన విషయాలు. దుష్యంతుడికి ఆమెను నగరానికి తెచ్చుకోవాలనే తొందర మాత్రం ఉండదు. చివరకు కొంత ఎదిగిన పుత్రుడితో ఆమె సభకు వచ్చినప్పుడు తిరస్కరిస్తాడు, ఎఱగనని అంటాడు. నీ తల్లి వేశ్య, నీ తండ్రి బ్రాహ్మణత్వం కోసం వెంపర్లాడినవాడు అని నిందిస్తాడు. [శాకుంతలం ఐదవ అంకం లో ఈ సందర్భం వస్తుంది. దుష్యంతుడు శకుంతలను నిందించటం ఉంది, అయితే అంత దురుసుగా ఉండదు.పైగా ఆయన మరచిపోయాడని మనకు తెలుసాయెను]

భారతం లో రాజసభ లోని శకుంతల మాటలలో  ఆమె వాక్చమత్కృతి, అనల్పమైన  జ్ఞానం కనిపించినా, . అంత నేర్పుగా చేసిన  వాదనకూ అతనేమీ లొంగడు. ఆకాశవాణి సత్యాన్ని తెలియజేసినాకనే   ఆమెనూ పుత్రుడినీ స్వీకరిస్తాడు. ‘ నా అబద్ధాలన్నీ లోక భీతి తో అన్నవి ” అని సంస్కృతం, తెలుగు రెండు పాఠాలలోనూ ఉంది. ” పతివ్రత వైన నువ్వు నా తప్పును మన్నించు ” అని వ్యాస భారతం లో మాత్రమే ఉంది. అటువంటి పద్యమేదీ నన్నయ్య గారు  రచించినట్లు కనబడదు, కారణం తెలియదు.     భారతం లో కేవలం ఇది ఒక ఉపాఖ్యానం కనుక ఎక్కువ వివరాలను ఆశించలేము.

కాని సాధారణం గా వచ్చే సందేహం ఉంటుంది, శకుంతల అటువంటి  తన భర్త గురించి ఏమనుకొని ఉంటుందా అని. పట్టమహిషి అవటం తో, యువరాజ మాత అవటం తో తృప్తి పడి ఉంటుందా ? అయితే  అది ఇతిహాసం,  చరిత్రను కాలం తో హెచ్చవేస్తే వచ్చినది. అన్ని ప్రశ్నలకూ జవాబులు ఉండనవసరం లేదు.  అటువంటి అనుమానమే [తార్కిక పరిభాష లో అనుమానం అంటే ఊహించి తెలుసుకోవటం]  కవికుల గురువు కాళిదాసు కి వచ్చి ఉండవచ్చు. ఆ కథ లోని ‘ నాటకీయత ‘ ఆయనను ఆకర్షించి ఉండాలి. సారాన్ని ఆధారమాత్రంగా గ్రహించి తమ  ఉపజ్ఞతో  మచ్చ లేని ధీరోదాత్త నాయకుడినీ ముగ్ధ అయిన వనబాల గా  నాయికనీ  సృష్టించారు.  ఆ కథా క్రమాన్ని పొసగిస్తూ రావటం లో పూర్తిగా ‘ సంస్కృతమైన ‘  రచన ఏర్పడింది. తీర్చి దిద్దని భావమూ శబ్దమూ కనబడవు, అసలు ప్రతి వాక్యానికీ వేర్వేరు  స్థాయిలలో అర్థం ధ్వనిస్తుంది. భరతుని నాట్యశాస్త్రాన్నికాళిదాసు  పూర్తిగా పాటించి ఉండలేదని అంటారు. ఆ భరత ముని  కాళిదాసుకు  తర్వాతి వాడేమో. శాస్త్రం కాళిదాసు విషయం లో retrospective  అయిఉండనూవచ్చు.

సరైనది ఇది అని నిర్ణయించలేనన్ని పాఠాంతరాలు శాకుంతలానికి ఉన్నాయి. ఆసేతు శీతాచలమూ అవిరళం   అయిన వ్యాప్తికి అవి తార్కాణాలు . ముఖ్యమైనవి- తూర్పు [బెంగాల్  ],  దక్షిణ, కాశ్మీరీ, ఉత్తర [దేవనాగరి ] ప్రతులు. వీటిలో తూర్పు ప్రతి ఎక్కువ ప్రామాణికం అన్న అభిప్రాయం ఉంది

అరిస్టాటిల్ పొయిటిక్స్ లో నాటకం గురించి చెప్పినదానికి భిన్నమైనది భారతీయ నాటక లక్షణం. నిజాన్ని యథా తథం గా ప్రతిబింబించరు ఇక్కడ. అనుకరణ పైన కాక సాదృశ్యం  [మరొక వస్తువుతో పోలిక ], ప్రమాణం  [ ఉండవలసిన పద్ధతి ] మీద  నాటకం  ఆధారపడుతుంది .  పాశ్చాత్యనాటకం లో కష్టాలు నాయకుడి వ్యక్తిత్వం లోనో ప్రవర్తన లోనో కలిగిన దోషాలవలన ప్రాప్తించవచ్చు. భారతీయనాటకం లో అవి దైవికంగానో కర్మ ఫలితంగానో వస్తాయి . ఇక్కడ విషాదాంతమైన నాటకం ఉండదు, ఉండకూడదు. జీవి ముక్త అయే క్రమం లో ఈ జన్మ ఒక అంకం మాత్రమే కనుక ఆశ చావటం ఎన్నటికీ లేదు, దాన్ని నిలిపి ఉంచటం కళకి ధ్యేయం.

అక్కడ లేని విధంగా ఇక్కడ భావుకుడైన ప్రేక్షకుడికి  కూడా సముచితమైన  స్థానం ఇవ్వబడింది .  ప్రదర్శించే రసానికి అనువైన స్థాయీభావాలు  ప్రేక్షకుల మనసులలో కొనసాగేందుకు సంగీతం ఉపయోగపడుతుంది .

భరత మునిని అనుసరించి నాటకం లో రసం వట్టి ఉద్వేగం కాదు, పూర్తిగా వైయక్తికమూ కాదు. కళ చేత వడకట్టబడిన అనుభూతి అది. భారతీయ లక్షణ కారులు రసానుభవాన్ని కళా  సృజనా ఆస్వాదనా ఇరు దిక్కులనుండి వచ్చి  ఏకమైన  స్థితిగా వర్ణించారు. వాస్తవ జీవిత  భావాలను శుభ్రపరచి సానబట్టిన  తర్వాత గానీ వాటికి కావ్యస్థాయి రాదు అన్నది వారి నిర్దేశం. అయినా  లోకధర్మ, నాట్యధర్మాలను అనుసరించేవి గా రెండు రకాలైన నాటకాలను భరత ముని గుర్తించారు.

శాకుంతలం రెండవ రకానికి చెందినది.  రసజ్ఞు లైన ప్రేక్షకుల లో ఎక్కువ శాతం మందికి  [అభిరూప భూయిష్ఠులు ]నాటకం నచ్చుతుందనేవిశ్వాసాన్ని  ప్రారంభం  లో    సూత్రధారుడి నోట పలికిస్తారు. ఎంత సుశిక్షితమైనప్పటికీ కవి హృదయం తన సృజన ను  తాను పూర్తిగా విశ్వసించలేదనే  ఆ సన్నని  అభద్రతను సూచిస్తారు.

నాటకం  విస్మృతి, స్మరణ ల  మీద నడుస్తుందనే అర్థం  ప్రస్తావన లో ఉంది. సూత్రధారుని వెంట ఉన్న నటి గ్రీష్మ ఋతువు ను వర్ణిస్తూ గానం చేస్తుంది.  ఈ కాలంలో  నీటిలో మునగటం సుభగం అన్నది మొదటి మాట. సుభగము  అన్న మాట ఉల్లాసాన్నీ, శుభాన్నీ  రెండింటినీ చెబుతుంది.  [ కణ్వ మహర్షి శకుంతల క్షేమం కోసం సోమతీర్థానికి వెళ్ళి ఉంటాడు] . అరణ్యాల లోంచి వీచే గాలి పాటల పుష్పాల సం సర్గం చేత సురభిళమైనది [ వనవాసిని ఐన శకుంతల సహచర్యం తర్వాత తిరిగివచ్చే   దుష్యంతుడి స్థితి సూచితమైంది ] ప్రచ్ఛాయ సులభ నిద్రా  [చిక్కని నీడ లో ఇట్టే నిద్ర వస్తుందని ఒక అర్థం, శాపపు నీడలో మరపు వస్తుందనే ధ్వని ] దివసాః పరిణామ రమణీయా [ రోజులు తమ ముగింపు లో రమ్యమైనవి, నాటకం ముగుస్తూ రమణీయమైనది ]  పాట పూర్తవగానే  సూత్రధారుడు ” ఇంతకూ మనం ఏమి ప్రదర్శించబోతున్నాము ? ” అని నటిని ప్రశ్నిస్తాడు. ” మీరే చెప్పారు కదండీ అభిజ్ఞాన శాకుంతలమని ” అని జవాబిస్తుంది నటి. ” అవును సుమా, నీ పాట లో మైమరచి  మరచేపోయాను ” అని ” అడుగో దుష్యంత మహారాజు, సారంగాన్ని వెండిస్తున్నాడు ” అని  నాటకం లోకి వెళతాడు సూత్రధారుడు. కాళిదాసు వైదర్భీ శైలి [  గౌడీ , పాంచాలీ వైదర్భీ అన్న భేదాలు  కఠిన, మధ్యమ,సులభ శైలులను వరుసగా చెబుతాయి ]   ఇలాగ, ప్రేక్షకులకు , పాఠకులకు ప్రసన్నమవుతుంది .

దుష్యంతుని సారధి రాజును ” ఆయుష్మంతుడా ”  అనే అస్తమానం సంబోధిస్తాడు. వయసులో పెద్దవాడవటం ఒక కారణమైతే, యుద్ధాలలో, అరణ్యమృగాలతో  ప్రమాదం ఎదురవగల పరిస్థితులలో సారధి రథం నడప వలసి రావటం ఇంకొకటి. ” సారంగాన్ని వెంబడిస్తున్న పినాకి [శివుడు ] వలె ఉన్నారు మహారాజు అంటాడు అతను. అద్వైతి అయిన  విశ్వనాథ తమ ‘ శాకుంతలము యొక్క అభిజ్ఞానత ” విమర్శ లో ఈ ప్రారంభం గురించి విపులంగా వివరిస్తారు. రాజు యొక్క అంతఃకరణం జాగృతమైన స్థితిని [  శివుడు ఉన్నట్లుగా]  కాళిదాసు ఉద్దేశించారని   ఆయన అంటారు. బుద్ధి, అహంకారం, చిత్తం, అంతఃకరణం  అనే నాలుగు పొరలలో అప్పటినుంచీ ఆయన అంతఃకరణం మేల్కొనే ఉంటుంది.  శాపం వలన మరపు వచ్చినప్పుడూ అది పనిచేస్తూనే, హెచ్చరిస్తూనే ఉంటుంది.శకుంతల దుష్యంతునికి మోక్ష సంబంధిని.

శాకుంతలం లో అసమాపక క్రియలను ఎక్కువ ఉపయోగించారని విశ్వనాథ అంటారు. కథ యొక్క చలనశీలత [dynamics] కి అవి ఊతం ఇచ్చాయేమో .

ఆ సారంగం పరుగెత్తుతున్న వర్ణన తో కథా గమనం సూచితమవుతూ ఉంది. జింక వెనుక భాగం ముందు భాగం లోకి చొచ్చుకుపోతున్నట్లుగా [నాటకపు చివరి అంకాల కోసమే మొదటివి ] , వియత్తు [ఆకాశం ] లో ఎక్కువగా భూమిమీద తక్కువగా కనిపిస్తోంది  జింక . శకుంతలలోనూ దివ్యత్వం ఎక్కువ, భౌమమైనది తక్కువ. ఆమె తల్లి దివిజ, తండ్రి మానవుడైనా , తపోనిధి. నాటకం ముగిసేదీ ఆకాశం లోనే. రాజు అంటాడు ” తమ కదలిక వల్ల రేగిన ధూళి తమకే  అంటనంత వేగం గా రథాశ్వాలు పరుగెడుతున్నాయి. ఆ వేగం వలన సూక్ష్మమైనది పెద్దదిగా కనబడుతోంది, మధ్యలో విభజించబడినది ఒక్కటిగా అనిపిస్తోంది, వక్ర రేఖలు లు తిన్నగా కనిపిస్తున్నాయి . ఏదీ నాకు దగ్గరగా ఉందని తోచదు, అలాగని దూరంగానూ లేదు ” నిజంగానే వేగం గా ప్రయాణించే వాహనం లోంచి చూస్తే ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా. ఇంకా కొన్ని చోట్ల కనిపించే కాళిదాసు నిశిత పరిశీలనా దృష్టి ఇది, స్వభావోక్తి, ఉత్ప్రేక్షల కలయిక. అంతర్ధ్వని కాల గమనం-తరుముకొని వచ్చినట్లున్న కలయిక, వియోగ భ్రాంతి, పునస్సమాగమం.

జింక ని వెంటాడుతూ ఆశ్రమ పరిసరాల  లో ప్రవేశించిన రాజును తాపసులు వారిస్తారు,  పూల రాశి పైన నిప్పులుపోయవద్దని, బాధితులను రక్షించవలసిన నీవు అమాయకులను వేధించరాదని. రాజు తక్షణమే బాణాన్ని ఉపసం హరిస్తాడు. ” యోగ్యుడైన పుత్రుడిని పొందెదవుగాక ”  అని వారు దీవిస్తారు. సంతానం లేని రాజు ” స్వీకరిస్తున్నాను ” అంటాడు.

కణ్వ మహర్షి తన కుమార్తె ఐన శకుంతల గ్రహస్థితి అనుకూలం గా లేనందున దుర్విధి ని నివారించేదుకు సోమ తీర్థానికి వెళ్ళాడని వారు చెబుతారు .  ప్రతి వాక్యం లోనూ వర్తనం లోనూ అర్థాన్ని ఇమిడ్చిన తీరు ఇక్కడా తెలుస్తుంది. చంద్రుడు రోహిణితో  మాత్రమే ఉండి తక్కిన ఇరవై ఆరుగురు భార్యలనూ నిర్లక్ష్యం చేసినందుకు మామగారైన దక్షుడు క్షయ వ్యాధి గ్రస్తుడివి కమ్మని శపిస్తాడు. ఆ శాప నివృత్తి కోసం చంద్రుడు ఆ తీర్థాన్ని సేవించి సగం విముక్తుడవుతాడు. నెలలో సగం రోజులు వృద్ధి, సగం రోజుల క్షయం. కణ్వమహర్షి కూడా శకుంతల దుర్విధిని సగం మాత్రమే నివారించగలుగుతాడు. ఎంత అన్యోన్య ప్రేమికులైనా ధర్మాన్ని తప్పక పాటించి తీరాలని, దు ర్వాసుడి విషయం లో అతిథి సత్కారమనే  కర్తవ్యాన్ని మరచిన శకుంతల శాపగ్రస్తురాలైందని ఒక వాదన ఉంది.  ఈ సోముని [తక్కిన భార్యల పట్ల అధర్మం గా ప్రవర్తించిన] అపరాధం, ప్రాయశ్చిత్తం ఆ వాదాన్ని సమర్థిస్తున్నాయి.

మా పుణ్య క్రతువులు నీ రక్షణ లో ఏ విధంగా కొనసాగుతున్నాయో చూసి వెళ్ళమని, శకుంతల  ఆతిథ్యం స్వీకరించమనీ  ఆహ్వానిస్తారు రాజును. శకుంతల ను ఆశ్రమవాసులు ‘ కణ్వదుహిత ‘ అంటారు. ఒక్కతే కూతురని అర్థం,  తండ్రి లేనప్పుడు అతిథి మర్యాద ఆమె బాధ్యత. దుర్వాసుడి విషయం లో తప్పిదం అలా జరిగింది. ఆశ్రమం లో ప్రవేశించే ముందు తన కిరీటాన్నీ రాజలాంచనాలనూ తీసివేసి సారథి కి ఇస్తాడు రాజు, తపోభూమి లో ఆడంబరాలు, ఆభరణాలు ఉండకూడదని…   జరిగిన మేలు  సుందరుడైన సాధారణ మానవుడుగానే  శకుంతల ప్రేమను పొందగలగటం.

రాజు అనుకుంటాడు ‘’ ఇంత శాంతంగా ఉన్న మునివాటిక లో నా కుడిభుజం ఎందుకు అదురుతూ ఉంది ? ఇక్కడ నాకు ఏ శుభఫలం వస్తుందని  ? ఏమో, ఎవరికి తెలుసు, భవిష్యత్తు కి అన్నీ ద్వారాలే ![ భవితవ్యానాం  ద్వారాణి భవంతి సర్వత్ర ]శకుంతల, అనసూయ , ప్రియం వద – ముగ్గురు కన్యలనూ ఒకేసారి  కనిపిస్తారు. కొంత  దూరం నుంచీ ముగ్గురూ అందమైనవారు గానే  గోచరిస్తారు. దగ్గరికి వచ్చెసరికి శకుంతల రూపం ఒకటే లోకోత్తరం గా రాజుకి కనబడుతుంది. ఇక్కడా కాళిదాసు సూక్ష్మ దృష్టి.

” నీలి తామర రేకుతో శమీ వృక్షాన్ని కోయబోయినట్లు ఈ ముగ్ధ సౌందర్యానికి తపస్సు శక్యమా! ”

పండుటాకు మాటున దాగిన పూవు లాగా ఈమె నార బట్టలలోనూ ప్రకాశిస్తోంది ”

శకుంతల అనుకుంటుంది ”ఇతనిని చూస్తే తపోవనానికి విరుద్ధమైన’ వికాసం ‘ ఏదో కలుగుతూ ఉందేమిటి ?”

ఆమె  సౌందర్యానికి కవి వేసిన ఉపమానాలు అన్నీ లతా తరు గుల్మ  సంబంధమైనవే. లేతగా తాజాగా ఉంటాయి. ఆమె నవమల్లికా లత  నొకదాన్ని పెంచుకుంటుందట, దానికీ తనకూ తేడా లేదట.  దాని పేరు వనజ్యోత్స్న. అంటే అడవిని  కాచిన  వెన్నెల. మనం వాడే లోకోక్తి ఇక్కడ నిరుపయోగం అవుతూంది.అసలు వెన్నెల కాయవలసినది అడవిలోనేనన్న మాట. అది ఋతువు కాకపోయినా మొగ్గలతో నిండిపోయింది .మల్లె తీగకూ మామిడిచెట్టుకూ మొదట జరిగిన పెళ్ళి  ఇక్కడేనేమో.   శకుంతల జననానికి  సంబంధించిన కథను అనసూయ వినిపిస్తూ ” ఆ వసంత కాలం లో తనను ఉన్మత్తుడిని చేయగల మేనకా సౌందర్యాన్ని విశ్వామిత్రులు వీక్షించి ..” అని అర్థోక్తిలో ఆగుతుంది. ” అర్థమైంది.  ఈమె అప్సర కుమార్తెనా ? ” అంటాడు రాజు . సున్నితమైన సంభాషణ. .[ ఇదే సందర్భం లో భారతం లో శకుంతల  తన జన్మ వృత్తాంతాన్ని తల్లిదండ్రుల కలయిక తో సహా  విపులంగా వివరిస్తుంది.]

” అవును, మానవ స్త్రీలకి ఇంత అందం ఉంటుందా ! ప్రభా తరళమైన   జ్యోతి [తరళము అంటే చలించేదీ ప్రకాశించేదీ రెండూ ] భూమి మీద మొలుస్తుందా ! ”

ఆమె క్షత్రియుడు పెళ్ళాడదగినది  అని, అవివాహిత అని తెలుసుకొన్నాక ” సందేహాస్పదమైనది నిశ్చితం అవుతోంది కదా, హృదయమా నీ ఈప్సితం నెరవేరేలాగా ఉంది, అగ్ని అనుకున్నది ఆభరణమైంది ‘’

” ఆ  కోమలమైన చూపు,  కన్నుల్లో తడి  వెలుగులు …నా కోసమే అవునా, లేక నన్ను నేనే చూస్తున్నానా ? ”

శకుంతల  తన ఆసక్తిని దాచుకుంటూ వెళ్ళబోతున్నప్పుడు[కొంత దూరం వెళ్ళి వెనక్కి వస్తుంది ] ”అనుయాస్యన్ మునితనయాం  సహసా వినయేన వారితప్రసరః  స్థానాదనుచ్చలత్రాపి గత్వేవ పునః ప్రతి నివృతః ” అనుకుంటాడు.  ”  ఆమెను వెంబడించి   వెళ్ళేందుకు సభ్యత అడ్డు వచ్చి వెళ్ళలేక ఉన్నచోటనే ఉన్నా , వెళ్ళి  తిరిగి వచ్చినట్లే ఉంది ‘ విశ్వనాథ ‘ వేయి పడగలు ‘ చివరలో అంటారు ” ఆమె ద్వారము వద్ద నిలుచుండెను . ఆ నిలుచుండుట కూడ తన వంకకు  నడుచుచున్నట్లే యుండెను  ” అని.  ప్రభువైన కాళిదాసు అని ప్రస్తావిస్తారు కదా  ఆయనను విశ్వనాథ తమ విమర్శలో.

” , ఆగాగు.. ఇంకా రెండు చెట్లకి నీరు పోయటాన్ని  నువ్వు నాకు బాకీ ఉన్నావు ” అంటుంది ప్రియంవద.’’  ఆమె అలసిపోయినట్లుంది,ఇదిగో, ఈ అంగుళీయకం తో ఆమె అప్పు తీరుస్తాను ” అంటాడు రాజు. ఆ ఉంగరం మీద పేరు చదువుకుని అతన్ని వారు గుర్తిస్తారు. ఇక్కడే  ప్రధాన పాత్రధారిణి  , ప్రతినాయికా తుల్య ఐన అంగుళీయకం ప్రవేశిస్తుంది.

మాలినీ [మందాకిని ] నదీతీరం, సప్తపర్ణి వృక్షాల చల్లటి  నీడలు,  పద్మాల సుగంధం,  స్నేహితురాళ్ళ ఆహ్లాదం… చెప్పీ చెప్పని మాటలు, అటువైపు తిరిగినా చూడగలిగిన  చూపులు …ఆకుపచ్చని స్వప్నలోకం- అమాయకమైన ఆహ్వానం దుష్యంతుని కోసం .

వెళ్ళలేక ముల్లు గుచ్చుకున్న వంక తో ఆగి తిరిగి చూస్తూన్న శకుంతల రవివర్మ చిత్రం ద్వారా మనకు పరిచయమే.

అసలు కవిత్వం అప్పటి దుష్యంతుని భావన లో ఉంది. ”ఆలోచనను ఆమెనుంచి తెంపుకోలేకుండా ఉన్నాను. రథం ముందుకు కదులుతూ ఉంటే ఆపైని చీనా  పట్టు జెండా వెనక్కి ఎగురుతున్నట్లు నా శరీరం ముందుకు వెళుతూ ఉంటే హృదయం వెనక్కి లాగుతూ ఉంది. ”

రెండవ అంకం దుష్యంతుని శిబిరం లో. చెలికాడైన మాఢవ్యుడితో  రాజు [శకుంతలను ఉద్దేశించి ]  ” అసలు చూడవలసిన దాన్ని నువ్వు చూడనేలేదు ” అంటాడు. ” నువ్వు నా ఎదురుగానే ఉన్నావు కాదా ” అంటాడు మాఢవ్యుడు.యథాలాపంగా అన్నట్లు అనిపించినా అతనికి దుష్యంతుడి మీద ఎంతో అభిమానమని తర్వాత రాజు అన్న మాటలలో తెలుస్తుంది ” సర్వః కాంతమాత్మీయం పశ్యతి ” [ప్రియమైన వారు అందరికీ అందంగానే కనిపిస్తారు ]

సరే,మునికన్య నీకు ఎలా అందుతుందని మాఢవ్యుడు అడుగుతాడు..  రాజు ” అప్సరా దివ్యదేహం  నుంచి   ప్రభవించిన ఆమె  ఋష్యాశ్రమంలో పెంపుడు బిడ్డ అయింది,  సువాసనలు చిమ్మే  తెల్లని మల్లె పూవు తీగ నుండి విడివడి  జిల్లేడు ఆకు మీద రాలినట్లు’ ’అని వివరించి రెండు శ్లోకాలలో ఆమెను వర్ణిస్తాడు .

” చిత్రే నివేశయ పరికల్పిత సర్వ యోగా ” అన్నది మొదటిది. ఆమె ఒక ప్రత్యేకమైన సృష్టి [స్త్రీరత్న సృష్టిరపరా ప్రతిభాతి సా ] అని, విధాత  అరుదైన చక్కదనాలన్నీ  కలిపి  చిత్తరువు గీసి ప్రాణం పోశాడా అని.

ఆ తర్వాతి శ్లోకం సుప్రసిద్ధం .

” అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై [ఆఘ్రాణించబడని పుష్పం, గోరు తగలని లేత మొలక ]

రనవిద్ధం రత్నం మధు నవమనాస్వాదితరసం [రంధ్రం చేయబడని రత్నం, రుచి చూడని మధురసం ]

అఖండ పుణ్యానాం ఫలమివచ తద్రూపమనఘం [ ఆ నిష్కల్మషమైన రూపం [నా ]  అఖండపుణ్యఫలం ]

న జానో భోక్తారం కమిహి సముపస్థాస్యయతి విధిః [ఆమె కోసం విధాత ఎవరిని నిర్ణయించి ఉన్నాడో]

మూడవ పంక్తి చదువుతున్న ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లుతాయి… దుష్యంతుడు తన  సుకృతాన్ని గుర్తు పట్టటం అది. ఆ మాటలు భార్య గురించి ప్రతి పురుషుడూ భావించగల దానికి  పరమావధి.

‘’ మరి ఆమె సంగతి ?’’- మాఢవ్యుడు

‘’ ఆమె ప్రేమను వ్యక్తం చేయలేదు, దాచిఉంచనూ లేదు ‘’

‘’ అయితే  త్వరగా ఆమెను రక్షించండి, ఏ ఇంగుడి నూనె అంటిన జిడ్డు చేతులలోనే ఆమె పడిపోగలదు ” అని హాస్యం చేస్తాడు మాఢవ్యుడు.

ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు-కణ్వమహర్షి  లేడు కనుక, ఆశ్రమవాసులు రాజును కొన్నాళ్ళు  రక్షగా ఉండమని అడుగుతారు. ఈ లోపల రాజ మాత తన వ్రతం ముగుస్తోందనీ కొడుకును రమ్మనీ కబురు చేస్తుంది. ”దూర దూరంగా ఉన్న  రెండు చోట్లాకర్తవ్యాన్ని    నిర్వహించటం ఎలాగ !ప్రవాహం మధ్యలో పర్వతం అడ్డువచ్చి రెండుగా చీలిన నదిలాగా  నా హృదయం ద్విదాభూతమైంది. ” [వాస్తవానికి మున్యాశ్రమ రక్షకు ఎవరినైనా నియమించవచ్చు, తానే అవసరం లేదు. అది ఒక మిష.] నువ్వూ మా తల్లికి కొడుకు వంటి వాడవే నని మాఢవ్యుడిని నగరానికి వెళ్ళమంటాడు.  ఈ వాగుడు పిట్ట ఇక్కడి వార్తలను అంతఃపురం లో వినిపించి ఎక్కడ కలకలం రేపుతాడోనని ” ఇదంతా ఒట్టిదేనోయీ [పరిహాస విజల్పం ] మనమెక్కడ, లేళ్ళతో సమంగా పెరిగిన, పరోక్ష మన్మథ [ఇక్కడా రెండు అర్థాలు. మన్మథ భావమే తెలియనిదని, పరోక్షం లోనే  ఆ భావం ఉన్నదని ]అయిన ఆమె ఎక్కడ!  ” అని చెప్పి పంపుతాడు. దుష్యంతుడికి మనస్స్థానీయుడైన మాఢవ్యుడు శకుంతలా దుష్యంతుల గాంధర్వ వివాహ సమయం లో ఉండకపోవటం అనర్థమైంది, అతను లేకపోయిన మరొక సన్నివేశమూ అస్తవ్యస్తమవుతుంది.

మూడవ అంకం లో ఒకరి ప్రేమ మరొకరికి తెలిసే తీరు  మృదువుగా, మర్యాదగా ఉంటుంది. ఇక్కడి మాటలలో హృద్యమైనవి కొన్ని ..దుష్యంతుడి స్వగతాలు

‘’’’ ఆమె రూపం  నేత్రనిర్వాణం ‘’

”ఎంత లోతుగా ప్రేమించీ ఆమెను గెలుచుకోవటం తేలికేమీ కాదు… ఊరికే ఆమెను గమనిస్తూ  ఉన్నా చాలు.  ‘’

” ముఖాలు పైకెత్తి రెప్పలార్పని కళ్ళతో నెలవంకను , అందుతుందనేనా చూస్తారు అంతా ? నేనూ ఆమెను అంతే.’’

శకుంతలను ఉద్దేశించి ” లక్ష్మి కోసం వెతికేవారికి ఆమె లభించవచ్చు, లేకపోవచ్చు. లక్ష్మి స్వయంగా వెతికేవారు ఆమెకు అందకుండా ఉంటారా ? ” ఎవరు నిన్ను తిరస్కరిస్తారనుకుంటున్నావు ? రత్నం వెదకదు, వెదకబడుతుందిగానీ  ! ”

‘’ నిన్నూ విరహం దహిస్తోంది, నన్నయితే మింగేస్తోంది.-పొద్దు పొడుపు కి కలువ వాడుతుంది, చంద్రుడు మొత్తా నికీ మాయమవుతాడు  ”

ఆ తర్వాత ‘’నా రుగ్మతకు కారణమైన స్మరుడే ఉపశమనాన్ని కూడా ఇస్తున్నాడు. మబ్బులు మూసిన చీకటి లోంచే కదా  వేసవి ముగిసిన వర్షం కురుస్తుంది ! ” ” ఆహా ! అదృష్టం అమృతమై కురిసి ఫాలాక్షుడు  దహించిన వృక్షం చిగురు తొడుగుతూ ఉంది ”

కాలాతీతమైందని వెళ్ళిపోయే ఆమెతో ” నీ హృదయమెంత కఠినం, పూవు కాడ లాగా”అనటం తమాషాగా ఉంటుంది , ఆ ఎడబాటు మరుసటి రోజువరకే అయినప్పుడు అంతకన్న గట్టి పదార్ధాన్ని ఉపమానంగా వాడక్కర్లేదు కదా..

‘’ ‘’ మళ్ళీ ఆమె ఒంటరిగా దొరికితే ఒట్టిగా పోనీయరాదని తెలివిమాలిన నా మనస్సు పథకం వేస్తుంది అలా…తీరా ఆమెను చూస్తే – జంకుతుంది, ఆగుతుంది ”

అంతవరకూ అస్వస్థురాలిగా ఉన్న శకుంతల సంతోషంగా కనిపించటం చూసిన గౌతమి అనే వృద్ధ తాపసి  ” ఇప్పుడు నీకు ఒంట్లో తేలికగా ఉందా ? ” అని అడిగినప్పుడు శకుంతల ”ఆర్యే, అస్తిమే విశేషః ” అంటుంది. ” నాలో [మెరుగైన ] మార్పు వచ్చింది ” అని అర్థమట. అవును, విశేషమే, ఆ పైన . ఆ ప్రణయానికి పర్యవసానం అప్పటికి సంగమ శృంగారమే అయినా , అది హఠాత్తుగా సంభవించదు… ఏ షరతులూ అక్కడ విధించబడవు.  ఆ వైపుకు ఇద్దరూ  వేసే అడుగులు ఒక క్రమాలంకారం వలె సొగసుగా అనిపిస్తాయి

శకుంతలా దుష్యంతుల సమాగమాన్ని అసలు చెప్పరు కాళిదాసు.. అది ఆయన ఔచిత్యపు సౌకుమార్యం . అంగుళీయకం పైన ఉన్న తన పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని రోజులు గడిచేలోగా ఆమెను నగరానికి తీసుకువెళతానని తను ముందు బయలుదేరతాడు.

నాలుగవ  అంకం -అతని ధ్యాసలో నిమగ్నయై తన రాకను గుర్తించలేదని దుర్వాసుడు శపిస్తాడు, ‘’  అతని ధ్యాసలోంచి నువూ మాయం అయిపోతావు. ..మదిర సేవించినవాడికి  అంతకు ముందరి  కథలాగా  ‘’ ‘[ దుర్వాసుడు అనే పదం వ్యుత్పత్తులలో ఒకటి చెడ్డ అతిథి అని  ] . ప్రియంవద ప్రాధేయపడితే గుర్తు గా ఒక ఆభరణాన్ని చూపిస్తే జ్ఞాపకం వస్తుందని మాత్రం కరుణిస్తాడు.

ఈ శాపపు ఉదంతం లో ధర్మాతిక్రమణం[చెప్పుకోదగిన స్థాయిలో ] కాక ఒట్టి పుణ్యానికే వచ్చి మీద పడిపోయే ఇక్కట్లే నాకు కనిపిస్తాయి. వాటికి మూలం కర్మఫలమో గ్రహచారం బాగా లేకపోవటమో అనవచ్చు, అప్పుడు చేసిన అపరాధం మాత్రం కాదు.

ఇదంతా శకుంతలకు తెలియనే తెలియదు, అంత ఏకాగ్రత అతని మీద. స్నేహితురాళ్ళూ  చెప్పరు. కాలం గడిచిపోతుంది.

నాలుగవ అంకం లో  కణ్వ మహర్షి ఆమెను నగరానికి పంపే రోజున శిష్యుడిని రాత్రి ఎంత గడిచిందో చూడమంటాడు. అప్పటి శ్లోకం ఒక సుభాషితంగా ప్రసిద్ధం ” ఒక వైపున ఓషధులకు రాజైన చంద్రుడు అస్తాద్రి లో క్రుంగుతున్నాడు. ఇంకొక వైపున అరుణుడిని ముందు పంపి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ తేజోనిధులకే తప్పని ఇటువంటి పరిణామాలు లోకానికి మాత్రంతప్పుతాయా ? [లోకో నియమ్యత ఇవాత్మ దశాంతరేషు ] ‘’

ఆ సమయానికనే దాచి ఉంచిన పొగడపూలదండను [పరిమళం వీడనిదాన్ని ] అనసూయ తెస్తుంది. కణ్వుని అనుగ్రహం తో వనదేవత ఇచ్చిన పట్టు వస్త్రాలనూ నగలనూ ” మాకు చేత అయితే కాదు కానీ చిత్రపటాలలో చూసి ఉన్నాము కదా, అలా అలంకరిస్తాము ”  అంటారు చెలిమికత్తెలు. ఇక్కడ కణ్వ మహర్షి  చెప్పిన నాలుగు శ్లోకాలూ ” కావ్యేషు నాటకం రమ్యం ”   అన్న ప్రశంస లోవి. ఆయన  శర్మిష్ఠ లాగా వర్ధిల్లమని శకుంతలను దీవిస్తాడు. శకుంతలది లాగానే శర్మిష్ఠదీ గాంధర్వ వివాహం. ఆమె భర్త యయాతి అంతకుముందే దేవయానికి భర్త. అయినా శర్మిష్ఠ కొడుకైన పూరుడే అనంతరం రాజు అవుతాడు. అలాగే శకుంతల కి కలగబొయే కొడుకే రాజ్యాధికారి అవుతాడని ధ్వని.

కనబడని వన దేవతల దీవెన-”ఆమె మార్గం సురక్షితమగుగాక ! అనుకూల శీతల పవనాలు వీచుగాక ! పచ్చని తామర తీగలు  నిండిన సరస్సులు ఎదురవుగాక !  ఆతప కిరణాలనుంచి  దట్టమైన తరువులు  కాచుగాక ! కలువల పుప్పొడి మెత్తని ధూళిగా ఆమె పాదాలకు సుఖమవుగాక ! ”

తన మల్లె తీగ వనజ్యోత్స్నను అనసూయా ప్రియంవద లకు అప్పగిస్తుంది శకుంతల. ” మమ్మల్నెవరికి అప్పచెబుతావు ” అని బావురుమంటారు వాళ్ళు.  ఆమె వెళుతూ ఉంటే కనిపించినంత మేరకూ చూసి స్నేహితురాళ్ళు ఇద్దరూ ” అంతర్హితా శకుంతలా వనరాజ్యా ” [  అరణ్య వృక్షాల వరుస వల్ల ఆమె కనబడకుండా పోయింది ] అని దిగులు పడతారు. ఇటు ఆశ్రమానికీ అటు అంతఃపురానికీ చెందక మొత్తంగా  అంతర్హిత అవబోతున్న సూచన ఇది. అయితే,  ఆ రెండూ కానక్కర్లేని అండగా ఆమెకు మరొక  లోకం ఉంది.

[సశేషం]